సంగీత సురధార-26

0
11

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 20 – మూడవ భాగము

తాళ శబ్దోత్పత్తి::

[dropcap]నా[/dropcap]ట్యము నందలి తాండవము, లాస్యము అను రెండింటి సంయోగము ఏ క్రియ వలన రాణించుచునన్దో ఆ క్రియ, తాండవ లాస్యములను రెండు పదముల ప్రథమాక్షరాల నందు ఉత్తత్తియై, ఆ తాలమను శబ్దమే క్రమముగా తెలుగులోనికి ‘తాళమ’ని పరిణామము యొందినటుల తాళ శబ్దోత్పత్తికి ప్రాచీన కాలము నుండి చెబుతూ వచ్చిన కారణములలో ఒకటిగా గోచరించుచున్నది. మరియు దశ ప్రాణములతో కూడిన హస్త ద్వయ సంయోగ వియోగములు తాళమనబడునని నారద విరచిన ‘సంగీత మకరందమ’ను గ్రంథము నందు చెప్పబడినది.

దశ ప్రాణములనగా 10 ముఖ్యమగు అంశములని అర్థము. అవి కాలము, మార్గము, క్రియ, అంగము, గ్రహము; జాతి, కళ, లయ, యతి, ప్రస్తారము. మొదటి 5 ముఖ్య ప్రాణములని, తరువాతి 5 ఉప ప్రాణములని అందురు.

1. కాలము:

తాళము యొక్క అంగముల కాల ప్రమాణమును నిర్ధారణముగా చెప్పెడి అంశము. ఇది సూక్ష్మ కాలమని, స్థూల కాలమనియు రెండు విధములు.

నూరు తామరరేకులను ఒకదానిపై నొకటి చొప్పున అమర్చి ఒక సూదితో ఆ రేకులను గ్రుచ్చినప్పుడు, ఆ రేకులలో ఒక రేకు ఎంత కాలములో తెగునో ఆ కాలము ఒక క్షణమనబడును. అటువంటి

  • 8 క్షణములు =1 లవము
  • 8 లవములు =1 కాష్ట
  • 8 కాష్టములు =1 నిమిషము
  • 8 నిమిషములు =1 కళ
  • 2 కళలు =1 చతుర్భాగము (వీటిని సూక్ష్మ కాలములని అందురు)

అటువంటి

  • 2 చతుర్భాగములు =1 అనుధృతము
  • 2 అనుధృతములు =1 ధృతము
  • 2 ధృతములు =1 లఘువు
  • 2 లఘువులు =1 గురువు
  • 8 లఘువులు =1 ప్లుతము
  • 4 లఘువుల కాలము =1 కాకపాదము (వీటిని స్థూల కాలములని అందురు)

2. మార్గము:

గానము యొక్క గమన క్రమము – మార్గము. మార్గములు 6. అవియే షణ్మార్గములు. మొదటి మూడు కేవలము మనోధర్మ గానము (పల్లవి గానము) నందు మాత్రమే ఉపయోగించబడుచున్నవి. మిగిలిన మూడు కృతి కీర్తనాది ప్రబంధ గానము నందు అనుసరింపబడుచున్నవి.

  • దక్షిణ మార్గము అనగా ఒక్కొక్క తాళాక్షరమునకు 8 మాత్రల యందు నడుచుట
  • వార్తీక మార్గము అనగా ఒక్కొక్క తాళాక్షరమునకు 4 మాత్రల యందు నడుచుట
  • చిత్ర మార్గము అనగా ఒక్కొక్క తాళాక్షరమునకు 2 మాత్రల యందు నడుచుట
  • చిత్ర తర మార్గము అనగా ఒక్కొక్క తాళాక్షరమునకు 1 మాత్ర యందు నడుచుట
  • చిత్ర తమ మార్గము అనగా ఒక్కొక్క తాళాక్షరమునకు 1/2 మాత్ర యందు నడుచుట
  • అతి చిత్ర మార్గము అనగా ఒక్కొక్క తాళాక్షరమునకు 1/4 మాత్ర యందు నడుచుట

కృతులు, కీర్తనలు మొదలైన ప్రబంధములను రచించుటకును, ఆయా ప్రబంధములను ఆయా తాళములలో వ్రాయుటకును, ఆయా ప్రబంధములను గానము చేయునప్పుడు, ఆయా తాలాక్షరములను సరిగా ఎంచుటకును ఈ అంశము మిక్కిలి ఉపయోగకరమైనది.

ఉదా:

  • చిత్ర తర – కాంభోజి – ఎవరి మాట విన్నావో
  • చిత్ర తమ – కదన కుతూహలం – రఘువంశ సుధాంబుధి చంద్ర
  • అతి చిత్ర తమ – సహానా – రామా ఇక నన్ను బ్రోవ రాదా

3. క్రియ:

కాలమును ఎంచెడి విధానము. ఘాతను వేయుట, వ్రేళ్ళను ఎంచుట, చేతిని వెనుకకు విసురుట మొదలగునవి క్రియలు అనబడును. కొన్ని క్రియలు చేతి అంగములు అగును.

దేశ్య క్రియలు: ధృవక అను సశబ్ద క్రియయును, సర్పిణి, కృష్ణ, పద్మిని, విసర్జితము, విక్షిప్తము, పతాకము, పతిత అను నిశ్శబ్ద క్రియల్ను దేశ్య క్రియలు అనబడును.

  • ధృవక: శబ్దముతో కూడిన కుడి హస్తపు ‘ఘాత’.
  • సర్పిణి: చేతిని ఎడమ వైపునకు విసురుట.
  • కృష్ణ: ఎడమ వైపున ఉన్న చేతిని కుడివైపునకు విసురుట
  • పద్మిని: అరచేతిని క్రిందిగా చేసి అదోముఖముగా చేయి చూచుట.
  • విసర్జిత: వెలుపలికి విసురుట.
  • విక్షిప్త: వ్రేళ్ళను ముడుచుట.
  • పతాకము: చేతిని పైకి విసురుట.
  • పతిత: పైకి విసరబడిన చేతిని క్రిందికి తెచ్చుట

4. అంగము:

తాళము యొక్క భాగములు. అంగములు మారినప్పుడే తాళములు మారును.

షడంగములు – గుర్తులు

అంగముల పేర్లు గుర్తులు అక్షర కాలము మాత్ర కాలము
అనుధృతము U 1 ¼

 

ధృతము O 2 ½
లఘువు I 4 1
గురువు 8 8 2
ప్లుతము 3 12 3
కాకపాదము + 16 4

షోడశాంగములు

అంగముల పేర్లు గుర్తులు అక్షర కాలము
1 అనుధృతము U 1
2 ధృతము O 2
3 ధృత విరామము UO 3
4 లఘువు (చతుర్థ) I 4
5 లఘు విరామము UI 5
6 లఘు ధృతము OI 6
7 లఘు ధృత విరామము UOI 7
8 గురువు 8 8
9 గురు విరామము U8 9
10 గురు ధృతము O8 10
11 గురు ధృతము విరామము UO8 11
12 ప్లుతము 3 12
13 ప్లుత విరామము U3 13
14 ప్లుత ధృతము O3 14
15 ప్లుత ధృత విరామము UO3 15
16 కాకపాదము + 16

5. గ్రహము:

ఒక తాళము నందు గానము ప్రారంభించెడు స్థలము. అనగా తాళములో పాట ఎత్తబడుట. ఇది సమగ్రహము, విషమ గ్రహము అని రెండు రకములు. పాట, తాళము ఒకేసారి ప్రారంభించుటను సమగ్రహమని అందురు. పాటని, తాళమును ఒకేసారి ప్రారంభించక, ముందు గాని వెనుక గాని ప్రారంభించుటను విషమ గ్రహమని అందురు.

విషమగ్రహము రెండు రకములు.

  • అతీత గ్రహము – ముందు పాట, తాళము తరువాత.
  • అనాగత గ్రహము -ముందు తాళము, తదుపరి పాట.

6. జాతి:

లఘువు మార్పు చెందుట వలన జాతులు ఏర్పడును.

చతురశ్ర 4 14 స్వర లఘువు
త్రిశ్ర 3 13 మనుష్య లఘువు
మిశ్ర 7 17 హంస లఘువు
ఖండ 5 15 దేశ్య లఘువు
సంకీర్ణ 9 19 చిత్ర లఘువు

విశేష లఘువులు 5 కలవు

పేరు అక్షరములు మాత్ర కాలము
దివ్య సంకీర్ణ లఘువు 6 1 ½ దివ్య లఘువు
మిశ్ర సంకీర్ణ లఘువు 8 2 సింహ లఘువు
దేశ్య సంకీర్ణ లఘువు 10 2 ½ వర్ణ లఘువు
మిశ్ర దేశ్య సంకీర్ణ లఘువు 12 3 వాద్య లఘువు
దేశ్య శుద్ధ సంకీర్ణ లఘువు 16 4 కర్ణాటక లఘువు

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here