తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి.
~
ఈ భాగంలో మనం వివిధ ‘పురుష’లలో వ్రాయటంలో ఉండే ప్రయోజనాలను, అలాగే ఇబ్బందులను గురించి కూడా తెలుసుకుందాము.
ఉత్తమ పురుష:
ముందుగానే చెప్పుకున్నట్టుగా, ఉత్తమ పురుష కథనం ‘నేను’, ‘నాకు’ అంటూ సాగుతుంది. ప్రధాన పాత్ర తానే కథకుడిగా/కథకురాలిగా మారి కథను చెబుతారు.
ఈ రకమైన కథనంలో ఒక రకమైన స్వేచ్ఛ, సులభంగా వ్రాయగలిగే నేర్పు ఉంటాయి. కథను పాత్రయే చెప్పటం వలన, పాత్ర పరంగా చెప్పవలసిన విషయాలన్నీ బాగా చెప్పగలుగుతాడు రచయిత. ప్రధాన పాత్ర తనను తాను ప్రెజంట్ చేసుకోవటంలోను, తన భావాలను, చర్యలను సమర్థవంతంగా చెప్పి, ఒప్పించటంలోనూ కృతకృత్యుడౌతాడు.
అయితే ఈ కథన విధానంలో ఒక ఇబ్బంది ఉంటుంది. కథనమంతా ఒకే పాత్ర వైపునుంచి కొనసాగుతుంది. మిగిలిన పాత్రల మనోభావాలు లేదా పరిస్థితులు ఆయా పాత్రలు సంభాషిస్తే తప్ప పాఠకులకు అర్థం కావు. ఈ పురుషలో కథను రచించినపుడు ప్రతీ సారీ ‘నేను’ అని మాత్రమే రావాలి. ‘తను’, ‘తాను’ అనే ప్రయోగాలు ఈ కథనానికి పనికిరావు.
మధ్యమ పురుష:
ఈ విధానం ముందుగానే చెప్పినట్టుగా లేఖాసాహిత్యంలో ఎక్కువగా కనిపిస్తుంది. ‘నువ్వు’ లేదా ‘నీవు’ అనేదే ఇందులో ప్రధాన పాత్ర. ఇతర పాత్రల ప్రాధాన్యత ఈ కథన విధానంలో చాలా తక్కువగా ఉంటుంది.
ప్రథమ పురుష:
రకరకాల పాత్రలు కథను నడిపిస్తాయి. అన్ని పాత్రల పరంగానూ కథను నడిపించవచ్చు. రచయితకు కథాస్థలానికి లేదా సందర్భానికి ఎటువంటి పరిమితులు ఉండవు. ఎక్కువ కథలు ఈ పురుషలోనే వ్రాస్తారు. పాఠకులకు బాగా అర్థమయే కథలు కూడా ఇవే. ఎటువంటి తికమక లేకుండా, చదివే పాఠకుడికి ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈ కథనంలో రాకూడని పదం ‘నేను’. ఏ పాత్రైనా డైరెక్ట్ స్పీచ్‌లో అంటే డైలాగ్ రూపంలో మాత్రమే రావాలి. మిగిలిన చోట ఆ పాత్ర స్వగతం కానీ అతని/ఆమె గురించి వచ్చినప్పుడు మాత్రం తాను/తను/తన అని మాత్రమే రావాలి.
రచయితలందరూ తప్పకుండా ఈ విషయాలు గుర్తు పెట్టుకొని, కథారచన చేస్తే ఆ కథలు చదవటానికి ఎంతో ఇంపుగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు.
*
















