సంగమేశ్వర క్షేత్ర యాత్ర

0
10

(ఇటీవల సంగమేశ్వర క్షేత్రం దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.)

[dropcap]ఆం[/dropcap]ధ్ర ప్రదేశ్ లోని అరుదైన, అతి పురాతనమైన శైవక్షేత్రం సంగమేశ్వరం. ఇది నంద్యాల జిల్లాలో ఉంది. కృష్ణ, భవనాశి, ఇంకా ఇతర నదుల కలిసే సప్తనదీ సంగమం (Confluence)లో, నదీ గర్భంలో ఉంటుంది.

సాధారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి నిల్వస్థాయికి చేరుకోగానే, బ్యాక్ వాటర్స్ సంగమేశ్వరాన్ని ఆక్రమిస్తాయి. క్షేత్రం మొత్తం మునిగిపోతుంది గోపుర శిఖరాలతో సహా. మళ్ళీ ఫిబ్రవరిలోనే ఆలయాలు బయటపడతాయి. దశాబ్దాలుగా, సంవత్సరానికి ఎనిమిది నెలలు సంగమేశ్వరం ‘జలాధివాసం’లోనే ఉంటున్నా, ఆలయం, శివలింగం, ఇతర పురాతన విగ్రహాలు చెక్కుచెదరడం లేదు.

ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం కావటం వల్ల సంగమేశ్వర దర్శనం చేసుకుందామని, హైదరాబాదు నుండి బయలుదేరాను.

అక్కడికి, నందికొట్కూరు నుండి చేరుకోవచ్చు. ఆత్మకూరు నుండి అయితే ఎ.పి.ఎస్. ఆర్.టి.సి. బస్ సౌకర్యం కూడా ఉంది. కానీ ఫ్రీక్వెన్సీ అతి తక్కువ. భక్తులు ఎక్కువగా స్వంత లేదా ప్రయివేటు వాహనాల్లో వెళతారు.

కర్నూలు – శ్రీశైలం రాష్ట్ర హైవేలో, కర్నూలుకు 30 కి.మీ.దూరంలో నందికొట్కూరు పట్టణం ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్ణాల మీదుగా శ్రీశైలం వెళ్ళేదారి అది. కర్నాటక లోని ప్రతి ముఖ్య పట్టణం నుండి శ్రీశైలానికి బస్సులు ఉంటాయి. అవన్నీ నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా వెళతాయి. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకూ వంద కి.మీ. పైన ఉంటుంది.

దోర్ణాల నుంఛి నేరుగా దోనకుండ, వినుకొండ, నర్సరావుపేటల మీదుగా గుంటూరు చేరే మార్గం కూడా అదే. హైదరాబాదు నుంచి కర్నూలుకు ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక వారి ఆర్.టి.సి. ఎక్స్‌ప్రెస్, సూపర్ లక్జరీ, గరుడ, ఇలా అన్ని రకాల బస్సులు ఉంటాయి. ప్రతి పది నిముషాలకు ఒక బస్ బయలుదేరుతూనే ఉంటుంది.

సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఎం.జి.బి.ఎస్. చేరుకున్నాను. ఎ.పి. బస్ ఎక్కాను. ఎందుకంటే అందులో మాత్రమే సీనియర్ సిటిజన్స్‌కు టిక్కెట్టు ధరలో 25 శాతం రాయితీ లభిస్తుంది మరి. కర్నూలు 220 కిమీ ఉంటుంది. నాలుగు గంటల ప్రయాణం.

కోస్తా జిల్లాల వాళ్ళు విజయవాడ వచ్చి, నందికొట్కూరు లేదా ఆత్మకూరు చేరుకుని స్వామిని దర్శించవచ్చు.

మధ్యలో జడ్చర్లలో బ్రేక్‍ఫాస్ట్‌కు 20 నిముషాలు ఆపాడు. ఆర్.టి.సి. బస్‍స్టాండ్‌లోనే ‘యగ్నేష్ విరాట్ పుడ్ కోర్ట్’ అని ఉంది. టిఫిన్ అక్కడ బాగుంది. సింగిల్ వడ సాంబారు, ఆనియన్ దోశ తిన్నాను. తొంభై రూపాయలు అయింది. టిక్కెట్టులో వచ్చిన రాయితీ టిఫిన్‍కు సరిపోయింది అని ఆనందించాను. మధ్యతరగతి మందహాసాలు ఇలాగే ఉంటాయి!

12 గంటలకు కర్నూలు చేరింది బస్సు. అక్కడ నందికొట్కూరు నాన్‍స్టాప్ బస్ రెడీగా ఉంది. ఎక్కి కూర్చున్నాను. కేవలం నలభై నిమిషాల్లో నందికొట్కూరులో దింపాడు. క్షేత్ర దర్శనం ఉదయం పూట అయితే బాగుంటుంది కదా అనుకున్నాను. పైగా వర్షం చిరుజల్లుగా, హైదరాబాదులో బయలుదేరినప్పటి నుండి పడుతూనే ఉంది.

నందికొట్కూరు మునిసిపాలిటీ. ఓ మోస్తరు పట్టణం. దగ్గరలో లాడ్జిలు ఏవయినా ఉన్నాయా అని విచారిస్తే, బస్టాండుకు కూతవేటు దూరంలోనే ‘శారదాస్ లాడ్జ్’, ‘ఎస్.ఎస్.ఇన్’ అని ఉన్నాయని చెప్పారు.

వెళ్ళి చూస్తే పెద్ద లాడ్జిలు ఏవీ కాదు. ‘ఎస్.ఎస్.ఇన్’ లో రూమ్ తీసుకున్నాను. వాతావరణం చల్లగా, హాయిగా ఉంది కాబట్టి నాన్ ఎ.సి. చాలు అనుకున్నాను. రూం రెంట్ ఏడు వందలు. రూం బాగుంది.

భోజనం ఎక్కడ బాగుంటుంది? అని రిసెప్షన్‍లో అడిగితే, కొద్ది దూరంలోనే ‘అన్నపూర్ణ ఉడిపి భవన్’ అని ఉందని, భోజనం చాలా బాగుంటుందని చెప్పారు. “కానీ మీ హైదరాబాదులో ఉన్నంత బాగుండదేమో సార్?” అని అనుమానం వ్యక్తం చేశారు! నేను నవ్వుకున్నాను.

ఉడిపి హోటల్లో భోజనం నిజంగానే బాగుంది. ప్లేట్ మీల్స్ 70/- రూపాయలు మాత్రమే! తోటకూర పప్పు, టమోట పచ్చడి, గోరుచిక్కుడుకాయ ఫ్రై, సాంబారు, చారు, పెరుగు. యథాప్రకారం రైస్ బౌల్ మీద అప్పడం పెట్టుకుని వచ్చాడు. అది మెత్తబడిపోయింది.

“టమాటాలు ధర కిలో వందకు పైగా ఉంటే, మీరు పచ్చడి ఎలా చేయగలిగారు?” అని అడిగాను నవ్వుతూ. “హోల్‍సేల్‍లో మాకు అరవైకే వస్తాయి సార్” అని చెప్పారు. కర్నూలు జిల్లాలో గోరుచిక్కుడును మటిక్కాయలంటారు.

రూంకు తిరిగివచ్చాను. రేపు ఉదయం సంగమేశ్వరం వెళ్ళాలని, కారు కావాలని చెప్పాను. “నేను మాట్లాడి చెబుతాను” అన్నాడు రిసెప్షనిస్ట్.

గదిలో టి.వి. ఆన్ చేసి వార్తలు చూడసాగాను. ఇంతలో ఒక యువకుడు వచ్చాడు. కారు డ్రైవరట. అతనిలా చెప్పాడు.

“సార్, నందికొట్కూరు కాడ్నించి సంగమేశ్వరం 68 కి.మీ. వచ్చాది. మెయిన్ రోడ్డు మింద ముఫై కి.మీ. బోయింతర్వాత పాములపాడు కాడ ఎడంపక్కకు తిరగాల. నేరుగబోయి సెలిమెల్ల కాద కుడిచేతి వైపుకు తిరిగితే సంగమేశ్వరం.”

“నీ పేరేమిటిరా అబ్బాయ్!”

“త్రిపురాంతకం సార్!”

“మంచి పేరు. శివుని పేరు. సరే గాని, రోడ్డు బాగుంటుందా?”

“రోడ్డు కేమి సార్, బంగారు మాదిరుంటే! పాలు క్రింద పోసి, మళ్ళీ పాలు గిన్నెలోకి ఎత్తుకోవచ్చు”

ఆ పిల్లవాడి భావుకతకు నాకు ముచ్చటేసింది.

“సార్, మనం ఎనక్కి వచ్చేటప్పుడు ‘కొలనుభారతి’ అమ్మవారిని గూడ్క సూడచ్చు. శానా మగిమ గల తల్లి. నల్లమల ఫారెస్ట్‌లో, లోపలికి ఐదారు కిలోమీటర్లు పోవాల.”

“వెరీ గుడ్. అయితే రేపుదయం 6 గంటలకు వచ్చేయి. సంగమేశ్వరం, కొలనుభారతి చూసుకుని ఎన్ని గంటలకు తిరిగి రాగలం?”

“మద్యాన్నం 12 గంటలకంతా రావచ్చు సార్!”

“సరే, ఎంత తీసుకుంటావు?”

“మీకు తెలియదినేముంది సార్. రానుపోను, ‘కొలనుభారతి’ తో సా, 150 వచ్చాది. ఎ.సి. ఏసుకుంటారా కారు లోన?”

“అవసరం లేదు. చల్లగా ఉంది కదా!”

“అయితే రెండు వేళ రెండు వందలియ్యండి. డ్రైవరు బత్తా మీ దయ”

“ఎ.సి. వేసుకుంటే?”

“నాలుగొందలు ఎగష్ట్ర!”

ఇదేదో బాగానే ఉందే! అనిపించింది నాకు. వెదర్ చిరుజల్లులతో చల్లగా, కొంచెం చలిగా కూడా ఉంది. “సరే రా అబ్బాయి! నీకు అడ్వాన్సు ఏమనా..”

“శ, శ, వద్దు సారు. రేపు పొద్దున్న పావు తక్కువ ఆరుకంతా బండి కట్టుతాను. నమస్కారం సార్!” అని వెళ్ళిపోయాడు.

నాలుగు గంటల వరకు పడుకొన్నాను. సాయంత్రం ఐదు గంటలకు తయారై బయటకి వెళ్ళి ‘బిస్మిల్లా టీ సెంటర్’లో షుగర్‌లెస్ చాయ్ తాగాను. పక్కనే వంకాయ బోండాలు వేడి వేడిగా వేస్తున్నాడు. మీడియం సైజు వంకాయలను నూనెలో వేయించి, వాటి కడుపులో ఉల్లికారం కూరి, శనగపిండిలో ముంచి వేస్తున్నాడు. వాటి సైజు చూస్తే ఒక్కటి మాత్రమే తినగలం అనిపించింది. ఒక్కట్టివ్వమన్నాను. దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసి, ఏదో పొడి, పచ్చి ఉల్లి, కొత్తిమీర మిశ్రమం చల్లి, కొంచెం నిమ్మకాయ పిండి ఇచ్చాడు. తింటుంటే జిహ్వ లేచి వచ్చిందంటే నమ్మండి! మన హైదరాబాదులో ఇటువంటి స్నాక్ దొరకదు.

దూరంగా ఒక పెద్ద గుడి కనబడుతుంది. సీరియల్ లైట్లతో గోపురాన్ని, ప్రాకారాన్ని అలంకరించారు. అదేమి గుడి అని అడిగితే, ‘పాండురంగస్వామి దేవళం’ అని చెప్పారు. వెళ్ళి దర్శించుకున్నాను. రుక్మిణీ సమేతుడై పాండురంగ విఠలుడు కొలువుతీరి ఉన్నాడు. శివుడు, ఆంజనేయుడు, చౌడేశ్వరి అమ్మవారు వేరు వేరు ఆలయాల్లో ఉన్నారు. అందరినీ దర్శించుకున్నాను.

గుడిని ఆనుకుని ఒక విశాలమైన హాల్ ఉంది. ఆ రోజు చౌడమ్మ తల్లి పుట్టినరోజట. ఆడవాళ్ళు సాలంకృతులై తల మీద ఘటములు ధరించి, అక్కడ నృత్యాలు చేస్తున్నారు. కాసేపు అది చూశాను.

ఒక చోట ‘ఇచ్చట జొన్నరొట్టెలు వేడిగా చేసి అమ్మబడును’ అని కనబడింది. అక్కడ కూర్చుని తినే సౌకర్యం లేదు. కేవలం పార్సెల్స్ మాత్రమే. ఆధునిక టర్మ్స్‌లో చెప్పాలంటే ‘టేక్ ఎవే’!

రెండు జొన్న రొట్టెలు కట్టించుకున్నాను. తెల్ల జొన్నవి, పుల్కాల్లా పొంగుతున్నాయి. అస్సలు నూనె వేయలేదు. మిక్స్‌డ్ వెజ్ కూర, పప్పు, సైడ్ డిషెస్‌గా ఇచ్చాడు. కేవలం 20 రూపాయలు మాత్రమే! రూంకు వచ్చి రొట్టెలు తినేశాను. చాలా బాగున్నాయి రొట్టెలు (అన్నమే కాదు, ఏ తిండి ఐనా) పరబ్రహ్మ స్వరూపమేనని నా విశ్వాసం!

ఉదయం ఆరు గంటలకు బయలుదేరాము. పాములపాడు వద్ద డైవర్షన్ తీసుకున్నాడు. సెలిమెల్ల దాటిన కొంతసేపటికి నల్లమల అడవిలో ప్రవేశించాము. సన్నగా, జల్లు పడుతునే ఉంది. చుట్టూ ఆకుపచ్చని కొండలు, వాటితో దోబూచులాడే తెలిమేఘాలు! రోడ్ బాగుంది. ఎనిమిదికి సంగమేశ్వరం చేరాము.

సంగమేశ్వర క్షేత్రం, నంద్యాల జిల్లా. కు వెళ్లే దారిలో, నల్లమల అడవిలో

వర్షాలు లేటయినా కృష్ణానదిలో నీళ్ళు బాగానే ఉన్నాయి. కానీ గుడి వరకు కారు వెళ్ళింది. మెట్లు దిగిన తరువాత నదీతీరం వంద మీటర్లు ఉంది. పాంటు షర్టు విడిచి, పంచె, కండువా తీసుకొని, చెప్పులు కారులోనే వదిలి, నదిని చేరుకున్నాను. బురదలో కొంత నడవాల్సి వచ్చింది.

కృష్ణా పుష్కర ఘాట్

శివనామస్మరణ చేస్తూ కృష్ణలో స్నానం చేశాను పావుగంట సేపు. హాయిగా ఉంది. పంచె కట్టుకుని, ఉత్తరీయం కప్పుకుని మెట్లెక్కి వచ్చాను మెల్లగా. కాళ్ళకు బాగా బురద. అక్కడ గుడి ఆవరణలో వరుసగా కొళాయిలున్నాయి. వెళ్ళి కాళ్ళు శుభ్రంగా కడుక్కున్నాను. నిన్న సాయంత్రం, నందికొట్కూరులోనే స్వామికి పూలమాల, విడి పూలు, అరటిపళ్లు, కొబ్బరికాయ అన్నీ కొనుక్కుని ఉన్నాను.

చాలా పురాతన దేవాలయం. రెండు చిన్న గోపురాలు, ఒకటి పెద్ద గోపురం. రాతి నిర్మాణం. ఒక వైరాగ్య భావన గుడి అంతా ఆవరించి ఉంది. ‘వైభోగ ప్రియో విష్ణుః, వైరాగ్య ప్రియో శివః’ అని కదా ఆర్యోక్తి!

తెలకపల్లి రఘురామశర్మ గారని, వేద పండితులు సంగమేశ్వరాలయ అర్చకులు. ప్రతిరోజు వచ్చి స్వామివారికి పూజాదికములు నిర్వహిస్తారట. ఫేస్‍బుక్‍లో ఈ క్షేత్ర మహత్యాన్ని గురించి, బ్యాక్ వాటర్‍లో గుడి శిఖరం మునిగిపోయే వీడియోలు అన్నీ పెడుతుంటారాయన. ఫేస్‍బుక్‍లోనే, “ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి ఆర్యా?” అని అడిగితే, ఆయన వివరాలు తెలిపారు. వారికి కృతజ్ఞతలు.

ఆ రోజు ఆయన ఇంకా రాలేదు. ఎవరో ఒక సహాయకుడు ఉన్నాడు. ఆయన పేరు ‘కాశయ్య’ అట. “మీరు స్వామికి అభిషేకం చేస్తారా?” అని అడిగితే, “నాకు రాదు” అన్నాడు. “నేను చేసుకోవచ్చా?” అంటే “మా రాజుగా!” అని నవ్వాడు. By all means! అని కవి హృదయం.

ఆయనే ఒక స్టీలు బిందెతో నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. శివలింగాన్ని దారుకాలింగం అంటారు. వేపచెట్టు మొదలు నరికి ఆ మొద్దును లింగంగా చెక్కారు. కానీ లింగాకృతి లేదు. ఒక చెక్క మొద్దును నిలువుగా నరికినట్లే ఉంది. రెండడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల పొడవు ఉన్నాడు శివుడు. వెనక లలితా పరమేశ్వరి అమ్మవారి మూడు అడుగుల విగ్రహం ఉంది. ‘శాకంబరీదేవి’గా కూరగాయలతో ఆమెను అలంకరించి ఉన్నారు. చివర డుండి వినాయకుడున్నాడు.

లలితా దేవీ సమేత శ్రీ సంగమేశ్వ ర స్వామి

సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతి పూజ చేసి, ఏకవార రుద్రాభిషేకం చేయడానికి ఉపక్రమిస్తుంటే, కాశయ్య, ఆయన భార్య, ఇంకా కొందరు భక్తులు “స్వామీ, మాకు కూడా చేయించండి” అని కోరారు. ‘అన్యోన్య సహాయేన’ అని చెప్పి, వారందరి గోత్రనామాలు చెప్పి, స్వామివారికి అభిషేకం చేశాను. అందరితో చేయించాను. ఒక భక్తుడు ఒక సీసాలో పంచామృతాలు తెచ్చాడు. వారిది మార్కాపురమట. తర్వాత శివాష్టోత్తరంతో స్వామికి పూజ చేసి విభూతి, గంధం, కుంకుమ, పుష్పాలు, పూలమాలలతో స్వామిని అలంకరించాను. ఒక భక్తురాలు బిల్వదళాలు తెచ్చింది.

‘మిథున పతయే నమః, శర్వాయ నమః’ అంటూ బిల్వపత్ర పూజ కూడా చేయించాను. చివర్లో మంత్రపుష్పం చదివి, స్వామివారికి ‘కర్పూర నీరాజనం’ ఇచ్చాను.

స్వామిని ఇలా ప్రార్థించాను

శ్లో:
“బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో
భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాః కలిత శశికళాశ్చండ
కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష స లలిత వపుషః
శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాః
నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్”

ఆ విధంగా శ్రావణ పాడ్యమి శుభదినానన సంగమేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడమే గాక, ఇంకా కొందరికి చేయించే భాగ్యం, శివానుగ్రహం వల్ల నాకు కలిగింది.

గర్భగుడి బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో, వీరభద్రుడు, ఎదుట నందీశ్వరుడు. ఒక పక్కగా బూడిద రంగులో మరో శివలింగము ఉన్నాయి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చాను. నాకు కాశయ్యను ఇవ్వమన్నాను. కొందరు నాకు దక్షిణ ఇచ్చి, పాదాలకు నమస్కరించబోగా, సున్నితంగా తిరస్కరించాను. వృత్తిరీత్యా నేను పురోహితుడిని కానని, అందరం కలిసి స్వామి పూజ చేసుకున్నాము, అంతే అని చెప్పాను. నమక, చమక, పురుష, స్త్రీ సూక్త, మహన్యాస పూజా వ్రత విధానాలను, నా ఎనిమిదవ ఏటనే నాకు ఉపయనము చేసి, నాకు నేర్పిన మా నాన్నగారు బ్రహ్మశ్రీ, శతావధాని, ‘పౌరాణిక రత్న’ పాణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రి గారిని స్మరించి, మనసులోనే ఆయనకు ప్రణమిల్లాను. నాకు తెలుగు, సంస్కృత సాహిత్యాలను బోధించింది కూడా మా నాన్నగారే. “తండ్రి! హరి జేరుమని యెడి తండ్రి తండ్రి!” అని భాగవతాగ్రేసరుడగు ప్రహ్లాదుడన్నట్లు తండ్రినే గురువుగా పొందిన నేను అదృష్టవంతుడిని.

ఆలయం ద్రావిడ శిల్ప నిర్మాణ శైలిలో నిర్మించారు. బయట కుడ్యాల మీద ఉగ్రనరసింహ, నటరాజుల శిల్పాలున్నాయి. 1981లో, శ్రీశైలం డ్యాం నిర్మించిన తర్వాత, ఆ బ్యాక్ వాటర్స్‌లో ఆలయం మునిగిపోయింది. 2003లో బయటపడింది. పాండవులు శ్రీశైలమును దర్శించిన తర్వాత, ధర్మరాజు, ఈ దారుక(చెక్క) లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని ఐతిహ్యము. విజయాదిత్యుడనే చాళుక్య వంశానికి చెందిన మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. దీనిని విజయేశ్వరం అని కూడా అనేవారు. బిజాపూర్ రాజ్యం విజయాదిత్యుని ఏలుబడిలో ఉండేది. క్రీ.శ. 733లో ఆలయాన్ని నిర్మించారని చరిత్ర.

ఇక్కడ ఏడు నదులు సంగమిస్తాయి. అవి కృష్ణ, వేణి, తుంగభద్ర, భీమరథి, మలపహారిణి, సంగమేశ్వరి, భవనాశిని. ఇవి అంతర్వాహినులుగా ఉంటాయి. మనకు కనబడేది కృష్ణమ్మ మాత్రమే. శ్రీశైల క్షేత్రానికి ‘వాయువ్య దర్శనం’గా సంగమేశ్వరం ఖ్యాతి చెందింది. ఫిబ్రవరి నెలలో, శివరాత్రికి ముందే ఆలయం బయటపడితే, శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రతి సోమవారం కూడా.

శిఖరం పూర్తిగా మునిగే ముందు అర్చకుడు శ్రీ తెలకపల్లి రఘురామశర్మ గారు పడవలో వెళ్లి ‘శిఖరపూజ’ నిర్వహిస్తారు.

తొమ్మిదిన్నరకు తిరిగి బయలుదేరి ‘మాడుగుల’ అనే ఊర్లో టిఫిన్ చేశాము. కర్నూలు జిల్లా స్పెషల్ ఉగ్గాణి, బజ్జీ! చాలా బాగుంది. టీ కూడా బాగుంది. పదిన్నరకు ‘కొలను భారతి’ దేవస్థానం చేరుకున్నాము.

‘కొలను భారతి’ అమ్మవారి మందిరం. శివపురం మండలంలో ఉంటుంది. ఏకైక సరస్వతీ మందిరం ఇది ఆంధ్ర ప్రదేశ్‍లో. ఇక్కడ కొండల మధ్య, స్వచ్ఛమైన లేత నీలిరంగుతో నిండిన కొలను ఉంది.

కొలను భారతి.. అమ్మవారి ఆలయం వద్ద కొలను

ఆ నీటిని పిల్లలకు తాగిస్తే విద్యావంతులవుతారట. చాలా ఏళ్ళుగా ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. అమ్మవారు నాలుగడుగుల లోపు విగ్రహం. చతుర్భుజ. చామరం, ఢక్క ధరించి ప్రసన్న వదనయై దర్శనమిస్తుంది. ప్రధానాలయన్ని పునరుద్ధరిస్తున్నారు.

పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న దేవస్థానం ఇది. దగ్గరలో చిన్న జలపాతం ఉందట. కానీ వర్షాలు లేక అది నేను వెళ్ళినప్పుడు దూకడం లేదు.

నల్లమల లో, కొండల మధ్య, సరస్వతి మందిరం ( కొలను భారతి )

అమ్మవారిని ‘జ్ఞాన సరస్వతి’ అంటారు. సమస్త విద్యలకు జ్ఞానానికి అధిష్ఠాన దేవత సరస్వతీదేవి. గ్రీకులకు అదే విధంగా ‘Muse’ అనే అధిష్ఠాన దేవత ఉంది. వసంత పంచమి వేడుకలు, ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అక్కడ పారే సెలయేరును ‘చారుఘోషిణి’ అని అంటారు. అమ్మవారిని ‘శ్రీ చక్రసంచారిణీ’ యంత్రములో ప్రతిష్ఠించినారు. మట్టి రోడ్డులో ఐదు కిలోమీటర్లు దట్టమైన అడవిలో ప్రయాణించాము, పచ్చని చెట్లు, కొండల మధ్య. దీనిని ‘వరుణ తీర్థము’ అని కూడా అంటారు. అమ్మవారు ఒక చేతిలో వేదములను ధరించి, పుస్తకపానిగా దర్శనం అనుగ్రహిస్తుంది. ఆమె స్వయభువు. సప్తర్షులు ఇక్కడ యజ్ఞం చేశారని, వారి రక్షణకై ఆమె ఇక్కడ వెలసిందని ఐతిహ్యం.

భక్తులు ఈ క్షేత్రాన్ని ‘ఆంధ్రా బాసర’ అని పిలుస్తారు. కానీ బాసర అంత అభివృద్ధి ఇక్కడ ఏ మాత్రం లేదు. ప్రధాన మందిరానికి దగ్గరలోనే సప్తలింగ క్షేత్రమని ఉంది. కాలభైరవ స్వామి విగ్రహం ఉంది. మధ్యలో అందమైన నందీశ్వర విగ్రహం కనువిందు చేస్తుంది.

సప్త లింగ క్షేత్రం ఏడు వివిధ నామాలతో విలసిల్లే శివాలయాల సముదాయం. ప్రతి ఆలయం గోపురం బంగారు రంగుతో కాంతులీనుతూ ఉంది.

నల్లమల లో, కొలను భారతి అమ్మ వారి ఆలయం సమీపాన కొలువైన వివిధ శివ మూర్తులు
నల్లమల లో, కొలను భారతి అమ్మ వారి ఆలయం సమీపాన కొలువైన వివిధ శివ మూర్తులు

కొలనుభారతి గుడి సమీపంలో కృష్ణుడి విగ్రహం

అమ్మవారికి కుంకుమ పూజ, అష్టోత్తరం చేయించుకోవలనుకున్నాను. టికెట్టు 30/- రూపాయలు. పూజారి గారు అమ్మవారి శ్లోకాలు నాలుగు చదివి, హారతి ఇచ్చి పంపారు. అష్టోత్తరం హుళక్కి! సంగమేశ్వరంలో దేనికీ టికెట్ లేదు. విశేష దినాల్లో ఉంటుందేమో. పదకొండున్నరకు తిరుగు ప్రయాణం.

దారి వెంబడి నల్లరేగడి భూములు విశాలంగా పరచుకుని ఉన్నాయి. మొక్కజొన్న విత్తినట్టున్నారు. సాళ్ళు ఏర్పడి, నాలుగు అంగుళాల నుంచి అడుగు ఎత్తున మొక్కజొన్నలు జల్లుల్లో తడుస్తూ, మహదానందంగా తలలూపుతున్నాయి. ఒక చోట మాత్రం రెండు అడుగులు పెరిగి, శ్యామల వర్ణంలో పసరు కడుతున్న మొక్కజొన్న చేను కనబడింది. గాలికి చేను ఉపరిభాగం అలల వలె కదలాడుతూ మనోహరంగా ఉంది. మధ్యలో తెలుగు గంగ కెనాల్ వచ్చింది. తమిళనాడుకు మంచినీటి సరఫరా అయ్యేది దాని ద్వారానేనట.

సిద్ధేశ్వరం-సంగమేశ్వరం మధ్య కృష్ణపై బ్యారేజీ, దానిపై బ్రిడ్జి కడితే హైదరాబాదుకు – కడపకు మధ్య దూరం 80 కిలోమీటర్లు తగ్గుతుందట. కర్నూలుతో సంబంధం లేకుండా, కల్వకుర్తి, సోమశిల, ఆత్మకూరు, నంద్యాల మీదుగా కడపకు చేరుకోవచ్చునట. కానీ ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా పర్యాటకుల కోసం కేవలం ఒక కేబుల్ వంతెనను (hanging bridge) నిర్మించాలని అనుకుంటున్నదట.

దాని వల్ల ఏ ప్రయోజనమూ లేదనీ, బ్యారేజీ కం బ్రిడ్జి కడితే, రాయలసీమకు సాగు, తాగు నీరు అందుతుందని, రాయలసీమ నాయకుడు శ్రీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పోరాట సమితి ఏర్పడిందట. ఆ మేరకు అక్కడక్కగా గ్రామాల్లో వాల్ రైటింగ్స్ కనబడ్డాయి.

‘ఉయ్యాల వంతెన వద్దు! బ్యారేజీ వంతెనే ముద్దు! చలో సిద్ధేశ్వరం-సంగమేశ్వరం! జై రాయలసీమ’ లాంటివి.

నాకు కూడా ఆ ఉద్యమం సహేతుకంగా అనిపించింది.

మధ్యాహ్నం 12.45కి నందికొట్కూరు చేరాము. త్రిపురాంతకం, అదే మా డ్రైవరు, “రెండు వేలు ఇవ్వండి సార్, చాలు” అన్నాడు. “అదేమిటిరా నాన్నా?” అంటే “మీరు నాతో కూడా గోత్రనామాలతో అభిషేకం చేయించినారు కదా!” అన్నాడు. కానీ నేను వినలేదు. పూర్తిగా, అనుకొన్న మొత్తం అతని నంబరుకి ట్రాన్స్‌ఫర్ చేశాను. నమస్కరించి వెళ్ళిపోయాడు. ఎ గుడ్ గై!

‘అన్నమయ్య మెస్’లో భోంచేశాను. కాసేపు రెస్ట్ తీసుకొని, నాలుగున్నరకి కర్నూలు చేరి, అక్కడి నుంచి సూపర్ లగ్జరీ బస్‍లో (ఆళ్ళగడ్డ డిపోది) బయలుదేరి ఎనిమిది గంటలకు ఆరామ్‍ఘర్ జంక్షన్‍లో దిగి, ఊబర్ ఆటోలో ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిదయింది. మా కోడలు ప్రత్యూష కారం దోశలు పోస్తే తిని, మజ్జిగ తాగి బజ్జున్నాను.

ఆలయం మునిగిపోక ముందే సంగమేశ్వరుని, సరస్వతీ అమ్మవారిని చూసి రండి మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here