సంగీత సురధార-22

0
11

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 18

ప్రాచీన సంగీత రచనలు:

[dropcap]ప్రా[/dropcap]చీన సంగీత రచనలు నాలుగు రకములు. అవి (1) సూళాది (2) ఠాయము (3) దరువు (4) ప్రబంధం

A. సూళాదులు

ఇవి గీతమునకు దేశ్యపదమైన ‘సూళ’ నుండి స్వీకరింపబడినది అగుటచే ఇవి ‘సూళాదులు’ అని చెప్పబడినది – గీతమును పోలియుండు రచనలు. ఈ సూళాదులు ప్రసిద్ధ అలంకార సప్త తాళములలో ఏకతాళముగా యుండి, విలంబ, మధ్య లయలు కల్గి యుండి, సాహిత్యముతో యుండు రచనలు. ఇట్లు సూళాదులు ఒక్క పురందరదాసు మాత్రమే కన్నడ భాషలో రచించినట్లు తెలియుచున్నది. ఉదాః అచ్యుతానంద – కాశిరామక్రియ రాగం – ఝంపెల.

B. ఠాయము

ఇది రచనలో గీతమును పోలి యుండును. ఇందులో పాఠము (సోల్కట్టు) లేక జతులు వుండుటయే యొక్క ప్రత్యేక లక్షణము. ఇది అభ్యాస గానమునకు చెందిన రాగము అగును. ఇది ముఖ్యముగా వీణ విద్యార్థులు వీణ యందు మీటు శాస్త్రము అభివృద్ధి చేసుకొనుటకు మిక్కిలి సహాయకారిగా యుండును. రచించిన వారిలో పురందరదాసులు, శ్రీ వేంకటమఖి మొదలగువారు ముఖ్యులు. మరియు గీత, ఆలాప, రాయ, ప్రబందములతో కూడుకొనినట్టి దానిని ‘చతుర్పండి’ అని చెప్పబడునని గ్రహించునది.

C. దరు (దరువు)

ఇది పద, లక్షణమును పోలి యుండు శృంగార రస ప్రధానమైన ఒక విధమగు రచన. నడక మధ్య కాలంలో యుండును. దరులలో కొన్ని ఒకే చరణముతోను, కొన్ని 2, 3, చరణములతో కూడి యుండును. ఉదా: సారసాగ్రీసర – సరగున – అను నారాయణి రాగం త్రిశ్రజాతి ఏకతాళములోని సుబ్బరాయ దీక్షితుల రచనలు. (1) నీ పాటి దైవమెందు లేదు – శ్రీరంజని – రూపక – దీక్షితుల రచనల యందు కన్పించును.

దరు లో- తిల్లానా దరు, ప్రవేశ దరు, సంవాద దరు, స్వగత దరు, జిక్కిణ దరు అను భాగములు కూడా కలవు.

D. ప్రబంధం

సంగీత రచనలో పూర్వము నుండె క్రమములో లేని రచనలు గలవు. అట్టి వానిలో నొకటి ప్రబంధం. ఒక విధంగా ప్రబంధం అనగా ‘ప్రత్యేకమైన ప్రాచీన రచన’ అనియే గాక ‘ప్రతి సంగీత రచన’ అని అర్థము.

***

ప్రాచీన ప్రబంధములలోని 5 రకములు:

ప్రాచీన ప్రబంధములలో ఈక్రింది 5 రకములు కలవు.

  1. మేదిని – క్రింది 6 అంగములుండుట. ఉదా. చండ్రశేల – హంసధ్వని
  2. ఆనందిని – తేనకము తప్ప, మిగిలిన 5 ఉండుట – తిల్లానా – ధన్యాసి
  3. దీపిని – పాటకము, తేనకము తప్ప మిగిలినవి – విరిబోణి – భైరవి
  4. భామిని – పదము, తాళము, స్వరము – నీ మది చల్లగా – ఆనంద భైరవి
  5. తారావళి – స్వరము, తాళము – సా రి గా సా దా సా నీ దా – బిళహరి – స్వరజతి

ప్రబంధములలోని 3 రకములు:

మరొక పద్ధతిలో ప్రబంధములలో మూడు రకములు గలవు. అవి

  1. ద్విధాతు: ఉద్గ్రాహము, ధృవము – పాహి రామచంద్ర – శం॥
  2. త్రిధాతు: ఉద్గ్రాహము, ఆభోగము – సరస సామదాన – కాపీ నారాయణి
  3. చతుర్థాతు: ఉద్గ్రాహము, మేళాపక, ధృవ, ఆభోగ, – అంబా నీ స్మరణం – ఆనంద భైరవి

ప్రబంధములలోని 2 రకములు:

మరొక పద్ధతిలో ప్రబంధములలో రెండు రకములు గలవు. అవి

  1. నిర్యుక్త: సూత్రం, ఛందస్సు, రాగ, తాళలను తెలుపుచు వ్రాయబడిన రచన.
  2. అనిర్యుక్త: సూత్రం, ఛందస్సు, రాగ, తాళలను తెలుపకనే చేసిన రచన.

ప్రబంధములలోని 6 అంగములు:

సాధారణముగా ప్రబంధమునకు 6 అంగములు కలవు.

  1. స్వరము: సప్త స్వరములు – ఒక్కొక్కటి స్వరములనబడును
  2. బిరుదము: సంబోధనగా ప్రబంధ నాయకుని ఉద్దేశించి వాని ధైర్య, శౌర్య గుణములను తెలుపు స్తోత్ర పాఠములు.
  3. పదము: మాటలు గలది అని అర్థము.
  4. తేనకము: భాండీర భాషలో గల ‘తేన’ అను శబ్ద వికారమును ‘తేనక’మని అందురు. తత్ శబ్దమునకు చెందినది. తత్ అనునది నిత్య మంగళ స్వరూపమైన పరబ్రహ్మ వాచకమగును. ఓం తత్ సత్, తత్వమసి అను మహా వాక్యములకు సరిపోవు యీ ప్రబంధమందలి ‘తేన’ శబ్దమునే ‘తేనక’మని అందురు.
  5. పాటము: రుద్రవీణ, శంఖము, వంటి వాద్యములలో గల్గు స్వారస్య శబ్దములను; ఊరో వాద్యము వంటి చర్మ వాద్యములలో లక్షణానుసారముగా పలుకునట్టి శబ్దములు (లేక) జతులును ‘పాటము’ అని చెప్పబడును (పాటము=శబ్దము).
  6. తాళము: తాళప్రకరణ లక్షణములు కలిగినది.

ప్రబంధములలోని 4 ధాతువులు:

  1. ఉద్గ్రాహము: ప్రబంధము యొక్క మొదటి భాగము (లేక) పల్లవికి సరిపోవు ప్రారంభ భాగము.
  2. ధృవము: చరణమునకు సరిపోవు ముఖ్యమైన భాగము.
  3. మేళాపకము: అనుపల్లవి పావుపై రెండింటిని కలుపునట్టిది
  4. అభోగము: మధ్యమ కాల సాహిత్యము (లేక) కృతి – చి॥ స్వ॥ అంత్యభాగము.

ఉద్గ్రాహ, ధృవము – ముఖ్యాంగ.

మేళాపకము, ఆభోగము- అముఖ్యాంగా తెలుపవచ్చు.

శార్ఞ్గ దేవుడి ప్రకారం ప్రబంధములలోని రకములు:

శార్ఞ్గ దేవుడు ప్రబంధములను మూడు రకములుగా పేర్కొనెను.

  1. సూడ ప్రబంధములు: ఇందులో శుద్ధ సూడ, సాలగ సూడ అను రెండు రకములు గలవు
  2. అవిక్రమ ప్రబంధములు
  3. విప్రకీర్ణ ప్రబంధములు

ఇవిగాక తరువాత వచ్చిన ఆక్షిప్తకములు, కపాలములు, కంబళముల వంటి యితర రచనలు కూడా పేర్కొనెను. ఇవిగాక 108 తాళములలో ప్రబంధములు గలవు. చచ్చరీ; హంసలీల; తురగలీల: గజలీల మొదలైనవి.

~

శ్రీ గోపాల నాయకుడు (1) గ్రహస్వర ప్రబంధము (2) తాళార్ణవ ప్రబంధము (3) రాగ కదంబక ప్రబంధము అను ప్రబంధములను రచించెను.

భూలోకమల్లుడు చాలా ప్రబంధములను వ్రాసెను.

  • వర్ణ ప్రబంధము:
  • పంచతాళేశ్వరము: 5 మార్గ తాళములు
  • శ్రీవిలాసము: 5 రాగములు, 5 తాళములు
  • శ్రీరంగ ప్రబంధము : 4 రాగములు, 4 తాళములు
  • ఉమాతిలక ప్రబంధము: 3 రాగములు, 3 తాళములు
  • పంచ భంగి, పంచానన: 2 రాగములు, 2 తాళములు
  • శరభలీల: 8 రాగములు, 8 తాళములు
  • రాగ కదంబము : ఆధునిక రాగమాలిక
  • తాళార్ణవము: ఆధునిక తాళమాలిక
  • స్వరార్థ: స్వరాక్షరములతో కూడిన సంగీత రచన. దీనిలో రెండు రకములు. (1) శుద్ధము: రచన అంతయు స్వరాక్షర క్రమములో నుండుట (2) మిశ్రము: సాహిత్య అక్షరములు అక్కడక్కడ వుండుట

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here