సత్యాన్వేషణ-22

0
11

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]వ[/dropcap]శిష్ఠుడు అక్కడ పని పూర్తి చేసుకు వచ్చే సరిగా ఇక్కడ యజ్ఞము జోరుగా జరుగుతూవుంటుంది.

కులగురువుకు చెప్పక యజ్ఞము చేస్తున్నందుకు కోపగించి విదేహుడవి కమ్మని శపిస్తాడు వశిష్ఠుడు.  నిమి సంకల్పబలముతో యాగము పూర్తిచేస్తాడు. అతని యాగఫలము చిరంజీవిత్వము కాబట్టి ప్రజల కన్ను రెప్పల మీద నిలిచి వుంటాడట. అందుకే మానవులు కనురెప్పలు కొట్టుకుంటాయని, మానవులను అందుకే ‘నిమీషులు’ అంటారని పురాణ కథనము.

వశిష్ఠ మహర్షి తరువాత కర్దప్రజాపతి కుమార్తె అయిన అరుంధతిని వివాహము చేసుకుంటాడు. ఆమె పతివ్రతా శిరోమణి. వివాహాలలో అరుంధతి నక్షత్రము చూడటమన్నది తప్పని ఆచారము. కారణము వశిష్ఠ నక్షత్రము, అరుంధతీ నక్షత్రము రెండూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ వుంటాయి. భార్యాభర్తలు అలా వుండాలని మన పెద్దల ఆలోచన అయి వుండవచ్చు. ఆమెకు ఇసుక ఇచ్చి వండమంటే ఆమె శక్తి చేత ఇసుకను అన్నముగా మార్చి వండినదట. వశిష్ఠుల వారికి నీడలా వుండే మహసాధ్వి ఆ తల్లి.

వశిష్ఠులవారి ఆశ్రమానికి విశ్వామిత్రరాజు వస్తాడు. విశ్వామిత్రుడు ఋషి కాక మునుపు రాజుగా పాలించేవాడు. ఆయన వేటకు వెళ్ళి అలసి వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెడతాడు. అందరికీ భోజనాలు నందినీమాత అన్న కామధేనువు సంతతి ఆవు ఇస్తుంది. అడిగినవన్నీ తీర్చే ఆ ఆవు తనకు ఇవ్వమని విశ్వామిత్రుడు కోరుతాడు. వశిష్ఠుడు నిరాకరిస్తాడు. సైన్యముతో బలప్రయోగము చేయ్యబోతే నందినీమాత ముఖము నుంచి వేల కొలది సైన్యం పుట్టి విశ్వామిత్రుని సైన్యాన్ని నాశనము చేస్తారు. విశ్వామిత్రుడు రాజు కన్నా ముని శక్తిమంతుడని గ్రహించి తన రాజ్యం వదిలి వెళ్ళి తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేసినా ఆయనను బ్రహ్మర్షి అని వశిష్ఠుడు వప్పుకోడు. కోపముతో విశ్వామిత్రుడు వశిష్ఠుని నూర్గురు కుమారులని చంపుతాడు. వశిష్ఠుడు కోపగించడు కానీ సమాధానము చెప్పడు. బ్రహ్మర్షి అని కూడా అనడు. ఏమీ చెయ్యలేక విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సు చెయ్యటానికి వెడతాడు.

అలా కుమారులను కోల్పోయిన వశిష్ఠుడు దుఃఖముతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఆయన నదిలో దూకపోతే నదీమతల్లి ఆయనను తెచ్చి ఇక్కడ వదిలింది. అప్పటికే అక్కడికి అరుంధతిమాత వచ్చి ఆయన కోసము నిరీక్షిస్తూ వుంటుంది. ఆ అందమైన గంగాతీరమూ, సుందరమైన అడవి, ప్రశాంతముగా వుండి వశిష్ఠుడు అక్కడే నివాసమేర్పుచుకుంటాడు. ఆయన అలా ఆ గుహలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకుంటాడు.  అక్కడికి దగ్గరలో మరో గుహ అరుంధతి మాతది. ఆ గుహ వాతావరణము కూడా చాలా శక్తివంతమైనది, వశిష్ఠుని తపస్సు చేత.

వశిష్ఠుడు మహాజ్ఞాని. జనక మహారాజు జ్ఞానబోధ చెయ్యమని అడిగితే “యోగమంటే ధ్యానమే! అది రెండు రకాలుగా వుంటుంది. మనస్సున ఏకాగ్రవృత్తి అనేదొకటుంది. సగుణభావముతో ప్రాణాయామము ఫలప్రదమవుతుంది. నిర్గుణభావముతో ఏకాగ్రత లభిస్తుంది. ఈ రెండూ యోగము వల్ల సాధ్యమవుతాయి” అని ‘అవ్యక్తము, జ్ఞానము’ వంటివి వేదాంత పరిభాషలో వశిష్ఠుడు బోధిస్తాడు. ‘అది ఎవరికీ చెప్పకూడదని కేవలము తీవ్ర జిజ్ఞాసులే ఆ యోగము తెలియటానికి అర్హుల’ని చెబుతాడు వసిష్ఠుడు. వశిష్ఠ – జనక సంవాదమనే అధ్యాయము మనకు మహాభారతములో శాంతి పర్వములో కూడా కనపడుతుంది. వశిష్ఠులవారు రామునికి ఉపదేశించిన జ్ఞానయోగ విశేషాల ‘యోగవాశిష్ఠముగా’ ప్రఖ్యాతి కెక్కిన గ్రంథము, పరమ పూజ్యమైనది. జిజ్ఞాసువుకు సహాయకారి. సాధకులు తప్పక చదవ వలసిన గ్రంథము ఇది.

వశిష్టులవారు నివసించి, తపస్సు చేసినందుకు ఆ గుహ ఎంతో శక్తి మంతమైయ్యింది. నదికి కేవలము 2000 అడుగుల ఎత్తున వుంటుంది. ఆ గుహను చాలా కాలము ప్రజలు గుర్తించలేదు. 1928లో శ్రీ పురుషోత్తామానంద గురువులు దానిని చూచి అందులో నివసించారు. ఆయన అందులో దాదాపు 25 సంవత్సరాలు తపస్సు చేసుకున్నారు. భక్తులు ఆయనకు ఒక గది కట్టి ఇచ్చే వరకూ ఆయన అక్కడే ఆ గుహలో వుండేవారు. ప్రక్కన గది కట్టాక అందులోకి మారారు. ఇప్పుడు  శ్రీ పురుషానంద ట్రష్టు ఆ గుహను సంరక్షిస్తున్నారు.

అది చాలా పెద్ద గుహ. లోపలికి దాదాపు 700 అడుగులు వుంటుంది. దాని ముందర చిన్న రేకుల వరండా, గుహకు తలుపులు బిగించి వున్నాయి.  నేను వెళ్ళినప్పుడు తలుపులు తెరిచే వున్నాయి. నేను నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. దానికి ప్రవేశ రుసుములేదు. లోపల కటిక చీకటిగా వున్నది. కాని క్రింద చాపలు పరచి కూర్చొని ధ్యానము చేసుకోవటానికి వీలుగా వున్నాయి. చాలా శుభ్రముగా వుంది అక్కడ. అగరువత్తుల ధూప సువాసన, మూలకు నూనె దీపము వెలుగుతోంది. ఆ దీపము ఒక శివలింగము ముందర వుంది. చీకటిలో నెమ్మదిగా ఒక్కోక్కటే కనపడుతున్నాయి నాకు.

నేను నెమ్మదిగా నడుచుకుంటూ లోపలి దాకా వెళ్ళి, శివునికి నమస్కరించి ఒక ప్రక్కగా కూర్చున్నాను. కొద్దిగా చల్లగా, చాలా శాంతముగా వుంది. సన్నని వెలుతురులో ఆ ప్రశాంత వాతవరణములో చాలా హయి అయిన ధ్యానము కుదురుతుంది. నేల పైన మెత్తటివి చద్దరులు పరిచి వున్నాయి.

“ధ్యాతుం ఇచ్ఛా దిధ్యాసా”

“నిరంతర ధ్యాతుం ఇచ్ఛా నిదిధ్యాసా”

ధ్యానము చెయ్యాలన్న కోరిక దిధ్యాసా. నిరంతరము తీవ్రంగా ధ్యానము చెయ్యాలనుకొవటము నిదిధ్యాస.

ఆ గుహలో మనము నిదిధ్యాస దిశగా వెడతాము. అక్కడ అంతర్లీనముగా ప్రవహిస్తున్న శక్తి అలాంటిది.  నాకు కొంతసేపటికి శివుని ప్రక్కన తేజం వున్నట్లుగా మెరుపు కనపడింది. నా బ్రాంతికి నేను చికాకు పడాను. కొంత సేపు కూర్చొని ధ్యానము చేశాక మనసులో గైడు బయట వున్నాడని, ఎదురుచుస్తూ వుంటాడన్న ఆలోచన చాలా డిస్ట్రబింగుగా అనిపించింది.  చేసేది లేక తప్పక, ఒక గంట తరువాత లేచి వస్తే అతను బయట ఎదురుచూస్తూ వున్నాడు.  నన్ను అరుంధతి గుహ, ఆపై గంగ వైపుగా నడుద్దాము రమ్మని తీసుకువెళ్ళాడు.

కొంత వరకు ఫ్లాట్‌గా వున్నా తరువాత మెట్లు. క్రింద కాఫర్‌సల్ఫైటు రంగులో గంగ, ప్రక్కన అడవి. మనుష్యులు తిరగటము మొదలెట్టినప్పుడే, ఇప్పుడే ఇలా వుంటే ముని తపస్సునకు వచ్చినప్పుడు ఇంకెంత సుందరముగా వుండి వుంటుందో. కనీసము స్వామి పురుషోత్తామనందా గురుజీ వచ్చినప్పుడు కూడా అంతే సుందరమైన పరిసరాలు అయి వుండాలి ఇవి. తలుచుకుంటే నాకెంతో హాయిగా అనిపించింది.

గైడు చెప్పాడు చాలా మంది విదేశీ భక్తులు ఇక్కడకొచ్చి రాత్రులు గుహలో వుండి ధ్యానము చేస్తారట. వారికి చాలా చక్కటి అనుభవాలు అవుతాయట. ఒకసారి ఒక భక్తురాలికి ధ్యానము చేసుకుంటూ వుంటే ఎలక్ట్రిక్ లైటులా ఒక తేజం గుహంతా తిరిగి బయటకు పొయ్యిందని, కొందరికీ గురుజీ దర్శనము అయిందని, మరికొందరికి వశిష్ఠుల వారి దర్శనము జరిగిందని చెప్పుకొచ్చాడు. దక్షణ భారత చలనచిత్ర నాయకుడు (హీరో) ఒకరు ఇక్కడ ధ్యానము చేస్తాడు అని కూడా చెప్పాడు. అన్నింటికి తల ఊపూతూ నేను పరిసరాలను చూస్తూ నడిచాను. గంగ మీద చిన్న బోటులో కూడా యాత్రికులు అక్కడకు రావటము కనిపించింది. వారు గంగ మీద వచ్చి, అక్కడ దిగి ఆ గుహకు వస్తున్నారు. గుహకు యాత్రికుల తాకిడి ఎక్కువే. రుషీకేష్‌కు దగ్గరగా వున్నందుకు కాబోలు. ట్రస్టు వారు చాలా ఆదరముగా వున్నారు యాత్రికుల పట్ల.

మేము బయటకు వచ్చి టీ త్రాగి తిరిగి రుషీకేష్‌కు వచ్చేశాము.  నన్ను లక్ష్మణ్ ఝూలా వద్ద దింపుతూ “దీదీ నీలకంఠ చూడు కుదిరితే” అని సలహా ఇచ్చి తుర్రుమన్నాడా కుర్రాడు. నేను అక్కడ షేరు ఆటో ఎక్కి తిరిగి మఠానికి వచ్చేశాను. మఠములో అర్చకస్వామి నా ప్రయాణము ఎలా జరిగిందని ఆదరముగా అడిగారు. వశిష్ఠగుహ నాకు చాలా నచ్చింది. రాత్రి వుండేలా వెళ్ళాలని అనుకున్నా, నాకు ఆ ట్రిప్పులో కుదరలేదు.

***

“సూక్ష్మశ్చ, మహాంతశ్చ, ప్రత్యగాత్మ భూతశ్చ” – సూక్ష్మమైన వాడు, అత్యంత శక్తిమంతుడు ప్రత్యగాత్మగా అన్ని జీవులలో వుండే వాడు పరమాత్మ.

నా దేవప్రయాగ ప్రయాణము తరువాత మరురోజు నేను నా మాములు పద్ధతిలో నిత్యపూజ, గంగా స్నానము చేసి జపము చేసుకున్నాను. ఆ సాయంత్రము పరమార్థనికేతనుకు బయలుచేరాను. అక్కడ స్వామిజిని నేను కలవలేదు కదా. నా గురువు ఆయనేమో అన్న ఒక గాఢ భావనతో నేను వుండివున్నాను కూడా. నన్ను అక్కడ వుంచకపోయిన పరిస్థితులను అనుమానించలేదు. అసలు నేనూ ఒక్క శాతము అనుమానము కూడా వుంచుకోదలుచుకోలేదు. దానికో కారణముంది. చాలా సిల్లీ అయిన విషయము కాని నేను ప్రతి పుట్టను కొట్టదలచాను, సందేహము మిగుల్చుకోకూడదు (want to hit every bush).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here