సత్యాన్వేషణ-38

1
7

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ప్ర[/dropcap]తివారిలో పరమాత్మ వున్నాడు. ఆ సత్యం గ్రహిస్తే ఎవ్వరినీ ద్వేషించము. సర్వులకు ప్రేమను అందించమని చెబుతారు, విశ్వంజీ. సర్వమును తనలో, తనను సర్వములో చూడమని చెబుతారు.  పరమాత్మను హృదయములో కనుగొనమని చెప్పి ప్రేమ తత్త్వమును, పరబ్రహ్మ తత్త్వము పంచే విశ్వంజీకి ఎందరో భక్తులు.

వారు అట్లాంటా వచ్చారని, మిత్రుల ఇంట వున్నారని తెలిసింది. నేను వీలు వెంటనే బయలుదేరి ఆయన దర్శనానికి వచ్చేశాను. నేను వచ్చేసరికే వారివి మధ్యాహ్నాపు పూజా ఇత్యాదివి ముగిశాయి. విశ్రాంతిగా వున్నారు, వారికి ఇచ్చిన గదిలో. భక్తుల హడావిడి తగ్గింది. నన్ను ఆయన రమ్మన్నారు. నేను వెళ్ళి వారి పాదాలకు నమస్కరించి నేల మీద వారి ఎదురుగా కూర్చున్నాను.

ఆయన పడక్కుర్చీ వంటి దాంట్లో కూర్చొని వున్నారు.

“కర్పూర కాంతి దేహాయ, బ్రహ్మమూర్తిధరాయచ,
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ! నమోఽస్తుతే.”

మనిషి పండులా పచ్చగా వున్నారు. ఆయన వేసుకున్న కాషాయ వస్త్రము, లాల్చీ వంటివి ఆయన వంటి రంగు ముందు వెలవెలబోతున్నాయి. నుదుటన గంధపు బొట్టు, తల మీద జుట్టు వంపులు, అట్టలుగా, తీగలుగా, వుంది. తెల్లని గడ్డము, ప్రశాంతమైన వదనము. భక్తుల రద్దీ లేనందునా, ఆయన కూడా విశ్రాంతిగా శాంతముగా అనిపించారు. అంతకు పూర్వము మా వూరిలోని సాయి దేవాలయములో ఆయనను చూశాను దూరము నుంచి. భక్తులు ఆ హడావిడి అంతా చూశాక దూరము నుంచే నమస్కరించి వచ్చేశాను.

ఇండియాలో కూడా ఆయన వస్తున్నారని మా అక్క ఒకసారి నన్ను రమ్మనమని చెప్పి, తను ముందుగా దేవాలయము వెళ్ళిపొయ్యింది. నే వెళ్ళే సరికే ఆయన ఉపన్యాసము ఒక ప్రక్కన, జన సముద్రము మరోప్రక్కన. నాకు జనమంటే వుండే సహజ భయంతో నేను వచ్చేశాను. తరువాత అక్క నన్ను కోప్పడింది, ఆయన ఆసీస్సులు పొందే అవకాశము కోల్పోయానని.

నాకు ఆయనతో ఇటువంటి సమావేశము రాసి వున్నందునేమో పూర్వము నేను ఆయనను కలవలేదు.

ఆయన నన్ను అడిగారు…. “వ్యక్తిగతమైనమైన ఇబ్బందులు ఏమైనా వున్నాయా?” అని….

నేను తల అడ్డంగా వూపాను…

“మనము జన్మ ఎందుకు ఎత్తుతాము?” అని అడిగాను

“కర్మ అనుభవించటానికి” అన్నారాయన.

“మానవులుగా జన్మించిన వారి కర్తవ్యము” అడిగాను

“ప్రేమను పంచుతూ జీవించటమే.. సర్వములో పరమాత్మను చూడటమే”

“అందరి మీద ప్రేమ ఎలా వుంటుందండి? కొందరి మీద కోపము పోదు వద్దనుకున్నా….” చెప్పాను నేను..

“సర్వత్రా వున్నది ఒకే పరమాత్మ అన్న ఎరుక కలిగితే కోపమెందుకు వస్తుంది? మన మీద మనకు కోపము రాదుగా…” అన్నారు విశ్వంజీ

“ముక్తి పొందటము ఎట్లా ఈ జీవితములో” నా తదుపరి ప్రశ్న…

“సద్గురువును ఆశ్రయించటము ద్వారా” చెప్పారు వారు….

“బాబాను గురువుగా నమ్మిన తరువాత మళ్ళీ మరో గురువు కావాలా” అడిగాను… దీక్షగా చూస్తూ..

“బాబానే మనకు కావలసిన రూపున వచ్చి మనలను ఉద్ధరిస్తారు” అన్నారాయన.

 నాకు కన్నీరు ఆగలేదు…. నేను నన్ను నేను నిభాయించుకుని

“స్వామి సర్వము గురువేనని నమ్మి, వారి దర్శనము కోసము తపిస్తూ, తప్పిపోయిన లేడిలా తిరుగుతున్నా…. ఈ జన్మలో వారిని కలుస్తానా? నాకు దారి కనపడుతుందా…… మానవ జన్మ ఎత్తి కూడా సద్గురువులను చూడకనే రాలిపోతానా… కృపతో నా గురువును నన్నూ కలపండి…” అంటూ కన్నీరుతో ఆయన పాదాలను తాకాను….

ఆయన దయగా తలపై చెయ్యివేశారు.

నేను నన్ను నేను సంబాళించుకుని నెమ్మదించాను. ఆయన కాసేపు శూన్యములోకి చూస్తూ వుండి పోయారు…..

తరువాత నా వైపు చాలా కరుణగా చూస్తూ “నీ గురువుకు నీకు కనెక్షను కలిసే వుంది. వారిని తప్పక కలుస్తావు…. ఎప్పుడో నే చెప్పలేను. కానీ ఈ జన్మలోనే కలుస్తావు” అన్నారు…

నాకు వెయ్యి ఏనుగల బలము వచ్చింది.

ఆయన ఇచ్చిన పండును ప్రసాదముగా తీసుకొని మరో మారు వారికి నమస్కరించి వచ్చేశాను.

***

కొన్ని కుటుంబ కారణాల వలన వెంటనే మళ్ళీ హైద్రాబాదు వెళ్ళవలసి వచ్చింది. ఆసారి అక్కడే వుండిపోవల్సి వచ్చింది కూడా. నాలుగు నెలలు. ఆ సమయములో కృష్ణానదికి పుష్కరాలు. రమ్మనమని చుట్టాలు పిలిచారు. కానీ వెళ్ళలేకపోయాను. ఆసుపత్రి డ్యూటీ సదా వుండటమొకటి, జనము గుమి వుంటే వెళ్ళటమంటే నాకున్న సహజ భయం వల్ల కూడా.  నా మిత్రుడు ఒకతను నారాయణపేటలో పనిచేస్తాడు. కృష్ణానది అక్కడే తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నన్ను రమ్మనమని, జనము లేని చోట రాజ మర్యాదలతో పుష్కర స్నానము చెయ్యవచ్చని పిలిచాడు. నాకు దేవుడి దగ్గర రికమెండేషన్లు నచ్చవని వెళ్ళలేదు. నేను రావటము లేదని, మా పిన్నివాళ్ళు నన్ను బలవంతముగా మంత్రాలయము పట్టుకుపోయారు.

మంత్రాలయము రాఘవేంద్రస్వామి వారి సంస్థానము. మధ్వులు ఎక్కువగా రాఘవేంద్రుని పూజిస్తూ కనపడతారు మనకు. వారిలో ప్రస్ఫుటముగా కనపడేది వారి ఆచారాల వ్యవహారాల మీద వున్న నిబద్ధత. మధ్వాచార్యుల పరంపరకు చెందిన పీఠమిది. దాని గురించి నాకు తెలిసినంత వరకూ ఆ మఠము వారు నేటికీ వారి వ్యవహారములో ఆచారమును ఒక్క పిసరు కూడా సడలించని ఆచారవంతులు.

మధ్వ ఆచార్యులైన ఆ మఠము వారు ‘జీవుడు – పరమాత్మ’ అన్న ద్వైత సిద్ధాంతాలని నమ్ముతారు. కుంభకోణానికి చెందిన సర్వజ్ఞ పీఠమైన ఈ మధ్వపీఠానికి సుధీంద్ర తీర్థులు గురువులు. వీరి వద్దకు వెంకటనాథుడనే పేద బ్రాహ్మడు వెడతాడు, ఆశ్రయము కోసము. వెంకటనాథుడు పుట్టుకతో మహా మేధావి. ఆయన వెంకటేశ్వరస్వామి వర ప్రభావమున తిమ్మణాచార్యులు, గోప్పమ్మ దంపతులకు 1595లో జన్మించాడు. మూడవ యేట అక్షరాభ్యాసము చేయించి ‘ఓం’ కారము పలకపై రాయిస్తే, ‘ఒక్క అక్షరము నారాయణ స్వరూపమెట్లా అవుతుంద’ని తండ్రిని ప్రశ్నించే సూక్ష్మగ్రాహి.

వెంకటానాథుడు ఒకనాడు ఒక యజ్ఞ సంతర్పణకు వెళ్ళినప్పుడు ఆయన్ని గంధం తీయమని చెబుతారు. అగ్నిసూక్తం పఠిస్తూ తీసిన గంధం రాసుకున్న పండితులకు వళ్ళు మంటలు రేగాయి. వెంకటనాథుడు తప్పు గ్రహించి వరుణసూక్తం చదువగా అందరూ శాంతించారు. వీరు మహాత్ముడని గ్రహించారు అంతా. వెంకటనాథునికి సరస్వతీ అన్న ఆమెతో వివాహము జరుగుతుంది. ఒక కుమారుడు కూడా కలుగుతాడు. వారిని దరిద్రం చాలా బాధిస్తూ వుంటుంది. భార్య కోరికపై వారు కుంభకోణము బయలుచేరుతారు. అక్కడ గురువుల సేవలో కొద్దిగా కుటుంబాన్ని సాగించవచ్చని అనుకుంటాడు వెంకటనాథుడు.

గురువులు ఆదరిస్తారు. మఠములో మూలరాముని పూజించటము, తెల్లవారు జామున మఠము సేవ, విద్యార్థులకు బోధించటము, గురువుల వద్ద న్యాయసుధ అభ్యసించటము, దినచర్య అయినది. కఠోర నియమాలు పాటిస్తూ గురువు వాత్సల్యము చూరకొంటాడు వెంకటనాథుడు. శిష్యుని పాండిత్యము చూచి ‘మహాభాష్యం వెంకణ్ణాచార్యు’ లని బిరుదు కూడా ఇస్తారు గురువు.

ఇలా వుండగా, సుధీంద్ర తీర్థులు ఒకనాడు వెంకటనాథుని పిలిచి తన తరువాత మఠానికి బాధ్యత వహించమని, సన్యాసము తీసుకోమని ఆజ్ఞాపిస్తారు. అలా చెప్పటానికి కారణము ఆయనకు కలలో మూలరాముని ఆజ్ఞ.

వెంకటనాథుడు ఏమీ చెప్పలేకపోతాడు. ఆనాటి రాత్రి ఆయన కలలో వాగ్దేవి కనిపించి ఆయనకు పూర్వజన్మ వృత్తాంతములు వివరించి ‘శ్రీ విద్యా’ మంత్రం ఉపదేశిస్తుంది.

 (సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here