సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-4

1
10

[dropcap]జో[/dropcap] తార్ సె నిక్ లీ హై వో ధున్ సబ్ నే సునీహై

జో సాజ్ పె  గుజ్‍రీ హై వొ  కిస్ దిల్ కొ పతాహై

‘చాందీ కీ దీవార్’ సినిమాలో సాహిర్ రాసిన ‘అష్కోన్ నె జొ పాయా హై’ పాటకు బాణీని కూర్చింది ఎన్. దత్త. పాటలోని ఈ పంక్తులు లతా మంగేష్కర్‍కు చాలా ఇష్టమైనవని పలు సందర్భాలలో లత స్పష్టం చేసింది. తీగ నుంచి వెలువడిన బాణీని/గానాన్ని అందరూ వింటారు. కానీ ఆ బాణీ సృజనలో తీగ కానీ, తీగ నుంచి వెలువడుతున్నప్పుడు బాణీ కానీ ఎలాంటి కష్టాలననుభవించాయో, వాటి అనుభవాలేమిటో ఎవరి హృదయానికి తెలుసు? ఎవరికి తెలుసు? సృజన ఏదైనా బాధతో,  తపనతో కూడుకున్నది. ప్రపంచం సృజనను చూస్తుంది. కానీ ఆ సృజన వెనుక ఉన్న కష్టాన్ని పట్టించుకోదు. ఒక అందమైన రూపం ధరించేముందు శిల అనుభవించిన ఉలి దెబ్బలు ప్రపంచం గమనించదు. అందమైన రూపాన్నే గమనిస్తుంది. ప్రపంచం లత స్వరం విని పరవశిస్తుంది. ఆ స్వరాన్ని పలుకుతున్న హృదయవేదన ప్రపంచానికి అనవసరం.

1998లో లత చివరిసారి అమెరికాలో పాటలు పాడినప్పుడు “నేను ఎప్పుడూ మీరు కోరిన పాటలు పాడుతుంటాను. ఇప్పుడు మీరు నాకు ఇష్టమైన పాటను వినండి. నచ్చితే కరతాళ ధ్వనులతో అభినందనను తెలియజేయండి. నచ్చకపోతే నిశ్శబ్దంగా ఉండండి” అంది. ఆ సందర్భంలో ఆమె పాడిన పాట –

కుచ్ దిల్ నె కహా,  కుచ్ భి నహీన్..

కుఛ్ దిల్ నె సునా , కుఛ్ బి నహీ

ఐసే భీ బాతే హోతీ హై, ఐసే భీ బాతే హోతీ హై

ఈ పాటలోని ఓ పంక్తిని ఆమె ప్రత్యేకంగా పాడారు.

జీవన్ తో సూనా హీ రహా, సబ్ సంఝే ఆయీ హై బహార్

కలియోంసే కోయీ పూఛ్‍‌తే, హస్తీ హై వొ నా రోతీ హై

అందరూ జీవితంలోకి వసంతం వచ్చిందనుకున్నారు. కానీ, జీవితం శూన్యంగానే వుంది. పూల అందాన్ని చూస్తాం. ఆనందిస్తాం. కానీ ఎవరూ పూల మానసిక స్థితిని అడగరు. వాటి మనోభావాల గురించిన ఆలోచన కూడా రాదు . అందమైన వస్తువుల గతి అంతే…..

లతకు ఈ రెండు పాటల్లో ఇష్టమైన ఈ రెండు భావాలకు, ఓ ఇంటర్వ్యూలో లత అన్నమాటలను జతపరిచి విశ్లేషిస్తే లత మనస్సును గ్రహించే వీలవుతుంది. తీగ నుండి వెలువడే స్వరం వేదన, అందమైన పూల మనస్సులోని ఆవేదనను అర్థం చేసుకునే అవకాశం చిక్కుకుంది.

జావేద్ అఖ్తర్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘మరో జన్మంటూ ఉంటే ఏమవుతారు?’  అన్న ప్రశ్నకు  సమాధానంగా “నా హి జనం మిలే తో అచ్చా హై ఔర్ అగర్ వాకాయి మిలా ముఝే తో మైన్ లతా మంగేష్కర్ బన్ నా నహీ చాహూంగి” ( మరో జన్మ లేకపోతేనే మంచిది. ఒకవేళ మరో జన్మంటూ ఉంటే మాత్రం లత మంగేష్కర్‍గా జన్మ వద్దు’) అంది. ఆశ్చర్యపోయిన ఇంటర్వ్యూ చేసే జావేద్ అఖ్తర్ “అదేమిటి?” అనడిగాడు.  “లతా మంగేష్కర్ కి జో తక్లీఫే హైన్ వో ఉస్కో హీ పతా హైన్” ( లతా మంగేష్కర్ కు  ఏం కష్టాలుంటాయో లతా మంగేష్కర్ కే తెలుసు. )అంది సమాధానంగా.

‘దూరపు కొండలు నునుపు’ అంటారు. దూరం నుంచి చూస్తే హిందీ సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాణి లతా మంగేష్కర్. మహమ్మద్ రఫీ ఆమెను ‘మహారాణీ’ అనేవాడు. సంపూర్ణంగా పురుషాధిక్య ప్రపంచమైన సినీ రంగంలో లత మహరాణిలా రాజ్యం చేసింది. ఆమె కరుణ ఎవరిపై ప్రసరిస్తే వారు శిఖరారోహణం చేరారు. ఎవరిపై కినుక వహిస్తే వారు శిఖరం నుంచి అధఃపాతాళానికి దిగజారారు. ఆమె గదిలో అడుగుపెడితే ప్రధానులు, ప్రెసిడెంట్లు కూడా గౌరవంతో లేచి నిలబడేవారు. ఆమె గదిలో ఉంటే చైన్ స్మోకర్లు కూడా చేతులు కట్టుకుని నిలబడేవారు. బడా బడా నిర్మాతలు, నటులు, షోమెన్లు కూడా ఆమె ముందు మంచినీళ్ళు కూడా అమె అనుమతితో తాగేవారు. దేశంలోని పలు గాయనిలు లత స్థాయికి ఎదగాలని తపనపడుతున్నారు.  ప్రతి గాయని లక్ష్యం లత స్థాయికి చేరటమే. అలాంటి లతా మంగేష్కర్ తనకు మరో జన్మంటూ ఉంటే, ‘లతలా మాత్రం జన్మవద్దు’ అనటం ఆశ్చర్యంతో పాటు ఆలోచనను కలుగజేస్తుంది. లత ఈ వ్యాఖ్య వెనుక మనసును గ్రహించాలంటే లత తండ్రి దీనానాథ్ మంగేష్కర్ మరణం తరువాత నుంచి లత హిందీ సినీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగేంతవరకూ జరిగిన సంఘటనలను విశ్లేషించాల్సి ఉంటుంది.

దీనానాథ్ మంగేష్కర్ మరణించినప్పుడు లత వయస్సు పదమూడు. పదమూడేళ్ళు అటు పెద్ద వయసు కాదు ఇటు చిన్న వయసు కాదు. అప్పుడప్పుడే ప్రపంచం తెలుస్తూంటుంది. తెలియకుండా ఉంటుంది. విషయాలు అర్థమయినట్టూ ఉంటాయి, అర్థం కానట్టూ ఉంటాయి. అర్థం కాని ఊహలు చిగురిస్తూంటాయి. ఒక నూతన ప్రపంచ ద్వారం తెరుచుకున్నట్టుంటుంది. పూర్తిగా తెరుచుకోదు. సాధారణంగా ఏ వయసులోనైనా తల్లిదండ్రులలో ఎవరో ఒకరిని కోల్పోవటం ఒక బాధాకరమైన అనుభవం. అది వ్యక్తి మానసిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

ఒక సంఘటనకు ఒక వ్యక్తి ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది అతని వ్యక్తిత్వం అంతిమంగా నిర్ణయిస్తుంది. కానీ మౌలికంగా అందరి ప్రతిస్పందనలు ఒకే రకంగా ఉంటాయి. అపనమ్మకం, మరణం అంటే అర్థమయీ కాకపోవటం, వ్యక్తి లేని లోటును అర్థం చేసుకోలేకపోవటం, అర్థమయిన తరువాత భవిష్యత్తు గురించి భయం కలగటం, అభద్రతా భావం కలగటం, న్యూనతాభావం పెరగటం ఇలాంటి పలు భావాలు ప్రధానంగా కలుగుతాయి. ముందుగా అసలు తండ్రి మరణాన్ని ఆమోదించటం కష్టం. ఏదో సాయంత్రం బయటనుంచి ఇంటికి వస్తాడని, అంతా మామూలుగా వుంటుందన్న భ్రమ కలుగుతుంది. నిజం గ్రహించేసరికి సమయం పడుతుంది. నిజం గ్రహింపుకు రాగానే అభద్రతాభావం తీవ్రమవుతుంది. న్యూనతా భావం కలుగుతుంది. తాను తండ్రి లేకపోవటం వల్ల ఇతరులకన్నా తక్కువ అన్న భావన కలుగుతుంది. అంతేకాదు, తండ్రి తనవెంటే వుంటూ తనని కాపాదుతున్నట్టు ఒక భ్రమను సృష్టించుకుని, ప్రతి క్షణం తండ్రిని తలచుకుంటూ, అతడిని రక్షించమని వేడుకుంటూ జీవితం సాగదీస్తారు.   ముఖ్యంగా ఇంకా తండ్రిపై ఆధారపడిన పిల్లలైతే ఆ కుటుంబానికి ప్రధాన ఆధారం తండ్రి ఒక్కడే అయితే అలాంటి పిల్లల్లో అభద్రతాభావం తీవ్రమవుతుంది. ఈ అభధ్రతా భావాన్ని అదుపులో ఉంచుకోలేని వారు మానసిక సమతౌల్యం కోల్పోతారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. మరికొందరు జీవితం మీద విరక్తితో పలు దుర్వ్యసనాలకు బానిసలై జీవితం వ్యర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా ఇంకా స్వంత కాళ్ళమీద నిలబడకముందే, స్వంత వ్యక్తిత్వం ఎదగకముందే తండ్రిని కోల్పోవటం అన్నది ఒక తీవ్రమైన మానసిక అవ్యవస్థకు దారి తీసేటటువంటి పరిణామం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇలా తండ్రిని కోల్పోయింది ఆడపిల్ల అయితే, ఆ ఆడపిల్లకు తండ్రితో అనుబంధం, ఆప్యాయత, గౌరవాలతో పాటు అతని గొప్పతనం పట్ల గర్వం కూడా ఉంటే, అలాంటి అమ్మాయి తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. లత మంగేష్కర్ అలాంటి మానసిక వేదనకు గురై ఉంటుంది.

లతా తల్లి శుద్ధమతి

లతా మంగేష్కర్‍కు తండ్రితో ఆత్మీయమైన అనుబంధం ఉన్నదనటంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి పట్ల గౌరవాభిమానాలు ఉండటంలోనూ ఎలాంటి వివాదం లేదు. తండ్రి ఆమె ప్రథమ గురువు. ఆమె తండ్రిని ఆరాధించటంలోనూ ఎలాంటి అనుమానం లేదు. ఆమెకు తండ్రి గొప్పతనం తెలుసనటంలోనూ ఎలాంటి వివాదం లేదు. తన తండ్రి నుంచి తనకు స్వాభిమానంతో జీవించే ప్రేరణ లభించిందని లత పలు ఇంటెర్వ్యూల్లో స్పష్టం చేసింది. తండ్రి నేర్పిన సంస్కారం వల్ల జీవితంలో నిజంకోసం నిలబడి పోరాడే స్ఫూర్తి లభించిందని చెప్పింది. తన తండ్రి నుంచి జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురయినా సమ్యమనంతో ఎలా వుండాలో నేర్చుకున్నానని చెప్పింది. ఎవరిముందూ తలవంచకూడదనీ నర్చుకుంది. తన తల్లికూడా ఎంత కష్టం వచ్చినా ఒకరి ముందు చేయిచాపని స్వాభిమానం కలదని చెప్పింది.  కాబట్టి తండ్రి మరణం, తరువాత దిగజారిన ఆర్ధిక పరిస్థితులు ఆమెను మానసికంగా ఎంతటి వేదనకు, ఉద్విగ్నతలకూ గురిచేశాయో ఊహించవచ్చు. 1947-48 ప్రాంతంలో చీరలు రేషన్లో దొరికేవని, తాను సంపాదించిన డబ్బుతో ఆ తెల్లటి కాటన్ చీరలు కొని అవే ఇంటిల్లపాదీ ధరించేవారని, వాటిని తానే ఉతికి, ఇస్త్రీ చేసినట్టుండేందుకు తలక్రింద దిండులా పెట్టుకుని పడుకునేదాన్నని, తెల్లారి అవే కట్టుకుని స్టూడియోకెళ్ళేదాన్నని లతా ఓ ఇంటెర్వ్యూలో చెప్పింది.  ఇప్పుడీ మాటలు నవ్వుతూ చెప్పింది కానీ, నిజంగా అనుభవించేప్పుడు ఎలాంటి మానసికవేదనకు, న్యూనతా భావానికి గురయివుంటుందో ఊహించవచ్చు. జిలుగు వెలుగుల కృత్రిమ అందాల సినీ ప్రపంచంలో ఎలాంటి అలంకరణలు లేకుండా, రేషన్ తెల్ల చీర కట్టుకున్న లతాను అందరూ ఎలా చూసివుంటారో, ఆమె ఎలాంటి మానసిక వేదనకు గురయివుంటుందో అనుభవించిన వారికే అర్ధమవుతుంది.

‘ఖజాంచి’ సినిమా విడుదలైన తరువాత సినీ నిర్మాతలు ఓ పోటీ పెట్టారు. ‘ఖజాంచి’ సినిమాలోని ఏవైనా రెండు పాటలు ఎంచుకుని చక్కగా పాడిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆ సమయంలో లత తండ్రి  బొంబాయి వెళ్ళారు. పోటీ ‘పూనా’లో జరుగుతోంది. ఆ పోటీలో లత తన పేరు కూడా ఇచ్చింది. రెండు పాటలు ‘లౌట్ గయీ పాపన్ అంధియారీ’, ‘నైనోంకే బాన్ కీ రీత్ అనోఖీ’ అన్నవి బాగా సాధన చేసింది. ఈ రెండు పాటలు  సినిమాలో పాడింది శంషాద్ బేగం.

పోటీలో 114 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. పోటీ రోజు ఒక్కో అమ్మాయిని స్టేజీ పైకి పిలిచినపుడు, ఆ అమ్మాయి స్టేజీ ఎక్కి తన పరిచయం చేసుకోవాలి. లత వంతు వచ్చినప్పుడు ఆమె స్టేజి ఎక్కి ‘లతా! దీనానాథ్ మంగేష్కర్’ అని పెద్దగా మైకులోకి చెప్పింది. ఆ తరువాత జరిగింది లత జీవితాంతం మరచిపోలేదు. ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. “వారు నా ఆత్మవిశ్వాసానికి చప్పట్లు కొట్టారో, నా తండ్రి పేరు విని హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారో, అంతటి మహానుభావుడి కూతురు పోటీలో పాల్గొంటున్నదని చప్పట్లు కొట్టారో నాకు తెలియదు” అన్నది ఓ ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్. ఆ పోటీలో లత ప్రథమ బహుమతి గెలుచుకుంది. కానీ ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఆమె తండ్రి పేరు చెప్పగానే ప్రజలు కరతాళ ధ్వనులు చేయటం ఆమె మరిచిపోలేదు. ఇంటికి తిరిగివచ్చిన దీనానాథ్ లత బహుమతిని చూసి ఆనందించాడో లేదో కానీ ఆగ్రహం ప్రదర్శించాడు. సినిమా పాటల పోటీలో లత పాల్గొనటం పట్ల తీవ్ర నిరసనను వ్యక్తపరిచాడు. ఒకవేళ పోటీలో ప్రథమ బహుమతి రాకపోతే తన పరువు పోయేదని బాధపడ్డాడు. ఈ సంఘటన చెప్తూ లత చేసిన వ్యాఖ్య గమనార్హం.

‘బాల్యం నుంచీ నాకు నేను పండిత దీనానాథ్ మంగేష్కర్ కూతురిని అవ్వటం వల్ల ఇతరులకన్నా భిన్నం అన్న భావన కలిగింది’.

దీనానాథ్ మంగేష్కర్ కూతురు అవ్వటం వల్ల తాను ప్రత్యేకం అన్న భావన కలిగిన లతా మంగేష్కర్ అతని మరణంతో ఎంత తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఉంటుందో ఊహించటం కష్టం కాదు.

తండ్రి మరణం తరువాత 1943లో లత కోల్హాపూర్ వదలి బొంబాయి వచ్చింది. వాళ్ళ బాబాయి కమలానాథ్ మంగేష్కర్ ఇంట్లో ఉంది కొన్నాళ్ళు. తండ్రి పేరును నిలిపి, ఆయన ఖ్యాతిని సజీవంగా ఉంచాలన్న తపనతో సంగీతం, నృత్యం నేర్చుకుంటుండేది. ఇది ఇంట్లో పెద్దలకు నచ్చలేదు. ‘తండ్రి పేరు నిలపటం కాదు, పాడు చేస్తావ్’ అని దూషించేవారు. ‘పండిత దీనానాథ్ మంగేష్కర్ ఎక్కడ, ఈ పిల్ల ఎక్కడ, సరిగ్గా పాడటమే రాదు, ఆయన పేరు ఈమె ఏం నిలబెడుతుంద’ని విమర్శించారు. మరో బంధువు కృష్ణారావు కోల్హాపూరె (పద్మిని కోల్హాపురె తండ్రి) కూడా లత సరిగ్గా పాడలేదని భావించాడు. ఆయన బరోడా రాజ దర్బారులో పండితుడు, గాయకుడు, వీణా విద్వాంసుడు. సరిగ్గా పాడలేక లత తండ్రి పేరు పాడు చేస్తుందన్న విమర్శ లతను తీవ్రంగా బాధించింది. ఆమె బాధపడుతుంటే పిన్ని లతను ఓదార్చింది. ‘తండ్రి పేరు స్మరించు. ఆయనే నీ సంగీతానికి దిశను చూపిస్తాడు’ అని ధైర్యం చెప్పింది. ఏ రోజు సాయంత్రం ఆమె ‘నాట్య సమారోహం’లో పాడాలో, ఆ రోజు మధ్యాహ్నం ఆమెకు కల వచ్చింది. కలలో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆమెకు మానాపమాన్ నాటకంలోని ‘శూరా మీ మదీలే’ పాట పాడుతూ కనబడ్డాడు. ఇది తండ్రి తన వెంట ఉన్నాడన్న ధైర్యం లతకు ఇచ్చింది. నాట్య సమారోహంలో ఆమె మాల్కౌస్, భైరవి రాగాల నడుమ నడయాడే ‘దివ్య స్వతంత్ర రవి ఆత్మ తేజోబలే’ అన్న తండ్రి పాటను పాడి మెప్పించింది. ఆ సభలో ఉన్న అప్పటి గొప్ప నటి లలితా పవార్ పద్నాలుగేళ్ల లతను దగ్గరకు తీసుకుని, మెచ్చుకుని, ఆశీర్వదించింది! అప్పటి నుంచీ తండ్రి తన వెంట ఉండి, రక్షిస్తాడన్న భావన లతలో స్థిరపడింది. అందుకే ఎంత పేరొచ్చినా లత ప్రతి పాటను అదే తన ప్రథమ సంగీతం అన్నట్టుగా జాగ్రత్తగా, బహు సాధన చేసి పాడుతుంది. ఎందుకంటే పాట బాగా పాడలేదనో, పాటలో తప్పులొచ్చాయనో అని ఎవరైనా అంటే ఆ అవమానం లతది కాదు, ఆమె తండ్రిది. ఎట్టి పరిస్థితులలో తండ్రికి చెడ్డపేరు రానీయదు లత. అందుకే ఈనాటికీ, తన పాటలో ఎవరు ఏ తప్పు పడతారో అన్న భయం తనను వేధిస్తుందనీ, అందుకే ఎలాంటి పొరపాటు చేయటం తనకు ఇష్టం వుండదనీ లత పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.

ఇప్పుడు లత మానసిక స్థితిని అంచనా వేసి, ఆమె ప్రవర్తనను అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. దీనానాథ్ లత దృష్టిలో దైవంతో సమానం. తన ప్రతి పని ప్రభావం ఆయనపై ఉంటుందని తెలుసు. కాబట్టి ఆయన స్థాయికి తగని పని చేయకూడదని తెలుసు. ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.  తండ్రి మరణాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టు ప్రతిస్పందించేలోగా ఇంటి బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది లతకు. ఇంటికి పెద్ద అవటం వల్ల ఎవరు చెప్పినా చెప్పకున్నా బాధ్యత తనదే అని లత గ్రహించింది. దీనానాథ్ మరణించిన రెండు మూడు నెలలకల్లా తాను ధన సంపాదన గురించి ఆలోచించకపోతే తాము వీధిన పడక తప్పదనీ గ్రహించింది. ప్రస్తుతం ఇంట్లో తాను తప్ప సంపాదించాలన్న ఆలోచన గలవారు, సంపాదించేవారు కూడా ఎవ్వరూ లేరని అర్థం చేసుకుంది. తండ్రిని తలచుకుని అడుగు ముందుకు వేసింది.

అంతవరకూ ఎవరినీ దేనికీ అభ్యర్థించిన వ్యక్తి కాదు. ఎవరిముందు తలవంచిన వ్యక్తి కాదు. తండ్రి మరణంతో ఇప్పుడు తలపై నుండి నీడ తొలగిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావటమే కాదు, తాను తన కుటుంబానికి నీడను అందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పదమూడేళ్ళ పసిపిల్లల మనసులో ఎలాంటి భయాలు, ఎలాంటి సంశయాలు, ఎలాంటి నిరాశలు చెలరేగుతాయో అర్థం చేసుకోవచ్చు.

మాస్టర్ వినాయక్ రావ్

అయితే డబ్బు సంపాదనకు లతకు తెలిసిన మార్గం ఒక్కటే. అదీ తండ్రి చూపించిందే. నాటకాలలో నటించటం, పాటలు పాడటం. లత వాళ్లకు సహాయానికి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీనానాథ్ మిత్రుడు, శ్రీపాద్ జోషి లత కుటుంబానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. పూనాలో ఉన్న ‘మాస్టర్ వినాయక్’ (నటి నంద తండ్రి) పేరుతో ప్రసిద్ధుడైన వినాయక్ దామోదర్ కర్ణాటకీ వద్దకు లతను సిఫారసు చేసి పంపాడు. మాస్తర్ వినాయక్ దీనానాథ్ కు మంచి మిత్రుడు. కుటుంబానికి శ్రేయోభిలాషి.  అలా లత ‘నవయుగ్ చిత్రపట్ ఫిల్మ్ కంపెనీ’లో మూడునెలల ఒప్పందంపై మూడు వందల రూపాయలకు అడుగుపెట్టింది.

 

ఇక్కడ ఒక్కక్షణం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది. దీనానాథ్‍కు సినిమాలంటే ఇష్టం లేదు. కానీ లత తప్పనిసరి  పరిస్థితుల్లో మూడు నెలల కాంట్రాక్ట్‌తో దీనానాథ్ మరణించిన మూడు నెలలకు చేరాల్సి వచ్చింది. తండ్రికి ఇష్టంలేని పని చేయటం లతకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం ‘లత’ సినిమాల్లో నటించేందుకు సిద్ధపడాల్సి వచ్చింది. ఇది లతను జీవితాంతం బాధించింది. తండ్రికి అస్సలు ఇష్టం లేని పని చేయాల్సి వచ్చింది. ఇదీ నేరభావన. నాటకాలను అప్పటికి సినిమాలు మింగేస్తున్నాయి. కాబట్టి తండ్రితో కలిసి పని చేసినట్టు నాటకాలలో పనిచేయలేదు. కాబట్టి సినిమాలలో నటించటం తప్పనిసరి. కానీ అది నేరభావనను కలిగిస్తోంది. ఆ నేర భావనను అధిగమించేందుకు దాన్ని అణచి ముందుకు సాగేందుకు ఇదంతా ‘కుటుంబం కోసం’ అని సర్ది చెప్పుకుంది. తానీ పనికి సిద్ధపడకపోతే ఆ దీనానాథ్ కుటుంబమే రోడ్డు మీద పడాల్సి వస్తుంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో లత సినిమా కంపెనీలో చేరింది. కానీ నేరభావనను మాత్రం సంపూర్ణంగా అధిగమించలేకపోయింది. ఈ సమయంలో లత తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేయాలనుకుంది. ఆమె తండ్రితో సహా ఆ కాలంలో మహారాష్ట్రీయులు అనేకులు స్వతంత్ర వీర సావర్కర్ భక్తులు. ఇప్పుడంటే సావర్కర్ పేరు చెప్తే కొందరికి ఆవేశాలూ, పూనకాలూ వస్తాయి. ఆ కాలంలో కూడా దేశభక్తి ఆవేశాలు, భక్తి పూనకాలూ వచ్చేవి. ఆయన ప్రభావంలో పడని మహారాస్ట్రీయులు లేరు. ఆయన స్వతంత్ర పోరాటవీరుడు. సమాజసేవకుడు. రాజకీయవేత్త. సమాజ సేవ చేస్తూ రాజకీయాల్లోకి రావాలా? రాజకీయాల్లో వుంటూ సమాజసేవ చేయాలా? అన్న సందేహం లతకు వచ్చింది. ఆమె తన సందేహానికి సమాధానం సావర్కర్ ను అడిగింది. దానికి సమాధానంగా సావర్కర్, ” మీ తండ్రి గొప్ప సంగీత విద్వాంసుడు. సంగీతంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించినవాడు. అలాంటి పండితుడి కూతురిగా నువ్వూ సంగీతంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. సంగీతం ద్వారా సమాజసేవ చేయాలి” అని బోధించి ఆమెను సంగీతం వైపు మరల్చాడు వీర సావర్కర్. అందుకే లతా సావర్కర్ ను తన గురువులా, పిత్రు సమానుడిలా అభిమానించి గౌరవించింది. ఆయన సలహాను పాటించింది. సంగీత శిఖరాలను అధిరోహించింది. సమాజ సేవనూ కొనసాగించింది. ఇలాకూడా ఆమె తండ్రికి ఇష్టంలేని సినిమాల్లో పనిచేయటాన్ని మనసుకు సర్దిచెప్పుకుంది.

లత మంగేష్కర్ నటనను ఇష్టపడలేదు. తెరపై నటించటం కన్నా తెరవెనుక పాడటం మంచిది. ఒకరకంగా తండ్రి నేర్పిన పాటను సజీవంగా నిలుపుకున్నట్టవుతుంది. అందుకే,   అవకాశం దొరకగానే నటన నుంచి విరమించుకుంది. తరువాత పలు ఇంటర్వ్యూలలో నటన పట్ల తన విముఖతను స్పష్టం చేసింది. మేకప్ వేసుకోవటం ఇష్టం లేదని చెప్పింది. పెదవులకు లిప్‍స్టిక్ వేసుకోవటం అసహ్యం అంది. ఇదంతా తండ్రికి ఇష్టంలేని పనిని తప్పనిసరిగా అయిష్టంగా చేయాల్సి రావటం పట్ల లత మనస్సు ప్రతిస్పందన. అందుకే లత జీవితాంతం తెల్లటి చీరలే కట్టింది. ఎలాంటి మేకప్పులు, అలంకరణల జోలికి పోలేదు. వీలైనంత నిరాడంబరంగా ఉంది. సినీ రంగంలో ఉన్నది కానీ దాదాపుగా సినీరంగం బయట ఉన్నదానిలానే ఉంది. ఎవ్వరితోనూ సన్నిహితంగా లేదు. కానీ అందరితో స్నేహంగా ఉంది. తన చుట్టూ ఒక గిరి గీసుకుంది. ఎవ్వరినీ ఆ గీత దాటి లోనికి రానివ్వలేదు. ఎవరైనా గీత దాటే ప్రయత్నాలు చేస్తున్నారనిపిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా తన జీవితం నుంచి వెడల నడిపింది. వారెంతటి వారైనా లెక్కచేయలేదు.  దీనానాథ్ మంగేష్కర్ తలదించుకునే పని లత చేయలేదు. అతనికి చెడ్డపేరు వచ్చే చర్య లత తలపెట్టలేదు. మరణించినా అతను వెంటవుండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఒక పనిచేసేముందు తన తండ్రి ఈ పనికి గర్విస్తాడా? బాధపడతాడా? అని ముందు ఆలోచిస్తుంది లత.  అందుకే ఇతరుల దృష్టిలో లత ఎన్ని శిఖరాలు అధిరోహించినా ఆమె తనని తాను ‘గొప్ప’ అనుకోలేదు. ఏదో సాధించిన దానిలా భావించుకోలేదు. తనను తాను పొగుడుకోలేదు. అహంకారం ప్రదర్శించలేదు. అహంకారం ఎప్పుడు ప్రదర్శించిందంటే, ఎవరైనా ఆమె గీసుకున్న గీతను దాటాలని ప్రయత్నించినప్పుడు. అందుకే లత మంగేష్కర్ ప్రదర్శించే వినయంలోనూ, ఇతరులకు ఇచ్చే గౌరవంలోనూ న్యూనత భావం, నేర భావనలు, ‘నేను ఇంత గౌరవానికి అనర్హురాలను’ అన్న భావనలు లీలగా తొంగి చూస్తుంటాయి. సినీ నేపథ్య గాయనిగా ఎంత పేరు సంపాదించినా తనని తాను శాస్త్రీయ సంగీత విద్వాంసుల కన్నా ఎంతో తక్కువగా భావించుకుంది. అవకాశం దొరికినప్పుడల్లా తాను శాస్త్రీయ సంగీతాన్ని వదలి సినిమా నేపథ్య గాయని అయినందుకు విచారం వెలిబుచ్చింది. వీలైనప్పుడల్లా తాను పాడిన పాటలు తాను వినను అని చెప్తూ వచ్చింది.

 

లత తొంభై ఏళ్ల జన్మ దినం సందర్భంగా ‘క్వింట్’ పత్రిక జరిపిన ఇంటర్వ్యూలలో తనకు శాస్త్రీయ సంగీతం పాడాలని ఉంది కానీ పాడలేకపోతున్నానని అంది. “ఎందుకని?” అన్న ప్రశ్నకు సమాధానంగా “Circumstances. My father was a Natya sangeet musician, a Hindustani classical vocalist and a Marathi theatre actor. Following a heart ailment, he passed away when I was 13. I used to act in his plays ever since I was four or five years old. Left fatherless, I was the family’s eldest child who had to take the lead in making ends meet at home. Our close family friend, film producer Master Vinayak helped me to get film roles. I would end up playing the sister of the hero or the heroine. Pahili Mangalagaur (1942), Subhadra (1946), and Mandir (1948) were some of the films I acted in, but my heart wasn’t into acting at all!” అంది. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా పరోక్షంగా ఇచ్చింది. తండ్రి మరణం, కుటుంబ పోషణ భారం వల్ల తాను శాస్త్రీయ సంగీత గాయనిగా కాక సినీ నేపథ్య గాయనిగా స్థిరపడాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పింది. జీవితాంతం లత మనస్సులో తండ్రి ఇష్టానికి వ్యతిరేకమైన పని చేసున్నానన్న భావన, శాస్త్రీయ సంగీత గాయనిగా స్థిరపడలేకపోయానన్న వేదనగా ప్రకటితమవుతూనే ఉంది. అందుకే ఆమె సినిమాల్లో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలను మక్కువతో పాడింది. అలాంటి సంగీత దర్శకులను ఆదరించింది, గౌరవించింది.

‘మాస్టర్ వినాయక్’ వల్ల సినిమాల్లోకి వచ్చానని తాను నటించిన మూడు సినిమాల పేర్లు చెప్పింది లత. కానీ, ఆమె సినీరంగ ప్రవేశం అంత సులభంగా కాలేదు. మూడు నెలల కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తరువాత ‘పహలీ మంగళగౌర్’ సినిమాలో నాయిక సోదరి వేషం వేసింది లత. నాయికగా అప్పటి హిట్ నటి ‘స్నేహ ప్రభ’ నటించింది. నాయికకు లభిస్తున్న ప్రాధ్యాన్యం, తనని ఎవరూ పట్టించుకోకపోవటం మౌనంగా భరించింది. సినిమా పూర్తికాక మునుపే ‘నవయుగ’ ఫిల్మ్ కంపెనీకీ, మాస్టర్ వినాయక్‍కూ నడుమ భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో మాస్టర్ వినాయక్ కంపెనీ వదలి వెళ్ళిపోయారు. లత అతని వెంట వెళ్ళలేదు, ఎందుకంటే ఆమె కాంట్రాక్టులో ఉంది. కాబట్టి మూడు నెలలు కాంట్రాక్ట్ అయ్యేవరకూ ముక్కు మూసుకుని భరించింది. మూడు నెలలు పూర్తికాగానే మాస్టర్ వినాయక్ దగ్గరకు కోల్హాపూర్ వెళ్ళిపోయింది. కోల్హాపూర్‍లో మాస్టర్ వినాయక్ ‘ప్రపుల్ పిక్చర్స్’ అనే సినిమా సంస్థను నెలకొల్పాడు. దాన్లో నెలకు అరవై రూపాయల వేతనంతో చేరిపోయింది లత. 1945లో మాస్టర్ వినాయక్ కోల్హాపూర్ వదలి బొంబాయి వచ్చేసరికి లత జీతం రెండువందల రూపాయలైంది. మాస్టర్ వినాయక్‍తో పాటు లత కూడా బొంబాయి వచ్చింది. ప్రపుల్ పిక్చర్స్‌లో పనిచేయటం ప్రారంభించింది.

ప్రపుల్ పిక్చర్స్ లో ఆమె మాఝే బాల్ (1943), గజబాహు (1944), బడీ మా (1945), జీవన్ యాత్రా (1946), సుభద్ర (1946), మందిర్ (1948) వంటి సినిమాలలో నటించింది.

 

‘బడీ మా’ సినిమాలో లత నూర్ జహాన్తో కలిసి నటించింది. ఈ సినిమాలో నటించేందుకు నూర్ జహాన్ కోల్హాపూర్ వచ్చింది. ఆ సమయంలో లతను పరిచయం చేశారు, ‘ఈమె మా కంపెనీలో పనిచేస్తోంది. పాటలు పాడుతుంది’ అని. నూర్ జహాన్ లతతో పాటలు పాడించుకుని ఆనందించింది. “జీవితంలో పాటను ఎప్పుడూ వదలకు, ఎంతో పైకి వస్తావు” అని ఆశీర్వదించింది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ లత ఒక అద్భుతమైన సంఘటనను చెప్పింది.

ఆ కాలంలో నూర్ జహాన్ దేవతతో సమానం. పద్నాలుగేళ్ళ లత , అందుకే నూర్ జహాన్ వైపు కన్నార్పకుండా చూస్తూండేది. ఆమె ప్రతి కదలికను గమనిస్తూండేది. ఓ రోజు నూర్ జహాన్ నమాజ్ చేస్తూ కన్నీరు కార్చటం చూసింది లత. అదేమిటని అడిగింది. దానికి నూర్ జహాన్ అందమైన సమాధానం ఇచ్చింది. “నాకు కష్టమేమీ లేదు. నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఇక ఆయనను ప్రత్యేకంగా అడిగేందుకు ఏమీ లేదు. నేను నా నేరాలను మన్నించమని వేడుకున్నాను. ఎందుకంటే, మనం మనుషులం. తెలిసో తెలియకో ఏవేవో పొరపాట్లు చేస్తుంటాం. మన ప్రమేయం లేకుండా ఎవరికో దుఃఖాన్ని కల్గించవచ్చు. అలాంటి తెలిసీ, తెలియక చేసిన పొరపాట్లను క్షమించమని కన్నీటితో వేడుకుంటున్నాను. నువ్వు కూడా మీ భగవంతుడిని నీ  తప్పిదాలను మన్నించమని ప్రార్థించు. మనకోసం మనకేమీ అవసరం లేదు. మనవల్ల ఇతరులకు కష్టం కలగకూడదు” అంది నూర్జహాన్. ఈ సంఘటన తనపై అమితంగా ప్రభావం చూపించిందని చెప్పింది లత.

‘బడీమా’ లో లత ఒక పాట పాడింది. ‘మాతా తేరే చరణోం’ అనే పాట ఆమెపైనే చిత్రితమైంది. ఇప్పుడీ పాట పాడింది లత అని నమ్మటం కష్టం. నూర్జహాన్, శంషాద్ బేగమ్‍ల కలగలుపు గొంతులా ఉంటుంది. ఈ సినిమాలో నూర్జహాన్ పాడిన పాట ‘దియా జలాకర్ ఆఫ్ బుఝాయే’ ను లత నూర్జహాన్ లానే పాడేందుకు సాధన చేసింది.

 

‘గజభాఊ’ సినిమాలో లత తన జీవితంలో తొలి హిందీ పాట ‘హిందుస్తానీ లోగో అబ్ తో ముఝే పహెచానో” (హిందుస్తానీ ప్రజలారా, ఇకనైనా నన్ను గుర్తించండి), పాడింది. 1947లో ‘ఆప్కీ సేవామే’ అనే సినిమాలో ‘పా లాగూ కర్ జోరీ రే’ అనే పాటతో లత నేపథ్య గానం ఆరంభించింది. అయితే, ఈ విషయాల వల్ల లత ఎందుకని ‘మరోసారి లతగా పుట్టకూడద’ని కోరుకుందో అంతగా స్పష్టం కాదు.

లత జీవితం మూడు వేర్వేరు అంశాలుగా పరిశీలించాల్సి ఉంది. ఒకటి బహిరంగంగా కనిపిస్తున్న సినీ జీవితం. రెండవది అంతగా అందరికీ పరిచయం లేని ఆమె కుటుంబ జీవితం, సాధన. మూడవది పై రెండింటి ఆధారంగా ఊహించే ఆమె అంతరంగిక ప్రపంచం. ఈ మూడు అంశాల వారీగా తెలుసుకుని విశ్లేషిస్తేనే  ‘లతా మంగేష్కర్’ అనే ‘వ్యక్తి’ని ఓ మోస్తరుగానైనా అర్థం చేసుకోగలుగుతాం.

కోల్హాపూర్ నుంచి లత, మాస్టర్ వినాయక్‍తో బొంబాయి వచ్చింది. లతతో పాటు మొత్తం కుటుంబం బొంబాయి వచ్చింది. కొద్ది రోజులు బంధువుల ఇళ్ళల్లో ఉన్న తరువాత తనకంటూ ఓ ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది. బొంబాయిలో తొలి జీతంతో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చింది లత. రోజూ సాధన చేసేందుకు ఇంట్లో వీలు కుదరక మందిరంలో సాధన చేసేది. ఈ సమయంలో వారు ‘నానా చౌక్’ లో ఓ ఇంట్లో ఉండేవారు. వీరితో పాటు వారి బంధువులు కూడా ఉండేవారు. వారి ఇంట్లో రెండు గదులుండేవి.  దీనానాథ్ బ్రతికి వున్నప్పుడు సాంగ్లిలోని వారి ఇంట్లో 13గదులుండేవి.  అక్కడికి దగ్గర్లో ‘మహాదేవుడి’ మందిరం వుండేది. ‘మహాదేవుడు’ లత వాళ్ళ ఇంటి దైవం. 1945 నుంచి 1951 వరకు ఆ ధర్మశాలలోనే, ఈ రెండు గదుల ఇంట్లోనే ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా మందిరంలోనే సాధన చేస్తూండేది లత. మరోవైపు లత చదువు ఆరంభించింది. తండ్రి దగ్గర మానేసిన శాస్త్రీయ సంగీతం ఒకవైపు, పాఠశాలకు వెళ్లకపోవటం వల్ల ఆగిపోయిన చదువు మరోవైపు, సినిమాల్లో నటన ఇంకోవైపు. పరిస్థితి కాస్త కుదుట పడుతోందన్న తరుణంలో మాస్టర్ వినాయక్ మరణించాడు. దాంతో మళ్ళీ బొంబాయిలో లత ఆధారం లేక ఒంటరిదైపోయింది.

లత సంగీతాన్ని అభ్యసిస్తూ, చదువుతూ సినీ రంగంలో నిలద్రొక్కుకోవటం వచ్చేవారం.

***

Photo Credits: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here