సత్యాన్వేషణ-17

2
6

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]రు[/dropcap]షికేష్‌లో కొంత ముతకగా ఖద్దరు పోలిన వస్త్రాలు చూశాను. అవి వున్ని వస్త్రాల వంటివే కానీ ఫైనుగా నాజుకుగా లేవు. పరమ ముతకగా వున్నాయి. నాసి రకమేమో నాకు తెలియదు కాని, నాకు మాత్రం బాగా నచ్చాయి. చాలా మంది వాటిని వాడటము చూశాను. ఆఖరికి సాధువులు కూడా అవే కప్పుకు తిరుగుతున్నారు. నేను ఆ శాలువను, అదే మెటీరియల్లో చేసిన పైజామాను తెచ్చుకున్నాను. అక్కడ వున్నన్ని రోజులూ నాకు అవి బాగా పనిచేశాయి.

నేను రుషికేష్ చేరిన నాలుగు రోజుల తరువాత నా తలలో పేలు ఎక్కువై బయటకు ప్రాకటం మొదలయ్యింది. తల దువ్వటం లేదు. రోజు నీళ్ళలో మునగటమూ, రావటమూ కదా. పైపెచ్చు నాకు గాణుగాపురము నుంచి ఆ దురద ఇప్పుడు ఇలా పెరిగింది. ఇక తప్పక నేను పేల షాంపు కొని రాసుకున్నాను. దువ్వటము మాత్రము చెయ్యలేదు. ఆ షాంపు రాయగానే అన్నీ మాయమైనాయిలా వుంది, మళ్ళీ దురద రాలేదు.

రుషీకేష్‌లో నే వెళ్ళిన వారానికి పెద్ద వానతో మెరుపులు వురుములుగా కురిసింది. హిమాలయాలలో వాన చాలా ఎక్కువే. వాన రాగానే వీధులు బురదతో నిండటమూ సామాన్యమే. నేను ఎంతో తీవ్రతతో చేస్తున్న సాధనకు, నాకు ప్రతి నిముషము ఫలితముకై పిచ్చిగా ఎదురుచూడటమే సరిపొయేది. నా జపము లక్ష దాటినా నాకు ఎలాంటి సమాధానము దొరకటంలేదు. అది నాకు పరమ నిరుత్సహమును కలిగించిన విషయము. ఓపికగా ఎదురుచూడటము రానేరాదు నాకు. అలాంటి వాన కురిసిన ఒక రాత్రి కరెంటు లేదు. పిచ్చ వాన. మెరుపులు. నేను ఆ మెరుపులలో గుడి శిఖరాన్నీ, మర్రి చెట్టును చూస్తూ శ్రీదత్తుని ప్రార్థిస్తూ కూర్చున్నాను.

“నాకు ఫలితము కావాలి. లేదా కనీసము నేను సరి అయిన దారిలో వున్నానని నాకు సమాధానము కావాలి” అంటూ నేను దత్తుని అదే పనిగా మొరపెట్టుకున్నాను. సుఖవంతమైన జీవిత విధానము, పైలాపచ్చీసులా తిరుగుతూ మిత్రులతో అదే సుఖమనుకుని తిరిగే నేను అన్నీ వదిలి బిక్షువులా పాత్ర చేత పట్టుకు, మఠము నిద్ర సత్రం భోజనములా తిరుగుతూ, శరీరముపై వ్యామోహము వదలటానికి చెయ్యవలసినంత ప్రయత్నం చేస్తూ, ఒంటిపూట భోజనముతో సదా శ్రీగురుని చింతతో తిరుగుతూ అలిసిపోయాననిపించింది. నాకు ‘ఎందుకు జీవించాలి నేనసల’ని ప్రశ్న హృదయాంతరాలలో మొలిచింది. ఆ రాత్రి కంటికి మింటికి ఏకమైనట్లుగా బయట వర్షానికి తోడుగా కన్నులూ వర్షిస్తూనే వున్నాయి.

“యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైన సుఖం భూమా త్వేవ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి।” (ఛాందోగ్యోపనిషత్తు 23.1)

అనంతమైనది మాత్రమే సంతోషము. అంతమయ్యే స్వభావము వున్న దేనిలోనూ సుఖం లేదు.

ఆధ్యాత్మికత పదునైన కత్తి. అది మనలోని అహంకారాన్నీ రకరకాలుగా, అన్నీ వైపుల నుంచి తెగ నరుకుతుంది. ఆ ప్రయాణము పరమ ఒంటరి ప్రయాణము. ఎవరికి వారే చేయ్యవలసినది. ఎవరి ప్రయాణము వారిది. వారి కర్మలననుసరించి సాధన వుంటుంది. రామకృష్ణ పరమహంసకు ఏ మంత్రమైనా ఒక్క మాల త్రిప్పగానే ఆ మంత్రాది దేవత ముందు ప్రత్యక్షమయ్యేది. కొందరికి జీవితమంతా చేసినా ఫలితము కనిపించదు. కారణము వారి కర్మల బట్టి వుంటుంది కదా. అందుకే ఇదే మార్గమని చెప్పటానికి లేదు. ఇది సరి అయినది అని కూడా చెప్పలేము. అలా చెప్పగలిగేది కేవలము ఆ వ్యక్తి యొక్క ‘గురువు’ మాత్రమే! ఆయనే దయతో ఆర్తితో దగ్గరకు తీసుకు దారి చూపుతాడు.

నా గురువును కలవకపోతే, వారిని గురించి తెలియకపోతే నేను చేస్తున్న ఈ ప్రయత్నం పరమ వృథా. గంగమ్మ తల్లే నాకు శరణము. నేనారాత్రి మెరుపుల నడుమ పరిపరి విధాలా విచారిస్తూ ఏ తెల్లవారు జాముకో నిద్రపోయాను. ఉదయము మా అక్కయ్య ఫోను చేసింది.

***

ఆమెకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ, నేను మాములుగా లేనని అర్థమయ్యింది. తను ప్రాణిక్ హీలర్‌. ‘ప్రాణిక్ హీలింగ్’ అన్నది వ్యక్తిని ప్రత్యక్షముగా ‘తాకకుండా’ బాధపడుతున్న వారి రుగ్మతకు స్వస్థత కూర్చే ఒక ప్రక్రియ. వారి సిద్ధాంతము ప్రకారము ప్రతి వారి శరీరములో తమను తాము నయము చేసుకునే ప్రక్రియ వుంటుంది. దానినే ‘ప్రాణా(ఎనర్జీ)’ అంటారు. ఆ ప్రాణా కనుక సరిగ్గా వుంటే మనిషికి ఎలాంటి ఇబ్బందులూ రావు. ప్రాణాలో తేడాల మూలముగా రకరకాల భావ పరంపరలు, అసౌకర్యాలు, శరీరిక మానసిక రుగ్మతలు వస్తాయి. ప్రతి మనిషి శరీరములో ఆరు (షట్‌) చక్రాలుంటాయని యోగశాస్త్రము చెబుతుంది. కానీ ఈ హీలర్సు ప్రకారము ఆ చక్రాలు 12. ప్రతి వారికి, వారికి వచ్చే తేడాలు ముందుగా వారి ఆరాలో కనపడుతాయి. మంచి ప్రాణాతో ఆ చక్రాలు సరి చేస్తే మనిషికి జబ్బులు రావు.

ఈ ఆధునిక హీలింగిను ప్రసాదించిన గురువులు గ్రాండుమాష్టారు చోవా కోక్ సూయి. ఆయన ఫిలిఫిన్స్‌కు చెందిన వారు. ముప్పై సంవత్సరముల తన జీవితాన్ని ప్రజల మానసిక, భౌతికమైన ఇబ్బందులను తొలగించటానికి వాడారు ఆయన. వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీరైన ఆయన తన చిన్నతనము నుంచి ఆధ్యాత్మికతపై ఆసక్తితో వుండేవారు. హిమాలయాలలో కొన్ని సంవత్సరములు గడిపారు. అందరికీ సులువుగా తెలిసేలా, అర్థమయ్యే విధముగా ప్రాణా గురించి వివరిస్తూ 20 పుస్తకాలను రచించి, ప్రచురించారు. ఆయన ప్రపంచమంతటా పర్యటించి హీలింగును నేర్పుతూ, పంచుతూ గడిపారు. “మనకు విద్యుత్చక్తి గురించి తెలియని నాడు కూడా ప్రపంచములో విద్యుత్తు వుంది. దానిని అందుకోవటానికి సమయము పట్టింది. అలాగే మనకు తెలియని నాడు కూడా ప్రాణా శక్తి వుంది. దానిని అందుకొని అవసరమైన వారికి పంచటము మన కర్తవ్యము” అని బోధించేవారు. ఆయన గొప్ప టీచరు. అంతకు మించి హీలరు. దాదాపు వంద ప్రాణిక్ హీలింగు సెంటర్లను ప్రపంచమంతటా స్థాపించారు.

ప్రాణిక్ హీలరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. సత్కర్మలు చెయ్యమని, నలుగురికీ ఉపయోగపడే పనులు చెయ్యమని చెబుతారు. వారి సేవలు చాలా మటుకు ఉచితముగా వుంటాయి కానీ, విద్య మీద గౌరవము పోకుండా వుండటానికి వారు కొంత డబ్బు తీసుకుంటారు. ఆ హీలింగ్ విధానములో మనకు వచ్చే “ప్రాణా” (ఎనర్జీ) వివరాలు బాగా అర్థమవుతాయని చెబుతారు. వారు తమ చేతులలో ప్రాణశక్తి యొక్క స్పర్శను ఫీల్‌ అవుతూ హీలింగు చేస్తారు. హీలింగుకు ఉప్పు నీరు వాడుతారు. ఉప్పు చాలా త్వరగా చెడును తీసివేస్తుందని చెబుతారు. అందుకే మన పెద్దవాళ్ళు దిష్ఠి తీసేటప్పుడు ఉప్పు వాడుతారు.

మా అక్కయ్యకు భవిష్యత్తు గురించి ఊహలు కలుగుతాయని నా అనుభవము. ఆమె మాతో ఆ విషయము చెప్పదు కాని కొన్ని సార్లు మాత్రమే చటుక్కున తెలిసిపోతుంది. చాలా ఎనర్జీబాడీ వున్నదామెకు. కారణము ఎన్నో సంవత్సరముల సాధన వుంది కదా. మనకు ప్రతేక్యముగా ఇదీ అని తెలియదు కానీ తన సమక్షములో ప్రశాంతముగా వుండగలరు ఎవరైనా.

ఫోను చేసి “ఎలా వున్నావు?” అంది.

“నడుస్తోంది” అన్నాను హీనస్వరమున.

“నీ పరిస్థితి బాలేదు. నీకు ఎనర్జీ ఎక్కువై స్టక్ అవుతోంది. ఫ్లో లేదు. ఈ రోజు ఏమీ చెయ్యకు. బయటకు వెళ్ళి నాలుగు చోట్లూ చూసి రా” అంది ఆజ్ఞగా.

‘నిజం. నా పరిస్థితి బాలేదు. గంగాశరణము మమః ఈవిడకెలా తెలిసింది’… అనుకున్నాను. గంగకు వెళ్ళి మాములు జపము చేసుకున్నా, ఆశ్రమానికి వచ్చాక నేను తయారై బయటకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నా.

మన దేశపు కర్మ భూమిలో హిమాలయాలు శక్తి వంతమైనవి. అసలు పర్వతాల వద్ద, నదీ తీరాలలో, దేవాలయాలలో శక్తి (ఎనర్జీ కేంద్రాలు) ఎక్కువగా వుంటుంది. అక్కడ చేసే ధ్యానానికి త్వరగా ఫలితముంటుంది. అందుకే కదా దేవాలయాలలో పూజ కాని, జపము కాని చేయ్యాలంటారు.

మనకు అసలు శరీర వ్యాయామము లేక, ఒక ముహుర్తం చూసి వ్యాయామము మొదలెడితే, అదీ చాలా పెద్ద ఎత్తున మొదలెడితే శరీరము ఎలా ఎక్కడికక్కడ పట్టేసి కదలటానికి మొరాయిస్తుందో, ఎనర్జీ బాడీ కూడా అతిగా చేసే ధ్యాన ప్రక్రియ వల్ల అలా పట్టేస్తుంది. ఎనర్జీ అన్నది శరీరపు చక్రాలలో క్రిందకూ పైకి తిరుగుతూ వుండాలి. అలా కాకపోతే మనకు శరీరపు రుగ్మతలు కలుగుతాయి. మన శరీరములో సహస్రారము, అంటే నడినెత్తిలో వున్న చక్రము వద్ద నుంచి కానీ, ఆజ్ఞా చక్రము నుంచి కానీ ఎనర్జీ మన లోనికి వస్తుంది. అందుకే మన పెద్దలు బొట్టుకు అంత ప్రాముఖ్యతనిచ్చారు. ప్రతిరోజూ బొట్టు పెట్టుకుంటూ మనము మన నుదుటిమీద తగులుతాము కదా, అలా మన ఆజ్ఞా చక్రము యాక్టివేట్ అయి మనలోనికి మంచి ఎనర్జీని పంపుతుంది. ఈ ఎనర్జీలను తెలుసుకోకుండా సాధనలు చేస్తే ఒక్కోసారి వారికి మతి భ్రమణము కూడా సంభవిస్తుందని హెచ్చరిస్తారు తెలిసినవారు.

మొండిగా అలాగే చేసే వారికీ పరమాత్మ ఏదో విధముగా సరిచేస్తూ వుంటాడు కదా. ఇప్పటి మా అక్కలా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here