మనిషి ఎలా పరిణతి చెందాడో వివరించే ‘సేపియన్స్’

0
6

[యువల్ నోఆ హరారీ రచించిన ‘సేపియన్స్’ అనే పుస్తకానికి ఆర్. శాంతసుందరి గారి అనువాదాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ ఎన్. వి. హనుమంతరావు.]

[dropcap]సే[/dropcap]పియన్స్ అంటే పరిణితి చెందిన మానవులు, తెలివైన మానవులు. ప్రముఖ ఇజ్రాయిల్ రచయిత యవల్ నో ఆ హరారి రాసిన ఈ పుస్తకం చాలా రోజుల క్రితం ఓ ముప్పై పేజీలు చదివి లోపల పెడితే దాక్కుని మళ్లీ అనుకోకుండా ఈరోజు బయటపడింది. చదువుతున్నకొద్దీ ఉత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే ఇది మన చరిత్ర. మన పూర్వీకుల చరిత్ర. మానవ జీవన పరిణామ క్రమం. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి వివరిస్తున్న పుస్తకం. ఇప్పటికి ఈ పుస్తకం చదవడం పూర్తయింది. చదివిన తర్వాత ఈ పుస్తకం గురించి రాయాలి అంటే కొద్దిగా భయం వేసింది. ఇది చదివిన తర్వాత నేను అర్థం చేసుకున్నది, తెలుసుకున్నది, నేర్చుకున్నది, మీకు చెప్పాలంటే మరో చిన్న పుస్తకం అయ్యే అవకాశం ఉంది. అందుకే నాకర్థమైనంత వరకు సరళమైన భాషలో అతి క్లుప్తంగా రాయటం మొదలుపెట్టినా ఆరు పేజీలు అయింది. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం..

కేవలం 60 లక్షల సంవత్సరాల క్రితం ఒక ఆడ కోతికి రెండు ఆడ కోతి పిల్లలు పుట్టాయట. ఒకటి అన్ని చింపాంజీలకు పూర్వీకులు అయింది. మరొకటి స్వయానా మన అమ్మమ్మట. ఎక్కడో తూర్పు ఆఫ్రికాలో పుట్టిన మానవుడు ప్రపంచమంతా పర్యటిస్తూ అక్కడి వాతావరణాలకు అనుకూలంగా శారీరక నిర్మాణాలు మార్పుచెందుతూ ఈరోజు ఈ స్థితికి వచ్చాము. మిగిలిన జీవజాతులకన్నిటి కంటే మానవుడి ప్రత్యేకత అభివృద్ధి చెందిన అతని మెదడు. అందుకే మనమందరం శుద్ధ సేపియన్లం అంటాడు రచయిత.

దాదాపు 20 లేదా 30 వేల సంవత్సరాల క్రితం మానవుడు ఒంటరిగా లేదా గుంపులుగా, సమూహాలుగా ఆహారం కోసం అన్వేషిస్తూ ఈ భూమి మీద సంచరిస్తూ ఉండేవాళ్లు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ, ఏది దొరికితే అది తింటూ ముందుకు సాగేవాళ్ళు. ఒక నిర్ణీత సమయంలో ఆహారం తీసుకోవటం ఉండదు కాబట్టి, దొరికినప్పుడు అతిగా, ఆబగా తినేవాళ్ళు. అదే అలవాటు ఇప్పటికీ మన జీన్స్‌లో ఏర్పడింది అని శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకే ఈనాటికీ మానవుడు తనకు అవసరమైన దానికన్నా, కావలసిన దానికన్నా, ఎక్కువగా తింటున్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో అనేక అనారోగ్యాలకు ఈ అలవాటే మూల కారణం.

దాదాపు 10 నుంచి 16 వేల సంవత్సరాల లోపు సేపియన్స్ భూగోళమంతా ఆక్రమించారు. వాతావరణానికి, పర్యావరణానికి అనుకూలంగా సర్దుకుపోయారు. ఇది అంత సులువుగా జరగలేదు అంటారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి ఖండాలలో సాగిన వారి ప్రయాణం పర్యావరణ విధ్వంసానికి దారి తీసింది. వారు అడుగుపెట్టిన ప్రతి నేలమీద 60 నుండి 70 వరకు జంతు జాతులు నశించిపోయాయి. సింహాలు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, పెద్ద ఆకారం గల ఎలుకలు, వేల సంఖ్యలో పక్షులు, కీటకాలు పరాన్నజీవులతో సహా మొత్తం అంతరించిపోయాయి. మరోవైపు కొందరు అధ్యయనకర్తలు మానవులు నిర్దోషులని, అది వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల జరిగిన ప్రమాదమని వాదించేందుకు ప్రయత్నించారు. ఏది ఏమైనా మానవులు ఆ వినాశనానికి కారణమనేది నిశ్చయం. అందుకే జీవ శాస్త్ర చరిత్రలోమనం అన్నిటికన్నా ప్రాణాంతకమైన జాతిగా అపఖ్యాతి సంపాదించుకున్నాము అంటాడు రచయిత.

ప్రపంచ చరిత్రలో సుమేరియన్లు భాష, లిపి కనిపెడితే క్రీ.శ. 9వ శతాబ్దానికి ముందు ఒక కొత్త లిపిని కనుగొనడం ద్వారా చరిత్రలో అతి ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. అవి కేవలం పది చిహ్నాలు. 0 నుండి 9 దాకా ఉన్న అంకెలకు ప్రతీకలు. ఈ అంకెలను ఇప్పుడు మనం అరబిక్ అంకెలు అంటాము. అసలు వీటిని కనిపెట్టింది హిందువులట. అరబ్బులు హిందూ దేశాన్ని ఆక్రమించినపుడు ఇటువంటి చిహ్నాల ప్రయోజనాన్ని గమనించి, తస్కరించి ఆ తరువాత సంస్కరించి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడింది. ఇప్పుడు ఏ దేశంలో అయినా ఏ భాష అయినా ఏ వ్యవస్థలో అయినా ఈ గణిత లిపి ఉపయోగించడం జరుగుతోంది. ఇదే ఈనాటి కంప్యూటర్‌కి ఆధారం. సుమేరియన్ల దగ్గర ప్రారంభమైన ఈ మార్పు సిలికాన్ వ్యాలీలో టాబ్లెట్ విజయంతో ముగిసింది అంటాడు రచయిత.

మానవ జాతి చరిత్రలో వ్యవసాయ విప్లవం అత్యంత ముఖ్యమైనది. మనిషి వ్యవసాయం చేయడం మొదలు పెట్టిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసిన తరువాత ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. నిజానికి గత మూడు వేల సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో మానవజాతి కొత్తగా సాధించింది ఏమీ లేదు. గతంలో ఉన్న గోధుమ, వరి, బంగాళదుంప లాంటివి పండించడమే జరిగింది కానీ కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు అని రచయిత చెప్పారు.

ఇక వర్ణం, కులం గురించి రాస్తూ రచయిత ఒక చోట.. దురదృష్టవశాత్తు సంక్లిష్టమైన మానవ సమాజాలకు ఊహాజనిత వర్గీకరణలో అన్యాయమైన వివక్ష అవసరమవుతోంది అంటారు. కుల వ్యవస్థ గురించి చెప్తూ ఇలాంటి ఆలోచనలు కేవలం హిందువులకు మాత్రమే ఉండేవని అనుకోకూడదు అంటాడు రచయిత. మన దేశంలో నాలుగు కులాలుగా ఉండిన జనం 3000 వేరు వేరు సమూహాలుగా విడివడి జాతులు అనే పేరు సంపాదించుకున్నాయి. పవిత్రత, అపవిత్రత అనే అంశాలు కేవలం భారతదేశంలోనే కాక అమెరికా, ఆఫ్రికా కొద్దిగా యూరప్ మొదలైన దేశాలలో కూడా ఇలాంటి భావన ఉన్నది. ఇలాంటి వ్యవస్థ ఒక విషవలయంలో చిక్కుకున్నది అని రచయిత అభిప్రాయం.

ఈ పుస్తకంలో స్త్రీ పురుషుల గురించి లైంగికత, లింగ భేదం అనే విషయాల గురించి రచయిత చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు. సెక్స్ అనేది జీవశాస్త్రం వర్గానికి చెందినదైతే జెండర్ సంస్కృతికి సంబంధించినది అంటారు. జీవశాస్త్ర పరంగా స్త్రీపురుషులు ఇద్దరూ ఒకటే కానీ జెండర్ చాలా గంభీరమైన వ్యవహారం. కొన్ని వేల సంవత్సరాల నుండి కొన్ని సమాజాలలో మాతృస్వామ్యం ఉన్నా పితృస్వామ్య సమాజాలే ఎక్కువ. పురుషుల ఆధిపత్యం కేవలం శారీరక బలం కాదని వాళ్ల దుందుడుకు స్వభావం తాలూకు పరిణామమని కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఈ పరిణామ క్రమం పురుషుల్లోనూ స్త్రీలలోనూ మనుగడకి, పునరుత్పత్తికి సంబంధించిన వ్యూహరచనలో తేడాలను సృష్టించింది అంటాడు రచయిత. గత శతాబ్ద కాలంలో జెండర్ పాత్రలో విప్లవాత్మకమైన అనేక మార్పులు వచ్చాయి. చాలా సమాజాలు స్త్రీలకి, పురుషులకి చట్టప్రకారం సమానమైన హోదా రాజకీయ హక్కులు ఆర్థిక అవకాశాలు ఇస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి అనేది అనేక విధాలుగా మారుతూ వస్తోంది. చిన్న చిన్న సంస్కృతులు ఏక సంస్కృతిగా మారిపోవటం మళ్ళీ కొన్ని శతాబ్దాల తరువాత ముక్కలు ముక్కలుగా విడిపోవటం జరిగింది. గత మూడు శతాబ్దాలుగా ప్రాపంచిక దృష్టిని అర్థం చేసుకునేందుకు మనిషి మరింతగా ప్రయత్నించాడు. డబ్బు, సామ్రాజ్యాలు సార్వత్రిక మతాలు భారీగా విస్తరించి ఈనాటి ఐకమత్యంతో కూడిన ప్రపంచానికి పునాది వేశాయి. అవే ఏక ధ్రువ ప్రపంచానికి మూల కారణం అయ్యాయి. మనుషుల్ని కలిపి ఉంచే మూడు అంశాల్లో ఆఖరిదైన మతం గురించి ఒక అధ్యాయంలో విస్తృతంగా చర్చించడం జరిగింది. ఇంత విస్తృతంగా చర్చించిన ఈ అధ్యాయంలో కొన్ని వేల ఏళ్ళ క్రితం పుట్టిన హిందూ మతం గురించి, భారతదేశం గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. చివరకు బౌద్ధం గురించికూడా వివరించిన ఈ రచయిత భిన్నత్వంలో ఏకత్వం సాధించిన హిందూ మతం గురించి ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

చరిత్రలో ప్రతిదీ ఒక కూడలే. గతం నుంచి వర్తమానానికి సాగేది ఒకే ఒక మార్గం. కానీ అక్కడినుంచి లెక్కలేనన్ని మార్గాలు భవిష్యత్తు వైపుకు చీలిపోతాయి. అందుకే హోమో సేపియన్స్ వెనక్కి చూసుకోవడం అనే పొరపాటు చేయకపోవడం వారి విజయ రహస్యం అని ఒక అధ్యాయంలో వివరిస్తాడు రచయిత. ఎందుకంటే చరిత్ర గమన శక్తులు మానవుల శ్రేయస్సును పెంచే దిశగా మాత్రం పని చేయలేదు. ఎక్కువగా విజయాన్ని సాధించిన సంస్కృతులే అత్యధికంగా ఉపయోగకరమైనవి అనే అభిప్రాయానికి కూడా సరైన ఆధారం లేదు. క్రీ.శ. 1500 ప్రాంతాలలో వచ్చిన శాస్త్రీయ విప్లవం ప్రాణికోటి తలరాతనే మార్చివేసింది అంటాడు రచయిత. 1509 సంవత్సరంలో మొత్తం ప్రపంచంలో 50 కోట్ల సేపియన్స ఉండేవారు. ఈనాడు 700 కోట్ల మంది ఉన్నారు. అంటే మనుషుల జనాభా 14 రెట్లు పెరిగింది. ఉత్పత్తి 240 రెట్లు, ఆహారం తీసుకోవడం 115 రేట్లు పెరిగాయి. జనాభా పెరిగినా ఈనాడు మానవుడు ఎంత అభివృద్ధి సాధించాడో, సాధిస్తున్నాడో ఈ లెక్కలు చెబుతాయి. మానవుడు చంద్రుడి మీద కాలు పెట్టాడు. అలాగే అణుబాంబు పేల్చటం కూడా నేర్చుకున్నాడు. ఈ 500 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి జరిగింది. మనిషి జ్ఞానిగా మారేడా లేక అజ్ఞానిగా ఉండిపోయాడా అని అనేక విషయాల్లో రచయిత ఒక అధ్యాయంలో వివరిస్తాడు. ఈ కాలంలోనే గొప్ప శాస్త్రీయ విప్లవం సంభవించినా మనిషి తాను అజ్ఞాని అని భావించుకున్నాడు. ఈ భావనే మనిషి అభివృద్ధి పథంలోకి సాగటానికి సహాయపడింది. కాలానుగుణంగా శాస్త్ర సమ్మతమైన పద్ధతులు మారుతూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయాలను కనుక్కుంటూ మనిషి ముందుకు సాగుతున్నాడు. ప్రాచీనకాలంలో జ్ఞానులు మనకందించిన విజ్ఞానానికి కొనసాగింపే ఆధునిక శాస్త్ర విజ్ఞానం అని అత్యంత వివరంగా ఉదాహరణల సహితంగా రచయిత ఒక అధ్యాయంలో వివరిస్తారు.

సైన్స్ మరియు టెక్నాలజీ విస్తృతంగా అభివృద్ధి చెంది సమాజానికి ఉపయోగపడాలి అంటే ఆయా రంగాలలో విస్తృతమైన పరిశోధనలు జరగాలి. కానీ అనేక దేశాలలో ప్రభుత్వాల వద్ద ఈ రంగంలో ఖర్చుపెట్టడానికి నిధులు పరిమితంగా ఉన్నాయి. అందుకే విజ్ఞానశాస్త్రం వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో స్వయంగా నిర్ణయించుకోలేకపోతోంది అంటారు రచయిత. కారణం విజ్ఞాన శాస్త్రానికి సామ్రాజ్యాలకీ, పెట్టుబడికి అవినాభావ సంబంధం ఉన్నది. ఒక అధ్యాయంలో మనందరికీ తెలిసిన జేమ్స్ కుక్ సాహస యాత్ర ఫలితాలు, ఆ యాత్ర వల్ల జరిగిన నష్టాలు స్పష్టంగా వివరిస్తారు. యూరోప్ నుండి వివిధ దేశాలకు వెళ్ళి నివాసం ఏర్పరుచుకున్న వాళ్లు స్థానికుల నుంచి భూములు, సంపద లాక్కుని వాళ్లని మూల ప్రాంతాలనుండి తరిమి వేయడం వలన మూలవాసులు పూర్తిగా నశించి పోయారు. టాస్మానియాను ఒక ఉదాహరణగా రచయిత చూపెడతారు. పదివేల సంవత్సరాలు అద్భుతమైన ఏకాంత వాసం అనుభవించిన అక్కడి ప్రజలు కుక్ వచ్చిన శతాబ్దం లోపు పూర్తిగా అంతరించిపోయాయిట. 1775లో ప్రపంచంలోని ఆర్థిక అభివృద్ధి లో 80% ఆసియాదే. 1950 వచ్చేసరికి యూరప్ ఆధ్వర్యంలో ఒక కొత్త భూమండల అధికారం, సంస్కృతి ప్రారంభమయ్యాయి. దీనికి కారణం యూరోప్ లోని శాస్త్రజ్ఞులు వారు చేసిన శాస్త్రీయ పరిశోధనలు, అనేక రంగాలలో వాళ్లు సాధించిన శాస్త్రీయమైన అభివృద్ధి కారణంగా చెబుతారు.

ప్రపంచ చరిత్ర ఒకే ఒక సమగ్రమైన మానవ సమాజం చరిత్రగా రూపుదిద్దుకుంది అంటే అందుకు కారణం యూరప్ సామ్రాజ్యవాద యాత్రలు అని చెప్పుకోవచ్చు. అన్వేషించు – జయించు అనే ధోరణిలో యూరప్ మెల్ల మెల్లగా పక్కనున్న రాజ్యాలను జయించుకుంటూ కొన్ని వందల సంవత్సరాల పాటు దూర ప్రయాణాలకు యాత్రలు చేస్తూ ప్రపంచ చరిత్ర గతిని మార్చివేసింది. యూరప్ చేసినన్ని సముద్ర ప్రయాణాలు అప్పటికే అభివృద్ధి చెందిన ఆసియా దేశాలు కూడా చేయలేదు. ఆధునిక యూరోపియన్లకు సామ్రాజ్య నిర్మాణం అనేది ఒక శాస్త్రీయ ప్రణాళిక అయితే శాస్త్రీయ విషయాలను ముందుకు తీసుకు పోవడం అనేది ఒక సామ్రాజ్యవాద ప్రణాళిక. అందుకే ముస్లింలు భారతదేశాన్ని ఆక్రమించినపుడు మన దేశ చరిత్రను పద్ధతి ప్రకారం అధ్యయనం చేయలేదు. అదే బ్రిటిష్ వాళ్ళు ‘ది గ్రేట్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రారంభించి. కేవలం 60 సంవత్సరాలలో చరిత్ర అధ్యయనం పూర్తి చేశారు. ఇది బ్రిటిష్ వాళ్లకు శాస్త్రీయ విషయాలపై ఉన్న కుతూహలానికి చక్కటి ఉదాహరణ.

ఈ పుస్తకంలో అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం 16 ‘పెట్టుబడిదారి మతం’. ఈ అధ్యాయంలో పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బు యొక్క ప్రాముఖ్యత గురించి సోదాహరణంగా ఎంతో ఆసక్తికరంగా వివరించడం జరిగింది. ఆధునిక అర్థశాస్త్ర వ్యవస్థ మానవులలో ఊహాశక్తి కున్న అద్భుతమైన సామర్థ్యం అంటారు రచయిత. డబ్బును మనిషి ఎలా ఉపయోగించాడు, దాని ద్వారా ఎలా ఎదుగుతున్నాడు, సమాజాన్ని తన గుప్పిటలో పెట్టుకొని విజయం ఎలా సాధిస్తున్నాడు అన్న విషయాలు ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. డబ్బు గురించి ఎన్నో అద్భుతమైన, ఆసక్తికరమైన కొటేషన్స్ ఇందులో మనకి కనపడతాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బు ఎలా పెరుగుతుంది, అది సమాజానికి, దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అని తెలియజేస్తారు.

చరిత్రలో కొంత వెనక్కి వెళితే ఎన్నెన్ని సామ్రాజ్యాలు ముఖ్యంగా పశ్చిమ యూరోప్ అధునాతన ఆర్థిక వ్యవస్థ లని ఏర్పాటు చేశారు. అదే సమయంలో పెట్టుబడి పేరిట ఇతర వ్యవస్థలని కబళించడం ఏ విధంగా జరుగుతుందో కూడా తెలియజేస్తారు. ఉదాహరణకి ఇండియన్ ఉపఖండాన్ని ఆక్రమించింది బ్రిటిష్ రాజ్యం కాదు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ నియమించిన కిరాయి సైన్యం అంటారు రచయిత.

పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎన్నో దేశాలు కుప్పకూలిపోయాయి. ఉదాహరణకు ఫ్రాన్స్ సామ్రాజ్యం చేసిన ఒక నేరం వల్ల ఆ రాజ్యం పతనమై ఫ్రెంచి విప్లవానికి దారి తీసింది. ఇండోనేషియా, చైనా, ఈజిప్ట్, గ్రీక్ మొదలైన దేశాలన్నీ బ్రిటన్ ఆర్థిక రాజకీయాలకి బలి అయిపోయాయి. ఆధునిక ప్రపంచంలో అత్యంత పెద్ద సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అంటాడు రచయిత.

ఆధునిక కాలంలో యుద్ధానికి నిర్వచనం మారిపోయింది అని ఒక అధ్యాయంలో వివరిస్తాడు రచయిత. నిజానికి 1945 తర్వాత ఏ దేశము, ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కారణం యుద్ధం యొక్క ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఎక్కడో ఎప్పుడో కొన్ని అనవసరమైనటువంటి సమస్యల వల్ల యుద్ధం కొన్ని దేశాల మధ్య జరుగుతోంది. అన్నిటికంటే ముఖ్యం చాలా దేశాలను అణుబాంబు భయపెట్టింది. ఈ రోజుల్లో దేశాలలోని సంపదంతా భౌతికంగా చాలా తక్కువగా ఉండి మానవుల మెదడులో ఎక్కువగా ఉండటం వల్ల యుద్ధం పట్ల విముఖత పెరిగిపోయింది. అయినప్పటికీ కొన్ని దేశాలు ఆక్రమణల కోసము, జాతి వైరం కోసం యుద్ధాలు చేస్తున్నాయి. రష్యా – ఉక్రెయిన్, ఇజ్రాయిల్- హమాస్- ఇరాన్ పోరాటాలు ఇలాంటివే. ఇలాంటి యుద్ధాలవల్ల సమాజం ఎటు పయనిస్తుందో చరిత్ర ఇంకా నిశ్చయించటం లేదు. మనం వేచిచూడాల్సిందే.

ఈ పుస్తకంలో 19వ అధ్యాయం ‘ఆ తరువాత వాళ్ళు కలకాలం ఆనందంగా జీవించారు’. మనం ఎంత అభివృద్ధి సాధించాము అన్నది కాకుండా ఎంత ఆనందంగా జీవిస్తున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం. మనిషి నిజంగా ఆనందంగా ఉన్నాడా? ఉంటే ఎప్పటినుండి ఉన్నాడు? ఎందుకు ఆనందంగా ఉన్నాడు? అసలు ఆనందం ఎన్ని విధాలుగా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ అనేక ఉదాహరణలతో ఆసక్తిదాయకంగా ఈ అధ్యాయంలో వివరించటం జరిగింది.

సేపియన్స్ ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రగతి సాధించినా జీవశాస్త్రం నిర్ణయించిన హద్దుల్ని దాటిపోలేదు. కానీ ఇరవై ఒకటో శతాబ్దం ప్రారంభం నుండి ఇది నిజం కాదని నిరూపించబడింది. అప్పటిదాకా ప్రతి జీవి సహజ ఎంపికకే లోబడి పరిణామం సాధించింది. జన్యుశాస్త్రం అభివృద్ధి అయిన తర్వాత మనం ఊహించని మార్పులు సమాజంలో ఏర్పడ్డాయి. మనుషులు ఇతర జీవాలను కొత్తగా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. జన్యు పునర్నిర్మాణం సాయంతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి. వేల సంవత్సరాల క్రితం మాయమైన మానవ జాతిని బయో ఇంజనీరింగ్ ద్వారా తిరిగి జీవించేలా చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదిసాధ్యమైతే హోమో సేపియన్‌లు పరిసమాప్తి అవ్వటం తథ్యం. మరో రెండు మూడు దశాబ్దాలలో కంప్యూటర్లో మనిషిలా మాట్లాడే, ప్రవర్తించే కృత్రిమ మానవ మస్తిష్కాన్ని తయారు చేసే అవకాశం కూడా ఉంది. మానవ జీవితంలో అన్ని రంగాలలో వ్యవస్థల నియమాలను పునర్ నిర్వచించాల్సిన అవసరం వస్తుంది. నైతిక, సామాజిక, రాజకీయపరమైన చిక్కులు ముందుముందు రాగలవు. గతంలో మనం చెప్పుకున్న సైన్స్ ఫిక్షన్ వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది.

ఈ పుస్తకం ఆఖరులో రచయిత భవిష్యవాణి కూడా వినిపిస్తాడు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందింది. హోమో సేపియన్ లను తొలగించి ఆ స్థానంలో పూర్తిగా భిన్నమైన ప్రాణుల నిర్మాణం జరుగుతుందట. భవిష్యత్తులో మనము ఎలా తయారవ్వలి అనుకుంటున్నాం అనేది కాదు మన ముందున్న ప్రశ్న. మనం కావాలని కోరుకునేది ఏమిటి? ఈ ప్రశ్న విని భయపడని వాళ్లు బహుశా దీని గురించి లోతుగా ఆలోచించలేదు అంటాడు రచయిత. జీవిత పరిణామం కొన్ని వేల సంవత్సరాల నుండి మనిషి ఎలా పరిణతి చెందాడు అన్నది వివరిస్తూ భవిష్యత్తులో అదే మనిషి తన ఉనికిని ఎలా కోల్పోతాడో కూడా అద్భుతంగా వివరించారు రచయిత.

***

సేపియన్స్
మూలం – యువల్ నోహ్ హరారి
అనువాదం – ఆర్. శాంతసుందరి
ప్రచురణ: మంజుల్ పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 432
వెల: ₹ 699.00
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/Sapiens-Telugu-Yuval-Noah-Harari/dp/9389143314

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here