సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 5

0
9

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

అతీత్య స్వార్హతాం కోపి
లభతే నాధికం ఫలమ్ ।
స్వల్పమేవాంబు లభతే
ప్రస్థః ప్రాప్యాపి సాగరమ్ ॥

ఆటవెలది
ఎంత అర్హతున్న అంతె దొరకు గాని
అధిక మెపుడు దొరక దరయ గాను
కడవ చేత బట్టి కడలి చెంత కరుగ
కడవ నీరె నీవు బడయ గలవు ౨౧
ఎంత అర్హతున్న !
అంతె దొరుకునన్న !!

***

వ్యథా వృష్టి సముద్రేషు
వ్యథా తృప్తేషు భోజనమ్ ।
వ్యథా దానం ధనాఢ్యేషు
వ్యథా దీపో దివాఽపి చ ॥

తేటగీతి
వాన కురియంగ సంద్రాన వ్యర్థ మౌను
అరయ సంతుష్టు కన్నమ్ము వ్యర్థ మౌను
అర్థ మీయంగ ధనికిని వ్యర్థ మౌను
పవలు దివ్వెను వెలిగించ వ్యర్థ మౌను ౨౨
అర్హునికే ఇద్దాం !
అర్హమైనదే ఇద్దాం !!

***

నీచే నాల్పతయా దృష్టో
వ్యధికో న విచారయేత్।
దర్పణే పర్వతోప్యల్పే
దృశ్యతే లఘువు త్ఖలు ॥

ఆటవెలది
ఖలులు కించ పరుచ కలత చెందగ బోరు
జ్ఞాను లవని యందు క్షణము గూడ
గగన మంటు చున్న నగరాజమైనను
చిన్న అద్ద మందు చిన్న దౌను ౨౩
మురియకు పొగడిన !
వగవకు తెగడిన !!

***

న తత్ శస్రైః న నాగేంద్రైః
న హయైః న పదాతిభిః।
కార్యం సంసిద్ధి మాప్నోతి
యద్ బుద్ధ్యా తు ప్రసాధితమ్ ॥

ఆటవెలది
ఆయుధముల చేత అశ్వ బలము చేత
గజ బలమ్ము చేత కాల్బలమున
జరుగ నట్టి పనులు జరిగి తీరును సుమ్మి
బుద్ధి బలము చేత పుడమి యందు ౨౪
బుద్ధి బలము కన్న !
ఏ బలము మిన్న !!

***

నాస్తి మాతృ సమా ఛాయా
నాస్తి మాతృ సమో గతిః ।
నాస్తి మాతృ సమం త్రాణమ్
నాస్తి మాతృ సమా ప్రపా ॥

ఆటవెలది
అమ్మ కన్న లేదు హాయి గూర్చెడు ఛాయ
అమ్మ కన్న లేదు అతుల గతియు
అమ్మ కన్న లేదు అమృతంపు చలివేంద్రి
అమ్మ కన్న లేదు అరయ రక్ష ౨౫
మొదటి దైవం అమ్మ !
మరచి పోకు మమ్మ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here