సరిగ్గా వ్రాద్దామా?-3

0
6

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

‘తప్పుల లిఖించబోకుము
తప్పుల సవరణ కొరకును తగు కృషి చేయన్
తప్పక నిశ్చయ దృష్టిని
తప్పటడుగులను విడుమిదె తడబడ వలదే!’
*

[dropcap]అం[/dropcap]దరికీ నమస్తే. ఈరోజు మనం, మన వ్రాతలలో సాధారణంగా దొర్లే తప్పుల గురించి చర్చించుకుందాము. ఇదివరకే మనం చెప్పుకున్నట్టుగా అక్షరాలలో హ్రస్వాలు, దీర్ఘాలు ఉంటాయి కదా. మనం వ్రాసేటప్పుడు హ్రస్వాలకు దీర్ఘాలు, దీర్ఘాలకు హ్రస్వాలు వ్రాస్తూ ఉంటారు చాలామంది. ఇది తెలియక కావచ్చు, టైప్ తప్పులు కావచ్చు. ఏది ఏమైనా పోస్ట్ చేయబోయే ముందు చదివి సరిచేసుకోవలసిన బాధ్యత మాత్రం వ్రాసినవారిదే…

ఉదాహరణకు, ఈ వాక్యం చూడండి,

‘పాలకా పైన పప అక్షరలు దిద్దుతునది.’

బాగుందా? అసలు అర్థం అవుతుందా? ఉహు… అసలైన వాక్యం ఇలా ఉండాలి.

‘పలక పైన పాప అక్షరాలు దిద్దుతున్నది.’

అవును కదా… కానీ, చాలామంది మొదటి వాక్యంలాగానే టైప్ చేసి, అలాగే పోస్ట్ చేసేస్తూ ఉంటారు. మళ్ళీ చూసుకోరు. పొట్టి అక్షరాలకు బదులుగా, పొడుగు అక్షరాలు, పొడుగు అక్షరాలకు బదులుగా పొట్టి అక్షరాలు వ్రాసేస్తూ ఉంటారు…

సరిచేయబోతే ఇలా అంటారు, ‘ఇది మా తప్పు కాదండీ, టైపు మిస్టేక్…’ అని. మన మొబైల్ లేదా సిస్టమ్ అనేవి కేవలం యంత్రాలు. వాటికి అది తప్పని తెలియదు. వాటికి తెలుగు రాదు. కానీ మనకు వచ్చు కదా… అంచేత మనమే సరిచేసుకోవాలి. మనం మళ్ళీ మరోసారి లేదా రెండు సార్లు మన వాక్యం చదువుకుంటే అర్థమౌతుంది, తప్పు ఎక్కడ చేసామో, ఎలా ఎడిట్ చేసుకోవాలో…

కానీ ఉహు, చెప్పినా కోపం తెచ్చుకుంటారు. ఆ మధ్య ఒక గ్రూప్‌లో ఒకావిడ అన్నారు, ‘చూడండి, నేను తెలుగులో టైపు చేయటమే కనా కష్టం, నా మొబైల్‌లో తెలుగు టైపు ఇలాగే వస్తుంది. ఇది చేయటానికే నాకు రెండు గంటలు పట్టింది… అలాంటిది మీరు నా టైపులో తప్పులు వెదికితే ఎలా?’ అని. అలాంటి వారికి మనం ఏమి చెప్పగలం చెప్పండి? మన మాతృభాషపై గౌరవమంటూ ఉంటే, ఎవరమైనా తప్పులు వ్రాయకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు వహిస్తాము.

ఇంకోరకమైన తప్పులు – అవసరమైన చోట ప్రాణాక్షరాలు ఉపయోగించకపోవటం.

ఈ వాక్యం చూడండి, ‘రాజకుమారుడు తన కడ్గంతో రాక్షసుడిని పొడిచాడు.’ సరిచేయండి… అవును మీరు కరెక్టే… వాక్యం ఇలా ఉండాలి…

‘రాజకుమారుడు తన ఖడ్గంతో రాక్షసుడిని పొడిచాడు.’

‘ఖ’ అనేది ప్రాణాక్షరం కదండీ? అది ఉపయోగించవలసిన చోటల్లా మామూలు అక్షరమే ఉపయోగిస్తూ ఉంటారు. ఎంత తప్పు అది? ‘ఖ’ ఉపయోగిస్తేనే కదా అది ఖడ్గమయ్యేది, మనకి అర్థమయ్యేది? ఇలా చాలా ఉన్నాయి. ఉదాహరణకి, ‘గనమైనది (ఘనమైనది), చందస్సు (ఛందస్సు), చత్రపతి (ఛత్రపతి), జరి (ఝరి), జాన్సీ (ఝాన్సీ), బారము (భారము), బావము (భావము), లాటీ (లాఠీ), కంటము (కంఠము), డంకా (ఢంకా), గాడంగా (గాఢంగా), గూడచారి (గూఢచారి), కత (కథ), కపము (కఫము), పలము (ఫలము), బరిణి (భరణి)’ మొదలైనవి. ఇక ‘ణ’ బదులుగా ‘న’, ‘స’ బదులుగా ‘శ’, అలాగే ‘శ’ బదులుగా ‘స’ ఎన్నో చోట్ల, ఎన్నెన్నో వాక్యాలలో వ్రాసేస్తున్నాము. ‘అలా వ్రాయకూడదు’ అని చెబితే నన్ను చాలా మంది ఒక చాదస్తురాలిగా చూసారు కానీ ‘అయ్యో, సరియైన పదము వ్రాయలేకపోతున్నాము, నేర్చుకుని, చూసుకుని, తెలుసుకుని వ్రాద్దామ’ని చాలా కొద్దిమంది మాత్రమే అనుకుంటున్నారు. అయితే ‘సంచిక’లో ఈ వ్యాసం చదువుతున్న పాఠకులంతా ఇవన్నీ నేర్చుకుని, సరిచేసుకుంటారన్న నమ్మకంతో మీకు చెప్పగలుగుతున్నానన్నమాట.

‘ణ’కు బదులుగా ‘న’ ఉపయోగించి వ్రాస్తున్న పదాలు ఎన్నెన్నో… ఉదాహరణ ‘గనము (గణము), ప్రానము (ప్రాణము), వాని (వాణి), మని (మణి), వానిజ్య (వాణిజ్య), శ్రేని (శ్రేణి), ఆనిముత్యము (ఆణిముత్యము), కోనము (కోణము), వేని (వేణి) ఇలా ఎన్నో.

అలాగే శంకరుడు, శబ్దము, శారద, శంఖము ఇవన్నీ తప్పులుగా సంకరుడు, సబ్దము, సారద, సంకము ఇలా వ్రాసేస్తున్నారు. కాదంటారా మిత్రులారా? ‘శంకరం’ కాస్తా ‘సంకరమై’పోతే ఏం చేయగలము? ‘ఆశ్చర్యము’ అనే పదాన్ని నేను ఎన్నో పోస్టులలో ‘ఆస్చర్యము’గా చూసాను. అలాగే ‘విస్మయము’ను ‘విశ్మయము’గా కూడా.

ఇక ‘ళ’ బదులుగా ‘ల’ వాడి ఆ పదాలు తప్పుగా వ్రాస్తారు. ఉదా: పరిమలము (పరిమళము), తాలము (తాళము), మేలము (మేళము), పెల్లి (పెళ్ళి), మల్లీ (మళ్ళీ), వెల్లి (వెళ్ళి)… పలకటంలోనే కాదు వ్రాయటంలో కూడా తప్పులు. అందుకు మన చలన చిత్రాలు, టీవీ యాంకర్ల భాష కూడా ఒక కారణమే.

‘ఎలా అయితేనేమి, అర్థం తెలుస్తోందా, లేదా?’ అనే వారున్నారు. అటువంటి వారితో వితండవాదం చేయటం కన్నా ఊరుకోవటమే ఉత్తమం.

ఈనాటి యువతకు ఏది సరియైన పదమో, ఏది కాదో తెలియదు. ముందు పలకటం నేర్చుకుంటేనే, ఆ ప్రకారంగా వ్రాయటం వస్తుంది. అవునంటారా?

దయచేసి మీ పిల్లలకు, మనవలకు, మనవరాళ్ళకు మంచి తెలుగు నేర్పండి. మీకేమైనా సందేహాలుంటే అవి తీర్చుకుని, తీరైన తెలుగు మీరు ముందు నేర్చుకుని, తరువాత మీ వాళ్లకు నేర్పండి. తద్వారా భాష అంతమైపోకుండా ఉంటుంది. అందంగా నిలిచిపోతుంది.

ఇవి కాక ఒత్తులు… అబ్బో అవి చేసే గమ్మత్తులు అన్నీ ఇన్నీ కావండీ… సరియైన చోట ఒత్తు పడకపోతే ఇక భాషంతా చిత్తే… ఆ వైనమేమిటో వచ్చే వారం చూద్దాము.

ఈ వారం మీకొక చిన్న టాస్క్. నేను క్రింద ఇచ్చిన విషయాన్ని ఒకసారి చూసి, సరిచేసి వ్రాసి, ఉంచుకోండి. వచ్చేవారం నేను సరియైన పాఠం వ్రాసి పెడతాను. తప్పులు వస్తే సరిచూసుకోండి.

‘రవింద్రనాద టాగూరు తన గితంజలి కవ్యానికి సహిత్యంలొ నొబెల్ బాహుమతిని అందూకూన్నడు. గూరుకూలల తారహలో సంతినికేతాన్‌గా పాసిద్ది గాంచిన వీస్వబారతి వీస్వవీద్యలయాన్ని స్థపించడు. కలాబావాన్‌ను కూడా స్తపించడు. ఇక్కడ విద్యర్డులు వివిద విద్దలను, కలలను నెర్చుకునేవరు’

మరి వచ్చేవారం వరకూ సెలవా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here