సత్యాన్వేషణ-13

1
9

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

హిమాలయాలు పిలుస్తున్నాయి…

“అదృష్టో ద్రష్టాఽశ్రుతః శ్రోతాఽ మతోమన్తేఽవిజ్ఞాతో” (బృహదారణ్యకోపనిషత్తు 7.2.23)

[dropcap]చూ[/dropcap]చువాడే కానీ చూడబడేవాడు కాడు. వినేవాడే కానీ వినబడేవాడుకాడు. తెలియువాడేకాని తెలియబడువాడుకాడు. మననము చెయ్యబడేవాడు కాని చెయ్యువాడు కాడు. అతనే అంతర్యామి!

***  

హైద్రాబాదులో ఆనాటి రాత్రి వుండి మరురోజు ఉదయపు మొదటి విమానములో బయలుదేరాను రుషికేష్‌కు. హిమాలయ పర్వత పాదాల వద్ద వున్న చిన్న పట్టణము రుషికేష్. ఉత్తరాఖాండ్ రాష్ట్రము క్రిందికి వస్తుంది. పశ్చిమ హిమాలయాలను గర్హ్వాల్ డివిజన్‌గా పిలుస్తారు. ఈ గర్హ్వాల్‌ హిమాలయ పర్వత పాదాలను ముద్దాడుతూ వుండే సుందరమైన పట్టణము. ఒకవైపు పర్వతాలు, మరోవైపు గంగానది నడుమ వున్న ఈ పట్టణము ప్రసిద్ధమైన పుణ్యధామము. ఈ పట్టణము చేరటానికి రైలు మార్గము ఉత్తమమైనది. బస్సుల సౌకర్యము కూడా వుంది. మన దక్షిణ భారతదేశము నుంచి వెళ్ళటానికి ఢిల్లీలో రైలో, బస్సో, లేదా విమానమైనా మారాల్సి వుంది. సరాసరి అక్కడికి వెళ్ళటానికి మరో మార్గములేదు, మన సొంత వాహనమైతే తప్ప.

రుషికేష్ విమానములో వెళ్ళాలంటే మనము డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంటు విమానాశ్రయములో దిగాలి. అక్కడ్నుంచి అరగంట టాక్సిలో రుషీకేష్ చేరవచ్చు. డెహ్రాడూన్‌ పశ్చిమ హిమాలయాలకు చేరటానికి వున్న ఏకైక విమానాశ్రయము. అక్కడ విమానము దిగి మనము రోడ్డు పై ప్రయాణించాలి, పర్వతాలలో. డెహ్రాడూన్‌ చక్కటి శుభ్రమైన పట్టణము. నవీన పోకడలతో, సాంప్రదాయ పద్ధతులనూ కూడా అందచేస్తున్న ఈ చిన్న పట్టణము హిమాలయాలలో ప్రయాణించే యాత్రికులను ఆదరముగా స్వాగతిస్తుంది. చక్కటి స్టారు హోటళ్ళ నుంచి, మాములు బస వరకూ, శుభ్రమైన వివిధ ఆహారాలు అందుబాటులో వున్నాయక్కడ. భారతీయ మిలట్రీ అకాడమి అక్కడికి చాలా దగ్గర. చూడతగ్గ ప్రదేశాలు ఎన్నో వున్న ఆ పట్టణముకు ఢిల్లీ నుంచి విమానాలు, బస్సులు రైళ్ళ సౌకర్యము వీలుగా వుంటుంది. ఏ మార్గములో ప్రయాణమైనా ఢిల్లీలో మారాలి కాబట్టి నేను విమానములో వెళ్ళటానికి నిశ్చయించుకొని డెహ్రాడూనుకు విమాన టికెట్‌ కొనుకున్నాను.

ఢిల్లీకి ఉదయము ఏడు గంటల విమానము అందుకొని, ఢిల్లీలో నాలుగు గంటలు ఎదురుచూసి నా రుషీకేష్ విమానము అందుకున్నాను. రుషీకేష్‌కు చేరే సరికే దాదాపు మూడు గంటలయ్యింది.

హిమాలయాలు పూజ్య పర్వతశ్రేణులు, హిమముతో సదా నిండిన పర్వతాలు భారతదేశానికి కట్టని గోడ యని మా చిన్నతనములో చదువుకున్నాము. ఈ హిమాలయాల సందర్శనము నా జీవితములో మొదటిసారి. నా హృదయములో భావ పరంపరను వర్ణించటానికి అక్షరమాల చాలదేమో అనిపించింది. ఆ పవిత్రమైన పట్టణములో పదిహేను రోజులు గడపటమంటే మాటలా, నేను ఎంతో పుణ్యము చేసుకున్నాను అని సంతోషము కలిగింది. చాలా చిన్నప్పట్నించి హిమాలయాలంటే నాకున్న భక్తి చెప్పలేను. జీవితములో నాకు సెటిల్ అవటానికి చాయిస్ ఇస్తే నేను ఈ హరిద్వారో, రుషికేష్‌లలో సెటిల్ అయివుండేదాన్ని.

రుషికేష్ గంగ ప్రక్కనే, పర్వతపాదాల వద్ద వుండి పవిత్రతకు చిహ్నంలా మెరుస్తూ వుంటుంది. పురాణకాలము నుంచి ఎంతో శక్తివంతమైన క్షేత్రమిది. ఎందరో ఋషులు పవిత్ర గంగానది తీరాన తపస్సు చేశారట. ఇది పూర్వం ఋషుల వాటిక యని, అందుకే అది రుషికేష్ అని పేరుతెచ్చుకుంది అంటారు. మరో అర్థము విష్ణు నామాలలో ఒక నామము “రుషికేష” అన్న పేరు మీద వచ్చింది.

స్కాందపురాణములో ఈ పట్టణము యొక్క ప్రస్థావన వుంది. ఆ పట్టణములో రాముడు రావణుని చంపిన తదనంతరము, తన బ్రహ్మహత్యాపాతకము పోవటానికి ఇక్కడ పరిహారకర్మలాచరించాడట.

నేటికీ గంగాతీరములో కనపడని శరీరాలతో (ఆస్ట్రల్‌ బాడీస్స్) ఋషులు తపస్సు చేస్తారని నమ్మకము. అందుకే రుషీకేష్‌లో మనము ఏ దేవాలయాల కోసం ఆత్రపడక, ప్రశాంతముగా గంగానది వడ్డున కూర్చొని ధ్యానము చేసుకుంటే చాలు. పవిత్ర గంగానది మీద ‘లక్ష్మణ్ జూలా’ వంతెన అన్న (సస్‌పెన్షను బ్రిడ్జు)ను 1889లో నిర్మించారు. అది మన దేశములోని మొదటి వుయ్యాల వంతెన. ఆ ప్రదేశములో లక్ష్మణ స్వామి ఒక తాడు విసిరి గంగను దాటాడట. అందుకే పూర్వము అక్కడ ఒక తాడుతో వంతెన వుండేది. అక్కడే ఈ జూలా వంతెనను నిర్మించారు. తరువాత 1986లో ‘రామ్ జూల’ అని మరో వంతెన లక్ష్మణ్ జూలాకు కొద్దిగా ఎగువన నిర్మించారు.

“దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే।

శజ్కర మౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే॥”

(గంగా స్తోత్త్రము, ఆదిశంకర విరచితము)

దేవనది గంగా పర్వతాలలో 240 కిమీ. ప్రవహించి ఎన్నో చిన్న చిన్న నదులను కలుపుకుంటూ పూర్ణమై, ఈ పట్టణములోనే మొదట మనకు గంగానదిగా దర్శనమిస్తుంది. గంగానది గురించి తలుచుకుంటే హృదయము పులకరిస్తుంది భారతీయులకు. గంగానది పవిత్రత గురించిన ప్రస్తావన మనకు వేదాలనుంచి కనపడుతుంది. బుగ్వేదములో ఉదహరించిన నదీస్తుతిలో గంగానదికి ప్రథమ స్థానమున్నది. (నదీస్తుతి 10.75.5). శతపధ బ్రహ్మణంలో, ఐతరేయ బ్రహ్మణంలో ప్రస్తావన వుంది. రామాయణ భారతాలలో ఈ నది వివరాలు వున్నాయి. నారదపురాణములో ఈ పవిత్ర నది పుట్టక గురించి వివరముగా వుంది.

భగవద్గీతలో కృష్ణడు తనకీ, గంగానదికీ అభిన్నతను చూపాడు.

గంగమ్మతల్లి భారతదేశ గౌరవము. హైందవ ధర్మపు ‘గ’ కారపు ముక్కాలిపీటలో గంగమ్మ నది ముఖ్యమైనది. గీతా, గాయత్రి మరో రెండు కాళ్ళు. ఈ మూడు కాళ్ళ ముక్కాలి పీటపై నిలచి హైందవము పవిత్రతను చాటుతున్నది, వేదకాలము నుంచి. భౌతికముగా గంగ పుట్టిన చోటు గంగోత్రి.

పురాణాల బట్టి విష్ణువు పాదాలలో జన్మించినది గంగ. అందుకే ‘విష్ణుపదీ’ అన్న పేరు వచ్చింది.

భాగీరథుడు అన్న రాజఋషి గంగను భూమిపైకి తీసుకురావటానికి తపస్సు చేస్తాడు. అతని పూర్వులు కపిల మహర్షి శాపానికి గురై బూడిదకుప్పలుగా పాతాళములో వుంటారు. భగీరథుడు శివునికై తపము చేసి, గంగను భూమిపైకి రప్పిస్తాడు, అందుకే ఆమె ‘భాగీరథి’ అయ్యింది. స్వర్గము నుంచి వచ్చినది కాబట్టి స్వర్లోకగంగ. పాతాళముకు సాగింది కాబట్టి పాతాళగంగ. జహ్ను మహర్షి ఆశ్రమము ముంచెత్తి ఆయన త్రాగేసి తదంతరము చెవి గుండా విడుదల చేశాడు కాబట్టి ‘జాహ్నవీ’ అయ్యింది. మందాకినీ అన్న నది కలిసింది కాబట్టి ‘మందాకిని’ అని కూడా అంటారు. యమున, సరయు, గండకీ నదులు ఉపనదులు. బంగాళాఖాతములో కలిసే చోట పద్మ అంటారు. సముద్రములో కలిసే ముందు బ్రహ్మపుత్రాతో కలుస్తుంది. సమస్త పుణ్యధామాలు ఈ నది వడ్డున వున్నాయి.

గంగమ్మతల్లిని గురించి గానము చెయ్యని కవి లేడు భారతదేశములో. ఆది శంకరుల ఆదిగా, జగన్నాథ పండితుల సాక్షిగా, కాళిదాసు నుంచి నేటి రవీంద్రుని వరకూ గంగను గురించి గానము చేసినవారే.

మన తత్త్వశాస్త్రానికీ, ఆధ్యాత్మిక అనుశాసనానికి ప్రతినిధి గంగ. గంగను గంగామాత, భారతీయ జాతీయనది అని గౌరవిస్తారు, పూజిస్తారు.

గంగ ఉదకము త్రాగిన వారికి సర్వ పాపములు పోతాయని, చెడు ఆలోచనలు దరి చేరవని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పేవారు. ఎవరైనా చెడు తలపులతో వున్నా, ఇతరుల గురించి చెడు మాట్లాడినా వారిని గంగా జలముతో స్నానము చెయ్యమని చెప్పేవారు పరమహంస. అలా గంగను సేవించుకుంటే ఆధ్యాత్మికత పుట్టి, వారు ముక్తులవుతారని పరమహంస చెప్పేవారు.

గంగలో శాస్త్రోక్తముగా సాన్నము చేస్తే సర్వ పాపాలు తీరి వారు ముక్తులవుతారని మత్స్యపురాణము చెబుతుంది. ప్రజలకు సర్వ సంపదలనూ ఇస్తూ, మరణాంతరము ముక్తి ఇస్తున్న గంగమ్మ తల్లి కన్నా పవిత్రమైనది ప్రపంచములో లేదని భారతీయుల విశ్వాసము. ప్రపంచములో మరే నదినీ గౌరవించి పూజించనంతగా గంగానదిని పూజిస్తారు భారతీయులు.

ఆ నది ప్రక్కన్న జీవించటము పూర్వ పుణ్యము వల్ల మాత్రమే కుదురుతుంది. జన్మలో ఒక్కసారి అన్నా గంగా నదిలో పవిత్ర స్నానాలు చెయ్యటము హిందువులకు తప్పని సరి అయిన విషయము. నా జీవిత ధ్యేయము కూడా గంగకు అర్చన చెయ్యటము, కొద్ది కాలమన్నా ఆ నది ప్రక్కన వుండటము. నాకు అనిపిస్తుంది. నేను పూర్వజన్మలో గంగ ప్రక్కన వుండేదాన్నీ కానీ ఏదో దోషము చేసి గంగమ్మకు దూరమైనాను అని. నాకు స్వతహాగా వున్న భక్తితో ఆ నది వడ్డున కనీసము పది రోజులైనా వుండాలన్న సంకల్పముతో రుషీకేష్‌కు చేరుకున్నాను.

గంగానదికి హారతులు కూడా మనకు రుషీకేష్ నుంచి మొదలవుతాయి. గంగాహారతికి వారణాసి పెట్టినది పేరుకదా! మన తెలుగు పండితుడు, 17వ శతాబ్దపు వాడైన శ్రీ జగన్నాథ పండితుడు రచించిన ‘గంగాలహరి’ని గానము చేస్తారు వారణాసిలోని హారతులలో. జగన్నాధపండితుల వారిది ఒక ప్రత్యేకమైన చరిత్ర. వారు గొప్ప సంస్కృత పండితులు. ఆయన తన జీవితములో సింహభాగము వారణాసిలో నివసించారు. ‘రసగంగాధరమ’న్న అలంకార శాస్త్ర గ్రంథము రచించారాయన. ఆయన లవంగి అన్న మహ్మదీయ యువతని వివాహము చేసుకున్నాడట. వారణాసి వచ్చి గంగా స్నానానికి వస్తుంటే పండితులు కులభ్రష్టుడని, పవిత్ర గంగను తాకటానికి వీలులేదని అటకాయిస్తారుట. ఆయన గంగను తాకలేక విలవిలలాడుతూ ఆ తల్లిని చూస్తూ స్తోత్త్రం చేస్తాడుట. ఆయన చెప్పే ఒక్కొక్క శ్లోకాని ఒక్కో మెట్టు చొప్పున 52 మెట్లు ఎగబాకి గంగమ్మ తల్లి ఆయనను ముంచెత్తిందని కథనము. ఆ గంగాలహరి గంగమ్మతల్లికి ప్రియమైనదని హారతులలో అదే పాడుతారు.

“సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి తన్‌

మహేశ్వరం లీలాజనిత జగతః ఖణ్డపరుశో।

శ్రుతీనాం సర్వస్వం సుకృతమథ మూర్తం సుమనసాం

సుధాసోదర్యం తే సలిలవ శివం నః శమయతు॥” (గంగాలహరి)

అమ్మా గంగాభవానీ! నీవు ప్రపంచానికి సౌభాగ్యానివి. క్రీడావినోదములా పరమశివునిచే సృష్టించబడిన ఈ ప్రపంచానికి నీవు భాగ్యదేవతవి. నీవు వేదసారానివి. పరమాత్మ సకల జీవరాసులకూ ఆహారమివ్వటానికి సృష్టించబడినావు. మా సర్వపాపములనూ నశింపచేయును నీ జలము.

రుషికేష్‌లో గంగ వేగంగా, చాలా పరిశుభ్రంగా వుంటూ గలగల ప్రవహిస్తుంది. ఆ నీలి రంగు మనోహరముగా వుంటుంది. ఆ పాలపిట్ట రంగు నీలము మనకు చూడగానే పవిత్రమైన ఊహ కలుగుతుంది. రుషికేష్‌ ప్రపంచ యోగాకు కేంద్రమని పేరు. ప్రపంచములో అత్యంత గొప్ప యోగా గురువులు, అత్యధిక యోగా ఆశ్రమాలు ఇక్కడే వుంటాయి. అందుకే ఈ పట్టణమునకు విదేశీ యాత్రికులు చాలా మంది వస్తుంటారు ఫిబ్రవరి, మార్చిలలో. ఏప్రెల్ నుంచి భారతీయ యాత్రికులతో వూరు కళకళలాడుతుంది. చార్‌ధాముగా ప్రఖ్యాతి చెందిన యాత్ర రుషికేష్ నుంచే మొదలవుతుంది. (గంగోత్రి, యమునోత్రి, కేధార్‌నాథ్, బదిరి కలిపి చార్‌ధామ్ యాత్రగా ప్రసిద్ది).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here