శతక పద్యాల బాలల కథలు-9

0
11

(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)

పుత్రోత్సాహము తండ్రికి

[dropcap]పి[/dropcap]ల్లలు ఎప్పటిలాగే ప్రకృతి వాళ్ళ ఇంటికి అమ్మమ్మ చెప్పే పద్యం, కథ వినటానికి వచ్చారు. అందరు హాల్‍లో రెడీగా కూర్చున్నారు.

ఆంటీ, మానస్, అంకుల్ వచ్చారు. పిల్లలకు ఉడికించిన పల్లీలు, నిమ్మరసం ఇచ్చారు. అమ్మమ్మ వచ్చి దీపం వెలిగించాకా, అందరు కొద్దిసేపు ధ్యానం చేసారు. అమ్మమ్మ చెప్పే పద్యం, కథ ఏమిటా అని ఎదురుచూస్తున్నారు.

అమ్మమ్మ అందరికి హలో చెప్పారు.

“గుడ్ ఈవెనింగ్. మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను.” అన్నారు.

“గుడ్ న్యూస్. Wow!” అన్నారు అందరు.

“మా అమ్మాయి నీలిమ ఈ ఏడాది ఉత్తమ టీచర్ అవార్డుకి ఎంపిక అయింది. రాష్ట్రపతి పురస్కార్” అన్నారు గర్వంగా అమ్మమ్మ.

అందరు గ్రీటింగ్స్ చెప్పారు.

“పిల్లలూ! ఇవ్వాళ మీకు ‘పుత్రోత్సాహము తండ్రికి’ అనే పద్యం చెబుతాను. మీకు తెలుసా? పేరెంట్స్‌కి పిల్లలు.. బాయ్ లేదా గర్ల్ ఎవరైనా కానివ్వండి పుట్టినప్పుడు, అందరు విషెస్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది.

కానీ నిజమైన ఆనందం పిల్లలు ప్రతి స్టేజిలో అంటే చదువు, ఆటపాటలు, ప్రవర్తనలో మంచి performance కనబడితే ఆనందిస్తారు. ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. కానీ అసలైన ఆనందం ఎప్పుడంటే మీరు ఏదైనా అందరు మెచ్చే పనిచేసి, దానికి తగిన గుర్తింపు వచ్చినప్పుడు. For example..” అంటూండగా..

“For example నీలిమ ఆంటీకి ప్రెసిడెంట్ అవార్డు వచ్చినప్పుడు” అన్నాడు గడుగ్గాయి మౌర్య.

“ఎస్. యు ర్ రైట్” అన్నారు అమ్మమ్మ.

“ఓకే. పద్యం వినండి” అంటూ పద్యం చెప్పారు

~

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి

~

భావం:

కుమారుడు పుట్టగానే తండ్రికి కలిగే సంతోషం కంటే ప్రజలు కుమారుడి గొప్పతనాన్ని గుర్తించి మెచ్చుకున్న రోజు నిజమైన, అసలైన ఆనందం కలుగుతుంది.

~

“పిల్లలూ, పద్యంలో బద్దెన కుమారుడు అన్నాడని కొడుకులే గొప్ప అనుకోవద్దు. కుమార్తెలు తల్లిదండ్రులకి, ఫ్యామిలీకి మంచి పేరు తెస్తారు. నిజానికి పేరెంట్స్‌కి పిల్లలు అందరు సమానం. అందరికి ఈక్వల్ అవకాశాలు ఇస్తారు. ఫ్రీడమ్. మీకు దొరికిన అవకాశాన్ని మంచిగా వాడుకుని షైన్ అవటం మీ చేతిలో ఉంది. ఇక కథ విందామా?” అన్నారు.

***

ఒక గ్రామంలో రైతుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళు తమ ఊరి స్కూల్‌లో చదువుకుని పై చదువులకు పక్క టౌన్‌కి వెళ్లారు. సెలవుల్లో వాళ్ళు తండ్రితో పాటుగా పొలం పనులకు వెళ్లేవారు. వారిలో ఒక కొడుకు తండ్రి వ్యవసాయ పనులకి inspire అయి డిగ్రీలో వ్యవసాయం సబ్జెక్టుగా తీసుకుని మంచి మార్కులతో పాస్ అయ్యాడు.

ఊరి వారందరు అతని అన్న అక్క లాగా ఇతను సిటీలో ఉద్యోగం చేస్తాడని అనుకున్నారు.

అతని నాన్నతో “వీరయ్యా! నీ కొడుకు సురేందర్ చదువు అయిపొయింది కదా, ఎక్కడ కొలువు చేస్తాడు?” అన్నారు.

“తెలియదు అన్నా! ఇంకా ఏమి చెప్పలేదు. అడగాలి” అన్నాడు వీరయ్య.

ఇంతలో సురేందర్ అటువచ్చాడు “సురేందర్! ఇటురా బిడ్డా!” అని పిలిచాడు నాన్న.

వచ్చిన కొడుకుతో “ఊరి వాళ్ళు నువ్వు కొలువు ఎక్కడ పోతావు అని అడుగుతున్నారు. ఇంకా చదువుతావా?” అని అడిగాడు.

“లేదు నాన్నా. ఇంక చదవను. ఇక్కడే మన పొలంలో వ్యవసాయం చేస్తాను” అన్నాడు సురేందర్.

“ఇక్కడా? చదువుకుని వ్యవసాయం చేస్తావా? లాభసాటి (profitable) కాదు కదా?” అన్నారు పెద్దలు.

“లేదు మామా, సరిగ్గా చేస్తే వ్యవసాయం పండగే. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త రకాల పంటలు, కొత్త పద్ధతుల్లో పండించటం ఇష్టం. అందుకే అగ్రికల్చరల్ బిఎస్‌సి చదివా” అని చెప్పి లోపలి వెళ్ళాడు.

అందరు “ఏందో ఈ పిల్లగాడు. సిటీ జాబ్ వద్దంట” అనుకుంటూ వెళ్లిపోయారు.

సురేందర్ తమ పొలంలో తన చదువు, తండ్రి అనుభవం, technology, ప్రభుత్వ సాయంతో కొత్త పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం organic farming మొదలుపెట్టాడు. మంచి నాణ్యమైన పంటలు పండించేవాడు. దిగుబడి (yield) కూడా ఎక్కువ వచ్చేది. గ్రామస్థులు అందరు అతని పంటలు పరిశీలించేవారు.

ఒక ఏడాది అతనికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ రైతు అవార్డు వచ్చింది.

అది తెలిసి ఊర్లోకి అతన్ని ఇంటర్వ్యూ చెయ్యటానికి టీవీ, న్యూస్ పేపర్ వాళ్ళు క్యూ కట్టారు. ఊరంతా సంతోషపడింది – ఊరికి, రైతుకు మంచి పేరు వచ్చిందని.

టీవీ రిపోర్టర్లు సురేందర్‌ని ఇంటర్వ్యూ చెయ్యటానికి వచ్చారు.

ఊరంతా అతని ఇంటి ముందు గుమి కూడింది. ముందుగా ఒక రిపోర్టర్ తండ్రిని అడిగింది “సురేందర్‌కి బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?” అని.

దానికి తండ్రి “నాకు చాలా గర్వంగా ఉంది. కొడుకు పుట్టినప్పుడు అందరు అదృష్టవంతుడినని అన్నారు. అప్పటికంటే ఇవ్వాళ నాకు నిజంగా సంతోషంగా ఉంది. సురేందర్ పనికి గుర్తింపు, అవార్డు వచ్చి మా ఫ్యామిలీకి మంచి పేరు గౌరవం వచ్చింది” అన్నాడు.

ఇంతలో సురేందర్ పొలం పక్కన పొలాలు ఉన్న రైతులు రిపోర్టర్‌తో “మీకు తెలిసింది సురేందర్‍కి వచ్చిన అవార్డు మాత్రమే. మీకు తెలియంది చెబుతాము” అన్నారు.

అదేంటో మీరూ వినండి. “సురేందర్ తన పొలంలో వేసే మంచి నాణ్యమైన విత్తనాలను మాకు ఇచ్చి మా పొలాలలో వేయిస్తాడు. మాకు మంచి పంట వచ్చేలా సలహా advice ఇస్తాడు” అన్నారు.

అది విన్న రిపోర్టర్ సురేందర్‌తో “మీరెందుకు మీ పొలానికి అన్ని వైపులా ఉన్న రైతులకి మీ గుడ్ క్వాలిటీ సీడ్స్ పంచుతారు? వాళ్ళు మీకు పోటీదారులు/కంపిటీటర్స్ అవుతారు కదా? మీ పంటకు డిమాండ్, రేట్ తగ్గుతుంది కదా?” అని అంది.

అందుకు సురేందర్ “అవును నాకు వాళ్ళు పోటీదారులు. మీకో నిజం చెప్పనా! మై సీక్రెట్ అఫ్ సక్సెస్ అదే” అన్నాడు.

“అదెలా?” అన్నది రిపోర్టర్.

“ఎలా అంటే వాళ్ళకి మంచి విత్తనాలు వెయ్యమని ఇచ్చేది నా పంట మంచి కోసమే. పంటలకు అవసరమైన పరాగ రేణువులను గాలి, పిట్టలు ఒక చోటు నుండి ఇంకో చోటికి గాలి వాలు direction ని బట్టి క్యారీ చేస్తాయి. పోలినేషన్కి అవసరం. ఒకవేళ నా పక్క పొలం రైతు వాడే సీడ్స్ గుడ్ క్వాలిటీవి కాకపొతే సరైన పోలినేషన్ లేక నా పంట తగ్గే అవకాశం ఉంది. అలాంటి నష్టం రాకుండా ఉండాలంటే నాతో పాటు నా చుట్టూ ఉన్న రైతులు అందరు మంచి విత్తనాలు వాడేలా చూడాలి కదా! అందుకని వారికి మంచి విత్తనాలు ఇచ్చాను. నా ప్రయత్నం ఫలించి నాతో పాటుగా వారికి మంచి crop వచ్చింది. మా ఇతర రైతులు కూడా లాభపడ్డారు. నా వ్యవసాయ ప్రయోగాలతో, సేంద్రియ ఎరువులతో నేను లాభపడుతున్నా” అన్నాడు.

అది విన్న వీరయ్య “అమ్మా, ఇప్పుడు అర్థం అయిందా? నాకు నిజమైన ఆనందం ఎందుకు కలిగిందో. ఊరి ప్రజలే కాదు, రాష్ట్ర, దేశ ప్రజలు కూడా నా కొడుకుని మెచ్చుకుంటున్నారు” అన్నాడు .

***

“పిల్లలూ మీరు చేసే మంచి పనుల వల్లే మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. అంతే కాదు సురేందర్ చెప్పినట్లు తోటివారు బాగుపడాలని కోరుకోవటం గొప్ప గుణం. అసూయ మంచిది కాదు. మీరందరు మీకు బాగా నచ్చిన చదువు, వృత్తిలో రాణించాలి. అంటే సక్సెస్ అవ్వాలి. అందరికి పేరు తేవాలి” అన్నారు అమ్మమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here