సత్యాన్వేషణ-28

0
7

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]అం[/dropcap]తేకాదు ఈ యోగనారసింహుడు ప్రతి సంవత్సరము కొంత కొంత చొప్పున భూమిలోకి క్రుంగుతూ వుంటాడట. ఆయన ఎడమ చెయ్యి ప్రతి ఏడాది కొద్ది కొద్దిగా అరుగుతూ వుంటుంది. ఆ అరుగుదల ఎక్కువై చెయ్యి విరిగినప్పుడు బదిరి భూమిలోకి వెడుతుందట. అప్పటి నుంచి భవిష్య బదిరి అని అక్కడికి ఇరవై కి.మీ. దూరములో నారాయణుడు వెలుస్తాడని చెప్పారు.

భూగర్భ శాస్త్రవేత్తలు కూడా జ్యోషిమఠ్ వున్న ప్రదేశము క్రుంగే ప్రదేశమని నిర్దారించారు. మనము ఉదయము అభిషేకము కనుక చూడగలిగితే మనకు ఎడమ చెయ్యి కుడి చెయ్యి కన్నా సన్నగా స్పష్టముగా కనపడుతుందట. నేను అది చూడటానికి వెళ్ళాలనుకున్నా కానీ నా ఆరోగ్యసమస్యతో లేచి వెళ్ళలేకపోయాను.

నే వెళ్ళే సరికే అభిషేకము, అర్చన చేసి వున్నారు. అలంకారముతో దేవుడు కన్నులపండుగగా కనిపిస్తున్నాడు. ఒక ప్రక్క బదిరి నారాయణుడు. దర్శనము చేసుకున్నాను మనఃపూర్తిగా.

“సంసార దావదహనాకరభీకరరు-
జ్వాలావళీ భిరతి దగ్దత నూరు హస్య
త్వత్పాదపద్మ సరసీ రుహ మాగతస్య
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్‌॥”
( లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రము)

కానీ జ్యోషిమఠ్‌లో నాకు కలిగిన అనుభవము మాత్రము చాలా సంతోషాన్ని ఇచ్చింది. మఠములోని సాధుమహారాజ్ ఫోను చేసి హనుమానుచెట్టికీ రమ్మని పిలిచారు. వచ్చి టీ త్రాగమని పిలిచారు కానీ, నాకు త్వరగా మైదానాలకు వెళ్ళాలని అనిపించి వెనక్కు తిరిగాను.

***

రుషీకేష్‌ తిరిగి వెనకకు వెళ్ళేటప్పుడు నేను ధారాదేవి దేవాలయము వద్ద ఆగాలనుకున్నాను వెళ్ళేటప్పుడే.

“ఆత్మాత్వం చాసి మాతః పరమసి భగవతి త్వత్పరాన్నైవ కించిత్।
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే॥
కాలాభ్రాం శ్యామలాంగీం విగళిత చికురాం ఖడ్గముండాభిరామాం।
త్రాసత్రాణేష్టదాత్రీం కుణపగణ శిరోమాలినీం దీర్ఘనేత్రాం॥”
(కాళీ స్తోత్రం)

శ్రీనగరు వూరు దాటాక, రుద్రప్రయాగ ముందర మనకు ఆ దేవాలయాము వస్తుంది.

అమ్మవారి పేరు ధారాదేవి. ఆమె కాళీ అవతారము. స్థలపురాణములో అమ్మవారి తల ఇక్కడ, మొండెము రుద్రప్రయాగకు మరోదిక్కుగా పడినాయట. భక్తులు ఆ అమ్మవారిని శక్తి వంతమైన దేవిగా ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారి తల మాత్రమే వుంటుంది.

అలకనందా ప్రక్కనే వుంటుంది ఈ దేవాలయము. ఆ ఎగువన ఒక హైడ్రో ప్రాజెక్టు ‘తెహ్రీ’ కడుతున్నారు. ఆ ప్రాజెక్టు మూలముగా ఈ దేవాలయము మునిగిపోతుందని, ఆ దేవాలయాన్ని మరో చోటకు మార్చాలని నిశ్చయించారు. కథనము బట్టి అక్కడ నుంచి అమ్మవారు తలను కదల్చినప్పుడు భూమిలో కలిగిన కదలికలకు కేదారునాథ్‌లో వున్నమందాకినికి వరదలు వచ్చాయని నమ్ముతారు.

2013 లో అనుకోకుండా హిమాలయాలల్లో కురిసిన వర్షానికి కొండలు కరిగి, బండలు కదిలి చాలా వూర్లు నదీ ప్రవాహములో కొట్టుకుపోయాయి. ఆనాటి వరదలో కేదారనాథ్ శివాలయము కొట్టుకుపోకుండా ఒక పెద్ద గండశిల అడ్డుకున్నది. దానిని భీమశిల అంటారు. ఆ శిల గుడి వెనకకు వచ్చి ఆగినందున కేదారనాథ్ దేవాలయము చెక్కుచెదరలేదు. కానీ ప్రక్కన వున్నవన్నీ కొట్టుకుపోయాయి.

ఆ అకారణ వరద చాలా మంది యాత్రికులను, ఆస్తినీ మాయము చేసింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి తీరని నష్టాన్నీ ఇచ్చింది. అది మనకు తెలిసిన వరదలలో అత్యంత దారుణమైన గంగా వరద.

అక్కడ వున్న పెద్దలు చాలా మంది ఈ వరదకు కారణము ధారాదేవిని ఆమె స్థానము నుంచి కదపటము వలనేనని నమ్ముతారు.

ధారాదేవి శక్తిని అక్కడ ప్రజలు చాలా నమ్ముతారు. ఆమెను ఏదైనా కోరి పూజించి ఒక గంట కట్టి వెడతారు. వారి కోరిక తీరిన తరువాత అమ్మవారికి సారె పట్టుకు వస్తారు మేళతాళాల మధ్య ఊరేగింపుగా. అమ్మవారికి పసుపు, కుంకుమ, ఎర్ర చీర, ఎర్రగాజులతో పాటు మరో గంట తీసుకువస్తారు.

సంభావనలతో కలిపి ఈ గంటను పూజించి దేవాలయములో కడతారు. అలాంటి ఉత్సవము ఒక దానిని చూశాను నేను. వారు తెచ్చిన గంట పెద్దది. పెళ్ళి వూరేగింపు పోలిన హడావిడితో ఆనందపు నృత్యాలతో వారు ఒక గంటను దేవాలయానికి తెచ్చారు. దేవాలయములోనికి తీసుకుపోయి పూజించి కట్టారు.

ఇక్కడి  నీటిలో మునిగిన ఈ దేవాలయము 200 సంవత్సరాల నుంచి వుందిట. అంతకు పూర్వము పాత దేవాలయము వుండేది. ఇప్పుడు అక్కడే ఎత్తుగా కట్టిన స్తంభాలపై ఒక గదిలా, హాలు వంటిది కట్టి అందులో అమ్మవారిని వుంచారు. అదో చాలా టెంపరరరీ కట్టడములా కనపడుతుంది. పూర్తి స్థాయి దేవాలయము ఇంకా కట్టవలసి వున్నది. ఇప్పుడు వున్న ఈ దేవాలయానికి మనము అర కిలోమీటరు వంతెన మీద వెళ్ళాలి. ఆ వంతెన పూర్తిగా గ్రిల్ వేసి వుంది. కానీ కోతులు చాలా వున్నాయి. ఆ వంతెన మీద నడవటానికి కొంత భయము కలగటము సహజము. దేవాలయము కోసము వేసిన స్లాబ్ కూడా పూర్తి కాలేదు. కొంతమేరకు ఓపన్‌గా వుంది. అక్కడికి వెడితే ఎవరన్నా పడే ప్రమాదము కూడా వుంది. అది విశాలమైనది అని చెప్పలేము. యాబై మంది వస్తే ఆ దేవాలయములో పట్టరు.

ఈ అమ్మవారిని అక్కడి రాష్ట్ర రాజకీయనాయకులు చాలా విశ్వసిస్తారట. అందరూ అమ్మవారి దర్శనానికి వస్తారని చెబుతారు. రోడ్డు మీద నుంచి మనము చాలా మెట్లు దిగి క్రిందికి వెళ్ళాలి. మరో వైపుగా రోడ్డు వున్నది వంతెన వరకూ కానీ దానిని మూసివేశారు. నేను దిగి అమ్మవారికి పూలు గాజులు కుంకుమ కొంటే, గంట కొనమని అడిగింది దుకాణములో స్త్రీ.

నేను మనసులో, మళ్ళీ ఇక్కడికి వస్తే గంట కడతాను అమ్మవారికి, అని అనుకున్నాను. మెట్లు దిగి క్రిందికి వెళ్ళి, వంతెన మీదుగా కోతుల ప్రక్కగా మెల్లగా దేవాలయమన్న ఆ విశాలమైన హల్ వంటి దానికి వెళ్ళాను.  అందులో ఒక గట్టు మీద ఒక పెద్ద ముఖము విగ్రహము వుండి చుట్టూ ఎర్రని చీరని కప్పి వుంచారు. చాలా కళగా వున్నది తల్లి ముఖము. ప్రక్కన చిన్నచిన్న అమ్మవారులు (పరివార దేవత)ల తలలు వున్నాయి. అందరికీ ఎర్రని చీరలు కట్టి వుంచారు.

అమ్మవారు వున్న అరుగుకు, భక్తులకు మధ్య పెద్ద గ్రిల్ వుంది. లోపల పూజారులు వుండి భక్తుల పేర్లు అడిగి సంకల్పము చెబుతున్నారు. కొందరు భక్తులు వున్నారు అక్కడ అప్పటికే. నేను కొద్ది దూరములో కూర్చొని, ధ్యానము చేసుకున్నాను.

“లోలజిహ్వే దురారోహే నేత్రత్రయవిభూషితే । లోలజిహ్వే హరాలోకే
ఘోరహాస్యత్కరే దేవీ కాళికాయై నమోఽస్తుతేథ”
(కాళీ తాండవ స్తోత్త్రము)

జగదంబను నాకు గురువును ప్రసాదించమని, నాకో మార్గము చూపమని పరిపరి విధాలుగా ప్రార్థించాను. కళ్ళు తెరిస్తే పూజారి రమ్మని పిలిచాడు. నేను గ్రిల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నా.

పేరు, గోత్రము అడిగి సంకల్పము చెప్పారాయన. 

మాట కలుపుతూ “ఎక్కడ్నుంచి వచ్చావు” అన్నారు పూజారిగారు

“హైద్రాబాదు” అలవాటుగా చెప్పాను.

“నీవు వుండేది హైద్రాబాదా” కొద్దిగా ఆశ్చర్యముతో అన్నాడు. నాకు నుదుటన పెద్ద తిలకము దిద్ది దానిపై బియ్యం అంటిచాడు. చేతికి ఎర్రతాడు కట్టాడు. చిన్న ఎర్రటి వస్త్రము, మీఠాయి నా చేతికి ఇచ్చి, తలపై చెయ్యిపెట్టి దీవించాడు. నేను తోచిన సంభావన అక్కడ పెట్టి నమస్కరించి లేచి వస్తుంటే “నీవు ఇక్కడదానివి కావు. బయట నుంచి వచ్చావు. బయట దేశము నుంచి” అన్నాడు.

నేను ఆశ్చర్యముగా చూసి, ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేశాను.

‘నా ఏ పద్ధతి చూసి ఆయన అలా తీర్మానించారో, అలా అనుకొని వుంటాడో’ అనుకున్నా. నేను తిక్కలో ఏలియన్‌లా యాక్టు చేస్తున్ననా?…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here