సత్యాన్వేషణ-48

0
5

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]అ[/dropcap]భిషేకము అయ్యింది. విష్ణు సహస్రము మొదలెట్టాడు రావల్జీ… నేనూ గట్టిగా చదువుతుంటే ఆయన తగ్గమని సైగ….ఆహా ఏమి భాగ్యము నా స్తోత్రము పరమాత్మ చెవిన పడినదయ్యా…

“శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యమ్
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్॥”

“స్వామి నాకు గురు దర్శనము కలిగించు…. నాకు కోరుకోతగ్గది మరిలేదు”…గుండె గొంతుకు అడ్డం పడగా ప్రార్థించాను….

ఆ సేవ రెండున్నర గంటల సేపు సాగింది. అంత సేపు రెప్పవాల్చక చూస్తూ వుండిపోయాను. తరువాత ప్రసాదమన్నారు…. నేను టికెటు తీసుకోలేదు.. ప్రసాదమేమిటి అనుకొని లేచి ఆశ్రమానికి వచ్చేశాను. వాన పెరుగుతోంది కాని తగ్గటము లేదు. వాన ఇలా పడితే ఇక రోడ్డు మూసుకుపోతుంది అన్నారు ఆశ్రమములో…

ఇంతలో నన్ను వెంటనే బయలుదేరమని… లేకపోతే నా ఫ్లైటు తప్పిపోగలదని హెచ్చరిస్తూ… ఒక జీపును పిలిచారు ఆశ్రమ కేర్‌టేకరు. నన్ను అభిషేకానికి పిలిచినతను కూడా ఆ జీపులో వున్నాడు.

అలా నా ప్రయాణము అనుకున్న రోజుకన్నా ముందుగా మొదలయ్యింది. అప్పటికే నేను ఆశ్రమములో వారికి చిన్న వూలు వస్తువులు, శాలువలు గిఫ్టుగా ఇచ్చాను. నా బట్టలు అన్నీ బ్యాగులో పడేసి పరుగున వచ్చి జీవు ఎక్కాను. ఆశ్రమములో పిన్నిగారు నాకు ఆపిల్ ఇచ్చి నుదుటిన చిన్న ముద్దు పెట్టుకుంది. నేను ఆమె పాదాలంటితే…. “తప్పమ్మా మీరు బ్రాహ్మలు”.. అంటూ జరిగింది.

నేను నవ్వి ఆమెకు బై చెప్పి జీపు ఎక్కేశాను.

“శం నః సూర్య ఉరుచక్షా ఉదేతు శం నో భవన్తు ప్రదిశశ్చతస్రః।
శం నః పర్వతా ధ్రువయో భవన్తు శం నః సిన్ధవః శము సన్త్వాపః॥”
ఋగ్వేదం (7-35-8)

ఓ సర్వవ్యాపక సచ్చిదానంద సర్వేశ్వరా! నీ కరుణా కటాక్షాల వల్ల తన బృహత్ ప్రకాశంతో అన్నింటిని దర్శింపచేయు సూర్యుడు ప్రతి ఉదయం మా సుఖశాంతుల కొరకు ఉదయించును గాక. నాలుగు దిక్కులు, ప్రదిశలు (నాలుగు మూలలు) మాకు శాంతి దాయకములగును గాక. భూమిపై స్థిరముగా నుండు పర్వతాలు, సముద్రాలు, ప్రవహించు నదులు, వాపీకూప తటాకాది జల స్థానాలన్నీ మాకు శాంతినిచ్చునవి అగును గాక.

“మనము ప్రేమను ఇవ్వటము సులభమేమో కానీ ద్వేషము వదిలించుకోవటము అత్యంత కష్టమైన పని. సాధన అంటే ఈ ద్వేషాన్ని నిర్మూలించుకుంటూ, సర్వము పరమాత్మ తత్త్వముగా చూస్తూ ప్రేమించటము. ద్వేషము వుంటే సాధనలో ముందుకుపోలేము” అన్నారు నేను బదిరి నుంచి వచ్చి కలిశాక మా హీలింగ్ మాస్టరు.

అవుననుకున్నాను నేను. ఆయన ఆ దిశగా నా సాధనను చూసుకోమని సలహా ఇచ్చారు.

ద్వేషమన్నది మనము వద్దనుకున్నా కొందరి మీద కలిగి లోలోపల నిలబడిపోతుంది. మనము పైపైన ఏమి చేసినా అది పైన డ్రెస్సింగులా వుంటుంది. మనము లోపలి నుంచి దానిని తీసివెయ్యాలి. అది కష్టమైన పని.

తెలుగువారి ఇళ్ళల్లో ఎక్కడో మంచి స్నేహపూరిత అత్తగారిళ్ళు వుంటాయి. సర్వసాధరణముగా అవి కొంత ఘర్షణనే ఇస్తాయి స్త్రీలకు. నేను ఈ విషయములో మినహాయింపు కాదు. అందుకే ఈ ద్వేషము వదిలించుకోవటమన్నది నాకు చాలా కష్టమైయ్యింది.

దానికే ప్రాణిక్ హీలింగులో మంచి ఫలవంతమైన టెక్నిక్సు కొన్ని వున్నాయి. అవి సాధన చేస్తే మనకు తప్పక మంచి ఫలితముంటుంది. అవే కాదు మనకు మనమీద కూడా కొంత కోపముంటుంది లోలోపల. లేదా మన మీద మనము జడ్జిమెంటలుగా వుంటాము. అటు వంటి భావనలు కూడా సాధనకు విరోధమే. కాబట్టి వీలైనంత న్యూట్రల్‌గా వుండేందుకు ముందు ప్రయత్నం సాధన చెయ్యాలి.

ఈ సాధన వల్ల మాత్రమే మనము ముందుకు సాగగలము. ఈ ద్వేషభావము మనము వదిలించుకున్నామనుకున్నా, మళ్ళీ మళ్ళీ వస్తూ వుంటుంది. అందుకే లోలోపల నుంచి తొలగించాలి. దండపాణి అన్న మెడిటేషను గురు ఈ భావాలను డబ్బుతో పోలుస్తారు. మన ఎమోషన్లకు కొంత రూపమివ్వచ్చని చెబుతూ అతను చక్కటి ఉదాహరణ చెబుతారు. మనకు పిల్లలు తెల్లకాగితం పై రెండు గీతలు గీసి లవ్యూ అని రాసిస్తారు. మనము వాటిని పడెయ్యలేము. వాటిని చూస్తే మనకు మన పిల్లలు గుర్తుకు వస్తారు కాబట్టి. అంటే మనము మన ప్రేమకు ఒక రూపమిచ్చామిక్కడ. అలాగే ద్వేషాన్నీ కాగితముపై రాసి, ఆ కాగితము కాల్చివేస్తే మన మనస్సుకు ప్రశాంతత చిక్కుతుందని చెబుతారు ఆయన. ఇదో పద్ధతి.

కాని అటు వంటి ద్వేషపూరిత వ్యక్తులను తిరిగి కలవవద్దని సలహా ఇస్తారు. మరి మన ఇంట్లో వాళ్ళే మనను ద్వేషిస్తుంటే? చాలా సార్లు మనము ఇటు వంటి డోలాయమాన స్థితిలో పడిపోతాము. హీలింగులో ఇటు వంటి వాటికి కూడా సమాధానము దొరుకుతుంది. ఆ టెక్నిక్స్ మనకు సహాయపడగలవు. నేను అవి సాధన చేస్తున్నా మళ్ళీ పడిపోతూనే వుంటానని అనిపిస్తుంది.

***

శ్రీ ఎమ్ గారి ఆత్మకథలో ఒక విషయము నన్ను చాలా రోజులు వేధించింది. అదేమంటే ఆయన తన గురువుతో కలసి ఒక అఘోరీ దర్శనానికి వెడతారు. అక్కడ వారు వుండగా ఒక స్త్రీ వస్తుంది. ఆ అఘోరీ ఆ స్త్రీ తో తన కామము తీర్చమని కోరుతాడు. ఆమె తిరస్కరించి వెళ్ళిపోతుంది. శ్రీ ఎమ్ కు ఇది కొంత ఆశ్చర్యము కలిగిస్తుంది. దానికి ఆ అఘోరీ ఆమె కోరరాని కోరిక కోరుతున్నందున్న వదిలించుకోవటానికి ఇలా మాట్లాడానని చెబుతాడు. వారు మరో సంభాషణ లోకి పోతారు. కథ సాగిపోతుంది.

నాకు ఎన్ని సార్లు చదివినా ‘ఆమె సరేనంటే ఆయనేమనేవారు’ అనుకుంటా ఎప్పుడూ. సర్వము త్యజించి, మానవుల విసర్జనకు, మధుర పదార్థానికి ఎలాంటి భేదభావము చూపని వారికి, అఘోరీలకు కామవాసనలు వుండవు కదా అనిపిస్తుంది.

నేను ఎన్నో సార్లు ఆలోచించేదాన్ని ఆ విషయము…. ఆత్మ గురించి అవగాహన కలిగిన తరువాత మళ్ళీ తన వద్దకు వచ్చిన శిష్యులలో స్త్రీ పురుష భేదము చూపుతారా గురువులు. ఈ శరీరము కేవలము ఆత్మను మోసే వాహనము కదా. ఇంద్రియాలను జయించనిదే స్వాత్మా దర్శనము కలగదు కదా…. మరి మళ్ళీ ఇలాంటివి వుంటాయా ఇంకా. ఆమె ఆ విషయముపై అవగాహనతో ‘సరే’ అంటే అఘోరీ గారు ఏమనేవారో కదా??!!

***

“అభయం మిత్రాదభయమమిత్రాదభయం జ్ఞాతాదభయం పురో యః।
అభయం నక్తమభయం దివా నః సర్వా ఆశా మమ మిత్రం భవన్తు॥”
(అథర్వ వేదము.19-15-6)

భావార్థము: ఓ పరమాత్మా! నేను మిత్రులు, శత్రువులు, పరిచితులు, అపరిచితులు, రాత్రి, పగలు అను భయము లేకుండా అన్ని దిశలు-ఉప దిశలలో నిర్భయముగ విస్తరించుదును గాక.

ఇక భయం లేదు:

ఒక గురువు గారితో విచిత్రముగా పరిచయము కలిగింది. ఆయనను నే ప్రత్యక్షముగా కలవలేదు అంతకు ముందు. ఏదో సమూహములో ఆయన ప్రవచనమిచ్చేవారు. జ్యోతిష్యము, ఆయుర్వేదము బాగా తెలిసినవారు. హిందూ ధర్మమును నిలపాలనీ, దేవాలయాలను పునరుద్ధరించాలని, మొక్కలు నాటాలని సంకల్పము వారిది. వారు ఆర్షధర్మమును నిలపాలని ఏదో సంస్థను పెట్టారనుకుంటా. నాకు పెద్దగా తెలియదు. నేను అట్లాంటా స్థానిక తెలుగు సంస్థలో కొంత యాక్టివ్‌గా వున్నానని, ఎన్నో పొజీషన్లు సమర్థవంతముగా నిర్వహించానని ఆయనకు తెలిసింది. ఒకసారి నన్ను వారి సంస్థ తరుపున హిందూ ధర్మ పోరాటములో భాగము కమ్మని ఆహ్వానించారు. నేను గురువుకై అన్వేషణలో వున్నాను. అన్నింటికి దూరంగా వుండదలుచుకున్నాను. ఆయనతో నాకు ఆసక్తి లేదని చెప్పాను.

ఆయనేమనుకున్నారో కానీ నాతో తిరిగి ఏమీ అనలేదు.

ఒకసారి నాకు ఫోనులో “అమ్మవారు చెప్పింది నీకు మంత్రదీక్ష ఇమ్మని” అని మంత్రం ఇచ్చారు. తరువాత అంగన్యాసాలు చెప్పారు.

నాకు గురువంటే సర్వమూ అన్న నమ్మకము. నేను చిన్నప్పట్నించి బాబా భక్తితో పెరిగినదాన్ని. గురుచరిత్ర పారాయణము వందలసార్లు చేసినదాన్ని.

నాకు ఏ గురువైనా సాక్షాత్తూ ఆ సాయినాథుడే. దత్తస్వామే. తేడాలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here