[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘సర్పయాగం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]న[/dropcap]రులు నడిచే సమాజంలో
విష సర్పాల సమారోహం
ఘోర కోరలు చూపిస్తూ పాములు
నడిచే పాములు పొడిచే పాములు
తక్షకులు కర్కోటకులు నర రూపంలో
నర్తిస్తూ క్రూరంగా వర్తిస్తూ వస్తున్నాయ్
స్వార్థం మోసం ద్వేషం విషం
తల నిండా నిండి బుసలు కొడుతున్నాయ్
శివుని కంఠాన ఆభరణమై
హరికి పానుపైన సర్పాలు
దేవతా సర్పాలు మానవతా మూర్తులు
ఈ నర సర్పాలు కుబుసాలు
విడిచి బుస కొడుతున్నాయ్
మాటు వేసి కాటు వేస్తున్నాయ్
నర సమాజాన్ని విషంతో నింపుతున్నాయ్
సర్ప దోషం పోవాలంటే
చేయక తప్పదు సర్పయాగం
జనమే జనమేజయులై
క్రూర సర్పాలను మానవతా
యజ్ఞంలో ఆహుతి చెయ్యాలి
విషపు కోరల నుండి విముక్తి పొందాలి