సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 22

0
10

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

[dropcap]డి[/dropcap]సెంబర్ 28, 2022

న్యూయార్క్, న్యూజెర్సీ వెళ్లిన పర్యటనకు వాళ్ళు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడకుండా ఎవరు వస్తారు?! అక్కడికి వెళ్ళాక అది చూడకపోతే అసంపూర్ణం కదా!

మాకూ అంతే.

ఐకాన్ ఆఫ్ అమెరికా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని, ఏ రోజుకారోజు అక్కడికి వెళ్లాలని ప్రయత్నం. కానీ తీవ్రమైన చలి గాలులు, స్నో ఉండడం వల్ల ఆ ప్రయత్నం మానుకోవాల్సి వచ్చింది. మా తిరుగు ప్రయాణానికి సమయం దగ్గర పడుతున్నది. మేం వెళ్ళిన సమయం అనుకూలంగా లేదు. ఎప్పటికప్పుడు ఫోర్‌కాస్ట్ చెక్ చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వాతావరణం కాస్త అనుకూలించడంతో బయలుదేరాలనుకున్నాం.

నార్త్ బ్రౌన్స్విక్, న్యూ జెర్సీ లోని చెల్లి కామేశ్వరి (చంటి) ఇంటి నుంచి ఉదయం పదిన్నర ప్రాంతంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి బయలుదేరాం.

రాజేష్, పిల్లలు సౌరవి, సుచిర్ నేను చంటి బయలుదేరాం. సాధన ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయింది.

న్యూయార్క్ వెళ్ళినప్పుడు మాన్హట్టన్ నుంచి చాలా దూరంగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపించింది. అలా చూడటం చూసిన అనుభూతిని ఇవ్వదు కదా..

దాదాపు గంట ప్రయాణం చేసి లిబర్టీ స్టేట్ పార్క్‌కి చేరుకున్నాం. ఫ్రీ పార్కింగ్ లాట్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. శీతగాలుల వాళ్ళ జనం తక్కువ ఉన్నారనుకుంటూ కారు పార్క్ చేసి ముందుకు కదిలాం.

అక్కడ టికెట్ తీసుకుని ఫెర్రీలో ఎల్లిస్ ఐలాండ్ నేషనల్ మాన్యుమెంట్‌కి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళాలి. చంటి టికెట్ తేవడానికి వెళ్ళింది.

ఈ లోగా మేం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కనిపిస్తే దాని దగ్గరకు చేరాం. అప్పటికే అక్కడ ఇద్దరు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు.

అమెరికా, ఫ్రాన్స్ దేశాల స్నేహాన్ని గుర్తు చేసే అద్భుతమైన శిల్పాన్ని ఫ్రాన్స్ అమెరికాకు బహూకరించింది. రోమన్ దేవత లిబర్టాస్ ప్రతిరూపం అట. అమెరికా జాతీయ చిహ్నంగా మారింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 91 మీటర్లు. అది కుడిచేత్తో టార్చ్ పట్టుకొన్న స్త్రీ విగ్రహం.

సరిగ్గా అదే విధంగా చేసిన స్టాట్యూ ఇది కూడా. కాకపోతే నిల్చుని కాకుండా పడుకుని 25 అడుగుల పొడవులో ఉంది. దాన్ని చూస్తే బుద్ధుడు గుర్తొచ్చాడు. ఆ ఫోజ్‌లో బుద్దుడి విగ్రహాలు కూడా మనదేశంలోనే చూశాను. ఆ విగ్రహాన్ని ముట్టుకుని చూశాం. పిల్లలు విగ్రహంపై కూర్చుని ఫోటో తీసుకున్నారు.

ఇక్కడ నుండి మాన్హట్టన్ స్కైలైన్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ నుండి ఎల్లిస్ ఐలాండ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వెళ్ళడానికి ఫెర్రీ సర్వీస్ అందుబాటులో ఉంది. టికెట్‌కి పెద్ద క్యూ లు ఉన్నాయి. చలి గాలిలో నిల్చోవడం కష్టంగా ఉంది. వారాంతంలోను, సెలవురోజుల్లోనూ, ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు లైన్లో దాదాపు రెండు గంటలు పడుతుందట. పార్కింగ్ దొరకడం కూడా కష్టంగా ఉంటుందట. మేం వెళ్ళింది డిసెంబర్ చివర కాబట్టి రద్దీ తక్కువే. అయినప్పటికీ గంట సమయం పట్టింది.

మధ్య మధ్యలో అక్కడక్కడ ముందురోజు పడిన మంచు గడ్డకట్టి తెల్లగా పేరుకుపోయింది. పలుచని ఎండపొడ పడి మిలమిలలాడున్నది. సుచిర్ వెళ్లి దాన్ని పట్టుకుని చూశాడు. సౌరవి ఏదో స్నో రైమ్ అందుకున్నది.

మొత్తానికి టికెట్స్ తీసుకుని క్యూ లో ముందుకు వెళితే సెక్యూరిటీ చెక్. అచ్చం మన ఎయిర్పోర్ట్‌లో ఉన్నట్లుగానే. చాలా స్ట్రిక్ట్‌గా ఉంది.

అది పూర్తయిన తర్వాత మళ్ళీ క్యూ లో.. పిల్లలకు ఆ క్యూ లో నిల్చోవడం విసుగ్గా ఉంది.

ఎంత స్వెర్టర్స్ వేసుకున్నా చలిగాలులు తట్టుకోవడం నాకు కష్టంగానే ఉంది. పిల్లలకి, రాజేష్‌కి, చంటికి ఆ వాతావరణం అలవాటే కాబట్టి పెద్దగా ఫీల్ కాలేదు.

మాకు కాస్త ముందుగా అంటే ఓ పది మంది ముందు వరకు ఎక్కించుకుని ఫెర్రీ వెళ్ళిపోయింది. మాన్హట్టన్ స్కై లైన్‌ని చూస్తూ అన్నిరకాల చర్మాల వారిని గమనిస్తూ క్యూలో.. మరో ఫెర్రీ కోసం పదిహేను నిముషాలు అలా గడిచిపోయాయి. అప్పటికి ఫెర్రీ ఎక్కడానికి టికెట్ తీసుకుని గంటపైనే సమయం గడిచిపోయింది.

ఫెర్రీ వచ్చింది. 10 నిమిషాల్లో ఎల్లిస్ ఐలాండ్ చేరుకున్నాం. బుల్లి ఐలాండ్. ఓ వైపు ప్రధాన భవనం ఉంది. ఇందులో ఇమ్మిగ్రిషన్ జాతీయ మ్యూజియం ఉంది.

న్యూయార్క్ బే లో మూడు ద్వీపాలున్నాయి. ఒకటి ఎల్లీస్ ఐలాండ్, రెండోది లిబర్టీ ఐలాండ్, మూడోది బ్లాక్ టామ్ ఐలాండ్. ఎల్లీస్ ఐలాండ్‌ని ఒకప్పుడు లిటిల్ ఓస్టెర్ ఐలాండ్ అనేవారట.

‘ఓస్టెర్’ ప్రజలు ఆ సమీపంలో నివసించేవారట. అందుకే ఆ పేరు పెట్టారు. తర్వాతి కాలంలో సైన్యం ఈ దీవిని వాడుకుంది.

కోలోనియాల్ పీరియడ్‌కి ముందు ఎల్లీస్ ఐలాండ్‌ని స్థానిక తెగలు చేపలు, ఇతర జలచరాలను వేటాడేందుకు తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి వాడేవారట.

మ్యూజియం చూడడం నాకు ఆసక్తి. పిల్లలకు అంత ఆసక్తిలేదు. రాజేష్ వాళ్ళను ఆడిటోరియంలోకి తీసుకెళ్లాడు. నేను చంటి మ్యూజియం మొత్తం తిరిగాం.

ఈ ప్రాంతం హడ్సన్ కౌంటీలో ఉంది.

ఎల్లిస్ ఐలాండ్ వలసదారులను తనిఖీ చేసే స్టేషన్. ఎల్లీస్ ఐలాండ్ దిగిన మొదటి వలసదారు ఐర్లాండ్‌కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి పేరు అన్నీ మూర్. వలసదారుల ఇమిగ్రేషన్ తనిఖీ చేయడంతో పాటు ప్రాసెస్ కూడా ఇక్కడి నుండి చేసేవారు. వలసదారుల వైద్య, మానసిక పరీక్షలు కూడా చేసేవారు. మొదట్లో ఎక్కువగా యూరోపియన్లు, జర్మన్, రష్యన్, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీల నుండి వలసదారులు వరదలాగా రావడం మొదలైంది. తర్వాత హంగేరి, చెక్, గ్రీస్, సిరియా, టర్కీ, అర్మేనియా, స్లోవేకియా పోలాండ్ వంటి దేశాల నుంచి వలసలు పెరిగాయి. 1892 నుంచి 1954 వరకు న్యూయార్క్, న్యూజెర్సీ పోర్ట్ లకు వచ్చిన దాదాపు 12 మిలియన్ల మంది ఈ కేంద్రంలో నమోదయ్యారు. ప్రతి వలసదారుని ఇద్దరు ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసేవారు.

వలసదారుల శరీర, మానసిక వైకల్యాలు, ఇతర రుగ్మతలు తనిఖీ చేసేవారట. ఆ తర్వాత ట్రాకోమా, కళ్ళ కలక, గుండె వ్యాధులు, చర్మవ్యాధులు వంటి రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించేవారు. ముగ్గురు డ్యూటీ డాక్టర్లు క్లియర్ చేసిన తర్వాత మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. మెడికల్ సర్టిఫికెట్ పొందిన వారికి, అక్షరాస్యత పరీక్ష నిర్వహించేవారు. అర్హత సాధించిన వారిని ప్రత్యేక విచారణ జరిపిన తర్వాత వలస వీసా ఇచ్చేవారు.

అనారోగ్యంగా ఉన్న వారిని తిప్పి పంపడం లేదా ఆస్పత్రిలో కొంతకాలం ఉంచడం చేసేవారు.

1892 ప్రారంభమైన ఈ తనిఖీ కేంద్రం 1897లో అగ్ని ప్రమాదానికి గురైంది. అంతా ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత 1900లో మళ్ళీ ప్రారంభించారు. 1924 నుంచి వలసదారుల నిర్బంధ కేంద్రంగా వాడారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో యుద్ద ఖైదీలను నిర్బందించడానికి కూడా ఈ కేంద్రాన్ని ఉపయోగించారు. కొంత కాలం శరణార్థుల కోసం వాడారు. 1990 నుంచి ఈ ద్వీపంలోని ప్రధాన భవనాన్ని మ్యూజియంగా మార్చారు.

నేషనల్ మ్యూజియంలో ఎల్లీస్ ఐలాండ్ కార్యకలాపాలకు అంటే ఇమిగ్రేషన్ స్టేషన్‌కు చెందిన ఫోటోలు, ఫోటో కింద వివరాలు రాసి చరిత్రకు సాక్ష్యాలుగా కనిపించాయి. మేం మొత్తం చూడలేకపోయాం కానీ అనేక గదులు, 700 పడకల బ్యారక్‌లు ఉన్నాయి.

కరోనా సమయంలో తాత్కాలికంగా మూసేసారు.

వలసదారులకు వాళ్ళ స్వంత పేరు బదులు కొత్త పేర్లు ఇచ్చారు. అలా ఇవ్వడాన్ని కొందరు ఒప్పుకోలేదని విన్నాను. కానీ చారిత్రక ఆధారాలు ఏమి అక్కడ లేవు. అమెరికన్ సంస్కృతి లోకి వచ్చిన ఐదేళ్లలోపు అనేక కుటుంబాలు తమ ఇంటిపేర్లు అమెరికన్‌విగా మార్చుకున్నాయట. అలా మార్చుకున్న వారి తాలూకు వారు కొందరు ఇప్పటికీ తమ మూలాలు తెలుసుకోవడం కోసం తమ పూర్వీకులను ఆనాటి ఇంటిపేర్లతో వెతుక్కోవడానికి ఈ ద్వీపానికి వస్తుంటారట.

మూడు అంతస్తుల్లో ఉన్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో గిఫ్ట్ షాప్స్, బుక్ షాప్స్ , పెద్ద గ్లోబ్ వంటివి ఉన్నాయి. మొదటి అంతస్తులో బ్యాగేజి గదిలో ప్రధాన లాబీ, ఫ్యామిలీ ఇమ్మిగ్రేషన్ హిస్టరీ సెంటర్, రెండవ అంతస్తులో రిజిస్ట్రీ రూమ్, హియరింగ్ రూమ్, మూడో అంతస్తులో డార్మెటరీ, ఎల్లీస్ ఐలాండ్ క్రానికల్స్, ప్రదర్శనలు కోసం మూడు థియేటర్లు ఉన్నాయి. లైబ్రరీ, రీడింగ్ రూమ్, ఓరల్ హిస్టరీ సెంటర్ ఉన్నాయి. అన్ని అంతస్తుల్లో ఆడిటోరియంలు ఉన్నాయి.

అమెరికాలో వలసల గురించిన చరిత్రని తెలిపే ఎల్లీస్ ఐలాండ్ న్యూజెర్సీ రాష్ట్ర భూభాగంలో ఉంది. ఇది ఇంగ్లీషు అక్షరం C ఆకారంలో కనిపిస్తుంది. అప్పటికే చూసే సరికి చాలా సమయం గడిచిపోయింది. పిల్లలు రాజేష్ ఏవో స్నాక్స్ తిని ఆడిటోరియంలో కాసేపు కూర్చున్నారు. వాళ్లకు విసుగ్గా ఉంది.

అసలు చూడాలని వచ్చిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడనేలేదు. న్యూయార్క్ వెళ్లే ఫెర్రీలు, మేము దిగిన చోటుకు అంటే లిబర్టీ స్టేట్ పార్క్‌కు వెళ్లే ఫెర్రీలు వచ్చాయి కానీ లిబర్టీ ఐలాండ్ వెళ్లే ఫెర్రీ రాలేదు. దాని కోసం ఎదురుచూస్తూ క్యూలో నిల్చున్నాం. ఒక వైపు పై నుండి కాల్చే ఎండ, నీటి మీదుగా వచ్చే చల్లటి గాలులు శరీరాన్ని కోసేస్తూ..

ఆ మిట్ట మధ్యాహ్నం వేళ (మూడు గంటల సమయంలో) అలా ఆకాశం కేసి చూస్తే నిలువుగా సగం కత్తిరించినట్లుగా చందమామ సన్నని మేఘపు పొరల మధ్య నుంచి తొంగి చూస్తూ ..అది మా సౌరవి కంట పడింది.

మూన్ మూన్ అంటూ మాకు చూపింది. మనకి సాధారణంగా ఆ సమయంలో చందమామ కనిపించదు, కానీ అక్కడ స్పష్టంగా కనిపిస్తూ..

ఎట్టకేలకు మేం ఎక్కాల్సిన ఫెర్రీ వచ్చింది. విండో సీట్లలో ఫెర్రీకి ఎడమవైపు కూర్చున్నాం. కానీ కుడివైపు కూర్చున్నవాళ్ళకి రెండు నిముషాలు మినహా ప్రయాణిస్తున్నంత సేపు లిబర్టీ స్టాట్యూ కనిపిస్తూనే ఉంటుంది.

అందుకోసం నేను లేచి డెక్ దగ్గరకు వెళ్లి చూస్తూ నిల్చున్నా.

లిబర్టీ ఐలాండ్ న్యూయార్క్ రాష్ట్రం భూభాగంలో ఉంది.

ఎల్లీస్ ఐలాండ్ నుంచి ఐదు నిమిషాలు కూడా ప్రయాణం చేయకుండానే కళ్ళకు పండుగ వాతావరణం కల్పిస్తూ నియో క్లాసికల్ శిల్ప సుందరి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. కానీ దాని దగ్గరకు చేరడానికి మాత్రం మరో పది నిమిషాల సమయం పట్టింది. నేనూ నా ఫోన్ కెమెరాకి పని కల్పించా. మాలాగే యాత్రికులు అందరూ ఉద్వేగంతో .. ఫోటోలు తీసుకుంటూ.. సెల్ఫీ తీసుకుంటూ..

లిబర్టీ ఐలాండ్‌లో అంతా దిగిపోయారు. అప్పటికి సమయం నాలుగు కావస్తున్నది. సూర్యుడు పడమటి అంచులకు చేరుతున్నాడు. అందుకే మేం దిగలేదు. దిగితే మరో గంట సమయం పడుతుంది. ఆ సమయంలో ఫెర్రీ చాలా రద్దీగా ఉంటుంది. ఆ చలిగాలిలో పిల్లలకు కష్టం కాబట్టి మేం దిగలేదు. ప్రపంచ పర్యాటకులకు పెద్ద ఆకర్షణ, సగర్వంగా ఠీవిగా నిలుచున్న విగ్రహం లేత ఆకుపచ్చ వంటి ప్రత్యేకమైన రంగులో.. కేంద్రమైన అక్కడ నుండి విరిగిన సంకెళ్లు, గొలుసు మధ్య ముందుకు నడుస్తున్నట్లు కుడి పాదం ఎత్తి కనిపించే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూసి అందించి వెనుదిరిగాం. అదీకాక విగ్రహం లోపలికి వెళ్ళడానికి ముందు రిజర్వేషన్ చేసుకోవాలి. అవి పరిమిత సంఖ్యలో లభ్యమవుతాయి. ఆ రోజు వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటంతో ముందే రిజర్వ్ అయిపోయాయి. మాకు దొరకలేదు.

అణచివేత చీకట్లను చీల్చి వెలుతురు, స్వేచ్ఛకు చిహ్నంగా నిలిచిన ప్రపంచ వారసత్వ సంపద అయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన జనంతో ఆ ప్రాంతం అంతా బిజీ బిజీగా కనిపిస్తున్నది. వాళ్లలో మేము కలవలేక పోయినందుకు, ఆ గొప్ప బహుమతిని చేతులతో స్పర్శించలేకపోయానని చిన్నగా నిట్టూర్పు.

కానీ తిరుగు ప్రయాణంలో ఫెర్రీ ఎక్కిన పర్యాటకుల మాటలు, చంటి చెప్పిన దాని ప్రకారం తెలిసింది ఏమిటంటే విగ్రహం తలపై కిరీటంలో ఏడు కిరణాలు ఏడు ఖండాలను సూచిస్తాయి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం లోపలికి మెట్ల ద్వారా వెళ్లవచ్చు. విడతలవారీగా దాదాపు 250 మందిని పంపిస్తారు. కిరీటం దగ్గర పది మందిని మాత్రమే పంపిస్తారు. కిరీటంలో 35 కిటికీలు ఉన్నాయి. టార్చ్ 24 క్యారెట్ల బంగారం, రాగితో కప్పబడి ఉంది.

బెడ్లొ ఐలాండ్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పెట్టిన తర్వాత ఆ దీవిని లిబర్టీ ఐలాండ్‌గా పిలుస్తున్నారు. ఫ్రాన్స్ లో తయారైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని విడి భాగాలుగా నౌకల్లో అమెరికా తెచ్చి అమర్చారు.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి కానీ, మ్యూజియం చూడ్డానికి కానీ ఎటువంటి టికెట్ లేదు. ఫెర్రీకి మాత్రం టికెట్ కొనుక్కోవాలి. న్యూయార్క్ వైపు నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేరాలంటే మాన్హట్టన్ నుండి ఫెర్రీ తీసుకోవాలి. న్యూజెర్సీ నుంచి వెళ్ళేవాళ్ళు లిబర్టీ స్టేట్ పార్క్ నుండి ఫెర్రీలో వెళ్ళాలి.

మేం ఫెర్రీలో ఉండగానే సూర్యాస్తమయం అయింది. క్షణక్షణానికి పెరిగిపోతున్న శీతల గాలుల్లో ఫెర్రీ దిగి ఇంటికి బయలుదేరాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here