‘మైనా’ ఎగిరిపోయింది

0
11

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, చిత్రకారులు, రచయిత శీలా వీర్రాజు గారి ఆకస్మిక మరణం సాహితీ లోకాన్ని దుఃఖ సంద్రంలో ముంచిన తరుణంలో వారికి నివాళి.

~

‘మైనా’ ఎగిరిపోయింది

“నీ పుస్తకానికి ముఖచిత్రాన్ని గీసాను తీసుకువెళ్ళు. అవునూ, వెళ్లడానికి చార్జీలు ఉన్నాయా..” ఆనాటి ఔత్సాహిక కవులను ఆదరంగా అడిగి, చిత్రాన్ని చేతిలోపెట్టే ఆ చిత్రకారుడు, కవి, రచయిత శీలా వీర్రాజు గారు. ఆయన మాట, ప్రవర్తన ఎంత నెమ్మదిగా మృదువుగా ఉంటాయో, సిద్ధాంతాలు అభిప్రాయాలు అంత ఖచ్చితంగా ఉంటాయి. తాను నమ్మిన విషయాల పట్ల జీవితాంతం ఒకే విధమైన నిబద్ధతతో బ్రతికిన వ్యక్తిత్వం ఆయనది.

కొన్ని ముఖచిత్రాలు:

 

కళల కాణాచి యైన గోదావరి తీరం రాజమహేంద్రవరంలో 1939 ఏప్రిల్ 22వ జన్మించారు. హైస్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే మిత్రులతో కలిసి ‘బాల సాహితి’ అనే చేతివ్రాత పత్రిక తీ‌సుకువచ్చారు. అక్కడే చిత్రలేఖనం వాటర్ కలర్స్, తైలవర్ణాలతో ప్రారంభించి, 60 ఏళ్ళ పాటు తన స్వేదాన్ని రంగులుగా దిద్ది తీర్చిన చిత్రాలను… అమ్ముకుంటే లక్షలు కురిపించే చిత్రాలను తన పుట్టిన వూరులో, దామెర్ల రామారావు పేరున ఉన్న ఆర్ట్ గ్యాలరీకి ఉచితంగా ఇచ్చేసారు. అక్కడ చిత్రకళను అభ్యసించే విద్యార్థులకు మార్గనిర్దేశనంగా ఉంటాయన్నది ఆయన ఉన్నతాశయం (గోడ వారగా పెట్టిన ఆ చిత్రాలను మర్నాడు పంపించి వేస్తున్నట్లు ఆయన చెప్తే, అల్లారుముద్దుగా పెంచుకున్న ఆడపిల్లను అత్తారింటికి పంపిస్తున్నట్టుగా అన్పించి, నేను భారమైన మనసుతో మౌనంగా అక్కణ్ణించి వచ్చేసాను ఆరోజు).

 

1961లో కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేసి, 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకునిగా చేరి, 1990లో స్వచ్ఛంద పదవీవిరమణ చేసారు. ఎనభై మూడేళ్ల జీవితకాలంలో అరవయ్యేళ్ళు సాహితీ కృషి చేసిన అతి కొద్దిమందిలో ఆయన ప్రథములు. స్వాతి మాసపత్రిక ప్రారంభ సంపాదకులుగా, ఎందరో కవులు కథకులు నవలాకారులకు దాదాపు వెయ్యికి పైగా ముఖచిత్రాలు గీసి ఇచ్చారు. కుందుర్తి ఆంజనేయులు కవిత్వాన్ని విపరీతంగా ప్రేమించిన ఆయనకి, కుందుర్తి వారు స్ధాపించిన ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ మొదటి అవార్డు వచ్చింది. కుందుర్తి గారి మరణానంతరం వారి కుమారునితో కలిసి, ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా, అత్యంత రహస్యంగా మంచి కవిత్వాన్ని పరిశీలించి అవార్డు లివ్వడంతో పాటు అనేక కార్యక్రమాలు – తను మరణించే ముందు రోజుల వరకు, ఆసక్తితో, లేని ఓపిక తెచ్చుకుని నిర్వహించారు.

 

వీర్రాజు గారి కవిత్వం ఆయన హృదయంలా సున్నితంగానూ, భావం ఆయన ఆలోచనల్లా గాఢంగానూ ఉంటుంది. ఆ కవితా సంపుటాలు చూస్తే నవరసామృతంలో మునిగి తేలిన ‘అ క్షరాలు’ అనుకోక తప్పదు. వచన కవితోద్యమం ఆద్యులలో ఒకరిగా ఉండి, అభ్యుదయ కవితోద్యమంలో ఎన్నో కవితలు రాసి, దిగంబర కవితోద్యమంలో మాత్రం భాగస్వాములు కాకపోయినా… ఆ కవులందరికీ తన మనసులో స్థానం ఇచ్చారు, పొందారు.

కొడిగట్టిన సూర్యుడు, హృదయము దొరికింది, మళ్లీ వెలుగు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, బతుకు బాట, ఒక అసంబద్ధ నిజం….. ఆయన కవితా సంపుటాలు.

వెలుగు రేఖలు, కాంతి పూలు, కరుణించని దేవత నవలలు, ముఖ్యంగా వీర్రాజు గారి పేరు వినగానే గుర్తొచ్చే ‘మైనా’ నవల 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.

కథా సంపుటాలు – సమాధి, మబ్బు తెరలు, వీర్రాజు కథలు, హ్లాదిని, రంగుటద్దాలు, పగ మైనస్ ద్వేషం, వాళ్ళ మధ్య వంతెన, మనసులోని కుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది, చివరిగా – ‘కథ నాది ముగింపు ఆమెది’.

 

ఆయన చిత్రించిన అపురూపమైన చిత్రాలలో గ్రామీణ వాతావరణం, సౌందర్యాత్మక భావనతో పాటు బాధాతప్త మానవుల ‘మాటరాని మౌనం’ కూడా ప్రత్యక్షమవుతుంది. అవన్నీ కూడా సజీవ జీవన చిత్రాలు. 1990లో లేపాక్షి శిల్పాలకు గీసిన స్కెచ్ లతో ‘శిల్ప రేఖ’ పేరిట ఒక పుస్తకం, 2009లో వర్ణచిత్రాల ఆల్బమ్ ‘శీలా వీర్రాజు చిత్రకారీయం’ పేరిట మరో పుస్తకం వెలువరించారు. ఆ రెండూ అందుకున్న భాగ్యం కూడా నాది.

మూడు నాలుగు తరాల కవులను, రచయితలను ప్రోత్సహించిన వీర్రాజు గారు తన పుస్తకాలను ఆత్మీయంగా నాకందిస్తూ… “మీ ముళ్ళపూడి వారి పిహెచ్.డి. వ్రాతప్రతి బాగుంది. ప్రచురించవచ్చు కదా, పెన్షన్ డబ్బులు ఉన్నాయిగా..” అన్న రెండు వాక్యాలకి చిత్రంగా చూసాను. అంతే చిత్రంగా ఒకటిన్నర సంవత్సరంలో ఆరు పుస్తకాలు ప్రచురించి, మొదటి ప్రతిని ఆయనకే ఇచ్చాను.

పుస్తకం వేయమని చెప్పడమే కాక, నా ‘విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు’కు ముఖచిత్రం గీసి, పుస్తకం నా చేతికి వచ్చేవరకూ అంతా తానైనారు. కిన్నెరసాని పాటలు అంటే విశ్వనాథ వారి చిత్రం, ఒక కొండ, ఒక వాగు అందంగా గీస్తారు ఏ చిత్రకారుడైనా. కొండగా నిలిచిన భర్తను చూస్తూ, దిగులుగా ప్రవహించి పోయే వాగు కెరటాలలో… దిగులుగా భర్త వంక చూస్తున్న స్త్రీ మూర్తిని చిత్రించడం వీర్రాజు గారి ప్రత్యేకత. సంభ్రమంలో మునిగిన నేను వారికి ‘కృతజ్ఞతలు’ అంటే చాలా చిన్న మాట.

1994లో అరసం గుంటూరు శాఖ వీర్రాజు గారికి ‘కొండేపూడి సాహితీ పురస్కారం’ అందించిన సభలో నేనూ పాలుపంచుకోవడం ఒక మంచి జ్ఞాపకం.

వారి సతీమణి శీలా సుభద్రా దేవి గారు (మేనమామ బిడ్డ) కవిత్వం, కథలు, ఒక నవల మాత్రమే కాక, మంచి చిత్రాలు గీసి, అనేక అవార్డులు సన్మానాలు అందుకొన్నారు. రచనలలో భర్త ‘సహాయ సహకారాలు…’ అంటే ఆమె ఒప్పుకోరు. చిన్నతనం నుండే ఆమెకవి అలవడ్డాయి. తన జీవిత కథని ఎలాంటి భేషజాలు లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ‘నెచ్చెలి’ వెబ్ మాగజైన్‌లో రాస్తున్నారు. (సరిగ్గా వీర్రాజు గారితో వివాహ విశేషాల వరకు మే నెలకి రాయడం యాదృచ్ఛికం.) ఆమెను నా నెచ్చెలిగా, మార్గదర్శకురాలిగా భావిస్తాను.

వీర్రాజు గారు కవిత్వం రాసారు. కథలు రాసారు. అయితే కథల్ని కవిత్వంలో రాయడం మరో నూతన వైవిధ్య ప్రక్రియ.శీలా వీర్రాజు గారి కవిత్వం పై రెండు ఎం.ఫిల్ లు, ఒక పిహెచ్.డి., కథలపై ఒక ఎం.ఫిల్. చేసారు యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు. ఆయన కవిత్వం హిందీ, ఇంగ్లీష్ లోకి అనువదింపబడ్డాయి. మైనా నవల తమిళం, హిందీ లలో వెలువడ్డాయి.

శీలా వీర్రాజు గారి మరణవార్త విని కవిలోకమే తరలి వచ్చింది చివరి చూపు కోసం.

స్మశానంలో అంతిమ క్రియలకు సన్నద్ధమైన తమ మిత్రుడు, పెద్ద దిక్కు అయిన వీర్రాజు గారి భౌతిక దేహం ఎదుట ఆయన కవిత్వాన్ని చదవడం అన్న ఘటన విని ఈ నూతన ఒరవడికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసింది సహృదయ లోకం.

‘కలానికి ఇటు అటు’ అన్న వ్యాస ‌సంపుటి వెలువరించిన శీలా వీర్రాజు గారు ‘ఇటు మంచికీ మానవత్వానికీ – అటు నిర్ధిష్టమైన భావాలతో కూడిన రచనలకీ’ మధ్యలో ఉన్న చైతన్యశీలి. మిత్రులకు ‘శీలావీ’.

వారికి నా హృదయపూర్వకమైన నివాళి.🙏🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here