సీతాకోకచిలుకమ్మల కొంగ్రొత్త దీపావళి

0
6

[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గరచేయాలనే ఉద్దేశ్యంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)

~ ~

పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box] 

[dropcap]ఒ[/dropcap]క రంగురంగుల రెక్కల చిట్టి చిన్నారి సీతాకోకచిలుక అడవిలోనుంచి ఒక రోజు దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి చేరుకుంది. ఆ చిన్నారి ఎప్పుడూ మానవులను గాని, వారి అలవాట్లను గాని చూసి లేదా విని ఉండలేదు. అందువల్లనే దానికి ఈ గ్రామంలో ప్రవేశించాక ప్రతి ఒక్క విషయం ఒక గొప్ప అన్వేషణగా, గొప్ప విశేషంగా అనిపించసాగింది.

అది గమనించిన కొన్ని అంశాలు ఏమిటంటే ఆ గ్రామంలోని ప్రతి ఒక్క ఇల్లు రంగురంగుల సున్నాలతో అందంగా అలంకరించబడి ఉన్నది; ప్రజలందరూ మెరమెర లాడుతున్న మంచి క్రొత్త దుస్తులు ధరించి ఉన్నారు; గ్రామంలో ఎక్కడ చూసినా ప్రకాశవంతమైన దీపాలు వెలుగుతూ ఉన్నాయి; ఉండి ఉండీ ఒక విధమైన పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తూ ఉండగా ప్రజలందరూ ఆ ధ్వనులకు ఆనందంగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. మన చిన్నారికేమి తెలుసు ఆ గ్రామీణులు దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటున్నారని?!

ఇప్పుడా సీతాకోకచిలుకమ్మ ఒక చెట్టు కొమ్మపై కూర్చొని అబ్బురంగా చూడసాగింది. అక్కడి పిల్లలందరూ వెఱ్ఱి ఆనందంతో పరుగులు తీస్తూ రకరకాల టపాకాయలు కాలుస్తూ ఉన్నారు. వాటిలో కొన్ని ఏ రకమైన శబ్దం చేయకుండా అందమైన రంగురంగుల కాంతులను ప్రసరిస్తూ ఉన్నాయి. మరికొన్ని టపాసులు చూడటానికి ఏమంత ఆకర్షణీయంగా లేకపోయినా చెవులు గింగురుమనేటంత శబ్దాలు చేస్తున్నాయి. మరికొన్ని రకాల టపాసులు ఆకాశాన్ని అందుకుంటున్నాయా అన్నంత ఎత్తుకు వెళ్ళి పేలుతూ రంగురంగుల రవ్వల కాంతులను చిమ్ముతున్నాయి.

ఈ ఆనందకరమైన టపాకాయల వినోదాన్ని చూస్తూ పరవశించిపోయిన మన చిన్నారి సీతాకోకచిలుకమ్మ సమయం ఎంత అయిందో కూడా గమనించలేదు. ఇంటికి తిరిగి వెళ్ళి అమ్మను కలవాలి అన్న ఆలోచన రాగానే సూర్యుడు పడమటి దిక్కున అస్తమించేశాడు అని గ్రహించిన మన చిన్నారి వెంటనే అడవి వైపు వేగంగా ఎగురుతూ వెళ్ళసాగింది.

ఇంటికి చేరీ చేరగానే ఆ గ్రామస్థులు ఏమి చేస్తున్నారో, ఎందుకలా చేస్తున్నారో తల్లిని అడిగి తెలుసుకోవాలని అనుకుంది. తల్లి దగ్గర కూర్చొని తాను గ్రామంలో చూసిన సంగతులన్నీ ఒక్కొక్కటి వర్ణించి చెప్పసాగింది. అంతా విన్న తల్లి సీతాకోకచిలుక ఆ గ్రామస్థులు దీపాలు, టపాకాయలతో జరుపుకుంటున్న ఆ పండుగ పేరు ‘దీపావళి’ అని తన బిడ్డకు చెప్పింది.

“అమ్మా, పిల్లలంతా తమ తమ చేతులలో పట్టుకున్న కర్రలాంటి వస్తువు ఏమిటమ్మా, అది నిప్పుకు తగలగానే రంగురంగుల వెలుగులు విరజిమ్ముతున్నది! అది ఏమిటో చెప్పమ్మా. దాన్ని వాళ్ళు ఎలా తయారు చేస్తారో చెప్పమ్మా” అన్నది మన చిన్నారి తల్లితో గారాబంగా.

అప్పుడు తల్లి ఆ కర్రలాంటిది అనేక రసాయన పదార్థాలతో చేయబడిన ‘కాకరపువ్వు వత్తి’ అని చెప్పింది. ఆ విషయం విన్న చిన్నారి ముఖం ఎంతో సంతోషంగాతో వెలిగిపోయింది. అంటే, మా అమ్మకు ఆ వింత కర్ర లాంటిది ఎలా తయారు చేయాలో తెలుసన్నమాట! వెనువెంటనే తన స్వంత వెలిగే పుల్లలను తయారు చేసుకుందామన్నది మన చిన్నారి. ఈ కాకరపువ్వు వత్తులను ఎలా తయారు చేస్తారో చెప్పడానికి ముందు తల్లి సీతాకోకచిలుక చాల సందేహించింది కాని నిజం చెప్పేసింది.

ఆమె తన బిడ్డను దగ్గరకు తీసుకొని “కనులకు విందు చేస్తున్న ఈ ఆకర్షణీయమైన టపాకాయలు మన పరిసరాలకు ఎంతో హాని చేస్తాయి తెలుసా? వాటిని హానికారకమైన రసాయన పదార్థాలతో తయారు చేస్తారు. అందుకే టపాకాయలు కాల్చడం వాయు, నీటి, శబ్ద కాలుష్యాలను కలిగించడమే కాక పర్యావరణానికి కూడా ఎంతో హాని కలిగిస్తుంది సుమా! టపాకాయలలోని రసాయనాలు ఎంత ప్రమాదకరమైనవి అంటే టపాకాయలు కాల్చే ముందు, కాల్చిన తరువాత కూడా మనము మన చేతులను శుభ్రంగా కడుగుకోవాలి అన్నమాట. మనం పొరపాటుగానయినా ఆ టపాకాయలు ముట్టుకున్నచేతులతో భోజన పదార్థాలు ముట్టుకుంటే అది ప్రాణాపాయం కలిగిస్తుంది” అని ఎన్నో విషయాలు చిన్నారికి తెలియజెప్పింది.

తల్లి మాటలు విన్న చిన్నారి సీతాకోకచిలుకకు ఎంతో దుఃఖం కలిగింది. ఎంతో నిరాశగా, నీరసంగా అనిపించింది కూడా! రసాయనాల వల్ల కలిగే ప్రమాదం దానికి విశదంగా అర్థమైనా దాని గురించిన కుతూహలం, ఆసక్తి దానిని ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి. పర్యావరణానికి హాని చేసే టపాకాయలను తానిక ఎప్పటికీ మానవులలాగా కాల్చలేను కదా అని తలచుకొని ఎంతో దుఃఖించసాగింది.

తన ప్రియాతి ప్రియమైన బిడ్డ అలా దుఃఖిస్తూ ఉంటే తల్లి తట్టుకోలేకపోయింది. రసాయన పదార్థాలకు బదులు అడవిలో దొరికే సహజమైన వస్తువులు వెతికి తెచ్చి తన బిడ్డ కోరిక తీర్చాలని ఆమె నిర్ణయించుకుంది. అంతే, అడవికేసి బయలుదేరింది తల్లి సీతాకోకచిలుక. ఎంతో వెతుకులాట, అన్వేషణ జరిగాక ఆ తల్లికి తాను వెతుకుతున్న బుడమ కాయల (తమిళం: ‘నేతికళ్లి’) మొక్క కనబడింది. ఈ బుడమ కాయల మొక్క నిండా ముళ్లే కాదు, పచ్చటి పూల మొగ్గలు ఎన్నో ఉంటాయి. మొగ్గలను ఎవరైనా నేలకేసి కొడితే చాలు, అవి పెద్ద శబ్దం చేస్తూ ఫట్ మని పగిలిపోతాయి. టపాకాయలు చేసే శబ్దం ఈ ‘ఫట్’ శబ్దం ముందు ఎంత మాత్రమూ పనికిరానిదే.

ఆ మొగ్గలను తీసుకువెళ్లి తల్లి తన పిల్లలందరికీ పంచి పెట్టింది. పిల్లలందరూ ఆసక్తిగా వెంటనే ఆ ప్రకృతి సిద్ధమైన టపాకాయ పనితీరును పరీక్షించడం మొదలుపెట్టారు. ఈ మొగ్గలు టపాకాయల శబ్దంతో సరిగ్గా సరితూగే శబ్దం చేయడం కళ్ళారా చూసిన ఆ పిల్లల ఆశ్చర్యానికి అంతులేదు. పిల్లలంతా అలా పరవశంగా ఆనందంగా ఆడుకోవడం చూసిన తల్లి సంతోషానికి హద్దే లేకపోయింది.

అయితే ఆమెకు ఒక్కసారిగా కాకరపువ్వొత్తుల విషయం గుర్తొచ్చింది. అవును కదా! ప్రకృతి నుండి కాకరపువ్వు వత్తికి సమానమైనది ఏమిటన్నది వెతకడానికి తల్లి సీతాకోకచిలుక మళ్లీ అడవి వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. కాకరపువ్వొత్తి, దాని నిర్మాణం, దాని పనితీరు జ్ఞాపకం చేసుకుంది. ‘ఆఁ అర్థమైంది!’ అనుకుంది మనసులోనే.

వెంటనే ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఒక వేపపుల్లను తుంచింది. పుల్ల పొడుగునా వేప జిగురు పూసింది. కొన్ని మిణుగురులను తీసుకువచ్చి ఆ జిగురు పుల్లపై వరుసగా అంటిస్తూ పోయింది. మిణుగురులు మెరుస్తూ ఉంటే ఆ పుల్ల వంద కాకరపువ్వొత్తుల కన్నా ఎక్కువైన మెరుపుతో కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది.

పిల్లలంతా ఆ ప్రకృతి సిద్ధమైన పువ్వువత్తిని చూసి ఆనందంగా గంతులు వేయసాగారు. వాళ్ళు ఆ పుల్లను అటూ ఇటూ తిప్పుతూ మిణుగురులు అన్నివైపుల నుండి మెరవడం చూసి పరవశించి పోసాగారు.  వాళ్లందరూ తమ తల్లిని గట్టిగా కౌగిలించుకొని చాల సేపు అలానే ఉండిపోయారు. ఆమెను కదలనీయకుండా బంధించారు. తమ తల్లి తమ అందరికోసం తయారుచేసిన ఈ సహజమైన టపాసును చూసి వాళ్ళు పరవశించిపోయారు.

సీతాకోకచిలుకమ్మ ఇంట్లో జరుగుతున్న ఈ సంబరాన్ని ఆ చుట్టుప్రక్కల చెట్లపై నివసిస్తున్న పిచ్చుకమ్మలు, గుడ్లగూబలు, తేనెటీగలు, గబ్బిలాలు అన్నీ నవ్వుకుంటూ సరదాగా ఆనందంగా గమనిస్తూ సంతోషపడుతూ ఉన్నాయి. ఆ దీపావళి సంబరాలు తాము కూడా జరుపుకుంటున్నంత ఆనందాన్ని ఆ ఇతర ప్రాణులన్నీ అనుభవిస్తూ ఉన్నాయి. ప్రకృతి సహజమైన టపాకాయలతో పండుగ చేసుకుంటున్నామన్న ఆనందం కన్నా ఆ సీతాకోకచిలుకల కుటుంబం పంచి పెడుతున్న సంబరమే ఇతర పక్షుల ఆనందానికి అసలైన కారణం అన్నది సందేహం లేని సంగతి ఇక్కడ!

సీతాకోకచిలుకల కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఈలలతో, చప్పట్లతో అభినందించడం మాత్రమే కాదు, ఆ పక్షులన్నీకూడ వెళ్ళి ఆ కీటకాల సంబరాలలో కలసి ఎగరడం మొదలుపెట్టాయి! ఇక ఆరోజు నుండి ఆ పక్షులు, కీటకాలు అన్నీ ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు ముందుగానే స్వాగతం పలికి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాయి!

మూలం: ఉమయవన్ రామసామి

తెలుగు: వల్లూరు లీలావతి

***

ఉమయవన్ రామసామి – తమిళ మూల రచయిత

ఉమయవన్ మంచి కవి, వ్యాసకర్త, పిల్లల నవలాకారుడు, చరిత్ర పరిశోధకుడు, ముద్రాపకుడు. ఇప్పటివరకు తమిళంలో 15 పుస్తకాలు ప్రచురించారు. వ్యవసాయ నేపథ్యంలో పెరిగినందువల్ల ప్రకృతి సంబంధ విషయాల పట్ల ఆయనకున్న ఇష్టం, అవగాహన పాఠకులను కట్టిపడేస్తాయి. ఆయన వ్రాసిన పుస్తకాలు ప్రత్యేక గుర్తింపును, పలు పురస్కారాలను అందుకున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక ‘తమిళ చెమ్మళ్’ బిరుదుతో సత్కరించింది. అతి కొద్దిమంది రచయితలకు మాత్రమే దొరికే అరుదైన అదృష్టం ఇది. ఈ అవార్డును అందుకున్న 50 ఏళ్ళ లోపు వారిలో ఉమయవన్ తొలి వ్యక్తి. రౌండ్ టేబుల్ ఇండియా వారి ప్రైడ్ ఆఫ్ తమిళనాడు, పుదుక్కోట్టై సాంసృతిక సంఘంవారి కవిమామణి ఆయన అందుకున్న ఇతర బిరుదులలో కొన్ని. కంబోడియా ప్రభుత్వం ఏటా ఇచ్చే భారతియర్ సాహిత్య పురస్కారాన్ని 2019 లో అందుకున్నారు. రైతులకు, వ్యవసాయం చేసేవారికి ఉమయవన్ ఇచ్చే సలహాలు ఎంతో మెచ్చుకోదగ్గవి. కోయంబత్తూర్ కు చెందిన ఒక బహుళ జాతీయ సంస్థలో పనిచేస్తూ ‘ఇలక్కియ చారఇల్’ అనే ఒక త్రైమాసిక పత్రికకు 29 ఏళ్ల ఉమయావన్ సంపాదకులుగా ఉన్నారు. ఆయన తమిళ పుస్తకం ‘పరక్కుమ్ యానై యుమ్ పెసుమ్ పూక్కళుమ్’ (ఎగిరే ఏనుగు మరియు ఇతర కథలు) అదే ఇప్పుడు మనం చదువుతున్న ‘ది ఫ్లైయింగ్ ఎలిఫెంట్’. ఈ సంపుటికి ‘ఉత్తమ బాలల పుస్తకం’, 2020 తిరుప్పూర్ సాహితీ పురస్కారంతో బాటు ఇంకా చాలా పురస్కారాలు లభించాయి. దీన్ని ఆంగ్లంలోకి శ్రీమతి తులసి భట్ అనువదించారు. శ్రీ నరేశ్ కట్వాల్ నేపాలీలోకి అనువాదం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here