శీల నిర్మాణం

4
9

[dropcap]తొ[/dropcap]లికోడి కూతనో
చెట్టుమీద పిచ్చుకలో
మేలుకొలుపులు చెప్పిన ప్రతిసారీ
ఒకే ఒక్క భావం మనోఫలకం పై చిగురిస్తుంది

శీలం అంటే అనిర్వచనీయ అభిప్రాయమై
మెరుపు తీగ లా
వెనువెంటనే అలా
లాలనలో పాపలా
పాలనలో క్షేమం లా
రాగద్వేషాలు లేని రోజులను వెంటేసుకొని
మనసు పందిరిపై పచ్చని తీవ లా
నునువెచ్చని కాల వ్యవధి లా కన్నతల్లి స్పర్శలా రావాలి

నీదైన శైలీ శిల్పపు మంచితనపు
సౌశీల్యం
బాల్యం బొమ్మలు పొదరింటికెదిగిన చందంలా
చందమామ తినిపించిన గోరుముద్దలు
విరిసీ
అతివృష్టి అనావృష్టి భావనలు వీడి
మంచితనపు మట్టి వాసన వీచినట్టు
గుణ స్వరూపమూ
స్వభావ స్వరూపమూ
నలుగురు నీతో కలివిడి తనపు
ముచ్చటైనప్పుడు
మనుషులు నీ బతుకు ఖాతా పుస్తక లెక్కలై
పొదుపు నీ ఆదాయపు అసలుగా అయ్యి
పనితనం మొత్తం ఖర్చు వనరు అయినప్పుడు
శీలం ఆవృత ధారణ రూపంలో నీ వెనకే నడుస్తుంది

అవినీతి సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడని జీవితం నీ చిట్టా పద్దు మొదటి సంఖ్య గా
అయినప్పుడు
మాట మొట్టమొదటి వేకువ చిద్విలాసం లా
భాష బాట దాటిన బాటసారిని చేసినప్పుడు
గగనపు గమకాలుగ
గగనికైనా యవనికైనా ఒక్క తీరు కొలువైనప్పుడు
జీవన నాటక రంగం మొత్తం రంగుల హరివిల్లవుతుంది

లోకం పోకడ లో లోతులెరిగినా
అబద్ధపు దృశ్యానివి కానప్పుడు
గిజిగాడి నిపుణుత
విలుకాని గురి అంత
పనులకు పరిస్థితులకు నడుమన
పిరికి చర్యవూ కానంతవరకు
అంతవరకు
నీ నిర్మాణ కౌశలం లో
శీలం సంధి కార్యమై
నిన్నో ఉన్నత శిఖరాల పరంపరలో
నిరంతర మురిపించే
మకుటాన్ని చేస్తుంది

కొత్త దారిని వేస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here