సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-2

5
7

ఆయెగా, ఆయెగా, ఆయెగా అనేవాలా, ఆయేగా (మహల్, 1949)

[dropcap]’C[/dropcap]ometh the hour, cometh the man’ అనే పదబంధాన్ని  ఆంగ్లంలో వాడతారు. దాని అర్థం ఏమిటంటే సందర్భం వచ్చినప్పుడు, అవసరం పడ్డప్పుడు అవసరం తీర్చే వ్యక్తి వస్తాడని. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టాన్ని తొలగించే వ్యక్తి వస్తాడని . లత మంగేష్కర్ జీవితాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

1947 ఆగష్టు 15న దేశానికి స్వతంత్రం సిద్ధించింది. స్వతంత్రంతో పాటు దేశవిభజన సంభవించింది. దేశవిభజన భారతీయ సమాజాన్ని అల్లకల్లోలం చేసింది. దేశవిభజన వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటమే కాదు, సంస్కృతి కూడా అనూహ్యమైన రీతిలో దెబ్బతిన్నది. ముఖ్యంగా సినీరంగంపై విభజన తీవ్రమైన ప్రభావం చూపింది. అంతవరకు ఒకటిగా ఉన్న భారతీయ సినిమా రెండుగా చీలిపోయింది. భారతీయ సినిమా చీలి ‘పాకిస్తాన్ సినిమా’ ఏర్పడింది. సినీ నిర్మాణం దెబ్బతిన్నది. పేరుపొందిన కళాకారులు దేశం వదిలి వెళ్ళారు. ఆ కాలంలో బొంబాయికి పోటీగా ‘లాహోర్’లో సినీ నిర్మాణం కేంద్రంగా ఉండేది. కానీ విభజన వల్ల ఇటునుంచి కళాకారులు అటూ, అటు నుంచి కళాకారులు ఇటు రావటం ఆరంభమయింది. నూర్‍జహాన్, జియాసర్హది, గులామ్ మహమ్మద్, సాదత్ హాసన్ మంటో వంటి వారు పాకిస్తాన్ వెళ్ళిపోయారు. గుల్జార్, గోవింద్ నిహలాని, బి.ఆర్. చోప్రా, యష్ చోప్రా వంటి వారు భారత్ వచ్చారు. నాసిర్ ఖాన్, సాహిద్ లూధియాన్వి వంటివారు పాకిస్తాన్ వెళ్ళినా అక్కడ ఇమడలేక భారత్ తిరిగి వచ్చారు. ఇంకా సయ్యద్ షౌకత్ హుస్సేన్ రిజ్వి, రోషన్ ఆరా బేగమ్, ముంతాజ్ శాంతి, మీనా షోరే, గులామ్ అహ్మద్ చిష్తి, గులామ్ హైదర్, నజీర్ అహ్మద్ ఖాన్, గోహార్ మామాజీ వాలా, ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్, ఖుర్షీద్ బానో, మాలికా ఏక్‌రాజ్, షౌకత్ హుస్సేన్ రిజ్వి, నిస్సార్ బాజ్మి, నాషాద్ వంటి కళాకారులు పాకిస్తాన్ వెళ్ళిపోయారు. వీరంతా భారతీయ సినిమాలో పేరుమోసిన కళాకారులు. తమ ప్రతిభతో సినీ రంగాన్ని సుసంపన్నం చేసినవారు. వీరిలో గులామ్ హైదర్, లతా మంగేష్కర్‍కు సినిమాల్లో పాడేందుకు తొలి అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు. అందరూ ‘లత స్వరం పీలగా ఉంది, పనికిరాదు’ అంటున్న సమయంలో లత ప్రతిభపై నమ్మకం ఉంచినవాడు గులామ్ హైదర్.

గులామ్ హైదర్

“గులామ్ హైదర్ నిజంగా నాకు గాడ్ ఫాదర్ లాంటివాడు. నా ప్రతిభపై ఆయనకు ఉన్న విశ్వాసం వల్లనే నేను సినీ పరిశ్రమలో నిలబడగలిగాను. పరిశ్రమ నన్ను తిరస్కరించినప్పుడు ఆయన నాకు అవకాశం ఇచ్చారు. నా గాన ప్రతిభపై నమ్మకం ప్రదర్శించిన తొలి సంగీత దర్శకుడు గులామ్ హైదర్. ఆయన నన్ను పలువురు నిర్మాతలకు పరిచయం చేశారు. వారిలో ఎస్. ముఖర్జీ కూడా ఒకరు. ఆయన కూడా నా స్వరాన్ని పనికిరానిదిగా భావించటంతో ఆగ్రహించిన గులామ్ హైదర్, ఎస్. ముఖర్జీ కన్నా పెద్ద నిర్మాణ సంస్థ అయిన ‘బాంబే టాకీస్’ వారిని ఒప్పించి ‘మజ్బూర్’ సినిమాలో పాటలు పాడే అవకాశం నాకు ఇచ్చారు” అంది లతా మంగేష్కర్ బొంబాయిలో అడుగుపెట్టిన తన సంఘర్షణను తలుచుకుంటూ.

లతా మంగేష్కర్  నే కాదు షంషాద్ బేగమ్, సుధా మల్హోత్ర, సురిందర్ కౌర్ వంటి వారిని సినీపరిశ్రమకు పరిచయం చేసింది గులామ్ హైదర్. ఆయన ప్రభావంతో హన్స్‌రాజ్ బహల్, హుస్న్‌లాల్ -ల్ భగత్ రామ్, ఫిరోజ్ నిజామి వంటి సంగీత దర్శకులు తమ సంగీతాన్ని తీర్చిదిద్దుకున్నారు. మదన్ మోహన్, నాషాద్ వంటివారు అతనికి సహాయ సంగీత దర్శకులుగా పనిచేశారు. వీరిలో మదన్‍మోహన్ తర్వాత ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాషాద్ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు.

ఇలాంటి దిగ్గజాలు, ప్రతిభావంతులు వెళ్ళిపోవటంతో హఠాత్తుగా సగం నీళ్ళు తోడేసిన సముద్రంలా అయింది బొంబాయి సినీపరిశ్రమ పరిస్థితి. ఈ ఖాళీని పూడ్చేందుకు దేశం నలువైపుల నుండి పలువురు కళాకారులు కళ్ళ నిండా స్వప్నాలతో, గుండెల నిండా ఆశలతో బొంబాయి వచ్చి చేరారు. అయితే అప్పటికే సినీ నిర్మాణానికి ఒక వ్యాకరణం స్థిరపడింది. కొందరు కళాకారులు తమ ప్రతిభతో ప్రామాణికాలు ఏర్పరిచారు.

ఇప్పుడు కొత్తగా సినీ ప్రపంచంలో అడుగుపెడుతున్న ప్రతి కళాకారుడినీ ఈ ప్రామాణికాలతో కొల్చి చూడటం ఆనవాయితీ అయింది. అదీగాక ప్రతిమనిషికీ అతడు ఎంత గొప్పవాడైనా కొన్ని అపోహలు, కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. కొత్తగా సినీరంగంలో అడుగుపెట్టిన వారు ఈ ప్రామాణికాలు, అపోహలు ఖచ్చితమైన అభిప్రాయాలను దాటుకుని తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. దొరికిన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. సినీ పరిశ్రమ ఎలాంటిదంటే వెయ్యి విజయాలైనా ఒక పరాజయంతో తుడిచిపెట్టుకుపోతాయి. ఆరంభంలోనే అడుగు పొరపాటుగ పడితే ‘పరాజయం’ ముద్ర వేసి పక్కకు నెట్టేస్తారు. మళ్ళీ నిలదొక్కుకోవాలంటే ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. దీనికి తోడు ‘అవకాశం’ లభించాలంటే కేవలం ‘ప్రతిభ’ కాక ఇంకా అనేక అంశాలు ప్రాధాన్యం వహిస్తాయి. ఆకాలంలో సినీ సంగీత రంగంలో తవాయిఫ్‌లూ( వేశ్యలు), డేరేదారినిలు( ముఘల్ రాజుల దర్బార్‌లో నృత్యంచేసేవారి వంశానికి చెందినవారు) అధికంగా ప్రవేశించేవారు. నటనతో పాటూ పాటలు పాడేవారు. నేపథ్య గానం అంతగా వ్రేళ్ళూనుకోలేదు. దాంతో పాటలు పాడేందుకు వచ్చే యువతులంటే చులకన అభిప్రాయంవుండేది.

 

ఇలాంటి బొంబాయి సినీ ప్రపంచంలో లతా మంగేష్కర్ 1945లో పదహారేళ్ళ వయసులో అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమెకు ఎవరూ పరిచయం లేదు. ఆమె తండ్రి స్నేహితుడు మాస్టర్ వినాయక్ నాటక సంస్థ బొంబాయికి మారటంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న లత కూడా బొంబాయి రావాల్సి వచ్చింది. బొంబాయిలో హిందుస్థానీ సంగీత గానంలో శిక్షణ పొందింది. 1946లో ‘ఆప్‍ కీ సేవామే’ అనే సినిమాలో ‘పా  లాగూ కర్ జోరీ’ అనే పాటతో హిందీ సినీ  సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. ‘బడీ మా’ సినిమాలో చిన్న వేషం వేయటంతో పాటు ‘మాతా తేరే చరణోంమే’ అనే భజన పాడింది. ఇంతలో మాస్టర్ వినాయక్ మరణించడంతో లత పరిస్థితి సంకటంలో పడింది. బొంబాయి వదలి వెనక్కు వెళ్ళలేదు. వెనక్కు వెళ్ళినా జీవితం సాగించేందుకు ఎలాంటి ఆధారం లేదు. పైగా లతకు ‘పాట’ తప్ప మరొకటి తెలియదు, రాదు. దాంతో బొంబాయిలోనే ఉండి తన అదృష్టం పరిశీలించుకోవాల్సి వచ్చింది. సన్నిహితులు అన్నవారు లేని పరిస్థితి. అవకాశం లభిస్తే మ్రింగేసే మొసళ్ళు, ముక్కలుగా చీల్చే సొరచేపలు, కన్నుమూసి తెరిచేలోగా మాయచేసి ముంచేసే సుడిగుండాలు… ఇలాంటి సినీ ప్రపంచంలో కాళ్ళునుకోవాలని ప్రయత్నిస్తున్న లతా మంగేష్కర్‍కు గులామ్ హైదర్ అండ లభించింది. ఆయన లతను వెంట తీసుకుని నిర్మాణ సంస్థకు పరిచయం చేయటం ఆరంభించాడు. కానీ అది శక్తివంతమైన ఖంగునమ్రోగే మహిళల స్వరాల కాలం. నూర్జహాన్, అమీర్  బాయి కర్ణాటకి, సురయ్య, రాజ్ కుమారి, శంషాద్ బేగం, జోహ్రబాయి అంబాలేవాలి  వంటి వారు రాజ్యం ఏలుతున్న కాలం. అలాంటి కాలంలో సన్నని తీగలాంటి లత స్వరంలోని మెరుపును గ్రహించలేకపోవటంలో ఆశ్చర్యం లేదు. ‘మరాఠీ ఆమె ఉర్దూ పదాలు సరిగ్గా ఉచ్చరించలేదు’ అన్నారు. ‘స్వరంలో శక్తి లేదన్నారు’. ‘కంఠం పైకి రాదన్నారు’. ఇలాంటి పరిస్థితులలో పాడే అవకాశాలిచ్చిన గులామ్ హైదర్ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. దాంతో మళ్ళీ లత పరిస్థితి మొదటికి వచ్చింది.

ఇదే సమయానికి దేశ విభజన జరగటంతో పేరున్న కళాకారులు పాకిస్తాన్ వెళ్ళిపోవటంతో సినీరంగంలో పెద్ద కొరత ఏర్పడింది. అప్పటికే సైగల్ మరణం నేపథ్య గాయకుల ప్రపంచంలో పెద్దలోటును ఏర్పరచింది. ముకేష్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ వంటి యువ గాయకులు ఆ లోటును పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూర్జహాన్ వంటి గాయని పాకిస్తాన్ వెళ్ళిపోవటంతో గాయనిల ప్రపంచంలోనూ లోటును ఏర్పరచింది. సంగీత దర్శకులు ‘నూర్జహాన్’ లాంటి స్వరం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో ఖేమ్‍చంద్ ప్రకాష్ ‘మహల్’ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

‘మహల్’ సినిమాలో ‘ఆయెగా అనెవాలా’ పాట ఆత్మతో పాడేటటువంటి పాట. ఆ పాట కోసం  విభిన్న స్వరం అవసరమైంది. మృదుత్వం, కోమలత్వంతో పాటు కాస్త భౌతిక ప్రపంచానికి చెందనిది అనిపించేటటువంటి స్వరం పాటకు అవసరం. అప్పటికి పేరుపొందిన స్వరాలు ఖంగుమని మ్రోగేవి. ఇంకొందరి స్వరాలలో మృదుత్వం ఉన్నా మౌగ్ధ్యం లేదు. ఒకరకమైన One of this world లక్షణం లేదు. అందుకని ఖేమ్‌చంద్ర్ ప్రకాష్ ఈ పాటను లతతో పాడించాలని నిశ్చయించాడు. ఇది నిర్మాత సవక్ వాచాకు నచ్చలేదు. ఇంత పీలగొంతు వల్ల పాట పాడవుతుంది, సినిమా దెబ్బతింటుందన్నాడు. ‘ఆయెగా అనెవాలా’ పాట మహల్ సినిమాకు కీలకం. పలు సందర్భాలలో వస్తుంది. కాబట్టి సినిమా విజయం ఈ పాటపై ఆధారపడి ఉంటుంది. అందుకని ఎవరైనా పేరున్న మరో గాయనితో పాడించాలని నిర్మాత పట్టుబట్టాడు. కానీ ఖేమ్‍చంద్ ప్రకాష్‌కు తమ ప్రతిభపై నమ్మకం. లత స్వరంపై విశ్వాసం. పాటను రెండు రకాలుగా పాడించి రికార్డు చేశాడు. ఒకవేళ లత పాట విఫలమైతే మరో పాట విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇదంతా జరుగుతున్నప్పుడు లత మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించాలంటే బాధ కలుగుతుంది. సంగీతం తప్ప మరో మాట తెలియదు. అదే ఆమెకు జీవిక. ఆమెకే కాదు ఆమెపై ఆధారపడిన కుటుంబానికి ఆధారం ఆమె ‘గానం’. కానీ పలు కారణాల వల్ల ప్రతి ఒక్కరూ ఆమెను తిరస్కరించేవారే. అవకాశాలు ఇచ్చేవారు అరుదు. అలా వచ్చే అవకాశాలను అడ్డుకునే వారే అందరూ. ఒక వ్యక్తి యిష్టాయిష్టాలపై ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉండటం ఎంత దుర్భరమైన దుస్థితో ఊహించవచ్చు. ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినవి ఇలాంటి పలు భయంకరమైన అనుభవాలు.

‘మహల్’ సినిమా విడుదలయింది. సినిమా కన్నా ముందుగా అందరినీ ‘ఆయెగా అనెవాలా’ పాట ఆకర్షించింది. పాట రికార్డు అవుతున్నప్పుడు నటి నర్గీస్, ఆమె తల్లి జద్దన్ బాయి స్టూడియోలో ఉన్నారు. పాట పాడి బయటకు వచ్చిన లతను పేరు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆమె,  ఉర్దూ పదాలను అంత చక్కగా పలకటాన్ని అభినందించారు. ముఖ్యంగా ‘బగైర్’ అన్న పదాన్ని పలికిన తీరును ప్రశంసించారు. పాట విన్న తరువాత దేశమంతా నర్గీస్ తల్లి అడిగిన ప్రశ్ననే అడగటం ప్రారంభించింది. ‘ఎవరీ గాయని?’, ‘ఎవరీ గాయనీ?’, పాట పాడిందెవరు?’

ఆ కాలంలో నేపథ్య గాయకులను ఎవ్వరూ లెక్క చేసేవారు కారు. రికార్డులపై కూడా సినిమాలో ఆ పాట పాడిన పాత్ర పేరుండేది తప్ప గాయని పేరుండేది కాదు. దాంతో పాట పాడింది ఎవరో తెలుసుకోవాలని శ్రోతలు తహతహలాడేవారు. ఆ కాలంలో రేడియోలో కూడా గాయని పేరు చెప్పేవారు కాదు. దాంతో ‘ఈ పాట పాడింది ఎవరు?’ అని ఉత్తరాలు రాశారు. ఆ తాకిడిని తట్టుకోలేక ఈ పాట పాడింది ‘లతా మంగేష్కర్’ అని ప్రకటించాల్సి వచ్చింది. అంతవరకూ రికార్డులపై గాయనీ గాయకుల పేర్లు ప్రచురించని హెచ్.ఎం.వి. సంస్థకు  లత పేరును ముద్రించక తప్పలేదు.

అలా హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఒక లోటును పూడుస్తూ లత రంగప్రవేశం చేసింది. Cometh the hour, cometh the man అన్న నానుడిని నిజమని నిరూపిస్తూ ఆరు దశాబ్దాల పైగా చలన చిత్ర సంగీత ప్రపంచాన్ని మకుటం లేని మహరాణిలా ఏలింది. ఎవ్వరూ లెక్కచేయని పరిస్థితి నుంచి దేశం మొత్తం సరస్వతీ దేవిలా కొలిచే స్థాయికి ఎదిగింది. ‘సినీ పరిశ్రమ ఈమెకు పాదక్రాంతం అవుతుంద’న్న గులామ్ హైదర్ మాటలను నిజం చేస్తూ లతా మంగేష్కర్ ఎవరూ ఊహించనంత, ఎంత ప్రయత్నించినా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. ప్రపంచంలో ఒక బీథోవెన్, ఒక మోజార్ట్, ఒక తాన్‍సేన్, ఒక త్యాగరాజు, ఒక లతా మంగేష్కర్ మాత్రమే అని ముక్తకంఠంతో అందరూ నీరజనాలు అర్పించే స్థాయిలో నిలిచింది లతా మంగేష్కర్.

‘ఆయెగా అనెవాలా’ పాట విని అందరూ ‘ఎవరిదీ స్వరం?’, ‘పాట పాడింది ఎవరు?’, ‘ఎవరీ గాయనీ?’ అని అడిగారు. గాయని పేరు లతా మంగేష్కర్ అని తెలిసింది. అప్పుడు అందరూ ‘ఎవరీ లతా మంగేష్కర్’ అని అడగటం ప్రారంభించారు.

అవును. ఎవరీ లతా మంగేష్కర్? ఈమె నేపథ్యం ఏమిటి? ఇది వచ్చేవారం.

***

Photo Credits: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here