సత్యాన్వేషణ-39

2
6

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]కు[/dropcap]మారునికి ఉపనయనము చేసి, భార్య అనుమతి కోరుతాడు. విలవిలలాడే భార్యను అన్నకు అప్పచెప్పి సన్యసించ వెళ్ళిపోతాడు వెంకటానాథుడు. కుంభకోణములో ఆయనకు సన్యాస దీక్ష, రాఘవేంద్రతీర్థులని నామకరణము జరుగుతుంది. మఠములో మూలరామ పూజ చేసే ఆయనలో మధ్వాచారుల సన్నిధి అనుభవించేవారు అందరూ. ఆయన గురువాజ్ఞపై దేశ సంచారము చేస్తూ ఉడిపి, పాండురంగం వెడతారు. పాండురంగములో రంగడు సన్నిధిలో పాటలు పాడుతారు. పురంధర దాసు దర్శనము కలుగుతుంది. శ్రీశైలము, తిరుపతి, కాంచీపురము, వృద్ధాచలము, శ్రీముష్టము వంటి దివ్యదేశాలను చుట్టివస్తారు. ఈ యాత్రలో శ్రీ రాఘవేంద్రస్వామి చూపిన అద్భుతాలు ఆశ్చర్యము, అనంతము.

ఆయనను భిక్షకు పిలిచిన భక్తుని ఇంటిలో వంటల వద్ద ఆడుకుంటున్న మూడు సంవత్సరముల వారి కుమారుడు నీళ్ళ గంగాళములో పడి మరణిస్తాడు. ఇంటివారు వణికిపోతూ స్వామికి తమకు కలిగిన శౌచం గురించి చెబుతారు. స్వామి ఆ శిశువును తెమ్మని మూలరాముని అభిషేకించిన జలమును చల్లగా ఆ పిల్లవాడు బ్రతుకుతాడు.

స్వామి వద్ద వున్న శిష్యుడు తను వివాహము చేసుకోవాలని అనుమతి కోరుకుంటాడు. ఆయన ఆ సమయములో మృత్తిక స్నానములో వుంటారు. ఆ శిష్యునకు కొంత మృత్తిక ఇచ్చి వెళ్ళమని ఆశీర్వదిస్తారు. ఈ శిష్యుడు వారి గ్రామము వెడుతూ ఒక బ్రాహ్మణ గృహములో ఆగుతాడు. వారింట గృహిణికి కాన్పు సమయము. పిల్ల పుట్టగానే వారింట కనపడని శక్తి పిల్లలను చంపుతూ వుంటుంది. ఈనాడు కూడా రాబోయి, రాలేక ఆగి స్వామి శిష్యునకు ఆయన చెంగులోని మట్టిని అవతల పారవెయ్యమని అడుగుతుంది. శిష్యుడు ఆ మట్టిని ఆ దుష్టశక్తి మీద వేస్తే అది నశిస్తుంది. గృహస్తు సంతోషపడి, వారి అన్న కుమార్తెను వివాహము చేసికోమని కోరుకుంటాడు.

స్వామి మరో శిష్యుడు వివాహనంతరము స్వామి వద్ద పరిపూర్ణ ఆయుష్షువంతుడని దీవెనలు తీసుకుంటాడు. ఆ రాత్రి అతనిని పాము కరుస్తుంది. అతని భార్య స్వామి వద్దకు పరుగున వచ్చి గొల్లుమనగా, స్వామి ఆ పాము విషమునకు విరుగుడుగా తపఃజలము చల్లుతారు. శిష్యుడు బ్రతుకుతాడు.

మరో గ్రామములో ఒక వేదద్వేషి వుంటాడు. వేదపండితులను అవమానించి, హేళన చేస్తూ వుంటాడు. రాఘవేంద్రస్వామి ఆ వూరు వచ్చినప్పుడు వేద పండితులు ఆయన వద్ద వీడి ఆగడాల గురించి గోల పెడతారు. స్వామి అతనిని రమ్మని, అతని సందేహమేమిటో అడగమంటాడు. అతను రోకలికి ఆకులు తెప్పిస్తే, వేదాలను నమ్ముతానని లేదంటే తన్నులు తప్పవని బెదిరిస్తాడు. స్వామి ఆ రోకలిని భూమిలో మొక్కవలె నాటమని, ప్రతిరోజూ మూలరాముని అభిషేక జలముతో తడుపుతారు. మూడవనాడు ఆకులు మొలచి, నాలుగవనాడు పనస కాయ వస్తుంది. ఆ మూర్ఖుడు భయపడి శరణువేడుతాడు. వేదములను పరిహసించిన కర్మ పాపము తప్పదని చెప్పి స్వామి అచ్చటి నుంచి యాత్ర సాగిస్తారు.

రాఘవేంద్రస్వామి హుబ్లిలో వుండగా దార్వాడు నవాబు కుమారుడు పాముకాటుకు మరణిస్తాడు. ఆ కుమారుని ఖననము చేస్తారు. స్వామి, ఖననము చేసిన బాలుని బయటకు తీయ్యమని, మూలరాముని అభిషేక జలము ఆ బాలునిపై చిలకరిస్తే, బాలుడికి ప్రాణాలు వస్తాయి. నవాబు ఎంతో సంతోషించి అగ్రహరము కానుకగా ఇస్తాడు. స్వామి ఆ అగ్రహారమును బ్రాహ్మలకు దానము చేసి తంజావూరు వెడతారు. అక్కడ 12 సంవత్సరాలు వుండి ధర్మబోధలు చేసి కుంభకోణము తిరిగి వెడతారు. కుంభకోణములో మఠమునకు వేరొకరికి అప్పగించి మైసూరు వైపుగా వెడతారు. దారిలో భక్తులను కాపాడుతూ ధర్మప్రచారము సాగిస్తూ ఆదోని చేరుతారు. ఆదోని నవాబు వద్ద మంత్రి వెంకన్న. ఆ వెంకన్న స్వామి భక్తుడు. పూర్వము స్వామి యాత్రలో అతని ఇంటి ముందు మూలరాముని పూజచేసి తీర్థం ఇస్తారు స్వామి. వెంకన్న స్వామి వద్ద మంత్రం తీసుకొని, మంత్రసిద్ధి పొంది ఆదోని నవాబుకు మంత్రిగా అవుతాడు. రాఘవేంద్రస్వామిని తన ఇంటికి తీసుకుపోయి, నవాబును కూడా రమ్మని పిలుస్తాడు. నవాబు పళ్ళెములో మాంసం పెట్టి, పైన వస్త్రం కప్పి అవి స్వామి స్వీకరించాలంటాడు. అలా స్వామిని పరీక్షించాలనుకుంటాడా నవాబు. స్వామి ఆ గుడ్డ మీద జలం చల్లి ఆ బట్టను తియ్యమని శిష్యులకు చెబుతారు. తీస్తే అన్నీ మధురఫలములే వుంటాయి. అవి అందరికీ పంచుతారు. నవాబు స్వామి మహిమలు చూచి భక్తుడై, నగరాలను దానము చెయ్యబోతే, వద్దని మంచాల గ్రామము మాత్రము ఇవ్వమని చెబుతారు స్వామి. మంచాల తుంగభద్ర నది వడ్డున వున్న చాలా చిన్న గ్రామము.

ఆ గ్రామములో పూర్వము ప్రహ్లాదుడు హోమము చేసిన ప్రదేశము. గ్రామ దేవత మంచాలమ్మ అమ్మవారు రేణుక రూపము. ఆ గ్రామమే మంత్రాలయము.

కేరళ నుంచి వచ్చిన ముగ్గురు జ్యోతిష్కులు స్వామి జాతకము చూస్తామని అనుమతి కోరుతారు. ముగ్గురూ మూడు రకాలుగా చెబుతారు. స్వామి 75 సంవత్సరాలుంటారని ఒకరు, 300 అని ఒకరు, 700 అని ఒకరు చెబుతారు.

స్వామి మూడు నిజమని ముగ్గురిని సత్కరించి పంపుతారు. అదేమని అడిగిన శిష్యులకు 70 భౌతికముగా, 300 సంవత్సరముల బోధలూ,700 సంవత్సరములు భక్తులను అనుగ్రహిస్తూ వుంటామని

చెబుతారు స్వామి. స్వామి బృందావనము తయారు చెయ్యమని దివాను వెంకన్నకు చెబుతారు. అందమైన బృందావనము చూచి, బావుందని, కానీ ఆ రాయి కాదని మాధవరము అన్న గ్రామములో మరో రాయిని సూచించారు. అరణ్యవాసములో రాముడు ఆ రాయి మీద కొంత సేపు కూర్చొని సేదతీరారట. ఆ రాయి అలా ప్రత్యేకమైనదని రాఘవేంద్రస్వామి చెబుతారు. ముందు చేసినది ఆయన తరువాత ఐదవ గురువులు వాడుతారని కూడా చెబుతారు. ఆ రాయితో బృందావనము తయారవుతుంది. దివాన్‌ మల్లన 700 సాలగ్రామాలు తెప్పిస్తాడు స్వామి ఆజ్ఞపై. స్వామి శ్రీ మూలరాముని పూజ, అభిషేకము చేసి, వేదఘోషల మధ్య, తుంగభద్ర గలగలల మధ్య, హరినామ సంకీర్తనల పారాయణాల మధ్య, విరోధి సంవత్సరమున, శ్రావణ బహుళ విధియ 11-8-1671 న సజీవ సమాధిగా బృందావన ప్రవేశము చేశారు.

స్వామి శిష్యుడు అప్పణాచార్యుడు స్వామిని తనుండగా సమాధి అవవద్దని కోరుకుంటాడు. అందుకే స్వామి అతనిని ముందే తీర్థయాత్రలకు వెళ్ళమని పంపిస్తాడు. స్వామి బృందావన ప్రవేశం గురించి తెలిసి యాత్ర మధ్యలో పరుగున వస్తాడు. తుంగభద్ర వరదగా వుంటుంది. అప్పణ స్వామి మీద స్తోత్త్రం చేస్తూ వస్తూ వుంటే, తుంగ రెండుగా చీలి దారి ఇస్తుంది. అప్పణ మంత్రాలయము చేరేసరికే స్వామి బృందావనము మూసి వెయ్యబడి వుంటుంది. చదువుతున్న స్తోత్రం చదవలేక గొంతు పూడిపోయి అప్పణాచార్యులు మూగబోతారు. బృందావనములోంచి ఆ చివరి పాదము వినపడుతుంది. భక్తిగా చదివినవారికి అది నేటికీ కల్పవృక్షమై కోరికలు తీరుస్తుంది.

మంత్రాలయము మహా దివ్యక్షేత్రము. రాఘవేంద్రస్వామి మహా తపస్వి మాత్రమే కాదు, గొప్ప కవి, సంగీత విద్వాంసులు. పండితులు కూడా. 33 స్తోత్రాలు, కావ్య వ్యాఖ్యానాలూ, ఉపనిషత్తుకు, భగవద్గీతకు, మీమాంశకూ వ్యాఖ్యానాలు రచించారు. పూర్వపు ప్రహ్లాదుడే ఈ రూపములో జన్మించినారని భక్తుల నమ్మకము. బ్రహ్మచే పూజలందుకున్న మూలరాముడి పూజ చెయ్య మానవరూపము పొందిన సత్యలోకవాసి ఆయన. ఆ మూలరాముని మనము నేటికీ మంత్రాలయములో చూడవచ్చును. మంత్రాలయము మన తెలుగు నేలపై వుండటము మన తెలుగు వారి అదృష్టము. భక్తులు సేవించి, చరిత్ర పారాయణము చేసి, భక్తితో పిలిస్తే బృందావనము నుంచి పలికే రాఘవేంద్ర స్వామి నేటికీ పరమ సత్యం.

పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్యధర్మరతాయ చ।
భజతాం కల్పవృక్షాయ, నమతాం కామధేనవే।।

నేను ఆ బృందావనము చూచి కొంత నెమ్మదించాను. నాకు స్వామి వారి మీద చిన్నప్పటి నుంచీ భక్తికి కారణము మా నాన్నగారు చాలా మంత్రాలయము వెళ్ళి వస్తూ వుండేవారు. మమ్మల్ని చిన్న పిల్లలుగా వున్నప్పుడు తీసుకుపోయారు కూడా. ఆ బృందావనానికి అడుగడుగు దండాలు పెట్టటము మాకలవాటుగా వుండేది. మళ్ళీ తమ్ముడు సహాయముతో నేను బృందావనానికి అడుగడుగు దండాలు పెట్టాను. నాకు గురు దర్శనము కలిగించమని గురురాఘవేంద్రులను ప్రార్థించాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here