సీత ముచ్చట్లు – రాంబాబు ఇక్కట్లు

7
9

[శ్రీ తుర్లపాటి నాగేంద్రకుమార్ రచించిన ‘సీత ముచ్చట్లు – రాంబాబు ఇక్కట్లు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయం ఎనిమిది గంటలవుతోంది. వంటింట్లో గిన్నెల మూతలు తీసి చూస్తున్న, రాంబాబు మోచేయి గ్యాస్ స్టవ్ మీద ఉన్న గరిటకి తగిలి, ఆ గరిట కిచెన్ ప్లాటుఫామ్ మీదున్న పళ్లెం మీద పడింది. త్రాసులో ఓ వైపు బరువేస్తే, మరో వైపు పైకి లేచినట్టుగా, పళ్లెం గాల్లోకి ఎగిరి, ఓ పల్టీ కొట్టి, క్రింద గచ్చుని తాకి, బొంగరంలా తిరుగుతూ, నేలపై వాలింది. ఆ గరిట, పళ్లేల ‘జుగల్బంది’ సృష్టించిన చప్పుడు వినగానే, పడకగది ఊడుస్తున్న రాంబాబు భార్యామణి, సీత ‘ష్’ అంటూ, చేతిలో చీపురుతో వంటింట్లోకి వచ్చింది.

రాంబాబుని చూస్తూనే, “మీరా? పిల్లి అనుకున్నాను. ఏంటండీ! మీకా తొందర, చెప్పానుగా, ఆ కాస్తా చదివేస్తే, టిఫిన్ పెడతానని” అంది. “అది కాదోయ్, సీతా! ఆకలేస్తోంది. టిఫిన్ చేసేసి చదువుతానే” అన్నాడు రాంబాబు, జాలిగా ముఖం పెట్టి. “ఊహు, లాభం లేదు. మీ పొట్టలో ఏమన్నా పడిందా, గుర్రు పెడతారు” అంది సీత. అలా అంటుంటే, మురిపెం, మందలింపు కలగలసిన భావం, సీత కళ్ళలో తొంగి చూసింది.

‘నిజమే! తన పొట్టలో ఏమన్నా పడిందంటే, కళ్ళు మూతలు పడతాయి’ అనుకున్నాడు, రాంబాబు. ఇక చేసేదిలేక, లైబ్రరీలోకి వెళ్లి కూచున్నాడు. అంతకు ముందు, చదివిన గుర్తుగా, మడత పెట్టిన పేజీని తీసి, చదవడం మొదలెట్టాడు. అతని చూపు పంక్తుల వెంబడి పరుగెడుతోంది. కానీ, ఒక్క ముక్కా రాంబాబు బుర్రకెక్కట్లేదు. అతని పరిస్థితి ‘చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద’ అన్నట్టుగా ఉంది.

అతని చుట్టూ ప్రఖ్యాత రచయితల పుస్తకాలు పేర్చి ఉన్నాయి. వాటి వంక చూస్తూ, ‘ఈ పుస్తకాలేమిటో!, ఈ చదువేమిటో!’ అనుకున్నాడు, రాంబాబు. ఓ పక్క అతనికి డయాబెటిక్ కంప్లయింట్ ఉంది. ఆకలి దంచేస్తోంది. కానీ, ఏం చెయ్యగలడు? వాళ్ళ ఆవిడ ముచ్చట తీర్చాలంటే, అలా కడుపు మాడ్చుకోవాల్సి వస్తుందని, అతనికి ముందే తెలిసుంటే, ‘నా వల్ల కాదోయ్, సీతా! నన్నొదిలెయ్’ అని గడ్డం పుచ్చుకుని, బతిమిలాడుకునే వాడేమో! ‘ఓరి భగవంతుడా! ఇవెక్కడి తిప్పలురా తండ్రీ!’ అనుకున్నాడు రాంబాబు.

అతను కూచున్న, గది తలుపు మీద ‘లైబ్రరీ’ అని, ఎదురుగా గోడ మీద ‘సైలెన్స్ ప్లీజ్’ అని, తెల్ల కాగితం మీద, నల్ల స్కెచ్ పెన్నుతో వ్రాసి అతికించింది, మూడో తరగతి చదువుతున్న రాంబాబు కూతురు, సాహితి. తన దగ్గర ఉన్న, పంచతంత్రం, తెనాలి రామకృష్ణుడి కథలు, పిల్లల రామాయణం లాంటి పుస్తకాలన్నీ తెచ్చి, ఆ గదిలో పెట్టింది. “ఇదంతా ఏంటి?” అని ఐదో తరగతి చదువుతున్న, సాహితి అన్నయ్య సాకేత్ అడిగితే, “అది కాదురా, అన్నాయ్! నాన్నగారు, ఈ పుస్తకాలన్నీ చదవేసి, కథలు వ్రాస్తారుట, అమ్మ చెప్పింది, అందుకే, ఆ పుస్తకాలన్నీ, ఈ గదిలో పెట్టాను. మరీ, ‘లైబ్రరీ’లో ‘సైలెన్స్’గా ఉండాలంట కదా! మా టీచర్ చెప్పింది. అందుకే ఆ కాగితం గోడకి అతికించాను” అంది.

అంతటితో ఆగక, “అమితాబ్ బచ్చన్‍కి ‘బాగ్‌బాన్’ సినిమాలో వచ్చినట్టు, నాన్నగారికి ‘బుకర్స్ ప్రైజ్’ వస్తుందేమో” అంది, తన ఇంగ్లీష్ మీడియం, టీవీ పరిజ్ఞానం ఒలకబోస్తూ. ఆ మధ్య ‘బాగ్‌బాన్’ సినిమా టీవీలో వస్తే, ఇంటిల్లిపాది కలిసి చూసిన విషయం గుర్తొచ్చింది, రాంబాబుకి. వాడు తక్కువ తిన్నాడా, “నాన్నగారేమైనా, త్రివిక్రమ్ శ్రీనివాసా?” అన్నాడు, అల్లు అర్జున్ స్టెయిల్లో. రాంబాబుకి అర్థం కాక, “వాడు ఎవడురా” అన్నాడు. ‘వాడు’ అన్నందుకు, ముఖం అదోలా పెట్టి, “త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలీదా? త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘అల వైకుంఠపురం’ సినిమా రైటర్, డైరెక్టర్. ఆయనవి, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి” అన్నాడు సాకేత్. నాన్నకి తెలియనివి, తనకి మాత్రమే తెలిసిన విషయాలు, చాలా ఉన్నాయి, అన్నఫీలింగ్ వాడి ముఖంలో దోబూచులాడింది.

ఈ ‘బుకర్స్ ప్రైజ్’, ఆ ‘అల వైకుంఠపురం’ ఏమోగాని, తాను మాత్రం అచ్చంగా, మరోసారి ‘బుక్కై’ పోయాను అనుకున్నాడు, రాంబాబు. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో, గుండ్రంగా తిరిగే వృత్తాలు, పాత్రల గత స్మృతులని, వెండితెరపై ఫోకస్ చేసినట్టుగా, అతని ఆలోచనల ఫోకస్ సుమారుగా, పదేళ్లనాటి పాత జ్ఞాపకాల వైపు మళ్లింది.

***

సీత, రాంబాబుల పెళ్లప్పుడు, మూడు నిద్రల ముచ్చట్లు పూర్తికాక ముందే, ఓ కాంట్రాక్టు ఫైనల్ చేయాల్సిందిగా ఆఫీసునుంచి అర్జెంటు పిలుపొచ్చి, వారం రోజులు, ఆఫీసు పని మీద క్యాంపుకి వెళ్లాల్సొచ్చింది. పగలు ఆఫీసులో బిజీగానే ఉన్నా, సాయంత్రాలు, ఏమీ తోచేది కాదు. రాత్రుళ్ళు, సీత ముగ్ధ మనోహర రూపం, కళ్లముందు కదలాడుతూ వుంటే, నిద్రొచ్చేది కాదు. సెల్ ఫోన్‌లో ఎంతసేపు మాట్లాడినా, సీత విరహంలో, పక్కమీద పొర్లుతూ, ఏ తెల్లవారుజామునో నిద్రపోయేవాడు. అలాగే ఓ రాత్రి, ఏమీ తోచక, ఓ చిత్తు కాగితం మీద,

“సీతా!

నా విరహం, ఓ సమరం,

ఓ భామా,

ఎపుడు, అందేది

నీ ప్రేమ”

అంటూ, నాలుగు ముక్కలు వ్రాసాడు.

రాంబాబు క్యాంపు నుంచి తిరిగి వచ్చిన రోజు, విడిచిన బట్టలు ఉతకటానికి, సూటుకేసు తెరిచిన సీత కంటపడింది, ఆ కాగితం. అంతటితో రాంబాబు తిప్పలు మొదలైనాయి. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక, పక్క మీద వాలి, వంటింటి చప్పుళ్ళు వింటూ, సీత రాకకోసం ఎదురుచూడ సాగాడు. పనులన్నీ ముగించుకుని, పాల మీగడలాటి తెలుపు మీద, గులాబీ రంగు పువ్వుల ప్రింట్ ఉన్న చీరలో, మూర మల్లెలు జడలో తురుముకుని, పడక గదిలోకి వచ్చిన సీతని చూస్తూనే, రాంబాబుకి హుషారొచ్చింది. చటుక్కున మంచం దిగి, సీతకి దగ్గరగా వస్తూ, “ఎంతసేపు వెయిట్ చెయ్యను”, అన్నాడు. “ఆగండాగండి, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి” అంది సీత. “రేపు మాట్లాడచ్చులే”, అన్నాడతను. “అలా కాదండీ. ఇప్పుడే మాట్లాడాలి”, అంది సీత. మాటలతో, విరహాన్ని మరింత పెంచటం ఎందుకని, “సరే తొందరగా కానీ”, అన్నాడు, రాంబాబు, ముని వేళ్ళతో ఆమె బుగ్గని నిమురుతూ. అతని వంక ప్రేమగా చూస్తూ, “సరసం తరువాత, ముందు నే చెప్పేది వినండి” అంది సీత. “ఊ! చెప్పు” అన్నాడతను.

“ఏవండీ, నాకు కవితలన్నా, కథలన్నా బోలెడంత ఇష్టం. సాహిత్యం అంటే ప్రాణం. చిన్నప్పటినుంచి, కనిపించిన, ప్రతి పుస్తకం చదివేదాన్ని. నేను కూడా ఏమైనా వ్రాయాలని, ప్రయత్నించాను. కానీ, నా వల్ల కాలేదు” అంది సీత. సాధ్యమైనంత మృదువుగా, “ఇప్పుడు ఈ సాహిత్య సమావేశం, ఏంటి సీతా?” అన్నాడు రాంబాబు. “కాస్త వినండి, ప్లీజ్” అంటూ, “పోనీలే, కనీసం, ఓ రచయితకి, భార్యనైతే బాగుండేది, అనుకునేదాన్ని. మీలో ఆ ‘స్పార్క్’ ఉందండి. మీరూ.. కథలు వ్రాయరూ..” అని, గోముగా అడిగింది, సీత. రాంబాబులోని ‘స్పార్క్’కి నిదర్శనంలా, దిండు క్రింద నుంచి తీసి, ఓ కాగితం, అతని చేతిలో పెట్టింది. అది క్యాంపులో ఉన్నప్పుడు, పిచ్చి గీతలు గీసిన చిత్తు కాగితం. విరహ వేదనలో ఉన్న రాంబాబు, మాటలతో కాలయాపన చేయడం ఎందుకని, ముద్దులోలికే సీత ముఖాన్ని చూస్తూ యథాలాపంగా “ఊ” అని సీతకి దొరికిపోయాడు.

సీత ముచ్చట తీర్చటం, రాంబాబుకి బృహత్తర బాధ్యత అయ్యి కూచుంది. తెల్ల కాగితాలు ముందేసుకుని ఓ కవితనో, కథనో వ్రాయాలని కసరత్తు ప్రారంభించాడు. అదేదో సినిమాలోలా, తను సృష్టించిన పాత్రలు వచ్చి, తనకి మొట్టికాయలు వేస్తాయోమో! అని, కూసింత భయపడ్డాడు. కానీ ఆ మొట్టికాయలు బాధకంటే, సీత ముచ్చట తీర్చకపోతే, సీత పడే బాధ ఎక్కువ అనిపించి, తోచినవి వ్రాయటం, పత్రికలకి పంపటం, అవి తిరుగు టపాలో వెనక్కి రావడం జరుగుతూనే ఉండేది. “సార్, సార్” అంటూ నవ్వుతూ, పలకరించే, వాళ్ళ పోస్టుమ్యాన్ ఒకింత, విసుగు ముఖంతో కనిపించటం మొదలెట్టాడు. దానికి తోడు ఆఫీసులో, రాంబాబుకి పని ఎక్కువయ్యింది. అతనికి విసుగొచ్చి, సీతకి ఏవో సాకులు చెప్తూ, వ్రాయటం మానేసాడు. సీత కూడా అదివరకటిలా, అతని వెంటబడడం మానేసింది. అందుకు, రకరకాల కారణాలున్నాయి. తను ప్రెగ్నెంట్ అవ్వడం, వేవిళ్లు, డెలివరీకి పుట్టింటికి వెళ్లడం, సాకేత్ పుట్టడం, చంటాడితో బిజీ అవ్వడం, వగైరా, వగైరా. ఆ తర్వాత రెండేళ్ళకి, సాహితి పుట్టింది. ఇక పిల్లల పెంపకం, వాళ్ళ స్కూలు, చదువులు, హోమ్ వర్కులు. ఈ బాధ్యతల్లో పడి తన సాహిత్యాభిరుచిని రాంబాబుపైన, రుద్దడం మానేసింది. రాంబాబు ఉద్యోగపర్వంలో ప్రమోషన్లు రావడం, బాధ్యతలు పెరగడం జరిగింది. ఆ రచనా ప్రహసనం గుర్తొచ్చినప్పుడల్లా, అది ముగిసిపొయిన, ఓ పీడకలలా భావించి, తనలో తాను నవ్వుకునేవాడు, రాంబాబు.

***

అలా పూల తేరులా, దశాబ్దకాలంగా సాగిపోతున్న, సీత, రాంబాబుల ప్రణయజీవన నౌకాయానంలో, మరోమారు, రచనా తుఫాను చెలరేగింది. ఆ తుఫానుకి, పరోక్ష కారణం పక్కింటి పంకజం. ఓ ఆర్నెల్ల క్రితం, సుబ్బారావు, పంకజం దంపతులు, రాంబాబు పక్కింట్లో అద్దెకి దిగారు. సుబ్బారావు ఓ పత్రికలో సబ్ ఎడిటర్. వృతి రీత్యా, కథలు, కవితలు వగైరా ఎడిట్ చేస్తూ ఉంటాడు. ఆ వృత్తి ప్రభావమో లేక, అతని ప్రవృతి ప్రభావమో గానీ, మినీ కవితలు, కథలు వ్రాస్తూ ఉంటాడు. వాటిలో కొన్ని అచ్చయ్యేవి. అలా అతని రచనలు, అచ్చయినపుడల్లా, పిల్లాపీచు, ఏ లంపటం లేని పంకజం, వాళ్ళాయన రచన అచ్చయిన, పత్రికని, ఇరుగు పొరుగు అమ్మలక్కలకి చూపిస్తూ, “మా ఆయన రచయిత. ఆయన కథ పత్రికలో వచ్చింది. అంతేకాదు, మా ఆయన ఫలానా పత్రికలో ‘సబ్ ఎడిటర్’ తెలుసా” అని టముకేసేది. అలా ‘సబ్ ఎడిటర్’ అని చెప్పేటప్పుడు, ‘సబ్’ అన్న పదాన్ని, వినీ, వినపడనట్టుగా, ‘ఎడిటర్’ అన్న, పదాన్ని మాత్రం, ఆరున్నొక రాగంతో సాగదీస్తూ, చెప్పేది. ధనుర్మాస వేళ, వాకిట్లో ముగ్గుల దగ్గరనించి మొదలయ్యే, పంకజం, వాళ్ళాయన గొప్పలు, వీలుంటే, మునిమాపు వేళదాకా సాగేవి. పంకజం ‘టముకు’ నాదం, పక్కఇంట్లోనే ఉండటంవల్ల, సీత చెవిని, బహు తరుచుగా తాకేది. ‘నా మొగుడు రచయిత’ అంటూ పంకజం చెప్పే, గొప్పలు వినేకొద్దీ, సీత మనసులో సాహిత్యాభిరుచి, మళ్లీ పురివిప్పింది. తన మొగుడ్ని కూడా, రచయితని చేసి తీరాలన్న కోరిక రోజు, రోజుకి పెరిగిపోయింది. బంగాళాఖాతంలో అల్పపీడనంలా మొదలై, వైజాగ్ మీద విరుచుకుపడ్డ ‘హుద్ హుద్’ తుఫానులా, మంద్రస్థాయిలో మొదలైన, పంకజం గొప్పలు, రానూ రానూ శృతిమించి, సీత మనసులో సృష్టించిన తుఫాను, రాంబాబుపైన విరుచుకుపడింది.

మరోసారి రచనాసంద్రంలో, ఈదులాటకో, మునకకోగానీ, రాంబాబుని సీత సమాయుత్తం చేసింది. సీత మనసు నొప్పించలేని రాంబాబు, మళ్లీ కలాలు, కాగితాలు ముందేసుకుని, తన ద్వితీయ ప్రయత్నం మొదలెట్టాడు. అతను అర్ధరాత్రి దాకా, ఏదో ఒకటి వ్రాసే ప్రయత్నం చేస్తుంటే, పగలంతా పిల్లలతో, ఇంట్లో పనులతో, అలిసిపోయి, పడక మీద వాలగానే సీత కళ్ళు మూతలుపడేవి. సీత ముచ్చట తీర్చడానికి రాంబాబు, పాట్లు పడుతూండేవాడు. భార్యతో ముద్దు, ముచ్చటకి సమయం దొరికేది కాదు. ఎపుడో ఓసారి, వీలుకుదిరినా, కథ రసకందాయంలో, పడే టైముకి, కూతురు నిద్ర లేచేది, బాత్రూముకి వెళ్ళాలనో, భయమేస్తోందనో. రాంబాబుకి చాలా విసుగుగొచ్చేది. “నా వల్ల కాదురా, సీతా!” అని, చెప్దామనుకున్నపుడల్లా, పాకిస్తాన్, ఇండియా బోర్డర్‌లో, మాటిమాటికి చొరబడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే టెర్రరిస్టుల్లా, ఓ రోజు అటు, ఇటుగా, పంకజం చేతిలో పత్రికతో, మా ఆయన కథో, కవితో అచ్చయిందని గొప్పలు చెపుతూ, రంగప్రవేశం చేసేది.

ఇక అంతే సంగతులు. సీతని ప్రసన్నం చేసుకుని, ఆ రచనా సాగర తీరాన్ని చేరుకుందామన్న, రాంబాబు నిశ్చయం, నీరుగారి పోయేది. ఎదురుగా టేబుల్ పైనున్న కాగితాల వైపు, అటుపక్క, మంచంమీద, నుదుటిమీద వాలిన ముంగురులుతో, ముద్దులొలికే సీత వైపు, చూపులు సారిస్తూ, ఏం చేయాలో తోచక, చేతులు నలుపుకుంటూ, జుట్టు పీక్కుంటూ, మథనపడుతూ, ఏ అర్ధరాత్రో, అపరాత్రో నిద్ర పోయేవాడు.

అంతలో, ఎపుడో, ఈ ప్రహసనానికి ముందు, ఆర్నెల్ల క్రితం, ఊసుపోక రాంబాబు వ్రాసి పంపిన ఓ ‘నవలా సమీక్ష’ అచ్చవటం, ఓ రెండు వందల రూపాయల కిమ్మతు చేసే చెక్కు అందుకోవడం జరిగింది. ఇంకేముంది, సీత విజృంభించింది. ఆ పత్రికని, ‘చెక్కు’ని, తనకి పరిచయమున్న వారందరికీ చూపిస్తూ, “మా వారు రచయిత, విమర్శకులు, సమీక్షకులు”, అంటూ, గర్వంగా చెప్పింది. ఇంకేముంది, కలానికి మరింత పదునుపెట్టమని, రాంబాబుకి పోరు మొదలయింది.

అదలా ఉండగా, ఓ పత్రికలో ఫలానా ఆదివారం ప్రఖ్యాత రచయితలకి సన్మానం జరుగుతుంది. అంతేకాక, ఆ రచయితా మహామహులు, రచయిత అవ్వాలనుకునేవారికి, రచనలు చేయటం ఎలా? అన్న టాపిక్ పై తమ అమూల్య సలహాలు అందచేస్తారు. కావాలనుకున్నవారికి ‘కౌన్సిలింగ్’, ఆ పైన ‘కోచింగ్’ సదుపాయం కూడా ఉంటుంది, అంటూ ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన చేత పుచ్చుకుని, పక్కింటి పంకజం ఊడిపడింది. రాంబాబు పరిస్థితి, పెనంపై నుంచి, పొయ్యిలో పడ్డట్టయ్యింది.

ఆ ఆదివారం, ఎంచక్కా ఉప్మా, పెసరట్టు చేయించుకుని తిందామనుకున్న రాంబాబుని, “ఆలస్యం అయిపోయింది, అమూల్య సలహాలు, మీరు మిస్సవుతారు”, అంటూ, చద్దెన్నంతో, నిమ్మకాయ పులిహోర తినిపించి, సభకి లాక్కెళ్లింది సీత. పిల్లలు కూడా వస్తే, అమూల్య సలహాలకి, అంతరాయం కలుగుతుందేమోనని, సాయంత్రం ఐస్ క్రీమ్ కొంటానని, ఆశ చూపించి, తాము తిరిగొచ్చేవరకు, పిల్లల్ని చూస్తూ ఉండమని, ఎదురింటి బామ్మగారికి అప్పచెప్పింది.

సభా ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. రచయితలు సాంప్రదాయబద్ధంగా ఉంటారు, బోలెడు పంచకట్లు, శాలువాలు, లాల్చీ పైజామాలు, పట్టు చీరలు కనిపిస్తాయని అనుకున్న రాంబాబుకి, అక్కడివారిని చూడగానే ఆశ్చర్యం వేసింది. సూట్లు, బూట్లు, జీన్సు, చంకలో లాప్‌టాప్ లతో అందరూ, హడావిడిగా తిరుగుతున్నారు. ‘కంప్యూటర్’ యుగంలో, తెలుగు కళామతల్లికి, ‘హైటెక్’ సేవ లాగా ఉంది అనుకున్నాడు, రాంబాబు.

ఇంతలో ఓ ‘అనౌన్స్‌మెంట్’ వినిపించింది ఇంగ్లీషులో. సారాంశం ఏంటంటే, కాసేపట్లో ప్రఖ్యాత రచయితల సన్మానం జరుగుతుంది. సభకి విచ్చేసిన రచయితల సలహాలు, సంప్రదింపులు కావాలి, అనుకునేవారు తలా వంద రుపాయాలు చెల్లించి ‘రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలి.

ఇది ఎక్కడి చోద్యం? ‘రచనలు ఎలా చేయాలి అని సలహాలు ఇస్తారా! కోచింగ్‌కి రిజిస్ట్రేషనా!’. రాంబాబు, తన ఆలోచనని సీతతో ‘షేర్’ చేసుకుందాం అని, అటు, ఇటు చూసాడు. సీత ఎటో మాయమయ్యింది. ‘మొగుడ్ని, ఈ సంతలో వదిలేసి, ఎక్కడికి వెళ్ళిందిరా బాబు!’ అనుకున్నాడతను. అతనికి మొహమాటం పాలు, ఒకింత ఎక్కువే. తిరునాళ్లలో, తప్పిపోయిన పిల్లాడిలా ఉంది, అతడి పరిస్థితి. పెళ్లి పీటల మీద తప్ప, పంచెకట్టు ఎరుగని రాంబాబు చేత, బిళ్ళ గోచి పెట్టించి, పంచె కట్టించి తీసుకొచ్చింది సీత. అలవాటు లేని కట్టు, గోచి ఊడిపోతుందోమో, అన్న భయం. చేతులు నలుపుకుంటూ, ఓ వారగా నిలబడ్డాడతను. ఇదే చాన్సు. సీత రాక ముందే పారిపోతే, అన్న ఆలోచన వచ్చిందతనికి. కానీ సీతతో పాటు, పొద్దుటి ‘నిమ్మకాయ పులిహోర’ కూడా గుర్తుకొచ్చింది. తను అలిగిందంటే, తన ‘ఆత్మారాముడు’ ఏమైపోతాడో అన్న భయం, అతన్ని ఎటూ కదలకుండా చేసింది.

చుట్టూ పరికించి చూస్తుంటే, రాంబాబు చూపు, కొన్ని బోర్డుల మీద పడింది. ‘వీఐపి లాంజ్’, ‘రిజిస్ట్రేషన్’, ‘కౌన్సిలింగ్’ లాంటి పదాలు, ఆ ‘బోర్డు’ల మీద వ్రాసి, క్రింద బాణం గుర్తులు వేసి ఉన్నాయి. ఇంతలో ‘రిజిస్ట్రేషన్’ అన్న బాణం గుర్తున్న బోర్డు వైపు నుండి హడావిడిగా వచ్చింది, సీత, “పదండి, పదండి” అంటూ.

“ఏంటి, సీతా! ఇక్కడంతా గందరగోళంగా ఉంది” అన్నాడు, రాంబాబు. “మీరు ఊరుకోండి, త్వరగా కదలండి, ముందు వరుసలో కూర్చోవాలి” అంది, సీత. మాంత్రికుడి ప్రాణాలున్న చిలకని, గుప్పిట్లో పెట్టుకున్న, ‘ఎన్టీఓడి’లాగా, కాస్త గుప్పిట విప్పి చూపించింది. “ఏమిటీ! అది” అన్నాడు, రాంబాబు. “రిజిస్ట్రేషన్ స్లిప్” అంటూ, రాంబాబు చేయి పట్టుకుని, లోపలకి లాక్కెళ్లింది సీత. హతోస్మి! సీత ఆ స్లిప్ చూపించిన తీరు చూసి, కోటి రూపాయలు ప్రైజ్ వచ్చిన లాటరీ టికెట్ చూపించినట్టుగా తోచింది, రాంబాబుకి.

సభ ప్రారంభమయింది. వేదిక మీద, ఓ వారగా సరస్వతి దేవి ఫోటో పెట్టారు. వెనకగా గోడకి, అన్నం, నీళ్లు మానేసి ‘థమ్స్ అప్’ కంపెనీ వాళ్ళ కూల్ డ్రింక్ త్రాగమని సజెస్ట్ చేస్తునట్టుగా, ఓ సినీనటుడి బొమ్మతో, పెద్ద బ్యానర్, పెద్ద పెద్ద అక్షరాలతో కట్టారు. బ్యానర్ దిగువన, చిన్న అక్షరాలలో ‘ఆమెచూర్ రైటర్స్‌కి స్వాగతం’, ‘బెస్ట్ అఫ్ లక్’ అని, వ్రాసి ఉంది. రాంబాబు ఇంతకుముందు గమనించలేదు. ప్రాంగణమంతా వివిధ కంపెనీల బ్యానర్లతో నిండి ఉంది.

ఇంతలో, మైకు కీచుమంది. వేదిక పైన ప్రతక్ష్యమైంది, ఓ పదహారేళ్ల అమ్మాయి. ప్యాంటు, షర్ట్ లాంటి అదో రకమైన డ్రెస్ వేసుకుని జేమ్స్ బాండ్ సినిమాలో వాళ్ళలా నడుముకి, ఓ మెటల్ బిళ్ళల బెల్ట్ బిగించింది. జుట్టు సింహం జూలులా ఉంది. ఆ కార్డ్‌లెస్ మైక్ పట్టుకుని, జుట్టుని మాటిమాటికి వెనక్కి తోస్తూ, అవసరం ఉన్నా, లేకపోయినా, పళ్ళికిలించి, నవ్వుతూ మాట్లాడడం, మొదలెట్టింది. రాంబాబుకి గుర్తొచ్చింది, టివీలో, ‘ఖబర్దార్’ అన్న షోలో ‘యాంకర్’గా కనిపిస్తోంది ఈ పిల్ల. జీన్సు, టీషర్ట్ వేసుకున్న, ఓ పిల్ల చేత ‘శుక్లాంబరధరం విష్ణుమ్’ చదివించింది. ఆ పిల్ల శ్లోకాన్ని, ఇంగ్లీష్‍లో వ్రాసుకుని, చదివింది అనటానికి, దివ్యదృష్టి అక్కర్లేదనివించింది, రాంబాబుకి. ‘ధరం’ అనే పదాన్ని ‘డరం’ అని, పలికిన తీరు చూసాక. పక్క సీట్లో కూచున్న సీత, కళ్లింతచేసుకుని, వేదిక వంక చూస్తోంది.

ముందుగా ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కంపెనీ యాజమాన్యానికి, ఆ తరవాత కో-స్పాన్సర్ చేసిన సబ్బు బిళ్లలు, షాంపూలు వగైరా కంపెనీల వారికి పేరుపేరునా కృతజ్ఞలు తెలుపుతూ, వారు ఇలాగే, ఇకముందు కూడా సహకరించాలని కోరింది, ఆ యాంకర్ పిల్ల.

ఆ తరవాత, ప్రఖాత్య రచయితలని వేదిక పైకి ఆహ్వానించి, ఈ మధ్యకాలంలో ఒకటి, రెండు సినిమాల్లో నటించిన వారి చేత, స్పాన్సర్ కంపెనీల ప్రతినిధుల చేత, శాలువాలు కప్పించి, బొకేలు, ఇప్పించింది. సూటు వేసుకుని, టై కట్టుకుని, తెలుగు భాషా సాహిత్య రచయితలుగా, శాలువా అందుకుంటున్న వాళ్ళని చూస్తుంటే, రాంబాబుకి నవ్వు ఆగలేదు. నవ్వితే బాగోదని, బలవంతంగా ఆపుకున్నాడు.

ఇక ప్రఖ్యాత రచయితల ఉపన్యాస పరంపర మొదలైంది. ఆ పదహారేళ్ళ యాంకర్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ, మధ్య మధ్యలో తన చేతిలో ఉన్న సెల్ ఫోన్‌ని చూస్తూ, వారిని హెచ్చరిస్తోంది. బహుశా, సమయాభావం అయివుంటుంది.

మొత్తానికి ఉపన్యాసాలు పూర్తి అయ్యాయి. సారాంశం ఏమిటంటే, రచనకి కావలసినది, విజ్ఞానము. విజ్ఞానానికి కావలసినది, పుస్తకాలు చదవడం. ఇంకా మహారచయితల రచనల అధ్యయనం. రచనలో ‘ఎక్స్‌ప్రెషన్’, ‘రిపీట్’ కాకూడదు. రచన క్లుప్తంగా ఉండాలి. లేదంటే, సినిమాలలో, అభ్యంతరకర సన్నివేశాలు కత్తిరించే, సెన్సారు వారిలా, పత్రికల వారు, రచనలని ‘ఎడిట్’ చేస్తారు. అప్పుడు రచనలో, అసలు రచయిత చెప్పాలనుకున్న విషయం, మాయమైపోవచ్చు. ప్రముఖ రచనల అధ్యయనం అంటే, విశ్వనాథ వారివి, చలంగారివి, ఉప్పల గారివి, మధురాంతకం వారివి. ఇంకా కృష్ణశాస్త్రీ, నండూరి వంటి మహనీయుల రచనలు చదవాలి.

మచ్చుకి, ప్రేమ సబ్జెక్టు వ్రాయాలంటే, కొడవగంటి ‘ప్రేమించిన మనిషి’, ఉప్పల గారి ‘అతడు-ఆమె’, చలంగారి ‘దైవమిచ్చిన భార్య’, ‘మైదానం’ లాంటి రచనల్ని ఉదహరించారు. చివరిగా ‘ఎంకి’ పాటలు, ‘కృష్ణ పక్షము’ లాంటివి కూడా స్పృశించారు. “ఇలాటివన్నీ, అధ్యయనం చేసి, మేమింత వాళ్ళం, అయ్యాం” అన్నారు.

ఆ కార్యక్రమం ముగిస్తూ, ‘అమెచ్యూర్’ రచయితల్ని, ‘కౌన్సిలింగ్ హాల్’కి వెళ్ళమని సలహా ఇచ్చింది, ఆ యాంకర్ పిల్ల. పెళ్ళికెళ్ళి, వధూవరుల చేతిలో గిఫ్ట్ కవరు ఉంచి, బఫెకి బయలుదేరినట్టుగా, అందరూ ‘కౌన్సిలింగ్’ బాణం గుర్తు వైపు పరుగులు తీశారు.

‘కౌన్సిలింగ్’ హాల్లో ఓ పాతిక టేబుల్స్ ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర, అటువైపు ఒకటి, ఇటువైపు రెండు లెక్కన, కుర్చీలు వేశారు. ఒక కుర్చీ ‘కౌన్సిలింగ్’ నిర్వాహకుడికి, మిగిలిన రెండు, ‘అమెచ్యూర్’ రచయితకి, వారికి తోడుగా వచ్చిన వారికి.

ఎంట్రన్స్ దగ్గర ఉన్న కుర్రాడు, రిజిస్ట్రేషన్ స్లిప్ మీద నెంబర్ చూసి, “మీ నెంబర్ పిలిచినప్పుడు, ఫలానా టేబుల్ దగ్గరికెళ్ళండి”, అంటూ, ‘పోలింగ్ ఏజెంటు’లా సెలవిచ్చాడు.

ఇంతలో, రాంబాబు పేరు, దాంతోపాటు, రిజిస్ట్రేషన్ నెంబర్ మైకులో వినిపించాయి. రాంబాబు, సీత వెళ్లి, టేబుల్ దగ్గర కూర్చున్నారు. అక్కడ కూచున్న అమ్మాయికి, పట్టుమని, పదిహేనేళ్లు లేవు. చుడీదార్ వేసుకుంది. వాళ్ళు కూర్చోగానే, ఓ పింక్ కలర్ కార్డు, దాంతోపాటు, మరో కాగితం రాంబాబు చేతిలో పెట్టింది.

ఆ కార్డులో ‘స్టేటస్’ అని, హెడ్డింగ్ ఉంది. ఇంకా, రాంబాబు పేరు, ఆ మధ్య సీత పోరుపడలేక వ్రాసి, ఏ పత్రిక కన్నా పంపిస్తే, దడుచుకుంటారేమో, అని అటకెక్కించిన, రాంబాబు వ్రాసిన కథ పేరు ఉన్నాయి. రాంబాబుకి అర్థంకాక సీత వైపు చూసాడు. “నేనే, ఇందాక ‘రిజిస్ట్రేషన్ కౌంటర్’లో ఇచ్చాను”, అంది సీత.

అంటే, అది రాంబాబు ‘ప్రోగ్రెస్ కార్డు’ అన్నమాట. దాని మీద శైలి, ఎక్స్‌ప్రెషన్, భావం, క్లుప్తత అంటూ, ఓ డజన్ ఐటమ్స్ ఉన్నాయి. వాటికెదురుగా ‘పూర్’, ‘యావరేజ్’ ‘ఎబోవ్ యావరేజ్’, ‘గుడ్’, ‘వెరీ గుడ్’, ‘ఎక్సెలెంట్’ అంటూ, గ్రేడింగులు ఉన్నాయి. రాంబాబు ‘ఓవరాల్ గ్రేడింగ్’, ‘గుడ్’ అని ఉంది. ఇంకో కాగితం మీద, అంత క్రితం, ప్రముఖులు సెలవిచ్చిన రచనలతోపాటు, ఆ ప్రముఖుల రచనల పేర్లు, వాటి కెదురుగా వాటి రేట్లు ఉన్నాయి.

ఆ కౌన్సిలింగ్ పిల్ల ఇలా వివరించింది. “సార్ మీ ‘పెర్ఫామెన్స్ స్టేటస్’ చూసారు కదా, సలహాలు సభలో విన్నారు కదా, మీరెళ్ళి, పుస్తకాల కౌంటర్లో, ఈ పుస్తకాలన్నీ తీసుకోండి. వాటిని బాగా చదివి, అధ్యయనం చేయండి. మీ రచనలు సాగించండి” అని, ఇంకో కాగితం చేతిలో పెడుతూ, “ఇందులో మా కోచింగ్ వివరాలు ఉన్నాయ్. కోచింగ్ తీసుకుని, మా ప్రోగ్రాం ఫాలో అవుతే, మీరు మంచి రచయిత అవుతారు” అంది ఇంక మీరు వెళ్లచ్చు, అన్నటుగా, ముఖం పెట్టి. రాంబాబుకి, తన కూతురు స్కూల్లో ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ చేతిలోపెట్టి, ‘నెక్ట్ ఇయర్’ క్లాస్ పుస్తకాలు కొనుక్కోండి అని, చేతికందించిన ‘లిస్ట్’ గుర్తుకొచ్చింది.

“పదండి, పుస్తకాలూ కొందాం” అంది సీత. “మన దగ్గర అంత డబ్బు లేదు కదా!” అన్నాడు రాంబాబు, ఆ పుస్తకాల ఖరీదు చూస్తూ. “మీరు వర్రీ కాకండి సార్, క్రెడిట్ కార్డు కూడా వాడచ్చు” అంది, ఆ కౌన్సిలింగ్ పిల్ల. వెంటనే రాంబాబు లాల్చీ జేబులోనుంచి క్రెడిట్ కార్డు లాక్కుని, పుస్తకాల కౌంటర్ వైపు వెళ్ళింది సీత. అంత వరకు, రాంబాబు క్రెడిట్ కార్డు ఎప్పుడూ వాడలేదు. ఆ మధ్య ఆఫీసులో, కొలీగ్ శంకర్ రావు ఉద్బోధ విని కార్డు తీసుకొన్నాడు, అత్యసరంలో పనికొస్తుందని.

సభలో సెలవిచ్చిన పుస్తకాలతోపాటు, ప్రఖ్యాత రచయితల పుస్తకాల దొంతరని, మూడు తడవలుగా, మోయలేక, మోస్తూ, పట్టుకొచ్చింది సీత. అవన్నీ ఆటోలో వేసుకుని, ఇంటికి చేరుకున్నారు.

ఇక ఆ మర్నాటినుంచి, పిల్లల్ని కన్విన్సు చేసి, కూతురి పడక, తమ బెడ్ రూంలోకి, కొడుకు పడక హాల్లోకి మార్చి, వాళ్ళ బెడ్ రూంని, రాంబాబుకి ‘స్టడీ కమ్ లైబ్రరీ’గా మార్చేసింది, సీత. తెచ్చిన పుస్తకాలని, రాంబాబు చుట్టూ పేర్చి, ‘అధ్యయనం’ చేయమని హుకుం జారీ చేసింది. అంతేకాకుండా, కోచింగ్‍కి ఫీజు కట్టి, రాంబాబుని రెగ్యులరుగా అటెండ్ అవ్వమని, అల్టిమేటం ఇచ్చింది. ప్రతి శని, అదివారాలు కోచింగ్. నెల చివర ఎగ్జామ్. ఏదో ఒక ‘సబ్జెక్టు’ ఇచ్చి, ఆ ‘సబ్జెక్ట్’పై, కథ వ్రాయమనేవారు.

ఏం చేస్తాడు. సీత చేప్పిందల్లా చేశాడు. అలా ఓ మూడు నెలలు గడిచేససరికి, రోజూ పొద్దున్న టిఫిన్‌లో ఇడ్లీ, ఉప్మా లాంటివి మాత్రమే ఉండటం, పిల్లలు ఏమైనా కొనమంటే, సీత విసుక్కోవడం, భోజనంలో ఇదివరకటిలా వేపుళ్ళు ఉండకపోవడం, పప్పుగాని, కూరగాని ఏదో ఒకటే భోజనంలో ఉండడం గ్రహించాడు రాంబాబు. కానీ అలా ఎందుకు జరుగుతోందో, అర్థం కాలేదు. వచ్చిన జీతం వచ్చినట్లుగా సీత చేతిలో పెట్టడమే రాంబాబుకి తెలుసు.

అదలా ఉండగా, గడచిన కొద్దిరోజులుగా, రాంబాబుకి తరచుగా ఆకలి, నీరసం అనిపిస్తోంది. ఎందుకైనా మంచిదని, ఆ రోజు రాంబాబు ఆఫీస్ నుంచి, ఇంటికి వస్తూ, డాక్టర్ని కలిసాడు. నాడి, కళ్ళు టెస్ట్ చేసి, “ఎప్పటినుంచి ఇలా ఉంది? షుగర్‍కి టాబ్లెట్ వాడుతున్నారా? వేళకి భోజనం చేస్తున్నారా? ఎంతసేపు నిద్ర పోతున్నారు?” వగైరా ప్రశ్నలు వేసి, ‘సిస్టర్’ని పిలిచి ‘ర్యాండమ్ షుగర్ టెస్ట్’ చేయించాడు డాక్టర్. ‘బిపి’ చూసాడు. ‘షుగరు’,’బి పి’ రెండూ, ఎక్కువగానే ఉన్నాయి. “వేళకి భోజనము, విశ్రాంతి చాలా అవసరం” అని మందులు వ్రాసిచ్చాడు.

రాంబాబుకి తెలుసు. సీత ముచ్చట కోసం, ఈ రచనా ప్రయాస, సరిగా నిద్ర లేకపోవడం, ఆఫీసులో పని ఒత్తిడి. ఇవి షుగర్, బిపికి కారణాలని. ‘ఏంచేయాలి?’ అని, ఆలోచిస్తూ, ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరాక, రాంబాబుకి కాఫీ కప్పు అందిస్తూ, అడిగిందింది సీత. “ఏంటండీ, నీరసంగా కనిపిస్తున్నారు, ఒంట్లో బాలేదా” అని. రాంబాబు తటపటాయిస్తూ, “ఏంలేదులే” అన్నాడు. “కాదు, ఏదో ఉంది, ప్లీజ్ చెప్పండి” అంది ఆమె. రాంబాబు ఇక ఉండబట్టలేక, డాక్టర్ని కలిసిన విషయం, డాక్టర్ ఇచ్చిన సలహా సీతకి చెప్పాడు. అది వింటూనే ఆమె బెంబేలు పడిపోయింది. “మీరు చెప్పింది నిజమేనా, సీరియస్ ఏమి కాదుగా” అంది. “నిజమే సీతా, సీరియస్ ఏమీ కాదు, వేళకి భోజనం, నిద్ర అవసరమని డాక్టర్ అన్నాడు” అని చెప్పాడు రాంబాబు.

ఆ రాత్రి భోజనాలయ్యాక, కాగితాలు ముందేసుకుని కూచున్న రాంబాబుని చూస్తూనే, లైటార్పేసి “ఇక చాలు, ఈ సంబడం, మీరు విశ్రాంతి తీసుకోండి” అంది సీత, బెడ్ లాంప్ స్విచ్ వేస్తూ.

పడకమీద వాలి, సీతని దగ్గరగా తీసుకుని, అదే అదనుగా అడిగాడు రాంబాబు. “ఏంటి సీత! ఏమైంది, ఈ మధ్య పిల్లల మీద విసుకుంటున్నావు. అదీకాక, వంటింట్లో వంటలవి, మునపటిలా చెయ్యట్లేదు” అని.

ఎప్పుడు అడుగుతాడా చెపుదాం అన్నట్లుగా, బరస్ట్ ఆయిన సీత భర్తని వాటేసుకుని, “సారీ అండి. నా ముచ్చట సంతకెళ్లా, మిమ్మల్ని రచయితగా చూడాలని, నేను ఓ రచయిత భార్య అని, అనిపించుకోవాలని, అనుకున్నాను. కానీ, ఈ కోచింగులు, కౌన్సెలింగులు, పుస్తకాలు, వీటన్నిటికి, తడిసి మోపెడు ఖర్చవుతోంది. పిల్లలకి సరిగా తిండి పెట్టలేకపోతున్నాను. దానికి తోడు మీకు ‘షుగర్’ ఎక్కువయ్యింది. ‘బిపి’ కూడా వచ్చింది. నా దిక్కుమాలిన సరదాతో, అటు పిల్లల్ని, ఇటు మిమ్మల్ని బోలెడంత ఇబ్బంది పెట్టాను” అని, కళ్ళనీళ్లు పెట్టుకుని, పమిటతో ముక్కు తుడుచుకుంది, సీత. బెడ్ మీద కాస్త దూరంగా జరిగి, దిగాలుగా, గిల్టీగా తలవాల్చి కూచుంది.

రాంబాబుకి నవ్వు, హుషారు ఒకే సారి వచ్చాయి. సీత ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, “సో, నీ సరదా మూలంగా, మన ఇంటి బడ్జెట్, లోటు బడ్జెట్ అయిపొయిందన్నమాట, అంతేనా” అన్నాడు. “పోదురూ, మీకు వెటకారంగా ఉంది” అని, మరోసారి కళ్ళు తుడుచుకుంది సీత.

రాంబాబుకి, సీతపై బోలెడు జాలి కలిగింది. “చూడు నా పిచ్చి సీతా! వెటకారం కాదురా, సంతోషం. నీకు పరిస్థితి అర్థం అయ్యింది. నువ్వు అనవసరంగా కష్టపడి, పిల్లల్ని కష్టపెట్టావు. నేనూ ఇబ్బంది పడ్డాను. మనకెందుకు, ఈ గోల. మన సంపాదనతో, మనం హాయిగా ఉన్నాము. ఈ కథలూ, కావ్యాలకి స్వతహాగా టాలెంట్ ఉండాలి. రచనలు చేయాలంటే, సృజనాత్మకత ఉండాలి. మన జీవితాల్లో, మన చుట్టూ ఉన్నవాళ్ళ జీవితాలలో, బోలెడు కథలు దొరుకుతాయి. కానీ, వాటిని కాగితం మీద పెట్టడం, అంత సులువు కాదు. ఒక విషయం ఆలోచించు. ఆనాడు వాల్మీకి, వ్యాస మహర్షి రామాయణ, మహాభారతాలు, ఏ కోచింగ్, కౌన్సిలింగ్ తీసుకుని, ఏ పుస్తకాలూ, రచనలు అధ్యయనం చేసి వ్రాసారంటావు. అంతదాకా ఎందుకు, మనం పట్టుకొచ్చిన విశ్వనాథ వారి, చలంగారి ఇంకా మిగిలిన వారి రచనలు, వాళ్ళు ఏం అధ్యయనం చేసి వ్రాసారంటావు. అంతరంగాన్ని మథించాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, పరిసరాల్ని గమనించాలి. అలా చేసిన రోజు మనలో సృజనాత్మకత, వ్రాయగల సామర్థ్యం ఉంటే, కథలు, కవితలు అవే పుట్టుకొస్తాయి” బడాయిగా అన్నాడు, రాంబాబు. ఇప్పటికైనా, ఈ బాధ తప్పిందన్న సంతోషంతో.

మళ్లీ సీత మనసు మారితే! వెంటనే సీతని దగ్గరగా తీసుకుని, “నువ్వేమి వర్రీ అవ్వద్దు. నాకు వచ్చే నెల ప్రమోషన్ వస్తుంది, జీతం పెరుగుతుంది. మనం ఇదివరకటికంటే, హాయిగా ఉండచ్చు. నువ్వు మాత్రం మళ్లీ, రచన అంటూ, నన్ను అడగొద్దు” అన్నాడు, రాంబాబు. సీత నుదుటిపై మృదువుగా ఓ ముద్దిస్తూ.

“లేదండీ, ఈ నా పాపిష్టి సరదా, మీకు, పిల్లలకి ఇబ్బంది కాకూడదు. నాకు బుద్ధి వచ్చింది. మీరు వ్రాయగలిగితే, వ్రాయండి. లేదంటే మానెయ్యండి. మనం ఇదివరకటిలా, పిల్లలతోపాటు హాయిగా, సరదాగా ఉందాం” అంది, సీత.

“మళ్ళీ, ఆ పంకజం, గొప్పలు చెప్తూ వస్తే, ఏం చేస్తావు?” అన్నాడు రాంబాబు.

“ఆ పంకజం, మళ్ళీ నా ఛాయలకొచ్చిందంటే, చీపురు తిరగేస్తాను” అంది సీత.

“ఇంకెక్కడి పంకజం సీతా! డాక్టర్ దగ్గరనుంచి వస్తుంటే, వాళ్ళాయన కలిసాడు. విజయవాడలో, వేరే పత్రికలో జాబ్ వచ్చిందంట. రెండ్రోజుల్లో, తట్టా బుట్టా సర్దుకుని వెళతారంట” అన్నాడు, రాంబాబు నవ్వుతూ.

“పీడా విరగడైంది” అని, మెటికలు విరిచింది సీత, అమాంతం అతని మీద వాలిపోతూ.

‘హమ్మయ్య! ఇన్నాళ్ళకి, ఈ రచనా సమరం నుంచి విముక్తి దొరికింది’ అనుకుంటూ, సీతని చేతుల్లోకి తీసుకుని, రాబోయే మధుర క్షణాల్ని, మనోనేత్రంతో వీక్షిస్తూ, మంచంపై వాలాడు రాంబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here