సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 23

0
16

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

టూత్ ఫెయిరీ

[dropcap]ఇ[/dropcap]ది 2022 ఫిబ్రవరి నాటి ముచ్చట.

అమ్మా నా పన్ను అటూఇటూ కదులుతోంది అంటూ వాళ్ళమ్మకు చూపింది సౌరవి.

ఏడేళ్లకు పాలపళ్ళు ఊడతాయి అంటారు కానీ దీనికేంటి ఐదేళ్లకే కదులుతున్నాయి మనసులో మాట పైకే అనడంతో, దానిదేముంది కొందరికి ముందు వెనక అని మా అమ్మాయి సాధన జవాబిచ్చింది.

గిగ్లింగ్ టీత్ అంటూ సౌరవి దృష్టి అంతా కదులుతున్న కింద పన్ను మీదే.

అప్పుడప్పుడే కిండర్ గార్డెన్‌లో చేరింది. స్కూల్ నుండి ఇంటికి రాగానే టూత్ ఫెయిరీకి ఏమిస్తావ్ అని అమ్మనాన్నలని అడిగింది. వాళ్ళేదో చెప్పారు. టూత్ ఫెయిరీ అంటే ఏంటి? నాకు ఏ మాత్రం అర్థం కాలేదు.

మీరు విన్నారా టూత్ ఫెయిరీ గురించి. నేనైతే మొదటిసారి విన్నాను. మనదేశంలో ఇట్లాటి ఆచారం లేదు.

కాబట్టి అదేంటో తెలుసుకుందామని మా అమ్మాయిని అడిగా.

పన్ను ఊడిందని పిల్లలు భయపడిపోకుండా, బాధపడకుండా వాళ్ళని సంతోషం పెట్టడం కోసం చేసే ఓ పద్ధతి అని వివరించింది.

మొదటి పాలపన్ను ఊడినప్పుడు పిల్లలకు చాలా ఫన్ గాను, ఉద్విగ్నంగా ఉంటుంది కదా.. మా సౌరవికి కూడా అంతే.

తన పన్ను ఎప్పుడెప్పుడు ఊడుతుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టింది.

టూత్ ఫెయిరీ వస్తుందా రాదా.. వస్తే నా పన్ను తీసుకుపోతుందా.. అని రకరకాల ఆలోచనలు చేసింది.

ఆ తర్వాత రెండు మూడు రోజులకే పన్ను ఊడి పోయింది. ఆ రోజు దానికి పండుగ లాగా ఉంది. దాన్ని జాగ్రత్తగా ఒక బాక్స్ లో పెట్టి దిండు కింద దాచి పెట్టింది. ఉదయం లేవగానే తన దిండు కింద వెతుక్కుంది. రెండు డాలర్లతో పాటు చిన్న బొమ్మ కూడా ఉండడం చూసి టూత్ ఫెయిరీ వచ్చిందని సంతోష పడిపోయింది. డాలర్ బిళ్ళలు రెండు, బొమ్మని తీసుకుని మా అందరికీ టూత్ ఫెయిరీ వచ్చి ఇచ్చిందని చూపించింది.

ఆ సాయంత్రం బడినుండి వచ్చాక టూత్ ఫెయిరీ ఎలా వచ్చింది. అసలు ఎలా ఉంటుంది? తన పన్ను తీసుకుపోయింది. అది ఏమి చేసుకుంటుంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు మా పై వెదజల్లింది.

అప్పుడు వాళ్ళమ్మ వివరించింది. చక్కగా అర్థం చేసుకుంది. టూత్ ఫెయిరీ నిజంగా లేదు. అది మనం ఊహించుకుంటాం అంతే. అమ్మానాన్నలే టూత్ ఫెయిరీ ఇచ్చినట్లు దిండుకింద డాలర్ పెడ్తారు, బహుమతులు పెడతారు అని వివరిస్తుంది సౌరవి.

టూత్ ఫెయిరీ పద్ధతి ఆస్ట్రేలియాలో మాత్రమే ఉందా? ఇతర దేశాల్లో కూడా ఉందా.. తెలుసుకుందామని గూగుల్ చేశాను. నేను తెలుసుకున్న విషయాలు ఇక్కడ మీతో పంచుకుంటున్నా.

చరిత్రలోకి వెళితే మొదటి పాలపన్ను ఊడినప్పుడు టూత్ ఫీ చెల్లించే సాంప్రదాయం ఉత్తర్ యూరోప్‌లో ఉండేదట. అందుకు సంబంధించిన లిఖిత రికార్డులు ఉన్నాయట.

టూత్ ఫెయిరీ పద్ధతి ఇంగ్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియాలో ఉంది. బహుశా యూరోపియన్ వలసదారుల ద్వారా ఈ ఆచారం ఆస్ట్రేలియా చేరి ఉంటుంది.

కొందరు చెట్టు కింద పాతుతారు. కొందరు సూర్యుడికేసి విసురుతారు. కొందరు పెద్దలు ఆ పాలపన్ను మింగేస్తారు. కొందరేమో కాల్చేస్తారు.

వైకింగ్స్‌కి టూత్ ఫీ అని పద్ధతి ఉండేదట.

స్పెయిన్‌లో దిండు కింద పైస లేదా చాకోలెట్ పెడతారట.

ఆర్జెంటినా, స్వీడన్‌లలో ఊడిన పాలపన్ను పిల్లలు నీళ్లతో ఉన్న గాజు గ్లాసులో వేసి పెడతారట. చిట్టెలుక వచ్చి ఆ నీళ్లు తాగేసి పన్ను తీసుకుంటుంది. గ్లాసు పక్కన నాణెం లేదా చాకోలెట్ పెట్టి వెళ్తుందట.

ఆస్ట్రియాలో పాలపన్నుని పెండెంట్ లోనో, ఉంగరంలో పెట్టి విసురుతారట. పై పన్ను అయితే ఇంటి లోపలికి, కింద పన్నయితే పైకప్పు పైకి విసురుతారు.

ఆసియా దేశాల్లోనూ, గ్రీస్, బ్రెజిల్ దేశాల్లో ఊడిన పాలపన్నును పిల్లలు ఇంటి పైకప్పు పైకి విసురుతారట. ఎంత నిటారుగా అది పైకి వెళితే అంత త్వరగా శాశ్వత కొత్త పన్ను పెరుగుతుందని నమ్ముతారు.

ఈజిప్ట్‌లో పాలపన్నుని టిష్యూ పేపర్‌లో చుట్టి బయటికి తీసుకుపోతారు. సూర్యుడికేసి విసిరి ఈ దున్నపోతు పన్ను తీసుకుని అందమైన మెరిసే పన్ను ఇవ్వమని వేడుకుంటారు.

మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా సూర్యుడి వైపు విసిరితే మంచిగా మెరిసే పన్ను సూర్యుడు ఇస్తారని నమ్ముతారు.

ఊడిన పాల పళ్ళు ఫెయిరీ తీసుకుపోయి క్యాజిల్ కడుతుందని కొందరు పిల్లలు అనుకుంటారు. కొందరేమో పళ్ళు ఇంకా రాని పిల్లలు తినడానికి కష్టం అవుతుంది కదా అందుకే ఈ పళ్ళు తీసుకుపోయి ఫెయిరీ వాళ్లకు ఇస్తుందని అనుకుంటారట.

ఇంగ్లాండ్‌లో ఒకప్పుడు ఊడిన పాలపన్ను నిప్పుల్లో వేసేవారట. ఇలా చేస్తే దెయ్యాలు పట్టవని, పిల్లల శక్తుల్ని దోచుకోవని నమ్మేవారు. ఇప్పుడయితే దిండు కింద నుండి టూత్ ఫెయిరీ తీసుకుని డబ్బులు పెడుతుందట.

యూరోపియన్ దేశాల్లో కూడా నిప్పుల్లో కాల్చేసే అలవాటు ఉండేది. నిప్పు పెట్టి కాల్చడానికి స్థలం లేని వాళ్ళు ఇంట్లో ఉండే పూలకుండీలో పెట్టి కాల్చేసేవారట.

ఇప్పుడయితే ఆ పద్ధతి పోయింది. పాలపన్నుని దిండు కింద పెడితే ఫెయిరీ వచ్చి నాణేలు పెట్టి పన్ను తీసుకుపోయే పద్దతే ఉన్నది.

ఫ్రాన్స్‌లో ఫెయిరీ చిట్టి పన్నును తీసుకుని బహుమతులు ఇస్తుందట.

ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు పాలపన్ను ఊడినప్పుడు రకరకాల నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. కొన్ని పిల్లల్ని ఆనందపెట్టడానికి చేసేవైతే కొన్ని దుష్టశక్తుల్నించి కాపాడుకోవడానికి, కొన్ని మంచి పళ్ళు రావాలనే ఆకాంక్షతో చేసేవి.

మధ్యయుగాల్లో పిల్లల దంతాల చుట్టూ మూఢ నమ్మకాలు పుట్టుకొచ్చాయి. పిల్లలను మరణానంతర జీవితంలో కష్టాల నుండి రక్షించాడని పాల పళ్ళు కాల్చమని చెప్పేవారట. మంత్రగత్తెల భయం దంతాలను పాతిపెట్టడానికి లేదా కాల్చడానికి మరొక కారణం.

టూత్ ఫెయిరీ ఆడ అని ఎక్కువ మంది నమ్ముతారట.

ఏ కారణంతో చేసినప్పటికీ పిల్లలు మాత్రం మొదటి పాలపన్ను ఊడినప్పుడు టూత్ ఫెయిరీ ఇచ్చే వాటికోసం ఉత్కంఠతో ఎదురుచూస్తుంటారనేది నిజం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here