సత్యాన్వేషణ-43

0
9

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]మ[/dropcap]రురోజు పిల్ల లేవక మునుపు లేచి నే తయారై ఒక్కదాన్నే దేవాలయానికి వెళ్ళిపోయాను. నాకు దేవాలయము చాలా నచ్చింది. అణువణువు పరమశివుని ప్రకాశవంతమైన శక్తిని, ఆయన కృపను నేను అనుభవించాను. శివుడు పెద్దగా వున్న చతుర్ముఖుడు. లోపలికి ఎవ్వరికీ ప్రవేశము లేదు. నాలుగు వైపులా తలుపులు వున్నా, రెండు వైపుల తలుపులే తీశారు. అక్కడ పూజారులను రావల్‌జీ అంటారు. వారు దక్షిణభారతదేశము నుంచి వస్తారు. వారు నేపాలు రాజుకు జవాబుదారులుగా వుంటారు.

వాళ్ళకు దక్షిణ ఇచ్చిన వారికి, మెడలో రుద్రాక్ష మాలలు వేస్తున్నారు. అక్కడ భారతీయ రూపాయికి విలువ ఎక్కువే. నే దక్షిణ ఇచ్చిన వెంటనే నా మెడలో రుద్రాక్షల మాల వేసి నుదుటిన తిలకము దిద్దాడు రావల్జీ. మాలలు అలా నాకు ఆ ట్రిప్పులో చాలానే వచ్చినా, నేను నా బంధుమిత్రులకు కానుకగా ఇచ్చేశాను తరువాత.

ఆ రోజు ఒక పాండా సహాయముతో నమక చమకాలతో శివాభిషేకము చేసుకున్నాను.

ఆ ప్రాంగణములో చాలా గుడులున్నాయి. చిన్నవి మందిరాలున్నాయి. ఒకవైపు నుంచి నది వైపుకు పెద్ద ద్వారము, మెట్లు. అటు వెడితే అది గౌరి ఘాటు. భాగుమతి నది వడ్డున శ్మశానము వుంది. శవాలు కాలుతూనే వున్నాయి మణికర్ణికలోలా…

ఆ నది లోతుగా వుంది. దానిపై వంతెనలు… నది మరోవైపున ఎన్నో శివాలయాలు వరుసగా వున్నాయి. శివునికి పూజాపునస్కారములు లేవు. కొన్ని మందిరాలాలో కొందరు జులాయిలు కూర్చొని సిగరెట్ త్రాగుతూ పేకాడుతున్నారు. నేను ‘శివశివా’ అనుకొని వచ్చేశాను.

రుద్రాక్షలకు కాట్మండు పెట్టిన పేరు. మంచి రుద్రాక్షలు దేవాలయపు ముందర వున్న షాపులలో దొరుకుతాయి. మనము మన హోటలు వారి నడిగి మంచి షాపులో నాణ్యమైనవి కొనవచ్చును. ఆ దేవాలయములో మూడు రోజులు గడిపాను. చాలా పుణ్యదేవాలయాలకు విహారయాత్రలా కాక సాధన చెయ్యటానికి వెళ్ళాలని పెద్దలు చెబుతారు. మహాత్ముల జీవితాలలో కూడా అలా ఒక పుణ్యధామము చూసుకొని జపము చేసి ముక్తి పొందారని మనకు చాలా ఉదాహరణలు కనపడుతాయి. అందుకే నేను అటు వంటి పద్దతిని అనుసరించే ప్రయత్నం చేస్తూ వుంటాను. ఖాట్మాండులో నేను కేవలము మూడు రోజులు పరమశివుని కొలుచుకోగలిగాను అన్న మాట అలా వుంచితే, పిల్లతో వచ్చినప్పుడు కనీసము ఈ మాత్రమైనా నా సాధన చేసుకున్నానని తృప్తి కలిగింది.

“న జనకో జననీ న చ సోదరో న తనయో న చ భూరిబలం కులమ్।
అవతి కోఽపి న కాలవశం గతం భజత రే మనుజా గిరిజాపతిమ్॥”

***

నేను వాలంటీరు చేస్తున్న సంస్థ వారు వేసవిలో అమెరికాలోని హైస్కూలు పిల్లలను ఇండియాలో ఆ సంస్థవారి స్కూళ్ళకు తీసుకుపోతారు. ఈ అమెరికా పిల్లలకి భారతీయ విద్య, స్కూల్సు, జీవనవిధానము పరిచయము చెయ్యటానికి, ఆ గిరిజన, అంధ బాలబాలికలలో ఆత్మవిశ్వాసము నింపటానికి ఈ కార్యక్రమము ఉద్దేశించబడింది. అది చాలా సమర్ధవంతముగా నడుస్తున్న కార్యక్రమము. ఎందరో దీని మూలంగా అటు వారు, ఇటు వారు కూడా, ఎన్నో నేర్చుకుంటున్నారు.

ఆ కార్యక్రమములో హైస్కూలు పిల్లల తోడుగా పెద్దలు ఛాపరాన్స్‌లా పిల్లల కూడా వెళ్ళి వారిని పర్యవేక్షించాలి. నేను అలా ఆ విద్యార్థులతో మళ్ళీ ఇండియా వచ్చాను. ఆ సమయముములో నేను చిన్నజీయ్యరు స్వామిని కలిసే అవకాశమొచ్చింది. స్వామి వారితో నేను బదిరి ఆశ్రమములో నెల రోజులు వుండేందుకు అనుమతి కోరాను.

ఆయన పరమ దయతో అక్కడ చలి గురించి హెచ్చరించారు. “మీ అట్లాంటాలా కాదండి. అక్కడ సెంట్రల్ హీటింగు వుండదు. మీరు ఇబ్బంది పడతారు” చెప్పారాయన.

నేను పర్వాలేదని తలవూపాను.

బదిరిలో వుండి కొంత జపం చేసుకోవాలన్న నా కోరిక పూరతనమైనది. అంటే, అనాదిదేమీ కాదు గానీ నాకు బదిరి గురించి తెలిసినప్పటి నుంచి వున్న కోరిక. నేను మొట్టమొదట రుషీకేష్‌ ట్రిప్పులో రాఘవ స్వామిని కలిసినప్పుడు, ఆయన చెప్పిన నాటి నుంచి నాలో మొలకెత్తినది. ఆ కల నేటికి సాకరమైనది.

ఏదైనా జపము, తపము, హోమము, దానము…. మంచి కానీ చెడు కానీ ఒకటికి 100 రెట్ల ఫలము బదిరిలో లభ్యం. అది నారాయణుడు ఇచ్చిన మాట.

ఉత్తరాంచల రాష్ట్రమంతా తమది దేవభూమి అని అంటారు. హిమాలయములంతా అదేగా. దేవతలు తిరుగాడిన, తిరుగాడుతున్న మహోన్నతమైన భూమిక. అందునా కేదారము, బదరీ మోక్షభూములు. అందుకే అక్కడ జరిపే జపతపాదులకు అంత విలువ, ప్రాముఖ్యత.

అంతేకాదు, అక్కడ ఒకరి గురించి తప్పుగా తలవకూడదు. చెడు మాటలు గట్రా కూడా ఎవరిని అనటము అదీ చెయ్యకూడదు. దానికి వెయ్యి రెట్లు పాపం వస్తుందిగా మరి.

అక్కడ ఒక విధమైన పవిత్రత గాలిలో నిండి వుంది. అది అనుభవించవలసినదే కానీ చెప్పలేము. సదా హృదయము పరమాత్మతో అనుసంధానింపబడి వుంటుంది. మనము వైఫై రౌటరు వున్న గదిలో వున్నప్పుడు ఎలా మన ఫోను వైఫై ఏ మూల వున్నా ఎలా కనెక్టు అయి వుంటుందో అలాగన్నమాట.

నా అనుష్ఠానముకు అందుకే బదిరిని ముఖ్య భూమికగా ఎంచుకున్నాను.

నేను, మా శ్రీవారు క్రిందటి సంవత్సరము కనీసము రెండు ధామాలన్నా సందర్శిద్దామనే పయనమయ్యాము. కానీ కొండల్ చాలా జర్వం పడ్డారు. అందుకే కేదారేశ్వరము సందర్శించి వెనకకు మళ్ళాము. అలా గత రెండు సంవత్సరాలుగా బదరిలో నాకు ప్రవేశము కలగలేదు. ఈసారి తప్పక బదిరి వెళ్ళాలన్న నా కోరికతో వెడుతూ హిమాలయ అంతర్భాగములోకి వెళ్ళటము పరమ సంతోషాన్నీ కలిగించింది.

హిమాలయములు
అద్భుత సౌందర్య సంపదల నిలయమా,
అనిర్వచ ఆనందాలు పండించు శికర సమూహమై,
రాశిభూతమైన సర్వ సంపదలభౌతిక రూపమై,
మురిసితివి నీవు హరునకు ప్రియమైన ఆవాసమై,
జగములనేలు జగదంబ పుట్టినిలై,
హరికి మిగుల ప్రాణమై, బదిరికా వనమై,
మహోన్నత ఉత్తుంగ తురంగ తరంగమై
సురగంగ నృత్యాల వేదికై,
యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులకు ఆలవాలమై,
పవిత్ర జలముల మేటి సెలయేటిల కంజారమై,
హొయలు మీర సొగసు చూపు జలపాతముల సంవాసమై,
ఆధ్యాత్మికతను పండించిన భూమికై
మహా యోగులకు ధావనై,
మానవ మేధకు అందని రహస్యాల కూటమై,
సర్వ ప్రాణులకు మిక్కిలి ప్రియమై, సంవాసమై,
భారతవనికి కట్టని గోడవై
మురియు ఓ సమాశ్రయమా, సద్మమా….
హిమముకు సమాశ్రయమా,
హిమాలయమా నీకిదే మా వందనము.

ఈ సారి నేను కృతనిశ్చయముతో వున్నాను. నాకు బదరిలో కొన్ని రోజులన్నా వుండాలన్న కోరిక. అక్కడ మన జియ్యరు స్వామి వారి మఠము కూడా వున్నది కదా!

శ్రీ పరమహంస పరివ్రాజక పెద్ద జియ్యరు స్వామి వారిచే 1949లో మొదలుపెట్టబడిన ఈ మఠము తెలుగువారి అవసరాలు తీరుస్తూ, మంచి తెలుగు బోజనముకు, వసతికి పేరు పొందింది. శ్రీ చిన్నజీయ్యరుస్వామి వారు ఆ క్షేత్రంలోని ఆ మఠాన్ని మరింత అభివృద్ధి చేశారు. స్వామి వారి మంగళాశాసనములు దొరికాక ఇంక ఘంటాసురుడు(బదిరి క్షేత్ర పాలకుడు) కూడా ఆపలేడు నన్ను అని నేను మురిసాను. అది సత్యం కూడానూ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here