సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 9

0
7

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

వారెవ్వా..

[dropcap]2[/dropcap]016లో నేను మొదటి సారి సిడ్నీ వెళ్ళాను. అప్పుడు నన్ను ఆశ్చర్యపరిచిన విషయం మీతో పంచుకోవాలని అనిపించి ఇలా మీ ముందుకు తెచ్చాను.

ఒకరోజు ఇంటి ముందు ఉన్న సిట్ అవుట్‌లో మనవరాలితో కూర్చున్నాను. ప్రతి రోజు రిచ్మండ్ రోడ్‌లో బారులు తీరి వెళ్లే వాహనాలు ఆ రోజు కనిపించడం లేదు. ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటి ముందున్న రోడ్ దగ్గరకు వెళ్లి చూసా.

క్రేన్ వంటి వాహనం ఆగి ఉంది. క్రేన్ బకెట్ కరెంట్ స్తంభం పైకి లేచి ఉంది. అందులో యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి.

అక్కడ అతను ఏం చేస్తున్నాడో అర్థం కాక ఒక క్షణం చూశాను. అర్థం కాలేదు.

మా అమ్మాయిని పిలిచి అదేంటి ట్రాఫిక్ డైవర్ట్ చేసి వాళ్ళేం చేస్తున్నారు అని అడిగితే విషయం చెప్పింది.

వెంటనే లోపలికి వెళ్లి ఆ దృశ్యం కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తున్నా. బకెట్ కనిపిస్తున్నది కానీ అందులో వ్యక్తి సరిగా కనిపించడం లేదు.

ఎలాగైతేనేం ఫోటో తీయగలిగాను.

విద్యుత్ లైన్‌లో ఏమైనా అంతరాయం వస్తే, లోపం ఉంటే వెంటనే లైన్‌మెన్ విద్యుత్ స్తంభం పైకి ఎగబాకి పరీక్షించడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఎక్కడికెళ్లినా అది సర్వ సాధారణ దృశ్యం మన దేశంలో.

అంతేకాదు ఆ పని చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు జారి పడినా, షాక్ కొట్టినా, ఒక్కసారిగా తీగల్లో కరెంట్ సరఫరా అయినా చాలా సార్లు నిండు ప్రాణం గాల్లో కలిసి పోవడం కూడా సామాన్య విషయంగానే కనిపిస్తుంది.

అట్లా చనిపోయిన వాళ్ళని చూసి ఉన్నాను.

నిజానికి ఈ మరమ్మతు పనులు లైన్‌మెన్ చేయాలి. ఆ పనులు సబ్ స్టేషన్ నుండి ఒక అధికారి పర్యవేక్షించాలి. ఇవన్నీ నిబంధనలు. రూల్స్ బుక్‌లో ఉంటాయి.

అధికారులు ఏ ఒక్క నిబంధనలు పాటించరు..

చాలా సందర్భాల్లో లైన్‌మెన్‌గా జీతం తీసుకుంటున్న వ్యక్తి విధులు నిర్వహించకుండా దినసరి కూలీలను ఏర్పాటు చేసుకొని వాళ్లను ఎక్కిస్తూ ఉండడం సర్వ సాధారణం తెలంగాణ రాష్ట్రంలో. అట్లా పనిచేస్తున్న చాలా మంది కుర్రవాళ్ళని చూసాను. నిజానికి వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఉండదు. పని మెళుకువలు తెలియదు. కానీ పని చేస్తుంటారు.

ఈ మధ్య కాలంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, సబ్ ఇంజనీర్ అందరూ కాంట్రాక్టు సిబ్బంది. అరకొర జీతాలతో పనిచేస్తున్న సిబ్బంది. ఆ హెల్పర్ లాగే ఎవరూ పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్లకు బాధ్యతలే కానీ హక్కులుండవు.

ఇక హెల్పర్‌గా నియమించుకున్న వాళ్ళ సంగతి చెప్పనవసరం లేదు. వాళ్ళ ప్రాణాలకు విలువ ఉండదు.

జరగరాని సంఘటన జరిగి పోల్ మీద నుండి జారిపడినా, విద్యుత్ షాక్‌తో చనిపోయినా ఆ క్షణం ఆవేదన చెందడం తర్వాత మర్చిపోవడం తప్ప ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం ఆలోచించరు.

ఆ రోజు సిడ్నీలో చూసిన ఆ దృశ్యం నాకు పరిష్కారం చూపింది. ఇటువంటి పరిష్కారం ఉంటుందని అప్పటి వరకు నా ఊహకు అందని విషయం.

అందుకే ఆ దృశ్యం నాకు ఆసక్తిని, అపరిమిత ఆనందాన్ని కలిగించింది.

క్రేన్ బకెట్‌లో ఉన్న వ్యక్తి తన పని ముగించుకున్నాడేమో బకెట్ కిందకు వచ్చింది.

కానీ సిడ్నీలో మొదట చూసినప్పుడు ఆ దృశ్యం చాలా అద్భుతంగా కనిపించింది.

మనందరికీ తెలుసు లైన్‌మెన్ కొత్త లైన్లు వేయడం, మరమ్మతులు చేయడం, విద్యుత్ లైన్స్ సరిగ్గా ఉందో లేదో పెట్రోలింగ్ చేస్తూ చెక్ చేస్తారు. కాలిపోయిన జంపర్లు, పడిపోయిన కండక్టర్లు, దెబ్బతిన్న స్తంభాలు మారుస్తుంటారు. ఇలా ఏ పని చేయాలన్నా విద్యుత్ లైన్ల పైకి ఎగబాకుతుంటారు. అది ఎంత ప్రమాదకరమో తెలియనిది కాదు. అయినా అదే విధానం కొనసాగుతున్నది.

 

మన దేశంలో ప్రమాదకరమైన పనులకు అత్యాధునిక యంత్రాలు ఉపయోగించుకునే రోజు ఎప్పుడు వస్తుందో..

విలువైన ప్రాణాలు అర్ధాంతరంగా ముగిసిపోని రోజు ఎప్పుడు వస్తుందో.. అని మనసు నిట్టూర్చింది.

పని ముగించుకుని వెళ్లిపోవడంతో రోడ్డు యథాప్రకారం వచ్చి పోయే వాహనాలతో బిజీ అయిపోయింది.

నేను మనవరాలితో బిజీ..

వి. శాంతి ప్రబోధ

Image Source: Internet


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here