సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 7

0
12

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

నాన్ టీన్ టెంపుల్

[dropcap]2[/dropcap]018, ఏప్రిల్ 7వ తేదీ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం.

సిడ్నీ సౌత్ కోస్ట్ పట్టణం వొలంగాంగ్ వెళ్లాలని అనుకున్నాం. 96 కిమీ.దూరంలో ఉంది.

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో మూడో పెద్ద నగరం వొలంగాంగ్.

అద్భుతమైన ప్రకృతి సౌందర్యమంతా అక్కడే కుప్ప పోసినట్లుగా ఉంటుంది.

2016లో వచ్చినప్పుడు ఈ ప్రాంతం చూసాను. ఇప్పుడు మరోసారి ప్రయాణం. గతంలో వెళ్ళినప్పుడు హెలేన్స్ బర్గ్‌లో ఉన్న పెద్ద హిందూ దేవాలయం చూసి అటునుంచి వెళ్ళాం. ఇప్పుడు వచ్చింది మరో రూట్‌లో.

సిడ్నీ నగరం దాటాక కొన్ని పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు. ఇప్పటికే మేం బయలుదేరడం ఆలస్యం కావడంతో తిరుగు ప్రయాణంలో వ్యవసాయ క్షేత్రాల దగ్గర ఆగుదాం అనుకున్నాం. రోడ్డుకు సమీపంలో ఆ ఫార్మ్స్‌లో కూరగాయలు, ఆకుకూరలు ఉన్నట్లు స్టాల్స్ వల్ల తెలుస్తోంది. లోపల ఏమి ఉన్నాయి తెలియదు.

షాపింగ్ సెంటర్ లోని కూరగాయల దుకాణం, లేదా మరో చోట కూరగాయల దుకాణాలు కూరగాయలు, పండ్లు ఎంత ఫ్రెష్ అని చెప్పినా అవి నిలువ చేసినవే. కానీ, వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన స్టాల్స్ దగ్గర కొనుక్కుంటే ధరలో పెద్ద తేడా ఉండదు కానీ చాలా తాజాగా ఉంటాయట.

ఇంకాస్త ముందుకు పోతే ఫార్మ్స్‌లో మేసే గుర్రాలు, గొర్రెలు, ఆవులు కనిపించాయి. అచ్చం పచ్చిక బయళ్లలో మేసే మన గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలను మేస్తున్నట్లుగానే అనిపించింది.

అక్కడ భూములు మన మెట్ట భూములు గుర్తుకు తెచ్చాయి. మన మెట్ట చేలల్లో అక్కడక్కడ విప్ప, మద్ది లాంటి చెట్లు ఉండి పలుచని గడ్డి తోనో రాళ్లు రప్పలతో గట్టిబడి పోయిన నేలలుగా కనిపిస్తాయి కదా.. అచ్చం అలాగే అనిపించాయి. అలా వందల వేల ఎకరాలు.

ఎత్తు పల్లాలతో ఆ పచ్చిక బయళ్లు, వ్యవసాయ క్షేత్రాలు దాటుకుని సాగుతున్నది మా ప్రయాణం అలా వెళ్తుండగా దట్టమైన అడవి మొదలైంది.

ఓహ్.. ఏమి ఆ సౌందర్యం..

చిక్కని అడవి సోయగాలను ఆస్వాదిస్తూ పోతున్నాం మేం.

ఎత్తైన కొండలు, లోతైన లోయలు దాటుకుంటూ సాగిపోతోంది ప్రయాణం. దారి మధ్యలో అక్కడక్కడా టెలిఫోన్ బాక్స్‌లు, రెస్ట్ వే.. కన్పించాయి.

ఓ గంటన్నర గడిచాక “అబ్బ అద్భుతంగా ఉంది కదా..” అన్నది సీరియస్‌గా డ్రైవ్ చేస్తున్న సాధన.

కొండ వాలు దిగుతున్న మేము తల వంచి దూరంగా చూస్తే ఓ పక్కగా కనిపించే నివాస సముదాయాలు.

కనుచూపు మేర పరుచుకున్న నీలి సముద్రం. ఆ నీలి సముద్రంపై పలుచని మేలిముసుగు వేసినట్లుగా పొగమంచు..

సముద్రపు నీటి పై పలుచని ఎండ పడినప్పుడు ఆవిరి అయ్యే నీటి వల్లనేమో అలా పొగమంచు ఆవరించినట్లుగా ఉన్నది. ఏది ఏమైనా కానీ ఆ దృశ్యం అద్భుతంగా.. పైకి చూస్తే నీలాకాశం.. అలా అలరించి ఇలా మాయమైంది. ఆ దృశ్యం మళ్ళీ కనిపిస్తుందేమోనని కళ్లింత చేసుకుని చూసాం.

దట్టమైన చెట్ల ఆకుల సందుల్లోంచి దోబూచులాట. కార్ పార్క్ చేసుకుని ఆగే ప్రదేశం కాదది. మన దేశంలో లాగా ఎక్కడ పడితే అక్కడ కారు ఆపకూడదు. స్పీడ్ కూడా ఇష్టం వచ్చినట్టు తగ్గించకూడదు. ఏం చేస్తాం.. ముందుకే సాగాం. ఎటూ వెళ్ళేది అటే కదా..

కానీ ఈ సౌందర్యం వేరు. దగ్గరనుండి చూసే ఆ సౌందర్యం వేరు కదా..

వోలంగాంగ్ పట్టణం చేరుకున్నాం.

మొదట నాన్‌ టీన్ టెంపుల్ అనే బౌద్ధ దేవాలయం చూడాలనుకున్నాం. వోలంగాంగ్ పట్టణానికి దక్షిణం వైపు 10 నిముషాల దూరంలో ఉన్న ఈ బౌద్ధాలయం సహజ సౌందర్యంతో అలరారే ప్రాంతం బర్కిలీలో ఉన్నది.

తైవానీస్ ఫో గుయాంగ్ షాన్ (Fo Guang Shan) (మహాయాన బుద్దిస్ట్ సంస్థ ) నిర్వహిస్తున్న ఆలయాల్లో ఇది ఒకటి. ఆ సంస్థని 1965లో Hsing Yun ప్రారంభించారు. ఆయనే సముద్రానికి, పర్వతాలకి మధ్య ఉన్న ఈ ప్రాంతం ఫెంగ్ షుయ్ ప్రకారం అనువైనదని ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారట.

ఈ సంస్థ నిర్వహణలో ప్రపంచ వ్యాప్తంగా 120 బౌద్ధాలయాలు ఉన్నాయట. అయితే దక్షిణార్థ గోళంలో ఇదే పెద్ద బౌద్ధాలయం అట. బుద్ధిజాన్ని మన రోజువారీ జీవితంలో భాగస్వామ్యం చేయాలని ఫో గుయాంగ్ షాన్ (Fo Guang Shan) అనుచరుల ప్రయత్నం. మానవవాద బుద్ధిజం అని వారి ఫిలాసఫీ. అదే ఇక్కడ యూనివర్సిటీలో బోధిస్తారు.

ఆస్ట్రేలియాన్ ప్రభుత్వం భూమి ఇస్తే ఇది నిర్మించారట. నాన్ టీన్ టెంపుల్ కెంబ, కెయిర పర్వతాల ఎదురుగా ఉంది. ఆధునిక ఆర్కిటెక్చర్ పద్ధతుల్లో చైనా స్టైల్‌లో ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్ట్స్ నిర్మించారట.

నిజానికి, మేమెవరం భక్తులు కాదు. మాకెవరికీ ఏ మతానికి చెందిన దేవుళ్ళు, దేవతల మీద విశ్వాసం లేదు. దేవాలయాల మీద ఆసక్తి లేదు. కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దర్శనీయ స్థలం అయితే ఏ మతానికి చెందిన దేవాలయం అయినా ఆ దేవాలయాల్లోకి వెళ్లడానికి, చూడడానికి అభ్యంతరం లేదు. అక్కడి ప్రకృతి సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తాం. ఆనందిస్తాం. అదే విధంగా నాన్ టీన్ టెంపుల్ చూడాని వచ్చాం.

మేం గతంలో కర్ణాటకలోని మైసూరుకు పశ్చిమ దిశలో ఉన్న టిబెటియన్ సెటిల్‌మెంట్‌లో ఉన్న బౌద్ధ దేవాలయం చూసాం. నేను ఒరిస్సాలోని చంద్రగిరి ఏరియాలో ఉన్న చిన్న టిబెటియన్ సెటిల్మెంట్‌కి వెళ్ళాను. అక్కడ పది ఎకరాల్లో కొత్తగా నిర్మించిన బౌద్ధాలయంతో పాటు బౌద్ధ సన్యాసులుగా శిక్షణ పొందుతున్న 200 మంది విద్యార్థులను కలిశాను.

మన దేశంలో చూసిన రెండు బౌద్ధాలయాలలాగే ఇక్కడ కూడా అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారే పర్వత ప్రాంతాల్లో నిర్మించడం విశేషం.

ప్రధాన గుడిలో మనదేశంలో చూసిన ఆలయానికి కొంత పోలికలు ఉన్నప్పటికీ తేడాలు కూడా చాలా కనిపించాయి.

ముఖ్యంగా మన దేశంలో నేను చూసిన పగోడా ఎత్తు తక్కువ. కానీ ఇక్కడ చాలా ఎత్తైన టవర్‌లా అంతస్తులు అంతస్తులుగా 8 అంతస్తులతో పెద్ద కొండపై ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

ప్రధాన ఆలయం చాలా పెద్దది. ధ్యానంలో ఉన్న 5 బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. దేవునికి ఇవ్వడం కోసం కొవ్వొత్తులు రకరకాల రేట్లలో.. పువ్వులు, ఆకులు మధ్య పెట్టి, కొన్ని చిన్న చిన్న పాట్స్‌లో పెట్టి, మొక్కల మధ్య పెట్టి అమ్ముతున్నారు. భక్తులు వాటిని కొని బుద్ధ దేవుడికి అర్పిస్తున్నారు. కానీ వాటిని వెలిగించడం కనబడలేదు. ధ్యాన మందిరంలో ఉన్న ప్రధాన దేవాలయంలో ఉన్న బల్లలపై కూర్చొని మౌనంగా ప్రార్థన చేసుకోవచ్చు.

జపనీస్ స్టైల్‌లో ఉన్న చక్కటి గార్డెన్స్, చాలా ప్రాంతాల్లో పిక్నిక్ నిషేధం. ఎక్కడైతే నిషేధం లేదో అక్కడ చూసుకొని కూర్చొని మేము ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర, దద్దోజనంతో భోజనం కానిచ్చాము. మా లాగే సౌత్ ఏషియన్ కుటుంబాలు కొన్ని పచ్చటి తివాచిల్లాటి గడ్డిపై చాప పరిచి ఇంటి నుంచి తెచ్చుకున్న పదార్థాలు తింటూ కనిపించారు. విజిటర్స్ పార్కింగ్ పూర్తిగా నిండిపోయింది.

బుద్ధ గుడి 1992లో కట్టడం మొదలెట్టి 1995 నుండి భక్తులకు ద్వారాలు తెరిచారట. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న ఈ బౌద్ధాలయం చాలా పెద్దది. ఆర్కిటెక్చర్ మమ్మల్ని చాలా ఆకర్షించింది.

బుద్దుని జీవితాన్ని చూపుతూ ఉన్న ఎక్సిబిషన్ చూసాం.

బుద్దిస్ట్ పండుగలు జరుపుతారట. ఆడిటోరియం, క్లాసు రూమ్స్, ఉన్నాయి. కాన్ఫెరెన్స్ హాల్స్ ఉన్నాయి హాస్టల్ రూమ్స్ ఉన్నాయి.

అక్కడ ఉండాలనుకునే వారికి 100 గదులతో వసతి సౌకర్యం ఉంది. ఏడాది పొడుగునా తెరిచే ఉంటుంది.

మంచి జీవన విధానం గురించి క్లాసులు జరుగుతున్నాయి. రెండు ఆడిటోరియంలలో ఏవో బుద్ధిజంకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువత ఎక్కువగా కనిపించారు అక్కడ.

మా సౌరవిని చూసి ఒకరు మా దగ్గరకు వచ్చి ఆశీర్వచనం ఇస్తారు ఫలానా వాళ్ళని కలవండి అంటూ ఓ క్లాస్ రూం లాంటి రూం చూపించారు. అక్కడ ఒకరు కూర్చుని ఉన్నారు. అతని ఎదుట కొందరు నిలబడి ఉన్నారు. అతని ఆశీర్వచనం తీసుకుంటే బిడ్డ దగ్గరకు ఎటువంటి దుష్ట శక్తులు దరి చేరవు అని చెప్పారు.

మేం చిన్నగా నవ్వుకుని ముందుకు కదిలిపోయాం.

ఇక్కడ కూడా దుష్ట శక్తులు వంటి నమ్మకాలు ఉన్నయా అని నేను ఆశ్చర్యంగా అంటుంటే.. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏవో కొన్ని నమ్మకాలు ఉన్నాయి అని సాధన, రాజేష్‌లు చెప్పారు.

సమీపంలోనే కాంటీన్ ఉంది. చక్కటి వెజిటేరియన్ ఆహారంతో చేసిన వంటలు వేడివేడిగా తయారవుతున్నాయి. చైనా వంటకాలు ఎక్కువ. తామరాకులో బియ్యం పెట్టి ఆవిరిపై వండిన లోటస్ లీఫ్ రైస్ ఫేమస్ అక్కడ. అందులో గుప్పెడు అన్నం కూడా ఉండదు కానీ 8 డాలర్లు. అయితే చాలా రుచిగా ఉంటుంది. అందుకే చాలా రద్దీగా ఉంటుంది. మనం ఆర్డర్ చేసిన తర్వాత సర్వ్ చేయడానికి కనీసం అరగంట పైనే పడుతుంది. టేబుల్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. అందుకే అక్కడ ఆగలేదు.

మొదటిసారి రమతో వచ్చినప్పుడు లోటస్ రైస్ ఎలాగూ రుచి చూశా కాబట్టి వేచి ఉండి ఆ లోటస్ రైస్ తినాలని అనుకోలేదు.

మా అల్లుడు రాజేష్ వేడి నీళ్ళ కోసం కాంటీన్‌కి వెళ్ళాడు. సాధన మేము పిక్నిక్ చేసిన దగ్గర ఉంది. అప్పుడు మా మనవరాలు సౌరవితో కలసి నాలుగడుగులు వేశాను. అప్పుడు సౌరవికి 18 నెలలు. ఉన్నట్టుండి సౌరవి పగోడా ఉన్న కొండ వైపు నడక మొదలు పెట్టింది. దాని వెనుక నేను. అలా ఓ రెండు వందల మీటర్లు నడిచామో లేదో దానికి మెట్లు కనిపించాయి. నెమ్మదిగా పైకి ఎక్కడం మొదలు పెట్టింది. సరదా పడుతోంది అనుకున్నా కానీ మొత్తం ఎక్కేస్తుందని అసలు ఊహించలేదు. 100 పైగా మెట్లు సునాయాసంగా ఎక్కేసింది. కింద మా వాళ్ళు మమ్మల్ని వెతుక్కుంటారేమో అని నాకు కంగారు. అలా దాని వెనుక నేను. రమ్మంటే రాదు. దాని ఉత్సాహాన్ని చూస్తుంటే ముచ్చటేసింది.

పెద్దలు చాలామంది అక్కడి వరకు ఎక్కలేక కిందనుండి పగోడా కనిపించేలా నుంచొని ఫొటోలతో సరిపెట్టారు. సౌరవి మాత్రం చివరికంటా ఎక్కి గర్భగుడిలో ఉన్న బుద్ధుడి ఎదురుగా గుమ్మం బయట ఉన్న పెద్ద రాగి కళాయి పట్టుకుంది. లోపలికి వెళ్ళబోయింది.

అక్కడున్న చైనా మహిళా వాలంటీర్ చెప్పులతో లోపలికి వెళ్లకూడదని వారించడంతో ఏదో గొణుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది.

దిగేటప్పుడు తానే దిగుతానని పేచీ.. ఫోన్ సిగ్నల్స్ అందడం లేదు. మా వాళ్ళు కంగారు పడుతుంటారని నా ఆందోళన. బలవంతాన ఎత్తుకుని దిగేసరికి నాకు ఆయాసం వచ్చేసింది. నా ఆయాసాన్ని అనుకరిస్తూ, వెక్కిరిస్తూ అమ్మ నాన్నలకు చూపింది ఆ బుడ్డది.

ఈ ఆలయానికి దగ్గరలో బుద్దిస్ట్ విలువలు, జ్ఞానం పెంచడం కోసం నాన్ టీన్ యూనివర్సిటీ ఉంది.

బౌద్ధాలయం ప్రారంభించిన 20 ఏళ్లకు అంటే 2015 నుంచి ప్రభుత్వ అక్రెడిషన్‌తో ఆ యూనివర్సిటీ ప్రారంభించారు.

బౌద్ధాలయం ప్రారంభించడానికి గానీ, యూనివర్సిటీ ప్రారంభించడానికి కానీ స్థానిక చర్చి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదట. అందరూ సాదరంగా ఆహ్వానించారట. ఆసక్తి ఉన్న ఎవరైనా ఆ యూనివర్సిటీలో చదువుకోవచ్చట.

ఆ యూనివర్సిటీలో ప్రధానంగా బుద్ధిజం స్టడీస్‌కి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. వాటితో పాటు ఆరోగ్యం సామాజిక క్షేమం, పర్యావరణం మొదలైన వాటిలో పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు ఉన్నాయి.

వోలంగాంగ్ ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్స్‌లో ఒకటైన బౌద్ధాలయం నుండి బయటికి వచ్చేసరికి 4 దాటింది.

బయట ఎండగా ఉంది. అప్పుడు 29 డిగ్రీల ఎండ. సిడ్నీ కన్నా 5 డిగ్రీలు తక్కువ.

వోలంగాంగ్ లో పారా గ్లైడింగ్, స్కై డైవింగ్, హ్యాంగ్ గ్లైడింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్కువ.

ఇల్లవర్రా రేంజ్‌లో ఉన్న ఓ కొండ పేరు బాల్డ్ హిల్. సముద్రానికి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండ హ్యాంగ్ గ్లైడింగ్‌కి అంతర్జాతీయంగా పేరొందింది. అక్కడి నుంచి చూస్తే నీలాకాశం కింద నీలి రంగులో మెరిసే నీళ్లు మనసును దోచేస్తాయి. ఆకాశంలో పక్షుల్లా సముద్రంపై, దట్టమైన అడవుల పైగా ఎగిరే గ్లైడర్స్.. ఆ దృశ్యాలను మనసులో ముద్రించుకుంటూ దూరంగా కనిపించే సముద్రపు ఒడ్డున ఉన్న గ్రామాలను చూశాం.

ఇక్కడి లారెన్స్ హార్గ్రేవ్ మెమోరియల్ పార్క్ పారా హ్యాంగ్ గ్లైడింగ్‌కి. చల్లటి గాలి మనని కొండ కిందనున్న సముద్రంలోకి నెట్టేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడి నుండి చూస్తే స్టాన్ వేల్ పార్క్, బీచ్ అందాలు,సీ క్లిప్ బ్రిడ్జ్ చూడడం గొప్ప అనుభవం.

ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా తరవాల్ తెగకు చెందిన అబోరిజినల్స్ దేనట. అయితే బ్రిటిష్ వాళ్ళ రాకతో అది వాళ్ళ పరమైంది.

గ్రాండ్ పసిఫిక్ డ్రైవ్ రాయల్ నేషనల్ పార్క్ నుండి నౌరా వరకు 140 కిమీ కోస్తా తీరం. 665 మీటర్ల పొడవైన క్లిప్ బ్రిడ్జి సముద్రపు పాదాలలో.. పక్కనే ఉన్న కొండ అంచుల్ని తాకుతూ.. దట్టమైన రైన్ ఫారెస్ట్ స్టీల్, సిమెంట్‌తో కట్టిన బ్రిడ్జి. 135 అడుగుల ఎత్తు. ఇది 2005లో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చిందట.

క్లిప్ బ్రిడ్జ్ పైన కార్లో ప్రయాణించాం. ఆ తర్వాత కారు ఆ చివరకు వెళ్ళాక క్లిఫ్ బ్రిడ్జి పై నుండి కాసేపు నడక సాగించాం.

ఓ వైపు విస్తారమైన నీటితో నీలి సముద్రం. మరో వైపు చూస్తే ఏపుగా ఎదిగిన వృక్షాలు.. అంత పచ్చదనం కుప్ప పోసినట్లు.. రెండు కళ్ళు చాలడం లేదు ఆ దృశ్యాలను చూడడానికి.

ఇక్కడి నుండి చూస్తే అప్పుడప్పుడు వేల్స్ కూడా కనిపిస్తాయిట. ఇక్కడికి వెళ్లాలనుకునే వారికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ట్రైన్ స్టేషన్ నుండి 15 నిముషాల దూరం. రైళ్లు, బస్సులు సోమవారం నుండి శనివారం వరకు 7 రోజులు అందుబాటులో ఉంటాయి.

అక్కడి నుంచి కియామా సమీపంలోని బ్లో హోల్ చూడటానికి వెళ్లాలనుకున్నాం. కానీ అప్పటికే చీకటి పడిపోవడంతో మది నిండా నింపుకున్న దృశ్యాలు నెమరు వేసుకుంటూ వెనుదిరిగాం. గతంలో చూసిన బ్లో హోల్ మళ్ళీ చూడలేకపోవటం నాకు లోటుగానే అనిపించింది.

కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, కొత్త జీవన విధానాలు మనిషిలో నూతన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతాయి. కొత్త ఎరుకలను కలిగిస్తాయి కదా…

మేము కొత్త ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పోగు చేసుకుని ఇంటికి చేరాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here