సరిగమలు… గలగలలు

0
6
Kashi Vishwanath Temple

[box type=’note’ fontsize=’16’] “ఏ విద్య అయినా నిరతరం గలగలా పారే సెలయేరులా ఉంటే పదిమందికీ ఉపయోగపడుతుంది. అలా కాకుండా స్తబ్దుగా ఉంటే చెరువులా ఉంటే నీళ్ళు పాడైపోయి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతుంది” అని చెప్పిన కథ ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి వ్రాసిన “సరిగమలు.. గలగలలు“. [/box]

[dropcap]సా[/dropcap]యంకాలం ఐదుగంటలు దాటింది. వారణాసిలోని కేదారఘాట్ మెట్లు మీద కూర్చున్నారు మధుమతి, శ్రీకర్. గంగానదిలో పడవలు వరసగా వెళ్తున్నాయి. కొన్ని పడవలలో హిందూ యాత్రికులుంటే మరి కొన్నింటిలో విదేశీయులున్నారు.

ఇంకా చలికాలం రాలేదు. ఓ పది మంది వరకూ సాయంత్రం స్నానాలు చేస్తున్నారు. మధుమతి, శ్రీకర్‌లకు కొద్ది దూరంలో ఒకాయన ఆసనం మీద కూర్చుని సంధ్యావందనం చేస్తున్నారు.

నదిలో వెళ్తున్న ఒక పడవలో నలుగురు విదేశీయులున్నారు. ఒకతను గిటారు వాయిస్తున్నాడు. మరొకతను తబలా వాయిస్తుంటే, మూడవ వ్యక్తి ఒక పాట హమ్మింగ్ చేస్తుంటే నాల్గవ అతను వాళ్ళను ఫోటోలు తీస్తున్నాడు.

మధుమతి ఆ పడవ దూరంగా వెళ్ళేవరకూ ఆసక్తిగా చూసింది.

ఇంతలో ఒక పడవలోంచి తెలుగు పాట వినపడింది. మధుమతి చెవులు రిక్కించి వినసాగింది.

“నీలాల సుందరిలా నవరసమయ మంజరిలా
కదలిరావే నా చెలీ, కమనీయ నెచ్చెలీ
ప్రియతమా.. ప్రియతమా..
మరిచిపోకుమా.. మరచిపోకుమా..”

మధుమతి మొహం మీద చిరు చెమటలు పడ్తున్నాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది.

రామ్మూర్తి మాష్టారు రాసిన ఈ లలిత గీతం.. ఇక్కడ ఎవరు పాడుతున్నారు.

గబగబా రెండు మెట్లు దిగింది.. పడవ గంగానదిలో వెళ్ళి పోతోంది. వాయిద్యాల హోరు లేదు. పాట పాడే అతని గొంతు చాలా శ్రావ్యంగా ఉంది.

ఈలోగా కేదారేశ్వర్ స్వామి గుడిలో హారతి కార్యక్రమానికి ప్రారంభ సూచికంగా దేవాలయంలోని గంటలు గణాగణా మ్రోగాయి.

“మధూ గడిలో హారతి చూద్దాం పద” పిలిచాడు శ్రీకర్.

భార్యాభర్తలిద్దరూ కేదారేశ్వర్ స్వామి గుడిలో హారతి చూడటానికే వచ్చారు. హారతి ఇంకా ప్రారంభం కాలేదని మెట్ల మీద కూర్చున్నారు.

మధుమతి వెనుదిరిగి భర్తతో కలిసి మెట్లెక్కి కేదారేశ్వరస్వామి గుడిలోకి వెళ్ళింది. ఆరగంట సేపు జరిగిన హారతి కార్యక్రమం చూసి ఆంధ్రాశ్రమానికి వచ్చారు శ్రీకర్, మధుమతి.

రాత్రి భోజనం చేసి పక్క మీద వాలినా గంగానదిలో వెళ్ళిన పడవలోని ఆ పాటే మధుమతి హృదయంలో మారుమ్రోగుతోంది.

శ్రీకర్ పెందరాళే నిద్రపోయాడు. మధుమతికి నిద్ర  రావడం లేదు.

మంచం మీద నుండి లేచి తలుపు తీసి వరండాలో కొచ్చి నిలబడింది. కొంతమంది రూములు ఖాళీ చేసి వెళ్తున్నారు. మరి కొంతమంది ఆ ఖాళీయైన రూముల్లోకి వస్తున్నారు. మనసుని వేరే విషయం మీద లగ్నం చేద్దామన్నా ఆమె వల్ల కావటం లేదు. ఆ పాటే గుర్తుకు వస్తోంది.

మధుమతి రూములోకి వచ్చి తలుపు గడియ వేసి కుర్చీలో కూర్చుని కళ్ళు మసుకుంది. ఆమె బాల్యం కళ్ళ ముందు కదలాడింది.

***

శివపురం కళాకారులకు పుట్టినిల్లు. వైణిక విద్వాంసులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సుబ్బారాయుడు, వయెలిన్ విద్వాంసులు నర్సింహమూర్తి, మృదంగ విద్వాంసులు సూర్యనారాయణ, హార్మోనిస్టులు పన్నాస సోదరులు శివపురానికి ఎంతో ఖ్యాతిని తీసుకు వచ్చారు.

గ్రామంలో చాలామంది తమ పిల్లలకు సంగీతం నేర్పిస్తున్నారు. ఎక్కువమంది పిల్లలు హార్మోనియం, వీణ, వయోలిన్ నేర్చుకుంటున్నారు. మృదంగం మాత్రం నలుగురైదుగురు నేర్చుకోవడం గమనార్హం.

సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద ఇరవై మంది వరకూ వీణ వేర్చుకుంటున్నారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త భూషణరావుగారి అబ్బాయి వంశీ, బ్యాంక్ మేనేజరుగారి అమ్మాయి మధుమతి కూడా ఉన్నారు. గ్రామంలో ఉన్న హైస్కూలులో ఇద్దరూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వంశీ వీణతో పాటు చంద్రభట్ల సత్యం గారి దగ్గర గాత్రం కూడా నేర్చుకుంటున్నాడు. వారానికి మూడు రోజులు వీణ పాఠానికి, మూడు రోజులు గాత్ర పాఠానికి వెళ్తాడు వంశీ. ఆదివారం ఆటవిడుపు.

సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీణ పాఠం చెప్పడం పూర్తయ్యాక వంశీని ఏదైనా కీర్తన పాడమనేవారు. వంశీది చాలా మధుర్యమైన గొంతు. మాష్టారి కోరిక మీద శ్రావ్యంగా ఒక కీర్తన పాడేవాడు వంశీ. కాలక్రమేణా మాష్టారితో పాటు మధుమతికి కూడా వంశీ పాటంటే ఇష్టం ఏర్పడింది.

వంశీ, మధుమతి ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరం చుదవులోకి వచ్చే సరికి వీణా వాయిద్యంలో ఇద్దరూ పట్టు సాధించారు. పాలకొల్లులో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఇద్దరి చేత వీణ యుగళ కచేరీ చేయించారు. ఉత్సవ నిర్వాహకులే కాకుండా చెన్నై నుండి వచ్చిన సంగీత విద్వాంసులు కూడా వంశీ, మధుమతుల వీణీ కచేరీని అభినందించారు.

సంగీతం వంశీ, మదుమతిలను బాగా చేరువ చేసింది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ, వస్తూ ఉన్నారు.

ఇంటర్ పూర్తికాగానే ఇద్దరూ బి.కాంలో చేరారు. విశాఖపట్టణం వెళ్ళి విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని ఉన్న సంగీతానికి దూరమవుతామన్న కారణంతో ఊళ్ళోనే ఉన్న డిగ్రీ కాలేజీలో చేరారిద్దరూ.

వంశీ అకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహించిన లైట్ మ్యూజిక్ ఆడిషన్ టెస్టులో పాసై రెండు సార్లు ఆకాశవాణిలో లలిత గీతాలు పాడాడు. గాయకుడిగా ఎదిగిన వంశీకి కాలేజీలో కూడా అభిమానులున్నారు.

శివపురంలోని రామ్మూర్తి మాష్టారు వచన కవితలు, లలిత గీతాలు రాయడంలో ప్రసిద్ధులు. ప్రఖ్యాతి చెందిన కవుల లలిత గీతాలతో పాటు రామ్మూర్తి మాష్టారి లలిత గీతాలను కూడా వంశీ ఆకాశవాణిలో పాడాడు.

డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న వంశీ, మధుమతిలను ఓ రోజు ప్రిన్సిపాల్ తన గదికి పిలిచాడు.

“వచ్చే నెలలో మహారాష్ట్రలోని అమరావతి విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయిలో ఎన్.ఎస్.ఎస్. క్యాంపు జరగబోతోంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం తరపున పాల్గోనే బృందంలో మీ ఇద్దరూ ఎంపికయ్యారు. ఇది మన కాలేజీకి సువర్ణ అవకాశం. సాంస్కృతిక కార్యక్రమాల్లో వంశీ గాయకుడిగా, మధుమతి వీణా వాయిద్యకారిణిగా పోటీ చేస్తే విజయం సాధిచవచ్చని నా భావన. మీ సంగీత సాధనకు కావల్సినంత సమయం తీసుకోండి. ఈ విషయంలో మీకు ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసరు సంజీవరావు పూర్తి సహకారాన్నందిస్తారు. మీ అభిప్రాయం చెప్పండి” అన్నారు ప్రిన్శిపార్.

“యూనివర్శిటీ తరపున పాల్గొనే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు సార్. నేను మీరు చెప్పినట్లుగా గాయకుడిగా పోటీలో పాల్గొంటాను. మీ అందరి సహకారం, మా సంగీతం మాష్టారి సహకారంతో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది సార్” అన్నాడు వంశీ.

“నాకు ఎన్.ఎస్.ఎస్. క్యాంపులో పాల్గొనాలనే ఉంది. కానీ మా ఇంట్లో అంత దూరం నన్ను పంపించరేమో అన్న అనుమానం ఉంది సార్” అంది మధుమతి.

“మీ పేరెంట్స్‌తో సంజీవరావు మాష్టారు మాట్లాడుతారు. నువ్వు నీ సంగీతం గురించి ఆలోచించు” అన్నారు ప్రిన్సిపాల్.

ఆ రోజు సాయంత్రమే లెక్చరర్ సంజీవరావు మధుమతి ఇంటికి వచ్చి ఆమె తల్లి తండ్రులతో మాట్లాడి మధుమతిని మహారాష్ట్ర పంపడానికి ఒప్పించారు.

మధుమతి సుబ్రహ్మణ్యం శాస్త్రిగారి సూచనల మేరకు నాలుగు కీర్తనలు రెండు దేశ భక్తి గీతాలు వీణ పై బాగా ప్రాక్టీసు చేసింది.

వంశీ రామూర్తి మాష్టారు రాసిన ఒక భావ గీతాన్ని శాస్త్రిగారి దగ్గరకు తీసుకు వచ్చి రెండింటికీ శాస్త్రిగారి చేత ట్యూన్ కట్టించి గట్టిగా ప్రాక్టీసు చేసాడు.

అనుకున్న సమయం రానే వచ్చింది.

అమరావతి విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ ఎన్.ఎస్.ఎస్ శిబిరానికి 22 విశ్వవిద్యాలయాల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థినీ, విద్యార్థులు వచ్చారు. వారం రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా సాగింది శిబిరం. పగలు సేవా కార్యక్రమాలు, ప్రొఫెసర్ల, సామాజిక సేవాకార్యకర్తల ఉపన్యాసాలుంటే సాయం సమయాలలో సాంస్కృతిక కార్యక్రమాలుండేవి.

సంగీత వాయిద్య పోటీల విభాగంలో మధుమతి వీణపై రెండు అన్నమాచార్య కీర్తనలు వాయించింది. ఆ కీర్తనల గురించి హిందీ, ఇంగ్లీషులలో సంజీవరావు ప్రేక్షకులకు వివరించారు.

గాత్ర సంగీత పోటీ విభాగంలో వంశీ గురజాడ అప్పారావు గేయం ‘దేశమను ప్రేమించుమన్నా’, రామ్మూర్తి మాష్టారి లలిత గీతం “నీలాల సుందరిలా, నవరసమయి మంజరిలా కదలిరావేనా చేలీ కమనయా నెచ్చెలీ, ప్రియతమా.. ప్రియతమా.. మరిచిపోకుమా” పాడాడు. ఈ రెండు గీతాల భావాన్ని సంజీవరావు హిందీ, ఇంగ్లీషులలో సభికులకు వివరించారు.

వంశీ పాడిన  రెండు గీతాలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. గీతాలు పాడటం పూర్తి కాగానే రెండు నిముషాల పాటు విద్యార్థినీ విద్యార్థుల చప్పట్లుతో ఆడిటోరియం మారు మ్రోగింది.

శిబిరం ముగింపు రోజున జరిగిన సభలో వివిధ విభాగాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ బహుమతిలందజేసారు.

సంగీత వాయిద్య విభాగంలో మధుమతి, గాత్ర సంగీత వీభాగంలో వంశీ ప్రథమ బహుమతులందుకున్నారు.

శివపురం వచ్చాకా వంశీ, మధమతిలను కళాశాల తరపున ఘనంగా సత్కరించారు ప్రిన్సిపాల్. వంశీ తల్లి తండ్రులు, మధుమతి తల్లి తండ్రులు కూడా ఆ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

ఈ ఫంక్షన్ జరిగిన నెల రోజులకు వంశీ తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. బిజినెస్ పార్టనర్స్ కుమ్మక్కై వ్యాపారంలో మోసం చేయడం వలన విపరీతమైన నష్టం వచ్చింది. మానేజింగ్ పార్టనర్ వంశీ తండ్రే కావడం వలన, బ్యాంకు లోన్లకు ఆయన షూరిటీ ఉండడం వలన ఆస్తులన్నీ అమ్మి బ్యాంకు లోన్లు కట్టవలసి వచ్చింది.

మధుమతి తండ్రి కూడా ఈ విషయంలో తానేమీ చేయలేనని ఖరాఖండీగా చెప్పేసాడు వంశీ తండ్రికి.

మరో నెల రోజుల తర్వాత మరో సారి హార్ట్ ఎటాక్ వచ్చి వంశీ తండ్రి చనిపోయారు. ఆయన కర్మకాండలు పూర్తయిన రెండు రోజులకే వంశీ తల్లి కూడా చనిపోయింది. తల్లి మరణంతో పూర్తిగా కుదేలైపోయాడు వంశీ. ఆస్తులున్నప్పుడు చేరిన బంధువులు వంశీకి మొహం చూపించడం మానేసారు.

వంశీ ఒక్కడే కొడుకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. వంశీ తాతగారికి కూడా వంశీ తండ్రి ఒక్కడే కొడుకు. ఆ విధంగా తండ్రి తరపు బంధువులెవరూ లేరు. తల్లి తరపు బంధువులు తమ మీద ఎక్కడ బాధ్యత పడుతుందోనని తప్పించుకు తిరిగారు.

రామ్మూర్తి మాష్టారే ఈ కష్టకాలంలో వంశీకి అండగా నిలిచారు.

డిగ్రీ పరీక్షలు రాయలేనని డీలా పడిపోయిన వంశీకి రామ్ముర్తి మాష్టారు ధైర్యం చెప్పారు.

“చూడు వంశీ. మనిషి జీవితం విచిత్రమైనది. మనకి ఎప్పుడూ సుఖాలే ఉండవు. కష్టాలూ ఎదురవుతాయి. ఆనంద విషాదాల సమ్మళితమే మానవ జీవితం. అమావాస్య చీకటి తర్వాత పౌర్ణమి వెలుగులూ  ప్రసరిస్తాయి. మనిషి మనుగడకు ఆహారం ఎంత ప్రధానమో ఆత్మవిశ్వాసం కూడా అంత కంటే ఎక్కవ అవసరం. కష్టాలను దాటుకుని ముందుకు ధైర్యంగా ప్రయాణించడమే మనిషి కర్తవ్యం. ఎవరూ లేరన్న ఒంటరి భావాన్ని మనసులోంచి తుడిచేసేయ్. నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను. మా ఇంటికి వచ్చేయ్. మా పిల్లలతో పాటే ఉందువు గానీ”  వంశీ భుజం మీద  చెయ్యి వేసి అనునయంగా చెప్పారు రామ్ముర్తి మాష్టారు.

ఆయన చెయ్యి భుజం మీద పడగానే వంశీ కన్నులు శ్రావణ మేఘాలై వర్షించాయి. వంశీనీ ఓదార్చి, తన ఇంటికి తీసుకు వచ్చారు రామ్మూర్తి మాష్టారు.

రోజూ పగలంతా మాష్టారింట్లోనే ఉండేవాడు వంశీ. రాత్రి పడుకోవడానికి తన ఇంటికి వెళ్ళేవాడు. మాష్టారి రెండువ అబ్బాయి గోపాల్ వంశీకి తోడు పడుకునేవాడు.

మాష్టారి కుటుంబ సభ్యులు ఆదరణతో తన బాధ నుంచి కొంత వరకూ తేరుకున్నాడు వంశీ. ఆ బాధలోనే డిగ్రీ పరీక్షలు రాసాడు.

మధుమతి వంశీ ఇంటికి వెళ్ళి అతన్ని చూసొస్తానంటే ఆమె తల్లి తండ్రులు వద్దని కట్టడి చేసారు

నెల రోజులు గడిచేసరికి మధుమతి తండ్రి విజయవాడ ట్రాన్స్‌ఫర్ చేయించుకుని కుటుంబంతో సహా వెళ్ళిపోయారు. అప్పటికి మధుమతి పరీక్షలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ మధుమతి శివపురం రాలేదు.

దూరపు బంధువైన శ్రీకర్‌తో మధుమతికి పెళ్ళి చేసారు ఆమె తల్లి తండ్రులు. అత్తింటి వారికి సంగీతమంటే అంత మక్కువ లేదు శ్రీకర్‌తో సహా. నిరంతరం వ్యాపారం, డబ్బు సంపాదించడం, ఆడంబరంగా జీవించడం. ఈ మూడే శ్రీకర్ లక్షణాలు. ఫలితంగా మధుమతి వీణ అటకెక్కింది. ఆమె జీవం లేని యంత్రంలా బ్రతుకుతోంది.

పన్నెండు సంవత్సరాల తర్వాత ఇన్నాళ్ళకు వారణాసిలో వంశీ పాడిన పాట ఆమెని కదిలించింది.

వంశీ ఇప్పుడు ఎక్కడ ఉన్నడు? ఎలా ఉన్నాడు? అన్న ఆలోచనలు ఆమెని నిద్రకు దూరం చేసాయి.

తల్లీ, తండ్రీనీ పోగొట్టుకుని కొడంత దిగుల్ని మోస్తున్న స్నేహితుడ్ని కలిసి ఒక్క ఓదార్పు మాట చెప్పనేకపోయానన్న భావన ఆమలో మరోసారి కదిలి ఆమె హృదయంలో భారంగా మూలిగింది.

‘నిజంగా తను వంశీ విషయంలో తప్పు చేసానా’ అని ఆత్మవిమర్శ చేసుకోసాగింది మధుమతి.

‘వంశీ కేవలం తన స్నేహితుడేనా? అంతకంటే ఏమీ కాడా?’ హృదయాంతరాళల్లోంచి బయటకు వచ్చిన ఆ ప్రశ్నలకు ఆమె సమాధానం వెతుక్కోవాల్సి వచ్చింది.

***

వారణాసి నుండి హైద్రాబాదు వచ్చినా మధుమతిని ఆ జ్ఞాపకాలు వదల లేదు. ఒక రోజు తన స్నేహితురాలు త్రిపురకు ఫోన్ చేసి వారణాసి వెళ్ళడం, గంగా నదిలో పడవలో వెళ్తూ ఒకతను వంశీ పాడిన పాట పాడాడని చెప్పింది.

“ఆ మధూ! నువ్వు వంశీ గురించి చెప్తుంటే ఓ విషయం గుర్తుకు వచ్చింది. మా బంధువు ఒకాయన బెనారస్ యూనివర్శిటీలో పని చేస్తున్నారు. ఆయన చెప్పారు ఒక తెలుగాయన కర్ణాటక, హిందుస్థానీ సంగీతం నేర్పుతున్నారని. కానీ ఆయనతో పాటు ఆయన తల్లి తండ్రులు కూడా ఉంటున్నారని చెప్పారు. వంశీ తల్లి తండ్రులు చనిపోయారు కదా. అందుకనే నేను ఈ విషయం నీకు చెప్పలేదు.”

“ఆయన పేరు నీకు గుర్తుందా?”

“కృష్ణ అని చెప్పారు. గత సంవత్సరమే ‘కృష్ణం వందే జగద్గురుం’ అని ఒక ఆల్బం కూడా రిలీజ్ చేసారట. దానికి విదేశాలలో కూడా మంచి పేరు వచ్చిందిట.”

“సరేలే, నేను నీతో తర్వాత మాట్లాడుతాను” అని ఫోన్ కట్ చేసింది మధుమతి.

శివపురంలోనే ఉంటున్న శకుంతల గుర్తకు వచ్చింది. పూజారిగారమ్మాయి శకుంతల వాళ్ళ బావని పెళ్ళి చేసుకుని శివపురంలోనే ఉంటోంది. శకుంతల భర్త సదాశివం సాయిబాబా గుడిలో పూజారిగా ఉంటున్నాడు.

పాత డైరీలో నోట్ చేసుకున్న శకుంతల ఫోన్ నెంబరు చూసి ఆమెకు ఫోన్ చేసింది మధుమతి.

పన్నెండు సంవత్సరాల తర్వాత తనని గుర్తుపెట్టుకుని మధుమతి ఫోన్ చేసినందుకు ఆనందపడింది శకుంతల.

కుశల ప్రశ్నలయ్యాక  “వంశీ ఎక్కడుంటున్నాడని?” అడిగింది శకుంతలని.

డిగ్రీ పూర్తయ్యాకా వంశీ శివపురం వదిలి వెళ్ళిపోయాడని చెప్పింది శకుంతల.

ఆమె సమాధానం విని మధుమతి చాలా నిరాశకులోనయ్యింది. శకుతలకి ‘థాంక్స్’ చెప్పి ఫోన్ కట్ చేసింది.

వంశీ పేరుకి ఒకవేళ కృష్ణ కూడా ఉందేమో? ఉంటే ఉండవచ్చు. కానీ  ఈ తల్లి తండ్రులున్న కృష్ణ ఎవరు? వంశీ పాడిన ఆ పాట వారణాసిలో ప్రతిధ్వనిస్తోందంటే వంశీ ఆయినా అక్కడుండాలి. లేదా రామ్మూర్తి మాష్టారయినా ఉండాలి. ఈ రహస్యం తెలియాలంటే తను మరోసారి వారణాసి వెళ్ళాలి. వంశీ గురించి వీధీ వీదీ తిరగాలి. అంతే!!

మధుమతి త్రిపురకు ఫోన్ చేసి పావు గంట సేపు మాట్లాడింది.

***

 మూడు రోజులు గడిచాక  ఉదయాన్నే మధుమతి ఇంటికి వచ్చింది త్రిపుర.

తన స్నేహితురాల్ని భర్తకు పరిచయం చేసింది మధుమతి.

“నమస్కారమండీ. మధు చెప్పింది. పది రోజులు క్రితం మీరు వారణాసి, అలహాబాద్ వెళ్ళి వచ్చారని. మీరు దగ్గరుండి అన్నీ బాగా చూపించారని. మావారు బ్యాంక్ ఆఫీసరు. ట్రైనింగ్‌కని ముంబయ్ వెళ్ళారు. నెల రోజులకు గానీ తిరిగిరారు. కాశీ విశ్వేశ్వరుడ్ని దర్శించుకోవాలని చాలా కోరికగా ఉంది. మీరు పెద్ద మనసు చేసుకుని మధుమతిని నాతో పంపితే విమానంలో వారణాసి వెళ్ళి స్వామి వారిని దర్శించుకొని వస్తా. ప్లీజ్, అన్నయ్యగారూ” అంది త్రిపుర శ్రీకర్‌తో.

తనని చాలా గొప్పవాడిగా ఊహించి మాట్లాడిన త్రిపుర మాటల్ని కాదనలేకపోయాడు శ్రీకర్. మధుమతి నడిగాడు మీ స్నేహితురాలికి తోడుగా వెళ్తావా అని.

“మీరు వెళ్ళమంటే వెళ్తాను” అంది మధుమతి శాంతంగా. ఆమె మాటలకు మరింతగా పొంగిపోయాడు శ్రీకర్.

‘సరేనమ్మా’ జాగ్రత్తగా వెళ్ళి రండి అని బయటకు వెళ్ళాడు శ్రీకర్. పిల్లల బాధ్యతని అత్తగారి కప్పచెప్పింది మధుమతి.

మర్నాడు విమానంలో బయల్దేరి వారణాసి వెళ్ళారు త్రిపుర, మధుమతి. సాయంత్రం విశ్వేశ్వరుడ్ని, అన్నపుర్ణాదేవిని, కాలభైరవడ్ని దర్శించుకున్నారు.

“స్వామీ! వంశీ ఆచూకీ నాకు తెలిసేటట్లు చెయ్యి. అతనికి నా క్షమాపణలు చెప్పుకునే అవకాశాన్ని కలిగించు” అని విశ్వనాథుడ్ని వేడుకుంది మధమతి.

బెనారస్ యూనివర్సిటీలో పని చేస్తున్న త్రిపుర బంధువు ఢిల్లీలో కాన్ఫరెన్స్‌కు వెళ్ళారు. రాత్రిగానీ ఫోన్‌కి దొరకలేదు.

“బావగారూ నేను త్రిపురని. హైద్రాబాద్ నుంచి వచ్చాను. సంగీతం నేర్పే తెలుగాయన కృష్ణ వారణాసిలో ఉన్నారన్నారుగా, ఆయన అడ్రస్ చెపుతారా?” అడిగింది త్రిపుర.

“కేదారేశ్వర్ స్వామి దేవాలయం ముందుకు వెళ్ళి కుడి ప్రక్కకు తిరిగితే చింతామణి గణపతి ఆలయానికి వెళ్ళే వీధి వస్తుంది. నాలుగైదు ఇళ్ళు దాటాకా ఎడమ వైపున్న మేడ మీద ఉంటారు కృష్ణగారు. మేడ మీద ‘వాణీ సంగీత నిలయం’ అన్న బోర్డు హిందీ, ఇంగ్లీషులలో రాసి ఉంటుంది నేను ఎల్లుండి వస్తాను. మిమ్మల్ని కలుస్తాను” అన్నారాయన.

“థాంక్స్ బావగారు” అని ఫోన్ కట్ చేసింది త్రిపుర. ఆయన చెప్పిన అడ్రుసు ఓ కాగితం మీద రాసుకుంది త్రిపుర.

మర్నాడు ఉదయం గంగానదిలో స్నానం చేసి ఆంధ్రాశ్రమంలోని రూమ్ కొచ్చారు మధుమతి, త్రిపుర. బట్టలు మార్చుకుని బయట కొచ్చి కాఫీ త్రాగి కేదారేశ్వరస్వామి గుడి కొచ్చారిద్దరూ.

వంశీ తప్పకుండా కనిపించాలని స్వామిని వేడుకున్నారిద్దరూ. దేవాలయం బయటకొచ్చి కొద్ది దూరం  వెళ్ళగానే కుడి ప్రక్క సందులోకి తిరిగి నెమ్మదిగా నడవసాగారు ఇద్దరూ. ఐదవ ఇల్లు దాటగానే ఒక పాత మేడ కనిపించింది. త్రిపుర బావగారు చెప్పినట్లుగా ‘వాణీ సంగీత నిలయం’ బోర్డు కూడా కనిపించింది.

అదురుతున్న గుండెలతో మెట్లెక్కి పైకి వెళ్ళారిద్దరూ. హాలులోకి వెళ్ళగానే కళ్ళు మూసుకుని తదేక ధ్యానంతో త్యాగరాజ కీర్తన పాడుతున్న వ్యక్తి కనిపించారు. ఆయన కెదురుగా పది మంది పిల్లలు తాళం వేస్తూ గురువుగారు చెప్పిన కీర్తనను పాడుతున్నారు. తెల్లటి లుంగీ, పైన లాల్చీ నుదిటిన విభూతి రేకలు, మధ్యలో కుంకుమ బొట్టు, నల్లని గెడ్డంతో ఉన్నారు గురువు గారు. చాలా గంభీరంగా ఉంది ఆయన గొంతు.

కీర్తన పాడటం పూర్తయ్యాకా కళ్ళు తెరిచారు గురువుగారు.

ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడి ఉన్న యువతులిద్దర్నీ చూసి లోపలకు రమ్మన్నట్టు సైగ చేసారు. పిల్లల సంగీత సాధన పూర్తవడంతో వారిని వెళ్ళమని చెప్పారు. పిల్లలు పుస్తకాలు బ్యాగుల్లో పెట్టుకుని ఒక్కక్కరే శబ్దం చేయకుండా వెళ్ళిపోయారు.

 “ఏం పని మీద వచ్చారు?” హిందీలో అడిగారాయన.

“కృష్ణగారి కోసం వచ్చాము” అంది త్రిపుర తెలుగులో.

ఆయన ఆశ్చర్యంగా ఆమెకేసి చూసారు.

ఆయన కేసి గుచ్చి చూస్తున్న మధుమతి ఒక్కసారి ‘వంశీ’ అని బిగ్గరగా పిలిచి పడిపోయింది.

త్రిపుర ఆమెని పట్టుకుని ‘మధూ.. మధూ..’ అంటూ పిలవసాగింది. ఆయన లోపలకు వెళ్ళి మంచి నీళ్ళు గ్లాసు తెచ్చి త్రిపుర కిచ్చారు. కొద్దిగా నీళ్ళు మధుమతి మొహం మీద జల్లింది త్రిపుర. మధుమతి కళ్ళు తెరచి చూసింది.

త్రిపుర యిచ్చిన గ్లాసులోని మంచి నీళ్ళు త్రాగింది మధుమతి. కొద్దిగా తేరుకుంది.

“ఎందుకు వంశీ ఇంత దూరం వచ్చేసావ్? ఎవరికీ కనిపించకూడదనుకున్నావా? మీ అమ్మగారూ, నాన్నగారూ పోయినప్పుడు నిన్ను పలకరించాలని ఎంతో ప్రయత్నించాను. కానీ కుటుంబ బంధాలు నన్ను గుమ్మం దాటనీయలేదు. మనం ఆమరావతి విశ్వవిద్యాలయం పోటీలకు వెళ్ళినప్పుడు గోదావరి నదిని చూడటానికి వెళ్ళాం. నది ఒడ్డున నిలబడి ప్రమాదవశాత్తూ నేను నీటిలో పడిపోతే ప్రాణాలకు తెగించి నదిలో దూకి నన్ను కాపాడావు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని లెక్చరర్ సంజీవరావు గారిని మనిద్దరం రిక్వెస్టు చేసాం. ఆయన ప్రిన్సిపాల్ గారికి కూడా ఈ విషయం చెప్పలేదు. నా ప్రాణాల్ని కాపాడిన నువ్వు తల్లీనీ, తండ్రినీ కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే రాలేకపోయాను. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే శాపమా? ఆమెకి స్వేచ్ఛ ఉండదా? తల్లితండ్రుల ఆంక్షలకు బలవ్వవలసిందేనా?” ఆవేశంగా ప్రశ్నించింది మధుమతి.

“మధూ శాంతించు. అవేశ పడకు” అంది త్రిపుర ఆమెని అనునయుస్తూ.

“ఆవేశం కాదు త్రిపురా. ఇది నా ఆవేదన. అప్పుడు మా తల్లి తండ్రులు నన్ను బయటకు వెళ్ళనీయకుండా నిర్భంధించినపుడు ఎంతో మానసిక వ్యథ అనుభవించాను” అంది మధుమతి భారంగా.

“మధూ! అప్పుడు నువ్వు రాలేదని నిన్ను నేను అపార్థం చేసుకోలేదు. నీకు ఏదో అవాంతరం వచ్చి ఉంటుందని భావించాను. అది ఒక దురదృష్టకరమైన సమయం. నాన్నగారి వలన ఎన్నో ఉపకారాలు పొందినవారు కూడా మొహం చాటేసారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న నన్ను ఆక్కున చేర్చుకుని ఆదరించిన వారు రామ్మూర్తి మాష్టారు, రాజ్యలక్షిగారు. నాకు పునర్జమ్మ నిచ్చిన మహనీయులు వారిరువురూ. వారి ఋణం నేను జన్మ జన్మలకూ తీర్చుకోలేను. అమ్మగారూ, నాన్నగారూ ఒక్కసారిలా వస్తారా?” చాలా వినమ్రంగా పిలిచాడు వంశీకృష్ణ.

లోపల్నుంచి వచ్చిన రామ్మూర్తి మాష్టార్ని, రాజ్యలక్ష్మి గారిని చూసి ఆశ్చర్యపోయింది మధుమతి. వాళ్ళిద్దరూ కూడా మధుమతిని చూసి ఒకింత నిర్ఘాంతపోయారు.

“నమస్కారం మాష్టారూ” అంది మధుమతి.

“ఆ.. ఎలా ఉన్నావు మధుమతి” అన్నారు రామ్మూర్తి మాష్టారు.

“బాగానే ఉన్నాను సార్. మీరు ఇక్కడ..”

“మేం.. వంశీతోనే ఉంటున్నాం..” అన్నారు చిన్నగా నవ్వుతూ మాష్టారు.

“అవును మధూ, నా డిగ్రీ పూర్తవగానే శివపురంలో మా ఇల్లు అమ్మేసి కొన్నాళ్ళు ముంబయ్‌లో ఉండి హిందూస్థానీ సంగీతం నేర్చుకున్నాను. చాలా చోట్ల తిరిగాను మనశ్శాంతి కోసం. చివరకు ఇక్కడకు వచ్చాను. పవిత్రమైన గంగానది మా అమ్మలా కనిపించింది. ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. సంగీతం క్లాసులు చెప్పడం ప్రారంభించాను. చీకటిలోంచి వెలుగులోకి పయనిస్తున్న అనుభుతి కలిగింది. నా మనసుకి సాంత్వన లభించింది. కొంత కాలం గడిచాక నాన్నగారిని, అమ్మగారిని తీసుకు వచ్చాను. అన్నయ్యలను చూడాలనిపించినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మళ్ళీ నా దగ్గరకు వస్తారు. ఇది నా అదృష్ణం” ఆనందంగా చెప్పాడు వంశీకృష్ణ.

“మధూ వీణకచేరీలు చేస్తున్నావా”? అడిగారు రామ్మూర్తి మాష్టారు.

“లేదండి మాష్టారూ. పన్నెండేళ్ళయ్యింది వీణ పట్టుకుని” విచారంగా అంది మధుమతి.

“ఏ విద్య అయినా నిరతరం గలగలా పారే సెలయేరులా ఉంటే పదిమందికీ ఉపయోగపడుతుంది. అలా కాకుండా స్తబ్దుగా ఉంటే చెరువులా ఉంటే నీళ్ళు పాడైపోయి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతుంది. గురువులు ఎంతో శ్రమపడి మనకు నేర్పిన కళను భావితరాలకు అందించాల్సి భద్యత మనపై ఉందని నేను నమ్ముతాను. ఆ దిశగా నువ్వూ పయనిస్తే సంగీత రంగంలో మంచి వైణిక విద్యాంసులకు కొదవుండదనుకుంటున్నాను. అది సరే, వంశీ ఇక్కడ ఉన్నాడని మీకెలా తెలిసింది?” ఆసక్తిగా అడిగారు రామ్మూర్తి మాష్టారు.

పది రోజులు క్రితం తాను వారణాసి వచ్చినప్పుడు పడవలో వెళ్తూ ఓ యువకుడు వంశీ పాడిన పాట పాడడం, అది విని హైద్రాబాద్ వెళ్ళాకా త్రిపురకు చెప్పడం, ఆమె ఇక్కడి బంధువు ద్వారా తెలుగు పాటలు నేర్పుతున్న సంగీతం మాష్టారు వారణాసిలో ఉన్నారని చెప్పడం వెంటనే బయల్దేరి ఇక్కడకు రావడం అన్నీ వివరంగా మాష్టారికి చెప్పింది మధుమతి.

మాష్టారి బలవంతం మీద మధుమతి, త్రిపుర వాళ్ళింట్లోనే భోజనాలు చేసారు. రాజ్యలక్ష్మగారు వాళ్ళిద్దరికీ చీరలు పెట్టారు.

మర్నాడు విమానంలో బయల్దేది హైద్రాబాదు వచ్చారు మధుమతి, త్రిపుర.

“చాలా థాంక్స్ త్రిపురా! నీ వలన నా స్నేహితుడి జాడ తెలుసుకున్నాను. ఎన్నాళ్ళనుండో నా మనసులో గూడు కట్టుకుని ఉన్న ఆవేదన తీరింది వంశీతో మాట్లాడుటం వలన” అంది మధుమతి. చిన్నగా నవ్వింది త్రిపుర.

రామ్ముర్తి మాష్టారి మాటలు మధుమతిని ప్రభావితం చేసాయి. స్టోర్‌రూంలో ఉన్న వీణని శుభ్రం చేసి హాలులో పెట్టింది. ఆ మర్నాడే ‘ఇచ్చట వీణ నేర్పబడును’ అన్నబోర్డు స్వయంగా ఇంటి గేటుకి కట్టింది మధుమతి.

ఆమె చర్యకు విస్తుబోయి చూస్తూండిపోయారు మధుమతి భర్త, అత్తగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here