సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 22

0
8

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

త్యజ దుర్జన సంసర్గం
భజ సాధు సమాగమమ్ ।
కురు పుణ్య మహోరాత్రం
స్మర నిత్యమనిత్యతామ్ ॥

తేటగీతి :
దుర్జనమ్ముల సంగతి త్రోసి పుచ్చు
సజ్జనమ్ముల సాంగత్య సంప దరయు
ఆచరించుము సత్కర్మ లనుదినమ్ము
నిత్య మెంచుము జగమనిత్య మనుచు ౧౦౬

***

యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువాణి నిషేవతే ।
ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్ట మేవచ ॥

లభియించునొ లభియించదొ
ఉభయమ్మును తెలియ కుండ ఉరుకులు యేలా ?
లభియించునన్నది విడువ
ఉభయమ్మును నష్ట పోవు నుర్విని యెపుడున్ ౧౦౭

***

పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః।
అథవా పునరా యాతి జీర్ణం భ్రష్టాః చ ఖండశః ॥

ఆటవెలది :
కాంత ధనము పుస్తకమ్ములు యెప్పుడు
పరుల చేత బడిన తిరిగి రావు
తిరిగి వచ్చె నేని తిన్నగా రావురా
చెడును తరిగి పోవు చిరిగి పోవు ౧౦౮

***

అహింసా పరమో ధర్మ: తథా౭హింసా పరం తప: ।
అహింసా పరమం జ్ఞానం అహింసా పరమార్జనమ్ ॥

తేటగీతి :
పరమ ధర్మ మహింసయే ధరణి యందు
పరమ తప మహింసయె సుమ్ము తరచి చూడ
పరమ జ్ఞాన మహింసయె నరుల కెల్ల
పరమ సంప దహింసయె అరసి చూడ ౧౦౯

***

వాచః శౌచం చ మనసః
శౌచ మింద్రియనిగ్రహః ।
సర్వభూతే దయా శౌచం
యేతత్ శౌచం పరార్థినామ్ ॥

ఆటవెలది :
శుద్ధ మైన పలుకు శుద్ధ మైన యెడద
ఇంద్రియములపైన యెగయు గెలుపు
జీవ కోటి యెడల స్థిరమైన యనుకంప
మోక్ష గామి వలచు లక్షణములు ౧౧౦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here