సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-28

1
11

[dropcap]మై[/dropcap] ఏక్ సదీసే బైఠీ హూన్, ఇస్ రాహ్ సె కోయీ గుజ్‌రా నహీ

కుఛ్ చాంద్ కే రథ్ తో గుజ్‍రే థే, పర్ చాంద్ సే కోయీ ఉత్‌రా నహీ

సంపూర్ణంగా నిరాశలో కూరుకుపోయిన విషాద హృదయపు ఒంటరితనంలోని విహ్వల వేదనను మనసు అనుభవించే రీతిలో పాటను రచించింది గుల్జార్. బాణీని సృజించింది హృదయనాథ్ మంగేష్కర్. ఈ పాట బాణీని దీనానాథ్ మంగేష్కర్ ‘మానాపమాన్’ అనే నాటకం కోసం సృజించిన ‘చలీ చంద్ర అసే దరీలా’ అనే పాట బాణీని పోలి ఉంటుందంటారు. అంటే ‘లేకిన్’ సినిమాలో ఈ పాట బాణీని సృజించటం కోసం హృదయనాథ్ మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సృజన నుంచి ప్రేరణ పొందేడన్నమాట. అవకాశం దొరికినప్పుడల్లా, లత తన స్వరం ద్వార తండ్రి స్వరం  ప్రకటితమవుతుంటుందని చెప్తుంది. లేకిన్ సినిమాలో తన తండ్రి రూపొందించిన ఈ పాటను పాడటం ద్వారా, తండ్రికి నీరాజనం అర్పించినట్టయింది.  ఈ పాటలో లత తన ఆత్మ స్వరాన్ని హృదయంతో వినిపించినట్టుంటుంది. ‘లేకిన్’ సినిమాను లత స్వయంగా నిర్మించింది. 1950 దశకంలో సి. రామచంద్రతో కలసి ‘ఝమేలా’ అనే సినిమా నిర్మాణాంలో లత పాలుపంచుకుంది. కానీ ఆ సినిమా అంతగా విజయవంతం కాకపోవటంతో లత తన దృష్టిని సంపూర్ణంగా నేపథ్యగానం వైపే కేంద్రీకరించింది. కానీ 1987లో లతా మంగేష్కర్ సినిమా నిర్మించాలని తలపెట్టింది. అందుకు ప్రధాన కారణం తాను పాడుతున్న పాటలు హిట్లు అయి, దేశ ప్రజలను ఉర్రూతలూపుతున్న లతకు తాను పాడుతున్న పాటల నాణ్యత పట్ల తీవ్రమైన అసంతృప్తి కలిగింది. కాబట్టి తనకు నచ్చిన విధమైన పాటలను రూపొందిస్తూ, సంగీతానికి పెద్ద పీటవేసే సినిమా నిర్మించాలనుకుంది లత.

ఇక్కడ ఒక విషయం విశ్లేషించాల్సి ఉంటుంది. 1987లో తాను పాడుతున్న పాటల పట్ల లత అసంతృప్తి వ్యక్తపరచిన సమయంలో లత నెంబర్ వన్ గాయని. అనూరాధ పౌడ్వాల్ టి.సిరీస్‍తో చేతులు కలిపిన సంవత్సరం. తాను పాడుతున్న పాటల పట్ల లత అసంతృప్తి వ్యక్తపరచటాన్ని పరిగణనలోకి తీసుకుని, 1970 నుండి 1987 నడుమ లతా మంగేష్కర్ పాడిన పాటలను పరిశీలించాల్సి ఉంటుంది.

1970 నుండి 1987 వరకూ లత పాటల గణాంక వివరాలు

సంవత్సరం సినిమాల సంఖ్య సోలో యుగళ గీతాలు  మొత్తం గీతాలు మొత్తం సినిమాలో లత పాటల శాతం
1970 54 84 46 130 16
1971 52 71 45 126 19.3
1972 62 86 65 151 21.7
1973 60 94 44 138 19.6
1974 55 66 38 104 16.6
1975 45 50 40 90 15.8
1976 41 53 44 97 17.5
1977 50 59 37 96 13.8
1978 46 48 42 90 16.1
1979 42 37 39 66 11.4
1980 43 43 28 71 11
1981 46 48 40 88 11.6
1982 45 41 41 82 10.6
1983 33 36 37 73 10.3
1984 39 32 38 70 8.7
1985 40 39 33 72 8
1986 27 22 19 41 7.5
1987 12 13 8 21 4.9

1970 నుండి 1987 వరకూ లత పాడిన పాటల సంఖ్య క్రమంగా తగ్గటం స్పష్టంగా కనిపిస్తుంది.  ఈ గణాంక వివరాలు ఒక విషయం స్పష్టం చేస్తాయి. లత నంబర్ వన్ స్థానాన్ని పట్టుకుని వేలాడటం కానీ, ఇతరులకు అవకాశాలు రానివ్వక వారిని అడ్డుకోవటం కానీ, కల్పనలనీ, వ్యక్తులు తమ పరాజయానికి కారణం తమ లోపాలన్న విషయాన్ని ఆమోదించలేక, లత పై ఆరోపణలు చేయటం ద్వారా తమ లోపాలను కప్పిపుచ్చుకుంటున్నారనీ అర్ధమవుతుంది. గతంలో పాడిన పాటలకన్నా తక్కువపాడుతూ, నచ్చిన వారితో పనిచేయటం, ఇతరులను అణగద్రొక్కి, వారి అవకాశాలను లాక్కునేవారు చేసే పనులుకావు. 1983 తరువాత లత పాటలు 10 శాతం కన్నా తక్కువ వున్నాయి. అందరి అవకాశాలనూ తామే కాజేసేట్టయితే, మరి ఇన్ని తక్కువపాటలు మాత్రమే ఎలా పాడింది? మిగతా 90 శాతం పాటలు ఎవరు పాడేరు? దీని అర్ధం ఏమిటంటే, అందరికీ అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ, లత పాడిన ఆ 10శాతం  కన్నా తక్కువ పాటల్లోనే అధిక శాతం పాటలు ఇతరులు పాడిన 90 శాతం పాటలకన్నా అధికంగా ప్రజాదరణ పొందేయి.  1972లో 21.7 శాతం పాటలు పాడిన లత 1984 నుంచి పదిశాతం కన్నా తక్కువ పాటలు పాడటం కనిపిస్తుంది. చివరికి 1987లో మొత్తం విడుదలైన హిందీ సినిమా పాటలలో లత పాడిన పాటలు కేవలం 4.9 శాతం. దీనితో పాటుగా లత పాడిన సోలో పాటల సంఖ్య కూడా గణనీయంగా తగ్గటం తెలుస్తుంది. 1973లో 94 సోలో పాటలు పాడిన లత 1987 వచ్చేసరికి పదమూడు సోలో పాటలు పాడింది. సినిమాలలో పాటల సంఖ్య గణనీయంగా తగ్గటం లత పాటల సంఖ్య తగ్గటానికి ఒక కారణమైతే, నాయికల ప్రాధాన్యం తగ్గిపోవటం మరో కారణం. అరుదుగా నాయికలకు సోలో పాటలు ఉండేవి. నాయికలు కేవలం హీరోతో రోమాన్స్ చేయటానికి, యుగళ గీతాలు పాడేందుకే పనికి వచ్చేవారు. అయితే లత పాటలు పాడిన సినిమాలలో నాయికలు అగ్రశ్రేణి నాయికలవటంతో వారికి ఒక సోలో పాట, రెండు యుగళ గీతాలు చొప్పున ఉండేవి. అదీగాక, లత స్థాయికి తగ్గ బాణీలు రూపొందించే ప్రతిభ, నైపుణ్యం ప్రదర్శించే సంగీత దర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవటం కూడా లత పాటల సంఖ్య తగ్గటానికి కారణమైంది. సంగీత దర్శకులు పాడమని లతను కోరినా రొటీన్ పాటలు, రొటీన్ బాణీల పాటలు పాడేందుకు లత ఇష్టపడక ఆయా పాటలను లత ఏదో ఓ కారణంతో తిరస్కరించేది. ‘సత్యం శివం సుందరం’ సినిమాలో కూడా పాటలు పాడేందుకు లత అంత ఉత్సాహాన్ని చూపలేదు. కానీ పండిత నరేంద్ర శర్మ, సంతోష్ ఆనంద్ వంటి వారు పాటలు రాస్తున్నారని చెప్పి పాటలు పాడేందుకు రాజ్ కపూర్ ఆమెను ఒప్పించాడు. కానీ పాటల చిత్రీకరణలో నాయిక జీనత్ అమన్‍కు అసభ్యమైన దుస్తులు వేస్తున్నాడని తెలిసి లత పాటలు పాడటానికి నిరాకరించింది. అప్పటికి అన్ని పాటలు రికార్డయిపోయాయి. ఇంకా ఒక్కపాటనే మిగిలి ఉంది. రికార్డ్ చేయటం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ లతా మంగేష్కర్‍కు సమయం లభించటం లేదు. చివరికి సినిమా రిలీజ్ తేదీని కూడా నిర్ణయించేశారు. ఒక్కపాట షూటింగ్ మిగిలి ఉంది. ఎంతో బ్రతిమిలాడగా ఆ పాట పాడేందుకు సిద్ధమైంది లత. అందరూ అంతా సిద్ధం చేసుకుని లత కోసం ఎదురుచూస్తున్నారు. లత ఎంతకీ రాలేదు. అందరికీ ఉద్విగ్నత పెరుగుతోంది. ఎందుకంటే ఆ రోజు పాట రికార్డు కాకపోతే సినిమా రిలీజ్ సమయానికి పాట షూటింగ్ పూర్తికాదు. దీనికి తోడు పాట రికార్డింగ్ కోసం చేసిన ఖర్చంతా వ్యర్థమవుతుంది. లత చివరి క్షణంలో వచ్చింది. ఆమె కారు ఆగగానే రాజ్ కపూర్‍తో సహా ఇతరులు కారు తలుపు తీసేందుకు పరుగెత్తారు. తలుపు తెరుచుకుంది. రాజ్ కపూర్ చేతులు జోడించి నిలబడ్డాడు. లత తలుపు తీసినట్టే తీసి మళ్ళీ వేసేసింది. పొమ్మని డ్రైవర్‍కు ఆజ్ఞాపించింది. రాజ్ కపూర్ జోడించిన చేతులు విడివడేలోగా లత కారు పెట్రోలు పొగ వదులుతూ వెళ్ళిపోయింది. లత ఇలా ప్రవర్తించటం వెనుక కారణం ఉంది.

1950లలో ఇదే కథతో లతను నాయికగా సినిమా తీయాలని రాజ్ కపూర్ సంకల్పించాడు. కానీ లత నటించేందుకు ఇష్టపడకపోవటంతో ఆ ఆలోచనను పక్కన పెట్టాడు. అదే ఆలోచనను ‘సత్యం శివం సుందరం’గా నిర్మిస్తున్నప్పుడు లత, తన ప్రేరణతో నిర్మిస్తున్న సినిమాగా భావించటంలో పొరపాటు లేదు. కాబట్టి నాయికను అసభ్యంగా ప్రదర్శించటం పట్ల లత తీవ్రమైన నిరసనను ప్రదర్శించటంలోనూ తప్పులేదు. లత నిరసన ప్రదర్శించే విధానం అది. దాంతో చేసేదిలేక ఆ పాట లేకుండానే సినిమాను విడుదల చేశాడు రాజ్ కపూర్. గమనించాల్సిందేమిటంటే ఈనాటికీ ‘సత్యం శివం సుందరం’ను లత అద్భుతమైన పాటల ద్వారానే గుర్తుపెట్టుకుంటారు కానీ నాయిక అంగాంగ ప్రదర్శన వల్ల కాదు. అంగాంగ ప్రదర్శనను అసహ్యించుకుంటూ, కళ్ళు మూసుకుని లత పాటలు వింటూ అలౌకికానందాన్ననుభవిస్తూంటారు. అయితే 1970 నుండి 1987 నడుమ గాయికగా లతను ఛాలెంజ్ చేసినటువంటి పాటలు అరుదు. లత ఇష్టంగా పాడిన పాటలు కూడా అరుదు. సంగీత దర్శకులు అధికశాతం రొటీన్ బాణీల సృజనపైనే మోజు చూపారు. కానీ అత్యంత సృజనాత్మక రీతిలో బాణీలు రూపొందించటం పై ధ్యాస పెట్టలేదు. 1970 నుండి 1987 నడుమ సినీ పాటల పాపులారిటీకి కొలబద్ద లాంటి ‘బినాకా గీత్ మాల’లో లత పాటలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

1970-87 నడుమ బినాకా గీత్‍మాలాలో లత పాటలు

సంవత్సరం మొత్తం పాటలు లత పాటలు సోలో యుగళ గీతాలు
1970 33 14 4 10
1971 32 9 4 5
1972 37 10 3 7
1973 37 16 6 10
1974 33 8 1 7
1975 32 12 2 10
1976 33 14 2 12
1977 41 9 2 7
1978 34 12 5 7
1979 39 15 4 11
1980 35 8 3 5
1981 32 12 2 10
1982 33 7 0 7
1983 31 12 4 8
1984 29 6 1 5
1985 33 14 2 12
1986 36 4 2 2
1987 29 5 3 2

‘బినాకా గీత్ మాలా’లో లత పాటల సంఖ్యను గమనిస్తే 1970 నుంచే లత పాటల సంఖ్య, ముఖ్యంగా సోలో పాటల సంఖ్య గణనీయంగా తగ్గటం తెలుస్తుంది. హిట్ గీతాలలో కూడా అధికంగా యుగళ గీతాలే ఉండటం తెలుస్తుంది. 1982లో టాప్ 33 పాటలలో లత సోలో ఒక్కటి కూడా లేకపోవటం గమనార్హం. ముఖ్యంగా కిషోర్ కుమార్ మరణం తరువాత లతతో దీటుగా పాడగలిగే గాయకులు లేని పరిస్థితి వచ్చింది. సురేష్ వాడ్కర్, తలత్ అజిజ్, మున్న, షబ్బీర్ కుమార్, నితిన్ ముకేష్, మన్హర్ ఉదాస్ వంటి యువ గాయకులు లతతో పాడిన యుగళ గీతాలు హిట్లు అవుతున్నా, కేవలం లత స్వరం వల్ల యుగళ గీతాలు ఆకర్షణీయం అవటం తెలుస్తుంది అదీగాక ఆరంభం నుంచీ లత సోలో పాటలు అధికంగా పాడటం అలవాటు. ఆమె సోలో పాటల వల్ల సినిమాలు సూపర్ హిట్‍లు అవటం అనవాయితీ.  1970 దశకంలో కిషోర్ కుమార్ ప్రభంజనం మరో గాయనీ గాయకులకు నిలిచే అవకాశం ఇవ్వలేదు. కానీ ఆ దశకంలో లత సోలోలు కూడా హిట్ అయ్యాయి. కానీ 1980 దశకంలో ‘డిస్కో’ రంగ ప్రవేశం చేయటం, యుద్ధం, హింస సినిమాలలో ప్రేమను రొమాన్స్‌ను డామినేట్ చేయటంతో గాయనిల సోలోల కన్నా యుగళ గీతాల ప్రాధాన్యం అధికం అయింది. దీనికి తోడు అల్కా యాగ్నిక్, కవిత కృష్ణమూర్తి, అనూరాధ పౌడ్వాల్ వంటి యువగాయనిలు కూడా పాటల రంగంలో ప్రవేశించటంతో లతకు రొటీన్ పాటలు పాడటం పట్ల ఆసక్తి లేకపోవటంతో లత పాడే పాటల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇదంతా లతలో తాను పాడుతున్న పాటల పట్ల అసంతృప్తి పెంచింది. హిట్ అవుతున్న గీతాలు కూడా అంత నాణ్యమైన వేవీకావు. అప్పుడొక ‘ఏయ్ దిల్-ఎ-నాదాన్’ (రజియా సుల్తాన్), ఇప్పుడొక ‘తేరె బినా జియా జాయేనా’ (ఘర్)  వంటి సోలో పాటలు తప్ప అర్థవంతము, రాగబద్ధమైన సోలో పాటలు అరుదైపోయాయి. హిట్ అయ్యే   పాటలు కూడా ‘షాయద్ మేరే షాదీకా ఖయాల్’, ‘ఆంగ్రేజీ మే  కహాతే  హై కి ఐ లవ్ యూ’ వంటి పాటలు కావటం కూడా లత అసంతృప్తిని తీవ్రతరం చేసింది. ఫలితంగా సంగీతం ప్రాధాన్యం కల సినిమాను నిర్మించటం ద్వారా రాగరంజితమైన శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలను పాడి తన తృష్ణను సంతృప్తిపరచుకోవాలనుకుంది లత. ఫలితంగా 1987లో గుల్జార్ గేయరచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించగా హృదయనాథ్ సంగీత దర్శకత్వంలో ‘లేకిన్’ అనే సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.

‘లేకిన్’ సినిమాను లత నిర్మించాలనుకునే సమయానికి గుల్జార్‌కూ లతకూ నడుమ మాటలు లేవు. ‘మీరా’ సినిమాలో లత పాటలు పాడేందుకు నిరాకరించటం గుల్జార్‍కు బాధ కలిగించింది. సినిమా విజయం సాధించి ఉంటే, బహుశా అంతగా బాధపడేవాడు కాదేమో! సినిమా పరాజయం పాలవటం, పాటలు అనుకున్నంతగా హిట్ కాకపోవటం వల్ల గుల్జార్ లతతో కలసి పనిచేయటం మానేశాడు. తన సినిమా పరాజయానికి పరోక్షంగా లతను బాధ్యురాలిని చేశాడు. కానీ లత ఎప్పటిలాగే మౌనంగా ఉంది. కలసినప్పుడు మర్యాదగానే ప్రవర్తించింది. కానీ లత ‘లేకిన్’ సినిమా నిర్మించాలనుకున్నప్పుడు ఆమె తన సినిమాకు పాటలు రాసేందుకు స్క్రిప్టు రచించేందుకు దర్శకత్వం వహించేందుకు ఎంచుకున్నది గుల్జార్‍నే!

గుల్జార్ లత కలసి సినిమా గురించి చర్చించి, షూటింగ్ ఆరంభించటం నిర్ణయించేసరికి రెండేళ్ళు పట్టింది. రవీంద్రనాథ్ టాగోర్ రచన ‘క్షుదిత్ పాషాణ్’ ఆధారంగా లేకిన్ కథను రూపొందించాడు గుల్జార్. ఇక్కడ గమనించవలసిందేమిటంటే, గుల్జార్ లతతో కలసి పనిచేయకున్నా లత అతని పట్ల ఎలాంటి నిరసన భావనలు ప్రదర్శించలేదు. అతనిలోని కళాకారుడిని, సృజనాత్మకతను గౌరవించింది. లేకిన్ సినిమా రూపొందించటంలో సంపూర్ణ స్వేచ్ఛ నిచ్చింది. అతడికి తాను అవకాశం ఇస్తునట్టే కాక, తన సినిమాను రూపొందిస్తున్నందుకు అతడు తనకు సహాయం చేస్తున్నట్టు ప్రవర్తించింది. లత గుల్జార్‍ను ఎంచుకోవటం వెనుక అతడి ప్రతిభ సినీ నిర్మాణం పట్ల నిబద్ధత వంటి వాటితో పాటుగా, సమకాలీన గేయ రచయితలలో సాహిత్యంతో సన్నిహిత సంబంధం ఉండి, ఒక ప్రత్యేక దృక్కోణం ఉన్న ఏకైక గేయ రచయిత గుల్జార్ కావటం కూడా ఒక ప్రధాన కారణం.

1966 నుంచి ఒకొరొకరుగా లతకు సన్నిహితులు, లత అత్యంత గౌరవించేవారు, లతతో అద్భుతమైన గీతాలు రూపొందించేవారు తాము వచ్చిన పని అయిపోయినట్టు లోకం విడిచి తను గంధర్వ లోకానికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. 1966లో లత అత్యంత అభిమానించే గేయ రచయిత శైలేంద్ర మరణించాడు. 1967లో లత ఎంతో అభిమానించి, గౌరవించే సంగీత దర్శకుడు రోషన్ మరణించాడు. 1971లో శంకర్ జైకిషన్‍లలో జైకిషన్ మరణించాడు. జైకిషన్‍తో లతకు ఎంతో సన్నిహిత అనుబంధం ఉందేది. శంకర్ జైకిషన్‍లతో జైకిషన్ అత్యంత సృజనాత్మక సంగీత దర్శకుడిగా లత భావించింది. జైకిషన్‍తో వాదించేది. పోరాడేది. బాణీల విషయంలో సూచనలిచ్చేది. అంత సాన్నిహిత్యం ఉండేది జైకిషన్‍తో. దీనికి తోడు శంకర్ శారదను మరో లతగా ఎదిగించాలని ప్రయత్నిస్తున్నప్పుడు, లతలా ఎవరూ పాడలేరని, లత పాడగలిగే పాటలు లతతోనే పాడించాలని శంకర్‍తో విభేదించి, శంకర్‍కు దూరమయ్యాడు జైకిషన్ లత కోసం. అతని మరణం లతను బాధించింది. 1975లో ఎస్డీ బర్మన్ మరణించాడు. ఎస్డీ బర్మన్‍తో లత విభేదించినా, వారిద్దరి నడుమ గౌరవపూర్వమైన అనుబంధం ఉండేది. లత కోసం అత్యద్భుతమైన గీతాలను సృజించాడు ఎస్డీ బర్మన్. “నాకు తబలాను, వేణువును, లతను ఇవ్వండి చాలు” అనేవాడు ఎస్డీ బర్మన్. 1975లోనే మదన్ మోహన్ మరణించాడు. లతకు విధేయుడుగా ఉంటూ లతతో ఎలాంటి వివాదం లేకుండా చివరివరకూ లత కోసం పరమాద్భుతమైన పాటలను సృజిస్తున్నవాడు మదన్ మోహన్. అతని మరణం లతను వ్యక్తిగతంగా క్రుంగదీసింది. 1976లో గాయకుడు ముకేష్ మరణించాడు. ముకేష్‍ను భయ్యా అని అమితంగా ప్రేమించేది లత. అతనితో విదేశీ పర్యటనలు చేసింది. అలాంటి ఓ విదేశీ పర్యటనలో ముకేష్ హఠాత్తుగా మరణించాడు. దాంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని భారత్ వచ్చేసింది లత. ముకేష్ మరణం కూడా లతకు తీవ్రమైన వేదనను కలిగించింది. 1980లో కవి సాహిర్ లూధియాన్వి మరణించాడు. సాహిర్ లూధియాన్వి లతల నడుమ స్నేహం కన్నా ఒకరి ప్రతిభను మరొకరు గౌరవించటం అధికంగా ఉండేది. సాహిర్ పాటలు పాడేందుకు లత ఇష్టపడేది. 1980లో మహమ్మద్ రఫీ మరణం లతను అమితంగా బాధించింది. హిందీ సినీ గేయ ప్రపంచంలో లతకు పోటీగా నిలవగలిగిన ఏకైక గాయకుడు రఫీ. ఆమెను గౌరవిస్తూనే అవసరమైనప్పుడు విభేదించాడు రఫీ. అయితే వారిద్దరి నడుమ క్రోధం, ద్వేషాలు లేవు. రఫీ సౌమ్యుడు. దేనిపై ఆశలేనివాడు. ఎలాంటి వివాదాల జోలికిపోడు. ఎప్పుడూ నవ్వుతూ అందరితో స్నేహంగా ఉంటాడు తప్పించి ఎవ్వరికీ సన్నిహితుడు కాడు. అందరికీ ఆత్మీయుడు. ఒక్క దురలవాటు లేదు. అతడు మరణించటంతో లతకు పోటీ అంటూ లేని పరిస్థితి వచ్చింది. పోటీ పడటం వల్ల, ఒకరిని మించి ఒకరు పాడాలన్న తపన వల్ల వారి ప్రతి యుగళగీతం ఒక ఆణిముత్యంలా రూపొందింది. 1980 తరువాత లత పాటలు పాడిన విధానాన్ని గమనిస్తే పాటలు అద్భుతంగా పాడుతున్నా ఒక రకమైన నిరాసక్తత కనిపిస్తుంది. ఒక్క కిషోర్ కుమార్ తప్ప లతతో స్వరానికి స్వరం కలిపి పాడగలిగే గాయకుడు లేని పరిస్థితి వచ్చింది. నితిన్ ముకేష్, మున్నా, షబ్బీర్ కుమార్, సురేష్ వాడ్కర్ వంటి వారు ఎంత ప్రయత్నించినా లతకు ధీటుగా పాడలేరు. ఆమె హై పిచ్‍ను అందుకోలేరు. ఆమె భావ ప్రకటనను ఇనుమడింపచేసే విధంగా తామూ భావ ప్రకటన చేసి, పాట ప్రభావాన్ని పెంచలేరు. అందుకే 1980 తరువాత లత, కిషోర్ కుమార్‍తో కలసి పాడిన యుగళ గీతాలను, ఇతర గాయకులతో పాడిన యుగళ గీతాలను గమనిస్తే పాటను మరింత ఆకర్షణీయం చేసేందుకు, పాట ప్రభావం పెంచేందుకు లత మామూలు కన్నా ఎక్కువ ప్రయత్నించటం స్పష్టంగా తెలుస్తుంది. 1987లో కిషోర్ కుమార్ మరణించటం లతకు తీరని లోటు. లత కిషోర్ కుమార్‍ల నడుమ సన్నిహిత స్నేహబంధం ఉండేది. ఎవ్వరి మాట వినని కిషోర్ కుమార్ లత మాటను గౌరవించేవాడు, పాటించేవాడు. లతతో విదేశీ టూర్లుకు వెళ్ళేవాడు. కానీ మీరాను అవమానించే ‘పగ్  ఘుంఘురూ  ఘుంఘురూ మీర నాచీ థీ ‘ వంటి పాటలు పాడవద్దంటే బుద్ధిగా తల ఊపేవాడు. మరణించటానికి కొన్నిరోజుల ముందు లతను కలసి ఏడుస్తూ తన గోడు చెప్పుకున్నాడు. తరువాత అతడు మరణించాడు. అతడు లతతో చెప్పుకున్న బాధలేమిటని ఎవరెంత అడిగినా లత చెప్పలేదు. అతని రహస్యాన్ని తనతో పాటే స్వర్గానికి తీసుకువెళ్ళింది లత. హిందీ సినీ రంగంలో కిషోర్ కుమార్ అభిమానించి గౌరవించినవారు నలుగురే! ఎస్డీ బర్మన్, శంకర్ జైకిషన్‍లలో శంకర్, దేవ్ ఆనంద్, లత మంగేష్కర్‍ల మాటను జవదాటే వాడు కాదు కిషోర్ కుమార్. అంతటి సాన్నిహిత్యం ఉండేది  వారి నడుమ. కిషోర్ కుమార్ మరణంతో లత మంగేష్కర్‍తో కలసి ధీటుగా పాడే గాయకుడు కూడా లేకుండా పోయాడు. ఈ సమయానికి అనూరాధ పౌడ్వాల్‍తో సహా యువ గాయనిలు రంగంలోకి ప్రవేశించారు. సంగీత దర్శకులు కూడా యువ గాయనిలతో పాటలు పాడించాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది గమనించి లత నెమ్మదిగా పాటల సంఖ్యను తగ్గించుకుంది. అయితే అంతవరకూ లతకు విధేయంగా ఉంటున్న లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍లు కూడా యువ గాయనిల వైపు మొగ్గుచూపటం, ఈ విషయంలో వారి నడుమ విభేదాలు పొడచూపటం అర్థం చేసుకున్న లత, ఒక దశలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍కు పాడటం మానేసింది. ఇలాంటి పరిస్థితులలో ‘లేకిన్’ సినిమాకు సంగీత దర్శకుడిగా సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్‍ను ఎంచుకుంది.

ఆ సమయంలో శాస్త్రీయ సంగీత ఆధారిత బాణీలను రాజీపడకుండా సృజించేది ఒక్క హృదయనాథ్ మంగేష్కర్ మాత్రమే. అతని బాణీలు సంక్లిష్టంగా ఉంటాయి. పాడటం చాలా కష్టమని లత ఇంటర్వ్యూలలో చెప్పింది. హృదయనాథ్ మంగేష్కర్, అమీర్ ఖాన్ సాహెబ్ శిష్యుడు. దాంతో అతను సృజించే సంగీతంలో అమీర్ ఖాన్ సాహెబ్ ప్రభావం కనిపిస్తుందంటుంది లతా మంగేష్కర్. 1980 దశకంలో లత స్వరంలోని ఔన్నత్యాన్ని, ఉత్తమత్వాన్ని, శాస్త్రీయ సంగీతంపై ఆమెకున్న పట్టును సినీ గీతం ద్వారా ప్రదర్శించగలిగిన వాడు హృదయనాథ్ మంగేష్కర్ ఒక్కడే. నౌషాద్ అప్పటికి జీవించి ఉన్నా, అతని సృజనాత్మక స్రవంతి దాదాపుగా ఇంకిపోయిన పరిస్థితి ఉంది. పైగా చాలాకాలం అతను సినిమా పాటను రూపొందించలేదు. ఖయ్యామ్ అధికంగా భారతీయ సంగీతంపైనే ఆధారపడి పాటలను సృజించినా, ఖయ్యమ్ పాటలలో లాలిత్యం అధికంగా ఉంటుంది. ఆయనకు పాటలు మెత్తని స్వరంలో పాడటం ఇష్టం. అది గాయకుడికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వదు. అదీగాక సంగీత దర్శకుడిగా ఖయ్యామ్‍కు పరిమితులున్నాయి. అతనితో లత, హృదయనాథ్‍తో చర్చించినట్టు చర్చించలేదు. పాటల విషయంలో ఖయ్యామ్ మొండి. అందుకని కూడా లత హృదయనాథ్‍ను ఎంచుకుంది. లత నమ్మకాన్ని వమ్ము చేయలేదు హృదయనాథ్ మంగేష్కర్. అత్యద్భుతమైన పాటలను రూపొందించాడు.

లతా మంగేష్కర్ సినిమా నిర్మిస్తున్నది,  దానికి గుల్జార్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడని తెలియగానే ఆ సినిమాలో నటించేంచుకు నటీనటులు పోటీపడ్డారు. డింపుల్ కపాడియా ఎన్నోమార్లు లతను, గుల్జార్‍ను కలసి ‘లేకిన్’లో నటించే అవకాశం కోసం ప్రయత్నించింది. ‘లేకిన్ సినిమాలో పాత్ర నేను నా జీవితంలో నటించిన అత్యుత్తమ పాత్ర. నాకు చాలా ఇష్టమైన పాత్ర’ అని ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా చెప్తూంటుంది డింపుల్. ఆమె ఆత్మ పాత్ర వేస్తుంది. ఆత్మ కనురెప్పలు కొట్టదు కాబట్టి  సినిమా అంతా డింపుల్ కనురెప్పలు కొట్టకుండా ఒక శూన్యమైన దృష్టితో నటిస్తుంది. ఆమెకు నటిగా ప్రశంసలు లభించాయి కూడా!

నాయకుడిగా వినోద్ ఖన్నాను ఎంచుకున్నారు. రజనీష్ ప్రభావం నుంచి బయటకు వచ్చి మళ్ళీ సినిమాలలో నిలద్రొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న వినోద్ ఖన్నాతో గుల్జార్‍కు ఉన్న అనుబంధం దృష్ట్యా అతనికి లేకిన్‌లో నటించే అవకాశం లభించింది. 1989లో సినిమా షూటింగ్ ప్రారంభమయి, 1991లో సినిమా విడుదలైంది.

1991లో ‘లేకిన్’ విడుదల అయ్యే సమయానికి టి.సిరీస్ డైరెక్టర్‍గా అనూరాధ పౌడ్వాల్ సినీ సంగీత పరిశ్రమను శీర్షాసనం వేయిస్తోంది. కొత్త సంగీత దర్శకులు, కొత్త గాయకులతో, ఆకర్షణీయమైన బాణీలు, సులభంగా, అందరూ పాడుకొనే వీలున్న పాటలతో సంచలనం సృష్టిస్తోంది. సినీ పరిశ్రమ అంతా ‘పాతతరం పని అయిపోయింది,  ఇది అనూరాధ యుగం’ అని ఒప్పేసుకునే స్థాయిలో సినీ గీతాల ప్రపంచాన్ని అనూరాధ నిర్దేశించే స్థితికి చేరుకుంది. త్వరలోనే అనూరాధ సినీ రంగంలో నెంబర్ వన్ గాయనిగా ఎదుగుతుందన్న నమ్మకం ప్రతి ఒక్కరూ ప్రకటించసాగారు. లతకు విధేయులుగా ఉన్న సంగీత దర్శకులు కూడా యువ గాయనిల వైపు మొగ్గు చూపించసాగారు. 1991కి లతకు అరవై రెండేళ్ళు. తెరపైకి వస్తున్న నాయికల సగటు వయసు పద్దెనిమిదేళ్ళు. దాంతో ఇంకా ఎంతకాలం లత చిన్నపిల్లలకు ప్రేమ గీతాలు పాడుతుందన్న నిరసన వ్యాఖ్యానాలు వినబడటం ఆరంభమయింది. ఇలాంటి పరిస్థితులలో ‘లేకిన్’ సినిమా పాటలు విడుదలయ్యాయి.

లతా మంగేష్కర్‍ను ఇతర గాయనిల నుంచి వేరుగా, ఉన్నత స్థానంలో నిలిపే ప్రధానాంశం ఆమె స్వరం. ఇతరుల స్వరాలు తీయగా ఉండవచ్చు. వారి భావ ప్రకటన అద్భుతంగా ఉండవచ్చు. వారు తన స్వరాలతో నటించే ప్రయత్నాలు చేయవచ్చు కానీ లత స్వరంలా తామే పాట అయిపోయి, పాటకు వ్యక్తిత్వాన్ని ఇస్తూ ప్రత్యేక అస్తిత్వాన్ని ఆపాదించే గాయని మరొకరు లేరు. కొన్నివందల తరాలలో ఒకరు జన్మిస్తారు ఇలాంటి అత్యద్భుతమైన లక్షణాలున్న స్వరంతో. అది దైవదత్తం! లత పాట వినటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ అనుభూతిని మాటలలో చెప్పటం కుదరదు. అది మనసుతో అనుభవించాల్సిందే. ఎవరెవరి సున్నితత్త్వాన్ని బట్టి,  ఎవరెవరి మనస్తత్వాన్ని బట్టి, ఆత్మ సంస్కారాన్ని బట్టి లత పాట వ్యక్తులలో విభిన్నమైన అనుభూతులను కలిగిస్తుంది. సున్నితత్త్వాన్ని జాగృతం చేస్తుంది. జన్మజన్మల సంస్కారాన్ని నిద్రాణ స్థితి నుంచి తట్టి లేపుతుంది. తాను పాడిన తొలిపాట నుంచి 2019లో రికార్డు చేసిన చివరిపాట వరకూ ప్రతి పాట సినీ పరిధి దాటి, సినిమా పాత్రల పరిధిని దాటి, ప్రతి వ్యక్తి అంతరంగంలో అలలు అలలుగా స్పందనలు కలిగించే అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది లత పాట. ఒక్కో పాట వింటూంటే లత స్వరం వ్యక్తి శరీర పధిని అధిగమించి, అతని ఆత్మకు రెక్కలనిచ్చి అలౌకికానుభూతుల ఆకాశంలో విశృంఖలంగా విహారం చేయిస్తుంది. వ్యక్తికి పరిచయం లేని అనుభూతులను అనుభవానికి తెచ్చి భావించేట్టు చేస్తుంది. ఒక్కో పదాన్ని ఉచ్చరించటం ఎంత గొప్పగా ఉంటుందంటే అక్షరాలలో ఒదిగి ఉన్న బీజాక్షర స్పందనలను ప్రస్పుటం చేస్తూ వ్యక్తులలో నిద్రాణమైన ఉన్న జన్మజన్మల అనుభూతులను, సంస్కారాలను జాగృతం చేసి వ్యక్తిని ఉన్నతుడిని చేస్తుంది. బండలో కూడా స్పందనలు కలిగించి అంతరంగాన్ని కరగించి ఆనంద ప్రవాహాలను పొంగి పొర్లిస్తుంది. ఒకటా? రెండా? 1946 నుంచి కొన్ని వేల పాటలు ఇలాంటి అనేక అనుభూతులను కలిగించగల శక్తితో అలరారుతూంటాయి. ఇలా పాడగలగటం సామాన్యులకు  సాధ్యం కాదు. శాస్త్రీయ సంగీత ప్రపంచంలో కూడా అందరు పాడేవి అవే రాగాలైనా, పలికేవి అవే స్వరాలైనా ఒక పండిత జస్రాజ్, ఒక బడే గులామ్ అలీఖాన్, ఒక భీమ్‌సేన్ జోషి, ఒక బాలమురళీకృష్ణ, ఒక ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, ఒక కిషోరీ అమోన్‍కర్, ఒక బేగం అక్తర్, ఒక గంగూబాయ్, ఒక కుమార్ గంధర్వలు దీప స్తంభాలుగా నిలుస్తారు. సినీ సంగీత ప్రపంచంలో అలాంటి అత్యుత్తమమూ, అత్యున్నతమూ అయిన దీప స్తంభం లతా మంగేష్కర్ స్వరం!

అలాంటి లతా మంగేష్కర్‍ను సవాలు చేయటం ఆమె కన్నా అద్భుతంగా గొప్పగా పాడి ఆమెను ‘అధిగమించాం’ అని భావించటమూ, మూర్ఖత్వానికి, అమాయకత్వానికి పరాకాష్ఠ. లత హిమాలయం. ఆమెతో పోటీ పడేవారు ఈ విషయాన్ని మరచి, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తే, అభాసుపాలయ్యేది, నష్టపోయేది వారే! అలాగని వారి ప్రతిభను తక్కువ చేసే వీలు లేదు. వారిలోనూ అత్యద్భుతమైన ప్రతిభ ఉంది. పాటలు పాడగలిగే ప్రతి ఒక్కరికీ సరస్వతీ కటాక్షం ఉంటుంది. సరస్వతీ కటాక్షం లేనిదే స్వరం పెగలదు. కలం కదలదు. వాక్కు ప్రవహించదు. కాబట్టి పాటలు పాడే ప్రతి ఒక్కరికీ సరస్వతి కటాక్షం ఉన్నట్టే. వారిలో అదృష్టం ఉన్నవారి ప్రతిభను పదిమందీ గుర్తిస్తారు. అదృష్టం లేనివారు ఎంత ప్రతిభ ఉన్నా వెనుకబడతారు. కానీ లతకు సరస్వతీ కటాక్షం కాదు, లత స్వరంలోనే సరస్వతి నివసిస్తుంది. సరస్వతీ దేవి తన అంశను భూమిపైని మానవులకు అలౌకిక గానాన్ని అనుభూతికి తెచ్చేందుకు లతా మంగేష్కర్ స్వరాన్ని సృజించింది అనిపిస్తుంది. అలాంటి ఆమెతో పోటీ అనే ప్రసక్తి లేదు. ఆమె స్థాయి హిమాలయం. ఆమె స్వరం అంతరిక్షం లోలోతుల్లో ప్రతిధ్వనించే ఓంకార నినాద ప్రతిధ్వని! మిగతావారు పాటలు పాడతారు. లతనే పాట! లతనే అనుభవం! లత స్వరమే అనుభూతి! ఈ విషయాన్ని లత అరవై ఏళ్ళ వయస్సులో రికార్డు చేసిన ‘లేకిన్’ పాటలు నిరూపిస్తాయి.

‘లేకిన్’ పాటల స్థాయి మామూలు సినిమా పాటలతో పోల్చటం కుదరదు. శాస్త్రీయ సంగీతంలో అమృతతుల్యమూ, అత్యున్నతమూ, అత్యద్భుతమూ, స్వర్గ సమానమైన లక్షణాలన్నిటినీ ఒకచోట కుప్పపోసి, అతి తక్కువ సమయంలో అత్యంత ప్రభావం చూపగల సినిమా పాటల రూపంలోకి తర్జుమా చేస్తే ‘లేకిన్’ సినిమా పాటలు రూపొందుతాయి. ‘లేకిన్’లో ఒక్కోపాట వింటుంటే పాట బాణీ, రచనలు ఎంత గొప్పగా ఉన్నా అన్నింటినీ అధిగమించి అలరిస్తుంది, ఆశ్చర్య పరుస్తుంది లత స్వరం. మానవ ప్రపంచ పరిధులను దాటి దైవీలోకం నుంచి వినిపిస్తున్న సుందర సుమధుర సురస్వరధార అనిపిస్తుంది. తన స్వరంతో శ్రోత హృదయానికి రెక్కలనిచ్చి అలౌకికానందపు ఆకాశాల్లో విహరింపచేస్తుంది లత ‘లేకిన్’ పాటలతో.

‘యారా సిలిసిలి’ పాట ఆరంభం నుంచీ మైమరపించేస్తుంది. ముఖ్యంగా చరణాలలో హైపిచ్‍లో లత స్వరం ఆనందపుటాకాశాలకు ఎగసినప్పుడు సంగీత శక్తి తెలుస్తుంది. పాట చివరలో ‘యారా’ అని ‘ఢోలా’ అని దీర్ఘం తీస్తూ హైపిచ్‍కి వెళ్ళినప్పుడు మనసు అలౌకికానందపు విశాల విహాయాసంతో విశృంఖల విహారం చేస్తుంది. ‘ఇది పాటనా? వ్యక్తి మనసుకు రెక్కలనిచ్చి ఆనందాంబరపు వీధులలో విహరింపచేసే మాయా పేటీనా?’ అనిపిస్తుంది. ‘కేసరియా బల్మా’ పాట ఆరంభంలో ఆలాపనతోనే మైమరపింప చేస్తుంది. ఒక్కో శబ్దాన్ని లత పలికిన తీరు భావాన్ని ప్రతిబింబింపచేసిన తీరు అమోఘం. మానవ మాత్రులకు ఇది సాధ్యం కాదు. ఈ పాట రెండు మార్లు రెండు భిన్న అర్థాలు, భావాలు ధ్వనించేట్టు పాడింది లత. ‘సునియోజీ అరజ్ మారియో’ పాట అయితే, ఎదను ద్రవింపచేస్తుంది. తనని వచ్చి తీసుకెళ్ళమని పుట్టింటి వారిని అభ్యర్థిస్తున్న లత స్వరం హృదయపు ఆక్రందనను అనుభవింపచేస్తుంది. ‘కేసరియా’ అని దీర్ఘరాగం తీసి పాడినప్పుడు కలిగిన వేదనను భిన్నమైన వేదన ‘సునియోజీ’ అని ఉచ్చస్వరంలో లత అభ్యర్థిస్తున్నప్పుడు కలిగే ఆవేదనకు అనుభూతిలో స్వరూపంలో ఎంతో తేడా ఉంది. ఈ తేడాను కేవలం తన స్వరం ద్వారా అనుభూతికి తెచ్చిన లతా మంగేష్కర్ మామూలు గాయని కాదు, సరస్వతీ స్వరూపం అనిపించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇక ‘మై ఏక్  సదీ సే బైఠీ  హూ’ పాటలో లత గొంతు పలికిన ఒంటరితనం, నిరాశనిస్పృహలు అనుభవైక వేద్యం. ఈ పాట వింటూంటే కొన్నివేల ఏళ్ళుగా, ఒంటరిగా ఎదురుచూస్తూ మనస్సు ప్రాంగణంలో కి ఎవరైనా అడుగు పెడతారేమో అని ఎదురుచూస్తూ  కూర్చున్న ఓ ఒంటరి ఆత్మ మనస్సు తెరపై కదలాడుతూంది. ఈ పాట వింటుంటే తనకోసం అత్యద్భుతమైన గీతాలను సృజించి మరలిరాని లోకాలకు వెళ్ళిపోయి, తనను ఒంటరిగా మిగిల్చిన సంగీత దర్శకులు, గేయ రచయితలను తలచుకుని విలపిస్తున్నట్టనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పాట బాణీ దీనానాథ్ మంగేష్కర్ రూపొందించిందన్న  నిజం గమనిస్తే పాటలో తండ్రి కోసం ఎదురుచూపులు కనిపిస్తాయి.

‘లేకిన్’ పాటలతో  లతా మంగేష్కర్ పలు విషయాలు స్పష్టం చేసింది. 1970 తరువాత ముఖ్యంగా సినీ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగం అంతమైన తరువాత లత హిట్ పాటలు ఎన్నో పాడి ఉండవచ్చు, దేశ ప్రజలను ఉర్రూతలూగించి ఉండవచ్చు కానీ లత స్వర ప్రతిభను సరైన రీతిలో ప్రదర్శించే పాటలు కావవి. లత స్వర స్థాయికి తగ్గ పాటలు కావవి. స్వర్ణయుగంలోని సంగీత దర్శకులు ఏ స్థాయిలో లత స్వరాన్ని వాడి ఆమె స్వరానికి సవాళ్ళు విసిరి, ఆమె స్వరంలోని పరమాద్భుత ప్రతిభను, ఆమె గాన నైపుణ్యాన్ని ప్రదర్శించారో, ఆ స్థాయిలో ఆధునిక సంగీత దర్శకులు లత స్వరాన్ని వాడలేకపోతున్నారన్న విషయం ‘లేకిన్’ పాటలతో స్పష్టమైంది. ‘లేకిన్’ పాటలతో స్పష్టమైన మరో విషయం, లతలో ఇంకా ఎంతోకాలం పాడగలిగే శక్తి ఉందని. అరవైలో కూడా ఇరవై ఏళ్ళ వయసులా ధ్వనించటమే కాదు లతలా మరొకరు పాడలేరన్న విషయాన్ని లత ‘లేకిన్’ పాటలతో స్పష్టం చేసింది. ‘లేకిన్’ పాటలతో లత స్పష్టం చేసిన మరొక విషయం, తనను ఛాలెంజ్ చేస్తూ తనపై ఆధిక్యం సాధిస్తున్నామని సంబరపడుతున్న యువగాయనిలు అంతా తన ప్రతిభముందు పసిపిల్లల లాంటి వారేననీ, హిమాలయం లాంటి తన స్థాయిని అందుకోవటం వారికి అసాధ్యం అన్న విషయం స్పష్టం చేసింది. ఆ కాలంలో వస్తున్న పాటల ముందు ‘లేకిన్’ పాటలు ఎడారిలో ప్రాణం పోయే సమయానికి లభించిన ఒయాసిస్ లాంటివి. ‘లేకిన్’ పాటలు  విన్నవారికి ఆ కాలంలో వస్తున్న పాటలు ఎంత మామూలు పాటలో అర్థమయింది. ఇప్పటికి కూడ పలువురు గాయనిలు లత పాడిన ఎన్నోపాటలు పాడతారు కానీ ‘లేకిన్’ పాటలు పాడే సాహసం చేయరు. అభాసుపాలు కావటం ఎవరికి ఇష్టం ఉంటుంది?

‘లేకిన్’ పాటలతో తన ఆధిక్యాన్ని నిరూపించుకోవటమే కాదు, ఆ కాలంనాటి యువగాయనిలంతా తనముందు ‘బచ్చీ’  లని నిరూపించింది లత. ఆ పాటలు వింటున్నవారికి సినీ సంగీతంలో తాము కోల్పోయినది, కోల్పోతున్నది అర్థమయింది. మందార మకరంద మాధుర్యం తెలియనంత వరకే కదా మధుపం మదనముల వెంట తిరిగేది. ఒక్క ‘లేకిన్’ పాటలతో లత అనూరాధ పౌడ్వాల్ అంతవరకూ సాధించిన విజయాలను తుడిచిపెట్టి, అనూరాధ స్థాయి ఏమిటో నిరూపించింది. అనూరాధ పౌడ్వాల్ పాడిన పాటలన్నీ ఒకవైపు, ‘లేకిన్’ సినిమాలో ఏ పాటలోనైనా లత చేసిన ఒక్క  ఆలాపన ఒకవైపు పెడితే ఆ ఒక్క ఆలాపన ముందు అనూరాధ పౌడ్వాల్ మాత్రమే కాదు ఇతరుల పాటలన్నీ తేలిపోతాయి.

లేకిన్ పాటలకు జాతీయ స్థాయిలో బహుమతి లభించింది. పాటల రికార్డుల అమ్మకాలు అంబరాన్ని తాకాయి. సినిమా అంతగా హిట్ కాకపోయినా, పాటలు మాత్రం గీటురాయిలా నిలచిపోయాయి. 1950, 60లలో లత అద్భుతంగా పాడటం వేరు. కానీ 1990లో ‘లేకిన్’ లాంటి పాటలు పాడటం, వయస్సనేది లత శరీరానికే తప్ప స్వరానికి కాదనిపించింది.

‘లేకిన్’ పాటలతో సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాము మరచిపోయిన, విస్మరించిన దివ్యస్వరం ఒక్కసారిగా వారిని జాగృతులను చేసింది. రొటీన్ పాటల వేటలో హిట్ పాటల ఆత్రంలో తాము విస్మరించిన మాధుర్యం జ్ఞప్తికి వచ్చింది. 1989లో ‘మైనే ప్యార్ కియా’ పాటలలో యువనటి భాగ్యశ్రీకి లత స్వరం కుదరటమే కాదు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  1989లోనే   ‘చాంద్నీ’  సినిమా సూపర్ హిట్ అవటంలో శ్రీదేవి కి లత నేపథ్యంలో అందించిన పాటలు ప్రధాన పాత్ర వహించాయి. ముఖ్యంగా లతకు అస్సలు నచ్చని మేరే హాథోమే నౌ నౌ చూడియాన్ హై పాట దేశమంతా ధూం మచాయించింది. పాటలో కొన్ని భావాలు లతకు అభ్యంతర కరంగా తోచాయి. ఈ పాటలో అక్కడక్కడా లత స్వరంలో తీయదనం లోంచి వయసు తొంగి చూడటం గమనించవచ్చు. అయినా ఒకే సంవత్సరం అటు భాగ్యశ్రీ కీ ఇటు శ్రీదేవికీ పాడి మెప్పించటం లత పనయిపోయిందన్నవారికి చెంపపెట్టు లాంటిది.  లత పనయిపోయిందన్న వారికి లత సమాధానం తన పాటతోనే ఇచ్చింది.  1990లో ‘లేకిన్’ పాటలతో 1991లో మళ్ళీ లత విజృంభించింది. ఆమెతో పాటలు పాడించేందుకు నిర్మాతలు, సంగీత దర్శకులు పోటీలు పడ్డారు. అంటే ఓ వైపు అనూరాధ పౌడ్వాల్, అల్కా యాగ్నిక్, కవిత కృష్ణమూర్తి వంటి వారు హిట్ పాటలు పాడుతూ తమ కెరీరును నిర్మించుకుంటుంటే మరోవైపు లత అత్యంత నాణ్యమైన పాటలతో యువ గాయనిల లోపాలను ఎత్తిచూపిస్తూ, సినిమా పాటలు ఎలా పాడాలో ప్రదర్శిస్తూ సూపర్ హిట్ పాటల ప్రవాహంతో ప్రజలను ఆనంద పరవశులను చేసిందన్నమాట. 1991లో 100 డేస్, హీనా, లమ్హే, లిబాస్, పత్థర్ కే పూల్, సాదాగర్ వంటి సినిమా పాటలతో తనకు తిరుగులేదని నిరూపించింది.

‘మైనే ప్యార్ కియా’, ‘లేకిన్’ వంటి సినిమాల పాటలు హిట్ అవటంతో నిర్మాతలు సంగీత దర్శకులు పునరాలోచనలో పడ్డారు. సినిమా ప్రపంచంలో ఎవరికైనా కావాల్సింది హిట్. అది ఎవరిస్తే వారే దైవం. లత పాటలు తగ్గించుకుని, టి.సిరీస్ ద్వారా అనూరాధ హిట్ పాటలిస్తున్న సమయంలో అందరూ అనూరాధ వైపు మళ్ళారు. కానీ టి-సిరీస్ అధినేతగా అనూరాధ స్వార్థపూరిత నిరంకుశ ప్రవర్తన, నిర్మాతలను ఇతరుల వైపు మళ్ళించింది. దాంతో అనూరాధ పౌడ్వాల్ టి-సిరీస్ నుంచి తప్ప ఇతరుల నుంచి పాడేందుకు పిలుపు రావటం తగ్గిపోయింది. దాంతో తాను టి-సిరీస్ పాటలే పాడతానని అనూరాధ ప్రకటించింది. ఎప్పుడైతే అనూరాధ టి-సిరీస్ పాటలే పాడతానని ప్రకటించిందో వెంటనే నిర్మాతలు అల్కా యాగ్నిక్, కవిత కృష్ణమూర్తి, సాధనా సర్గమ్ వంటి ఇతర గాయనిల వైపు మళ్ళారు. సినిమా రంగంలో ఒక అండ ఉండటం విజయానికి సోపానం అని గ్రహించిన అనూరాధ ఒకరికే పరిమితమవటం ఆత్మహత్యా సదృశ్యం అని అర్థం చేసుకోలేకపోయింది.

ఏ కళాకారుడైనా ఒకే రకమైన పాత్రలు వేసినా, ఒకే నిర్మాణ సంస్థకు పరిమితమైనా కళాకారుడిగా అతడి ఎదుగుదల ఒక స్థాయిని మించి సాగదు. ఒక వ్యక్తిపై ఆధారపడటం అంటే ఆ వ్యక్తి లేకపోతే మనుగడ అన్నది లేకపోవటం. లతా మంగేష్కర్‍పై ఆధారపడిన సి. రామచంద్ర, శంకర్ జైకిషన్‍లు లత పాడననగానే ఇబ్బందులెదుర్కొన్నారు. ఉన్నతస్థానం నుంచి దిగజారారు. శంకర్ జైకిషన్‍పై ఆధారపడిన శారద, రవీంద్ర జైన్ పై ఆధారపడిన హేమలత వంటివారు ఆయా సంగీత దర్శకుల ‘అదృష్టం’ మలుపు తిరగగానే కనుమరుగైపోయారు. ఓ.పి. నయ్యర్, ఆశా భోస్లేపై ఆధారపడ్డాడు. కానీ ఆశా బోస్లే ఓ.పి. నయ్యర్‍కు పరిమితం కాలేదు. తరువాత ఆర్డీ బర్మన్‍ను వివాహం చేసుకున్నా, ఇతర సంగీత దర్శకులకు పాడింది. గీతాదత్ గురుదత్ సినిమాలకే పరిమితమై కెరీరును పాడుచేసుకున్నట్టు ఆశా భోస్లే చేయలేదు. ఆర్డీ బర్మన్‍కు సినిమాలు లేక ఆశా ఇతర సంగీత దర్శకులకు పాడుతుంటే అసూయ ప్రదర్శించినందుకు ఆర్డీతో  వేరుగా ఉండేందుకు సిద్ధపడింది ఆశా. అంతే తప్ప ఆర్డీకే పరిమితమవ్వాలని అనుకోలేదు. ఇలా ఒకరికే పరిమితం కాకపోవటం వల్ల కళాకారుడి పరిధి విస్తృతమవుతుంది. అతడి విజయావకాశాలు మెరుగుపడతాయి. పైగా పలువురు కళాకారులు అత్యద్భుతమైన సృజనాత్మక ఫలాన్ని అనుభవించటం వల్ల కళాకారుడు సృజనాత్మక పాటవం కూడా మెరుగుపడుతుంది. అప్పుడు ఒకరు కాదన్నా కళాకారుడికి నష్టం ఉండదు. ఈ విషయం అనూరాధ గ్రహించలేకపోయింది.

టి-సిరీస్‍కే పరిమితం అవటంతో విస్తృతమైన సినిమారంగంలో ఒక చిన్నగదికి పరిమితమైనట్టయింది. దీనికి తోడు టి-సిరీస్ సంగీత దర్శకులంతా నూతన సంగీత దర్శకులు, అంత అనుభవజ్ఞులు కారు. అందువల్ల ఎలాంటి బాణీలు హిట్ అవుతాయో అలాంటి బాణీలను సృజించటానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప సృజనాత్మక ప్రదర్శనపై దృష్టి ఉండదు. దాంతో అనూరాధ పౌడ్వాల్ పాటలు హిట్ అవుతూన్నా కొన్నాళ్ళకి పాటలు రొటీన్ అవటం ఆరంభమైంది. ఇదే సమయానికి ఇతర సంగీత దర్శకులు ఇతర గాయనిలతో అత్యద్భుతమైన పాటలు పాడించారు. దీనికి తోడు 1991లో ‘రాధా కా సంగం’ విడుదలయ్యే సమయానికి ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన అనూరాధ పౌడ్వాల్ భర్త అరుణ్ పౌడ్వాల్ ఓ ప్రమాదంలో ఆకాలమరణం చెందాడు. వ్యక్తిగతంగా ఇది అనూరాధ పౌడ్వాల్‌ను క్రుంగదీసింది. ఆ సమయంలో ఆమె టి-సిరీస్‍కే పరిమితమవ్వాలని నిశ్చయించుకుంది.

అరుణ్ పౌడ్వాల్ మరణం తరువాత టి-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్, అనూరాధల గురించిన గాలివార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అనూరాధ టి-సిరీస్ తనదే అయినట్టూ ప్రవర్తించటం, సంగీత దర్శకులకు బాణీల విషయంలో సూచనలిస్తూ అధికారికంగా ప్రవర్తించటం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. సినీ పరిశ్రమ పైకి కనబడేంత అందమైనది కాదు. ఒక వ్యక్తిని క్షణంలో ఎంత ఎత్తుకు ఎత్తేస్తుందో, మరో క్షణంలో అంత లోతుల్లోకి నొక్కేస్తుంది. నిజం ఏమిటో కూడా తెలియనంతగా అబద్ధాన్ని నిజంగా నమ్మిస్తుంది. ఈ నీలివార్తలు, ఆరోపణల నుంచి అనూరాధ తేరుకుని తన కెరీరును ఒకదారిలో పెట్టేలోగా, టి-సిరీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన సంగీత దర్శకులు, గాయకులు గుల్షన్ కుమార్‍తో విభేదించి టి-సిరీస్ విడిచి వెళ్ళారు. నదీమ్ శ్రావణ్‍లతో గుల్షన్ కుమార్‍ల విభేదాలు పరోక్షంగా గుల్షన్ కుమార్‍ను అండర్ వరల్డ్ వారు వెంటాడి చంపటానికి దారి తీశాయంటారు. నిజం ఎవరికీ తెలియదు, కానీ నదీమ్ శ్రావణ్‍లలో నదీమ్ బొంబాయి వదలి లండన్ పారిపోయాడు. దాంతో నదీమ్ శ్రావణ్ జట్టు దెబ్బతిన్నది. గుల్షన్ కుమార్ మరణంతో కొద్దికాలానికి అనూరాధ పౌడ్వాల్ టి-సిరీస్‍ను విడవాల్సి వచ్చింది. తానిక సినిమా పాటలు పాడనని భజనలపైనే దృష్టి పెడతానని అనూరాధ పౌడ్వాల్ ప్రకటించింది –    లతకు ప్రత్యామ్నాయం అనుకున్న గాయని దారి పక్కన పడింది. ‘లేకిన్’లో లత పాడిన ‘మై ఏక్ సదీ సే బైఠీ హూ, ఇస్ రాహాసే కోయీ గుజ్‍రా నహీ’ అని ఎన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నా  లతకు ప్రత్యామ్నాయం లభించటం లేదని విషాదంతో పాడుకొంటుంటే లత అభిమానులు, లత పాటలకు పరవశిస్తూ ‘హమ్ ఆప్కే, ఆప్కే కౌన్’ అని ఆనందంతో ప్రశ్నిస్తూ ఇంకా లత పాడే మధురమైన పాటల కోసం ఎదురు చూడసాగారు.

1970 నుండి 1987 నడుమ పద్ధతి ప్రకారం సినిమాల్లో పాటలు పాడటం లత తగ్గించింది. కానీ ఈ సమయంలో ఆమె విదేశీ పర్యటనలు చేస్తూ తన పాటలతో దేశ విదేశాలలో భారతీయులను అలరించింది. దేశంలో కూడా స్టేజీ షోలు చేస్తూ, ఛారిటీ షోస్ చేస్తూ పాటలు పాడుతూ ముందుకు సాగింది. ఈ విషయంలో కూడా లతను విమర్శిస్తూ, లేనిపోని వివాదాలు సృష్టిస్తూ లతను దెబ్బతీయాలని ప్రయత్నించేవారు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here