సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-26

1
11

[dropcap]సా[/dropcap]వన్ కె ఝూలే పడే , తుమ్ చలే ఆవో

‘జూర్మానా’ (1979) సినిమాకోసం  లతా మంగేష్కర్ పాడిన ఈ పాట సినిమాలో రెండుమార్లు వస్తుంది. మొదటిసారి నాయిక ఈ పాటను పర్వత ప్రాంతంలో నది ఒడ్డున తోటలో పాడుతుంది. ఇద్దరు నాయకులు నాయిక పాట విని పరవశులవుతారు. ఆ సమయంలో నాయికకు సంగీతం అంతగా రాదు. కానీ పాడాలన్న తపన ఉంటుంది. సినిమాలో ఇదే పాట రెండోసారి వచ్చేటప్పటికి నాయిక సంగీతంలో నిష్ణాతురాలవుతుంది. పరిణతి చెందుతుంది. నాయకుడితో ప్రేమ పెరుగుతుంది. గాయికగా స్థిరపడుతుంది. ఒకే పాట రెండు విభిన్న సందర్భాలలో వస్తుంది. కానీ సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ ఈ పాటను రెండు భిన్నమైన పాటలుగా ధ్వనించే రీతిలో రూపొందించాడు. రెండు పాటలూ ‘పహాడీ’ రాగంపై ఆధారపడినవే. రెండు పాటలలో రెండు చరణాలు అవే. కానీ పాట తాళంలో,  వాయిద్యాలు వాడిన విధానంలో స్వల్ప మార్పులు చేయటం వల్ల రెండు విభిన్నమైన పాటలలా ధ్వనిస్తాయి ఇవి.

సంగీతం తెలియనప్పుడు, కేవలం సంగీతంపై ఉత్సాహంతో మాత్రమే పాడిన పాట మంద్రగతిలో ఉంటుంది. పాటలో ఎలాంటి అలంకారాలుండవు. కేవలం చరణంలో రాగాలుంటాయి. కానీ ఆ రాగం తీయటంలో కూడా ఎలాంటి అలంకారాలుండవు. తాళం కూడా ‘విలంబిత్ లయ్’ లో ఉంటుంది. అంటే పాట వింటుంటే ఒక ప్రశాంత ప్రకృతి ఒడిలో, ఎలాంటి ఉద్విగ్నతలు, చీకూ చింతా లేకుండా ఒక పక్షి ఎలా స్వేచ్ఛగా పాడుతుందో అలా పాడుతుందన్న మాట నాయిక. ఇదే పాట రెండోసారి వచ్చేసరికి పాటలో వేగం పెరుగుతుంది. రూపక తాళంలో పహాడీ రాగంలో, పాట లయలో ఒక ఉద్విగ్నత, ఒక వేగం కనిస్తూంటాయి. ఇక అడుగడుగునా, ఆరంభం నుంచీ అలంకారాలుంటాయి. తబలా, వయోలిన్లు రెండు పాటల్లోనూ వాడినా, రెండు పాటల్లో అవి వేర్వేరుగా ధ్వనించి పాట రూపురేఖలను మార్చివేస్తాయి. అంటే సంగీత దర్శకుడు తాను చేయవలసినదంతా చేశాడు. ఇక ఆ పాటకు తన స్వరంతో జీవం పోసి, ప్రత్యేక వ్యక్తిత్వాన్నిచ్చే బాధ్యత గాయనిది. ఆ బాధ్యతను లత అత్యద్భుతంగా నిర్వహించింది. పాటను లత ఎంత గొప్పగా పాడిందంటే మొదటిసారి పాడుతున్నప్పుడు మన కళ్ళముందు సంగీతంలో అంతగా ప్రావీణ్యం లేని అపరిణత గాయని కనిపిస్తుంది. కళ్ళనిండా ఆశలు నింపుకుని బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటున్న యువతిని మనస్సు తెరపై నిలుపుతుంది లత స్వరం. ఎక్కడా ఎలాంటి అలంకారాలు లేకుండా ప్లెయిన్‍గా పాడుతుంది. కేవలం స్వరంలోని తీయదనంతో పాటను వినటాన్ని ఒక మరపురాని మధురమైన గీతంగా ఎదిగిస్తుంది. అదే లత, అదే స్వరం,  రెండోసారి పాటను పాడేప్పుడు భిన్నంగా ధ్వనిస్తుంది. ఈ పాటను నాయిక రేడియో స్టూడియోలో పాడుతుంది. ఇప్పుడు నాయికలో కొండలనుండి దూకి ప్రవహించే నది చంచలత్వం లేదు. మైదానంలో ప్రవహించే నిండు నది పరిణతి ఉంది. అది లత స్వరం ప్రదర్శిస్తుంది. ఇప్పుడు ఆమె సంగీతంలో నైపుణ్యం సంపాదించింది. కాబట్టి మొదటి పాటలోలా కేవలం పాడదు. పాటను అలంకారాలతో అందంగా తీర్చిదిద్దుతుంది. లత స్వరం ఇదంతా ప్రదర్శిస్తుంది. ఒక పనిలో నైపుణ్యం సంపాదించిన తరువాత, అదే పనిని ఏమీ రాని కొత్త దశలో చేసినట్టు చేయటం కష్టం. అలాంటి కష్టమైన పనిని అతి సులభంగా, అవలీలగా సాధించిన లత గాన ప్రతిభకు జోహార్లర్పించాలనిపిస్తుంది. హిందీ సినిమాలలో మెలోడీ కన్నా, డిషుం డిషుంలకే ప్రాధాన్యం పెరుగుతూ, సినిమాల్లో పాటల విలువ, నాణ్యత తగ్గుతున్న సమయంలో వచ్చిందీ పాట. సినిమాలలో పాటల ప్రాధాన్యం తగ్గి, సంగీతం స్థాయి దిగజారుతున్న తరుణంలో కూడా, హిమాలయంలా ఎవరికీ అందనంత ఎత్తులో నిలచి అత్యుత్తమ పాటలను పాడుతూ, ఉత్తమ నాణ్యతకు ఉత్కృష్టమయిన నిదర్శనంలా లత నిలవటానికి నిరూపణ, 1970 దశకంలో లత పాడిన ఇలాంటి అమూల్యము, అపురూపమయిన ఆణిముత్యాల్లాంటి పాటలు.

సినీ పరిశ్రమలో ఒక పద్ధతి ప్రకారం ఆర్డీ బర్మన్, తన తండ్రి ఎస్డీ బర్మన్‍కు భిన్నమైన ఇమేజీని సృష్టించుకున్నాడు. ఆశా భోస్లేతో కలసి పాశ్చాత్య సంగీత ఆధారిత పాటలకు, పలురకాల వాయిద్యాలతో వింత శబ్దాల కలయికతో సృజించే అత్యద్భుతమైన పాటల రూపకర్తగా తనకంటూ ప్రత్యేక ఇమేజీని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆర్డీ బర్మన్ అత్యద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శించిన పాటలలో తొంభై శాతం పాటలు పైగా లతా మంగేష్కర్ పాడినవే. ఇలాంటి శాస్త్రీయ సంగీత ఆధారంగా, పాశ్చాత్య బాణీల ప్రభావానికి దూరంగా ఆర్డీ బర్మన్ సృజించిన పాటలలోనే ఆర్డీ బర్మన్ ప్రతిభ, నైపుణ్యం, అతని సృజనాత్మక ఆత్మ కనిపిస్తాయి. అలాంటి పాటలలో అధిక శాతం పాటలు పాడేందుకు ఆర్డీ బర్మన్ లతనే ఎంచుకున్నాడు. ప్రతి పాటకు ప్రాణం పోసి, వాటికి ప్రత్యేకమైన అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఆపాదించి మాధురీ శిఖరాలను అధిరోహింప చేసింది లతా మంగేష్కర్.

‘ఘర్ ఆజా ఘిర్ ఆయీ’ (ఛోటా నవాబ్, 1961) తో  ఆరంభించి,  ‘రైన బీతి  జాయే, బడ నట్‌ఖట్  హై’ (అమర్ ప్రేమ్, 1972), ‘ఇస్ మోడ్ సే జాతే హై, తుమ్ ఆగయే హో’ (ఆంధీ, 1975), ‘కర్వటే  బదల్‍తే రహే’ (ఆప్కీ కసమ్, 1975), ‘మేరే నైనా సావన్ భాదో’ (మహబూబా, 1976),  మేరి ఆవాజ్ హీ పహెచాన్ హై(కినారా, 1977) , ‘బీతీనా బితాయీ రైనా’ (పరిచయ్, 1977), ‘ఆప్ కీ ఆంఖోమే కుఛ్, ఆజ్ కల్ పావ్ జమీన్ పర్’ (ఘర్, 1978), ‘సీలీ హవా ఛూగయీ’ (లిబాస్, 1988), ‘తుఝే సె నారాజ్ నహీ’ (మాసూమ్, 1983) – ఇలా ఒకదాన్ని మించి మరొకటిగా ఆర్డీ బర్మన్ లత కోసం ప్రత్యేకంగా పాటలను అత్యుత్తమ నాణ్యతతో రూపొందించాడు. అందుకే ఆశా పాటలలో వ్యాపారపరమైన ఆర్డీ కనిపిస్తే లత పాటల్లో ఆర్డీ సృజనాత్మక ధ్వనిస్తుందంటారు.

ఆర్డీ సైతం 1985, సెప్టెంబర్ 29లో Times of India కు ఇచ్చిన ఇంటర్వ్యూలో There is no doubt that Lataji is supreme. When she sings she forgets about herself, her home and there’s a complete change over of personality. Though she may not admit this, she becomes a mother, a sweet heart etc before the microphone” అన్నాడు. అంటే పాట పాడే సమయంలో లత తనని తాను మరచిపోయి తాను పాడుతున్న పాట అయిపోతుందన్నమాట. అందుకే ఇతరులు పాడే పాటలకు లేని వింత ఆకర్షణ, శక్తి లత పాటలలో కనిపిస్తాయి. అందుకే నాయిక వయసుతో సంబంధం లేకుండా, నాయిక రూపానికి తగ్గట్టు, హావభావాలతో సరిపోయే విధంగా లత స్వరం భావ ప్రకటన చేస్తూ శ్రోతలను, ప్రేక్షకులను మెప్పించింది. ఇతర గాయనిలను లతను వేరుచేసే ప్రధానాంశం ఇది. అందుకే ఎందరో ప్రతిభావంతులైన యువ గాయనిలు సినీ ప్రపంచంలో మరో లత అయిపోవాలని, సినీ నేపథ్యగాన ప్రపంచంలో మహారాణి అవుదామని అడుగిడిగున  వారు క్షణకాలం మెరిసి అదృశ్యమైపోయే మెరుపులా అదృశ్యమైపోయారు.

లతా మంగేష్కర్ సినీ సంగీత ప్రపంచంలో తన ఆధిక్యం నిరూపించుకుని, నెంబర్ వన్ గాయనిగా నిలచినప్పటి నుంచీ, సినీ ప్రపంచం ఆమెకు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతూనే ఉంది. ఏ యువ గాయని కాస్త మంచి స్వరంతో ఒక హిట్ పాట పాడినా, లతా మంగేష్కర్‍కు ప్రత్యామ్నాయం లభించిందని ప్రకటనలివ్వటం, సంబరాలు చేసుకోవటం, కొన్నాళ్ళకి ఆమె స్వరంలోని లోపాలు, పరిమితులు అర్థం కావటంతో మళ్ళీ లతను ఆశ్రయించటం జరుగుతూ వస్తోంది. దీనివల్ల ఎన్నో ఆశలు పెంచుకున్న యువ గాయనిలు ఆశాభంగం పొందటమే కాదు తమ పరాజయానికి కారణాలు విశ్లేషించి పరిమితులను అధిగమించే ప్రయత్నాలు చేసే బదులు, దోషం లతపై నెట్టేయటం ఆరంభించారు. ఎందుకంటే వీరి పరిమితులను గుర్తించిన తరువాత, సంగీత దర్శకులు వీరిని వదలి లతతో పాడించటంతో – లతా మంగేష్కర్ వారిని బెదరించిందని, అందుకని తను అవకాశాలు అడుగంటాయని వారు ఆరోపణలు చేసేవారు. అయితే డబ్బుమయం అయిన సినీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకే టేక్‍లో ఎలాంటి కఠినమైన పాటనైనా సులభంగా పాడి పాటకు ప్రత్యేక గుర్తింపు నిచ్చే గాయనినే ఇష్టపడతారు కానీ మరొకరిని ఇష్టపడరు. అలా మొండిగా మరొకరితో పాడించినా పాటల నాణ్యత తగ్గి, వారి సృజన దెబ్బతిని తమ స్థానాన్ని కోల్పోతారు. సి. రామచంద్ర నుంచీ ఇదే జరుగుతూ వస్తోంది. సి. రామచంద్రతో లత కలసి పనిచేయను అనగానే ఆయన ఆశా భోస్లేతో పాడించటం ప్రారంభించాడు. ఒకటి రెండు సినిమాల పాటలు హిట్ అయినా లతతో సాధించిన ఫలితం ఆశాతో లభించలేదు. చివరికి సి. రామచంద్ర సినీరంగం వదలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సినీ ప్రపంచానికి కావాల్సింది హిట్. అది ఎవరు ఇస్తే వారే ఆనాటికి దైవం.

లతతో ఒక్క పాట పాడించకుండా ఓ.పి. నయ్యర్ సినీ ప్రపంచంలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడయ్యాడు. లత తన సినిమాలకు పాటలు పాడవనసరం లేదని లత పాటలు లేకుండానే సినిమాలు నిర్మించి, అగ్రశ్రేణి నిర్మాతగా చలామణి అయ్యాడు బి.ఆర్. చోప్రా. యువ గాయనిల  అవసరం ఉందని ప్రకటించి లతతో పాడించటం 1970 దశకం మధ్య నుండి మానేసిన కళ్యాణ్‍జీ ఆనంద్ జీ అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా కొనసాగాడు. ఆరంభం నుంచి సంగీత దర్శకుడు ‘ఖయ్యం’ లతతో పాడించేందుకు ఇష్టపడలేదు. ‘ఆఖ్రీఖత్’ సినిమాలో ‘బహారోం మేరా జీవన్ భీ సవారో’ పాట హిట్ అవటంతో లతతో పాడించటం ఆరంభించాడు. కానీ, అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆశాతో కానీ, ఇతర గాయనిలతో కానీ పాడించేందుకే ఇష్టపడ్డాడు. కానీ, లత తనకు ఇష్టమయిన సంగీత దర్శకులలో ప్రధమంగా ఖయ్యాం పేరే చెప్తుంది. ఎందుకంటే ఆయన పాశ్చాత్య బాణీల ప్రలోభంలో పడకుండా శాస్త్రీయ రాగాలకే ప్రాధాన్యం ఇస్తాడు కాబట్టి.  ‘ఇక్బాల్ ఖురేషీ’ వంటి వారు లత కన్నా ఆశా భోస్లేతో పాడించేందుకే మొగ్గు చూపారు. జయదేవ్ కొత్త కొత్త స్వరాలకు  ప్రోత్సాహం ఇచ్చేవాడు. రవీంద్ర జైన్ అధికంగా హేమలతతో పాడించారు.  ఇలా చెప్తూ పోతే ఎందరో కళాకారులు లతను కాదని, ఇతర గాయనిలతో పాడించారు. వీరెవ్వరినీ లత ఏమీ చేయలేకపోయింది. వారెవ్వరి గురించీ లత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఏమాత్రం వైరి భావం ప్రదర్శించలేదు.  దీనర్థం ఏమిటంటే గొప్ప గాయనిలవుదామని వచ్చి విఫలమైన వారందరూ తమ వైఫల్యానికి బాధ్యత వహించే బదులు, లతపై నేరం నెట్టేయటం సులభంగా భావిస్తున్నారన్న మాట. లత అగ్ర స్థానంలో వుంది కాబట్టి ఆమెను విమర్శించటం  సులభం. ఇతరులు ఆ విమర్శలను నమ్మటమూ సులభమే.

1960 దశకం చివరనుంచీ ఉషా తిమోతీ, వాణీ జయరాం, సులక్షణ పండిత్, రూనా లైనా, కృష్ణ కళ్ళె, నాజియా హసన్  వంటి నూతన గాయనిలు ఆశలతో సినీ రంగంలో అడుగుపెట్టారు. వీరిలో ‘ఉషా తిమోతీ’ హైపిచ్‍లో సులభంగా పాడగలిగినా ఆమె స్వరం మెలికలు తిరగదు. భావ ప్రకటనలో బోలెడన్ని పరిమితులున్నాయి. దాంతో కళ్యాణ్‍జీ ఆనంద్‌జీ ఎంతగా ప్రోత్సాహించినా ఆమె సినీ ప్రపంచంలో నిలదొక్కుకోలేకపోయింది. మహమద్ రఫీ చేసిన విదేశీ పర్యటనలలో సహా గాయనిలుగా ఉషా, కృష్ణ కళ్ళె వంటి గాయనిలను వెంట తీసుకెళ్ళి ఎంతో ప్రోత్సహించాడు. కానీ వారి స్వరాలకు బోలెడు పరిమితులున్నాయి. ఆ పరిమితులను వారు అధిగమించే ప్రయత్నాలు కూడా చేయలేదు. కొన్ని పాటలు హిట్ అవగానే, అందరూ లతకు ప్రత్యామ్నాయం దొరికిందని వ్యాఖ్యానించగానే, అదే నిజమని భ్రమించారు. ఫలితంగా ఎదుగుదల ఆగిపోయింది.

“కొత్తగా సినీరంగంలో పాటలు పాడేందుకు వస్తున్న వారంతా మరో లతా మంగేష్కర్ అయిపోవాలన్న ఆశతో వస్తున్నారు. కానీ వారు రెండు విషయాలు మరచిపోతున్నారు. లతా మంగేష్కర్, లతా మంగేష్కర్‍గా గుర్తింపు పొందటానికి ఎంత కష్టపడిందో , దాని వెనుక ఎన్ని తిరస్కారాలు, ఎన్ని అవమానాలు, ఎంత శ్రమ, ఎంత సాధన, ఎంత పట్టుదలలు ఉన్నాయో వారు తెలుసుకోరు. రెండవ విషయం ఏమిటంటే, ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినలే. అనుకరణ అనుకరణే. కాబట్టి మరో లత అవ్వాలన్న ఆలోచనే పొరపాటు. ఆ పొరపాటు ఆలోచన స్వంత వ్యక్తిత్వం ఏర్పాటు చేసుకోవటంతో ప్రతిబంధకం అవుతోంది” అని వ్యాఖ్యానించింది లత, యువగాయనిల గురించి.

వాణీ జయరాం తను పాడిన తొలి హిందీ పాట ‘బోలెరే బప్పీహరా’, ‘గుడ్డి’ సినిమాలో జయాభాదురికి పాడింది. పాట సూపర్ హిట్ అయింది. వెంట వెంటనే పెద్ద సంగీత దర్శకుల నుంచి ఆఫర్లు వచ్చాయి. మదన్ మోహన్‍కు పాడింది. ఇంతలో ‘మీరా’ సినిమాలో పండిత రవిశంకర్ సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం లభించింది.

‘మీరా’ సినిమా  ఆరంభంలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍ను సంగీత దర్శకులుగా అనుకున్నారు. లతను గాయనిగా అనుకున్నారు. అప్పటికే లత ప్రైవేట్‍గా పాడిన మీరా భజనలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఐతే హృదయనాథ్ మంగేష్కర్ సంగీత దర్శకత్వంలో పాడిన మీరా భజనలు హిట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ వేరే సంగీత దర్శకుల ఆధ్వర్యంలో అవే పాటలు పాడటం బాగుండదని, అనవసరమైన పోలికలు, వివాదాలు వస్తాయి కాబట్టి హృదయనాథ్‍నే సంగీత దర్శకుడిగా పెట్టుకోమని సూచించింది లత. కానీ నిర్మాతలు అందుకు ఇష్టపడలేదు. దాంతో తాను పాటలు పాడనంది లత. లత పాడకపోతే తామూ సంగీత దర్శకత్వం వహించం అని పక్కకు తప్పుకున్నారు లక్ష్మీ ప్యారే. దాంతో ఎంతో వెతికి పండిత్ రవిశంకర్‍ను సంగీత దర్శకులుగా ఎన్నుకున్నారు. శాస్త్రీయ సంగీతం తెలిసిన వాణీ జయరాంతో మీరా భజనలు పాడించారు. చక్కటి బాణీలను, అత్యద్భుతంగా పాడింది వాణీ జయరాం. కానీ అప్పటికే హిట్ అయి ప్రజల మనస్సులలో స్థిరపడిన లత మీరా భజనలను మరపించలేకపోయాయి పాటలు. పైగా సినిమాలో హేమమాలినికి ఈ స్వరం సరిపోలేదు. సినిమా స్క్రిప్టులో కూడా లోపాలుండటంతో ‘మీరా’ సినిమా దెబ్బతిన్నది. ఇది వాణీ జయరాం కెరీరును దెబ్బతీసింది. కానీ, లతా మంగెష్కర్‌కూ రవి శంకర్ కూ నడుమ వివాదాలున్నాయి కాబట్టి, లత ప్రతీకారం తీర్చుకుందని వ్యాఖ్యానించారు. మీరా పాటలు పాడటం వల్ల వాణీ జయరాం కేరీర్‌ను లత దెబ్బ తీసిందని విమర్శించారు. కానీ, లత ఎలాంటి విమర్శలకు స్పందించలేదు. ఒక అద్భుతమయిన పాట తరువాత మరో అద్భుతమయిన పాట పాడుతూ ముందుకు సాగిపోయింది.

 హిందీ సినీరంగంలో ఒక కళాకారుడు విజయవంతమవటమే కాదు, దీర్ఝకాలం కొనసాగాలంటే ఒక అండ ఉండటం తప్పనిసరి. ఎస్డీ బర్మన్ లతల నడుమ వివాదం సంభవించి లత, ఎస్డీ బర్మన్ పాటలు పాడను అన్నా సరే, తరువాత అతనికి గుండెపోటు వచ్చి చేతిలో సినిమాలన్నీ వేరేవారికి వెళ్ళిపోయినా సరే,  ఎస్డీ బర్మన్ నిలద్రొక్కుకోగలిగాడు. ఇందుకు ప్రధాన కారణం ఎస్డీ బర్మన్‌కు ‘నవకేతన్’ సినీ నిర్మాణ సంస్థ అండ ఉండటం. నటుడు దేవ్ ఆనంద్ సినిమాలకు ఎస్డీ బర్మన్ సంగీతం ఉండాలన్న నమ్మకం ఉండటం. పైగా ఎస్డీ బర్మన్‍కు గురుదత్‍తో సన్నిహిత సంబంధం ఉండటం వల్ల గురుదత్‍తో పాటు అతని శిష్యుడు రాజ్ ఖోస్లా కూడా గురుదత్‍తో పనిచేసేందుకు మొగ్గు చూపటం వల్ల ఎస్డీ బర్మన్ కష్టకాలం నుండి గట్టెక్కాడు. ఆశా భోస్లేకు ఓ.పి. నయ్యర్ అండ దొరకటంతో పాటు ఆమె ఏ రకమైన పాటైనా పాడేందుకు సిద్ధపడటంతో ఆమె గాయనిగా స్థిరపడటమే కాదు, దీర్ఘకాలం సినీరంగంలో ఉండగలిగింది. అంటే ఎంత ప్రతిభ ఉన్నా సరే, ఒక నిర్మాణ సంస్థ కానీ పెద్ద నిర్మాతల అండగానీ సినీరంగంలో నిలద్రొక్కుకోవటం కోసం ఎంతో అవసరం. ఇది ఏర్పాటు చేసుకోలేని వారు, కేవలం ప్రతిభపైనే ఆధారపడేవారు సినీరంగంలో దీర్ఘకాలం కొనసాగటం కష్టం.

‘జేసుదాసు’ హిందీ సినీరంగంలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కానీ అతనితోనే తప్పనిసరిగా పాడించే సంగీత దర్శకుడు లేడు. జేసుదాస్ తనకు పాడాలనే పెద్ద నిర్మాణ సంస్థ లేదు. ఏ ఒక్క నటుడితో అతని స్వరం ఐడెంటిఫై కాలేదు. దాంతో గొప్పగా పాడినా, హిట్ పాటలు పాడినా జేసుదాసు ఎక్కువకాలం హిందీ సినీరంగంలో నిలబడలేకపోయాడు. చివరికి ‘ఆలాప్’, ‘త్రిశూల్’ వంటి సినిమాలలో అగ్రశ్రేణి నటుడు అమితాబ్‍కు పాడినా, జేసుదాస్‍కు అవకాశాలు అడుగంటాయి. కేవలం జేసుదాసు పాటల వల్లనే హిట్ అయిన సినిమాలు లేకపోవటం (చిత్‌చోర్ మినహా) కూడా జేసుదాసు హిందీ సినీరంగంలో మనలేక పోవటానికి కారణాలు.

బాలసుబ్రహ్మణ్యం కూడా ‘ఏక్ దూజే కే లియే’తో సూపర్ హిట్ పాటలతో రంగ ప్రవేశం చేసినా, కొన్నాళ్ళు కమల్‍హాసన్‍కు పాడి రంగంలో నిలిచాడు. చివరికి కమల్‍కు కూడా కిషోర్ కుమార్‍తో పాడించటంతో బాలసుబ్రహ్మణ్యంకు హిందీ రంగంలో అవకాశాలు అడుగంటాయి. మళ్ళీ ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో సల్మాన్ ఖాన్ స్వరంగా గుర్తింపు పొందినా, ‘హమ్ ఆప్ కే హై కౌన్’ లో హిట్ పాటలు పాడినా, నెమ్మదిగా సల్మాన్‍కు మరో గాయకుడి స్వరం వెతికారు. బాలసుబ్రహ్మణ్యం అవకాశాలు ఆవిరై పోయాయి. కాబట్టి గాయకుడికైనా,  గాయనికైనా ప్రతిభతో పాటు ఓ పెద్ద నిర్మాణ సంస్థ అండ అవసరం.

శంకర్ జైకిషన్ లాంటి నెంబర్ వన్ సంగీత దర్శకుడు శారదను నెంబర్ వన్ గాయనిగా నిలిపేందుకు తమ నైపుణ్యాన్నంతా ప్రయోగించారు. కానీ ఆమె స్వరానికి బోలెడన్ని పరిమితులున్నాయి. చివరికి ఆమె స్వరాన్ని వాడటం విషయంలో శంకర్, జైకిషన్‍ల నడుమ విభేదాలు పొడసూపాయి. చివరి దశలో ఒకే పేరు మీద వారు సంగీత దర్శకత్వం వహించినా, వేర్వేరుగా పనిచేశారు. ఇది వారి కెరీరును దెబ్బ తీసింది. చివరికి జైకిషన్ మరణంతో శంకర్ జైకిషన్ శకం అంతం అయింది. శంకర్ జైకిషన్ పై ఆధారపడిన శారద కెరీరు కూడా ఆవిరైపోయింది.

‘వాణీ జయరాం’కు ఎంతో ప్రతిభ ఉన్నా, ‘బోలెరే పప్పీ హరా’, ‘హమ్ కో మన్‍కీ శక్తి దేనా’ వంటి రెండు మూడు పాటలు తప్ప చెప్పుకోదగ్గ హిట్ పాటలు లేవు. ఏ ఒక్క సంగీత దర్శకుడో, పెద్ద నిర్మాణ సంస్థనో అండగా ఏర్పాటు చేసుకోలేక పోయింది. దాంతో వాణీ జయరామ్ దక్షిణాది సినిమాలకు పరిమితం అవ్వాల్సి వచ్చింది.

‘సులక్షణ పండిత్’ శాస్త్రీయ సంగీతం కుటుంబం నుంచే వచ్చింది. ఆమె స్వరం చక్కగా ఉంటుంది. బాగా పాడుతుంది. కానీ ఆమె పాటలు పాడటంతో  సంతృప్తి పడలేదు. నటిగా ఎదగాలనుకుంది, అదీ నటి గాయని గా. సినిమా రంగంలో నటులు, నటులుగానే ఉండాలి. గాయనిగా ఎదగకూడదు. గాయకులు గాయకులుగానే ఉండాలి. నటులవ్వాలనుకోకూడదు. గాయకులుగా ఉచ్చస్థాయిలో ఉన్న తలత్ మహమూద్, ముకేష్‍లు హీరోలై పోవాలని రెంటికి చెడ్డ రేవడిలయ్యారు. చివరికి నటన వదిలితేనే కానీ వారి గొంతు వినబడని పరిస్థితి వచ్చింది. ముకేష్ కోలుకున్నాడు. తలత్ కోలుకోలేక పోయాడు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా ఎదగాలనుకున్న హేమంత్ కుమార్ కెరీరు సమాప్తమయి పోయింది. కిషోర్ కుమార్ కూడా నటన వదిలేసిన తరువాతనే గాయకుడిగా పెద్ద పేరు సంపాదించాడు. ఎప్పుడైతే సులక్షణ నటిగా కూడా ఎదగాలనుకున్నదో, అప్పుడే గాయనిగా ఆమె కెరీరు దెబ్బతిన్నది. ఎందుకంటే నటి కాబట్టి ఆమె తమకు పాడేందుకు ఇతర నాయికలు ఒప్పుకోరు. నటిగా అవకాశాలు అధికంగా రాకపోవటంతో నేపథ్యగానం అవకాశాలు తగ్గిపోవటంతో సులక్షణ అటూ నటిగా స్థిరపడలేక ఇటు గాయనిగా ఎదగలేక రెంటికి చెడ్డ రేవడి అయింది. చివరికి సులక్షణ పండిత్‍‌కు లత నేపథ్యంలో పాడింది. ‘గరమ్ ఖూన్’ సినిమాలో సులక్షణకు లత పాడిన ‘ఎక్ చెహరా’ అత్యద్భుతమైన పాట. కానీ అవకాశం దొరికినప్పుడల్లా గాయనిగానే తన సర్వశక్తులను కేంద్రీకరించి ఉంటే కొంతైనా గుర్తింపు పొంది ఉండేది. సులక్షణ పండిత్ సోదరి విజయేత  పండిత్ నటిగా రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమా ‘లవ్ స్టోరీ’లో లత అత్యద్భుతమైన నేపథ్య గానంతో సినిమా సూపర్ హిట్ అయింది. కానీ తరువాత ఆమె నటిగా ఎదగలేకపోయింది. కొన్నాళ్ళకు అదృశ్యమై పోయింది. సులక్షణ, విజయేతల సోదరులు జతిన్ – లలిత్‍లు సంగీత దర్శకులుగా లతా మంగేష్కర్‍తో పాటలు పాడించి విజయం సాధించారు. ముఖ్యంగా ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. తరువాత విభేదాల వల్ల వారు విడిపోయారు. వారి కెరీరు అంతమైపోయింది. కానీ వీరందరూ కలసి పనిచేసింది లతా మంగేష్కర్‍తో అనీ, వారికి ప్రత్యేక గుర్తింపు నిచ్చినవి లత పాటలు అన్న విషయం గమనిస్తే, లత గొప్పతనం స్పష్టమవుతుంది. ఎవరెన్ని రకాల ఆరోపణలు చేసినా ఆమె పట్టించుకోలేదు. పాటలు పాడుతూ పోయింది. అదీ ఎలా, పాట  తానయి, సులక్షణ కయినా, విజయేత కయినా, జతిన్, లలిత్‍ల సంగీత దర్శకత్వంలో కాజోల్ కైనా, లత పాటలో మార్పు రాలేదు. అదే నాణ్యత, అదే దీక్ష అదే నిజాయితీ, అదే నిబద్ధత. అందుకే లతా మంగేష్కర్ ఇన్ని దశాబ్దాలుగా అగ్రశేణి గాయనిగా నిలచింది. చివరికి స్వచ్ఛందంగా ఆమె పాటలు పాడటం తగ్గిస్తే కానీ ఆమె డిమాండ్‍లో ఏమాత్రం మార్పు రాలేదు.

1970 దశకంలో రంగ ప్రవేశం చేసిన మరో యువ గాయని రూనా లైలా. ‘రూనా లైలా’ కు కూడా బోలెడన్ని పరిమితులు ఉన్నాయి. అన్ని రకాల పాటలు పాడలేదు. పైగా ఇతర గాయనిలలాగే ఆమె తనకంటూ ఒక అండను ఏర్పాటు చేసుకోలేక పోయింది. పైగా, ఆమె బంగ్లాదేశీ అవటం కూడా ఆమె కెరీరు ఎదగటంలో ప్రభావం చూపించింది. కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, జయదేవ్, రాజేష్ రోషన్ వంటి సంగీత దర్శకులకు పాటలు పాడినా ఎక్కువకాలం సినీరంగంలో నిలవలేకపోయింది రూనా లైలా.

తొలి పాట తోటే హిందీ సినీ పాటల స్వరూపాన్ని రూపాంతరం చెందించింది గాయని నాజియా హసన్. ఆప్ జైసే కోయి మేరి జిందగీ మె ఆయె పాటతో హిందీ పాటల్లో డిస్కో ప్రవేశించింది. గమనిస్తే ఆ సంవత్సరం బినాకా గీత్ మాలాలో నాజియా హసన్ పాట కన్నా ఎక్కువగా హిట్ అయి అగ్ర స్థానంలో నిలిచింది లత పాట, శీష హో యా దిల్ హో ఆఖిర్ టూట్ జాతా హై!!!  హేమలత పాడిన ‘అఖియోంకే ఝరోంకోంసే’  పాట దేశాన్ని ఉర్రూతలూపింది. కానీ, ఆమె రవీంద్ర జైన్ పాటలకు పరిమితమవటంతో, రవీంద్ర జైన్ కేరీర్ పై ఆమె కెరీర్ ఆధారపడింది. అతని కెరీర్ దిగజారటంతో ఆమెకూ పాటలు లేని పరిస్థితి వచ్చింది. జేసు దాస్ లానే ఆమె కూడా రాజశ్రీ సినిమాల గాయికగా గుర్తింపుపొందటం కూడా ఆమె ఎదుగుదలకు ప్రతిబంధకం అయింది.

ఇలా గాయనిలు రావటం, కొన్ని పాటలు పాడటం, అదృశ్యమైపోవటం అన్న అనవాయితీకి అడ్డుకట్ట వేసింది అనురాధ పౌడ్వాల్. 1973లో ‘అభిమాన్’ సినిమాలో ఒక శ్లోకం పాడటంతో సినీరంగంలో అడుగుపెట్టిన అనూరాధ పౌడ్వాల్ చాలాకాలం డమ్మీ పాటలు పాడుతూ సినీ పరిశ్రమ పనితీరును గమనించింది. అర్థం చేసుకుంది. అవకాశం కోసం ఎదురు చూడటం కన్నా అవకాశాన్ని సృష్టించుకోవటం ఉత్తమం అనుకుంది. ఒక్కసారి అవకాశం లభించిన తరువాత ఆమె వెనుతిరిగి చూడలేదు. ఎంత స్థాయిలో విజయం సాధించిందంటే, లతా మంగేష్కర్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచీ 1980 దశకం వరకూ ఎవ్వరూ ఈ స్థాయిలో లతా మంగేష్కర్ స్థానాన్ని ప్రమాదంలోకి నెట్టలేదు. ఒక దశలో అనురాధ పౌడ్వాల్ పాటలు ఎంతగా హిట్ అయ్యాయంటే సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్ లత పని అయిపోయింది, హిందీ సినీ సంగీత ప్రపంచానికి నూతన రాణి అనూరాధ పౌడ్వాల్ అని ప్రకటించాడు కూడా.

“Lata is finished, Anuradha has replaced her” అని వ్యాఖ్యానించాడు ఓ.పి.నయ్యర్.

కొన్ని సినీ పత్రికలు అత్యుత్సాహంతో ‘లత పక్కకు తొలగిపో, అనురాధ పౌడ్వాల్ వచ్చింది’ అన్న శీర్షికతో వార్తలు రాశాయి. ‘లత యుగం అంతం?’ అంటూ కొన్ని పత్రికలు వ్యాసాలు రాశాయి. “కొత్త లత…. అనురాధ” అంటూ ఇంకొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ స్థాయిలో విజయం సాధించి, లతను దెబ్బతీసే స్థాయికి అనూరాధ ఎదగటం అర్థం చేసుకోవాలంటే అనురాధ పౌడ్వాల్ గురించి మరికాస్త తెలుసుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 27, 1954న కర్ణాటకలోని కర్వార్ వద్ద జన్మించింది అనూరాధ పౌడ్వాల్‌గా ప్రసిద్ధి పొందిన అల్కా నడ్కర్ని. ఆమెకు బాల్యం నుంచీ సంగీతం అంటే ఇష్టం. ముఖ్యంగా సినిమా పాటలంటే ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళకి సినిమా పాటలు మంచివాళ్ళు పాడరన్న నమ్మకం. అందుకని ఆమెకు సంగీతం నేర్పేందుకు కానీ, పాటలు పాడేందుకు కానీ వాళ్ళింట్లో వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఎప్పుడు రేడియోలో లత పాట విన్న మైమరచిపోయేది. పాట వెంట పాడాలని ప్రయత్నించేది. అయితే ఆమె గొంతు అంత బాగుందేది కాదు. బాల్యంలో అందరూ నెమలి గొంతు అని ఆమెను ఏడ్పించేవారు.

అనూరాధకు లత పాటలంటే ఎంత ఇష్టమంటే, లత పాటలు రికార్డు చేస్తుంటే చూడాలని ఉందని అందరితో చెప్తూండేది. అది విన్న ఓ స్నేహితుడు, పి.ఎన్. అరోరా నిర్మిస్తున్న ఓ సినిమాకు లత పాడుతుంటే వినేందుకు స్టూడియోకు తీసుకువెళ్ళాడు. ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో ‘పూఛో జరా కైసే’ అనే పాటను ఫేమస్ స్టూడియోలో లత రికార్డు చేస్తూంటే ప్రత్యక్షంగా చూసింది అనూరాధ. “I was spell bound. I could not believe that she could possess such a voice. It seemed straight from heaven. It was hypnotizing” అంది అనూరాధ లత రికార్డింగ్‍ను చూసిన తొలి అనుభవాన్ని వివరిస్తూ.

ఇంతలో అనూరాధకు న్యూమోనియా వచ్చింది. దాదాపుగా నలభై రోజులు ఆమె మంచంపైనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో లత భగవద్గీత రికార్డు చేసింది. ఆ క్యాసెట్ వింటూ సమయం గడిపింది అనూరాధ. భగవద్గీత వింటూ లతతో పాటు పాడుతూ గడిపింది. చిత్రంగా, ఆమెకు న్యూమోనియా తగ్గేసరికి ఆమె స్వరం మారిపోయింది. నెమలి గొంతు తీయని కోకిల స్వరంలా మారిపోయింది. అప్పటి నుంచీ ఆమె లత పాటలు వింటూ, లత స్వరంతో స్వరం కలిపి పాడటం ఆరంభించింది. ఎలాంటి సంగీత శిక్షణ పొందకుండా కేవలం లత పాటలు పాడుతూ పాడటం నేర్చుకుంది. పాటలలో భావం ప్రకటించటం నేర్చుకుంది. అందుకే ‘లతా మంగేష్కర్ నా గురువు’ అని పలు సందర్భాలలో స్పష్టం చేసింది అనూరాధ.

అనూరాధకు  పదిహేడేళ్ళ వయసు ఉన్నప్పుడు, అరుణ్ పౌడ్వాల్‍తో వివాహం అయింది. అరుణ్ బొంబాయి సినీపరిశ్రమలో వాయిద్యకారుడు. ఆయన అనిల్ మోహిత్‍తో కలసి ‘అనిల్-అరుణ్’ అన్న జంట పేరుతో మరాఠీ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. అనిల్ మోహిత్ లతకు ఇష్టమైన మ్యూజిక్ అరేంజర్. ఆమె విదేశాలలో టూర్లు చేసినప్పుడు అనిల్ మోహిత్‌ను సంప్రదించి అతనికి కుదురుతుందంటేనే కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అనిల్ మోహిత్ మరణించినప్పుడు (ఫిబ్రవరి 1, 2012) లత మంగేష్కర్ శ్రద్ధాంజలి ఘటిస్తూ ‘Anil was a constant at all my live concerts. He was the arranger and conductor of every live show of mine, both abroad and in India. For all 115 of them” అన్నది. అంతేకాదు “Anil shared a close and warm rapport with my entire family. He was especially close to  Hridaynath” అన్నది.

‘అనిల్-అరుణ్’లు కలసి ఎస్డీ బర్మన్‍కు అరేంజర్లుగా , అసిస్టెంట్లుగా పనిచేశారు. అరుణ్ పౌడ్వాల్‍కు సినీ పరిశ్రమలో చక్కని పేరు ఉంది. అతడిని వివాహం చేసుకోవటంతో అనూరాధ పౌడ్వాల్‍కు బొంబాయి సినీ పరిశ్రమ దగ్గరయింది. ‘అభిమాన్’లో లత పాడాల్సిన శ్లోకాన్ని అనూరాధతో పాడించి ఎస్డీ బర్మన్‍కు వినిపించింది అరుణ్ పౌడ్వాల్. అది విని ‘చక్కగా పాడింది అమ్మాయి. ఇంత చిన్న బిట్టు కోసం లతను పిలవటం ఎందుక’ని ఎస్డీ బర్మన్ ఆ శ్లోకాన్ని అనూరాధ స్వరంలో ఉంచేశాడు. అలా సినీ రంగంలో అడుగు పెట్టింది అనూరాధ.

‘అభిమాన్’లో అనూరాధ శ్లోకం విన్న పలు సంగీత దర్శకులు అనూరాధతో పాడించేందుకు ముందుకు వచ్చారు. అయితే సినిమాల్లో మొదటి పాట పాడేకన్నా ముందు లత ఆశీర్వాదం తీసుకోవాలన్నది ఆమె కోరిక. అరుణ్ ఆమెను లత దగ్గరకు తీసుకువెళ్ళాడు. “She was extremely sweet and gentle and wished me warmly” అని చెప్పింది అనూరాధ.

ఒకరోజు లతా మంగేష్కర్ – ఓ సినిమాయేతర మరాఠీ పాట పాడుతోందని, పాటకు హృదయనాథ్ సంగీత దర్శకుడని, పాటను కండక్ట్ చేస్తున్నది తన భర్త అరుణ్ అని అనూరాధకు తెలిసింది. ఆ రికార్డింగ్‍కు తనని తీసుకువెళ్ళమని కోరింది అనూరాధ. ‘ఎహ తకాలే పుసుని డోలే’ అనే పాటను లత అత్యద్భుతంగా పాడింది. రికార్డింగ్ అయిన తరువాత పాట రాసి ఉన్న కాగితాన్ని మరచిపోయి వెళ్ళిపోయింది లత. సాధారణంగా లత పాటలోని పదాలను తానే రాసుకుంటుంది. ఎక్కడ ఆగాలి, ఎక్కడ విరుపులు ఇవ్వాలి వంటివన్నీ ఆ కాగితంలో ఉన్నాయి. అనూరాధ ఆ కాగితాన్ని తీసుకుంది. మరుసటి రోజు రేడియోలో ఓ ప్రైవేట్ పాట పాడాల్సి ఉంది అనూరాధ. ఈ పాటను పాడింది. ఈ పాట శ్రోతలకు ఎంతగా నచ్చిందంటే పాట పెద్ద సంచలనం సృష్టించింది. పాట వింటూనే కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి వారు రేడియోకు ఫోన్లు చేశారు. తమ పాటలు పాడేందుకు అనూరాధను అహ్వానించారు. అలా సుభాష్ ఘాయ్ సినిమా ‘కాళీచరణ్’ లో ‘ఏక్ బటాదో’ అనే హిట్ పాట పాడింది అనూరాధ.

అయితే రేడియోలో ఈ పాట విన్న హృదయనాథ్ రేడియోకు ఫోన్ చేసి “ఆ పాటను నిన్ననే రికార్డు చేశాం. అప్పుడే ఎలా విడుదల చేశారు?” అనడిగాడట. ఈ పాట పాడింది లత కాదు, అరుణ్ భార్య అన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు హృదయనాథ్. అది తనకు అందిన ‘అతి గొప్ప ప్రశంస’ అంటుంది అనూరాధ.

తనకు పాడేందుకు ఎన్ని ఆఫర్లు వచ్చినా అనూరాధ వాటిని వెంటనే స్వీకరించలేదు. ముందుగా అరుణ్ సంగీత దర్శకత్వంలో మరాఠీలో పాటలు పాడింది. ఆమె మరాఠీలో విడుదల చేసిన ‘భావ్‍గీత్’ ఆల్బమ్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. చక్కటి గుర్తింపు నిచ్చింది. దాంతో సంగీత దర్శకులు ఆమె వెంట పడే తీవ్రత పెరిగింది. ‘కాళీచరణ్’ సినిమా  పాటల  తరువాత ఆమె లక్ష్మీప్యారేకు ‘ఆప్ బీతీ’ సినిమాలో ‘హమ్ తో గరీబ్‍హై’ అనే పాట పాడింది. ఆమె పాట పాడిన విధానానికి ముగ్దులైన లక్ష్మీప్యారేలు లత పాడాల్సిన  పాటల ట్రాక్  పాడేందుకు  ఆమెని ఆహ్వానించారు. అనూరాధ ఒప్పుకోలేదు. కానీ పాటలు పాడే విధానంలో శిక్షణ పొందినట్టు అవుతుందని వారు ఆమెని ఒప్పించారు. అంతేకాదు, ఆమెకు పాటలు పాడటంలో శిక్షణ నివ్వటం ఆరంభించారు.

ఎస్డీ బర్మన్ మరణం తరువాత అరుణ్ పౌడ్వాల్ బప్పీ లహరి ట్రూప్‍లో చేరాడు. దాంతో బప్పీ లహరి పాటలు పాడే అవకాశం అనూరాధకు లభించింది. 1976లో ఆమె మన్నా డే, కిషోర్ కుమార్, రఫీలతో పాటలు పాడింది. లక్ష్మీప్యారే సంగీత దర్శకత్వంలో ‘జానేమన్’ సినిమాలో మన్నా డే తో ‘రామ్ లీలా’ పాడింది. ఉధార్ కే సింధూర్ సినిమాలో కిషోర్ కుమార్‍తో ‘ఓ దిల్ జానీ’ పాట పాడింది. ‘సంగ్రామ్’లో రఫీ, కిషోర్ కుమార్‍లతో కలసి ‘దిల్‍దార్ హమారే దిల్ కో తుమ్’ అనే పాట పాడింది. ‘లైలా మజ్నూ’ సినిమా టైటిల్ సాంగ్ ప్రీతీ సాగర్‍తో కలసి పాడింది. లక్ష్మీప్యారేలకు అనూరాధ స్వరం ఎంతగా నచ్చిందంటే వారికి అవకాశం వచ్చినప్పుడల్లా ఆమెతో పాడించటం ప్రారంభించారు. అనూరాధ కూడా అందరి మెప్పు పొందుతూ సినీరంగంలో అందరినీ ఆకర్షించింది. ఉషా ఖన్నా సంగీత దర్శకత్వంలో ‘సాజన్ బినా సుహాగన్’ సినిమాలో అనూరాధ యేసుదాస్‍తో కలసి పాడిన ‘మధుబన్ ఖుష్బూ’ పాట సూపర్ హిట్ అయి అందరి దృష్టిని అనూరాధ వైపు మళ్ళిస్తే ‘జీజాజీ జీజాజీ’ పాటతో అందరినీ అలరించింది. ఒక్కో సంవత్సరం హిట్ పాటలు పాడుతూ అంచలంచెలుగా ఎదగసాగింది అనూరాధ.

1979లో జయదేవ్ సంగీత దర్శకత్వంలో అనూరాధ పాడిన ‘దూరియాన్’ సినిమాలో పాటలు ‘జిందగీ జబ్ తుమ్హారే గమ్ నహీ థే’, ‘జిందగీ మేరే ఘర్ ఆనా’, ‘లహూ కే దో రంగ్’ లో బప్పీ లహరి సంగీత దర్శకత్వంలో రఫీతో పాడిన ‘మాథేకీ బిందియా బోలే’ వంటి పాటలు అనూరాధకు వృద్ధిలోకి వస్తున్న గాయనిగా గుర్తింపు నిచ్చాయి. ‘దో ప్రేమీ’ సినిమాలో రఫీతో పాడిన ‘పాయలియా చమ్కీ థీనా’ చక్కని గుర్తింపు నిచ్చింది. ‘ప్రేమ్ గీత్’ సినిమాలో ‘దేఖ్ అవాజ్ దేకర్’, ‘ఆవో మిల్ జాయె హమ్’ వంటి పాటలు హిట్ పాటలు. పాటలు హిట్ అవుతున్నాయి. గుర్తింపు వస్తోంది. కానీ సూపర్ హిట్ అయి హిట్ సింగర్ అన్న గుర్తింపు రావటం లేదు. ఈ గుర్తింపు 1983లో యాదృచ్ఛికంగా లభించింది.

అనూరాధ పౌడ్వాల్ స్వరం లక్ష్మీప్యారేకు ఎంతగా నచ్చిందంటే వారు అవకాశం దొరికినప్పుడల్లా ఆమెతో పాడించటమే కాదు, లత పాటలను డబ్ చేయించటం ద్వారా లతలా పాడే శిక్షణ నిచ్చారు. హీరో సినిమాలో ‘తు మేరా జానూ  హై’, ‘డింగ్ డాంగ్’ పాటలను ముందు అనూరాధ పాడింది. తరువాత లత పాడాలి. అనూరాధ పాడింది లక్ష్మీప్యారేలకు, సుభాష్ ఘాయ్‍కి బాగా నచ్చింది. దాంతో లతతో మళ్ళీ పాడించే కన్నా అనూరాధ స్వరంలో ఉంచేస్తే మంచిదన్న ఆలోచన వచ్చింది. పైగా ‘హీరో’లో కొత్త హీరో హీరోయిన్లు కాబట్టి కొత్త స్వరాలుండటం ఔచిత్యంగా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఈ విషయంలో లక్ష్మీప్యారేల నడుమ వాదాలు జరిగేయి కూడా. ’కొత్త గొంతులను వాడాలి. యువతరానికి యువగొంతులు’ అని లక్ష్మీకాంత్  అనూరాధ పక్షం వహిస్తే, ‘లత తప్ప మరొకరు అవసరం లేద’ని ప్యారేలాల్ అభిప్రాయపడ్డాడు. చివరికి అనూరాధ పాట విని లత ‘ఇలానే ఉంచేయండి’ అనటంతో పాట అనూరాధ స్వరంలోనే విడుదలైంది. సూపర్ హిట్ అయింది. ఏ అవకాశం కోసం అనూరాధ ఎదురు చూస్తొందో ఆ అవకాశం ఆమెకు లభించింది.

‘హీరో’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ప్యార్ కర్నేవాలే, కభీ డర్తే నహీ ,  ‘నిందియా సే జాగీ బహార్’ పాటలు కూడా హిట్ అయ్యాయి.  కానీ తొలిసారిగా అనూరాధ స్వరం ముందు లత స్వరం వయసు స్పష్టంగా తెలిసింది. హీరో సినిమాలో పాటలు విన్న వారందరికీ అనూరాధ యువ స్వరం నచ్చింది. ‘తూ మేరా జానూ హై’ పాటకు అనూరాధకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. 1985లో లక్ష్మీప్యారే సంగీత దర్శకత్వంలో ఉత్సవ్ సినిమాలో ‘మేరా మన్ బజా మృదంగ్ ‘ అనే పాటను ఆర్తీ ముఖర్జీ, సురేష్ వాడ్కర్‍లతో కలసి పాడింది అనూరాధ. ఈ పాటకుగానూ ఆమెకు జాతీయ అవార్డు లభించింది. దాంతో తొలిసారిగా హిందీ సినీ సంగీత పరిశ్రమలో లతను సవాల్ చేయగలిగే సూపర్ హిట్ గాయనిగా నిలిచింది అనూరాధ.

లత మంగేష్కర్‍కు అనుభవం ఉంది. లత స్వర మాధుర్యాన్ని గానీ, ప్రతిభను కానీ ఎవ్వరూ ప్రశ్నించలేరు. కానీ అనూరాధ పౌడ్వాల్‌ది యువ స్వరం. సినీ ప్రపంచంలో రోజు రోజుకీ కొత్త యువతులు హీరోయిన్లుగా ప్రవేశిస్తున్నారు. వారికి తగ్గ చలాకీ స్వరం, యువత స్వరం కావాలి. 1981లో లవ్ స్టోరీ విడుదలైంది. ఆ సినిమాలో విజయేతా పండిత్‍కు లత పాడిన ప్రతి పాట సూపర్ హిట్. ప్రతి పాట యువతను ఉర్రూతలూగించింది. ‘యాద్ ఆ రహీ హై’, ‘కైసే తెరా ప్యార్’, ‘దేఖో  మైనే దేఖాహై ఏక్ సప్నా’ వంటి పాటలు లత స్వరంలో విన్నప్పుడు ఆమె వయస్సు 52 ఏళ్ళనీ, నాయిక వయస్సు 17 ఏళ్ళనీ ఎవ్వరికీ గుర్తు రాదు. కానీ ఒక్కసారి అనూరాధ పాటలు సూపర్ హిట్ అవటంతో అందరికీ లత వయసు గుర్తుకు వచ్చింది. గమనిస్తే ఈ రకమైన సూపర్ హిట్ పాటలు లత, ఆశా కాక పాడిన మరో గాయని అనూరాధ పౌడ్వాల్ మాత్రమే. ఎందరో గాయనిలు హిందీ సినీ ప్రపంచంలోకి పాటలు పాడాలని వచ్చారు. హిట్ పాటలు పాడాలని వచ్చారు. హిట్ పాటలు పాడేరు. కానీ తమ పాటల ద్వారా సినిమాకు గుర్తింపు తెచ్చిన వారు లత, ఆశా మాత్రమే. ఇప్పుడు అంటే 1983లో హీరో పాటలతో అనూరాధకి అలాంటి ఇమేజీ వచ్చింది.

సంగీత దర్శకులంతా అనూరాధ వైపు మొగ్గటం ప్రారంభించారు. కానీ తరువాత ఏ సినిమా పాటలు కూడా ‘హీరో’  అంత హిట్‍లు కాకపోవటంతో మళ్ళీ అందరూ లత, ఆశాల వైపు మళ్ళటం ప్రారంభించారు. ఎందుకంటే ఈ సమయంలో లత స్వరం మళ్ళీ చిన్నపిల్ల స్వరంలా ధ్వనించటం గమనించారు. దాంతో అనూరాధ పాడాల్సిన పాటలు లత, ఆశాలు పాడటం సంభవించింది. అనూరాధ విషయంలో పటిష్టమైన లక్ష్మీప్యారేల స్నేహం కోట బీటలు వారసాగింది. లక్ష్మీకాంత్ అనూరాధతోనే పాడించాలని, ప్యారేలాల్ ఎట్టి పరిస్థితులలో లత తోటి పాడించాలని ఎవరు పట్టు వారు పట్టారు. ఈ పట్టుదల ఫలితం ‘ప్యార్ ఝక్తా నహీ’ సినిమా పాటల్లో కనిపిస్తుంది. ఈ సినిమా లత పాడాల్సిన పాటలు కవిత కృష్ణమూర్తి కొన్ని, అనూరాధ పౌడ్వాల్ కొన్ని పాడేరు. ‘కవిత’ పాట విన్న లత ఆ పాటను ‘కవిత’ గొంతులోనే ఉంచమంది.   ‘కవిత’ పాడిన ‘తుమ్ సె మిల్‍కర్’ పాట సూపర్ హిట్ అయింది. కవిత కృష్ణమూర్తి కెరీర్‍కు శుభారంభం లభించింది. కానీ ‘తుమ్హే అప్న సౌథీ బనానే సే పహలే’ అనూరాధ పాడిన పాటను మాత్రం లత డబ్ చేసింది. ఆ పాట కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఆ పాట కన్నా ముందు ఒక కవిత పాడుతుంది నాయిక – ‘హజారో ఆంథియా ఆయీ’ అంటూ. ఆ కవితను లత డబ్ చేయలేదు. దాంతో సినిమాలో,  రికార్డుల్లో ముందు కవిత అనూరాధ స్వరంలో ఉంటుంది. పాట లత స్వరంలో ఉంటుంది. కానీ లత ఎంత అద్భుతంగా పాడిందంటే అది అనూరాధ స్వరం, ఇది లత స్వరం అన్న తేడా ఎవ్వరూ కనిపెట్టలేనంత అద్భుతంగా పాడింది. అంటే వయసులో తేడా, ఎదుటి వారి మనసులోనే ఉంది తప్ప స్వరంలో లేదని లత తన స్వరం ద్వారా నిరూపించిందన్నమాట. ‘కవిత’ పాటను అలాగే ఉంచి, అనూరాధ పాటను లత మళ్ళీ పాడటం ఒక రకంగా, దూసుకుపోతున్న అనూరాధ పౌడ్వాల్‍కు రాజు ఎవ్వరో చూపించటం వంటిది. హీరో సినిమా తరువాత పెద్దగా హిట్ పాటలు పాడని అనూరాధ కన్నా సూపర్ హిట్ పాటలు అలవోకగా పాడే లతతో పాడించేందుకే సంగీత దర్శకులు, నిర్మాతలు ఇష్టపడటంలో ఆశ్చర్యం లేదు.

‘నగీనా’ సినిమాలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍లు అనూరాధ పాడిన పాటలన్నిటినీ లతతో మళ్ళీ పాడించారు. కానీ ‘తూ నే బేచైన్ ఇత్‍నా’ అన్న యుగళ గీతం మాత్రం అనూరాధ స్వరంలోనే ఉంది. ఆ పాట సూపర్ హిట్ అయింది. అయితే ఇలా తన పాటలను లత డబ్ చేస్తూండటం, ఆ పాటలన్నీ హిట్‍లు అవటం, అనూరాధ పాడిన స్వరంలో ఉన్న పాటలు అంతగా హిట్ కాకపోవటం అనూరాధను కలవరపరచింది. తన కెరీర్ ఎదుగుదలలో లత అడ్డుపడుతోందన్న భావన కలిగించింది. దీనికి తోడు, ఆశా భోస్లేకు అనూరాధ పౌడ్వాల్ వ్యాఖ్యలు కొన్ని ఆగ్రహం తెప్పించాయి. దాంతో అరుణ్ పౌడ్వాల్ అరేంజర్‌గా ఉన్న పాటలు తాను పాడనని ఆశా భోస్లే నిశ్చయించుకుంది. ఆర్డీ బర్మన్, బప్పీ లహరిలకు ఆశా  పాటలు పాడే సమయంలో అరుణ్ పౌడ్వాల్‍ను స్టూడియో నుంచి బయటకు పంపేసేవారు. ఇది తెలిసి ఇతర సంగీత దర్శకులు కూడా ఆశా పాట పాడే సమయంలో అరుణ్ పౌడ్వాల్ ను స్టూడియో బయటకు పంపేవారు.  ఇది కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. లత, ఆశాలు తన కెరీర్‍ను దెబ్బ తీస్తున్నారన్న భావన అనూరాధలో కలిగింది. అయితే అనూరాధ ఎన్ని వ్యాఖ్యాలు చేసినా లత ఎలాంటి స్పందనను ఇవ్వలేదు. సంగీత దర్శకులు పిలిచి పాడమంటే పాడింది. పిలవని వారి జోలికి వెళ్ళలేదు. అనూరాధ పౌడ్వాల్ విషయంలో లత ఎలాంటి జోక్యం చేసుకోలేదనేందుకు లక్ష్మీప్యారేల ప్రవర్తన నిదర్శనం.

లక్ష్మీప్యారేలు లత భక్తులన్నది జగద్విదితం. కానీ అనూరాధ పౌడ్వాల్‍తో పాడించాలని వారు తీసుకున్న నిర్ణయం వల్ల అనూరాధతో పాడిస్తూ వచ్చారు. వారు పిలిచి పాడమన్నప్పుడు లత పాడింది. వారు అనూరాధతో పాడించినప్పుడు మౌనంగా ఉంది. అంతే తప్ప అనూరాధతో పాడించ వద్దనలేదు. లక్ష్మీ ప్యారే అనూరాధతో పాడిస్తున్నారు కాబట్టి వారికి పాడను అనీ అనలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయింది.   లత తన కెరీర్‍ను దెబ్బ తీస్తోందని అనూరాధ ఆరోపించిన కాలంలో అనూరాధ అధికంగా పాటలు లక్ష్మీప్యారేకి పాడింది. సంగీత దర్శకుల ఎంపికలో కానీ, నిర్మాతల నిర్ణయాలలో కానీ లత జోక్యం చేసుకునేదైతే లక్ష్మీప్యారేలు లతను కాదని అనూరాధతో పాటలు పాడించేవారు కాదు. కానీ లక్ష్మీ ప్యారేలు ఎంతగా ఆమెకు మద్దతుగా నిలిచినా ‘హీరో’ సినిమా పాటలలో ఆ తరువాత ఆమె పాడిన పాటలేవీ హిట్ కాలేదు. ఇది ప్రధానంగా ఆమె కెరీరును దెబ్బ తీసింది. దీనికి తోడుగా ఆమెకు ప్రధానంగా అవకాశాలిచ్చే సంగీత దర్శకుడంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేకపోవటం పెద్ద ప్రతిబంధకం అయింది. ఓ.పి.నయ్యర్, ఆర్డీ బర్మన్ వంటివారు ఎలాగైతే ఆశానే ప్రధాన గాయనిగా వాడేరో, అలా అనూరాధనే తప్పనిసరిగా వాడతామనే సంగీత దర్శకులు లేరు. లక్ష్మీప్యారేలు అనూరాధను అధికంగా వాడినా, వారి ప్రధాన విధేయత లతా మంగేష్కర్‍కే. ముఖ్యంగా మహమ్మద్ రఫీ మరణం తరువాత తమ పాట హిట్ అవటం కోసం వారు అధికంగా లతపైనే ఆధారపడ్డారు. ఇలాంటి పరిస్థితులలో అనూరాధకు అవకాశాలు రావటం తగ్గిపోయింది. వచ్చినా అవకాశాలు హిట్ పాటలుగా రూపొందటం లేదు. దాంతో నిరాశ చెంది అనూరాధ సినీ పరిశ్రమ వదలి వెళ్ళిపోవాలనుకుంది. ఒక దశలో ఆమె సినిమా పాటలు వదలి భజనలు పాడాలని ప్రయత్నించింది. ‘అమితాబ్’ సూపర్ స్టార్‍గా ఎదిగిన తరువాత సినిమా పాటల ఆకర్షణ తగ్గింది. దాంతో గాయనీ గాయకులు అధికంగా భజనలు, గజళ్ళవైపు మళ్ళారు. ఆ రంగంలో అడుగు పెట్టే వీలులేని పరిస్థితి ఉంది. ఆమె ప్రైవేట్ భజనలు పాడేందుకు HMV, పాలిడార్, మ్యూజిక్ ఇండియా వంటి మ్యూజిక్ సంస్థలను అడిగింది. కానీ ఉన్న మార్కెట్‍లో కొత్తవారికి అవకాశం లేదని వారు నిర్మొహమాటంగా చెప్పారు. దాంతో ఇక సంగీతం వదిలేయాలని నిశ్చయించుకుంది అనూరాధ. తనకు అందిన ప్రతి తిరస్కారానికి లతనే బాధ్యురాలిగా భావించింది.  అంటే, లత పాటలు వింటూ ఎదిగి, లత పాటలు పాడుతూ, పాడటం నేర్చుకుని, లత ఆశీర్వాదంతో సినిమా పాటలు పాడటం ఆరంభించినా, లత పాటల ట్రాక్ పాడుతూ  పాటలలో మెళకువలు గ్రహించిన అనూరాధ ఇప్పుడు తన కెరీర్ దెబ్బతినటానికి లతను బాధ్యురాలిగా భావించి కసి పెంచుకున్నన్నదన్న మాట. కానీ అవకాశాలు అడుగంటుతూండటంతో పాటలు హిట్ కాకపోవటంతో సినిమా రంగం వదిలేసి వెళ్ళిపోవాలని నిశ్ఛయించుకుంది అనూరాధ. ఆ సమయంలో విధి ఆమె కెరీర్‍ను ఓ మలుపు తిప్పింది. ఒక అనూహ్యమైన సంఘటనతో, అనూరాధ రెట్టించిన ఉత్సాహంతో సినీరంగంలో తిరిగి ప్రవేశించింది. ఈసారి ఆమె సినిమా రంగాన్ని ఊపు ఊపింది. నిర్మాతలు, సంగీత దర్శకులంతా ఆమె వెంట పడేట్టు, బారులు తీరే పరిస్థితి కల్పించింది.

‘టీ-సిరీస్’ అనే ఓ చిన్న సంస్థ స్వతంత్రంగా పాటల  క్యాసెట్లు తయారు చేయటం ఆరంభిస్తూ ఆ కార్యక్రమానికి అనూరాధ పౌడ్వాల్‌ను ఆహ్వానించింది. ‘టి-సిరీస్’ అనే సంస్థ, ఇతర మ్యూజిక్ కంపెనీల పాటలను అనధికారంగా వాడుకుంటూ తక్కువ ధరకు కాసెట్లు తయారు చేసి అమ్మే సంస్థ. 1984వ సంవత్సరంలో ఆరంభమైన ఈ సంస్థ, శ్రోతలు పాటలు వినే విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. అంతవరకూ ధనవంతులకే పరిమితమైన పాటల కాసెట్లను పేవ్‍మెంట్లపై కుప్పలు పోసి అమ్మే పరిస్థితి తీసుకు వచ్చింది టి-సిరీస్ సంస్థ. పది రూపాయలకే ఇరవై పాటలు, రెండు వైపులా రెండు అత్యద్భుతమైన సినిమాల పాటలు పొందుపరచి అమ్ముతూ పెద్ద పెద్ద సంస్థలు జుట్టు పీక్కునేట్టు చేసింది టి-సిరీస్. రికార్డింగ్ నాణ్యతతో సంబంధం లేకుండా పాట వినటమే పరమావధిగా భావించే సామాన్యుడికి పాటను అందించి, హిందీ సినీ పాటల మార్కెట్ ఎంత విస్తృతమైనదో నిరూపించింది టి-సిరీస్ సంస్థ. ఈ పరిస్థితి నుంచి న్యాయబద్ధమైన రీతిలో సినిమా పాటలను తయారు చేసి అమ్మాలని టి-సిరీస్ సంస్థ నిర్ణయించింది. 1986లో టి-సిరీస్ మ్యూజిక్ లేభిల్‍ను ఆరంభిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో అనూరాధ పౌడ్వాల్ పాట పాడింది. ఆమె స్వరానికి ముగ్దుడైన టి-సిరీస్ సంస్థ యజమాని గుల్షన్ కుమార్ తండ్రి చంద్రభాను కుమార్, ఆమెను టి-సిరీస్‌కు పాటలు పాడమని అభ్యర్థించాడు. అనూరాధ అందుకు సమ్మతించింది. అలా ఆరంభమైంది హిందీ సినీ సంగీత స్వరూపాన్ని శీర్షాసనం వేయించి లతా మంగేష్కర్ నెంబర్ వన్ స్థానాన్ని గండి కొట్టేందుకు సినీ చరిత్రలో జరిగిన ఏకైక అతి తీవ్రమైన, అద్భుతమైన,  విజయానికి అతి చేరువైన శక్తివంతమైన దాడి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here