సంగీత సురధార-29

0
12

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 22

జతిస్వరము (లేక) స్వరపల్లవి::

[dropcap]గీ[/dropcap]తములను నేర్చిన తరువాత జతి నేర్చుకొనుట ఆచారము. ఇది వర్ణమును పోలి యుండు రచన. పల్లవి, అనుపల్లవి, చరణము – విభాగాలు వుంటాయి. నడక సాధారణ, మధ్యమంగా వుంటుంది. చరణములు వేరు వేరు ధాతువులతో యుండును. ఈ రకమైన కొన్ని జతిస్వరములలో అనుపల్లవి కనబడదు. ఈ రకమైన రచనకు సాహిత్యము లేదు. దీనిని నృత్యానికి వాడతారు. కాబట్టి కొన్ని జతిస్వరములు, ముక్తాయి స్వరములతో సగమావర్తము స్వరములతోను, సగమావర్తము తాళాక్షరములతో (జతు)లతో వుంటాయి. ఇటువంటి జతిస్వరములు రచించిన వాగ్గేయకారులు పొన్నయ పిళ్ళె, వడివేళు పిళ్ళె, శివానంద పిళ్ళె గార్లు.

జతిస్వరమునే ‘స్వరపల్లవి’ అని అంటారు. దీనిలో జతులుండవు. పూర్ణముగా స్వరములె రచించిన వారిలో శ్రీమాన్ శ్రీ రామాచార్యుల వారు ప్రముఖులు. H.H. స్వామి తిరునాళ్ గారు, రాగమాలికా జతిస్వరములను పెక్కు రచించి యున్నారు. కాని జతిస్వరములకు ఎవరో సాహిత్యములు వ్రాసియున్నారు. బిలహరి,  సారిగాపా-దాసా- నీదా అను జతిస్వరమునకు ‘రార వేణుగోపా బాల’ అనియు, జాసనాది, మంగళం శ్రీ రంగాధీశ, దేవదేవ నిన్నరుల్ తనై పెట్ర మొదలుగా గల సాహిత్యములు రచించినారు. సాహిత్యములు రంజకములుగా ఉండుటను బట్టి ఈ జతిస్వరములు సాహిత్యములతోనే పాడబడుచున్నవి.

స్వరజతి:

స్వరజతి యొక్క లక్షణము జతిస్వరముల యొక్క లక్షణములు నొక్కటే. వీని రెండింటికిని భేదము – స్వరజతికి సాహిత్యముండును, జతిస్వరమునకు సాహిత్యం ఉండదు. స్వరజతిలో దేవుని గురించియో, వీరుని గురించియో సాహిత్యము రచింబడి యుండును. కొన్ని స్వరజతులలో తక, తకిట మొదలగు జతులను స్వరములను సాహిత్యము నందు కాననగును.

శ్యామాశాస్త్రి, ఆది అప్పయ్య, స్వాతి తిరునాళ్, శోభనాద్రి, మొలట్టూర్ వెంకట రామశాస్త్రి, వాలాజపేట క్రిష్ణస్వామి భాగవతార్, చిన్నకృష్ణదాస మొదలగువారు స్వరజతి రచయితలు.

కొన్ని ప్రసిద్ధ స్వరజతి – జతిస్వరములు:

  1. సాని దనీ పమ – ఖమాస్ – ఆది – న చ శ్రీ రామాచార్యులు
  2. మా గరి సని ద పా – జంఝూటి – ఆది – న చ శ్రీ రామాచార్యులు

స్వరజతులు:

  1. సాంబశివా – ఖమాస్ – ఆది – చిన్నికృష్ణదాస
  2. కామాక్షి – భైరవి – చాపు – శ్యామశాస్త్రి

చిట్టతానములు (లేక) కటకములు:

ఇవి వీణాభ్యాస రచనలు. ప్రసిద్ధ రాగములన్నిటిలోనూ ఇవి ఉండును. సంస్కృత భాషా విద్యార్థులకు అమరము ఎంత ఉపయోగమో, వీణా విద్యార్థులకు చిట్టతానములు అంత ఉపయోగములు. ఇది కేవలము వాద్య సంగీతము. ఇవి తాళబద్ధములు కావు, సాహిత్యము లేదు. కాని, ఆయా రాగములలోని ప్రయోగములన్నియు చిట్టతానము నందు కాననగును. చిట్టతానమునందు లేని ప్రయోగము ఉపయోగ రహితము. చిట్టతానములే రాగములకు అధికారి.

వర్ణము:

అభ్యాస రచనకు చాలా ముఖ్యమైన రచన. ఈ రచన నేర్చుకొనుటయు, పరిపూర్ణ పక్వములో పాడుటయు చాలా కష్టము. వర్ణమును బాగుగా నేర్చిన యెడల ఇతర రచనలు అతి సులభ సాధ్యము అగును. వాద్య పాలకులు వర్ణమును పఠించే వాయిద్యములపై వాయించుటచే సంగీత కళను సంపూర్ణముగా వాద్య స్వాధీనము చేసికొనవచ్చును. గాత్ర పాఠకులకు గాత్రము నందు ఎటువంటి సంచారమైనను అవలీలగా పాడుటకు వీలగును.

వర్ణమును రచించుట కష్టసాధ్యము. కృతుల సంఖ్య కంటే వర్ణముల సంఖ్య చాలా కొద్ది.

వర్ణము రచించుటకు రాగము యొక్క లక్షణములు పరిపూర్ణముగా తెలిసికొని, ఆ రాగములో వర్ణమును రచింపవలయును.

లక్షణము:

వర్ణము నందు రెండు భాగములు – పూర్వ, ఉత్తర – అని కలవు. పల్లవి, అనుపల్లవి, మొదలగువాటిని పూర్వభాగమనియు; చరణము, చిట్టస్వరములు ఉత్తర భాగమనియు అందురు.

పల్లవి, అనుపల్లవిలను సాహిత్యమందురు. ముక్తాయి స్వరమునకి సాహిత్యముండదు. కొన్ని వర్ణములకు, ముక్తాయి స్వరములకు సాహిత్యం ఉండును. నాటకురంజి వర్ణం – ముక్తాయి స్వరములకు సాహిత్యం కలదు.

రచించిన రాగములో ఏ ఏ విశేష సంచారములు వచ్చుటకు వీలున్నదో, రాగ రంజక ప్రయోగము లేవో అన్ని రకములైన సంచారములును వర్ణము నందు కాననగును. ఒక భాష నేర్చుకొనుటకు, నిఘంటువు ఎట్లు ఉపయోగింతుమో, ఒక రాగములోని వర్ణము ఆ రాగము యొక్క లక్షణమునకు అంతగా ఉపయొగింతుము.

వర్ణములోని సాహిత్యము చాలా కొద్ది అక్షరములు కల్గియుండును. సాధారణముగా శృంగార రసము గాను, భక్తిని దెల్పునది గాను, లేక ఒక రాజపోషక స్తుతి గాను యుండును.

ఉత్తర భాగములో చరణము, చిట్టస్వరములు ఇమిడి వున్నవి. చరణమునకు ఉపపల్లవి అని, ఎత్తుగడ పల్లవి అని, చిట్ట పల్లవి అనియు పేర్లు.

సాధారణముగా మొదటి స్వరము దీర్ఘముగా యుండును. 4 లేక 5 చరణములతోనే వర్ణమును రచించుట వాడుక. చరణ స్వరము పాడి, మరల చరణమును అందుకొనుట ఆచారము. కొన్ని వర్ణములకు రెండవ పల్లవులు ఉండును.

వర్ణముల రకములు:

వర్ణములు రెండు రకములు – తాన వర్ణము, పద వర్ణము.

తాన వర్ణము పద వర్ణము
1. పల్లవి, అనుపల్లవి, చరణములకు మాత్రం సాహిత్యమును కలిగి తక్కిన భాగములు స్వరములను మాత్రం కలిగియుండును సంపూర్ణముగా సాహిత్యము కల్గి యుండును
2. అభ్యాస గాన రచనలు  చౌకముగా పాడవలెను
3. కచేరీ ప్రారంభంలో పాడుట ఆచారము నృత్యములకు ఉపయోగింతురు

రాగమాలిక వర్ణములు కొన్ని కలవు. అనగా వేరువేరు ఆంగములు వేరు వేరు రాగములలో యుండుట. నవరాగమాలిక, దినరాగ మాలిక మొదలగునవి ఉత్తమ ఉదాహరణలు. నక్షత్రమాలిక అను 27 రాగములలో ఒక రాగమాలిక వర్ణము కూడా కలదు. ఒక్కొక్క ఆవర్తములో లఘువు ఒక రాగము రెండు దృతములు ఒక రాగము గాను, రచించబడినవి.

శ్రీరామస్వామి దీక్షితులు, తోడిరాగము, ఆది తాళముతో ఒక స్వరాక్షర వర్ణమును రచించి యున్నారు.

తాన వర్ణన రచయితలు:

పచ్చిమిరియం ఆదిఅప్పయ్య, శ్యామశాస్త్రి, వీణ కుప్పయ్య, పల్లవి గోపాలయ్య, స్వాతి తిరునాళ్, మానాంబుచవాడి వెంకట సుబ్బయ్య, తిరువారూర్ అయ్యాసామి, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, కొత్తవాసల్ వెంకటరామయ్య, తిరువత్తియూర్ త్యాగయ్యర్, రామ్నాడ శ్రీనివాసయ్యంగార్ మొదలగువారు. ప్రస్తుత రచయితలలో సంగీత శిఖామణి ప్రొఫెసర్ సాంబమూర్తి గారు, వైణిక విద్వాన్ న చ శ్రీరామాచార్యులు గారు.

పదవర్ణ రచయితలు:

గోవింద సామయ్య, కూవన సామయ్య, రామస్వామి దీక్షితులు, వడివేలుగారు,  పల్లవి శేషయ్య, రామస్వామి శివన్, మైసూరు సదాశివరావు, కుండ్రకుడి కృష్ణయ్యర్ మొదలగు వారు.

కొన్ని పద వర్ణములలో పల్లవి, అనుపల్లవి, చరణము మాత్రం సాహిత్యము కల్గి తక్కిన భాగములు తాన వర్ణము వలె స్వరములను మాత్రం కల్గి యుండును.

ఉదా: రూపము జూచి – తోడి – ఆది – దీక్షితులు

పదజతి వర్ణము:

పద వర్ణములోనే జతులు కూడ ఉండు రచన. వర్ణములకు స్వరసాహిత్యములలో నింకొక భాగము కలదు. దానికి ‘అనుబంధము’ అని పేరు.

సాహిత్య భావము వర్ణములోని సాహిత్య భావమునకు ఒద్దికగా యుండును. భైరవి ఆట తాళవర్ణము. విరిబోణిలో చిరు చెమటలు అను భాగము ‘అనుబంధము’. ఇది సంగీత సర్వార్థ సార సంగ్రహములో కాననగును.

కొన్ని వర్ణములలోని అనుబంధములకు స్వరభాగము (లేక) యుండి అనుబంధమును పాడిన పిదప వర్ణోత్తర భాగములోని ముక్తాయి స్వరమును పాడి పల్లవిని ఎత్తుకొని వర్ణమును ముగించుట అలవాటుగా నుండెను.

‘అనుబంధము’ ఎక్కువ ఆకర్షణీయముగా ఉండుట లేదు కాబట్టి రాను రాను ఆ భాగము వదిలివేయబడినది. ఇప్పుడు ‘అనుబంధము’ ఒకటి యున్నదని కూడా ఎవ్వరికీ తెలియదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here