సత్యాన్వేషణ-5

0
6

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]అ[/dropcap]నహంకారభావనే జ్ఞానము యొక్క స్వరూపము.

“కుతోఽ హంత్వం కుతస్త్వంత్వం
కుతోద్విత్వైక్య విభ్రమః”
(యోగవాసిష్టము. ని.ఉ.సర్గ.8. శ్లో.5)

నేను ఏది? నీవు ఏది?

గురువు చెప్పిన విధానముగా ప్రయత్నం చేస్తే విజయం, ముక్తి.

వున్నచోటనే నా సాధన మొదలెట్టాను.

కొంత పనితో, కొంత బద్ధకముతో కూడిన దినచర్యతో.

***

వున్నచోటనే, పనుల మధ్య జపము మొదలైయ్యింది. వున్నది అమెరికా. ఇక్కడి జపము ఫలిస్తుందా? ఐతే అనుమానము చాలా పెద్ద జబ్బు. ఈ అనుమానానికి కారణము ఇది కర్మభూమి కాకపోవటమే. ఇక్కడ చేసే జపతపాదుల ఫలితముంటుందా యన్న చిన్న అనుమానము వదలటంలేదు.

కర్మభూమి యని భారతావనికి పేరు. మనము చేసే కర్మలకు శీఘ్రముగా ఫలితాలను ఇస్తుంది, అవి మంచి కానీ, చెడు కానీ. మన పురాణాలలో, ఐతిహాసాలలో ఈ విషయము చాలా స్పష్టంగా చెప్పారు.

విష్ణు పురాణము ఇలా చెబుతుంది:

ఉత్తరేణ సముద్రస్యహిమాద్రేశ్చైవ దక్షిణం।
వర్షం తద్బారతం నామ భారతీ యత్ర సంతతిః॥
నవయోజన సాహస్రో విస్తరోస్య మహామునే।
కర్మభూమిరియం స్వర్గమపవర్గంచ గచ్ఛతాం॥

సముద్రమున కుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము కలదు. అందలి సంతతి ‘భారతి’ యనబడును. కర్మభూమి అని దీనికి పేరు.

బ్రహ్మ పురాణములో, పందొమ్మిదవ అధ్యాయములో జంబూద్వీప వర్ణన కనపడుతుంది.

ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం।
వర్షం తదేభారతం నామ భారతీ యత్ర సంతతిః॥
నవయోజన సాహస్రో విస్తారశ్చ ద్విజోత్తమాః।
కర్మభూమిరియం స్వర్గ మపవర్గం గంతు మిచ్ఛతామ్‌॥

సముద్రానికి ఉత్తరమున, హిమాలయముల దక్షిణమున ఉన్న ఈ భూమి భారతి కర్మ భూమి. కోరిన వారికి స్వర్గము , మోక్షము ఇచ్చే భూమి.

భారతదేశములో చేసే జపతపాదులు లెక్క కాని, మరోచోట చేసే తపస్సు ఫలిస్తుందా? అంటే, ఫలిస్తుందని శ్రీ కుర్తాళం స్వామివారు ఫలిస్తుందని చెప్పారు కాని, దానికి పట్టే సమయము మాత్రం చాలా ఎక్కువ. మనము వున్న చోట ఎలాంటి ఎనర్జీలు వుండకపోతే, మనము ముందు ఆ స్థలములో ఎనర్జీ క్రియేటు చేసి, తదనంతరము చేసే జపముతో ఫలితముంటుంది. అదే ఆ పరమాత్మ వున్న సన్నధిలోనైతే మన జపమునకు సమాధానము వెంటనే వస్తుంది.

అందుకేగా స్థల మహత్యమంటారు.

మన ఋషులు పూర్వం నుంచి ఎంతో తపస్సు చేసి, ఆ భూమికి ధారపోశారు. అందుకే అక్కడ మనము చేసే ప్రార్థనకు వెంటనే సమాధానము వస్తుంది. ఎలా చూసినా ఈ అమెరికా నేల మీద నేను చేసే జపానికి సమాధానము రావటమంటే ఎండు కట్టే చిగురించాలని ఆశపడటము. అదీ కొన్ని రోజులలో.

ఇలా అనుకున్నా నాకు కనీసము క్రమశిక్షణ కలుగుతుందని నేను లక్ష జపము చెయ్యటానికి పూనుకొన్నాను.

మంత్రము అంటే ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’- దేనిని మననం చేస్తే రక్షణ చేయ్యగలదో దానిని మంత్రము అంటారు. మననం చేస్తే రక్షణ చేయగలిగినటువంటి శక్తి దేనియందు నిక్షేపింపబడి ఉంటుందో అది మంత్రము కదా.

మనస్సు అనే ఇనుపముక్కను మంత్రమనే అయస్కాంతముతో రుద్దితే, మనస్సు కూడా కొంత కాలానికి అయస్కాంతమయి పరమాత్మను ఆకర్షిస్తుంది కదా. అందుకే మనసులో మంత్రం సదా ఉచ్చరిస్తూ వుండటము అలవాటు చేసుకోవాలి. బహిర్ముఖముగా ఏమి జరిగినా లోలోపల మంత్రోచ్ఛారణ సాగుతూనే వుండాలి. అది అలవాటుగా చేసుకోవటమన్నది మొదటి మెట్టు. రామకృష్ణ పరమహంస చెబుతారు, “గృహకృత్యాలలో వున్నప్పుడు ఒక చేత్తో దైవం పాదం పట్టుకో. పని ఏమీ లేనప్పుడు రెండు చేతులతో పట్టుకో” అని.

భగవాను రమణులు నాయన కావ్యకంఠమునికి జపము, తపము గురించి చెబుతూ “ఆ మంత్రము ఉద్భవించేదెక్కడో” చూడమన్నారు. భగవాను మరో సందర్భములో “పూసలు లెక్కపెట్టటమొక్కటే కాదు, నీవన్నది తెలుసుకోవాలి. లేకపోతే లెక్కలే వస్తాయి” అని హెచ్చరిస్తారు.

మొదటి మెట్టుగా, క్రమశిక్షణ కోసము మీ జపము అవసరమే కాని, కొంత స్వస్వరూప జ్ఞానము కూడా కావాలి. మనలను మనము ఉద్ధరించుకోవాలి.

“నేను” అన్నది చూడమని కదా చెబుతారు.

భగవాను చెప్పిన “నేను” మనం అహంకరించే “నేను” ఒకటేనా?

రెండూ వేరని నాకనిపించింది. “నేను” అన్న అహంకారము ఏదైనా పనిలో విజయమందు ‘నేను’ చేశానని గర్వపడే అహంకారము. అది ఆత్మ స్వరూపమైన నేను కాదు.

లోలోపలి ‘నేను’ – అంతర్గతంగా వుండి మొదటి అహంకరించే “నేను” ను గమనిస్తూ వుంటుంది. అందుకే ఆ ‘నేను’ ను సాక్షి లేదా అంతరాత్మ లేక ప్రత్యగాత్మ అని అంటారు. మనము పైపై చేసే పనులకు మనలోని ఒక కంఠము తప్పువొప్పులు చెబుతూ వుంటుందిగా. అది అంతరాత్మ.

అది మొదటి “నేను” ను గమనిస్తూ వుంటుంది.

ఈ “నేను”కు రాకపోకలు వున్నాయి. మనము జాగ్రత్తులోనూ, స్వప్నంలోనూ “నేను” అన్న స్ఫురణ వుంది. కాని సుషుప్తిలో ఆ స్ఫురణ లేదు. అంటే నేను లేదనా? మనకు కనపడని “నేను” కనపడే తెలిసే “నేను”ను చూస్తూ సాక్షిగా వుంది కదా. అంటే ఈ నేను నేను కాదు. సాక్షిగా వున్నదేదో అది నేను అనుకోవాలి.

మరోలా అంటే ఈ శరీరమూ, కర్మేంద్రీయాలూ, జ్ఞానేంద్రియాలు నేను కాదు. మరి బుద్ధి “నేనా?”

బుద్ధికీ ఆత్మకీ పోలిక చాలా వున్నది. రెండూ ఇంద్రియాల కన్నా సూక్ష్మమైనవి. రెండూ స్వచ్ఛమైనవి. రెంటికీ అవయవములు లేవు.

భేదమున్నదా?

ఆత్మ స్వయం ప్రకాశము. బుద్ధి కాదు. బుద్ధి ఆత్మ ప్రక్కనే వుంటుంది. ఆత్మ నుంచి వచ్చే ప్రకాశాని గ్రహిస్తుందనుకోవచ్చు.

ఆత్మను గురించి ఎన్ని చదివినా, ఎన్ని ఉపన్యాసములు విన్నా సాధనతో అనుభవములోకి తెచ్చికోవాలి. అంటే సాధనే మార్గం.

అంటే మళ్ళీ మొదటికొచ్చాను.

ఇక ఇలా కాదు చేసే పని అనుమానము లేక పూర్ణ విశ్వాసముతో చెయ్యాలి.

కర్మభూమికి వెళ్ళి నా గురువును కలవాలి. ఇక్కడే వుండి ఈ అసత్యమైన జీవితమే నిజమని ఎన్ని రోజులు వృద్దా చేసుకోవాలి?

ప్రపంచములో వారంతా ఆత్మానుభవము కోసము, అంతర్ముఖమవటానికి భారతదేశము వైపు చూస్తూ వుంటే నేనేంటి కర్మభూమిలో పుట్టి లంపటముల వైపు సాగి నా భూమికి దూరమై ఇలా దూరంగా ఈ భౌతికమైన ప్రపంచములో చిక్కుకుపోయాను.

తీరని దుఃఖం కలిగింది.

బందీనై పోయాను. ఈ జీవితములో, సంసారములో ఈ శరీరములో……. ‘జగదంబా! భవరణ్య కుఠారికా! నన్ను విడుదల చెయ్యి!’

విడుదలకు నా మనసు ఉరకలెత్తటము మొదలయ్యింది. రోజులు గడిచే కొద్ది పంజరములో కట్టేసిన పిట్టలా లుకలుకలాడిపోయాను.

ఇక ఆగలేక ఒకరోజు చెప్పాను మావారికి – నేను ఇండియా వెళ్ళి గురుక్షేత్రాలు తిరగాలనుకుంటున్నానని … నాలోని మార్పును గమనిస్తున్న ఆయన ఏమీ మాట్లాడలేదు.

కాదంటే చెప్పకుండా వెళ్ళిపోవాలన్న తెంపరితనము నాలో ప్రవేశించక మునుపు వెళ్ళిరమ్మన్నారు మావారు. “కాని ఒక్క షరతు ప్రతిరోజూ ఒక్కసారన్నా మాట్లాడు” అని చెప్పారు.

ఎక్కడికో, ఎమిటో తనూ అడగలేదు. నేనూ చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలియదు. ఎక్కడికి వెడుతానో ఎలా వెడతానో, వెళ్ళాలి. శ్రీ గురుని శరణుకోరి వెళ్ళాలి. అంతకు మించి మరేమి తెలియదు.

ఎవరికీ చెప్పకపోయినా నా మనసులో చూచాయగా ఒక ప్రణాళిక వేసుకున్నాను. గురుస్థానాలు దర్శించాలని. అన్నింటికి మించి గంగ ప్రక్కన కొంత కాలముండాలని. గంగ ప్రక్కన జీవించటము పూర్వ పుణ్యముంటే తప్ప సిద్ధించదు కదా!

సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి తన్‌
మహైశ్వర్యం లీలాజనితజగతః ఖణ్డపరశోః।
శ్రుతీనాం సర్వస్వం సుకృతమథ మూర్తం సుమనసాం
సుధాసోదర్యం తే సలిలమశివం నః శమయతు॥” (గంగా లహరి. జగన్నాథ పండితః)

హిమాలయాలు దర్శించాలి. భువిలో స్వర్గధామము, పరమాత్మ భౌతిక చిరునామా హిమాలయాలే కదా!

నేను చదివిన పుస్తకాలలో, చూచిన వీడియోలను బట్టి హిమాలయాలకు మించి మార్గము చూపేవి లేవు. అసలు ఆ గంగమ్మతల్లిని దర్శించటము పూర్వపుణ్యము కదూ!!

కొంత ఇంటర్నెటులో సమాచారము దొరికింది. రుషీకేషులో వుండటానికి ఒక ఆశ్రమమును బుక్ చేసుకున్నాను.

దత్తగురు స్థానాలలో వుండటానికి హైద్రాబాదు వెళ్ళి చూద్దామన్న మొండి దైర్యం మనసులో వచ్చేసింది.

ఇక ఆలస్యమెందుకు!

భారతావని పిలుస్తోంది!!

విమానము ఎక్కేశాను.

జై గురుదత్తా!!

***

చాలా కాలము తరువాత హైద్రాబాదుకు మళ్ళీ వచ్చాను.

అమ్మ, పుట్టిల్లు లేని హైద్రాబాదు ఆ క్షణములో మోడుగా, బీడుగా అనిపించింది. ఈ నేలా, గాలి అన్నీ అమ్మ లేదని నన్ను చూసి జాలి పడుతున్నట్లుగా వుంది. అమ్మా నాన్నలు లేనివారు పెద్దల అనుభవపు గైడెన్సు లేక జీవితపు తుఫానుకు వంటరిగా ఎదురెళ్ళటము పరమఖేదము. నాకు మనసులో పుండు రగిలింది మళ్ళీ. మానని పుండది. ఆ నేలలో నా చిన్నతనము గడిచింది. నా కాలేజీ, క్యాంపస్సులో నా తిరుగుడు, నా చదువు ఉద్యోగము, పెళ్ళి మిత్రులు ఏవీ నాకు జీవితమింతే అని వెన్ను తట్టలేదు.

“ఇది జీవితము కాదు, వెతుక్కో నీ అసలు జీవితమని” చెబుతున్నట్లే వున్నది.

ముందుగా గుంటూరులో పెద్దక్క ఇంట్లో నా సామాను పెట్టుకొని, హైద్రాబాదు వచ్చాను. (పిన్ని కూతురు) చెల్లి వాళ్ళింట్లో ఒక పూట వుండి నా ప్రస్థానము మొదలెట్టాలి. ఆనాడు పిన్ని అక్కడే వున్నది. అమ్మకు పెద్ద చెల్లి తను. చాలా గొడవ నా ప్రయాణము, నా వేషమూ ఏదీ ఆమెకు నచ్చలేదు. కోపముతో “అసలు మీ ఆయన నిన్ను ఎలా వెళ్ళనిచ్చాడు” అంటూ కేకలేసింది.

తమ్ముడు “అమ్మ లేనందుకు సంద్యక్క ఇలా చేస్తోంది” అని తీర్మానించాడు.

ఏమి చెప్పి ఎవరిని సంబాళించగలము?

తల మీద సన్నది దారముతో కత్తి సదా వ్రేలాడుతూ వుంటుంది. అమ్మను నాన్నను ఆపలేనివి నన్ను ఆపుతాయా. జీవితము ఏ క్షణములో ముగుస్తుందో తెలియనప్పడు, మనము చెయ్యగల పని ఏమిటి? నిర్లక్ష్యముగా తిండి, నిద్ర, తిరుగుడు, తాగుడుతో వృథా చెయ్యటమా? పరబ్రహ్మను గురించి చింతన చేస్తూ ఆత్మజ్ఞానముకై సద్గురువును ఆశ్రయించటమా?

భాగవతములో ప్రహ్లదుడు చెబుతాడుగా……

“సీ. కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మభస్త్రి గాక
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖనిర్మిత దర్వి గాక
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాలరంధ్రములు గాక
ఆ. చక్రి చింత లేని జన్మంబు జన్మమే
తరళసలిలబుద్బుదంబు గాక,
విష్ణు భక్తి లేని విభుండు విబుధుఁడే
పాదయుగము తోడి పశువు గాక” (భాగవతము)

మౌనము ఎన్నింటికో సమాధానము. అందుకే గమ్మున వుండిపోయాను.

నేను వెళ్ళేది నాకు తెలియని భాష మాట్లాడే స్థలము. దాని కన్నా నాకు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన వున్నది కాని, కారులో కాకుండా అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు. అంటే ప్రయాణ సాధనాలు బస్సు రైలు గట్రా ఏవి చూసుకోవాలో కూడా అర్థం కాలేదు.

హైద్రాబాదులో వున్నని రోజులు ఒక తీరున వున్నా, అమెరికా వచ్చేసినాక, మనము మనకు తెలియకనే ఒక బ్లాక్‌హోల్ వంటి కంఫర్టులలో కూరుకుపోతాము. కారు లేనిదే కదలము. మనకు ఒక పోష్ హ్యండు బ్యాగు, అందులో నాలుగైదు ఫ్లాస్టిక్ మనీ(క్రెడిట్ కార్డులు) వెదజల్లటానికి కొంత చిల్లర డబ్బు, ఒక ఫోను, కట్టినా కట్టకపోయినా పెట్టెలకొద్ది బట్టలు, రకరకాల చెప్పులు, తలకు మెడకు వింత రంగుల అలంకారాలు, ఒహో అదీ ఇదీ అని చెప్పలేని ఆర్భాటము కావాలి. ఇంతా చేస్తే మనము తిండి కూడా డైటింగని మాడుస్తాము పొట్టని. ఇంతటి కృత్రిమ జీవితానికి అలవాటు పడిపోతామో కదా!! పైపై వేషము చూసి మనుష్యులను అంచనా వేసి గౌరవించే కృత్రిమ ప్రపంచమీ అమెరికా. అందులో అహంకారము రూపముగా వివిధ తెలుగు సంఘాలు. అందులో వుండే నావంటి జనాలు. నాదీ అప్పటి వరకూ అదే ధోరణిగా… ప్రహ్లాదుడు చెప్పినట్లగా మాట్లాడే “పశువు” వున్నట్లుగా జీవితము కదా గడిపాను.

నేను అమెరికా వచ్చి సెటిల్ అయ్యి అప్పడికే పదహారు సంవత్సరాలు. మరి ఎంతగా ఈ వూబిలో కూరుకుపోయానో. ఎంతగా భ్రాంతిలో మునిగి అహంకారమనే పెంకులతో దుర్గమే నిర్మితమై వుంటుంది మనః ప్రపంచమున, అంచనాలకు అందదు.

అది అమ్మా, నాన్నల హఠాత్ నిష్క్రమణముతో కదిలింది. పునాదులతో కదిలి కూలింది. ఈ యాత్రతో ఏం అవుతుందో….

హైద్రాబాదులో బయలుదేరే ముందర నా ఆపిల్ ఫోను నీళ్ళలో పడింది. దాంతో ఆ ఫోను మరణించింది. అది పనిచేస్తుందో లేదో తెలియదు. దానిని చెల్లి వాళ్ళింట్లో వదిలేశాను.

నాకు అసలే మతిమరుపు. ఎవ్వరి నంబరు గుర్తు కూడా వుండదు. అలా ఒక యంత్రంతో బంధం పుటుక్కున తెగింది. యంత్రముతో బంధం అలా పుటుక్కున తెగటము నాకు కించిత్ కూడా కష్టమనిపించలేదు. పైపెచ్చు ఒక తలనొప్పి తగ్గింది.

ఒక చిన్న మొటరోలా ఫోనులో ఒక సిమ్ వేసి అక్కడ వున్నని రోజులూ వాడుదామని తీసుకున్నాను. నా ఫోటో ఐడిగా నా డ్రైవర్సు లైసెన్సు. వెయ్యి రూపాయలు, ఒక ఏటిఎమ్ కార్డు. రెండు జతల బట్టలు, టవలు, ఒక దుప్పటి (అదీ చివర నిముషములో పిన్ని ఇచ్చింది) సబ్బు వంటివి ఒక చిన్న బ్యాగు.

నాకు ఆసనము (జపం చేసుకునేటప్పుడు కూర్చుండుటకు ఆధారమైన పీఁట వంటి వస్త్రము) కూడా లేదు అప్పడు. కాబట్టి శాలువనే ఆసనముగా వాడుతూ వుండేదాన్ని. ఒకటి కొనాలన్న ఆలోచనా లేదు. చెప్పేందుకు ఎవ్వరూ లేరు. ఆ శాలువే తదుపరి జపము చేసుకునేటప్పుడు నా ఆసనమైయ్యింది, చలికి కాచే వెచ్చటి వస్త్రమైయ్యింది. జపానికి తులసిమాల. ఆ మాల నాకు పూర్వము శ్రీ పరమహంస పరివ్రాజక చిన్నజియ్యరు స్వామి వారు ఆసీస్సులతో ఇచ్చారు. అదే నా జపమాల. అదే నా మెడలో వుండేది. ఒక పూస వూడింది. కాని నేను అదే వాడేదాని. కాని జపమాల వాడటములో వివరాలు, పూసలు వూడినవి వాడటము, వాడకపోవటము లాంటివి నాకు అప్పుడు తెలియదు. తరువాత పూజ్యగురువులు తెలియచేశారు.

ప్రతిరోజూ పారాయణానికి గురుచరిత్ర గ్రంధం.

రాసుకోవటానికి నోటుబుక్, పెన్ను.

వీటిని ఒక చిన్న బ్యాగులో పెట్టాను. చేతి సంచీగా “ఓం” అన్ని వున్న బ్యాగు. అందులోనే పుస్తకము, నోటు బుక్, ఐడి. మొటరోలా.

నేను వద్దనుకున్నవి, నా యాత్రలో వున్నని రోజులు వాడనివి అద్దము, దువ్వెన, బొట్టబిళ్ళలూ, అలంకార సామాగ్రిని వదిలేశాను.

రాత్రులందు భోజనము వద్దన్న నియముము ముందరే వున్నది.

భోజనము మారు వడ్డించుకోకూడదని, కంచంలో వున్నది వదలకూడదని నియమాలు చేర్చుకున్నాను.

అన్నము తిననని, మరోటి మాత్రమే తింటానని వంటి వేషాలు లేక భోజన సమయములో దొరికినవి ఏదైనా శాఖాహార భోజనము తినాలన్న నియమము పెట్టకున్నా. తిండి నాకెప్పుడూ పెద్ద విషయము కాదు. నాకున్న బలహీనత శుభ్రమైన పరిసరాలు. అలా లేకపోతే నాకు ఇబ్బందిగా వుండేది. కాని నేనున్న మనఃపరిస్థితులలో నా మనస్సు ఏదీ గమనించే స్థితిలో లేదు. ఏ ఆలోచనలూ లేవు. ఒక్కటే ఆలోచన. ఒక్కటే లక్ష్యము.

అదే నా “గురుదర్శనము”.

(సశేషం)

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here