సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 17

0
11

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

సుఖార్థీ చ త్యజేత్ విద్యాం
విద్యార్థీ చ త్యజేత్ సుఖమ్ ।
న విద్యా సుఖయోః సంధిస్
తేజస్ తిమిరయో రివ ॥

ఆటవెలది :
చదువు కోరంగ విడువుము సౌఖ్య మీవు
సౌఖ్య మయ్యది కోరంగ చదువు రాదు
చదువు సౌఖ్యమ్ములకు సంధి కుదర దెపుడు
వెలుగు చీకట్లు యొకచోట కలియ వెపుడు ౮౧

***

యథా ఖాత్వా ఖనిత్రేణ
భూతలే వారి విందంతి ।
తథా గురుగతాం విద్యాం
శుశ్రూషు రధిగచ్ఛతి ॥

ఆటవెలది :
పలుగు బట్టి భువిని పలుమార్లు త్రవ్వంగ
భద్ర జలము లన్ని బయట పడవె
అటులె విద్య లన్ని అరసి నేర్వగ వచ్చు
శిష్య గణము గురుని సేవ జేసి ౮౨

***

కాకచేష్టో బకో ధ్యానీ
శ్వాన నిద్రస్తథైవ చ ।
అల్పాహారీ గృహత్యాగీ
విద్యార్థీ పంచలక్షణః ॥

ఆటవెలది :
వాయసమ్ము వోలె వరమైన యత్నమ్ము
కొంగ జపము కనగ కుక్క నిదుర
అల్పభోజనమ్ము అల గృహ త్యాగమ్ము
సహజ గుణము లయిదు చదువరులకు ౮౩

***

పఠంతి చతురో వేదాన్
ధర్మశాస్త్రాణ్యనేకశః ।
ఆత్మానం నైవ జానంతి
దర్వీ పాకరసం యథా ॥

ఆటవెలది :
వరలు వేద రాశి వల్లించి వల్లించి
సకల శాస్త్ర చయము చదివి చదివి
ఆత్మ నెరుగ కున్న అసలేమి ఫలమురా
వంట గరిట వోలె వ్యర్థ మగును ౮౪

***

దుర్జనః పరిహర్తవ్యః
విద్యయాలంకృతోఽపి సన్ ।
మణినా భూషితః సర్పః
కిమసౌ న భయంకరః ॥

ఆటవెలది :
విద్య యున్న నేమి విడువంగ వలెనురా
దుర్జనాళి పొందు దుర్భరమ్ము
భయము గలుగ జేయు వారి తలపు కూడ
మణుల దాల్చి యున్న ఫణుల రీతి ౮౫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here