సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-15

7
13

[dropcap]తే[/dropcap]రీ ఇస్ దో రంగీ దునియామే

కోయీ ఖుష్ కిస్మత్ కోయీ బద్ కిస్మత్

“భగవంతుడా నీ మోసపూరితమైన ప్రపంచంలో కొందరు అదృష్టవంతులు, కొందరు దురదృష్టవంతులు” అంటూ సాగే ఈ పాట 1949లో విడుదలైన ‘సావన్ భాదో’ సినిమాలోది. లత ఎంతో విషాదాన్ని ప్రతిబింబిస్తూ పాడిన ఈ పాటను రాసింది ముల్క్ రాజ్ భక్రి. సంగీత దర్శకత్వం హుస్న్‌లాల్ – భగత్‌రామ్. 1949లో ఈ పాట విడుదలయిందంటే అంతకు ఓ సంవత్సరమో రెండు సంవత్సరాల ముందో ఈ పాట రికార్డయి ఉంటుంది. ఈ పాట పాడే సమయానికి  తాను అదృష్టవంతురాలో, దురదృష్టవంతురాలో లతకు తెలియదు. కానీ పాట విడుదలయ్యే సమయానికి తాను అదృష్టవంతురాలి జాబితాలో అగ్రస్థానంలో ఉంటుందన్న విశ్వాసం కలిగి ఉంటుంది. 1950 తరువాత హిందీ సినీ సంగీత ప్రపంచంలో అగ్రస్థానం లతదే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.

లతతో పాటు అంటే 1946లో తన కెరీర్ ఆరంభించిన సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్. బెంగాల్‍లో గొప్ప పేరు సంపాదించిన ఎస్డీ బర్మన్ ఇతర బెంగాలీ కళాకారులలానే బొంబాయి వచ్చి చేరాడు. ఎస్డీ బర్మన్ రాజ కుటుంబానికి చెందినవాడు. సంగీతం కోసం, ప్రేయసి మీరా కోసం  రాచరికం వదలుకుని సంగీతాన్ని తన కెరీరు చేసుకున్నాడు. మీరాను తన జీవిత భాగస్వామి మీరా బర్మన్‍గా మలచుకున్నాడు.

కలకత్తాలో గొప్ప సంగీత విద్వాంసుడు, గాయకుడిగా పేరు సంపాదించాడు ఎస్డీ బర్మన్. కానీ బెంగాలీ సినిమాలలో అతని గీతాలను అందరూ అభినందిస్తున్నా అవి విజయవంతం కాకపోవటం ఎస్డీ బర్మన్‍లో అభద్రతా భావం కలిగించింది. ఈ సమయంలో ఫిల్మిస్తాన్ కంపెనీ అధినేత ‘రాయ్ బహదూర్ చునీలాల్’ నుంచి బొంబాయికి రమ్మని పిలుపు వచ్చింది. రాయ్ బహదూర్ చునీలాల్ తనయుడు ఆ తరువాత ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఎదిగిన మదన్ మోహన్. ఆరంభంలో మదన్ మోహన్ ఎస్డీ బర్మన్‌కు సహాయ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఎస్డీ బర్మన్ గీతాల రూపకల్పనను పరిశీలించి అభ్యసించిన తరువాత 1950 ప్రాంతాలలో స్వతంత్ర్య  సంగీత దర్శకుడయ్యాడు. అంటే, లతా మంగేష్కర్ అగ్రశ్రేణి గాయనిగా స్థిరపడి, హిందీ సినీ సంగీత సామ్రాజ్ఞిగా ఎదగటంలో తోడ్పడిన సంగీత దర్శకులలో  ఇద్దరూ, దాదాపుగా లత పాటలు పాడటం ఆరంభించిన సమయంలోనే సినీ రంగంలో ప్రవేశించారన్నమాట.

హిందీ సినిమాల్లో ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘షికారీ’. ఈ సినిమాలో పాటలు రాసింది కవి ప్రదీప్. ఎస్డీ బర్మన్‍కు హిందీ సరిగ్గా రాదు. కానీ గేయాల అర్థాలను, భావాలను ఆకళింపు చేసుకుని కానీ బాణీ కట్టేవాడు కాదు ఎస్డీ బర్మన్. పలు సందర్భాలలో సినిమాలో పాట సందర్భాన్ని అనుసరించి బాణీని సృజించి, బాణీలో ఒదిగే పదాలతో భావాన్ని ప్రతిబింబింపమనేవాడు. అశోక్ కుమార్, పారో, అమీర్‌బాయి కర్ణాటకి, శంషాద్ బేగమ్‍లు ఈ సినిమాలో పాటలు పాడేరు. సినిమాలో పాటలను అందరూ మెచ్చుకున్నారు. కానీ ప్రజల మెప్పు పొందలేదు పాటలు.

ఈ సినిమా పాటలను రూపొందించే సమయంలో అశోక్ కుమార్, ఎస్డీ బర్మన్‍ల నడుమ చక్కని దోస్తీ ఏర్పడింది. అశోక్ కుమార్ తమ్ముడు కిషోర్ కుమార్‍కు పాటలు పాడాలని చాలా కోరిక. అశోక్ కుమార్‍తో ఉన్న స్నేహం వల్ల కిషోర్ కుమార్ పాట విన్నాడు  ఎస్డీ బర్మన్. కిషోర్ కుమార్ పాటలు పాడటంలో ప్రత్యేక శిక్షణను పొందలేదు. కానీ అతని స్వరంలోని మాధుర్యాన్ని, ప్రతిభను పసికట్టాడు ఎస్డీ బర్మన్. అంతేకాదు కిషోర్ కుమార్ లోని చిలిపితనాన్ని అతని అల్లరి వెనుక ఉన్న గాంభీర్యాన్ని కూడా అర్థం చేసుకున్నాడు ఎస్డీ బర్మన్. ఏదైనా పాట పాడి వినిపించమంటే, ఎస్డీ బర్మన్ పాడిన పాటనే అతడిని అనుకరిస్తూ పాడి వినిపించాడు కిషోర్ కుమార్. అలా ఆరంభమయింది హిందీ సినీ సంగీత ప్రపంచంపై తమదైన ప్రత్యేక ముద్రను వేసిన ఎస్డీ బర్మన్, కిషోర్ కుమార్‍ల అనుబంధం. కిషోర్ కుమార్, ఎస్డీ బర్మన్‌ను తండ్రిలా భావిస్తాడు. ఆ రకంగా అతడికి ఎస్డీ బర్మన్ తనయుడు ఆర్డీ బర్మన్‍తో సోదర సంబంధం ఏర్పడింది. వీరిద్దరి మైత్రి 1970 దశకంలో ఉచ్చస్థాయి సంగీత సృజనకు దారితీసింది. సినీ సంగీతాన్ని ఓ అందమైన మలుపు తిప్పింది.

ఎస్డీ బర్మన్ ఎలా తనను సినిమాల్లో పాటలు పాడటంవైపు ఆకర్షించాడో కిషోర్ కుమార్ స్వయంగా రాశాడు
“ఎస్డీ బర్మన్‌కు నా స్వరం నచ్చింది. నేను ఏ గురువు వద్ద సంగీతం నేర్చుకోలెదు. అయినా, ఆయన పాటలు పాడమని నా వెంట పడ్డాడు. నేను ఆయనని తప్పించుకుని తిరిగేవాడిని. ఆయనను చూస్తేనే చికాకు వచ్చేది.
ఒకరోజు నేను కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగేను. హఠాత్తుగా బెంగాలీ గొంతులో కిషోర్ అని వినిపించింది. నేను జరుగుతున్నది గమనించేలోగా పెద్దాయన తలుపు తీసుకుని కార్లో వచ్చి కూర్చున్నాడు. డ్రైవర్ తో వూరవతలకు తీసుకుపొమ్మన్నాడు. మేము నగరం పొలిమేరలుదాటి పచ్చటి చెట్లున్న మైదానాలకు చేరుకోగానే కారాపమన్నాడు. కారు దిగి ధోతీ పైకి పట్టుకుని, గొంతెత్తి పాడుతూ పొలమంతా నడవటం ఆరంభించాడు. ఒకపాట తరువాత మరొకటి పాడుతున్న ఆయనని చూస్తూంటే ఇది కలనా, నిజమా అనిపించింది. నేను ఒళ్ళూ పై మర్చిపోయాను. అప్పుడు  అర్ధమయింది నేను ఇంతకాలం ఇలాంటి వ్యక్తి కోసమే ఎదురుచూస్తున్నానని. అప్పుడే నిర్ణయించుకున్నాను ఇతడేం చెప్తే అది చేయాలని.”

‘ఆఠ్ దిన్’ సినిమాలో కిషోర్ కుమార్‍తో ‘బాంకా సిపాయియా ఘర్ జాయెహో’ అనే పాటను పాడించాడు ఎస్డీ బర్మన్. కిషోర్ కుమార్‌తో రాజ్ కపూర్ కూ పాడించాడు. ఆ తరువాత కిశోర్ కుమార్ నటుడిగా స్థిరపడ్డాడు. తన పాటలు, దేవ్ ఆనంద్ పాటలు తప్ప ఇతరులెవరికీ 1969 వరకూ పాడలేదు.

అయితే ‘ఆఠ్ దిన్’ పాటలు కానీ ‘షికార్’ పాటలు కానీ అంతగా విజయం సాధించలేదు. ఇవికాక ‘చిత్తోర్  విజయ్’, ‘దిల్ కీ రాణీ’ వంటి సినిమాలకు పాటలను రూపొందించాడు ఎస్డీ బర్మన్. ఆ సినిమాల పాటలు కూడా అంతగా విజయం సాధించలేదు. ఈ నిరాశ సమయంలో ఎస్డీ బర్మన్‍కు గీతారాయ్ పరిచయం అయింది. గీతారాయ్‍ స్వరంలోని బెంగాలీతనం ఎస్డీ బర్మన్‍కు నచ్చింది. ఆమె పాట పాడే విధానం మరింత నచ్చింది. దాంతో ‘దోభాయ్’ సినిమాలో నిర్మాత అభీష్టాన్ని వ్యతిరేకించి మరీ గీతారాయ్‍తో పాటలు పాడించాడు. వాటిల్లో ‘యాద్ కరోగే ఎక్ దిన్ హమ్ కో యాద్ కరోగే’, ‘మెరా సుందర్ సప్నా బీత్ గయా’ అనే పాటలు సూపర్ హిట్లయ్యాయి. ముఖ్యంగా ‘మేరా సుందర్ సప్నా’ పాట అయితే అనూహ్యమైన రీతిలో అందరినీ ఆకర్షించింది. ఆ పాట ఓ రకంగా భవిష్యత్తు గీతా జీవితాన్ని ప్రతిబింబించటంతో గీతాదత్ సంతక  గీతంలా ఎదిగింది.

‘మేరా సుందర్ సప్నా’ పాటకు సంగీత దర్శకుడిలా ఎస్డీ బర్మన్ పేరు ఉంటుంది. కానీ ఈ పాటను రూపొందించింది అతని సహాయ సంగీత దర్శకుడు మదన్ మోహన్. ఎస్డీ బర్మన్‌కు అర్కెస్ట్రాను నిర్దేశించటం రాదు. అందుకని అతని తొలి చిత్రానికి సి. రామచంద్ర అరేంజర్‍గా సహాయం చేశాడు. దాంతో ఎస్డీ బర్మన్‍కు సి. రామచంద్రకు చక్కని దోస్తీ ఏర్పడింది. నిజానికి ఆ కాలంలో సి. రామచంద్ర స్వతంత్ర సంగీత దర్శకుడిగా చక్కటి గుర్తింపు పొందుతున్నాడు. అయినా సరే, తోటి పోటీదారు అయిన ఎస్డీ బర్మన్‍కు ఆర్కెస్ట్రాను నిర్దేశించటంలో సి. రామచంద్ర సహాయం చేశాడు. ఇది ఆ కాలం నాటి కళాకారుల సహృదయాన్నే కాదు ఎవరు ఎవరికీ పోటీ కాదు ఎవరి ప్రత్యేకత వారిదే అన్న విశ్వాసాన్ని చూపిస్తుంది.

“‘మేర సుందర్ సప్నా’ పాటను రికార్డు చేసిన తరువాత అది చక్కని పాట అవుతుందనుకున్నాము కానీ ఇంత గొప్ప పాటగా ఎదుగుతుందనుకోలేదు. కానీ ఈ పాట హిట్ అవటం నాకు విశ్వాసాన్నిచ్చింది. స్వతంత్ర సంగీత దర్శకుడిగా ప్రజలను అలరించే పాటలను రూపొందించగలనన్న విశ్వాసాన్ని నాకు ఇచ్చింది”  అంటాడు మదన్ మోహన్. 1950లలో ఈయన ఎస్డీ బర్మన్ సహాయకుడిగా మానేసి స్వతంత్ర సంగీత దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

‘విద్య’ సినిమా సమయంలో ఎస్డీ బర్మన్‍కు  దేవ్ ఆనంద్ పరిచయం అయ్యాడు. దేవ్ ఆనంద్ ద్వారా అతని సోదరులు చేతన్ ఆనంద్, విజయ్ ఆనంద్‍లు పరిచయం అయ్యారు. దేవ్ ఆనంద్‍కు ఎస్డీ బర్మన్ సంగీత రూప కల్పన సంవిధానం నచ్చింది. ‘వాయిద్యాల కన్నా మానవ స్వరం అత్యుత్తమ వాయిద్యం, ఇతర వాయిద్యాలన్నీ మానవ స్వరాన్ని ఉద్దీపితం చేయాలి తప్ప, మానవ స్వరాన్ని మింగేయకూడదు’ అన్న ఎస్డీ బర్మన్ సిద్దాంతం దేవ్ ఆనంద్‍కు నచ్చింది. దాంతో వీరు రోజూ సాయంత్రం కలసి సంగీత సభలు చేసుకునేవారు. ఈ సంగీత సభలు జరిగే సమయంలోనే హిందీ సినీ ప్రపంచంపై అత్యంత ప్రభావం చూపించగల సంఘటనలు సంభవించాయి. సినిమాలు, సినిమాల పాటల విషయంలో జరిగే చర్చల ఫలితంగా ఆనంద్ సోదరులకు తామే ఓ స్వంత సినీ నిర్మాణ సంస్థను స్థాపించాలన్న ఆలోచన వచ్చింది. వారి ఆలోచనను ఎస్డీ బర్మన్ బలపరిచాడు. అలా రూపొందింది నవకేతన్ సినీ నిర్మాణ సంస్థ. ఇక్కడే ఎస్డీ బర్మన్ కు గురుదత్ పరిచయం అయ్యాడు. గురుదత్ కు ఎస్డీ బర్మన్ పాటలంటే చాలా ఇష్టం.

 ఆ సమయంలో ఒకటొకటిగా తాను సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు పరాజయం పాలవుతుండటం ఎస్డీ బర్మన్‍ను బాధించింది. చివరికి నవకేతన్ వారి చిత్రం ‘అఫ్సర్’ చిత్రమే కాదు పాటలు సినిమాను సూపర్ హిట్ చేసేంతగా హిట్ కాకపోవటంతో  ఎస్డీ బర్మన్‍కు తన సంగీతం బొంబాయి సినిమాలకు పనికిరాదన్న భావన కలిగింది. ఆ సమయంలో అతను ముకేష్, గీతారాయ్, శంషాద్ బేగం వంటి వారి స్వరాలను వాడేవాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘షబ్నమ్’ పాటలు కాస్త ప్రజాదరణ పొందాయి తప్ప సినిమా పట్ల ప్రజల ఆకర్షణను పెంచటంలో అంతగా తోడ్పడలేదు. దాంతో నిరాశతో మూటా ముల్లె సర్దుకుని కలకత్తా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు ఎస్డీ బర్మన్.

ఈ సమయంలో లతా మంగేష్కర్ స్వరం దేశమంతా ‘అందాజ్’, ‘బర్సాత్’, ‘మహల్’, ‘బడీబహెన్’ వంటి సినిమా పాటలతో మార్మ్రోగుతోంది. ‘అఫ్సర్’ సినిమాలో ఎస్డీ బర్మన్ సురయ్యతో పాడించిన ‘నైన్ దివానే’ కూడా హిట్ అయింది,  కానీ లత స్వర తుఫాను ముందు నిలవలేకపోయింది. ఎస్డీ బర్మన్ బొంబాయి వదలి కలకత్తా వెళ్ళితున్నాడన్న వార్త అశోక్ కుమార్‍కు తెలిసింది. హిందీ సినీ పరిశ్రమలో జెంటిల్‌మేన్,  ధర్మరాజు అన్నమాట ఎవరికైనా సరిపోతుందంటే అది అశోక్ కుమార్‍కే. అతను గతంలో దేశ విభజన సమయంలో దేశం విడచి వెళ్ళవద్దని సాదత్  హాసన్ మాంటోని ఎంతో బ్రతిమిలాడేడు. కానీ మాంటో అతని మాట వినలేదు. పాకిస్తాన్ వెళ్ళి అష్ట కష్టాలు అనుభవించి పిచ్చాసుపత్రిలో దుర్భర దారిద్ర్యంలో మరణించాడు. కలకత్తా వెళ్ళాలనుకుంటున్న ఎస్డీ బర్మన్‍కు  కూడా అడ్డుపడ్డాడు అశోక్ కుమార్. తాను నిర్మిస్తున్న ‘మషాల్’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించమన్నాడు అశోక్ కుమార్. ఈ ఒక్క సినిమా పూర్తయిన తరువాత కలకత్తా వెళ్ళిపొమ్మన్నాడు. అశోక్ కుమార్ మాట తీసివేయలేక ‘మషాల్’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించేందుకు ఒప్పుకున్నాడు ఎస్డీ బర్మన్. లత పాటలోని ‘కోయి ఖుష్ కిస్మత్, కోయి బద్ కిస్మత్’ అన్నది ఇక్కడ వర్తిస్తుంది. ‘మషాల్’ ఎస్డీ బర్మన్ సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా. ఇంకో ఇరవై ఐదేళ్ళు ఎస్డీ బర్మన్ బొంబాయిలోనే స్థిరపడి ఇక్కడే మరణించేట్టు బొంబాయికి ఎస్డీ బర్మన్ అంకితం అయ్యేట్టు చేసిన సినిమా ‘మషాల్’. ‘మషాల్’ సినిమా ద్వారా మన్నా డే గాయకుడిగా పరిచయమయ్యాడు.

మన్నా డే గాయకుడిగా పరిచయమవటాన్ని మన్నా డే నే వివరించాడు. 1943లో మన్నా డే తన బంధువు కె.సి. డే తో బొంబాయి వచ్చాడు. శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన మన్నా డేకు  గాయకుడిగా స్థిరపడాలన్నది కోరిక. కె.సి.డేకు ఎస్డీ బర్మన్‌కు కలకత్తా నుంచీ చక్కని స్నేహం ఉంది. దాంతో ఎస్డీ బర్మన్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ, అవకాశం కోసం ఎదురు చూడసాగాడు మన్నా డే. కానీ ఎస్డీ బర్మన్,  మన్నా డేను సహాయకుడిగానే వాడుకున్నాడు తప్ప గాయకుడిగా వాడలేదు. అతడికి పాట నొటేషన్లు చెప్పి, ముకేష్‍తో సహా ఇతర గాయనీ గాయకులకు పాట నేర్పించే పని అప్పజెప్పాడు. వాయిద్యకారులకు వాయిద్యాల కదలికలను నేర్పించమనేవాడు. అంతేకాదు, ఎస్డీ బర్మన్ ఏం పని చెప్తే అది చేయలి. ‘I was an errand boy for him. sachin da was fond of bananas. I often used to buy bananas for him’ అన్నాడు మన్నా డే. ఎస్డీ బర్మన్‌కు అరటిపళ్ళు తెచ్చిస్తూ పాటలు పాడే అవకాశం కోసం ఎదురు చూశాడు మన్నా డే. చివరికి ఓ రోజు మన్నా డేను పిలిచి ‘ఓ పాట ఉంది. అది కె.సి.డేనే పాడగలడు. అంత ఉచ్చస్వరంలో రాగం చెడకుండా భావం పలకగలిగినవాడు కె.సి.డేనే. కానీ ఇప్పుడు ఆయన అందుబాటులో లేడు. కాబట్టి ఆ పాట నువ్వు పాడు’ అన్నాడు ఎస్డీ బర్మన్. ఎస్డీ బర్మన్ మాటలు అర్థం చేసుకునేందుకు సమయం పట్టింది మన్నా డేకు. అర్థం అయిన తరువాత అతని ఆనందానికి అదుపు లేదు.

“Sachin da asked me to sing ‘upar gagan vishal’ which he composed for mashaal. I sang and with it I announced to the world of hindi film music. I have arrived,  i have arrived at the darbar of the audience with the message of new dawn. It is i who will sing from now on. I shall fill the world of music with my songs tunes. I have arrived.”

మన్నా డే ఆనందానికి అవధులు లేవు. కానీ ఈ ప్రపంచంలో కొందరు అదృష్టవంతులు, మరికొందరు దురదృష్టవంతులుంటారు. మన్నా డే తొలిపాట నేపథ్యంలో వచ్చిన పాట. తొలి పాట నేపథ్య గీతం అవటంతో మన్నా డే తన కేరీర్లో అధిక శాతం పాటలు నేపథ్య గీతాలో, తాత్విక గీతాలో పాడాల్సివచ్చింది.  మన్నా డే స్వరం హిందీ సినిమా హీరోలకు ఎవరికీ నప్పదు. అందువల్ల అతడు ఉత్తమ గాయకుడిగా గుర్తింపు పొందాడు తప్ప అగ్రశ్రేణి గాయకుడిగా గుర్తింపు పొందలేదు. అతడికి తొలి అవకాశం ఇచ్చిన ఎస్డీ బర్మన్ కూడా తోటి బెంగాలీ అయిన మన్నా డేకు విరివిగా పాటలు పాడే అవకాశాలు ఇవ్వలేదు. ‘మషాల్’ తరువాత ‘నౌజవాన్’ లో ఒక పాట, ‘అర్మాన్’లో ఒక పాట, ‘షహెన్ షాహ్’లో ఒక పాట, ‘మిస్ ఇండియా’లో ఓ పాట, ‘చల్తీకానామ్ గాడీ’లో ఓ పాట పాడించాడు ఎస్డీబర్మన్. అంటే 1950 నుండి 1959 నడుమ మొత్తం ఆరుపాటలు మాత్రమే మన్నా డేతో పాడించాడు. అధిక శాతం కోరస్‍తో కూడిన పాటలు. ఇది మన్నా డేను అత్యంత నిరాశపరచిన అంశం. మన్నా డేను అతి తక్కువగా వాడేందుకు అదీ నేపథ్యంలో పాడే కోరస్ పాటలు  అధికంగా పాడేందుకు కారణం వివరించాడు ఎస్డీ బర్మన్.

“Manna Dey was my assistant as music director. He was open hearted modest and soft spoken. Bombay’s hindi film songs have become some what mechanical these days. The singers are often busy recording. They don’t have time to practice or rehearse. But Manna Dey is   solo exception. Even, at the zenith of popularity and to me, he is an artist who practise daily in the morning with his tanpura, rarely ever missing on this routine. Such devotion and reverence to music on his part have fascinated me. That is why I like him so much. Manna has worked in many of my films and is still working. He can infuse life and energy into any song.” ఎస్డీ బర్మన్ వ్యక్తిత్వంలోని ఓ ప్రధానమైన అంశాన్ని ప్రస్ఫుటం చేస్తుందీ విషయం.

ఆరంభంలోని పరాజయాలు ఎస్డీ బర్మన్‍లో అభద్రతా భావం కలిగించాయి. కలకత్తా నుంచి బొంబాయి వచ్చి స్థిరపడేందుకు జరిపిన సంఘర్షణ అతనికి బొంబాయిలో తాను పరాయివాడు అన్న భావనను కలిగించింది. ఫలితంగా ఎస్డీ బర్మన్ అగ్రశ్రేణి గాయనీ గాయకులను అధికంగా వాడేందుకు ఇష్టపడ్డాడు. ఒక్కసారి హిట్ అయిన వారితోనే కలసి పనిచేసేందుకు ఇష్టపడ్డాడు. అలాగని పాటతో రాజీపడలేదు. పాట ఏ గాయకుడు పాడితే బాగుంటుందో అతడితోనే పాడించేవాడు. అందుకే ఒకే సినిమాలో ఒకే నటుడికి పలు విభిన్న మైన గాయకులతో  పాటలు పాడించిన ఘనత ఎస్డీ బర్మన్‍కు దక్కుతుంది. ‘ప్యాసా’ సినిమాలో గురుదత్‌కు రఫీ పాడతాడు. కానీ ‘జానె వో కైసే’ పాటను హేమంత్ కుమార్‍తో పాడించాడు. ‘కహా హై’ పాటను మన్నా డేతో పాడించాడు. కానీ గురుదత్ ఒత్తిడి వల్ల మన్నా డే పాటను కాదని రఫీతో పాడించాడా పాటను. ఇలా ఒకోసారి రెండు మూడు విభిన్నమైన స్వరాలను నాయకుడికి వాడేడు ఎస్డీ బర్మన్. కానీ అధికంగా అప్పటి కాలంలో ప్రచలితంలో ఉన్న స్వరాలనే వాడేవాడు. ఈ వాడకంలో తన, మన తేడా లేదు. ఏ స్వరం హిట్టో అదే వాడేవాడు. అతడి ఈ స్వభావాన్ని లత మంగేష్కర్ ఆరంభంలో అర్థం చేసుకోలేదు. ఆమెకు అర్థమయ్యేసరికి అయిదు అత్యంత విలువైన సంవత్సరాలు వారిద్దరూ కలసి పనిచేయకుండా వ్యర్థమై పోయాయి.

‘మషాల్’ సినిమా విడుదలైన సంవత్సరమే తలత్ మహమూద్ తెరపైకి వచ్చాడు. దాంతో అంతవరకూ అధికంగా వాడిన ముకేష్‍ను వదలి తలత్ మహమూద్‍తో అధికంగా పాటలు పాడించాడు ఎస్డీ బర్మన్. ఇంతలో రఫీ అగ్రశేణి గాయకుడిగా ఎదిగాడు. వెంటనే తలత్ మహమూద్‍ని వదలి రఫీతో పాటలు అధికంగా పాడించాడు. తరువాత రఫీని వదలి కిషోర్‍తో అధికంగా పాటలు పాడించాడు. ఇలా ఏ గాయకుడితో పాటలు పాడిస్తే పాటల ప్రభావం అధికం అవుతుందో ఆ గాయకుడితోనే పాడించేవాడు. అంతే తప్ప ఓ ప్రత్యేక గాయకుడు లేకపోతే కుదరదు అనేవాడు కాదు ఎస్డీ బర్మన్. అలాంటి ఎస్డీ బర్మన్ కు ,  1950లో,  ‘మషాల్’ సినిమా సమయంలో లత స్వరంతో పరిచయం అయింది. 1949లో ఒకదాన్ని మించి మరొక హిట్ పాట పాడటంతో , సి. రామచంద్ర వంటి వారి సలహాతో,  లతతో ‘మషాల్‍’లో రెండు పాటలు పాడించాడు. అలా ప్రారంభమయింది హిందీ చలన చిత్ర ప్రపంచానికి అత్యంత మధురమైన మరపురాని గీతాలను అందించిన ఎస్డీ బర్మన్, లతల సంగీత దర్శక గాయనిల అనుబంధం.

మషాల్ లో ‘మన్నా డే’ పాటతో పాటు లత పాడిన ‘అజ్ నహీతో కల్’, ‘ఆంఖోం సే దూర్ హై’ అనే రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘ఆజ్ నహీ తో కల్’ అనే పాట చాలా బాగా ప్రజలను ఆకర్షించింది.

ఇదే సమయానికి ‘నవకేతన్’ నిర్మాణ సంస్థ ఎస్డీ బర్మన్‍ను తను ఆస్థాన సంగీత దర్శకుడిగా భావించింది. ‘నవకేతన్’ సినిమా ‘అప్సర్’ విడుదల అయిన తరువాత, పాటలు ప్రజాదరణ పొందాయి. అప్పుడు దేవ్ ఆనంద్ ఎస్డీ బర్మన్‍ను నవకేతన్ సంస్థకు ఒక ప్రధాన స్థంభం అని అభివర్ణించాడు.

“(Afsar) the film was very well made and established the new banner (nav kethan). It enhanced the name of Chetan, re-affirmed by status as an actor and brought into our fold a musical genius who was later weave his magic spell film after film and become a pillar to nava kethan the only and only SD Burman”

ఎస్డీ బర్మన్ మరణంతో నవకేతన్ సినిమాల నాణ్యత తగ్గటమే కాదు, నవకేతన్ నుంచి హిట్ సినిమా  పరంపర, ఉత్తమ సంగీత సంప్రదాయం అదృశ్యం కావటం గమనార్హం.

కానీ నవకేతన్ లాంటి పెద్ద సంస్థకు సంగీత దర్శకుడిగా స్థిరపడటం ఎస్డీ బర్మన్ కెరీర్‍కు స్థిరత్వాన్నిచ్చింది. ముఖ్యంగా 1960 ప్రాంతాలలో ఎస్డీ బర్మన్ అనారోగ్యం పాలయినప్పుడు గురుదత్‍తో సహా అందరూ అతడిని వదిలి వేరే సంగీత దర్శకుడితో పనిచేశారు. ఒక్క దేవ్ ఆనంద్ మాత్రమే ఎస్డీ బర్మన్ కోలుకునే వరకూ ఆగి ‘గైడ్’ సినిమాను అతడికి అప్పగించాడు. ఎస్డీ బర్మన్ సినీ సంగీత జీవితంతో పాటు దేవ్ ఆనంద్ కెరీర్‍నూ మలుపు తిప్పిన సినిమా అది. లత మంగేష్కర్‍,   ఎస్డీ బర్మన్‍  భేదాభిప్రాయాలవల్ల  కలసి పనిచేయని కాలంలో, ఎస్డీ బర్మన్ కెరీర్‍కు ఎలాంటి నష్టం కలగకుండా కాపాడిన ప్రధానమైన అంశాలలో నవకేతన్ నిర్మాణ సంస్థ ఒకటి.

‘మషాల్’ సినిమాలో లత స్వరం పరిచయం అయిన తరువాత ఎస్డీ బర్మన్, అంతవరకూ తాను అధికంగా వాడుతున్న గీతారాయ్, శంషాద్ బేగం వంటి గాయనిలను పక్కన పెట్టేశాడు. గమనిస్తే, గీతారాయ్ కానీ, శంషాద్ బేగం కానీ ఎస్డీ బర్మన్ కోసం ‘హిట్’ గీతాలను పాడేరు. లతతో ధీటుగా పాడేరు. ‘బాజీ’లో ‘తద్బీర్ సే బిగ్డీ హూయీ’ పాట ఈనాటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. ఈ పాటతో సాహిర్, ఎస్డీ బర్మన్‍ల దోస్తీ స్థిరపడింది. గీతారాయ్, గీతాదత్ అయ్యేందుకు బీజం బేసిందీ పాట.

‘బాజీ’లో ‘షర్మాయే కాహె’, ‘బహార్’ లో ‘సయ్యాన్ దిల్ మే అనారే’ వంటి సూపర్ హిట్ పాటలను అందించింది శంషాద్ బేగం. కానీ ఎస్డీ బర్మన్ అన్ని స్వరాలను విస్మరించాడు. లత స్వర మాయాజాల మాధుర్యంలో తన్మయుడయ్యాడు. 1950 నుంచి 1958 నడుమ లతతో డెభ్బై తొమ్మిది పైగా పాటలు పాడించాడు. కొన్ని సినిమాలలో లత మంగేష్కర్ ఒక్కర్తే గాయని. అయిదారు పాటలు లతతోనే పాడించాడు. లత కూడా ఎస్డీ బర్మన్‍ను అత్యంత గౌరవించింది. ఆయనకు ఎలాంటి భావం పాటలో పలకాలో అలాంటి భావం గ్రహించి ఆయన ఆశించిన దానికన్న అద్భుతంగా భావం పలికించేది. దాంతో ఒకదాన్ని మించి మరొకటిగా సూపర్ హిట్ పాటలు మాత్రమే కాదు, హిందీ సినీ సంగీత ప్రపంచంలో అత్యద్భుతమైన గీతాలలో అగ్రస్థానంలో ఉండేటటువంటి పాటలు రూపొందాయి. ఎస్డీ బర్మన్‍కు సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని ఆపాదించాయి.

ఎస్డీ బర్మన్‍తో లత మంగేష్కర్ సంబంధాన్ని రెండు దశలుగా విభజించవచ్చు. 1950 నుంచి 1957 వరకూ ఒక దశ. 1962 నుండి 1975 లో ఎస్డీ బర్మన్ మరణం వరకు రెండవ దశ. ఒక అయిదేళ్ళు,  1957 నుండి 1962 వరకూ అని కొందరు, 1958 నుంచి 1963 వరకూ అని కొందరూ భావిస్తారు. కానీ 1962లో ‘డాక్టర్ విద్య’ అనే సినిమాలో లత పాటలుండటంతో లత, ఎస్డీ బర్మన్‍లు అయిదేళ్ళ తరువాత కలసి పనిచేయటం ‘డాక్టర్ విద్య’ సినిమాతో ఆరంభమయిందని వాదిస్తారు. లత మంగేష్కర్, ఎస్డీ బర్మన్‍లు 1963 లో ‘బందినీ’ సినిమాలో ‘మోర గోర్ అంగ్ లైలే’ పాటతో మళ్ళీ తామిద్దరం కలసి పనిచేయటం ఆరంభించాం అని పలు సందర్భాలలో చెప్పటంతో 1963లో ‘బందినీ’ పాటతో వారు మళ్ళీ కలిశారు అని వాదిస్తారు కొందరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం వాదించుకునేది సినిమా విడుదలైన సంవత్సరం ఆధారంగా.  కానీ,  సినిమాలు కనీసం ఒకటి, రెండేళ్ళయినా తయారీలో ఉంటాయి. ముందుగా పాటలు రికార్డయి పోతాయి. ఒక పాట ముందుగా రికార్డయినా, సినిమా ఆలస్యంగా విడుదల కావచ్చు. కాబట్టి లత ఎస్డీ బర్మన్‍లు మళ్ళీ కలసి పనిచేయటం బందినీ పాటతో ఆరంభించినా, తరువాత రికార్డయిన డాక్టర్ విద్య సినిమా ముందు విడుదల అయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఒక అయిదేళ్ళు లత, ఎస్డీ బర్మన్‍లు కలసి పనిచేయలేదు. ఇది హిందీ సినీ సంగీత చరిత్రలో ఒక ప్రధానమైన ఘట్టం.

1950లో ‘మషాల్’ సినిమాలో లతతో తొలిసారిగా పాడించక ముందు ఎస్డీ బర్మన్ పలు గాయనిలతో పాటలు పాడించాడు.  లత పరిచయం అయిన తరువాత, 1950 నుండి 1957 నడుమ గీతారాయ్‍తో పాడించిన పాటలు నలభై. ఇదే సమయంలో అంటే 1950 నుండి 1957 నడుమ లతతో పాడించిన పాటల సంఖ్య 77.

1949లో శంషాద్ బేగమ్‍తో ‘షబ్నం’ సినిమాలో మొత్తంగా ఏడు పాటలు పాడించాడు ఎస్డీ బర్మన్. తరువాత 1950లో ఒకటి, 1951లో ఆరు పాటలు, 1952లో ఒక పాట, 1953లో రెండు పాటలు, 1954లో మూడు పాటలు పాడించాడు. మొత్తంగా ఇరవై పాటలు మాత్రమే పాడించాడు. ‘షబ్నం’ సినిమా పాటలు హిట్ అయిన తరువాత మరికొన్ని సినిమాలలో పాడించాడు. అవి తరువాత విడుదలయ్యాయి. ఈలోగా లత పరిచయం అయిన తరువాత శంషాద్ బేగమ్‍ను అతి తక్కువగా వాడేడు ఎస్డీ బర్మన్. 1952లో ఆశా భోస్లేతో తొలి పాటను రికార్డు చేశాడు ఎస్డీ బర్మన్. లత ప్రధాన గాయని. తరువాత గీతాదత్. ఆపై ఆశా భోస్లేను వాడేడు.  కానీ గీతారాయ్ గీతాదత్ అయి ఆమె దృష్టి పాట నుంచి మళ్లటంతో ఆశా భోస్లేకు అవకాశాలు అధికంగా ఇచ్చాడు ఎస్డీ బర్మన్. కానీ ప్రధానంగా 1957 వరకూ ఎస్డీ బర్మన్ రికార్డింగ్ స్టూడియోలో నెంబర్ వన్ గాయని లతా మంగేష్కర్.

ఎస్డీ బర్మన్ లత స్వరాన్ని గుర్తిస్తున్న సమయంలోనే ఇతర అత్యద్భుతమైన సంగీత దర్శకులు, పరమాద్భుతమైన గేయాలను లతతో పాడిస్తూండటంతో 1952 కల్లా లత సూపర్ సింగర్‍గా, నెంబర్ వన్ గాయనిగా ఎదిగింది. ‘బాజీ’లో గీతాదత్ అద్భుతంగా పాడినా ‘బుజ్ దిల్’ సినిమాలో లతతో అయిదు పాటలు పాడించాడు. వీటిలో ‘ఝున్ ఝున్ ఝున్ పాయల్  బాజే’ అన్న పాట అద్భుతమైనది. క్లిష్టమైన రాగం ఆధారిత పాటను లత అలవోకగా పాడుతుంది. ఇంతలో ‘నౌజవాన్’ సినిమాలో ‘ఠండీ హవాయే’ పాట సంచలనం సృష్టించింది. ఈ పాట ఎంతగా శ్రోతలను ఆకర్షించిందంటే,  సంగీత దర్శకుడు రోషన్  ఈ బాణీ ఆధారంగా 60 దశాబ్దంలో ‘రహే న రహే హమ్’ అనే సూపర్ హిట్ పాటను లత స్వరంలో సృజించాడు. ఆర్డీ బర్మన్ ఎప్పుడు హిట్ పాట కావాలన్న ఈ బాణీను వాడేవాడు. ‘హమే ఔర్ జీనేకీ చాహత్ న హోతీ’, ‘సాగర్ కినారే’ వంటి హిట్ పాటలకు ఆధారం ‘ఠండీ హవాయే’ పాటనే. ఇదే సంవత్సరం ‘సజా’ సినిమాలోని ‘తుమ్ న జానే కిస్ జహాన్ మె ఖోగయా’ పాట ఈనాటికి హృదయాలను బరువెక్కిస్తూంటుంది.

ఎస్డీ బర్మన్ పాటలు పాడే సందర్భంలోనే లతకు గేయ రచయిత సాహిర్ లూధియాన్వీతో పరిచయం అయింది. హిందీ సినీ గేయ రచయితలలో సాహిర్ లూధియాన్వీది ప్రత్యేకమైన స్థానం. గేయ రచయితలందరిలోకీ ఆకర్షణీయమైన నేపథ్యం కలవాడు సాహిర్. జమీందారుకు జన్మించినా, అతని తల్లికీ తండ్రికీ నడుమ జరిగిన పోరాటంలో పావు అయ్యాడు. ఒక దశలో అతని తండ్రి సాహిర్‌ను చంపించాలని ప్రయత్నించాడు. కానీ సాహిర్‌ను రక్షించేందుకు అతని తల్లి ఆడపులిలా పోరాటం సాగించింది. బాల్యంలోనే మానవ సంబంధాలలోని డొల్లతనం, అహంకారం ప్రాధాన్యం సాహిర్‌కు అర్థమైంది. బలవంతుడు, బలహీనుడిని అణచివేయటమే, లోక రీతి అని అర్థం చేసుకున్నాడు. బలహీనుల పక్షాన బలంగా తన గళాన్ని నిలిపేందుకు కలాన్ని ఆశ్రయించాడు. తనలో చెలరేగుతున్న న్యూనతా భావాన్ని ఆధిక్యతా భావంగా మలచుకుని సామాజిక ధిక్కారం, తిరస్కారాలను తన సంతకాలుగా చేసుకున్నాడు.

హిందీ సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన తరువాత హిందీ సాహిత్యాన్ని తెలుసుకునేందుకు హిందీ గేయాల అర్థాలను తెలుసుకునేందుకు తపన పడుతున్న ఎస్డీ బర్మన్‌కు సాహిర్ వెతుకుతున్న తీగలా అనిపించాడు. ఎస్డీ బర్మన్‌కు పాటలలో సాహిత్యం అత్యంత ప్రాధాన్యం. గేయాల్లో ఏ మాత్రం చులకన భావం ఉన్నా సహించలేడు. పాట విజయవంతం అవటంలో ఉత్తమ సాహిత్యం ప్రధాన పాత్ర పోషిస్తుందని నమ్మేవాడు ఎస్డీ బర్మన్. అతనికి సాహిర్‌తో దోస్తీ కుదిరింది. సాహిర్ పేరును ఎస్డీ బర్మన్‍కు సూచించిన వాడు జయదేవ్ అంటారు.

జయదేవ్ హీరో అవుదామని బొంబాయి వచ్చి సహాయ సంగీత దర్శకుడయ్యాడు. లూధియానాలో కాలేజీలో సాహిర్‌కు సీనియర్ జయదేవ్. అప్పటి నుంచే సాహిర్ సాహిత్యం అంటే జయదేవ్‍కు ప్రీతి. దేవ్ ఆనంద్, ఎస్డీ బర్మన్‍లు సరైన గేయ రచయిత కోసం వెతుకుతున్నారని తెలిసి సాహిర్ పేరు సూచించాడు జయదేవ్. కానీ కొందరు ‘టాక్సీ డ్రైవర్’ సినిమాతో జయదేవ్, ఎస్డీ బర్మన్‍కు సహాయ సంగీత దర్శకుడయ్యాడు కాబట్టి అంతకు రెండేళ్ళ ముందు తయారైన ‘బాజీ’ సినిమాకు జయదేవ్ సాహిర్ పేరు సూచించే అవకాశం లేదని అంటారు. హెచ్ క్యూ చౌదరీ రాసిన ‘ఇన్‍కంపేరబుల్ సచిన్ దేవ్ బర్మన్’ పుస్తకం ప్రకారం సాహిర్ ప్రోగ్రెస్సివ్ రైటర్ అసోసియేషన్‌లో సభ్యుడవటంతో మజ్రూహ్, కైఫీ ఆజ్మీ, జాన్ నిసార్ అఖ్తర్, ఇస్మత్ చుగ్తాయ్ వంటి వారితో పరిచయాలయ్యాయి. వారి ద్వారా ఎస్డీ బర్మన్‍కు సాహిర్ గురించి తెలిసింది. ‘బాజీ’ సినిమాలో ‘తద్బీర్ సే బిగ్డీ హుయీ’ పాట బాణీ వినిపించి, గేయం రాయమంటే ‘శవ పేటికకు తగ్గట్టు శరీరాన్ని ఇమడ్చాలన్న మాట’ అని సాహిర్ ఈసడించాడని అంటారు. కానీ ‘తద్బీర్ సే’ గజల్ సాహిర్ ముందే రాసిందని దానికి ఎస్డీ బర్మన్ బాణీ సమకూర్చాడని ఇంకొందరంటారు. ఏది ఏమైనా ‘బాజీ’లో సాహిర్, ఎస్డీ బర్మన్‍ల మేలుకలయిక సంభవించింది.

సాహిర్‌కు తన గేయ రచన పట్ల అమితమైన విశ్వాసం. మరొకరిని లెక్క చేయలేనంత విశ్వాసం. సాహిర్ ఆత్మవిశ్వాసం అధికంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేయలేడు.  తనకు దాసోహం  అని విధేయులుగా వుండేవారంటేనే అతనికి ఇష్టం.  ఎవరినీ లెక్కచేయని సాహిర్ పాటలు లత పాడటం అవి సూపర్ హిట్ అవటం, అందరూ లతను పొగడటం సాహిర్‌కు నచ్చలేదు. ‘నేను రాసిన పాటలు ఎవరు పాడినా హిట్ అవుతాయన్న’ విశ్వాసం అతనిది.

ఈ సమయంలో సాహిర్‌కు సుధ మల్హోత్ర పరిచయం అయింది. బాల గాయనిగా 1940లో గులామ్ హైదర్ ఆమెను సినీ ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘ఆర్జూ’ సినిమాతో నేపథ్య గాయనిగా రంగ ప్రవేశం చేసింది. కానీ అప్పటికే సినీ సంగీత ప్రపంచాన్ని లత, గీతాలు ఆక్రమించుకుని ఉన్నారు. వారు వదలిన పాటలు మిగతా వారికి లభిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తన ఉనికిని చాటుకోవటం కష్టమయింది సుధ మల్హోత్రకు. ఆమెతో స్నేహం ఏర్పడటం వల్ల సాహిర్ లతకు ప్రత్యామ్నాయంగా సుధ మల్హోత్ర పేరును సూచించటం ఆరంభించాడు. అంతవరకూ ఒకటి రెండు పాటలు పాడే సుధా మల్‌హోత్రకు సాహిర్ వల్ల పాటలు విరివిగా లభించటమే కాదు,  అతి చక్కని పాటలు లభించాయి. తనకు పోటీగా మరొకరిని నిలిపేవారిని లత సహించదు. ఆదరించదు. అందువల్ల  సాహిర్, లతలు ఒకరినొకరు గౌరవవించుకునేవారు తప్ప, సన్నిహిత సంబంధం ఎన్నడూ లేదు. ఒక దశలో ‘ లత గొప్ప ఏమిటి? లత కన్నా ఒక రూపాయి ఎక్కువ ఇస్తేనే నేను ఆమె పాడే పాటలు రాస్తా’నని సాహిర్ భీష్మించుకు కూచున్నాడు. ఇదంతా తెలియని కొందరు తెలుగు జర్నలిస్టులు లత సాహిర్‌ల నడుమ ప్రేమ వ్యవహారం నడిచిందనీ, ఆమె కోసం సాహిర్ పాటలు రాశాడనీ,  తాము కళ్ళతో చూసి, సాహిర్ స్వరంలో విన్నట్టు రాసేశారు. జవాబుదారీ లేని జర్నలిజం ఇలాగేవుంటుంది.  అయితే లత మాత్రం ఏ విషయాలనూ పట్టించుకోకుండా ప్రతి పాటనూ ఎంతో శ్రద్ధతో, అదే తన తొలి పాట అయినట్టు ఆ పాట పైనే తన కెరీరు ఆధార పడినట్టు పాడేది. అందుకే 1953 కల్లా తిరుగులేని మహారాణిలా సంగీత ప్రపంచంలో స్థిరపడింది లత.

సంగీత దర్శకులే కాదు, వాయిద్యకారులు కూడా లత స్వర వైశిష్ట్యం గుర్తించారు. ఆమె పాడిన పాటలకు వాయిద్య సహకారం అందించటం వల్ల తాము కూడ అమరులం అవుతామని గ్రహించారు. ఎంతో సీనియర్లయిన వాయిద్యకారులు కూడా లతను వయసుతో సంబంధం లేకుండా గౌరవించేవారు. ఆమె కేంద్రంగా వారు తమ వాయిద్యాలను కదిలించేవారు.

నిర్మాతల నుంచి డబ్బు సంపాదించటం విషయంలో లత రాజీ పడేదికాదు. కానీ అవసరమైన వారికి సహాయం అందించటంలో వెనుకడుగు వేసేది కాదు. వాయిద్యకారులలో ‘ఆంథోని గంజాల్వేస్’ది ప్రత్యేక స్థానం. ఆయన వయోలిన్ అద్భుతంగా వాయించటమే కాదు, ఎంతోమంది ఔత్సాహికులకు వయోలిన్ నేర్పేవాడు. అయితే వారికి నేర్పేందుకు సరైన స్థలం అతడికి దొరకలేదు. అతని అవస్థను అర్థం చేసుకున్న లత, ఔత్సాహికులను వయోలిన్ నేర్పేందుకు ఒక హాలును ఏర్పాటు చేసింది. అలా అంథోని గంజాల్వేస్ వద్ద వయోలిన్ వాయించటం నేర్చినవారిలో భవిష్యత్తులో గొప్ప సంగీత దర్శకులుగా ఎదిగిన వాళ్ళు అనేకులున్నారు.

photo taken from the book Behind the curtain, making of Music in Mumbai Film Studios by Gregory D Booth

వారిలో ఒకరు భవిష్యత్తులో లక్ష్మీకాంత్ తో  జతగట్టి నలభై ఏళ్ళ పైన సినీ సంగీత ప్రపంచాన్ని లక్ష్మీ-ప్యారేగా  ఏలిన ప్యారేలాల్ శర్మ . తమకు వయోలిన్ నేర్పినందుకు కృతజ్ఞత సూచకంగా ‘అమర్ అక్బర్ అంథోని’ సినిమాలో ‘మై నేమ్ ఈజ్ అంథోని గంజాల్వేస్’ పాటతో తన గురువుకు నీరాజానాలర్పించాడు ప్యారేలాల్. అంతేకాదు, ప్యారేలాల్ తండ్రి రాం ప్రసాద్ శర్మ ఉచితంగా వయోలిన్ , ఔత్సాహికులకు నేర్పించేందుకు కూడా లత సహాయం చేసింది.   నిరుపేదగా ఉన్నప్పుడు ఆశ్రయమిచ్చిన, భవిష్యత్తులో కూడు పెట్టే విద్యను నేర్చుకునే అవకాశం ఇచ్చిన లతా మంగేష్కర్ పట్ల జీవితాంతం విధేయతను ప్రదర్శించారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. ఇలా అటు సంగీత దర్శకులు, ఇటు వాయిద్యకారుల గౌరవ మన్ననలందుకుంటూ లత మంగేష్కర్ అచిర కాలంలోనే భారత దేశానికి గర్వకారణంగా ఎదిగింది.

నాణ్యమైన పాటలు, ఉత్తమమైన సాహిత్యం ఉన్న పాటలను మాత్రమే పాడుతూ, ఒకటి తరువాత మరొకటిగా హిట్ పాటలనిస్తున్న లత తప్ప మరో గాయని పేరు ఎవరూ తలవని పరిస్థితి హిందీ సినీ ప్రపంచంలో నెలకొంది ఆ కాలంలో. లత పాడని పాటలు, లతతో పాడించేంత స్థాయి లేని వారి పాటలు ఇతరులకు దక్కేవి. ఈ సమయంలో గీతాదత్ దృష్టి పాటల నుంచి మళ్ళటంతో ఆమె పాడేటటువంటి పాటలు పాడే గాయనిలకు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఆశా భోస్లే చక్కగా ఉపయోగించుకుంది. ఇంతలో 1957 ప్రాంతంలో లత, ఎస్డీ బర్మన్‍ల నడుమ ఓ చిన్న అపోహ నెలకొంది.

సినీ ప్రపంచం ఒక బుడగ లాంటిది, లోపల గాలి ఉన్నంత మటుకే అందంగా కనిపిస్తుంది. చిన్న గాలి తరగ   చాలు బుడగను దెబ్బ తీసేందుకు. అందులో ఉచ్చస్థాయిలో ఉన్న వారిని లాగి క్రింద పారేసి ఆనందించటం సినీ పరిశ్రమకు అలవాటు. తలత్ మహమూద్, ముకేష్‍లు గాయకులుగా ఉచ్చస్థాయి చేరుకుంటున్న సమయంలో వారి చుట్టూ చేరిన వందిమాగధులు వారిని బాగా పొగడి ‘మీరే హీరోలు’ అని నమ్మించారు. దాంతో హీరోలైపోవాలని తలత్ మహమూద్, ముకేష్‍లు ప్రయత్నించారు. తలత్ మహమూద్ కొన్ని సినిమాలలో నటించాడు. అంతగా హిట్ కాలేదు. కానీ ‘తమతో పోటీగా నిలిచిన వాడి గొంతు తామూ వాడటం ఏమిటి?’ అని హీరోలు తలత్ తమకు పాడటాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా మహమ్మద్ రఫీ ముందుకు దూసుకువచ్చాడు. ముకేష్ నటించిన సినిమాలు పూర్తి కాలేదు. పూర్తయినవి విడుదల కాలేదు. తానే స్వయంగా నిర్మాణం తలపెట్టిన సినిమా కూడా పూర్తికాలేదు. లతతో పాడిన ‘బడె అర్మానోంసె రఖా హై బలమ్ తేరీ కసమ్’ పాట మాత్రం ఈనాటికీ  వినిపిస్తుంది. నటనపై దృష్టి పెట్టిన ముకేష్ కు  పాటలు పాడేందుకు సమయం లేదని భావించారు. ఫలితంగా మన్నా డే వేదికపైకి వచ్చాడు. ఇదంతా లతా మంగేష్కర్ గమనిస్తూనే ఉంది. జరుగుతున్న సంఘటనలకు, కుట్రలు, కుతంత్రాలకు ఆమె సాక్షి. అందుకే ఎలాంటి వివాదాలకు పోకుండా ఎవరు చెప్పిన మాటలను లెక్కచెయ్యకుండా తన పనిపైనే దృష్టి పెట్టేది లత. ఈ సమయంలో ఎస్డీ బర్మన్, సంగీత దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సితారోంకె ఆగే’ లో లత ఓ పాట రికార్డు చేసింది.

‘పగ్ ఠుమక్ చలత్ బలఖాయే హోయే సయ్యా కై సే ధరూన్  ధీర్’ అనే పాట ఎస్డీ బర్మన్ సూచనల మేరకు అద్భుతంగా పాడింది లత. ఎస్డీ బర్మన్ సైతం సంతృప్తిని వ్యక్తం చేశాడు. సాధారణంగా ఒక పాట రికార్డయిన తరువాత సంగీత దర్శకుడు సంతృప్తిని వ్యక్తం చేయటంతో పాట పని సంపూర్ణం అయిపోతుంది. ఈ పాట రికార్డింగ్ అయిన తరువాత లతకు మరికొన్ని పాటల రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ తరువాత ఆమె విదేశీ టూర్ వెళ్ళాల్సి ఉంది. రికార్డింగ్ అయిన రెండు రోజుల తరువాత పాటను మరింత మృదువుగా పాడితే పాట ఇంకా అద్భుతంగా ఉంటుందని ఎస్డీ బర్మన్ కబురు పెట్టాడు. లతకు విషయం చెప్పి రికార్డింగ్ డేట్లు నిశ్చయం చేసుకుని రమ్మని అసిస్టెంటును పంపాడు ఎస్డీ బర్మన్. ‘ఇప్పుడు వీలులేదు తరువాత చెప్తా’నంది లత. అయితే ఆమెకు వీలు కుదరలేదు. అసిస్టెంట్ లత మాటలు ఎస్డీ బర్మన్‍కు ఎలా చెప్పాడో తెలియదు కానీ లత మళ్ళీ రికార్డింగ్ చేయటానికి సుముఖంగా లేదన్న భావం ఎస్డీ బర్మన్‍కు కలిగింది.

ఎస్డీ బర్మన్ ఏ విషయంలో నైనా రాజీ పడతాడు కానీ పాట విషయంలో రాజీ పడడు. పైగా అప్పటికే సంగీత దర్శకుడు గొప్పనా? గాయని గొప్పనా? అన్న విషయంలో చర్చలు సాగుతున్నాయి. ఒకసారి రికార్డయినా సంగీత దర్శకుడికి సంతృప్తి కలిగేంతవరకూ పాడటం గాయనీ గాయకుల ధర్మం.  ల్తకు మళ్ళీ పాటను రికార్డ్ చేసే సమయం దొరక్కపోవటంతో  మాటలను అటూ ఇటూ చేరవేశేవారు ముమ్మరంగా పనిచేశారు. లత మళ్ళీ పాడనందని ఎస్డీ బర్మన్ కు చెప్పారు. లతను గాయనిగా తీర్చిదిద్దింది సంగీత దర్శకులే అని ఎస్డీ అన్నాడని లతకు చెప్పారు. దాంతో లత నేను ఎస్డీ బర్మన్ పాటలు పాడనంది. లత కాకపోతే ఆశాపాడుతుందని ఎస్డీ బర్మన్ అన్నాడు. అలా ఒక అయిదేళ్ళ పాటూ లతా, ఎస్డీ బర్మన్‌లు కలసి పనిచేయలేదు. అయితే ఇతర సంగీత దర్శకులలా – లత లేకపోతే గడవదని ఎదురు చూసే వ్యక్తి కాదు ఎస్డీ బర్మన్. లత మళ్ళీ పాడేందుకు రాకపోవటంతో ఆశా భోస్లేను పిలిపించాడు. పాటను ఆమెతో పాడించాలని నిశ్చయించాడు. తాను రికార్డు చేసిన పాటను మరొకరితో పాడించటం లత ఒప్పుకోదు. గతంలో అలా చేశాడని అనిల్ బిశ్వాస్‍ని  సైతం పక్కన పెట్టింది లత. ఇప్పుడు ఎస్డీ బర్మన్ అదే చేశాడు. పైగా ఆశాతో పాడించాడు ఆ పాటను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here