సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 11

0
8

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

యః సముత్పతితం క్రోధం
క్షమయైవ నిరస్యతి ।
యధోరగస్త్వచం జీర్ణం
స వై పురుష ఉచ్యతే ॥

తేటగీతి
పాత బడినట్టి కుబుసమున్ పాట్లు పడుచు
పాము విడచిన తెఱగున ప్రాజ్ఞు డెపుడు
సహన మొక్కింత చూపించి స్వాంత మందు
అణచ వలయును క్రోధమ్ము అహరహమ్ము ౫౧

***

అర్థహాని శ్చావమతిః
గృహచ్ఛిద్రాదికం తథా ।
వంచనా వంచనావాప్తి
ర్న ప్రకాశ్యాని సర్వదా ॥

ఆటవెలది
అర్థ హాని యైన అవమాన మదియైన
కలత లింట పెక్కు కలిగి యున్న
మోస పడిన గాని మోస పుచ్చిన గాని
ఒరుల కెపుడు తెలుప నొప్పు గాదు ౫౨

***

అల్పోధికార లాభత్తు
స్వామినో వ్యతిరిచ్యతే ।
వాలుకోష్ణత్వ మత్యుగ్రం
వివస్వ త్తాపనాదపి ॥

ఆటవెలది
అధిక దర్ప మెపుడు అల్పుండు జూపెట్టు
పట్ట మతని కంట గట్టి నంత
తప్త మైన ఇసుక తాపమ్ము ముందర
తపను డిచ్చు నట్టి తాప మేమి ? ౫౩

***

కులం, రూపం, వయో విద్యా
ధనమేతత్తు పంచకమ్ ।
సతాం వినయ హేతుః
స్యు రసతాం గర్వ కారణమ్ ॥

ఆటవెలది
అందమైన వయసు అందాల రూపమ్ము
మంచి కులము ధనము మంచి విద్య
సుజన కోటి కొసగు సుగుణ సంపదలను
ఖలుల కవ్వి గర్వ కారణమ్ము ౫౪

***

పక్వాని తరు పర్ణాని
పతంతి క్రమశో యథా ।
తథైవ జంతవః కాలే
తత్ర కా పరిదేవనా ॥

తేటగీతి
దేహు లందరు ఆయువు తీరి నంత
ధరను గూలుట తథ్యమ్ము తరచి చూడ
పండు టాకులు రాలవె వసుధ యందు
దుఃఖ మేటికి నిందులో దుఃఖభాగ ! ౫౫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here