సరిగ్గా వ్రాద్దామా?-6

0
8

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

[dropcap]ఈ[/dropcap]నాటి తరగతిలో కథలో ఉండవలసిన గుర్తులు అనగా విరామచిహ్నాలు ఎలా ఉండాలో చెప్పుకుందాము. దీనినే ఆంగ్లంలో పంక్చుయేషన్ అంటారు.

ముందుగా కొన్ని విరామ చిహ్నాలు:

( . ) బిందువు (ఫుల్ స్టాప్) – దీనిని వాక్యం చివర ఉపయోగిస్తాము.

( , ) కామా – దీనిని వాక్యం మధ్యలో కొద్దిగా నిలుపవలసిన సందర్భములో వాడతారు. అలాగే వరుసగా వివిధ అంశాలను ప్రస్తావించినపుడు వాటి తరువాత పెట్టాలి.

ఉదా: తృణధాన్యములైన రాగులు, సజ్జలు, జొన్నలు ఆరోగ్యానికి మంచివి. (ఆఖరు అంశమైన జొన్నలు పక్కన కామా పెట్టలేదు, గమనించండి.)

( ! ) ఆశ్చర్యార్థకము – దీనిని కూడా బిందువు వలె వాక్యం చివర ఉపయోగించాలి. ఒక ఆశ్చర్యం లేదా అద్భుతం లేదా బలంగా చెప్పటం లేదా సంబోధనకు ఈ చిహ్నం ఉపయోగపడుతుంది.

ఉదా: పాప బుగ్గలు ఎంత మెత్తన!

నా ఇష్టం!

ఆహా, అమృతం!

రామారావ్! అవన్నీ నాకు చెప్పకు!

( ? ) ప్రశ్నార్థకము – ఈ చిహ్నాన్ని కూడా వాక్యం చివరనే ఉపయోగించాలి. పేరులో ఉన్నట్టే ప్రశ్నకు సూచన ఈ గుర్తు.

ఉదా: ఎందుకు వచ్చావు?

ఏ ఊరు వెడుతున్నారు?

మీ అమ్మాయికి పెళ్ళి చేయరా?

( ”  ” ) డబుల్ కొటేషన్స్ లేక డబుల్ ఇన్వర్టెడ్ కామాలు – సంభాషణలకు మాత్రమే ఉపయోగించాలి. ఇవి లేకుండా కథనంలో మామూలు వాక్యాలుగా వ్రాసుకుంటూ వెళ్ళిపోతే కథ గజిబిజిగా ఉండి, అర్థం లేకుండా ముద్దలా తయారవుతుంది. సంభాషణ ప్రారంభించినపుడు ( ” ) తో మొదలు పెట్టి, ఆ డైలాగ్ పూర్తి కాగానే మరచిపోకుండా మళ్ళీ అదే చిహ్నం ( ” ) తో ముగించాలి. అలాగే వేరు వేరు సంభాషణలు వేరు వేరు వరుసలలో వ్రాయాలి తప్ప పక్క పక్కనే వ్రాసేయకూడదు.

ఉదా:

“నీ పేరు?”

“రాంబాబండీ!”

“ఏం చదువుతున్నావు?”

“ఆరో తరగతి సార్!”

“మీ నాన్నగారి పేరు?’

“సత్యనారాయణ గారండీ!”

ఇలా సాగుతుంది. మొదటి వ్యక్తి మగవాడు, పెద్దవాడు – బహుశా రెండోవాడి గురువు కావచ్చు. రెండవ వ్యక్తి పేరు రాంబాబు, అతడొక విద్యార్థి. ఇలా సంభాషణలను విడదీసి వ్రాస్తే పాఠకులకు ఎలాంటి తికమక లేకుండా, స్పష్టంగా చదివి అర్థం చేసుకోగలుగుతారు.

( ‘ ) సింగిల్ కొటేషన్స్ లేదా సింగిల్ ఇన్వర్టెడ్ కామాలు – ఈ గుర్తును స్వగతాలకు, ఏదైనా ఒక వస్తువును లేదా విషయాన్ని ప్రత్యేకంగా చెప్పటానికి వాడతారు.

ఉదా: చిన్నప్పుడు గ్రంథాలయానికి వెళితే నాకు ‘చందమామే’ చదవాలనిపించేది!

‘చాలా తప్పు చేసాను!’ మనసులోనే మథన పడసాగాడు విష్ణు.

అక్కడున్న అన్ని బొమ్మలలోనూ ‘సరస్వతీదేవి’ బొమ్మనే పట్టుకుంది చిన్నారి సుధ.

విరామ చిహ్నాల గురించి మీ కందరికీ ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. పైవి కాక అర్థోక్తి (పాజ్) కొరకు మూడు చుక్కలు ( … ), వివరణ కొరకు డాష్ ( – ) కూడా వాడుతాము.

ఉదా: “ఎక్కడికి వెళ్ళావు?” గద్దించింది అపర్ణ.

“అదీ… మరేమో…” నసిగింది వాణి.

*

“ఇంతకూ నేను చేయవలసిన పని ఏమిటి?”

“జాగ్రత్తగా విను. పక్కింటి మీద ఒక కన్నేసి ఉంచటం – అదే నీ ఉద్యోగం… అర్థమైందా?”

*

ఈ రోజు పాఠంలో విరామ చిహ్నాల వినియోగం మీద కాస్త అవగాహన వచ్చింది కదూ?

వచ్చే తరగతిలో ఖాళీలు (స్పేసెస్) గురించి తెలుసుకుందాం.

అంతవరకూ శలవా మరి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here