సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-20

1
8

[dropcap]బా[/dropcap]త్ బాత్ మే రూఠో నా, అప్నె ఆప్ కో లూటో నా

యె రంగ్ బదల్తీ దునియా హై, తక్దీర్  సే  అప్నీ లూటో నా

చీటికీ మాటికీ అలగవద్దు. నీ అదృష్టాన్ని తిట్టుకోవద్దు,  నీకు నువ్వు అన్యాయం చేసుకోవద్దని మంచి మాటలు చెప్పే ఈ పాట ‘సీమ’ సినిమా లోనిది. హస్రత్ జైపురి రచించగా శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వం వహించారు. లత అత్యద్భుతంగా పాడిందీ పాటను. ఎంతో స్ఫూర్తినిచ్చి, మంచిదారిలో ప్రయాణించేందుకు దారి చూపించే ఈ పాటను పాడిన లత మాత్రం నిజ జీవితంలో ఈ పాట చెప్పిన సత్యాన్ని అంతగా అనుసరించలేదు. తన నిరసనను వ్యక్తం చేయటంలో కానీ, అలిగి పాటలు పాడనని మొండికేయటంలో కానీ ‘బాత్ బాత్ మే రూఠో నా’ అన్న నియమాన్ని లత పాటించలేదు.

సినీ రంగంలో అడుగుపెట్టిన కొత్తల్లో, ఇంకా స్థిరపడనప్పుడు కూడా లత ఇలాగే ‘వారితో పాడను’, ‘వీరితో కలసి పని చేయను’ అని అలిగి మొండికేసేది. కానీ అదృష్టం ఆమె వైపు ఉండటంతో అలాంటి మొండితనం ఆమె కెరీర్‍పై పెద్దగా దుష్ప్రభావం చూపలేదు. ఆమె ఎవరితో కలసి పని చేయనందో వారి కెరీర్లే దెబ్బతిన్నాయి. చివరికి లతతో అధిక సంఖ్యలో పాటలు పాడిస్తూ వస్తున్న సి. రామచంద్రకు పాటలు పాడనని లత ప్రకటించిన తరువాత సి. రామచంద్ర కెరీరు దెబ్బతినటం స్పష్టంగా తెలుస్తుంది. వెంటనే ఎస్డీ బర్మన్‌కు పాడనని ప్రకటించింది. ఎస్డీ బర్మన్ కెరీరు పెద్దగా దెబ్బ తినలేదు కానీ లతతో సృజించినటువంటి అతి చక్కని పాటలు ఎస్డీ ఇతర గాయనిల కోసం సృజించలేకపోయాడు.

1960 దశకం ఆరంభంలో సినీ సంగీత రంగంలో పలు మార్పులు సంభవించాయి. నాయికల ప్రాధాన్యం తగ్గి నాయకుల ప్రాధాన్యం పెరిగింది. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‍లు సినీ హీరోల్లో త్రిమూర్తుల్లా ఎదిగారు. హీరో పరిచయం పాటలు ప్రాధాన్యం పొందుతున్నాయి. షమ్మీకపూర్, రాజేంద్ర కుమార్, జాయ్ ముఖర్జీ వంటి యువ హీరోలు మహమ్మద్ రఫీ స్వరం ఆధారంగా గుర్తింపు పొంది కెరీర్లు నిర్మించుకుంటున్నారు. పాత తరం సంగీత దర్శకులైన ఆర్ సి బోరల్, అనిల్ బిశ్వాస్ వంటి వారు తెరమరుగవుతున్నారు. శంకర్ జైకిషన్, ఎస్డీ బర్మన్, నౌషాద్, ఓపి నయ్యర్ వంటి వారు ఉచ్చశ్రేణి సంగీత దర్శకులుగా ఎదిగి, తమ గేయ రూప కల్పన ప్రతిభతో సినిమా విలువను పెంచుతున్నారు. రవి, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, చిత్రగుప్త వంటి నూతన సంగీత దర్శకులు సినీ సంగీత రంగంలో తమ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లత, మహమ్మద్ రఫీతో కలసి యుగళ గీతాలు పాడకూడదని నిర్ణయం తీసుకుంది. అప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులను చూస్తే ఈ నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం అనిపిస్తుంది.

1953లో ఆరంభమైన ‘బినాకా గీత్ మాలా’ హిందీ సినిమా పాటల ప్రాధాన్యాన్ని మరింతగా పెంచింది. భారత రేడియో సినీ పాటలను ప్రసారం చేయకూడదని నిర్ణయం తీసుకోవటం వల్ల హిందీ పాటలు వినేందుకు ‘రేడియో సిలోన్’పై ఆధారపడ్డారు శ్రోతలు. హిందీ సినిమా పాటలు శాస్త్రీయ సంగీతాన్ని దెబ్బ తీస్తాయని, శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటలే రేడియోలో వినిపించాలని అధికారులు నిర్ణయించారు. వారు సినిమా పాటలు విని, పాటల్లో పాశ్చాత్య వాయిద్యం వినిపిస్తే చాలు, ఆ పాటను రేడియోలో ప్రసారం చేసేందుకు నిరాకరించేవారు. అలాంటి పరిస్థితులలో ‘రేడియో సిలోన్’ హిందీ సినిమా పాటల వేదికగా ఎదిగింది. హిందీ సినీ ప్రేమికులందరి గమ్యంగా మారింది. సినిమాల పట్ల ప్రజల ఆదరణను, పాటల ఆకర్షణను అర్థం చేసుకున్న శ్రీలంక ప్రసార మాధ్యమం హిందీ సినిమా పాటల కార్యక్రమాలను విస్తృతం చేసింది. దానిలో భాగంగా పాటల ప్రజాదరణను లెక్కించి అందించే ‘బినాకా గీత్ మాల’ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఆరంభం నుంచీ ఈ కార్యక్రమం శ్రోతలను ఆకట్టుకుంది. అంతేకాదు హిందీ సినిమా పాటల పాపులారిటీని, మారుతున్న ట్రెండ్‍లనే కాదు గాయనీ గాయకులు, సంగీత దర్శకుల ప్రాధాన్యానికి కొలబద్దలా ఎదిగింది. కాబట్టి బినాకా గీత్ మాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన పాటలను విశ్లేషిస్తే 1953 నుండి 1963 నడుమ, అంటే ఒక దశాబ్దంలో హిందీ సినీ గీతం దిశను విశ్లేషించే వీలు కలుగుతుంది. ఈ విశ్లేషణలో లత, రఫీల పాటలను కేంద్రంగా తీసుకుంటే, రఫీతో కలసి పాడనన్న లత నిర్ణయం ఎంత అనాలోచితమో, ఆవేశంలో తీసుకున్నదో, ఆత్మహత్యా సదృశ్యమో అర్థమవుతుంది.

బినాకా గీత్ మాలా హిట్ పాటలు 1953-1963

మొత్తం పాటలు లత రఫీ
సోలో యుగళ మొత్తం సోలో యుగళ మొత్తం
1953 12 4 4 8 0 0 0
1954 16 3 2 5 2 1 3
1955 16 5 1 6 3 1 4
1956 16 3 2 5 1 3 4
1957 34 4 5 9 6 6 12
1958 32 10 3 13 5 5 10
1959 32 5 4 9 5 4 9
1960 32 9 2 11 7 1 8
1961 32 5 10 15 6 6 12
1962 32 9 4 13 8 5 13
1963 32 7 8 15 6 10 16

లోతుల్లోకి వెళ్ళకుండా పైపైన చూస్తేనే 1953 నుండి 1963 వచ్చేసరికి మహమ్మద్ రఫీ నెమ్మదిగా లతతో సమానమవటం, లతను దాటటం కనిపిస్తుంది. బినాకా గీత మాలలో లత పాటలలో సోలో పాటలు అధికంగా హిట్ అవటం కనిపిస్తుంది. అదే రఫీ పాటలను గమనిస్తే సోలోలు, యుగళ గీతాలు సమానంగా ఉండటం కనిపిస్తుంది. అంటే రఫీ కెరీరు ఆరంభంలో సోలోల కన్నా యుగళ గీతాలు అధికంగా పాడినా, రాను రాను రఫీ సోలోలు యుగళ గీతాల కన్నా అధికం అవటం, అవి హిట్ అవటం కనిపిస్తుంది. అంటే లత, రఫీతో పాడను అన్నప్పుడు రఫీ యుగళ గీతాల మీద కన్నా సోలో గీతాలతో అధికంగా హిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటున్నాడు. ఇంకాస్త లోతుకు వెళ్ళి చూస్తే విషయం మరింత స్పష్టమవుతుంది.

బినాకా గీత్ మాలాలో లత రఫీల యుగళ గీతాలు 1953- 63

లత యుగళ గీతాలు రఫీ యుగళ గీతాలు
మొత్తం ఇతరులతో  రఫీతో ఇతరులతో మొత్తం
1953 4 4 0 0 0
1954 2 1 1 0 1
1955 1 1 0 1 1
1956 2 2 0 3 3
1957 5 3 2 4 6
1958 3 2 1 4 5
1959 4 4 0 4 4
1960 2 2 0 1 1
1961 10 5 5 1 6
1962 4 2 2 3 5
1963 8 0 8 2 10
ముబారక్ బేగం, జైకిషన్, రఫీ…. ముఝ్ కో అప్నే గలే లగాలో

1963లో లత, మహమ్మద్ రఫీతో కలసి యుగళ గీతాలు పాడనని అన్నప్పుడు బినాకా గీత్ మాలాలో లత పాడిన 15 పాటలలో 8 యుగళ గీతాలు. ఆ ఎనిమిది గీతాలూ కూడా పాడింది రఫీ తోనే! అప్పటికే ‘రాయల్టీ’ వివాదం వల్ల కొత్త కొత్త గాయనిలతో పాడించేందుకు నిర్మాతలు సంగీత దర్శకులపై ఒత్తిడి తేవడంతో కొత్త స్వరాలు హిందీ సినీ గేయ ప్రపంచంలో వినిపించడం ఆరంభయింది. మహమ్మద్ రఫీతో ముబారక్ బేగమ్ ‘హమ్ రాహీ’ సినిమాలో పాడిన ‘ముఝ్‌కో అపనే గలే లగాలో’ సూపర్ హిట్ అయింది. ‘1963’ బినాకా గీత్ మాలాలో 7వ స్థానంలో ఉంది ఈ పాట. 1963లో మొదటి స్థానంలో లత రఫీల పాట ‘జో వాదా కియా వో  నిభానా పడేగా’ (తాజ్‍మహల్) నెంబర్ వన్ స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో రఫీ, సుమన్ కళ్యాణ్‌పూర్‍లు పాడిన ‘దిల్ ఏక్ మందిర్ హై’ పాట ఉంది. అంటే, ‘లత రఫీతో పాడను’ అనే కన్నా ముందే లతకు ప్రత్యామ్నాయంగా ఇతర గాయనిలను రఫీతో పాడించే ప్రయోగాలు ప్రారంభమైపోయాయన్న మాట. గాయని ఎలాంటిదైనా ఆమెకు ప్రోత్సాహమిస్తూ, తాను పాటను గొప్పగా పాడుతూ యుగళగీతం అత్యున్నత స్థాయిలో నిలబడేట్టు పాడడం రఫీకి మొదటినుంచి అలవాటు. దాంతో లత, రఫీలు కలిసి పాడటం మానే కన్నా ముందు నుంచే లత బదులు నూతన గాయనిలతో రఫీ యుగళ గీతాలు పాడి పాటను హిట్‍గా నిలపటం ప్రారంభమయి పోయింది. ఎస్డీ బర్మన్ సైతం లతకు ప్రత్యామ్నాయంగా సుమన్ స్వరాన్ని ‘న తుమ్ హమె జానో’ పాటలో వాడి హిట్ పాటను రూపొందించటంతో లత  అంత నాణ్యమైన స్వరం కాకపోయినా లతకు ప్రత్యామ్నాయం లభించిన భావన సంగీత దర్శకులలో కలిగింది.   లత రఫీతో పాడకపోతే ఆశా భోస్లే రఫీతో పాడేందుకు సిద్ధంగా ఉంది. అప్పటికే ఆశా, రఫీలు ఓ దశాబ్దంగా యుగళ గీతాలు పాడుతూ వచ్చారు. ఓపి నయ్యర్ సంగీత దర్శకత్వంలో ఆశా, రఫీల యుగళ గీతాలు అత్యుత్తమ స్థాయిలో ఉండి శ్రోతలను అలరించాయి. దాంతో రఫీ, ఆశాల జోడీ హిట్ యుగళ గీతాలు పాడటం అలవాటైన జోడీగా స్థిరపడింది. ముబారక్ బేగమ్, కమల్ బారోత్ వంటి గాయనిలతో కూడా రఫీ హిట్ గీతాలు పాడేడు. లతకు ప్రత్యామ్నాయంగా సుమన్ కళ్యాణ్‌పూర్ ఉండనే ఉంది. అందువల్ల రపీతో లత పాడకపోతే ఎవరితో పాడించాలన్న పెద్ద సమస్య కాలేదు. పైగా హీరోలంతా రఫీ స్వరమే కావాలని పట్టుపడుతూండటంతో హీరోలకు రఫీ స్వరం వాడక తప్పదు. లత రఫీతో పాడదు కాబట్టి వేరే గాయనితో పాడించక తప్పదు.

లతతో యుగళ గీతం   ఎవరితో పాడించాలన్నది పెద్ద సమస్య అయింది. ఎందుకంటే లత, రఫీలు ఒకరితో ఒకరు పోటీ పడి పాడుతూ పాటను ఉచ్చస్థాయిలో నిలుపుతారు. అలా లతతో పోటీ పడి పాడే మరో గాయకుడు లేని లోటు స్పష్టంగా తెలియసాగింది. కిషోర్ కుమార్ ఇతరుల పాటలు పాడడు. ముకేష్ స్వరం అందరు హీరోలకు నప్పదు. మన్నాడే స్వరం కూడా అంతే. ఆ కాలంలో ఎలాగైతే లతలా పాడే సుమన్ కళ్యాణ్‌పూర్ సినీ రంగంలో అడుగు పెట్టిందో, అలా రఫీలా పాడే మహేంద్ర కపూర్ కూడా సినీ రంగంలో ప్రవేశించాడు.

మహేంద్ర కపూర్ రఫీకి శిష్యుడు. రఫీలానే పాడే ప్రయత్నం చేస్తాడు. కానీ రఫీ స్వరంలో ఉన్న మాధుర్యం, మార్దవం, హీరోకి తగ్గట్టు పాడే లక్షణం మహేంద్ర కపూర్ స్వరంలో లోపించింది. అందువల్ల రఫీకి ప్రత్యామ్నాయంగా మహేంద్ర కపూర్‍ స్వరాన్ని వాడినా; రఫీ, లతల యుగళ గీతాల స్థాయిని లత, మహేంద్ర కపూర్‍ల యుగళ గీతాలు అందుకోలేవన్నది స్పష్టం. అయినా సరే తప్పని పరిస్థితులలో మహేంద్ర కపూర్ లతల యుగళ గీతాలు రూపొందేయి. అప్పటికే పలువురు రఫీకి ప్రత్యామ్నాయంగా మహేంద్ర కపూర్‍ని వాడటం ప్రారంభించారు. రఫీ పాట పాడే పద్ధతి నచ్చని వారు రఫీని తొలగించి మహేంద్ర కపూర్‍తో పాడించటం అప్పటికే జరుగుతూ వచ్చింది.

బి. ఆర్. చోప్రా నిర్మిస్తున్న ఓ సినిమాలో రఫీ, మహేంద్ర కపూర్లతో ఓ యుగళ గీతం పాడించాలని బి. ఆర్. చోప్రా నిర్ణయించాడు. కానీ మహేంద్ర కపూర్, రఫీల నడుమ కలసి యుగళ గీతం పాడవద్దన్న ఒప్పందం ఉంది. దాంతో బి.ఆర్. చోప్రా ప్రతిపాదనను రఫీ తిరస్కరించాడు. దాంతో కోపం వచ్చిన బి.ఆర్. చోప్రా తాను నిర్మించే సినిమాల్లో రఫీతో పాడించకూడదని నిశ్చయించాడు. ‘నయాదౌర్’, ‘సాధన’ వంటి సినిమాల్లో బి.ఆర్. చోప్రాకు రఫీ హిట్ పాటలు పాడేడు. ‘ధూల్ కా పూల్’ సినిమాలో ‘తూహింద్ బనేగా న’ అన్న పరమాద్భుతమైన పాటను పాడేడు. కానీ వాటినేవీ బి.ఆర్ చోప్రా పట్టించుకోలేదు. ‘ధూల్ కా పూల్’ లో మిగతా పాటలన్నీ మహేంద్ర కపూర్‍తోనే పాడించాడు. అలాగే సి. రామచంద్ర ‘నవరంగ్’, ‘స్త్రీ’ వంటి సినిమాలతో సహా పలు సినిమాలలో మహేంద్ర కపూర్‍తో పాడించాడు. ఈ రకంగా మహేంద్ర కపూర్ రఫీ నచ్చని వారికి, రఫీని మెచ్చని వారికి ప్రత్యామ్నాయంగా నిలవటంతో రఫీ బదులు లతతో పాడేందుకు మహేంద్ర కపూర్‍తో పాడించారు. కానీ లత, మహేంద్ర కపూర్‍ల పాటలు బాగున్నా రఫీ, లతల పాటల స్థాయిలో లేవు. అంటే లత రఫీతో పాడకూడదన్న నిర్ణయం తీసుకోవటం వల్ల లత, రఫీలిద్దరికీ నష్టం జరిగినా, రఫీ కన్నా అధికంగా నష్టం లతకే జరిగింది. ఈ విషయం 1960 నుంచి 1968 నడుమ లత రఫీలు పాడిన సోలో పాటలు, యుగళ గీతాల గణాంక వివరాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది.

లత రఫీ
సోలో యుగళ మొత్తం రఫీతో సోలో యుగళ మొత్తం
1960 102 64 166 30 98 95 193
1961 88 64 152 24 57 44 101
1962 84 45 129 20 64 45 109
1963 62 49 111 24 88 50 138
1964 91 42 133 6 117 43 160
1965 71 20 91 0 103 41 144
1966 110 23 133 5 94 55 149
1967 67 39 106 12 81 29 110
1968 59 25 84 13 74 17 91
1969 67 30 97 22 94 44 138

1960-69 నడుమ లత రఫీల పాటలను గమనిస్తే, లత కన్నా సంఖ్యలో రఫీ అధికంగా పాడటం తెలుస్తుంది. అంతేకాదు 1949 తరువాత 1965లోనే లత సంవత్సరానికి వందకన్నా తక్కువ సంఖ్యలో పాటలు పాడటం కనిపిస్తుంది. అదే సమయానికి రఫీ సోలోలు, యుగళ గీతాలు అధిక సంఖ్యలో పాడుతూ, పాటల సంఖ్యలో లతను దాటిపోవటం తెలుస్తుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే, రఫీ పాటలలో యుగళ గీతాల సంఖ్య కూడ గణనీయంగా తగ్గటం తెలుస్తుంది. కానీ రఫీతో పాడకపోవటం వల్ల, లత అధికంగా నష్టపోవటం స్పష్టంగా తెలుస్తుంది. అనేక సినిమాల్లో సంగీత దర్శకులు యుగళ గీతాలు లేకుండా సినిమా స్ర్కిప్టును రూపొందించడం కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక యుగళ గీతం మొక్కుబడిగా ఉంచేరు అనేకులు. లత పాడే పాటలు గణనీయంగా తగ్గిపోవటం 1960 నుండి 1969 నడుమ లత పాటల గణాంక వివరాలు మరింత స్పష్టం చేస్తాయి.

1960 నుండి 1969 నడుమ లత పాటల వివరాలు

సంవత్సరం మొత్తం సినిమాల సంఖ్య పాటల సంఖ్య లత పాడిన సినిమాల సంఖ్య లత పాటల సంఖ్య లత పాటల శాతం
1960 111 852 48 166 19.50%
1961 104 757 44 152 20%
1962 93 613 40 129 21%
1963 89 580 37 111 19%
1964 99 671 46 133 19.80%
1965 91 653 42 91 14%
1966 103 661 49 133 20.10%
1967 83 538 44 106 19.70%
1968 72 458 33 84 18.30%
1969 98 785 43 97 12.30%

పై గణాంక వివరాలను పరిశీలిస్తే లత పాటల శాతం నెమ్మదిగా తగ్గటం తెలుస్తుంది. అంతేకాదు, లత సినీ గీత ప్రపంచంపై పట్టు సాధించింది, కొత్త స్వరాలను రానివ్వలేదు, చక్కటి స్వరాల గాయనిలను అణగద్రొక్కింది, వారికి అవకాశాలను రానివ్వలేదు అని ఆరోపించేవారు పై గణాంక వివరాలను మరోసారి పరిశీలించాల్సి ఉంటుంది. మొత్తం సినిమాలలో సంవత్సరం పాటలలో లత పాటల శాతం, ఆమె ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇరవై శాతం దాటలేదు. రఫీతో పాడనన్న తరువాత ఆమె పాటల శాతం గణనీయంగా తగ్గింది. అంటే, తనను కాక వేరే గాయనిలతో పాడిస్తే, లత కుట్రలు,  రాజకీయాలు చేసి, మరోసారి ఆ గాయనితో పాట పాడించకుండా చూసేది అనీ, లత వల్ల తమ కెరీర్లు పాడయి పోయాయి అని చేసే ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని ఈ గణాంక వివరాలు నిరూపిస్తాయి. లత పాడననగానే ఇతర గాయనిల వైపు మళ్ళారు నిర్మాతలు, సంగీత దర్శకులు. రఫీతో పాడననగానే, రఫీతో ఇతర గాయనిలు పాడేరు. అంతే తప్ప ఎవ్వరూ లత ముందు మోకరిల్లి ‘నువ్వే  దిక్కు’ అనలేదు. ఇలాంటి ఆరోపణలు, దూషణలు తమ పరాజయానికి మరొకరిని దోషిగా చూపటం తప్ప మరేమీ కాదు.

1949లో బర్సాత్ నుంచి లత లేనిదే తమ పాట లేనట్టు ఒక్కో సినిమాలో పది పాటలుంటే పది పాటలూ లతతోనే పాడించిన శంకర్ జైకిషన్ కూడా 1960 దశకం వచ్చేసరికి లతను దాటి ఇతర గాయనిల వైపు దృష్టి సారించటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆశా భోస్లేను వాడుతూ కూడా ఇతర గాయనిలను ప్రయోగాత్మకంగా వాడటం కనిపిస్తుంది.

1960లో విడుదలైన ‘కాలేజ్ గర్ల్’ సినిమాలోని ఏడు పాటలలో రఫీ రెండు, లత ఒక పాట సోలోలు పాడేరు. ఇద్దరూ నాలుగు యుగళ గీతాలు పాడేరు. ‘దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయా’ లోని ఏడు పాటలలో అయిదు పాటలు లత పాడింది. ఒక పాట రఫీ, మరో పాట ఆశా పాడింది. ‘ఫూల్ ఔర్ కాంటే’లో లత, రఫీ, ముకేష్‍లు చెరో రెండు పాటలు పాడేరు. లత ముకేష్‍తో రెండు, తలత్‌తో ఒకటి యుగళ గీతాలు పాడింది. ‘సింగపూర్’ సినిమాలో లత రఫీలు మూడు యుగళ గీతాలు పాడేరు. రఫీ, ముకేష్‍లు చెరో సోలోలు పాడగా లత మూడు సోలోలు పాడింది. అంటే లత పాట తప్ప మరొకరి పాటను ఒప్పుకోని శంకర్ జైకిషన్ సినిమాలో లత పాటల కన్నా గాయకుల పాటలకు ప్రాధాన్యం ఇవ్వటం, లతతో యుగళ గీతాలు అధికంగా పాడించటం, వీలున్నప్పుడు ఇతర గాయనిలతో పాడించటం ఆరంభమయిందన్న మాట. ‘బాయ్ ఫ్రెండ్’ సినిమాలోని ఎనిమిది పాటలలో లత పాట ఒకటే. రఫీతో ‘ఐగో ఐగో’ అనే యుగళ గీతం ఆర్తీ ముఖర్జీ పాడింది. ‘క్రోర్‌పతి’ సినిమాలోని తొమ్మిది పాటలలో ఆశాతో ఒక సోలో, రెండు డ్యూయెట్లు పాడించారు శంకర్ జైకిషన్. ‘ససురాల్’ సినిమాలో లతది ఒక సోలో, మూడు యుగళ గీతాలు ఉన్నాయి. మూడు యుగళ గీతాల్లో రెండు రఫీతో. ఈ సినిమాలో రఫీ పాట ‘తెరీ ప్యారీ  ప్యారీ సూరత్ కో’ సూపర్ డూపర్ హిట్‍గా నిలిచి 1960 దశకంలో శంకర్ జైకిషన్ ఆధిక్యాన్ని స్పష్టం చేసింది. 1950 దశకంలో సూపర్ హిట్ పాటలలో హిందీ పాటల ట్రెండ్‍ను మార్చిన శంకర్ జైకిషన్, 1960 దశకంలో ఎంతటి ఆధిక్యం సంపాదించారంటే సినిమాకి శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారని తెలియగానే పెట్టుబడి పెట్టేవారు పెట్టుబడి పెట్టేందుకు క్యూలో నుంచునేవారు. సినిమా పోస్టర్లపై సంగీత దర్శకత్వం శంకర్ జైకిషన్ అని పెద్దగా వేసేవారు. ప్రపంచ వ్యాప్తంగా శంకర్ జైకిషన్ ఫాన్ క్లబ్బులు వెలిశాయి. ఈనాటికి కూడా ఇతర ఏ కళాకారుడికీ లేని విధంగా శంకర్ జైకిషన్‌ ఫాన్స్ క్లబ్‍లున్నాయి. వీరు శంకర్ జైకిషన్ పాటలను విశ్లేషిస్తూ ఆనందం పొందుతున్నారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో శంకర్ జైకిషన్ సాధించినంత ఆధిక్యం మరే సంగీత దర్శకుడు సాధించలేదు. బప్పీ లహరి, నదీమ్ శ్రావణ్, ఇళయరాజా, ఎ.ఆర్. రహమాన్‍లు కూడా పాపులారిటీలో శంకర్ జైకిషన్ స్థాయి చేరుకోలేదనటం అనృతం కాదు. నటీనటులకు తన పాటలతో ప్రత్యేక ఇమేజీ నివ్వటం దగ్గర నుంచి, తన  పాటలతో నటీనటుల కెరీర్లను తీర్చిదిద్దటం ఒక్క శంకర్ జైకిషన్‍కే సాధ్యమయింది. 1950 నుండి 1960 వరకూ శంకర్ జైకిషన్ రూపొందించిన 359 పాటలలో 159 పాటలు లతతోనే పాడించిన శంకర్ జైకిషన్ 1960 దశకంలో లత వాడకం తగ్గించి ఇతర గాయనిల వైపు మళ్ళటం స్పష్టంగా తెలుస్తుంది. అంటే లతా మంగేష్కర్ రఫీతో కలసి పాడకూడదన్న నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు నిర్మాతలు, సంగీత దర్శకులు లతకు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారన్న మాట. లతను కాక ఇతర గాయనిల స్వరాలు వాడేందుకు ప్రయత్నాలు ఆరంభించారన్నమాట. ఇదే సమయానికి లత కూడా కొన్ని నెలలు పాటలు పాడలేని పరిస్థితి వచ్చింది. ఇందుకు పలు కారణాలు చెప్తారు.

అధిక సంఖ్యలో పాటలు పాడటం వల్ల లత స్వరం దెబ్బతిన్నదనీ, స్వరంలో సన్నని జీర వస్తోందని, ఆమె స్వరం కోలుకోవాలంటే కొన్నాళ్ళు ఆమె పాట, మాటల్లేకుండా స్వరానికి విశ్రాంతి నివ్వాలని సూచించారని, అందుకని కొన్ని నెలలు పాటలు పాడలేదని అంటారు. ఈ సమయంలో ఒక్క హేమంత్ కుమార్ ఆమె కోసం ఎదురు చూశాడు. మళ్ళీ లత పాడటం ఆరంభించిన తరువాత మొదటగా, హేమంత్ కుమార్ పాట ‘కహీ  దీప్ జలే కహీ   దిల్’ పాడింది లత.

మరో కథనం ప్రకారం, లతపై విష ప్రయోగం జరిగింది. ఫలితంగా ఆమెకు కదలటం కూడా కష్టమై పోయింది. చివరికి విష ప్రయోగం జరిగిందని నిర్థారణ అయ్యేసరికి ఆమె వంటవాడు అదృశ్యమై పోయాడు. ఈ విష ప్రయోగం నుంచి తేరుకునే సరికి మూడు నాలుగు నెలలు పట్టింది. ఈ సమయంలో మజ్రూహ్ సుల్తాన్‌పురి ప్రతి సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి ఆమెకు ధైర్యం చెప్పేవాడు. కోలుకున్న తరువాత ఆమె హేమంత్ కుమార్ పాట పాడింది.

లత సైతం విష ప్రయోగం కథను పలుమార్లు ప్రస్తావించింది. ఆశా బోస్లే లత స్వరానికి విశ్రాంతి కథనాన్ని పలుమార్లు చెప్పింది. ఇందులో ఒకటే నిజమా, రెండూ నిజాలా అన్న మీమాంస పక్కన పెడితే 1962 సంవత్సరంలో లత కొన్ని నెలలు పాటలు పాడలేదన్నది నిజం. ఈ సమయంలో సంగీత దర్శకులు, నిర్మాతలు ఇతర గాయనిలతో పాటలు పాడించేరన్నది నిజం. కాబట్టి లత సినీ సంగీత ప్రరిశ్రమపై పట్టు బిగించి, ఇతరుల కెరీర్లను నాశనం చేసిందన్నది కట్టు కథనం. అసూయతో చేసిన ఆరోపణలు, చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు తప్ప మరేమీ కావన్నది స్పష్టం. ఎందుకంటే, ఆమె కెరీరునే ఆమె నియంత్రించలేకపోయింది. తనకు విధేయులుగా భావించిన సంగీత దర్శకులు, తన స్వరం ఆధారంగా పైకి ఎగబ్రాకిన సంగీత దర్శకులు కూడా ఇతరులతో పాడించేందుకు ముందుకు దూకటాన్ని ఆమె నిరోధించలేకపోయింది. ఈ సమయంలో సుమన్ కళ్యాణ్‌పూర్‍కు అధిక ప్రాధాన్యం లభించింది. ఆశా భోస్లే ముందుకు దూసుకుపోయింది. అందుకని కూడా లత, అవకాశం దొరకగానే ఎస్డీ బర్మన్‍కు పాటలు పాడేందుకు ఒప్పుకుంది. ఇంతలో రఫీతో పాడనంది.

ఈ నేఫథ్యంలో చూస్తే రఫీతో పాడకపోవటం, అదీ సినీ సంగీత స్వరూపం మారుతూ కొత్త గాయనీ గాయకులు రంగప్రవేశం చేస్తూ, తమదైన ప్రత్యేక ముద్రను పాటలపై వేస్తున్న సమయంలో, ప్రధాన గాయకుడైన రఫీతో పాడననటం ఆత్మహత్యా సదృశం కాక మరేమిటి? లతకు ఏనాడూ తన కెరీర్ ఏమవుతుందోనన్న స్పృహ లేదు. ఆమెకు తెలుసు తన స్వరం విశిష్టమైనదని. ఇతరులు ఎంత ప్రయత్నించినా తన స్థాయిని అందుకోలేదన్నదీ లతకు తెలుసు. అదే ఆమె ధీమా. ఎన్నడూ ఎవరినో దాటిపోవాలని, ఎవరినో అణచి వేయాలన్న ఆలోచన ఆమెకు లేదు. ఆమె స్వరం ఆమె ఆయుధం. మనసుకు నచ్చినట్టు చేస్తుంది అంతే!

రఫీ, సుమన్

లత రఫీతో కలసి పాడననటం సంగీత దర్శకులకు ఒక విషమ పరీక్షలాంటి స్థితిని కల్పించింది. యుగళ గీతం సందర్భం వస్తే ఎవరితో పాడించాలన్నది సమస్య. రాజ్‌కపూర్ సినిమాలకీ సమస్య రాలేదు. ఎందుకంటే రాజ్‌కపూర్ కు ముకేష్ పాడతాడు. ముకేష్ తో యుగళ గీతం లత పాడుతుంది. సమస్య లేదు. ఉజాలా సినిమాలో శమ్మీ కపూర్ హీరో. అప్పటికి అతడికి గొప్ప ఇమేజీలేదు. దాంతో ఒక యుగళ గీతం ముకేష్ తో, మరో యుగళ గీతం మన్నా డే తో పాడించారు. జాన్‌వర్ సినిమా వచ్చేటప్పటికి షమ్మీ కపూర్ కు జంగ్లీ ఇమేజీ వచ్చేసింది. అందుకని సినిమాలో వున్న ఒక యుగళ గీతం, రఫీతో ఆశా పాడింది.  మరో యుగళ గీతం ఆంఖో ఆంఖోమే పాటలో లతా, ఆశాలతో మన్నాడే పాడేడు. శమ్మీ మారు వేషంలో వుంటాడు కాబట్టి మన్నా పాడినా ఆమోదించారు ప్రేక్షకులు. ఆయీ మిలన్ కీ బేలా సినిమాలో ఒక యుగళ గీతం రఫీతో లత పాడింది. తరువాత రఫీతో పాడనంది. రాజేంద్ర కుమార్ తనకు రఫీ స్వరమే కావాలంటాడు. అందుకని, రెండో యుగళ గీతం ఆశా పాడింది. సూరజ్ సినిమాలో రెండు యుగళ గీతాలున్నాయి. ఒకటి రఫీతో ఆశా పాడితే, ఇంకోటి సుమన్ కళ్యాణ్‌పుర్ పాడింది. బ్రహ్మచారి సినిమాలో ఒకే యుగళ గీతం. అదీ, సుమన్ పాడింది. రాజ్‌కుమార్ సినిమాలో శమీకపూర్ కు రఫీ, సాధనా కు లతా పాడేరు. కానీ, యుగళ గీతాల ప్రసక్తి వచ్చేసరికి, ఒక యుగళగీతం రఫీతో ఆశా పాడితే, మరో యుగళ గీతం సుమన్ పాడింది. ఇలా పరిశీలిస్తూ పోతే, హీరో డిమాండ్ ని అనుసరించి రఫీతో పాడించాలా, లతాతో పాడించాలా, అని సంగీత దర్శకులు నిర్ణయించేవారు.
లక్ష్మీకాంత్-ప్యారేలాల్ జంటకు రఫీ దేవుడయితే, లత దేవత. ఇద్దరినీ కాదనలేరు. అందుకని, వారు హీరోకు సోలోలు రఫీతో పాడించేవారు. యుగళ గీతం ప్రసక్తి వచ్చేసరికి మహేంద్రకపూర్ తో లతకు జోడీగా పాడించేవారు. ఆయే దిన్ బహార్ కే సినిమాలో పాటలన్నీ రఫీ పాడతాడు. యే కలీ జబ్ తలక్ అన్న యుగళ గీతానికి మాత్రం ధర్మేంద్రకు మహేంద్ర కపూర్ పాడతాడు. సంగీత దర్శకుడు రవి కూడా సమస్యను ఇలాగే పరిష్కరించాడు. భరోసా సినిమాలో గురుదత్ పాటలన్నీ రఫీ పాడేడు. యుగళ గీతం మాత్రం లతతో మహేంద్ర కపూర్ పాడేడు. ఇలా ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవటం నచ్చక కొన్ని సినిమాల్లో యుగళ గీతాలే వుంచలేదు. అయితే, రఫీ, లతాలు కలసి పాడకపోవటం వల్ల మహేంద్ర కపూర్, సుమన్ లతో పాటూ ముకేష్ కూడా లాభపడ్డాడు. నటుడయిపోవాలన్న ప్రయత్నంలో పాటల కెరీరును కూడా కోల్పోయిన ముకేష్, వీరిద్దరి గొడవ వల్ల, లతాకు ఇష్టుడయి, వివాద రహితుడవటం వల్ల, ఈ సమయంలో లతతో అధికంగా యుగళ గీతాలు పాడేడు. ఈ రకంగా రాయల్టీ వివాదంవల్ల లత, రఫీలతో సహా సినీ సంగీత ప్రపంచం అల్లకల్లోలం అయింది.

హీరోల యుగం తీవ్రమవటంతో హిందీ సినిమాలలో గాయకుల ప్రాధాన్యం హెచ్చుతూ, నాయికల పాటలు తగ్గుతూండగా రఫీతో పాడనని లత అనటంతో లత కెరీరు దెబ్బతినే పరిస్థితి వచ్చింది.ఇంతలో లత మరో ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. రాజ్ కపూర్ సినిమాలకు పాడకూడదని నిర్ణయించుకుంది.

‘సంగం’ సినిమాలో ‘మై కాకరూ రామ్ ముఝే బుడ్డా మిల్ గయా’ అనే పాటలో భావం అసభ్యంగా ఉందని ఆ పాటను పాడేందుకు నిరాకరించింది లత. కాని ఆ పాటలో పదాలు కానీ, భావం కానీ అసభ్యంగా లేవనీ, ఓ భార్య భర్తను ఆకర్షించేందుకు పాడుతున్న పాట అనీ, చిత్రీకరణ సభ్య పరిధులు దాటదని రాజ్ కపూర్ లతను పాట పాడేందుకు ఒప్పించాడు. లత పాట పాడింది. అద్భుతంగా పాడింది. పాట సూపర్ హిట్ అయింది. కానీ లత రాజ్ కపూర్ సినిమాలకు పాడనని ప్రకటించింది. ‘మై కాకరూ రామ్’ పాట ఓ వంక మాత్రమే అంటారు.

‘సంగం’ సినిమా సూపర్ హిట్ అయింది. పాటలు సినిమా విలువను పదింతలు చేశాయి. అయితే రాజ్ కపూర్ ఒప్పందం ప్రకారం లతకు ఇవ్వాల్సిన రాయల్టీ ఇవ్వలేదు. ఇది లతకు ఆగ్రహం కలిగించింది. అందుకని రాయల్టీగా రావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తే కానీ రాజ్ కపూర్‍ సినిమాలో పాటలు పాడకూడదని నిశ్చయించుకుంది లత. ఫలితం ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో ఒక్క లత పాట కూడా లేదు. ఆ సినిమా ఘోర పరాజయం పాలయింది. ఎంతగా అంటే రాజ్ కపూర్ ఉన్న ఆస్తి అంతా అమ్మినా తేరుకోలేని పరిస్థితి.

హం తుం ఎక్ కమ్రే మె బంద్ హో

సినీ పరిశ్రమలో రకరకాల నమ్మకాలుంటాయి. రాజ్ కపూర్ సూపర్ హిట్ సినిమా ‘బర్సాత్’ నుంచీ లత, రాజ్ కపూర్ సినిమాలలో పాటలు పాడుతోంది. సినిమాలు సూపర్ హిట్‌లు అవుతున్నాయి. ‘బూట్ పాలిష్’ సినిమాలో లత పాట లేకున్నా అది అంత ప్రధానమైన సినిమా కాదు. లత పాడని ‘మేరా నామ్ జోకర్’, ‘కల్ ఆజ్ ఔర్ కల్’ సినిమాలు విఫలమవటంతో రాజ్‍కపూర్‍కు తన సినిమాలు హిట్ కావాలంటే, లత పాట ఉండక తప్పదన్న నమ్మకం కలిగింది. అందుకని ‘బాబీ’ సినిమాలో లత పాట ఉండక తప్పదన్న నిర్ణయానికి వచ్చాడు. అయితే తనకు ఇవ్వాల్సిన రాయల్టీ బాకీలన్నీ చెల్లిస్తేనే పాడతానంది. అన్నీ చెల్లించాడు రాజ్‍కపూర్. అప్పుడే ‘బాబీ’ పాటలు పాడింది. అదీ ఎలా? పద్నాలుగేళ్ల ‘డింపుల్ కపాడియానే పాడిందా?’ అన్న భ్రమ కలిగించేంత అద్భుతంగా! బాబీ సూపర్ హిట్ అయింది. ట్రెండ్ సెట్టర్ అయింది.

జరిగిన పరిణామాలలో లత కావాలని చేసింది ఏమీలేదు. విధి అలా నడిపించింది. కానీ లత రాజ్‍కపూర్ మెడలు వంచిందని వ్యాఖ్యానిస్తారు. ‘బర్సాత్’లో అవకాశం ఇచ్చి  సూపర్ గాయనిగా ఎదిగే వీలు కల్పించిన రాజ్‍కపూర్ పట్ల కృతజ్ఞత ప్రదర్శించలేదని లతను దూషిస్తారు. ఇందులో ఆమె చేసిందేమీ లేదు. రాయల్టీ చెల్లించకపోతే పాడనంది. ‘మేరా నామ్ జోకర్’ విఫలం అవటంలో, ‘కల్ ఆజ్ ఔర్ కల్’ పరాజయం పొందటంలో లత ప్రమేయం లేదు. కానీ ‘బాబీ’ సినిమా సూపర్ హిట్ అవటంలో లత స్వర ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది. అంటే సమయం లత వైపు ఉందన్న మాట.  అంతే తప్ప, లత కుట్రలు కుతంత్రాలు చేసి రాజ్ కపూర్‍ను దెబ్బ తీయలేదు.

ఓ వైపు ‘సంగం’ తరువాత రాజ్‍ కపూర్‍కు పాడనన్న లత, అందరూ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకునే లోగా శంకర్ జైకిషన్‍తో వివాదానికి సిద్ధమయింది. ఆ కాలంలో అగ్రశేణి సంగీత దర్శకులు శంకర్ జైకిషన్‍లు. శంకర్ జైకిషన్‍ పాటలతో నిర్మాతలు, దర్శకులు, నటులు కెరీర్లు నిర్మించుకుంటున్నారు. పడిపోతున్న మనోజ్ కుమార్ కెరీర్‌కు నూతన జీవం ప్రసాదించింది ‘హరియాలీ ఔర్ రాస్తా’ సినిమా. ఈ సినిమాలో మనోజ్ కుమార్‍కు ముకేష్ స్వరం నిలిపారు శంకర్ జైకిషన్. ‘జంగ్లీ’ ద్వారా సైరా బాను, ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ ద్వారా ఆశా ఫరేఖ్, ‘లవ్ ఇన్ టోక్యో’ ద్వారా జాయ్ ముఖర్జీ,  ‘ఏప్రిల్ ఫూల్’ ద్వారా బిస్వజీత్, ‘ఆస్ కా పంఛీ’ ద్వారా రాజేంద్ర కుమార్  , గుంనాం సినిమాలో హం కాలే హై తో క్యా హువా పాట ద్వారామహమూద్ వంటి నటులకు, నాయికా నాయికలకు ప్రత్యేక ఇమేజ్‍ నిచ్చిన శంకర్ జైకిషన్‍లకు పాడకూడదని లత నిశ్చయించుకుంది.

ఓ వైపు రఫీతో యుగళ గీతాలు పాడటం లేదు. మరోవైపు ‘రాయల్టీ’ గొడవ వల్ల నిర్మాతలు లతతో పాడించడం తగ్గించారు. ఇతర గాయనిలు తెరపైకి వస్తున్నారు. రాజ్‍ కపూర్‌కూ పాడకూడదని నిశ్చయించుకుంది. ఇప్పుడు శంకర్ జైకిషన్‍లతో వివాదం! నిజానికి లత నెంబర్ వన్‍గా ఎదగటంలో 1950 దశకంలో ఓ వైపు సి. రామచంద్ర, మరోవైపు శంకర్ జైకిషన్‍లు లతతో వైవిధ్యభరితమైన పాటలు అధికంగా పాడించి ఎంతో తోడ్పడ్డారు. సి. రామచంద్రకు పాడటం 1956లోనే మానేసింది లత. కానీ శంకర్ జైకిషన్ ఆ లోటును భర్తీ చేశారు. ఇప్పుడు శంకర్ జైకిషన్‍కు పాటలు పాడకూడదని నిశ్చయించుకుంది లత. విశ్లేషించే వారికి లతకు సినీ పాటల ప్రపంచంలో ‘డెత్ విష్’ ఉందేమోననిపిస్తుంది. కెరీర్‍ను సవ్యంగా నిర్మించుకోవాలనుకునే వారి ప్రవర్తన ఇలా ఉండదు. నెంబర్ వన్ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాలని తపన పడుతూ కుట్రలు కుతంత్రాలు చేసేవారి ప్రవర్తన ఇలా ఉండదు. ఒకే సమయంలో అగ్రశ్రేణి సినీ నిర్మాతలతో వివాదం, అగ్రశేణి గాయకుడితో వివాదం, ఇప్పుడు అగ్రశ్రేణి సంగీత దర్శకులతో వివాదం….. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, తన ప్రతిభపైన విశ్వాసం ఉన్నవారు తప్ప కెరీరును, నెంబర్ వన్ ర్యాంకింగ్ లను పట్టుకుని వ్రేలాడేవారు ఇలా ప్రవర్తించరు. తన మనసుకు నచ్చినట్టు ప్రవర్తిస్తూ, నచ్చని వారితో పనిచేయడం మానేస్తూ, మనసులో మాటను నిర్భయంగా ప్రకటిస్తూ కెరీరును తృణప్రాయంగా భావిస్తూ కూడా సినీ రంగంలో ఆధిక్యం సాధించిన కళాకారులు ఇద్దరే ఇద్దరు. ఒకరు గేయ రచయిత సాహిర్ లూధియాన్వీ, రెండవది లతా మంగేష్కర్! వీరిద్దరికీ తేడాఅల్లా, సాహిర్ కొందరితోనే పనిచేస్తే, సినీ ప్రపంచమంతా, లత నియమ నిబంధలకు ఒప్పుకుని, లతతో పనిచేయటానికి తహ తహలాడింది.

లతా మంగేష్కర్‍కూ, శంకర్ జైకిషన్‍లకూ నడుమ వివాదానికి బీజం వేసింది రాజ్ కపూర్. నిజానికి రాజ్ కపూర్ కూడా తన చర్య వివాదానికి దారి తీస్తుందని కలలో కూడా ఊహించి ఉండడు. అప్పుడు సినీ రంగంలో నెలకొని ఉన్న పరిస్థితుల వల్ల కలిగిన ఒక చిన్న అపోహ లత, శంకర్ జైకిషన్‍ల నడుమ వివాదానికి కారణమవటమే కాదు, 1960 దశకం చివరలో సినీ సంగీత రూపకల్పన మరో మలుపు తిరగటానికి దారి తీసింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here