సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 24

0
12

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

సిలోస్

[dropcap]ఆ[/dropcap] రోజు 2022 డిసెంబర్ 17 వ తేదీ. చాంటిల్లి, వర్జీనియా నుండి లూరే కెవరిన్స్‌కి మా ప్రయాణం.

నున్నగా నిగనిగ లాడే రోడ్డుపై కారులో శానండోవ వాలీ దాటి ముందుకు దూసుకుపోతున్నాం. పర్వత ప్రాంతం, పచ్చని అడవులు దాటి విశాలమైన గోధుమ వ్యవసాయ క్షేత్రాలు దాటుకుంటూ సాగుతున్నాం.

అప్పటికి నేను అమెరికా చేరి 17వ రోజు. మొదటిసారి వ్యవసాయ క్షేత్రాలను చూశాను. గోధుమ, మొక్కజొన్న పంటలు హార్వెస్ట్ చేసి కనిపించింది. విశాలమైన ఆ వ్యవసాయ క్షేత్రాల్లో అక్కడక్కడ హార్వెస్టర్‌లు కనిపించాయి.

అంతలో సాగదీసిన సిలిండర్ లాంటి ఆకారం ఆకాశం వైపు చూస్తూ.. అది ఓ కట్టడం అని అర్థమైంది, ఆ పక్కనే సిలెండర్ ఆకారంలో వెడల్పుగా ఉన్న పెద్ద పెద్ద ఆకారాలు కాస్త దూరంగా.. సన్నగా పడుతున్న ఎండకు మిలమిల మెరుస్తూ కనిపించాయి. వాటిని టిన్ రేకులతో చేసినట్టున్నారు.

బహుశా రైస్ మిల్ లాంటిది ఏదో అయి ఉంటుంది అనుకున్నా.

నా అంచనా తప్పని తేల్చేశాడు మేనల్లుడు వాసు.

వాటిని సిలోస్ అంటారట. అవి మన వ్యవసాయ గిడ్డంగులు వంటివి. అంటే పండిన ధాన్యాన్ని నిలువ చేసుకునే ధాన్యాగారాలన్నమాట.

మనదేశంలో ధాన్యాన్ని తాత్కాలికంగా చదును చేసిన నేలపై ఎండబెట్టడం వాటిని నేలపై కుప్పలు చేసి రాశులుగా పోయడం చేస్తుంటారు.

దీర్ఘ కాలం కోసం నిలువ చేయాల్సి వస్తే వెదురుతో అల్లిన గుమ్ములు వాడటం, లేదా పురులు కట్టి దాచుకోవడం, మట్టి కుండల్లో బానల్లో నిలువ చేయడం, లేదా గదిలో దాచడం వంటి పద్ధతులు చిన్నప్పటి నుంచి తెలిసినవి. అవి సాంప్రదాయ పద్ధతులు.

వ్యవసాయంలో కోత యంత్రాలు ప్రవేశించాక కోత మీదే ధాన్యాన్ని అమ్మేయడం చూస్తున్నాను. చాలా కొద్దిమంది రైతులు మాత్రమే వ్యవసాయ గిడ్డంగుల్లో దాచడం తెలుసు.

ఏ పద్ధతిలో నిలువ చేసినా ఆ సమయంలో రైతు కొంత ధాన్యం నష్టపోతున్నాడు. ఎలుకలు, పందికొక్కులు చేరడం, చెదలు పట్టడం, వర్షానికి తడిచి నాని పోవడం, లేదా అగ్నిప్రమాదాలకు గురవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నష్టపోవాల్సి వస్తున్నది. రైతుబిడ్డగా నాకు ఆ విషయాలన్నీ తెలుసు.

సిలోస్‌లో ధాన్యం నిలువచేసే అమెరికన్ రైతులు నష్టపోవడం చాలా తక్కువట.

అమెరికా వ్యవసాయం ఎప్పుడో యాంత్రీకరణ జరిగింది. వ్యవసాయ కమతాలు కూడా చాలా విశాలమైనవి. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంటాయి.

గోధుమ, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, సోయాబీన్స్ పండిస్తారు.

ఆధునిక సాంకేతిక సహాయంతో ధాన్యం నిల్వ చేసే పద్ధతులు మారాయి. ధాన్యానికి పూర్తి రక్షణ కల్పించే పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు రైతులు.

అందు కోసం సిలోస్, బిన్స్, ఎలివేటర్లు, బంకర్లు లేదా షెడ్లు ఉపయోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు వచ్చి ధాన్యాన్ని సురక్షితంగా నిలువ చేసే అందుబాటులోకి వచ్చాక సిలోస్‌లో ఎమర్జెన్సీ అలర్ట్స్ కూడా ఉంటాయట.

రైతులు తమ ధాన్యం నిలువ చేసుకోవడానికి తమ వ్యవసాయ క్షేత్రంలో తమ అవసరానికి తగినన్ని సిలోస్ స్వంతంగా ఏర్పరచుకుంటారట. కొందరు రైతులు వాటిని అద్దెకు కూడా ఇస్తుంటారట. సిలోస్‌లో ధాన్యంతో పాటు పశువుల దాణా, గడ్డి కూడా నిలువ చేస్తారట.

అమెరికాలో రైతు అంటే మన దగ్గర ఉన్నంత చిన్న సన్నకారు రైతులు కనిపించరు. చిన్న రైతులు అంటే సరాసరి 230 ఎకరాలు ఉంటాయట. అదే మధ్య తరహా రైతులు అంటే రమారమి 1400 ఎకరాల పైన, పెద్ద రైతులు అంటే రెండువేల ఎకరాల పైన ఉంటాయట.

సిలోస్ నుంచి మా సంభాషణ అమెరికా వ్యవసాయం పైకి మళ్లింది.

అమెరికాలో వ్యవసాయం ఒక ప్రధాన పరిశ్రమ. వలసలు జరిగిన కాలంలో వర్జీనియా, మేరీలాండ్ రాష్ట్రాల్లో బానిసలను ఉపయోగించి పొగాకు పండించారట. కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లాండ్ నుండి వలస వచ్చిన వాళ్ళు వేరుశెనగ, బార్లీ పండించారట. మొదట్లో వ్యవసాయానికి గుర్రాలు, ఎద్దులు వాడేవారట.

వ్యవసాయంలో యంత్రాలు వచ్చాక అంటే ట్రాక్టర్, కోత మిషన్ వంటి ఆవిష్కరణలు వచ్చాక వ్యవసాయం ఒక పరిశ్రమగా మారిందట.

మొక్కజొన్నలను మనుషులకు, పశువుల దాణాకు, పందులకు వాడతారట. అలా అక్కడ పంటల గురించి మాట్లాడుకుంటూ ఉంటే సమయమే తెలియలేదు. మాటల్లోనే మా గమ్యం చేరాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here