సత్యాన్వేషణ-8

5
5

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]శ్రీ[/dropcap] గురుచరిత్రలో నామధారకుడనే బ్రాహ్మడు పరమపేదవాడు వుంటాడు. అతను ఎన్నో కష్టాల నడుమ శ్రీ గురుని కీర్తి గురించి విని, ఆయనను దర్శించాలని లేనిచో మరణమే శరణ్యమని తలచి గాణుగాపురము వస్తూ వుంటాడు. అతనికి కలలో ఒక సిద్ధుని దర్శనమవుతుంది. మరురోజు నడుస్తూ గాణుగాపురము వైపు వెడుతుంటే కలలో కనిపించిన ఆ సిద్ధుడు ఎదురుగా కనిపిస్తాడు. నామధారకుడు ఆయనను చేరి నమస్కరించి తనకు ఆయన దర్శనము వలన మనసుకు శాంతి చిక్కినది చెప్పి, శ్రీ గురు దర్శనార్థము వెడుతున్నాని చెబుతాడు. ఆ సిద్ధుడు నామధారకుని కూర్చోపెట్టుకొని శ్రీగురుని గురించి వివరిస్తాడు. సిద్ధుడు శ్రీగురుని శిష్యుడు.

శ్రీగురునిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీ నృసింహ సరస్వతీ యతివరేంద్రులు క్రీ.శ. 1380లో కరంజ నగరములో జన్మించారు. తల్లితండ్రులు ఆయనకు నరహరి అని పేరు పెట్టారు. పుట్టిన బాలుడు మూగవాడిలా ఏమీ మాట్లాడడు. ఎవ్వరు ఏమన్నా ‘ఓం’ అని సమాధానమిచ్చేవాడు. తల్లితండ్రులు దుఃఖపడుతూ వుంటే ఆయన కన్నీరు తుడిచి ఇనుప వస్తువు పట్టుకుంటే  అది బంగారముగా మారుతుంది. తల్లి ఆయన లీలలను దాచిపెట్టింది. బయటకు చెప్పలేదు.  ఏడు సంవత్సరముల వయస్సులో ఉపనయనము చేస్తారు. తల్లి నుంచి మొదటి బిక్ష స్వీకరించి వేదగానము చేస్తాడు నరహరి.

సన్యసించటానికి ఆయన తన తల్లిని తండ్రిని అనుమతి కోరుతాడు . ఒక సంవత్సర కాలము తల్లి కోరిక మీద వుండి ఆ తరువాత ఇల్లు విడిచి కాశీ పట్టణము చేరుతాడు. గంగ ఒడ్డున ప్రతిరోజూ తపస్సు చేసే ఆయనను చూచి అందరూ ఆశ్చర్యపోతూ వుంటారు. ఆయనను సేవించటానికి వీలుగా సన్యసించమని పండితులు కోరుతారు. లోక మర్యాద కోసము సన్యాసము తీసుకున్న నరహరికి గురువిచ్చిన నామము “నృసింహసరస్వతీ”.

ఆయన లోక సంచారము చేస్తూ భక్తుల కష్టాలను తీరుస్తూ వుంటారు. ఒక మహ్మదీయ రాజు (పూర్వజన్మలో అతను దత్తభక్తుడు)స్వామిని తన రాజ్యములోనికి రమ్మని ప్రార్థిస్తాడు. స్వామి వెళ్ళి దీవించి వస్తాడు. (బీదరు రాజు ఒక హైందవ సన్యాసిని కొలచేవారని చరిత్ర చెబుతుంది. బహమని సుల్తాన్ రెండవ అలాఉద్దీన్ అని చరిత్రకారుల అభిప్రాయం).

ఆయన దేశము అంతటా తిరుగుతూ రకరకాల కార్యాల ద్వారా ప్రజలలో భక్తిని కలగచేస్తూ కష్టాలు తీరుస్తూ గాణగాపురము చేరుతారు. విద్యలేక భ్రష్టు పట్టి శర ణన్న వాడికి సర్వ వేదాలు వచ్చేలా వరమిస్తాడు. వేదవేదాలు చదివి వేదాలను హేళన చేసే విప్రులకు బుద్ధి వచ్చేలా చేస్తాడు. పరమ భక్తులను, శరణు వేడిన వారిని రక్షిస్తూ వుంటారు. ఒక దీపావళికి వివిధ పల్లెల నుంచి వచ్చిన భక్తుల కోరిక ప్రకారము వారి ఏడుగురి పల్లెలకూ ఒకేసారి వెళ్ళి దీవించి వస్తాడు.

భీమా అమరజా తీరాన వున్న రావి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఆయన ముందుకు వచ్చి తనను కాపాడమని కోరుతాడు. ఆయన తీర్థంలో స్నానం చేయ్యమని చెప్పి పంపుతారు. ఆ తీర్థములో స్నానము చేసిన బ్రహ్మరాక్షసుడు మనిషిగా మారి శ్రీ గురుని వద్ద దీక్ష తీసుకు వెడతాడు. ఎందరి కుష్టు రోగమో ఆ తీర్థములో మునకలతో పోతుంది. మరణించిన వారు స్వామి కృపన బ్రతుకుతారు. ఎండిన చెట్టు ఆయన కృపన చిగురిస్తుంది. పాడైన పంట నుంచి రెట్టింపు దిగుబడి వస్తుంది. మూగవాడు కవిగా మారి కవిత్వము రాస్తాడు. ఒకటేమిటి అక్కడ స్వర్గములా వుంటుంది. శ్రీగురుని సేవించిన ప్రజల కర్మల నుంచి విడుదలై ఉత్తమ స్థితి పొందుతారు. నిత్య అన్నదానాలతో, నైష్టిక కర్మలతో అలరాడుతూ అమరావతిని మించి పేరు తెచ్చుకుంటుంది గాణుగాపురము.

శ్రీగురుడు ప్రజలను అలా ఎన్నో సంవత్సరములు కాపాడి చివరకు బహుదా నామ సంవత్సరము 1459 న శ్రీశైలము వెళ్ళి తామరపూల పడవ చేయించుకొని దాని మీద నదిలోకి వెళ్ళి అంతర్ధానమవుతారు. గాణుగాపుర ప్రజలు విలపిస్తూ వుంటే తమ పాదుకలను ప్రతిష్ఠించి, వాటిని తమ రూపుగా భావించమని, శరుణు కోరి వచ్చిన భక్తులను రక్షిస్తూ దుష్టులకు కనపడకుండా వుండటానికే తన రూపము మరుగున పరుస్తున్నట్లుగా చెబుతారు శ్రీగురుడు. ఆయన వాక్కు ప్రతి దినము గాణుగాపురములో మధ్యహ్నం మధుకరమునకు వస్తానని. ఆయన వాక్కు పై నమ్మకముతో శరణు వేడిన వారికి ‘ఓయీ’ అంటూ పలకరించి అనుగ్రహించే అద్బుత పట్టణము గాణుగాపురము.

ఈ కథను సిద్ధుడు అన్న శ్రీగురుని శిష్యుడు నామధారకునికి చెబుతాడు. నామధారకుడు ఆ కథను గ్రంధస్తం చేశాడు. మునుపు అది సంస్కృతములో వుండేది. తరువాత మరాఠీలోకి తరువాత తెలుగులోకి కూడా అనువాదమైనది. ఆ గ్రంధము గురువును కోరి పారాయణ చేస్తే తప్పక గురువు లభిస్తాడని తెలిపే వృతాంతాలు నేటికీ కొకొల్లలు.

“ధృత్వాకమండలు కరే దరటంకమాలికాం

కౌపీన మౌంజి భుజశాస్త్ర ముఖత్రి కేశవం।

నిత్యం హి వాస ఛాయిం శ్రీహరే

శ్రీ నృసింహ సరస్వతీ శరణం మాం భవపారకారణం॥”

పరమ దయాళువైన శ్రీగురుని కరుణను మనము ప్రత్యక్షముగా అనుభవించాలి, కానీ చెప్పటానికి భాష చాలదు. నేను ముందుగానే అక్కడ 3 రోజులు ఉండాలని, గురు చరిత్ర ఎంత కుదిరితే అంత చదవాలని అనుకున్నాను. వచ్చిన రోజు రాత్రి కానిచ్చి, మరునాడు శ్రీగురుని దేవస్థానానికి ఉదయమే వెళ్ళాను. శ్రీగురు పాదుకలు దర్శించి, దేవాలయ ప్రాంగణంలో ఒక చోట కూర్చొని సంకల్పము తీసుకొని ఆ రోజంతా గురుచరిత్ర చదువుతూ ఉండిపోయాను. మధ్యాహ్నము హరతి సమయములో ఢమరుకం మ్రోగించటము మొదలెట్టారు. అప్పటి వరకూ లేని వారు, వున్నవారు  కొందరు పరుగున వచ్చి అక్కడ వున్న గ్రిల్ మీద కడ్డీల మీద ఎక్కి వూగటము మొదలెట్టారు. కొందరు పూనకము వచ్చినట్లుగా వూగుతూ గడిపారు. ఆ హరతి అయ్యాక అంతా మళ్ళీ సద్దుమణిగింది. మళ్ళీ రాత్రి హారతి ఢంకా మ్రోగటము, కొంత మంది అలాగే వూగటము,   వారి వేషధారణ మూములుగా వున్నా, ఆడవారు జుట్టు విప్పుకోవటములో ఒక పిచ్చి కనపడుతుంది.

నా వరకూ నాకు వింతగా తోచింది ఈ విషయము. మర్నాడు, నేను ముందుగా మాట్లాడిన పూజారిగారు వూరు నించి వచ్చాడు. ఆయన నా తిండి గురించి అడిగి వారింటికి మధ్యహ్నం రమ్మనమని చెప్పి వెళ్ళాడు. నేను ఆయన చెప్పినట్లే వెళ్ళాను. పూజారిగారి మాతృశ్రీ వారు వండిన ప్రసాదం నేను సాధు సంతర్పణ చేశాను. అలా మధ్యాహ్నం అక్కడ వచ్చిన వారికి లేదనకుండా భోజనము వడ్డించటము జరుగుతుంది. కారణము దత్తస్వామి ప్రతిరోజూ భిక్షకు వస్తారు అక్కడ. నమ్మశక్యము కాని ఈ విషయము పరమ సత్యం.

ఇదే విషయమై ఒక సాధువు తెలుసుకోవాలనుకున్నాడుట ఎలాగైనా. ఆయన చాలా కాలము గాణుగాపురములోనే వున్నారట. దత్తస్వామిని గుర్తించి కాళ్ళు పట్టుకోవాలని మంచి పట్టుదలతో వున్నాడట ఆయన. ఒకనాడు మధ్యహ్నం భిక్ష సమయానికి ఆయనకు విపరీతమైన చలి, జ్వరము వచ్చాయట. ఎటూ కదలలేక వారు బసలో పడుకుండిపోయారుట. ఆయనకు మళ్ళీ మెలుకువ వచ్చే సరికే మూడు గంటలు. మంచి ఆకలి వేసి అప్పుడు భిక్షకు ఎప్పుడూ వెళ్ళే ఇంటికే వెళ్ళారుట. ఆ ఇల్లాలు “మధ్యహ్నం ఇచ్చానుగా మళ్ళీ వచ్చారేంటి బాబా” అని భిక్ష పెట్టినదట. ఆయనకు అర్థం కాలేదు. బసకు వచ్చి తిని పడుకుంటే కలలో దత్తస్వామి కనిపించి “నీ రూపున నేనే భిక్ష చేశాను. నన్ను పట్టుకోవాలని చూడకు” అన్నారుట. ఇది నిజంగా జరిగిన సంఘటన. మనకు ఆచార్యశ్రీ ఎక్కిరాల భరధ్వాజ మాష్టారు గారి పుస్తకములో కనపడుతుంది.

గాణుగాపురములో మధ్యహ్నం వచ్చే ప్రతి భిక్షు శ్రీ దత్తుని రూపముగా భావిస్తారు. అందుకే అక్కడ మధ్యహ్నపూట వచ్చే సాధువులకు భిక్ష సమర్పించటమన్న ‘సేవ’ యాత్రికులకు ఈ బ్రాహ్మణ పూజారులు కలిపిస్తారు. అలా ఆ సేవ చేసుకున్న తరువాత, పూజారిగారు నాకు కంచం ఇచ్చి వెళ్ళి ఐదిళ్ళలో భిక్ష చెయ్యమని పంపాడు. ఆయన చెప్పినట్లుగా ఆ పాత్రతో ఐదు గృహాలకి మధుకరీ భిక్షకి వెళ్లి ప్రసాదం తెచ్చుకొని, దానిని భుజించాను. కొందరికి గురు నామం జపిస్తూ బిక్ష వేశాను. మధుకరీ బిక్షకు గురుసంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు సమస్త ప్రపంచాలకి సర్వం ప్రసాదించు మహాదేవుడు కపాలం చేతపట్టి ఆది భిక్షువుగా తిరిగాడు. సన్యాసికి మన సమాజంలో ఎంతో పూజ్య స్థానం ఉంది. సమాజం కోసం, మన కోసం వారు వారి జీవితాలని త్యజించి, అహం అన్నది లేకుండా బిక్ష ఎత్తి, మన నుంచి బిక్ష స్వీకరించి, తద్వారా మన పాపాలను తుడిచి సమాజ హితవు చేస్తున్నారు.

అటు తరువాత సంగమము దర్శించటానికి వెళ్ళాను. నీరు లేదు నదిలో.  మధ్యన కొంత బురద వుంది. బురదనూ నీటిని సమానముగా చూచే అవదూత స్థితి కాదు నాది. అందుకే ఆ బురదలో కొంత లోపలికి వెళ్ళాక నీరులా వున్న చోట, ఆ నీటిని తలపై చల్లుకు ప్రోక్షణ చేసుకు వడ్డుకు వచ్చాను.

వడ్డున వున్న ఔదుంబర వృక్షం క్రింద కూర్చొని గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు ఎంతో మంది. చదువుకోవటానికి బల్లలు వీలుగా వేసి వున్నాయి. కొందరు ప్రమిదలతో దీపం వెలిగించి చదువుతున్నారు. ఆ చెట్టు క్రింద చిన్న శివాలయముంది. నేను ముందు మహాదేవునికి నమస్కరించి వచ్చి కూర్చొని నా గురు చరిత్ర పారాయణం మొదలెట్టాను. నా ప్రక్కన ఒక పదహారేళ్ళ పిల్లాడు కూడా చదవటము మొదలెట్టాడు. ఇంతలో హరతి నజరా మ్రోగించటము మొదలయ్యింది. నా ప్రక్కనున్న పిల్లాడు కడుపు పట్టుకు వూగడము మొదలెట్టాడు. మొకము నొప్పితో వంకరులు పోవటము నాకు కంగారుగా అనిపించి లేచి పట్టికొని “ఏమైనా కావాలా” (Are you ok?) అని అడిగాను.

అతను తల అడ్డంగా వూపాడు. హారతి అయ్యాక చెప్పాడు. అతని మీద ఏదో దుష్ట ప్రయోగము జరిగినదట. ఆరోగ్యము పాడైనదట. గాణుగాపురములో శ్రీగురు చరిత్ర చదివితే మాములుగా అవుతుందంటే వచ్చి గురుచరిత్ర చదువుతున్నాడతను. హరతి ఢంకా చప్పుడుకు కడుపులో మెలి పెట్టినట్లిగా అవుతుందట. అందుకే అలా వూగిపోయానని చెప్పాడతను.

“మరి ఎలా తగ్గుతుంది కడుపులో నొప్పి” అడిగాను నేను.

“తగ్గుతోంది రోజురోజుకు. ఇంకో పదిరోజులకూ పూర్తిగా నయమవుతుంది. పూర్వం చాలా నొప్పిగా వుండేది. ఇప్పుడంత లేదు” అన్నాడతను. నాకు అప్పుడర్థమయ్యింది గుడిలో ఆ గ్రిల్లులు పట్టుకు ఎందుకు కొందరూ వేలాడుతూ కనిపించారో హరతి సమయములో.

శ్రీగురుని పల్లకీ సేవ చాలా అద్బుతంగా జరుగుతుంది. ప్రతిరోజూ సాయంత్రము ఏడు గంటలకు మొదలవుతుంది. ఆ పల్లకిలో శ్రీగురుని ఉత్సవమూర్తిని తీసుకొని మఠము చుట్టూ త్రిప్పుతారు. ఆ పల్లకీ వచ్చే దారిలో అడ్డంగా భక్తులు పడుకుంటారు. వారిని దాటుతూ, భక్తులను పూజారులు తమ కాళ్ళు తాకిస్తూ వారి మీదుగా పల్లకిని తీసుకుపోతారు. అలా పల్లకీ దాటితే మనలోని భూత ప్రేతాలే కాదు పూర్వ కర్మలూ పోతాయని భక్తుల నమ్మకము. ఏదీ పోయినా పోకపోయినా మనలోని శరీరముపై మమకారము పోతుందనిపించింది నాకు.

నేను ముందు కొంత ఊగిసలాడినా ఆ సేవ శ్రీగురునికి చేశాను. ఆ క్షణం నాకు కలిగిన  ఊహ ఈ శరీరం ఆత్మకు ఉన్న తొడుగు. ‘నేను’ అంటే  శరీరం కాదు. లోన ఉన్న ఆత్మని పరమాత్మలో కలపాలి. అదే ఊహ కలిగింది. కొంత శరీరము పై వ్యామోహం వీడింది. గురు దర్శనానికై మనసు వేగిరపడింది. మఠములో శివ అభిషేకము చేస్తారు. నేను అభిషేకానికి కట్టినాక, నాచే అర్చకులు చేయించిన విధిని భక్తిగా చేశాను. అభిషేకమైనాక గురు చరిత్ర చదువుతూ మఠములో రాత్రి వరకూ వుండిపోయాను. మధ్యలో పూజారిగారు భోజనానికి రమ్మన్నా నే వెళ్ళలేదు. ఆ మూడు రోజులలో ఒక్క రోజు మాత్రము భోంచేశాను. మిగిలిన రెండు రోజూలు గురు సేవ చేస్తూ, గురు చరిత్ర చదువుతూ, మంత్ర జపముతో గడిపాను. గుడిలో అన్నదానము కట్టాను. మనము పాదుకల వద్దకు వెళ్ళలేము. ఒక కిటికి గుండా దర్శించుకోవాలి. ఆ కిటికి వద్దకు వెళ్ళే ముందు ద్వారము వద్ద వున్న అర్చకులు నేను కట్టిన డబ్బుకు అర్చన చెయ్యవచ్చని నా చే కూర్చోబెట్టి పూజ చెయ్యించారు. మనసులో కోరిక తీరుతుందని దీవించాడాయన. “నేను చాలా పెద్ద కోరికతో వచ్చా” నని చెప్పా నతనికి.

సద్గురువు దర్శనము”!

ఆయన నాతో, “తప్పక దొరుకుతుంది. శ్రీగురు దర్శనార్థం వచ్చిన వారంటే గురువుకు ప్రీతి” అని నవ్వి దీవించాడు. ఆయన నవ్వు నేటికి మరుపుకు రాదు. అంత కరుణ వున్నది నవ్వులో.

అనాది కాలం నుండి వెలుగొందిన

దివ్యమైన పురము ఇది సద్గురువుల నిలయమిది

జ్ఞాన,ధ్యాన బోధానిధి దత్త గురువు

మధుకరికై నడయాడిన నగరు ఇది

సర్వ పాపములను ప్రశమించే భీమా అమరజా సంగమమిది

మృత్యునకు జీవమిచ్చిన అశ్వత్థ వృక్షమిది

భూత ప్రేత పిశాచాల నశింపచేయు నజార అదే

కోరిన కోరిక తీర్చు కల్పవృక్ష నీడ అదే

సర్వ అహంకార మదమడుచు స్వామివారి పల్లకి

అహమన్నది వదిలేసిన మోక్షమిచ్చు ధరణి అదే

శ్రీగురుని క్షేత్రమదే గాణ్గా పుర పట్టణమదే!!

అలా నా మూడు రోజుల గాణుగాపుర నివాసము ముగిసింది. నాల్గవనాటి ఉదయాన దర్శనం చేసుకొని, శ్రీగురుని ప్రత్యక్ష దర్శనం కోరి మరల మరల ప్రాధేయపడి దండాలు సమర్పించాను. నాతోడు నీడగా నిలిచే దత్తస్వామికి  శ్రీగురు రూపమైన ఆ పవిత్ర పాదుకలకు నా ఆర్తి, తపన వినిపించాను. విడవలేక విడవలేక ఆ పవిత్ర పట్టణం నుంచి మధ్యాహ్నపు వేళ నా తదుపరి మజిలీ అయిన అక్కల్కోట వైపు వెళ్లే బస్సు ఎక్కాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here