సందేహాలు తీర్చిన ‘సత్యాన్వేషణ’

0
12

[dropcap]భా[/dropcap]రతీయ ధర్మంలో తల్లిదండ్రుల తరువాత ప్రాముఖ్యత గురువులకీయబడింది. కొన్నిసార్లు తల్లిదండ్రుల కంటే గురువులే మిన్నవుతారు. సాధారణ/లౌకిక విద్య నేర్పడానికి ఉపాధ్యాయులు, ఆచార్యులు ఎంత అవసరమో – ఆధ్యాత్మిక పథంలో ప్రయాణించేవారికి ‘సద్గురువు’ అండదండలు అంతే అవసరం.

గురువు సహాయం లేకుండా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించలేరు ఎవరూ. గురువుని త్రిమూర్తులతో సమానంగా పరిగణించే ధర్మం మనది. గురువంటే సత్యం మూర్తీభవించిన రూపం. అందుకే గురువు కోసం చేసే అన్వేషణ సత్యాన్వేషణ అవుతుంది.

ఆధ్యాత్మిక క్రమంలోకి అడుగుపెట్టిన వారికెవరికైనా తొలి అవసరం – గురువు. గురువు లేకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధించినవారు అతి తక్కువమంది. వారికి కూడా ఏదో అంతర్గత ప్రేరణే గురువుగా పనిచేసి ఉంటుంది.

సాధారణంగా పురుషులు తమ గురువుకై అన్వేషిస్తూ, దేశమంతటా తిరగటం మనం విన్నదే. కానీ ఓ మహిళ, భారతదేశంలో జన్మించి – భౌతికవాద దేశమైన అమెరికాలో నివాసముంటూ – ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి తనకు అండగా నిలిచే గురువుకై తపిస్తూ – భారతదేశం వచ్చి – ఉత్తర, దక్షిణ భారతదేశాలు తిరిగి ఎందరో గురువులని కలిసి – చివరికి తన గురువుని, మార్గదర్శకుని గుర్తించి – ఆయనను శరణువేడి – సాధనలో సఫలీకృతులవడం విశేషం.

***

మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సంధ్యా యల్లాప్రగడకి బాల్యం నుంచి కుటుంబంలోని ఆచార్య వ్యవహారాలు, పెద్దల పట్ల మర్యాదలు అలవడ్దాయి. అతిథులను ఆదరించడం నేర్చుకున్నారు. పెరిగి పెద్దయ్యాకా, సాధారణ భక్తి భావమే తప్ప – ఆధ్యాత్మిక పథంలోకి వెళ్ళాలన్న ఆలోచన అప్పటికి లేదు.

కొద్ది నెలల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరూ కన్నుమూయడంతో – మానసికంగా బాగా విచలితమవుతారు సంధ్య. ఆ వేదన నుంచి బయటపడడానికి ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తారు. ముందుగా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారు. కాస్త మనసు తెరిపిన పడ్డాకా, ఒక గురువుని పొంది, వారు చెప్పిన పద్ధతులలో సాధన చేస్తే ఆత్మోన్నతి కలుగుతుందని గ్రహిస్తారు. అప్పటికే సంధ్య గారు షిరిడీ సాయిబాబాని ఆశ్రయించి ఉన్నారు.

ఆ సమయంలో అమెరికా వచ్చిన కుర్తాళం పీఠాధిపతికి తమ ఇంట్లో బస ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది సంధ్యగారికి. సద్గురు దర్శనం కోరితే, ఆయన ఓ మంత్రం ఉపదేశించి లక్ష జపం చేయమంటారు. గురుచరిత్ర, సాయిబాబా చరిత్ర పారాయణం చేస్తూనే తన అన్వేషణ కొనసాగించారు. సత్సాంగత్యం ఎంతో అవసరమని గ్రహించారు.

కర్మభూమి కాని అమెరికాలో చేసే సాధనా ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయని గ్రహించి, భారతదేశం వచ్చి ఆలయ/గురు దర్శనం చేస్తూ, తన గురువును పొందాలని నిశ్చయించుకుంటారు సంధ్య.

ఈ ప్రయాణంలో తొలి అడుగు మాణిక్యనగర్. అక్కడ దత్తావతారం మాణిక్యప్రభువుని సందర్శించుకుంటారు. తనని కరుణించమని వేడుకుంటారు. తర్వాత గాణ్గాపురం చేరుతారు. అక్కడి ఓ అధికారి కటువుగా ప్రవర్తించినా, నొచ్చుకోరు సంధ్య. ఓ చిన్న గదిలో బస చేసి గురుచరిత్ర పారాయణం చేసుకుంటారు. గురువుని చూపమని ప్రార్థిస్తారు. ఈ ఆలయంలో ఉండగా తన అస్తిత్వం గురించిన ఎన్నో ప్రశ్నలు సంధ్యగారిని వేధిస్తాయి. వాటికి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. తర్వాతి మజిలీ అక్కల్‍కోట. స్వామి సమర్థ దర్శనం. గురువుకై వేడుకోలు.

ఇక్కడి నుంచి కొల్హాపూర్ వెళ్ళి మహాలక్ష్మిని దర్శించుకుంటారు. వెంట పురుషులు లేరని అభిషేకానికి ఆలయ సిబ్బంది అంగీకరించరు. స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మకి శరీరం ఒక ఉపాధి మాత్రమే కదా, అయినా ఎందుకు ఈ భేదాలు అని వాపోతారు. ఈ ఆలయంలో ఒక వృద్ధ స్త్రీతో కలిగిన పరిచయం, తదనంతర ఘటనల గురించి పుస్తకంలో చదవాల్సిందే. అక్కడ్నించి షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకుని తన మనోరథం వెలిబుచ్చుతారు. ఏ ఆలయాన్ని సందర్శించినా, ఏ దైవాన్ని వేడుకున్నా – ఆవిడ కోరిక ఒక్కటే – తన గురువుని కలవాలని!

రెండో దఫాలో సంధ్య గారు హిమాలయ యాత్ర చేస్తారు.

ఇక్కడి తొలి మజిలీ ఋషీకేశ్. ఈ పుణ్యస్థలిలో అడుగిడినందుకు, దేవభూమిలో సంచరించగలిగినందుకు తన జన్మ ధన్యమైందని భావిస్తారు. తాను బస చేయడానికి బుక్ చేసుకున్న పరమార్థ ఆశ్రమంలో ఎదురైన భంగపాటు ఆమెను కలవరపరుస్తుంది. కానీ మరో మంచి వ్యక్తి జోక్యంతో ఆవిడకు గది దొరుకుతుంది. భావోద్రేకాన నడుమ గంగ ఒడ్డున కూర్చుంటే సాంత్వన కలుగుతుంది. గంగ మీద ఓ కవిత ఉప్పొంగుకొస్తుంది. అక్కడి జియర్ మఠంలో ఉంటూ సాధన చేశారు. ఇక్కడ కొద్దిపాటి అనారోగ్యానికి గురై, మానసికంగా కూడా కొద్దిగా క్రుంగిపోతారు సంధ్య. ఆ సమయంలో వారి సోదరి ప్రాణిక్ హీలింగ్ చేస్తారు. మహావతార్ బాబాజీ గురించి వ్రాసిన ఓ పుస్తకం చదివి పునః ప్రేరణ పొందుతారు సంధ్య.

ఋషీకేష్ నుంచి దేవప్రయాగ వెడుతూ ఆ మార్గం సౌందర్యాన్ని వివరిస్తారు. దేవప్రయాగలో గంగ ఒడ్డున కాసేపు నడుస్తారు. సాధన చేస్తారు. పండాలకు దక్షిణనిస్తారు. ఈ మార్గంలోనే ఉన్న వశిష్ఠ గుహని దర్శించి, వశిష్ఠుడి గొప్పతనాన్ని స్మరించుకుంటారు.

‘పరమార్థ నికేతన్’ సంస్థకు వెళ్ళి, దానిని నిర్వహిస్తున్న స్వామి చిదానంద సరస్వతి గారిని దర్శించాలనుకుంటే, వారు దేశంలో లేరని తెలుస్తుంది. అక్కడ కలిగిన కొన్ని అనుభవాల వల్ల ఆయన తన గురువు కారని సంధ్య గ్రహిస్తారు.

అక్కడి నుంచి జ్యోషీమఠ్‌కి ప్రయాణం. హిమాలయాలలో ప్రయాణం అంటే కొందరు ఎందుకు భయపడతారో ఈ మార్గంలో అనుభవమవుతుంది సంధ్యగారికి. అలాంటిది జగద్గురువు ఆది శంకరాచార్య అన్నిసార్లు దేశం నలుమూలాలా ఎలా సంచరించారా అని ఆది గురువుని తలచుకుని ప్రణామాలర్పిస్తారు. శంకరులు వారి రచించిన సౌందర్యలహరి లోని ఏ ఒక్క శ్లోకమైనా మనలని దరి చేరుస్తుందని అంటారు. అక్కడి శంకరమఠం సందర్శించి ఓ స్వామీజీని కలుస్తారు. అక్కడికి దగ్గరలో ఉన్న కల్పవృక్షానికి నమస్కరించుకుంటారు. యోగ నారసింహుని ఆలయాన్ని దర్శిస్తారు. ధారాదేవి ఆలయం చూసి, మాతని దర్శించుకుని తృప్తి చెందుతారు.

అవకాశం ఉన్న చోటల్లా జపమో, యోగ సాధననో చేస్తూ – తాను వచ్చిన లక్ష్యాన్ని మనసులో నిరంతరం మెదిలేటట్టు చేసుకున్నారు.

ఈసారి ప్రయాణం దక్షిణ భారతదేశం.

ముందుగా తిరువణ్ణామలై వచ్చి రమణాశ్రమం సందర్శన. సాధన. గిరి ప్రదక్షిణ చేస్తారు. తరువాతి మజిలీ కాశీ. వారణాసి వెళ్ళేందుకు విమానాశ్రయంలో ఉండగా, అనుకోకుండా కుర్తాళం స్వామి వారి దర్శనమవుతుంది. అయనకు నమస్కరించి తన సందేహాలను వివరించగా, సరైన మార్గంలోనే సాగుతోంది సాధన ఆయన భరోసా ఇస్తారు. కాశీలోని ఆంధ్రాశ్రమంలో స్వామివారు సంధ్యగారికి గురుబోధ చేస్తారు. కాశీలోని ఆలయాలను దర్శిస్తారు. అఘోరాలను చూస్తారు. గంగ ఒడ్డున నడుస్తారు. సాధన కొనసాగిస్తారు.

తర్వాత మంత్రాలయం దర్శిస్తారు. అనంతరం మాతా మాణికేశ్వరిని దర్శించుకుంటారు. ఆమె శిష్యుడి ప్రవర్తన వల్ల మహానుభావుల అనుచరుల పట్ల విరక్తి కలుగుతుంది. తమ కుమార్తె కలిసి నేపాల్ వెళ్ళి పశుపతినాథుని ఆలయం దర్శిస్తారు.

మళ్ళీ హిమాలయాలు. ఈసారి బదరిలో బస. హిమాలయ యోగులకెందరికో బదరి ఆవాసమని చెబుతారు. బదరిలో అలకనంద ఒడ్డున ‘బ్రహ్మకపాలం’ సందర్శిస్తారు. అక్కడ తన తండ్రిగారికి కర్మ చేయాలనుకున్నా – స్త్రీలకి ఆ అర్హత లేదని పూజారులు చెబితే బాధపడతారు. దానికి బదులుగా అన్నవితరణ చేయవచ్చని మరో స్వామీజీ సూచిస్తే, అన్నదానానికి డబ్బు కట్టి వస్తారు. బదరిలో పరిచయమైన సూరమాత అనే సన్యాసిని గురించి పుస్తకంలో చదవాల్సిందే. ఆవిడ మనోనిబ్బరానికి అబ్బురపడతాం.

తిరిగి వచ్చేసాక గురువునని చెప్పుకునే ఓ వ్యక్తిని కలవాల్సి వస్తుంది. మొదట బాగానే ఉన్నా రాను రాను ఆయన సొంత బాకా ఎక్కువవడంతో ఆయన తన గురువు కాదని గ్రహిస్తారు. కొంత భయపడినా, తనకి తాను ధైర్యం చెప్పుకుంటారు.

వైజాగ్‍లో ఒక టీచర్ గారిని కలిసి తన అన్వేషణలో మరికొంత ముందుకు సాగుతారు. ఆవిడ చెప్పిన విషయాలు తనకు ఉపకరిస్తాయని నమ్మారు.

విజయవాడలో శ్రీ నిర్గుణ చైతన్యస్వామి వారిని దర్శించి, వారి బోధకి ముగ్ధులవుతారు. సాధనలో ముందుకు సాగమని ఆయన సూచిస్తారు.

దేవీదాసు అనే గురువుగారి పరిచయంతో సంధ్యగారి సంశయాలు దూరమవుతాయి. అయన తనకి మంత్రోపదేశం ఇవ్వలేదని కొంచెం బాధపడినా, తన గురువు వేరే ఉన్నారని ఆయన సూచించినట్లు గ్రహించారు.

చివరిగా తాను అన్వేషిస్తున్న గురుమూర్తి దొరుకుతారు. ఆయన శిష్యురాలిగా స్వీకరిస్తారు. మార్గదర్శనం లభించింది. శోధన ముగిసి సాధన కొనసాగుతుంది.

***

ఈ పుస్తకంలో ఆయా ఆలయాలను/గురువులను సందర్శించినప్పుడు – రచయిత్రి ఆయా దేవతలకు సంబంధించిన శ్లోకాలు పొందుపరచడం, ఆ గురువుల గొప్పతనాన్ని వర్ణించడం విశేషం.

చిత్తశుద్ధితో కృషి చేస్తే ఎవరికైనా సద్గురువు లభించగలరన్న భరోసానిస్తుందీ పుస్తకం. ఆధ్యాత్మిక పుస్తకం అయినప్పటికీ భాష ఎంతో సరళంగా ఉండి ఆసక్తిగా చదివిస్తుంది.

ఇంతమంది గురువుల గురించి ఒకేచోట చదవడం గొప్ప అనుభూతి. సాధారణ పాఠకులైనా, ఆధ్యాత్మిక పథంలో ఉన్న సాధకులైనా తప్పక చదవలసిన పుస్తకం ‘సత్యాన్వేషణ’

***

సత్యాన్వేషణ (ఆసేతుహిమాచల శోధన)
రచన: సంధ్యా యల్లాప్రగడ
పేజీలు: 264
వెల: ₹ 250
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా హైదరాబాద్ 9000413413,
అచ్చంగా తెలుగు ప్రచురణలు – 8558899478
ఆన్‌లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://books.acchamgatelugu.com/product/satyanveshana/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here