సాఫల్య సోపానం

    0
    7

    [box type=’note’ fontsize=’16’] నైతికత, ధార్మికత, మంచి, మానవీయ సుగుణాలు లేని సంపద, అధికారం ఎంత ఉన్నా అవి ఎందుకూ కొరగానిదని తెలుసుకోవాలని అంటున్నారు యండి. ఉస్మాన్ ఖాన్ “సాఫల్య సోపానం”లో. [/box]

    సంపద, అధికారం, హోదా, పలుకుబడి ఈ అన్నిటికంటే శీలం (క్యారెక్టర్) అత్యంత ప్రధానమైనది. ఎంత సంపాదించినా, ఎన్ని అధికారాలు అనుభవించినా మనిషిలో మంచి, మానవీయ సుగుణాలు లేకపోతే జీవితం నిరర్ధకం. ఈనాడు చాలామంది సంపదే సర్వస్వమని, అధికారమే పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదు. ఇవన్నీ ఈరోజు ఉండి, రేపు పోయే తాత్కాలిక పటాటోపాలే. చివరికి మిగిలేది మంచి, మానవీయ సుగుణాలు మాత్రమే.

    ఈనాడు సంపాదన విషయంలో, అధికారం, హోదా విషయంలో పోటీ పెరిగి పోయింది. ‘అక్రమం, సక్రమం’ అన్నవిచక్షణ లేకుండా అందినవరకు దండుకోవడమే జీవనధ్యేయంగా మారిపోయింది. అలా  కాకుండా, మంచి పనుల్లో, సమాజశ్రేయస్సుకు ఉపకరించే కార్యక్రమాల్లో ఒకరికొకరు పోటీపడాలి. అంటే, ఒకరు ఒక సత్కార్యం చేస్తే, అదిచూసి మరొకరు అంతకంటే ఎక్కువ సత్కార్యాలు ఆచరించాలి. ఒకరు పదిరూపాయలు దానం చేస్తే, మరొకరు ఇరవై రూపాయలు దైవమార్గంలో వెచ్చించడానికి ప్రయత్నించాలి. పోటీ గనక ఉంటే సత్కార్యాల్లోనే ఉండాలి తప్ప, ప్రాపంచిక వ్యవహారాల్లో కాదు. మన పూర్వీకులు ఇలాంటి ఆదర్శాలనే నెలకొల్పారు. దైవమార్గంలో తమ ధనాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, హజ్రత్ ఉమర్ (ర) తన సంపదలో సగానికి సగం తెచ్చి ప్రవక్త మహనీయులవారి ముందు రాశి పోశారు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (ర) తన మొత్తం సంపదనూ దైవమార్గంలో త్యాగంచేశారు. ఇదీ నిబద్దత అంటే, ఇదీ త్యాగం అంటే. పది రూపాయలు దానం చేసి వంద మందికి చెప్పుకోవడం కాదు.

    సృష్టి మొత్తం దేవుని కుటుంబం. మానవుడూ ఈ సృష్టిలోని భాగమే. అందుకని సృష్టిలోని ఏ ప్రాణికి సేవ చేసినా అది దైవానికే చెందుతుంది. ఇలాంటి సత్కార్యాలకు దైవం అమితంగా సంతోషిస్తాడు. అనంతమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అందుకని ఈరోజు ఉండి, రేపు పోయే తాత్కాలిక మెరుగులకు లోను కాకుండా, ఇహలోక ప్రయోజనాలతో పాటు, పరలోక సాఫల్యాన్నీ సాధించిపెట్టగల కార్యాలపై దృష్టిసారించాలి.

    అంటే, దీనర్ధం సంపాదన వైపు దృష్టి సారించవద్దనిగాని, ప్రపంచాన్ని త్యజించమనిగాని కాదు. మంచీ చెడు, ధర్మం అధర్మం లాంటి విషయాలను మర్చిపోకూడదు. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోకూడదు. మానవీయ విలువల్ని కాలరాయకూడదు. అన్యాయానికి, అధర్మానికి పాల్పడకుండా, ఒకరి కడుపు కొట్టకుండా, ధర్మసమ్మతమైన మార్గంలో నైతిక, ధార్మిక పరిధుల్ని అతిక్రమించకుండా ఎంతైనా సంపాదించవచ్చు.

    నిజాయితీగా, నిబద్దతతో, నిస్వార్ధంతో, దైవ ప్రసన్నతా కాంక్షతో ప్రజాసేవ చెయ్యాలన్న బలమైన సంకల్పం గనక ఉంటే, ప్రజాభీష్టం, ప్రజాస్వామ్య విధానాల ద్వారా అధికారాలు, హోదాలను కూడా పొందవచ్చు. ధర్మం దీనికి అడ్డుచెప్పదు.

    పేదసాదల్ని, నిస్సహాయుల్ని, అగత్యపరుల్ని ఎంతో కొంత ఆదుకోగలిగితే, ప్రజల బాగోగులు, ప్రజాసంక్షేమం ఎంతో కొంత పట్టించుకోగలిగితే అటువంటి సంపాదన, అటువంటి అధికారం ఎంతైనా ప్రశంసించదగ్గది. దైవప్రసన్నతకు యోగ్యం కాగలదనికూడా ఆశించవచ్చు.

    అందుకని ప్రతి ఒక్కరూ నైతికత, ధార్మికత, మంచి, మానవీయ సుగుణాలను అలవరచుకోవాలి. ఇవిలేని సంపద, అధికారం ఎంత ఉన్నా అవి ఎందుకూ కొరగానిదని తెలుసుకోవాలి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here