సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 14

0
11

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

ఆశయా బద్ధతే లోకే
కర్మణా బహు చింతయా ।
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత, జాగ్రత ॥

తేటగీతి
ఆశ పాశమ్ము కంఠాన అమర జేసి
కర్మ లెన్నియొ జేయుచు గడుపు నరుడు
తరిగి పోయెడి ఆయువు తలపు లేక
జాగరూకత గలిగుండు జగము నందు ౬౬

***

సంపదాః స్వప్న సంకాశాః
యౌవనం కుసుమోపమమ్ ।
విద్యుచ్చంచల మాయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత ॥

తేటగీతి
స్వప్న సమమె సుమ్మి సంపద లన్నియు
అలరు లట్లు అలరు యవ్వనమ్ము
మెరుపు తీగ వోలె మెరయు ఆయు వెపుడు
జాగరూకత గలిగుండు జగతి యందు ౬౭

***

అతిదర్పే హతా లంకా
అతిమానే చ కౌరవాః ।
అతిదానే బలిః బద్ధః
అతి సర్వత్ర వర్జయేత్ ॥

తేటగీతి :
అధిక దర్పమ్ము లంకేశు నణచి వేసె
అధిక మానమ్ము కురురాజు నణచి వేసె
అధిక దానమ్ము బలిరాజు నణచి వేసె
అధిక మెప్పుడు వర్జించు మవని యందు ౬౮

***

మూర్ఖాః యత్ర న పూజ్యంతే
ధాన్యం యత్ర సుసంచితమ్ ।
దంపత్యోః కలహం నాస్తి
తత్ర శ్రీః స్వయ మాగతా ॥

ఆటవెలది
ఖలుల నెవరు నెపుడు గారవింపని చోట
వరిని యెపుడు భద్ర పరచు చోట
కలహ మెపుడు లేని కాపురముల చెంత
సిరుల రాణి నిలచు స్థిరముగాను ౬౯

***

న ధైర్యేణ వినా లక్ష్మీః
న శౌర్యేణ వినా జయః ।
న జ్ఞానేన వినా మోక్షః
న దానేన వినా యశః ॥

తేటగీతి
ధైర్య మయ్యది లేకుండ ధనము రాదు
శౌర్య మయ్యది లేకుండ జయము రాదు
జ్ఞాన మయ్యది లేకుండ గనము ముక్తి
దాన మయ్యది లేకుండ గనము యశము ౭౦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here