సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-1

4
9

[dropcap]తూ[/dropcap] జహా జహా చలేగా

మేర సాయ సాథ్ హోగా!

మన నీడ కూడా మనల్ని వదలి పోవచ్చేమో గానీ లతా మంగేష్కర్ పాట మాత్రం మనల్ని వదలి పోదు. భౌతికంగా లతా మంగేష్కర్ అనే శరీరం వడలిపోయి, మనల్ని వదలి పోయి ఉండవచ్చుగానీ, సరస్వతి వీణాస్వరం లాంటి లతా మంగేష్కర్ సరసస్వరసురఝరీ తరంగాలు, తరతరాలుగా  అత్యుత్తమ గాన సంవిధానికి తార్కాణంగా నిలచి ఉంటాయి. సంగీతానికి స్పందించే లక్షణం మానవ సమాజంలో, మనిషి హృదయంలో సజీవంగా వున్నంతకాలం తరాలను స్పందింప చేస్తూనే ఉంటాయి.

ఇటీవలి కాలంలో ఎవరైనా మరణించిన మరుక్షణం ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించటం, వారి వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించటం, అంతా తాము చూసినట్టు, తమకు తెలిసినట్టు చెప్పటం చూస్తుంటే ఒక వ్యక్తి సచ్ఛీలతను, సత్ప్రవర్తనను, ఔన్నత్యాన్ని, ఉత్తమత్వాన్ని అంగీకరించలేని మానసిక స్థితిలో మన సమాజం ఉందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా, ఆ వ్యక్తి మహిళ అయి, జీవితాంతం వివాహం లేకుండా, ఒంటరిగా జీవిస్తూ, పురషాధిక్య వ్యవస్థను తన కనుసన్నలతో నిర్దేశిస్తూ, తనకు నచ్చినట్టు జీవితం కొనసాగించే మహిళ అయితే, అస్సలు ఆ ఔన్నత్యం, ఉత్తమత్వం, భరించలేని మానసిక వ్యవస్థ మన సమాజానిది అని లత మరణం తరువాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న దుర్వ్యాఖ్యలు నిరూపిస్తాయి. ముఖ్యంగా పేరున్న ఓ జర్నలిస్టు రచయిత పదే పదే గేయ రచయిత సాహిర్ లుధియాన్వీ లతను ప్రేమించాడనీ, ఆమె కోసం ‘కిసీ పత్థర్ కీ మూరత్ సే’ (హమ్‌రాజ్) అనే పాట కూడా రాశాడనీ గాల్లో ఊహించి, కుళ్లిన మెదడు వికృత సరస్సులో కలం ముంచి మరీ రాయటం,  తెలిసీ తెలియకుండా కుళ్లిన మెదడులోని ప్రతి ఉహనూ నిజం అనుకుని రాసేసి ప్రచారం చేసే, సమర్థించుకునే జర్నలిస్టు రచయితల పట్ల, వారి వికృతపుటూహల వక్ర రాతలకు జైజైకారాలుచేసే వందిమాగధ జనాల బాకాల కేకల  పట్ల   తీవ్రమైన జాలిని కలుగచేస్తుంది. అయితే ఈ దుర్వ్యాఖ్యలు, కుళ్లిన మెదళ్ల వ్యర్థ, అసంబద్ధ ప్రేలాపనలను వదలి ‘లతా మంగేష్కర్’ వైపు దృష్టి కేంద్రీకరిస్తే సరస్వతీ వీణా నిక్వణ స్వరూపమైన స్వరం దైవదత్తంగా పొందిన ‘లత’ అనే మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకునే వీలు లభిస్తుంది.

లతా మంగేష్కర్ స్వతహాగా అల్లరి పిల్ల. కానీ బాల్యం సవ్యంగా అనుభవించే కన్నా ముందే ఇంటి బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి వచ్చింది. తనతో పాటు ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకోవాల్సిన   చెల్లి తన జీవితాన్ని తాను చూసుకుంటూ ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదలి వెళ్లిపోయింది. అయినా లత బెదరలేదు. తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగింది. ‘నేను’ ‘నా జీవితం’  ‘నా ఆనందాలు’ అని అధునిక అభివృద్ధి చెందిన మహిళల్లా ఆలోచించి, కుటుంబాన్ని తన దారిన తాను వదలి తన జీవితం చూసుకోలేదు. పోరాడింది. అదీ ఎలా? తన ప్రతిభనే ఆయుధంలా. తన సత్ప్రవర్తనే కవచంలా. తన నిజాయితీ, వినయాలతో ప్రపంచాన్ని గెలించింది. ఎంత ఎదిగితే అంత ఒదిగింది. కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకు వచ్చింది. జీవితాన్ని ‘పాట’కే అంకితం చేసి, ఒంటరిగా నిలిచింది. ‘మహిళ’ అంటే విలువలేని, చులకన అభిప్రాయం కల సినీ పరిశ్రమలో ఎవరూ తాకలేని ‘హిమాలయ శిఖరం’లా ఉన్నతంగా  నిలిచింది. కన్నెత్తి చూడలేని స్వఛ్ఛమయిన సూర్యకిరణంలా తళతళ లాడింది.  దేశ ప్రజల దృష్టిలో స్వచ్ఛమయిన అంకితభావానికి, భక్తికి, నిస్వార్థానికి, నిజాయితీకి ప్రతీకలా నిలచి భారతరత్నగా ఎదిగింది. అలాంటి అత్యుత్తమ వ్యక్తి అంతరంగాన్ని ఆమె జీవితం ద్వారా, ఆమె పాటల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం ఇది.

లతా మంగేష్కర్ ఎక్కువగా ఎవరితో మాట్లాడేది కాదు. ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు. వాద వివాదాలకు దూరంగా ఉండేది. ఎవరైనా ఆమెపై ఆరోపణలు చేసినా, దూషించినా ఆమె స్పందించేది కాదు. ఎవరేమన్నా సమాధానం తన పాటతోనే ఇచ్చేది. అయితే మీడియా విస్తృతి పెరిగిన తరువాత కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది లతా. కొందరు రచయితలు ఆమెతో జరిపిన సంభాషణల ద్వారా ఆమె అంతరంగాన్ని గ్రహించే ప్రయత్నాలు చేశారు. కానీ, కొన్నాళ్లకి అందరూ, అవే ప్రశ్నలు అడుగుతుంటే, విసుగు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటం మానేసింది. అందరూ ఎప్పుడూ అడిగే ప్రశ్నలు కాక విభిన్నమైన ప్రశ్నలు అడిగితేనే ఇంటర్వ్యూలో పాల్గొనేది. ఈ ఇంటర్వ్యూలలో ఆమె ఇచ్చిన సమాధానాల ద్వారా కూడా ‘లత’ను ‘కళాకారిణిగా’ ‘వ్యక్తిగా’ అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వ్యాస పరంపర చేస్తుంది.   అంటే ఈ వ్యాస పరంపర లత కళను విశ్లేషిస్తూ, ప్రతిభను వివరిస్తూ, ఒక వ్యక్తిగా లతా మంగేష్కర్‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందన్న మాట.  పలువురు ప్రముఖులు, నటీనటులు, గేయ రచయితలు, నిర్మాతలు, సంగీత దర్శకులు లతతో పనిచేసిన తమ అనుభవాలు పంచుకున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.  లతా మంగేష్కర్ గురించి ఆమె తోటి కళాకారుల అభిప్రాయాలను కూడా ఈ వ్యాస పరంపర పరిగణనలోకి తీసుకుంటుంది. ఎందుకంటే, లతను సన్నిహితంగా చూసిన వారు ఈ కళాకారులు. నాయికల ఆత్మను తన స్వరంలో సజీవంగా పలికించటం ద్వారా లతా మంగేష్కర్ నాయికల నటజీవితానికి గుర్తింపును ఇచ్చింది. ఇలా పలు కోణాలలో లతా మంగేష్కర్‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందీ వ్యాస పరంపర.

“Lata didi was an exemplary woman. At a tender age, she was the only bread-earner for her family and kept them bonded till the end. Dignified and selfless, she is also known to have sung free for producers, who were short of money. Truly, they don’t make them like Didi anymore….I can only describe Lata Didi as a pure diamond, flawless. Today, we are bereft of a priceless diamond of the film industry.”

– ఆశా పరేఖ్ మాటల కన్నా గొప్పగా ‘లత’ గురించి చెప్పటం  కుదరదు. ఈ వ్యాస పరంపర ఆ price less diamond జిలుగు వెలుగులు, వెలుగులలో ఒదిగిన నీడలను ప్రదర్శిస్తుంది.

***

Photo Credits: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here