సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 15

0
9

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

ఆలస్యోపహతా విద్యా
పరహస్తగతాః స్త్రియః ।
అల్పబీజం హతం క్షేత్రం
హతం సైన్యమనాయకమ్ ॥

తేటగీతి:
జగతి యందు నలసులకు చదువు రాదు
కనగ పరహస్త గతమైన ధనము రాదు
పాడు గింజలు జల్లిన పంట రాదు
సైన్య నాథుడు లేనట్టి సైన్య మోడు ౭౧

***

నిశ్శంకం దీయతే యేన
స దాతా క్షున్నివారిణీ ।
సుధా స్యాత్ ధైర్యవాన్ యస్తు,
స ఏవ పురుషోత్తమః॥

తేటగీతి:
అన్న మమృత మౌను ఆకలి దీర్చంగ
దాన మిచ్చిన కొంచక దాత యగును
తెగువ తోడుత జీవించు ధీరు డొకడె
ఉత్త మోత్తము డరయంగ ఉర్వి యందు ౭౨

***

చతుస్సాగర పర్యంతాం
యో దద్యాత్ పృథివీ మిమామ్ ।
న ఖాదేచ్చాపి యో మాంసం
తుల్యమేతత్ విదుర్బుధాః ॥

తేటగీతి :
నాల్గు సంద్రముల వరకు వెల్గు ధరను
దాన మిచ్చిన లభియించు దాన ఫలము
మాంస భక్షణ సేయని మనుజ వరుని
మురిసి వరియించు నందురు బుధ జనమ్ము ౭౩

***

ప్రత్యుత్థానం చ యుద్ధం చ
సంవిభాగం చ బంధుషు ।
స్వయమాక్రమ్య భుక్తం చ
శిక్షేచ్చత్వారి కుక్కుటాత్ ॥

ఆటవెలది :
ప్రొద్దె నిదుర లేచు పోరు సలుప జూచు
వెడలి తనదు తిండి వెదుక జూచు
బంధు జనుల మధ్య పంచి తినగ జూచు
కోడి కున్న నాల్గు గుణము లివియె ౭౪

***

విద్యా దదాతి వినయం
వినయాద్ యాతి పాత్రతామ్।
పాత్రత్వాద్ ధనమాప్నోతి
ధనాద్ ధర్మం తతస్సుఖమ్ ॥

ఆటవెలది :
విద్య వినయ మొసగు వినయమ్ము పాత్రతన్
పాత్ర తొసగు ధనము వలసి నంత
ధనము తోడ నెపుడు ధర్మమ్ము సేయంగ
సుఖము దొరుకు నయ్య సొంపు మీర ౭౫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here