సత్సాంగత్యము

0
6

[dropcap]”న[/dropcap]వరత్నాలన్నీ ఒక దగ్గర” అనేవారు నాన్న. ఆ మాటలో అర్థాలు శతకోటి. నిజానికి ఒకలా ఆలోచించేవారు ఎవ్వరి ప్రమేయం లేకుండా ఒక దగ్గర చేరుతారన్నది నిజం. అది మంచి కానీ చేడు కానీ. అందుకే ఒక మనిషి మిత్రుల బట్టి వారి స్వభావం అంచనా వెయ్యవచ్చని అంటూ ఉంటారు.

వారి మిత్రుల జాబితా బట్టి వారి జీవిత లక్ష్యాలను, కోరికలను, ప్రవర్తనను తెలుసుకోవటమన్నది సాధారణ పద్ధతి. అసలు మంచి మిత్రులు లేకపోతే, అబ్బాయిలకు సంబంధాలు కూడా తప్పిపోతాయి. మిత్రులకు అంతటి ప్రాముఖ్యత ఉన్నది మానవ జీవితంలో.

మంచి వారి సాంగత్యం మల్లెపువ్వు లాంటిది. వారి సువాసన వద్దన్నా ప్రక్కవారికి అంటుకొని, సదా మంచి సువాసనలను పంచుతుంది. సామాన్య జీవితాలనుంచి, సాధకుల వరకు సజ్జన సాంగత్యం ఎంతో ముఖ్యమైనది. అది వారి జీవితాలను మారుస్తుంది. దశా, దిశా నిర్దేశం చేస్తుంది. అందుకే మోక్షానికి సజ్జన సాంగత్యం మొదటి మెట్టుగా చెబుతారు. సజ్జనుల సాంగత్యమే ‘సత్సాంగత్యము’.

‘సత్సాంగత్యం’ అంటే ఏమిటి అన్ని ప్రశ వేసుకుంటే – ‘సత్’, ‘సాంగత్యం’ అన్న రెండు పదాల నుంచి ఏర్పడిన ఒక సంస్కృత పదం. ‘మంచి తో నివాసం, మంచి వారితో స్నేహం, సజ్జనులతో కలిసి నడవటం’ అన్న అర్థాల నుంచి ‘సత్యం కై అన్వేషించే వారితో కలిసి తిరగటం’ అంటే – ‘సత్యాన్వేషణ’ అన్న అర్థం వరకు వస్తుంది. సత్యాన్వేషణ వలన, సత్యం తెలుసుకునే కొలది మనసు శాంతిస్తుంది. జీవిత పరమార్థం తెలుసుకోవటానికి సాధనంగా ఉపకరిస్తుంది. సాధకునికి అందుకే సత్సాంగత్యం అన్నది మొదటి అడుగుగా వర్ణించబడింది.

‘సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనమ్
సంభాషణం తీర్థకోటి వందనం మోక్షకారణమ్॥’ అని ఆర్యోక్తి.

సాధువులను దర్శిస్తే, వారితో గడిపి వారి నుంచి జ్ఞానము పొందగలగటము మోక్షానికి మార్గం.

సత్యాంగత్యం వల్ల మందబుద్ధి తొలగుతుంది. సత్సాంగత్యం సత్యమైన వాక్కులనే పలికిస్తుంది. పాపాన్ని దూరం చేస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. కీర్తిప్రతిష్ఠలను అంతటా వ్యాపింపచేస్తుంది. సత్సాంగత్యాన్ని కలిగియున్న భక్తులకు అందరి అభిమానం సులభంగా అందుతుంది. ఈ విధమైన బహుళ ప్రయోజనాలను అందించే సత్సాంగత్యం మనకు చేయలేని మేలు అంటూ ఏదీ ఉండదు.

మన ఊర్లలో భజన సమూహాలను ‘సత్సాంగత్యం’ అంటూ ఉండటం కద్దు. అంటే ఈ సమూహాలు నిజమైన, లేదా పరిపూర్ణమైన సత్యానికై, జీవితం పండించుకోవడానికి ఒక్క దగ్గర కూడినారు అని అర్థంగా చెప్పుకోవచ్చును.

సత్సాంగత్యం అన్న మాటను పరమ గురువులను కలవటం, సాధు పురుషులను కలవటం, లేదా పూజ్యులను కలవటం అన్న అర్థంలో కూడా వాడవచ్చు. మహానుభావులైన పూజ్యులను కలవటం అన్నది అందరికి సాధ్యం కాదు. దానికి సాధకునికి కొంత అదృష్టం కలిసిరావాలి. సాధు పురుషులు వారి ఉనికితో ఆ ప్రదేశాన్నీ పవిత్రం చెయ్యగల శక్తి కలవారు. అలాంటి వారిని కలవటం, వారి ఆసీస్సులను పొందటం అన్నది సాధకుని – సాధనకు ఎంతో ఉపకరిస్తుంది. అందుకే గురువులు, మహానుభావులతో ఎలాంటి సాంగత్యానికి అవకాశం వచ్చినా వదులుకోకూడదు.

సత్సాంగత్యం గురించి ఒక చిన్న కథ చెబుతారు పెద్దలు:

ఒకరోజు సత్సంగం మీద నారదుడికి సందేహం కలిగి విష్ణువు దగ్గరికి వచ్చి “స్వామి! సత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏంటి?” అంటే “దీనికి నేను ఎందుకు సమాధానం చెప్పడం! వెళ్లి అక్కడ ఒక పురుగు ఉంది దానిని అడుగు” అన్నాడు విష్ణు .

నారద మహర్షి పురుగు దగ్గరికి వెళ్లి “సత్సంగం అంటే ఏంటి? దానివలన ఉపయోగం ఏమిటి అని అడిగాడు.

పురుగు నారదమహర్శిని చూసి చనిపోయింది.

వెంటనే భగవంతుడి వద్దకు వచ్చి ‘స్వామి! సత్సంగం గురించి అడిగితే పురుగుని అడగమన్నారు. అడిగితే చనిపోయింది’ అన్నాడు.

భగవంతుడు నవ్వి ‘ఇప్పుడు ఆ పావురాన్ని అడగ’మన్నాడు. నారదుడు వెళ్లి పావురాన్ని అడిగాడు. పావురం కూడా మహర్షిని చూసి చనిపోయింది.

మహర్షికి ప్రేమ పుట్టి ‘అయ్యో! ఏంటి సత్సంగం గురించి అడిగితే ఇలా చనిపోతున్నాయి’ అని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్లి చెబుతాడు.

‘అదిగో ఇప్పుడే పుట్టిన లేగదూడని అడుగు సత్సంగం గురించి’ అంటాడు భగవంతుడు. వెళ్లి లేగదూడతో “సత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏమిటి’ అనగానే మహర్షి వైపు చూసి చనిపోతుంది. అప్పుడు నారదుడు భయపడి “ఇక సత్సంగం గురించి అడగను. అడిగితే చనిపోతున్నారు” అని నిర్ణయించుకుంటాడు.

మళ్లీ ఒక్కసారి భగవంతుడిని అడుగుదామని భగవంతుడి దగ్గరికి ధైర్యంగా వెళతాడు. వెళ్లి అడుగుతాడు. అయితే ఆ భగవంతుడు మాత్రం.. ‘చివరిసారిగా రాజ్యంలో అప్పుడే పుట్టిన యువరాజు ఉన్నాడు… వెళ్లి అడుగు’ అంటాడు.

అప్పుడు నారదుడు భయపడుతూ “ఇంతవరకు పురుగుని అడిగాను, పావురాన్ని అడిగాను, లేగదూడని అడిగాను కానీ అవన్నీ చనిపోయాయి. ఈ సారి ఈ పిల్లాడిని అడిగితే వీడికి ఏమౌతుందో! అని భయపడుతూ పిల్లాడి దగ్గరకు వెళ్లి నెమ్మదిగా చెవిలో అడిగాడు “సంత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏమిటి? అని.

పిల్లాడు నారదుడిని చూసి నవ్వుతూ ‘నారదా! నేను ఎవరో గుర్తుపట్టలేదా? నేనే ఆ పురుగుని, ఆ పావురాన్ని, ఆ లేగదూడని.. మీరు వచ్చి నాతో మాట్లాడడం వలన పురుగుగా ఉన్న నేను పావురాన్ని అయ్యాను. పావురంగా ఉన్న నేను లేగదూడగా పుట్టాను. మళ్లీ వచ్చి మాట్లాడడం వలన 84 లక్షల జీవరాసులలో కెల్లా ఉత్తమమైన ఈ మానవ జన్మ పొందాను. మనిద్దరి మధ్య ఉన్న సత్సాంగత్యం వలన అపురూపమైన మానవ జన్మను పొందగలిగాను. ఇదే సత్సంగం యొక్క గొప్పతనం’ అన్నాడు!

సత్సాంగత్యం గొప్పతనం అలాంటిది. ‘యోగావాశిష్ఠ గీత’లో వ్యాసులవారు “వివేకాః పరమో దీపో జయతే సాధు సంగమత్” అంటారు. వివేకం ఉన్నవారికి, మరింత వివేకం, లేనివారికి వివేకము ఇచ్చే సత్సాంగత్యం గురించి వివరిస్తారు.

సంసారం తరించటానికి సాధు సంగమమే సహకరి. సజ్జన సాంగత్యము ఒక చెట్టు అనుకుంటే, దానికి పూసే పుష్పములే వివేకం. ఆ వివేకం మోక్షానికి దారి చూపుతుంది. అందుకే సజ్జన సాంగత్యం అంత విలువైనది. దుష్టునికి సజ్జన సాంగత్యం వల్ల సుజనత్వం వస్తుంది. సజ్జనునికి దుష్ట సాంగత్యం వల్ల దుష్టత్వం రాదు. పూల సువాసన మట్టికి అంటుతుంది. మట్టి వాసన పూలకు రాదు కదా.

అందుకే ఆదిశంకరాచార్యుల వారు సత్సాంగాత్యాన్ని మోక్షమార్గాన్ని పొందటానికి మొదటి మెట్టుగా భజగోవింద స్తోత్రంలో వర్ణించారు:

“సత్సంగత్వే నిః సఙ్గత్వం
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం।
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః॥”

సజ్జన సాంగత్యం వలన ప్రాపంచిక విషయ సుఖాలమీద అవగాహన పెరిగి వాటి సాంగత్యానికి దూరమవుతాము. ఎప్పుడైతే విషయ సుఖాలకు దూరమయ్యమో వాటి మీద వున్న మమకారం, వ్యామోహం, ఆసక్తి తగ్గిపోతుంది. అలా నిశ్చలంగా వాటిమీద ఆసక్తి వదులుకోగలగటమే ఏకాగ్రత. ఏకాగ్రత సాధించిననాడు భాగవంతుని మీద నిశ్చలమైన ఏకాగ్రత పెరిగి చివరగా మేక్షానికి బాట వేస్తుంది.అందుచేత ముముక్షువుకి సత్సాంగత్యం మొదటి మెట్టు.

మోక్ష సాధన చేసే ప్రతి ఒక్కరూ మట్టిలా బురద చల్లే దుస్సంగత్యాన్ని వదిలి, ప్రయత్నపూర్వకంగా పువ్వులా పరిమళం వెదజల్లే సత్సాంగాత్యాన్ని వెతుక్కోవాలి.

“జాడ్యం ధియో హరతి వాచి సత్యం
మానోన్నతిం దిశతి పాపమపాకరోతి
చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం
సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్॥” అని భర్తృహరి పేర్కొన్నాడు.

అలాంటి సత్సాంగత్యం కోసం ప్రతి వారు కృషి చెయ్యాలి. సాధువుల దర్శనం కుదిరినంతగా చెయ్యాలి. తమ వంటి సాధకులతో కలసి చేసే ప్రయాణము వలన తగ్గ ఫలితాలు ఉంటాయి.సాధనకు చేయూతనిచ్చే సత్సాంగత్యం వెతికి పట్టుకోవాలి. మనము నివసించే ప్రదేశాలు, పరిసరాలు ప్రజల ప్రభావము మన జప తపాదులపై వుంటుంది. అందుకే తప్పక ప్రయత్నించి సత్సాంగత్యము ఏర్పాటు చేసుకోవాలి.

బాధ్యతలతో, బంధాలతో, వివిధ ఆకర్షణలతో, సమస్యలతో సతమతమవుతూ ఆధునిక జీవన విధానములో యాంత్రికమైన జీవనాన్ని కొనసాగిస్తూ తమ జీవితానికి గమ్యమేదీ, లక్ష్యమేదీ అని పరితపించేవారికి చందన స్పర్శ వలె చంద్రుని వెన్నెలవలె హాయిని ఆనందాన్ని కలిగించేది సత్సాంగత్యమే.

అలాంటి సత్సాంగత్యము సర్వులు పోందాలి.

ఽఽ స్వస్తి ఽఽ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here