సరిగ్గా వ్రాద్దామా?-4

0
9

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

కం.
అక్షర లేఖనమునను
లక్షల రెట్లగు ముదమును లలితముగానే
అక్షుల తనివిని నింపియు
శిక్షణ నొందిన రచనలు చెలువుగనొప్పున్
*

[dropcap]అం[/dropcap]దరికీ నమస్సులు.

క్రిందటి వారం తప్పుగా ఇచ్చిన పేరా గ్రాఫ్ ను ఎంతమంది సరిచేసి, తిరగ వ్రాసారు? చాలా మంది వ్రాసారనే నేను అనుకుంటున్నాను.

ఆ రోజు ఇచ్చిన విషయం ఇది:

‘రవింద్రనాద టాగూరు తన గితంజలి కవ్యానికి సహిత్యంలొ నొబెల్ బాహుమతిని అందూకూన్నడు. గూరుకూలల తారహలో సంతినికేతాన్ గా పాసిద్ది గాంచిన వీస్వబారతి వీస్వవీద్యలయాన్ని స్థపించడు. కలాబావాన్ ను కూడా స్తపించడు. ఇక్కడ విద్యర్డులు వివిద విద్దలను, కలలను నెర్చుకునేవరు’

వ్రాయవలసిన విధానం ఇది:

రవీంద్రనాథ ఠాగూరు తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. గురుకులాల తరహాలో ‘శాంతినికేతన్’గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వ విద్యాలయాన్ని స్థాపించాడు. కళాభవన్ ను కూడా స్థాపించాడు. ఇక్కడ విద్యార్థులు వివిధ విద్యలను, కళలను నేర్చుకునేవారు.’

చాలామంది సరిచేసి వ్రాసి ఉంటారని భావిస్తున్నాను.

ఈరోజు మనం సాధారణంగా దొర్లే కొన్ని అక్షరదోషాల గురించి తెలుసుకుందాం. క్రిందటి పాఠంలో చెప్పినట్టుగా ఒక అక్షరానికి మరొకటి పడితే పర్యవసానం ఎలా ఉంటుంది అంటే చాలా పదాలు అర్థాలు లేకుండానో  లేదా వేరే అర్థం వచ్చేలాగానో మారిపోతాయి.

ఉదాహరణకు ‘శశి’ అనే పదాన్ని అవే అక్షరాలతో వ్రాయాలి. శసి లేదా సశి అని అస్సలు వ్రాయకూడదు. అప్పుడది అర్థరహిత పదమౌతుంది. మరి ‘ససి’ అని వ్రాయవచ్చునా? ఉహూ. ససి అంటే అర్థముంది, కానీ అది (చంద్రుడి) పేరు కాదు. ఆ పదానికి ‘ఆరోగ్యము’ అని అర్థము. శశీ అని పిలవగలము కానీ ‘ఆరోగ్యమా!’ అని (ససీ) పిలుస్తామా? పిలవము కదా. అంచేత ఈ శ, స ల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. ఈ క్రింద నేనొక పట్టిక ఇస్తాను చూడండి. మీరు తప్పుగా వ్రాసే పదాలను సరిచేసుకోండి.

తప్పు ఒప్పు
ససి శశి
నిస్సబ్దము నిశ్శబ్దము
సాకము శాకము
శాకు సాకు (వంక, నెపము)
ప్రసంశ ప్రశంస
వాశి వాసి
సంకరుడు శంకరుడు
సంఖము శంఖము
శ్వాశ శ్వాస

ఇలాగన్నమాట. ఈ శ, స పదాలలో మీకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. నేను నివృత్తి చేయగలను.

ఇంకా మామూలు అక్షరాలు, ప్రాణాక్షరాల విషయంలో కూడా సందేహాలు ఉంటే అడుగవచ్చు. తప్పకుండా చెబుతాను.

అలాగే చాలా మంది తడబడే పదాలు, బాధ, బాధ్యత, భేదము, ఛేదించుట మొదలైనవి. వీటిని తడబడకుండా నేర్చుకోవాలి.

ఇదివరలోనే చెప్పినా, మరల ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా చాలా ముఖ్యమైనది. అత్యంత తేలికైన విషయంలా కనబడినా ఒకింత కఠినమైన విషయమే. అదే ‘థ’ అక్షరం గురించి.

ఇప్పుడు అందరూ ‘థ’ బదులుగా ధ వాడుతున్నారండీ. ఎక్కడో ఒక్కరో ఇద్దరో నాలాంటి ఛాందసులు తప్ప ‘థ’ అక్షరాన్ని ఉపయోగించటం లేదు. మీరంతా రచనలు చేసే మంచి నిర్ణయాన్ని కలిగి ఉన్నారు కనుక తప్పులు లేకుండా వ్రాస్తారనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ మాటలు చెబుతున్నాను. ఇప్పటికే థ అనే అక్షరం కనుమరుగైపోతున్నది. ఈ విషయంలో నాకు చాలా ఆవేదన.

రచయితలు కానీ, రచయిత్రులు కానీ వ్రాసేది ఏమిటి? కధా? ఉహు అసలు కానే కాదు. అది ‘కథ’ మాత్రమే. మీకు తెలుసా, నిఘంటువు ప్రకారం ‘కధ’ అనే పదానికి అసలు అర్థం లేదని? అంచేత ఈరోజు నుంచి మనమంతా కథ వ్రాస్తున్నాము, కధ కాదు. అలాగే, అర్థము అనే పదాన్ని సరిగ్గా వ్రాయగలిగితే దీనితో ముడిపడి ఉన్న మరెన్నో పదాలు సరియైనవిగా వ్రాయగలుగుతాము.

‘అర్థము’ అనే పదానికి గల అర్థాలు = ధనము, ప్రయోజనము, పని, శబ్దవివరణము మొదలైనవి. వీటన్నింటికీ ‘అర్థము’ అని మాత్రమే వ్రాయాలి. మరి ‘అర్ధము’ అని ఎప్పుడు వ్రాయాలి? ‘సగము’ అనే అర్థములో మాత్రమే వాడాలి. అనగా, అర్ధాంగి, అర్ధ రూపాయి, అర్ధ భాగము, అర్ధ గోళము, అర్ధణా ఇలాగన్నమాట.

ఇలా ఒక్క ‘అర్థము’ అనే పదాన్ని సరిగ్గా వ్రాయగలిగితే, స్వార్థము, పరమార్థము, కార్యార్థి, ప్రార్థన వంటి పదాలు తప్పుగా వ్రాయము కదా!

చర్విత చర్వణమని అనుకోకుండా నేను ఇదివరలో ఇచ్చిన థ అక్షరం వచ్చే అన్ని పదాల జాబితాను చక్కగా భద్రపరచుకొని, పరిశీలించండి. తప్పులుగా వ్రాయకండ

మనమందరం తప్పుగా వ్రాసే మరొక పదము ‘సాంత్వన’. దీనిని చాలా అలవోకగా ‘స్వాంతన’ అని వ్రాసేస్తూ ఉంటాము. నా 25వ సంవత్సరం వరకూ నేను కూడా అలాగే వ్రాసాను. అప్పుడు మా సీనియర్ కొలీగ్ శ్రీ సముద్రాల అప్పారావుగారు నన్ను సరిచేసారు.

అసలు స్వాంతన అనే పదము లేనే లేదండీ. ‘స్వాంతము’ అనే పదం మాత్రం ఉంది, దానికి మనసు, హృదయము అనే అర్థాలు ఉన్నవి. సాంత్వన లేదా సాంత్వనము అనగా, ఉపశమనము, నెమ్మది, ఓదార్పు అని అర్థము.

ఇకపోతే టైపోస్ గురించి –

సిద్ధపడు, బుద్ధి, స్వేచ్ఛ, ఇచ్ఛ ఇత్యాది పదాలను తప్పుగా టైప్ చేస్తూ ఉంటాము.

(సిద్దపడు, బుద్ది, స్వేచ్చ, ఇచ్చ ఇలాగన్నమాట!)

సాధారణంగా మనం వాడేవి ‘ట్రాన్స్ లిటిరేషన్ కీ బోర్డ్’ లే కాబట్టి, ఆంగ్లంలో – siddhapaDu, buddhi, swechCha, ichCha అని టైప్ చేయాలి.

ఇక కథనంలో మనం చేసే తప్పుల గురించి రాబోయే క్లాసులలో చర్చించుకుందాము. అలాగే, పంక్చుయేషన్ కూడా చాలా ప్రధానం. ఇవన్నీ త్వరలోనే మన పాఠాలుగా వస్తాయి.

ఈలోగా వచ్చే క్లాస్ వరకూ మీకొక టాస్క్ ఇస్తాను మరి. ఈ క్రింది పదాలను సరిచేయండి.

  • వైవిద్యము
  • విధ్య
  • విద్వంసము
  • మదురము
  • కాళీ
  • జాన్సీ
  • బయము
  • బాద
  • భాధ్యత
  • చత్రపతి
  • చేధించుట
  • క్రోదము
  • దనదాన్యాలు
  • బోగబాగ్యాలు
  • బవిశ్యత్తు
  • హస్యము
  • అధ్బుతం
  • దూపదీపనైవేధ్యాలు
  • సేధ్యము
  • వ్యర్ధము
  • కధానిక
  • శపధము
  • పధము
  • అథరము
  • రధము

మరి నేటి పాఠానికి చుక్క పెడదామా? వచ్చేవారం దాకా శలవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here