శస్త్రచికిత్స

0
6

[dropcap]ఆ[/dropcap]రోజు ఉదయం నేరపరిశోధన శాఖ ఇన్‌స్పెక్టర్ అభిరాం కాఫీ తాగుతూ దిన పత్రికలో.. కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్, రాజమ్మకు ‘గౌరవ డాక్టరేట్’ ప్రకటించడం.. సంబంధిత రాజమ్మ సంక్షిప్త జీవిత వృత్తాంతం చదువసాగాడు..

‘రాజమ్మ ఆరవతరగతిలో ఉండగా.. రోడ్డుప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి దిక్కులేనిదయ్యింది. ఆమె నాన్న మహాత్మాగాంధీ మెమోరియల్ వైద్యశాలలో ‘వాటర్‌మన్’గా పని చేసేవాడు. ఆ పనిని కొనసాగిస్తానని రాజమ్మ వేడుకుంది. అంత చిన్న అమ్మాయి నీళ్ళు మోసుకు రావడం ఇష్టపడక రాజమ్మను వైద్యశాల శస్త్రచికిత్స విభాగంలో సహాయకారిగా చేర్చుకున్నారు. ఆమె క్రమశిక్షణకు మారు పేరు. దానికి భంగం వాటిల్లితే సహించేది కాదు.

రాజమ్మ ఏకసంధాగ్రాహి. దినం, దినం డాక్టర్ల ఆంగ్లభాషకలవాటు పడుతూ.. యుక్త వయసుకు వచ్చేసరికి అక్కడి కలివిడికి.. ఆంగ్లభాష మాట్లాడ్డం అలవడింది. మరి కొద్ది రోజుల్లోనే.. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే ఆమె ప్రజ్ఞాపాటవాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. మరికొద్ది రోజులకే ఆమె వైద్య పరిభాషలోని పదాలపై పట్టూ సాధించింది. ‘విజ్ఞానం ఒకరి సొత్తు కాదు’ అనే నానుడికి ప్రతీకగా నిలిచింది.

వివిధ రకాల రోగులకు శస్త్రచికిత్స చేస్తున్న సమయాలలో డాక్టర్లకు పరికరాలు అందిస్తూ సూచనలిచ్చేది. ఆమెకున్న పరిజ్ఞానానికి డాక్టర్లు విస్తుపోయేవారు. కొన్ని విపత్కర సందర్భాలలో డాక్టర్లు రాజమ్మ సలహాలు తీసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. వైద్యం తన దైవంగా తలిచింది. ఆ దైవానికే తన జీవితాన్ని అంకితం చెయ్యాలని వివాహమనే మాట మర్చిపోయింది. ఆపరేషన్ థియేటర్ అనుబంధంతో దాదాపు ఏబది వసంతాలు గడిచిపోయాయి.

ఒక ఆపరేషన్ ఆమెను అదృష్టం వరించింది.

ఒక రోగి కడుపులో కంతి ప్రాణాపాయ స్థితి.. దాన్ని ఆపరేషన్ చేసి తీయడం మావల్ల కాదని డాక్టర్లంతా చేతులెత్తేశారు. హైదరాబాదు తీసుకెళ్ళాలన్నారు. కాని రాజమ్మ కేసును ఒక సవాలుగా తీసుకుని డాక్టర్లకు ధైర్యం నూరి పోసింది. తాను ముందుండి సలహాలిస్తూ.. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స విజయంతం చేయించింది రాజమ్మ. ఆమె సాయంతో రోగి కడుపులో నుండి దాదాపు ఐదు కిలోల కంతిని తొలగించారు. డాక్టర్లు ఇది రాజమ్మ వల్లనే సాధ్యమయ్యిందని ప్రశంసించారు.

వైద్యశాలలోని డాక్టర్ల వివరణలతో.. దినపత్రికలన్నీ రాజమ్మను పొగడుతూ ఆమె చిత్రాన్ని ప్రథమ పేజీలో అచ్చువేశాయి.

ఆమె విశిష్ట సేవలకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు బిరుదు ప్రకటించింది. దానిని స్నాతకోత్సవ సభలో ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది.’

అభిరాం మ్రాన్పడి పోయాడు. తప్పకుండా సభకు హాజరు కావాలనుకున్నాడు. రాజమ్మ లాంటి స్త్రీమూర్తిని చూడాలని మనసు తహ, తహ లాడింది. మరొక సారి పత్రిక తిరగేసి స్నాతకోత్సవసభ తేదీని తన డైరీలో నోట్ చేసుకున్నాడు.

***

ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవసభ..

వృత్తిరీత్యా అత్యవసర పనుల ఒత్తిడిలతో సతమతమవుతూ.. అభిరాం సభకు వెళ్ళే సరికి కాస్తా ఆలస్యమయ్యింది. రాజమ్మ ప్రసంగం కొనసాగుతోంది..

“నేను వైద్యపరంగా కేవలం మనుషులకు చికిత్సలో సాయపడ్తున్నందుకు గుర్తింపు లభించింది.. సంతోషం. నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా అధ్యక్షుల వారి అనుమతితో.. మరో రెండు విషయాలు చెప్పదల్చుకున్నాను” అనగానే సభ చెవులు పెద్దవిగా చేసుకుంది.

“నేను కేవలం వైద్యరంగంలో శ్రమిస్తున్నాను. సామాజిక పరంగా చికిత్స చేస్తున్న నా సహోదరి సమానురాలు కమలమ్మ ప్రతిభ అనన్యసామాన్యము.

 ఆస్తి కోసం.. కన్న తల్లిదండ్రులను హతమారుస్తున్న కాలమిది.

‘గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేనమః’ అని శ్లాఘించబడే మన పవిత్ర భారత దేశంలో.. టీచర్లు కొందరు కీచకులై తమ విద్యార్థినిల మానాలను కాలరాచి చిదిమేస్తున్న దౌర్భాగ్యము దాపురించింది.

ఈమధ్య మన ఊళ్ళో జరిగిన తొమ్మిది నెలల పసికందును ప్రాణాలు తీసుకున్న రాక్షసునికి కమలమ్మ వానికి మరణ దండన విధించింది” అనగానే.. సభలో చప్పట్లు మ్రోగాయి.

“ఆనాటి నుండి నేటి వరకు మరో బాలిక బలి కాలేదు. దినపత్రికలో మానభంగం వార్త రాగానే మరునాటి ప్రత్రికలో వాని చావు వార్త ప్రచురితమవడం ఆనవాయితీగా మారింది. మీరు గమనిస్తున్నారో..! లేరో..! మానవమృగాలకు వణకు పుడ్తోంది. ఆడవారికి రక్షణ మెరుగవుతోంది. మరి కొద్ది రోజుల్లో మన రాష్ట్రంలో మానభంగం, లంచగొండితనం అనే మాటలు కనుమరుగై పోతాయి. ప్రతీ రాష్ట్రంలోని మగువలు కమలమ్మలా కంకణం కట్టుకోవాలి. అప్పుడు దేశానికి సరియైన శస్త్రచికిత్స జరిగిందనుకుంటాను. ఇంత రూఢీగా నేను చెప్పే కంటే కమలమ్మ నాకు లోగడ వివరించిన రెండు సంఘటనలు మీముందుంచుతాను” అంటూ.. కండ్లకు కట్టినట్టుగా చెప్పసాగింది రాజమ్మ.

అభిరాం ప్రేక్షకుల మధ్య కూర్చోని ఆసక్తిగా వినసాగాడు.

***

అదొక రక్షకభట నిలయం.

“సెంట్రీ వన్ సిక్స్ త్రీ..!” అంటూ పోలీసు ఇన్‌స్పెక్టర్ భీమయ్య గొంతు మారుమ్రోగింది.

కచ్చేరీలలో అలా నంబర్లతో పిలవడమే ఆనవాయితీ. వెంటనే కన్కయ్య టక, టకా బూట్ల శబ్దం చేసుకుంటూ ఇన్‌స్పెక్టర్ గదిలోకి వెళ్ళి స్టిఫ్‌గా నిలబడి సెల్యూట్ కొట్టాడు.

“నలుగురు పోరగాండ్లను పట్టుకొచ్చి లోపలేశాం కదా.. వాళ్ళను విడిచిపెట్టుమని చోటా మోటా లీడర్లు ఎవరైనా రాకపోరు. ఎవడచ్చినా లోపలికి రానివ్వకు. మెడలు పట్టి బయటికి గెంటెయ్యి” అంటూ హుకుం జారీచేశాడు భీమయ్య.

“ఎస్సార్..” అంటూ మరోమారు సెల్యూట్ కొట్టి వెళ్ళాడు కన్కయ్య.

భీమయ్య ఊహ నిజమయ్యింది. పాపయ్య కార్లో దిగి పరుగులాంటి నడకతో వస్తున్నాడు. కన్కయ్య అది గమనించి కాపలాగది నుండి బయటికి వడి, వడిగా వచ్చి అడ్డుకున్నాడు.

“అదేంట్రా.. నేనెవరో తెలుసు గదా..! నన్నే ఆపుతావారా?.. నీ సంగతి చూస్తా..” అంటూ.. పాపయ్య కనుగుడ్లు తాటికాయలంత జేసుకున్నాడు. మీసాలు దువ్వుతూ.. గుర్రుమన్నాడు.

“ఎవరొచ్చినా లోపలికి పంపొద్దన్నాడు అమీన్ సాబ్” అని కన్కయ్య నిష్కర్షకంగా జవాబిచ్చాడు.

“మరి కచ్చేరి ఉన్నది ఎందుకురా..! పీకనికా!.. మా ఆపద, సంపద చెప్పుకోవద్దా..!” అంటూ బలవంతంగా అడుగు ముందుకు వేయబోయాడు పాపయ్య. అతని మెడ మీద చెయ్యి వేశాడు కన్కయ్య. పాపయ్య విదిలించుకున్నాడు. ఇద్దరి మధ్య తోపులాట మొదలయ్యింది. ఆ శబ్దానికి బయటకు వచ్చాడు భీమయ్య.

 “హల్లో.. పాపయ్యా గుడ్ మార్నింగ్. ఎంత సేపయ్యింది వచ్చి? రా.. లోపలికి రా..” అంటూ పాపయ్య దగ్గరికి వచ్చి అతని భుజంపై చెయ్యి వేసి ఆత్మీయంగా తన గదిలోకి తీసుకు వెళ్ళసాగాడు భీమయ్య. వెనక్కి తిరిగి, తిరిగి.. కన్కయ్యను ఉరిమి, ఉరిమి చూసుకుంటూ..

కన్కయ్య అవాక్కయ్యాడు.

“భీమయ్యా.. మా వాడ పిల్లలను తీసుకు వచ్చి లోపల వేశావని తెలిసింది. పాపం..! వాళ్ళ తల్లి దండ్రులు నాతో మొర పెట్టుకున్నారు. సెటిల్‌మెంట్ చేసుకుందామని వచ్చాను” అన్నాడు పాపయ్య.. రేటెంతో చెప్పమన్నట్లుగా.

“వాళ్ళు పిల్లలా..! కామాంధులు.. నరరూప రాక్షసులు” అంటూ గొంతు స్థాయి పెంచాడు భీమయ్య. అలా పెంచితే గాని ఎక్కువ గిట్టుబాటు కాదని బాగా తెలుసు. అతనికది వెన్నతో పెట్టిన విద్య.

“రాక్షసులా..! ఏం పని చేశారు?”

“వాళ్ళతోబాటు పదవ తరగతిలో చదివే అమ్మాయి ఎప్పుడూ ప్రథమ శ్రేణిలో పాసవు తుందట. వీళ్ళదేమో అధమ శ్రేణి. ఆ అమ్మాయి మీద కక్షబెట్టుకొని కిడ్నాప్ చేశారు. ఊరవతల పాడుబడ్డ బంగ్లాకు తీసుకెళ్ళి మానభంగం చేసి చంపేశారు. మాకు సమాచారం వచ్చింది. వెంటనే వెళ్ళి రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నాం” అన్నాడు భీమయ్య. ఎంత అడగాలోనని మనసులో లెక్కలేసుకోసాగాడు.

పాపయ్యకిదంతా తెలియదని కాదు. ఊళ్ళో టాం.. టాం.. అయిన విషయమేనాయే..

“అంత మాత్రానికే వాల్లను తీసుకొచ్చి లోపలెయ్యాలా..! వయసు మీద ఉన్న పోరగాండ్లు కుతి తీర్చుకోవడమూ తప్పేనా..! చంపాలని చంపలేదు. అది బతికితే తమ ప్రాణాలకు ముప్పు వస్తుందనే భయంతో ఆత్మరక్షణ. అయినా ఈ వాదనంతా ఎందుకు గాని ఎంత కావాలో చెప్పు” అన్నాడు పాపయ్య. ఎంతైనా ఫరవాలేదు అన్నట్టుగా..

“లకారాలు” అంటూ ఆరు వేళ్ళు చూపించాడు భీమయ్య.

“అతిగా ఆశపడొద్దు భీమయ్యా.. నాలుగు చేసుకో”

“పాపయ్యా..! ఇది కూరగాయల బేరం కాదు. నువ్వు ఇంత దూరం శ్రమకోర్చి వచ్చావని ఆ మాత్రం అడిగాను.. నాలుగు గిట్టుబాటు కాదు. అయినా నేనొక్కడినే తింటానా..? ఎందరికి పంచాల్సి ఉంటుందో నీకు తెలియదా? ముఖ్యంగా పాత్రికేయుల నుండి తప్పించుకోవాలి గదా..! నీకూ తప్పదనుకో..”

“సరే అయితే.. మా పార్టీ ఫండులో నుండి తెచ్చాను. ఓటర్లను కాపాడుకోవడం మాకు తప్పదు” అంటూ లేచి కట కటాలలో ఉన్న పిల్లల వంక చూస్తూ రెండు వేల రూపాయల మూడు కట్టలు భీమయ్య బల్ల మీద పెట్టబోయాడు. చట్టుక్కున లాక్కున్నాడు భీమయ్య. స్వయంగా లాకప్ తెరచి దుష్టచతుష్టయానికి విముక్తి కలిగించాడు.

ఆ మరునాటి దినపత్రికలన్నీ.. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పాపయ్య, భీమయ్యల నగదు ముడుపుల వ్యవహారమంతా ఫొటోలతో సహా ప్రచురితమయ్యాయి. నలుగురు కామాంధుల శవాల ఫోటోలు ప్రధమ ఆకర్షణగా నిలిచాయి.

టీ.వీ.లలో ఫ్లాష్ న్యూస్.. భీమయ్య తాత్కాలికంగా.. విధుల నుండి తొలగింపు..

సామాజిక మాధ్యమాలన్నీ హల్‌చల్..” అంటూ హుషారుగా చెప్పసాగింది రాజమ్మ.

సభ యావత్తు చప్పట్లతో మారు మ్రోగసాగింది. అభిరాం సభను కలియ జూశాడు. ఇసుక పోస్తే రాలనంత జనం..

రాజమ్మ చెప్పేతీరు, హావభావాలు.. కడు రమ్యంగా కనబడసాగింది. వేదిక సాంతం సినిమా వెండి తెరలా మెరిసి పోతోంది. ఆ తెరపై ఆ సంఘటన తాలూకు దృశ్యాలు కదలాడుతున్నాయి..

“ఇప్పుడు మరొక సంఘటన..” అనగానే సభ యావత్తు నిశ్శబ్దమయమయ్యింది..

***

“నారాయణరావు ప్రముఖ న్యాయవాది. అతను తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మిగా మార్చగల అఖండుడు.

అతని కార్యాలయ గదిలో రహస్య మంతనాలు జరుగుతున్నాయి.

“సార్.. మన ఎమ్మెల్లే గారు ఇది తన పదవి, ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని, తప్పక చేసి పెట్టాలని డబ్బిచ్చి పంపాడు” అంటూ చేతిలోని సూటుకేసు మీద వేళ్ళతో వీణలా మీటుతూ అన్నాడు ఎమ్మెల్లే గారి ఆంతరంగిక కార్యదర్శి కామేశ్వరరావు.

“ఏం పని?” అడిగాడు నారాయణరావు ఏమీ తెలియనట్టుగా.

“ఆమధ్య వార్తల్లో వచ్చిన సంఘటన..” అంటూ ఎలా చెప్పాలో తటపటాయించసాగాడు కామేశ్వరరావు. “మీతో అన్ని వివరాలు చెప్పానన్నారు ఎమ్మెల్లే గారు” అంటూ తల గోక్కుంటూ.. మొత్తానికి ‘న్యాయవాది అనిపించుకున్నాడు’ అని మనసులో గొణుక్కోసాగాడు.

“అది ఇంతదూరం ఎందుకు తెచ్చుకున్నారని ఆరోజే వారితో అన్నాను. అక్కడే పోలీసు స్టేషన్లో డబ్బు తగలేస్తే కోర్టు దాకా వచ్చేదే కాదని. అయినా ఇప్పుడు చాలా కష్టం కదా..!”

“ప్రయత్నించాం సార్. ఆ స్టేషన్లో భీమయ్య ఉన్నప్పుడు పనులన్నీ సులువయ్యేవి. అతను విధుల్లో నుండి శాశ్వతంగా తొలగించపడ్డాడు. ఇప్పుడున్న ఇన్‌స్పెక్టర్ చాలా నిక్కచ్చి మనిషి. దేనికీ లొంగలేదు. భయపెట్టి చూద్దామనుకునే సరికే మాచెయ్యి దాటిపోయింది. కేసు నమోదయ్యింది. అతిగా స్పందిస్తే అందరం దినపత్రికల్లోకి ఎక్కుతామనే భయంతో మీదగ్గర పరిష్కరించుకుందామని మంత్రిగారి ఆలోచన. కింది కోర్టులో కూడా సారంగపాణికి శిక్ష కరారయ్యింది. అక్కడ డబ్బులు వెదజల్లి బెయిల్ ఇప్పించాం”

“శిక్ష పడక ఏమవుతుంది?.. ఇదేమైనా తేలికైన కేసా.. ఒక చిన్న పసికందుపై అత్యంత పాశవికంగా అఘాయిత్యం మూలాన రక్తసిక్తమై మరణించింది. నిందితుడు సారంగపాణి స్వయాన ఎమ్మెల్లేగారి బావమర్ది అయినంత మాత్రాన శిక్ష నుండి తప్పించుకో లేడు కదా..!”

“అందుకే గదా సార్.. ఎమ్మెల్లే గారు నన్ను మీవద్దకు పంపింది” అంటూ సూటుకేసు తెరిచాడు కామేశ్వరరావు.

అందులో నిండుగా రెండు వేల రూపాయల కొత్తనోట్ల కట్టలు నిగ, నిగలాడుతున్నాయి. నారాయణరావు చటుక్కున సూటుకేసు లాక్కున్నాడు.

“ఎమ్మెల్లే గారిని నిశ్చింతంగా ఉండమని చెప్పండి. ఏది ఏమైనా.. శిక్షపడకుండా నేను చూసుకుంటాను” అంటూ.. కామేశ్వరరావు వంక చూశాడు నారాయణరావు. ఇక సెలవు తీసుకోమన్నట్లుగా..

కామేశ్వరరావు లేచి నిలబడి రెండు చేతులా మరో సారి వినమ్రంగా నమస్కరించి నిష్క్రమించాడు.

ఆ మరునాడు ఉదయమే ‘ఎమ్మెల్లేగారి బావమర్దా.. మజాకా..!’ అన్నట్టు సారంగపాణి హత్య వార్త అన్ని దినపత్రికల మొదటి పేజీలో వచ్చింది.

ఎమ్మెల్లేగారి పని ‘రెంటికి చెడ్డ రేవడి’లా తయారయ్యింది. తనకు తాను పిసుక్కోవడమే తప్ప ఎవరికీ చెప్పుకోనూ లేడు. నారాయణరావు దగ్గరి నుండి డబ్బు తిరిగి తీసుకోనూ లేడు.

తాను తీసుకున్న సూటుకేసు వీడియోలు సామాజిక మాధ్యమాలలో నాట్యమాడడం.. మూర్ఛపోయాడు నారాయణరావు. సర్వోన్నత న్యాయస్థానం నారాయణరావు మీద సమగ్ర విచారణ జరిపి కఠిన చర్య తీసుకుంది.

సారంగపాణి సర్వరోగాల సుందరాంగుడు. మందుమాత్రలతో బాటు మత్తుమందులకు బానిస మదపిశాచి. మంత్రిగారి అండ చూసుకొని ఆ మత్తులో చేసే అకృత్యాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పాపం పండింది.. పోయాడని అనుకున్నారంతా. హత్య ఎవరు చేశారో గాని ఒక మంచి పని చేశారని మెచ్చుకుంది లోకం.

***

“ఇక చివరగా రెండు మాటలు చెబుతాను” అంటూ కళ్ళ జోడు తీసి చెమ్మగిల్లిన కళ్ళను ఒత్తుకుంది రాజమ్మ.

“మనిషికి ఎలాంటి జబ్బు సోకినా నయంచేసుకోవచ్చు. సమాజానికి చికిత్స చేసే అత్యంత పటిష్ఠమైన వ్యవస్థలు రెండు.. రక్షకవ్యవస్థ, న్యాయవ్యవస్థ. నేడు అవి చీడపురుగు పట్టి.. తీరని అవస్థలుగా మారిపోయాయి. వీటిని పెంచి పోషించేది నేటి రాజకీయవ్యవస్థ. అదే మన మెడకు చుట్టుకున్న నీచాతి నీచమైన నికృష్టపువ్యవస్థ.

నేను కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే చెప్పాను. ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో చెదురుముదురుగా జరుగుతునే ఉన్నాయి. వీటిని చక్కదిద్దాలనుకుంది కమలమ్మ.

చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం నేరమే కావచ్చు. నేరాలను చూస్తూ.. సహించడమూ, మిన్నకుండడమూ.. మహానేరమే అవుతుందన్నది.. కమలమ్మ సిద్దాంతం. వానిని అరికట్టాలని ఒక నిర్ణయం తీసుకుని పరిష్కారం కోసం పరిశోధనలు సాగించింది.

ఎక్కువగా చదువుకోక పోయినా మన చింతకింది మల్లేశం తన తల్లి అవస్థను చూసి ఆసుయంత్ర వ్యవస్థను సాధించినట్లే నేనూ సాధించాలి అని మనసులో ధృఢనిశ్చయం చేసుకుంది కమలమ్మ.

దానిలో భాగంగా.. సామీప్య కైవార ఛాయాచిత్ర సాధనాలను లోబర్చు కోవాలనుకుంది. పది గదుల్లో ఉన్న ఛాయాచిత్ర సాధనాలను ఒక గదిలో కూర్చోని పరీక్షించినట్లే.. మన ప్రాంతంలో ఉన్న చాయా చిత్రాలన్నింటినీ అనుసంధానం చేసే ఒక యంత్రం కనుగొనాలనుకుంది. దాదాపు పది సంవత్సరాలు శ్రమించి విజయం సాధించింది. దానికి ‘ఛాయాచిత్రాల బక్షి’ అని పేరు పెట్టింది.

దాని సాయంతో మన ప్రాంతంలో జరిగే అన్యాయాలను పసిగడుతూ.. శిక్షలు అమలు పరుస్తూ వస్తోంది. మానభంగాలు చేసే వారికి మరణ శిక్ష కమలమ్మ శాసనం. అదే మార్గాన్ని నేడు మన కేంద్ర ప్రభుత్వం అనుసరించబోతోంది. దాన్ని మరింత విస్తృతపర్చి సమాజాన్ని ‘శస్త్రచికిత్స’ చెయ్యాలనుకుంటుంది.

కమలమ్మ శిక్షించే విధానంలో నైపుణ్యాన్ని నేను విశదీకరించదల్చుకోలేదు. కాని ఒక్కటి మాత్రం నిజం.. ఆమె ప్రయోగించే ఇంజక్షన్‌లో వాడే మెడిసిన్.. శవపరీక్షలో సైతం చిక్కదు. అలా ఆధునిక మందులు వాడడంలో ఆమె నిష్ణాతురాలు” అంటూ కమలమ్మ సామాజిక శస్త్రచికిత్సను ఎవరూ అడ్డుకోలేరనే రీతిలో హెచ్చరించింది.

సభ యావత్తు లేచి నిలబడ్డారు. కమలమ్మకు మద్దతుగా వారి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఆ ధ్వనుల మధ్యనే .. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ గారు కమలమ్మకు ‘గౌరవ డాక్టరేట్’ ప్రదానం చేశారు.

సభ విజయవంతంగా ముగిసింది..

అభిరాం ఆలోచనలో పడ్డాడు. ఎమ్మెల్లే గారి బావమర్ది హత్య గావడంతో తనకీ కేసు అప్పగించింది. తన పరిశోధనలో ఏ మాత్రమూ.. పురోగతి కనబడలేదు. కాని ఈ సభలో రాజమ్మ ప్రసంగంతో ఒక అవగహన ఏర్పడింది.

ఆ రోజు తను రాజమ్మ చదివిన ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి సేకరించిన సమాచారం సరిపోతోంది. ఆమె చాలా తెలివిగల అమ్మాయి. కాని లిప్త కాలంలోనే ఆమె చర్యల్లో మార్పులు వచ్చేవని ప్రధాన ఉపాధ్యాయిని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

ఒకే చరవాణిలో రెండు రెండు సిమ్ కార్డులున్నట్లు ఆమెలో రెండు పార్శ్వాలున్నాయి. ‘వైద్య శస్త్రచికిత్సలో రాజమ్మ’, ‘సామాజిక శస్త్రచికిత్సలో కమలమ్మ’ కావచ్చనే అనుమానం రాగానే.. తన బ్యాగులోని ఫైల్ తీసి ఆమె ఆరోతరగతి టీ.సి. నకలు చూశాడు. ఆమె పూర్తి పేరు ‘రాజకమలమ్మ’.

కుర్చీలో నుండి భారంగా లేచాడు అభిరాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here