సందేహ నివృత్తి – ప్రతిజ్ఞాపాలన

2
14

‘రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన తొలి కథ.

***

[dropcap]అ[/dropcap]ది దండకారణ్యం. మున్యాశ్రమాల సమూహప్రాంతం. చుట్టూ ఎత్తుగా పెరిగిన ఫలవృక్షాలు కాయల బరువుతో కొమ్మలు వంగి ఉన్నాయి. లేళ్ళు, జింకలు, కుందేళ్ళు వంటి ఆశ్రమ ప్రాంత మృగాలు అన్నీ భయంలేకుండా స్వేచ్చగా అటూఇటూ తిరుగుతూ ఉన్నాయి. స్నానం చేసిన తర్వాత ఆరవేసిన వల్కలాలు అక్కడి చెట్లకి వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఆశ్రమాల ముంగిళ్ళు చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఉన్నాయి. హోమం చేయటానికి తెచ్చిన దర్భలు, సమిధలు, జలకలశాలు, దేవతార్చన కోసం తెచ్చిన పూలు ఆ ఆశ్రమాలలో ఎక్కడ చూసినా సమృద్ధిగా కనిపిస్తున్నాయి.

సీతారామ లక్ష్మణులు చిన్నగా నడుస్తూ అక్కడికి వచ్చారు. అప్పటికే వారి రాక తెలిసిన వైఖానసులు (బ్రహ్మ యొక్క నఖముల నుంచీ జన్మించినవారు), వాలఖిల్యులు (బ్రహ్మ యొక్క రోమముల నుంచీ పుట్టినవారు), మరీచిపులు (సూర్య చంద్ర కిరణములను ఆస్వాదించువారు), గాత్ర శయ్యులు (చేతులనే తలగడగా చేసుకుని శయ్యలేకుండా పరుండువారు), తపోనిత్యులు (నిరంతరము తపోదీక్షలో నుండువారు), అర్ధపటవాసులు (తడిబట్టలతో ధ్యానసాధన చేయువారు), సలిలాహారులు (నీరు మాత్రమే ఆహారముగా కలవారు) అయిన వివిధ మహర్షులు వారికి ఎదురువెళ్ళి స్వాగతం చెప్పారు.

“శ్రీరామా! నీకు స్వాగతం. నీవు మహావీరుడవు. నీ పితృభక్తి నిరుపమానము, ధర్మనిరతి అపూర్వము, సత్యపాలన సాటిలేనిది. నువ్వు కాలుమోపుట వలన ఈ ఆశ్రమ ప్రాంతం పునీతమైనది” అంటూ తోడ్కొని వచ్చి సీతారాములకు ఆసనాలు చూపి కుర్చుండబెట్టారు. లక్ష్మణుడికి కూడా ఆసనం చూపితే అతడు వినయంగా తిరస్కరించి అన్నగారి చెంతే చేతులు కట్టుకుని నిలబడ్డాడు. మహర్షులు వారికి అక్కడ లభించే కందమూలాలు, వివిధఫలాలు, తియ్యటినీరు ఇచ్చి అతిథిసత్కారం చేసారు.

తర్వాత ఆ మహర్షులు రాముడిని చూస్తూ “రామా! ఇక్కడి వానప్రస్థులలో వైఖానస వాలఖిల్యాది బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్నారు. నువ్వు ఈ ప్రాంతానికి ప్రభువు అయినప్పటికీ ఇక్కడి ఘోర రాక్షసులు మునులందరినీ రకరకాలుగా హింసించి చంపివేశారు. అవిగో! వారి కళేబరాలు సమీపంలోనే ఉన్నాయి. చూడు” అన్నాడు ఒక మహర్షి.

“ఈ పంపాసరోవర ప్రాంతంలో ఉండేవారిని, మందాకినీ నదీ ప్రాంతంలో ఉండేవారిని ఒకచోటేమిటి మహర్షులందరినీ ఆ రాక్షసులు హింసిస్తున్నారు. ఈ క్రూర రాక్షసులు చేసే మారణకాండకు మేము తట్టుకోలేకుండా ఉన్నాము. మేము నిన్ను శరణు గోరుతున్నాము. మమ్మల్ని రక్షించు రామా!” అన్నాడు మరొక మహర్షి.

“అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం హి నః. నీవు తప్ప మమ్మల్ని రక్షించే సమర్థులు ఎవరూ లేరు” అన్నాడు ఇంకొక మహర్షి.

“వారిని శపిద్డామంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న తపోశక్తిని వ్యర్థం చేసుకోవటం మాకు ఇష్టం లేదు. మహర్షులు చేసే ధర్మకార్యాల ఫలంలో నాలుగవ భాగం రాజుకు చెందుతుంది. తన ప్రజలనందరినీ రక్షించే ప్రభువు శాశ్వతంగా ఉండే కీర్తిని పొందుతాడు” అన్నాడు వేరొక మహర్షి.

“మహాత్ములారా! మీరు ఇలా దీనులై నన్ను ప్రార్థించటం తగదు. నన్ను ఆజ్ఞాపించండి. నేను తాపసుల ఆజ్ఞను పాలించేవాడిని. రాక్షసులు మీకు చేసే అపకారాలను రూపుమాపటానికే కాబోలు మా తండ్రిగారు నన్ను వనవాసానికి పంపించింది! దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయటం నా ధర్మం. రాక్షసుల బారి నుంచీ మిమ్మల్ని తప్పకుండా కాపాడతాను. నా పరాక్రమము, నా తమ్ముడి పరాక్రమమూ మీరే చూస్తారు” అంటూ అభయం ఇచ్చాడు శ్రీరాముడు.

ఆ సాయంత్రం సంధ్యోపాసన ముగించుకుని సీతారామ లక్ష్మణులు అక్కడి ఆశ్రమంలోనే ఉన్నారు. మహర్షులు వారికి కందమూల ఫలాలు ఆహారంగా సమర్పించారు. ఆ రాత్రి ఆ రమణీయ ఆశ్రమప్రాంతంలో ఆనందంగా గడిపారు. తెల్లవారింది. ముగ్గురూ తిరిగి ప్రయాణమయ్యారు.

“మహర్షులారా! మీరు మాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. దండకారణ్య ప్రాంతంలో ఉన్న మున్యాశ్రమాలను దర్శించాలని మేము కుతూహల పడుతున్నాం. మా ప్రయాణానికి అనుమతించండి” నమస్కరిస్తూ అన్నాడు రాముడు.

“అలాగే! సుఖంగా వెళ్ళిరండి. తిరుగు ప్రయాణంలో మా ఆశ్రమానికి తప్పకుండా విచ్చేయండి” దీవించారు. సీతారాములు తలవంచి వారికి నమస్కరించారు.

****

గోదావరీ నదీతీరంలో గల పంచవటిలో రాముడు ఆశ్రమం నిర్మించుకుని ఉన్నాడు. అక్కడ రకరకాల చెట్లతో ఇసుక నేలలతో ఆ ప్రాంతం ఆహ్లాదంగా ఉంది. గోదావరి నీటిమీద నుంచీ వస్తున్న చల్లటి గాలులు నిరంతరం వింజామరలు వీస్తున్నట్లుగా ఉన్నాయి.

ఒకరోజున సీతారాములు విశ్రాంతిగా కుర్చుని ఉన్నారు. “ఏం సీతా! ఏదో ఆలోచిస్తున్నావు?” అడిగాడు.

“మీకొక చిన్న కథ చెప్పనా?” అన్నది.

“ఏమిటది? చెప్పు”

“ఒకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడు, సత్యసంధుడు. దేవేంద్రుడు ఆ ఋషి తపస్సు విఘ్నం చేయటానికి ఒక భటుడి వేషం వేసుకుని ఒక ఖడ్గం తీసుకుని వచ్చాడు. ఆ ఆయుధాన్ని అయన దగ్గర దాచిపెట్టి అడిగినప్పుడు ఇవ్వమని కోరాడు. సరేనని ఋషి ఖడ్గాన్ని తీసుకుని ఎప్పుడూ ఏమారకుండా దాన్ని తన దగ్గరే ఉంచుకోసాగాడు. ఎప్పుడూ ఆయుధం దగ్గర ఉండటం వాళ్ళ కొన్నాళ్ళకు ఆయన తపస్సు చేయటం తగ్గించాడు. బుద్ధి చలించింది. ధర్మబుద్ధి నశించింది. రౌద్రం ప్రవేశించి ప్రాణిహింస చేయటం మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు మరణించి నరకానికి పోయాడు. అందుకే ‘అగ్నిసంబంధం లాంటిదే ఆయుధ సంబంధం’ అని పెద్దలు చెబుతూ ఉంటారు” అని చెప్పింది సీత.

“కథ బాగానే ఉంది గానీ, నాకీ కథ చెప్పటంలో అంతరార్థం ఏమిటి?”

“మీరు ధర్మాత్ములు అయినప్పటికీ సూక్షంగా ఆలోచిస్తే అధర్మానికి పాల్పడుతున్నారేమో అనిపిస్తుంది. ఈ అడవిలో మనం తపస్సు చేసుకోవాలి. ఆయుధాలు చెంతనే ఉంటే రౌద్రబుద్ధి అలవడుతుంది. వైరం లేకుండా ప్రాణి హింస చేయటం రౌద్రలక్షణం. ఈ దండకారణ్యంలో రాక్షసులను చంపివేస్తానని మీరు ప్రతిజ్ఞ చేసారు. అకారణంగా వారిని చంపటం ఎందుకు? వారితో మీకేమీ వైరం లేదే! అపరాధం చేయని వారిని వధించాలనుకోవటం నాకు ఇష్టం లేదు” అన్నది సీత.

“ఈ దండకారణ్యంలో తపస్సు చేసుకునే ఋషులు శాంత స్వభావులు. కందమూలఫల శాకాహారాన్ని భుజించే సాత్వికులు. వివిధ నియమాలను పాటిస్తూ తపస్సులో కాలం గడిపేవారు. చలిచీమకైనా అపకారం చేయని సజ్జనులు. అలాంటి వారిని నరమాంస భక్షకులైన రాక్షసులు అతి దారుణంగా చంపేస్తున్నారు. ఋషులు తమని కాపాడమని నన్ను శరణు గోరారు. ఆశ్రయించిన ఆర్తులను రక్షించక పోవటం అధర్మం.

క్షత్రియులు ధనుర్ధారులై ఉన్నచోట ఆర్తనాదం వినపడకూడదు అని పెద్దల మాట. ప్రభువు ప్రజల ఆదాయం నుంచీ ఆరవవంతు పన్నుగా స్వీకరిస్తూ వారిని రక్షిస్తూ ఉండాలి. ఇది రాజు యొక్క కర్తవ్యం. అదీగాక బలవంతులు బలహీనులను ఆపదల నుంచీ కాపాడాలి. అప్పుడే బలహీనులు నిశ్చింతగా జీవించగలుగుతారు. రాజు కూడా బలవంతులతో చేతులు కలిపితే రాజ్యం అరాచకమౌతుంది. అధర్మం పెచ్చు పెరిగిపోతుంది. ఒకవేళ రాజు స్వయంగా అధర్మం చేయకపోయినా కళ్ళెదుట జరిగే అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవటం కూడా పాపానికే దారి తీస్తుంది.

తాపసుల శత్రువులైన రాక్షసులను పరిమార్చటానికే మా తల్లిగారు నన్ను వనవాసం పంపించమని వరం కోరారేమో! అందుకే మా తండ్రిగారు ఆదేశించారేమో! ఇది దైవికం. అందువల్ల నా వనవాసం ఫలప్రదం అవుతుందని నేను అనుకుంటున్నాను” అన్నాడు రాముడు.

“మీరు జితేంద్రియులు. సమస్త ధర్మాలను నిర్వహించటం జితేంద్రియులకు మాత్రమే సాధ్యమౌతుంది. మీ మీద అనురాగం చేతనే మీకు చెప్పాను గానీ ధర్మం గురించి మీకు తెలియనిది లేదు. నన్ను మన్నించండి” అన్నది సీత.

“నాకు తెలుసు సీతా! మన మధ్య గల సుహృద్భావము వలన నువ్వు ఈ విషయం ప్రస్తావించావని సంతోషించాను. ఆత్మీయులు కాని వారు ఎవరూ ఇలా ప్రస్తావించరు గదా!” అన్నాడు రాముడు.

సీతారాములు ఇలా ముచ్చటించుకుంటూ ఉంటే సమీపంలో గల చెట్ల చాటు నుంచీ ఒక రాక్షసి గమనిస్తూ ఉంది. ఆమె రాగి రంగు జుట్టుతో, కోరలు బయటకు వచ్చిన వికృతమైన ముఖంతో, వేలాడుతున్న పొట్టతో భయంకరంగా ఉంది. చాలాసేపటి నుంచీ రాముడి వంకే చూస్తున్నది. శ్రీరాముడి సుందరమైన ముఖం, తామర రేకుల వంటి కళ్ళు, గుండ్రటి భుజాలు, విశాలమైన వక్షస్థలం, మహారాజ లక్షణాలతో ఉన్న ఆయన సౌందర్యం చూసిన కొద్దీ చూడాలనిపిస్తున్నది ఆమెకు. ఆయనను రంజింపజేయటానికి అందమైన మానవ స్త్రీగా మారింది.

అయన ఎదురుగా నిలబడి ఇలా “ఓ అందగాడా! తాపసిలా కనబడుతున్న నువ్వెవరు? ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉన్నావు?” అని అడిగింది.

రాముడు సత్యవాక్య పరిపాలనుడు. అందునా పవిత్రమైన ఆశ్రమ జీవితం గడుపుతున్నాడు. పైగా స్త్రీల సమక్షంలో ఎన్నడూ అబద్ధం చెప్పి ఎరుగడు. అందువల్ల “నేను అయోధ్యాపతి అయిన దశరధ మహారాజు పెద్ద కుమారుడను. నా పేరు శ్రీరాముడు. తండ్రి ఆజ్ఞ మీద పద్నాలుగేళ్ళు వనవాసం చేయటానికి వచ్చాను. నువ్వెవరు?” అన్నాడు.

“నేను లంకానగరానికి ప్రభువైన రావణాసురుడి ముద్దుల చెల్లెల్ని. నా పేరు శూర్పణఖ. నేను కామరూపం గల రాక్షసిని. రావణుడి పేరు నువ్వు వినే ఉంటావు. మహావీరుడు. మేమిద్దరం ఉండగా ఈ అడవిలో నీకే భయం ఉండదు. నీ రూపం చూసి నేను మోహ పరవశురాలినైనాను. నాకు భర్తవై చిరకాలం సుఖించు” అన్నది.

ఆమె మాటలు వినగానే నవ్వు వచ్చింది రాముడికి. పరిహాసంగా చూస్తూ “నాకు వివాహం అయింది. ఈమె నా భార్య సీత. సవతి పోరు వలన దుఃఖమే కలుగుతుంది. అదిగో! అక్కడ నుంచుని ఉన్నవాడు నా తమ్ముడు లక్ష్మణుడు. చాలాకాలం నుంచీ భార్యకు దూరంగా ఉన్నవాడు. అతడిని వరించు. సవతి పోరు లేకుండా సుఖంగా ఉండవచ్చు” అన్నాడు.

శూర్పణఖ లక్ష్మణుడిని చూసింది. “అన్నే అనుకుంటే అన్నని మించిన అందగాడు. నిమ్మపండులా నిగనిగ లాడుతున్నాడు” అనుకుంటూ వెళ్లి తన కోరిక చెప్పింది. లక్ష్మణుడు ఆమెను ఎగాదిగా చూసాడు. ఆమె ఉద్దేశం, అన్నగారు తన దగ్గరకి పంపటంలో గల భావం అర్ధమైనది.

“నేను మా అన్న అధీనంలో ఉన్నాను. దాసుడనైన నన్ను వరించి నువ్వు కూడా దాసి గానే ఉంటావా! వెళ్లి ఆయననే చేపట్టి చిన్నభార్యగా ఆనందించు” అన్నాడు చిరునవ్వుతో.

శూర్పణఖ లక్ష్మణుడి మాటల్లో పరిహాసం అర్థం చేసుకోలేక మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చింది. “వృద్దురాలు, బలహీనమైన శరీరం గల ఈ సీతను చూసి మీరిద్దరూ నన్ను తిరస్కరిస్తున్నారు. నా నిజరూపం చూడండి. ఈమెను ఇప్పుడే తినివేస్తాను” అని రాక్షసి రూపం ధరించి ఎర్రటి చూపులతో, పొడవాటి గోళ్ళు గల చేతులు చూపిస్తూ మీదకు వచ్చింది.

మృత్యుపాశంలా మీదకు వస్తున్న శూర్పణఖను చూసి సీత భయంతో భర్త వెనక ముఖం దాచుకుంది. రాముడు ఒక్క హుంకారంతో రాక్షసిని నిలువరించి “లక్ష్మణా! దుష్టులతో పరిహాసం కూడదు. ఈ దుష్ట రాక్షసిని విరూపిగా చెయ్యి” అన్నాడు.

లక్ష్మణుడు పరుగున వచ్చి ఆమె జుట్టు పట్టుకుని వెనక్కు లాగి ఖడ్గంతో ముక్కు చెవులు ఖండించాడు (ఆనాటి రాజధర్మం ప్రకారం అత్యాచారం చేసినా, అక్రమ సంబంధం పెట్టుకున్నా, అలాంటి ప్రయత్నం చేసినా స్త్రీల కైతే ముక్కు చెవులు ఖండించటం, పురుషులకైతే అంగచ్చేదన చేయటం శిక్షలు. అందుకే అహల్యను మోసగించిన ఇంద్రుడి వృషణాలు తెగి పడిపోవాలని శపిస్తాడు గౌతమ మహర్షి).

మొహమంతా రక్తం కారుతూ మరింత భయంకరంగా అయిన శూర్పణఖ “ఉండండి. ఈ దండకారణ్యంలోనే మా అన్న ఖరాసురుడు ఉన్నాను. అతడికి చెప్పి మీ పని పడతాను” అని గోలుగోలున ఏడుస్తూ వెళ్ళిపోయింది.

శూర్పణఖ చెప్పిన విషయం విని ఖరుడు మండిపడ్డాడు. ఉగ్రుడై “సోదరీ! నిన్ను ఈ విధంగా పరాభవించిన రాముడిని, అతడి తమ్ముడిని ఇప్పుడే యమపురికి పంపిస్తాను. నువ్వు భయపడవద్దు, కన్నీళ్లు తుడుచుకో!” అని, సేనాధిపతి అయిన దూషణుడితో “దూషణా! మన సైన్యంలో గల పద్నాలుగు వేలమంది యోధులను, ఇతర సైన్యాధికారులైన త్రిశరుడు, ప్రమాది, మహాకపాలుడు మొదలైన వారిని వివిధ వాహనాల పైన వివిధ ఆయుధాలతోను యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పు. ఆ రామలక్ష్మణులను ఇప్పుడే హతమార్చాలి” అన్నాడు.

“చిత్తం ప్రభూ!” అంటూ వెళ్ళిపోయాడు త్రిశరుడు. (ఖరుడు, దూషణుడు, త్రిశరుడు ముగ్గురూ పూర్వజన్మలో యాజ్ఞవల్క్య మహర్షి కుమారులు. శివుడి ఆగ్రహానికి గురై రాక్షసులుగా జన్మించమని శపించబడ్డారు. తప్పు క్షమించమని వేడుకోగా  శ్రీరాముడి చేతిలో మరణించిన తర్వాత మీకు శాపవిముక్తి కలుగుతుంది అని శివుని చేత అనుగ్రహింపబడ్డారు).

ఖరుడి ఆజ్ఞ విని శ్యేనగామి, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, మేఘమాలి, మహామాలి, రుధిరాశనుడు మొదలైన రాక్షస వీరులంతా పరిఘలు (ఇనుప గదలు), శూలాలు, ఖడ్గాలు, ధనస్సులు, అడ్డకత్తులు మొదలైన ఆయుధాలు ధరించి ధృడమైన కవచాలు తొడుక్కుని రధాల మీద వచ్చేశారు. ఉత్సాహంతో సింహనాదాలు చేస్తున్నారు.

ఆ రాక్షస సైన్యం రణోత్సాహంతో  వస్తుంటే దుమ్ములేచి మేఘాల లాగా కమ్ముకున్నాయి. అడవిలో నివసించే క్రూరమృగాలు భయంతో పరుగుదీశాయి. చెట్లమీద పక్షులు ఒక్కసారిగా పైకెగిరి కోలాహలంగా అరవసాగాయి. రాబందులు, నక్కలు భయాన్ని సూచిస్తూ బిగ్గరగా అరిచాయి. ఆకాశంలో నుంచీ ఉల్కలు రాలిపడ్డాయి. అడవంతా కంపించిపోయినట్లు అయింది.

ఖరుడు సైన్యంతో పంచవటికి బయలుదేరినప్పుడు కలిగిన ఉత్పాతాలు చూసిన రాముడు లక్ష్మణుడితో “తమ్ముడూ! అదిగో చూడు! ఆ ఉత్పాతాలు రాక్షస సంహారాన్ని తెలిపే ప్రమాద ఘంటికలు. ఇప్పుడు ఘోరయుద్ధం సంభవించబోతున్నది.  క్రూరరాక్షసుల భయంకరమైన అరుపులు, వాళ్ళు మోగిస్తూ ఉన్న భేరీల ధ్వనులు దూరం నుంచీ వినిపిస్తున్నాయి. నా బాణాలు సమరోత్సాహంతో ప్రతాపాన్ని వెళ్లగక్కుతున్నాయి. దూరదృష్టి గలవాడు తనకెదురయ్యే ఆపదలకు తగిన ప్రతిక్రియ చేయాలి. నా కుడిభుజం అదురుతూ జయాన్ని సూచిస్తుంది. మీ వదినను తీసుకుని సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళు” అన్నాడు.

“మీకెందుకు శ్రమ? నాకు అనుజ్ఞ ఇవ్వండి. వీళ్ళందరినీ నేను వధిస్తాను” అన్నాడు లక్ష్మణుడు.

“నువ్వు శూరుడవు. ఈ రాక్షసమూకను వధించగలవు. కానీ వీరిని నేనే తుదముట్టించాలని అనుకుంటున్నాను.  నా మాటలను కాదనవద్దు. ఆలస్యం చేయకుండా జానకిని ఆ కనిపించే గుహ దగ్గరకు తీసుకువెళ్ళు. ఆమెకు రక్షగా ఉండు” అన్నాడు రాముడు.

సీతను తీసుకుని లక్ష్మణుడు దట్టమైన చెట్ల వెనక గల గుహలోకి వెళ్ళాడు. అతడు అటు వెళ్ళగానే రాముడు విల్లు చేతబట్టి దశదిశలు మారుమోగేటట్లు ధనుష్టంకారం చేసాడు. దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు ఆ యుద్ధం చూడాలనే కుతూహలంతో అక్కడికి వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. అలాగే మహాత్ములైన ఋషులు, భ్రుగుమహర్షివంటి వారు వచ్చి “చక్రధారి అయిన శ్రీమహావిష్ణువు రాక్షసులను సంహరించినట్లు ఈ శ్రీరాముడు ఈ రాక్షసులనదరినీ వధించు గాక!” అంటూ పరస్పరం సంభాషించుకోసాగారు.

మామూలు సమయాల్లో పరమశాంతంగా కనిపించే రాముడు యుద్ధానికి సన్నద్ధుడై ప్రళయ కాళరుద్రుడిలా భయావహంగా కనిపించాడు. రాక్షససైన్యం కేకలు వేసుకుంటూ ఉప్పొంగిన సముద్రంలా శ్రీరాముడిని సమీపించారు. మొదటగా ఖరుడు రాముడి పైకి వేయిబాణాలు ప్రయోగించాడు. రాక్షస యోధులంతా రకరకాలైన ఆయుధాలను వర్షంలా కురిపించారు. వాళ్ళు ప్రయోగించే ఆయుధాలనన్నింటినీ తన నిశిత శరాలతో దారిలోనే తుత్తినియలు చేసాడు రాముడు.

వంటరిగా ఉన్న రాముడి పైకి పద్నాలుగు వేల మంది రాక్షసులు ఒక్కసారిగా వచ్చిపడినా అయన బెదరలేదు. అయన ధనుస్సు నుంచీ లెక్కలేనన్ని బాణాలు బయటకు వచ్చాయి. ఆయన ఎప్పుడు అమ్ములపొదిలో నుంచీ బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచాడో తెలియలేదు. మెరుపు వేగంతో బాణాలు వచ్చి పడుతున్నాయి. కనురెప్ప పాటులో వేలకొలది రాక్షసుల తలలు, మొండాలు, కాళ్ళు చేతులు తెగి కింద పడుతూ ఆ ప్రదేశమంతా రక్తపు బురదతో నిండి భీతిగొలుపుతున్నట్లుగా అయింది..

రాముడు విషసర్పాల వంటి పద్నాలుగు బాణాలు త్రిశరుడి మీద ప్రయోగించగా అవి అతని వక్షఃస్థలం లోకి చొచ్చుకుపోయి నేలకూలాడు. దూషణుడు అంతకు ముందే నేలకూలాడు. దూషణుడు, త్రిశరుడు తన కళ్ళముందే నిహతులవటం చూసి ఖరుడు పట్టరాని కోపంతో ముందుకు వచ్చాడు.

“నిలు నిలు రాక్షసుడా! దండకారణ్యంలో ధర్మనిరతులై నివసిస్తూ ఉన్న మహానుభావులైన తాపసులను చంపి నువ్వు బావుకున్నది ఏమిటి? నువ్వు చేసిన పాపకృత్యాలకు తగిన ఫలితం అనుభవించే సమయం దగ్గర పడింది. మానవులను చంపుతూ హోరపాపాలకు పాల్పడే నీ వంటి వారి ప్రాణాలను తీయటానికే దశరధ మహారాజు నన్ను అడవులకు పంపించాడు. నీ ఇష్టం వచ్చిన బాణాలను ప్రయోగించు. తాటిపండులాగా నీ తల నేల రాలేటట్లు చేస్తాను” అన్నాడు రాముడు.

“యుద్ధంలో సాధారణ సైనికులను చంపి నిన్ను నువ్వు పొగుడుకోకు. వీరుడవైతే నాతో తలపడు. నిన్ను వధించి నా వారిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటాను” అంటూ వజ్రాయుధం లాంటి తన గదను రాముడి పైకి విసిరాడు ఖరుడు. మంటలను కక్కుతూ యమపాశంలా తన మీదికి వస్తున్న ఆ గదను బాణాలతో తునాతునకలు చేసాడు రాముడు.

“ఇంతేనా నీ బలము? నువ్వు పలికిన పలుకులన్నీ కల్లలైనాయి. వడగండ్లను భక్షించిన నలికండ్ల పాములా నువ్విప్పుడు దుర్మరణం చెందుతావు”  అన్నాడు రాముడు (నలికలపాము వడగళ్ళను తింటే చనిపోతుంది అని ప్రతీతి). ఖరుడు బిగ్గరగా అరుస్తూ ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి విసిరేశాడు. రాముడి కళ్ళు ఎర్రబడ్డాయి. నిప్పులు గక్కుతూ మరో బ్రహ్మాస్త్రమా అనిపించే ఒక బాణాన్ని ప్రయోగించాడు. అది అగస్త్యుడు రాముడికి కానుకగా ఇచ్చాడు. అప్పుడు అది పిడుగులాగా భయంకరమైన ధ్వని చేస్తూ ఖరుడి వక్షఃస్థలం మీద నాటుకుంది. అతడు మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు.

దేవతలు, సిద్ధులు, చారణులు అందరూ శ్రీరాముడిపై పుష్పవర్షం కురిపిస్తూ దుందుభులు మ్రోగించారు.  అందరూ దిగి వచ్చి అక్కడకి చేరారు. వారితో పాటు మహర్షులు కూడా వచ్చారు. “రాముడు తన బాణాలతో పద్నాలుగు వేల మంది రాక్షసులను కేవలం ఒకటిన్నర ముహూర్త కాలంలో మట్టి కరిపించాడు. శ్రీరాముడి పరాక్రమం విష్ణువు రణకౌశలాన్ని తలపిస్తున్నది” అంటూ తమ హర్షాన్ని ప్రకటించారు.

“శ్రీరాముడు శత్రు సంహారం చేసి తపస్వులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇక మేము నిశ్చింతగా తపస్సు చేసుకుంటాము” అన్నారు ఋషులు.

లక్ష్మణుడు కూడా సీతను వెంటబెట్టుకుని పర్వత గుహలో నుంచీ బయటకు వచ్చాడు. దేవతలు, మహర్షులు అందరూ సీతారామ లక్ష్మణులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. తన భర్త అపూర్వ విజయానికి, అద్భుతమైన శౌర్య పరాక్రమాలకు సీత పరమానంద భరితురాలైంది.

“ఈ విషయం ఇంతటితో అంతమవదని నా అనుమానం” అన్నాడు లక్ష్మణుడు.

“జరగనీ! చూద్దాం!” అన్నాడు రాముడు చిరునవ్వుతో.

“మీ అండన నాకేమీ భయం లేదు” భర్త వంక అనురాగ పూరితమైన దృక్కులతో చూస్తూ అన్నది సీత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here