కాజాల్లాంటి బాజాలు-106: సెర్చ్..

3
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]ర్జంటుగా అల్లప్పుడెప్పుడో రాసిన కథ ఎవరో కావాలని అడిగేరు. అసలు నేను చాలా సిస్టమెటిక్‌గా ఉంటాను. కథలన్నింటినీ ఒక ఫోల్డర్‌లో పెట్టి సేవ్ చేసుకుంటుంటాను. ఎటొచ్చీ అవి ఏ పేరుతో సేవ్ చేసుకున్నానో మర్చిపోతుంటానంతే. కావల్సిన కథ కోసం డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్‌లో వెదికేను. నేను సృష్టించుకున్న ఫోల్డర్స్‌లో వెదికేను. ఆఖరికి పొరపాటున ఫొటోలున్న ఫోల్డర్ లోకి వెళ్ళిపోయిందేమోనని అవి కూడా వెదికేసేను. కావల్సిన కథ మటుకు కనపడలేదు.

అసలు కథ మొదలుపెట్టేటప్పుడు నేను టైటిల్ పెట్టను. కథంతా అయ్యేక పెడుతుంటాను. అందుకని కొంత కథ రాసాక సేవ్ చెయ్యాలనుకున్నప్పుడు ఆ కథలో మొదటి పదాలతో సేవ్ చేసేస్తుంటాను. కొన్ని కథలకి ఆ ప్రారంభం బాగుండదనిపిస్తుంది. మార్చేస్తాను. కానీ పేరు మటుకు పాతదే ఉండిపోతుంది. ఇలా నాలుగైదుసార్లు కూర్చుంటే కానీ నాకు కథ పూర్తవదు. అందుకని ఓ రెండుసార్లు మార్చేక అలా ఏ పదాలతో సేవ్ చేసుకున్నానో మర్చిపోతుంటాను. అందుకని దానిని సేవ్ చేసుకుందుకు 1 అనే నంబర్ పెడతాను. మళ్ళీ ముగింపు నచ్చదు. దానిని మార్చినప్పుడు 12 అనే నంబర్లు పెడతాను. ఆఖరికి ఏ పత్రికకైనా పంపేటప్పుడు కానీ దానికి టైటిల్ రాసే అవసరం రాదు. అలా టైటిల్ రాసేసి కథ పంపాక అది ప్రచురించబడితే పరవాలేదు. కానీ తిరిగొచ్చిందనుకోండి.. మళ్ళీ దాని టైటిల్ మార్చేస్తాను. కానీ నా డెస్క్ టాప్ మీద మటుకు అలా 1, 12, 123 నంబర్లతో మాత్రమే సేవ్ అయివుంటుందా కథ. వాటినన్నింటినీ ఒక ఫోల్డర్ లోకి తోసేస్తుంటాను. అదే అసలు గొడవ. ఏదైనా కథ కావల్సివస్తే మొత్తం అన్ని కథలూ అలా నంబర్లతో ఉన్నవాటినన్నింటినీ ఓపెన్ చేసి కాస్త చదివితే కానీ కావల్సిన కథ అవునో కాదో తెలీదు. అందుకోసం బోల్డు టైమ్ వేస్టయిపోతుంటుంది.

అంతేకాక కొన్ని కథలని ఇంక అది పబ్లిష్ అయిపోయింది కదా అని డిలీట్ చేసేస్తుంటాను. అందుకని ఒక్కొక్కసారి అన్నీ తిరగేసినా కనపడదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాటి గురించి ఆలోచించుకుంటూ వెతుకుతుంటే బోల్డు టైమయిపోయింది. అలా చాలాసేపు కావల్సిన కథ కోసం వెతికాక కాసేపటికి నా బుర్ర ట్యూబ్ లైట్‌లా వెలిగింది. అవునూ! నా మెయిల్‌కి వెళ్ళి సెంట్ అనే చోట క్లిక్ చేసి, అక్కడ సెర్చ్‌లో ఈ కథ ఎక్కడికి పంపానో చూసుకుంటే నా కథ వచ్చేస్తుంది కదా అనిపించింది. హమ్మయ్య. భలే అవిడియా అని నన్ను నేనే మెచ్చేసుకుంటూ మెయిల్‌లో సెంట్ కి వెళ్ళేను. కానీ మళ్ళీ అనుమానమే.. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు మెయిల్‌లో అక్కర్లేనివీ, అనవసరం అనుకున్నవీ డిలీట్ చేసేస్తుంటాను. అయినా ప్రయత్నిద్దామని అసలా కథ దేనికి.. ఏ పేరుతో పంపించేనూ….అని ఆలోచించడం మొదలెట్టేను.

ఎందుకంటే నేను చాలా బాగా రాసానూ అనుకున్న కథ వెంటనే ఏ పత్రికా వేసుకోదు. ఏదో అలా అలా రాసి పడేసినవి వెంఠనే వేసేసుకుంటారు. అలా నాకు నచ్చిన కథలను పేరు మారుస్తూ ఒకదాని తర్వాత మరో పత్రికకి పంపుతుంటాను. అలా నాలుగైదింటికి పంపితే కానీ నేనెంతో కష్టపడి రాసిన, నాకు నచ్చిన కథ ప్రచురించబడే యోగం పట్టదు. మరిప్పుడీ కథ అలాంటిదే.. దేనికి ఏ పేరుతో పంపానో గుర్తు లేదు. ఈ కథ గురించి ఒక ఫ్రెండ్‌తో చెపితే దానిని పంపితే చదివి ఎలా ఉందో చెపుతానందని ఆ కథ కోసం వెతుకుతున్నాను. ఆ ఫ్రెండ్ కథలను బాగా చదువుతుంది. అందుకని ఆ కథను ఎలా మారిస్తే ప్రచురించబడుతుందో చెపుతుంది కదా అని అనుకుంటే ఇప్పుడా కథ ఎక్కడుందో కనిపించటం లేదు.

సెంట్ బాక్స్‌కి వెళ్ళి సెర్చ్ అన్నచోట ఆ పత్రిక పేరు కొడదామంటే ఏ పత్రికో మర్చిపోయేను. గుర్తొచ్చిన రెండుమూడు పత్రికలకి పంపానేమో అని చూస్తే వాటిలో లేదు.

ఇంక ఇది పని కాదని మా వదినకి ఫోన్ చేసి నా బాధ చెప్పుకున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మా వదిన బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. నేను చెప్పిందంతా ఓపిగ్గా విన్న వదిన,

“ఆ మాత్రం తెలీదా! చిన్నప్పుడు మీ ఇంట్లో ఏదైనా వస్తువు కనపడకపోతే ఏం చేసేవారూ!”

“ఏం చేస్తాం…అందరం తలో మూలా వెతికేవాళ్లం.”

“మరి కనిపించేదా!”

“ఊహు.. సూది కోసం వెతుకుతుంటే అప్పుడెప్పుడో కనపడలేదని వెతుక్కున్న ఎర్రరంగు దారం కనిపించేది. మా అమ్మ సెనగపప్పు కోసం డబ్బాలన్నీ తిరగేస్తుంటే అది తప్ప మిగిలిన పప్పులన్నీ కనిపించేవి.” చిన్నప్పటి సంగతి గుర్తు రాగానే ఆనందంగా చెప్పేను.

“చూసేవా! ఒక నగ్నసత్యం చెప్తాను గుర్తు పెట్టుకో. నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో అది నీకు కనపడదు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందీ!”

స్కూల్లో పిల్లాణ్ణి అడిగినట్లు ప్రశ్న లడుగుతున్న వదిన మీద కాస్త కోపం లాంటిది వచ్చింది.

“ఏమిటర్థమయేదీ! వెతికితే కనపడదూ అని” అన్నాను విసుగ్గా.

“ఊహు.. కాదు.. నువ్వు దేన్ని వెతుకుతుంటే అది కనపడదు. ఇప్పుడు వెతకడం మానెయ్యి. కొన్నాళ్ళు పోయేక వేరే ఏదో కావల్సొచ్చి వెతుకుతావు చూడూ… అప్పుడిది కనిపిస్తుంది..” అంది. నాకు వదిన మాటలకి చిరాకు అనిపించి టక్కున ఫోన్ పెట్టేసేను. ఆ రోజంతా కథ కనపడలేదని చిరాకుగానే ఉన్నాను.

ఓ నాల్రోజులు పోయేక సిస్టమ్ చూస్తుంటే ఏదో పత్రిక పెట్టిన కవితలపోటీ ప్రకటన కనిపించింది. ఈమధ్య ఇంట్లో తీరుబడిగా కూర్చుని ఎడాపెడా చాలా కవితలు రాసి పడేసేను. అందులోది ఏదైనా ఈ పోటీకి పనికొస్తుందేమోనని కవితలన్నీ పెట్టిన ఫోల్డర్ తీసేను.

హాశ్చర్యం.. అందులో మొట్టమొదట కనిపించిందే నేను వెతికి వేసారిపోయిన కథ. ఆ కథ ఈ ఫోల్డర్ లోకి ఎలా వచ్చిందీ అనుకుంటూంటే వదిన చెప్పిన నగ్నసత్యం గుర్తొచ్చింది. కవిత కోసం వెతుకుతుంటే కథ కనపడింది. వెంటనే దానిని కథల ఫోల్డర్ లోకి మార్చేసి, “అమ్మ వదినా…నీ బుర్రే బుర్ర..” అనుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here